జనవరి 5:

భారత్‌-‌పాకిస్తాన్‌ ‌సరిహద్దులలోని లూథియానా- ఫిరోజ్‌పూర్‌ ‌జాతీయ రహదారిలో ఉన్న పైరియానా గ్రామ సమీపంలో ఉన్న ఒక ఫ్లైవోవర్‌. ‌దాని మీద భారత ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌ 15 ‌నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. అక్కడి నుంచి ఒక దిక్కుగా 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే పాకిస్తాన్‌లో ప్రవేశించవచ్చు.  అలాంటి చోట ‘గుర్తు తెలియని వ్యక్తులు’ ప్రధాని వాహన శ్రేణిని అడ్డుకున్నారు. ఆయన కారులోనే ఉండిపోయారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత ప్రధాని అలా నడిరోడ్డు మీద, ప్రాణాంతకమైన పరిస్థితుల మధ్య మిగిలిపోవడం చూసి భారతదేశం నిర్ఘాంతపోయింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని విషయంలోను జరగనంత భద్రతా వైఫల్యం ఫిరోజ్‌పూర్‌ ‌ఘటనలో జరిగిందని చెబుతున్నారు. ఇది కాంగ్రెస్‌ ‌పాలిత పంజాబ్‌ ‌ఘనత.


ఇది కేవలం భద్రతా వైఫల్యమేనా? కాదు. ఇది ముమ్మాటికీ ప్రధాని పదవిని ఈ దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థగా గుర్తించడానికి నిరాకరిస్తున్నవారు చేసిన, లేదా చేయించిన దుర్మార్గం. కేవలం గాంధీ-నెహ్రూ వంశీకులే ప్రధాని పదవికి అర్హులన్న నెత్తికెక్కిన దురహంకారమే ఇలాంటి పని చేయించింది. ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోదీ అనే బీజేపీ నేతను అవమానించడమంటే, అది భారతదేశాన్ని అవమానించడమేనన్న ఇంగిత జ్ఞానం నశించిపోవడం వల్ల చోటు చేసుకున్న దురాగతమిది. ‘నేను కనీసం ప్రాణాలతో మళ్లీ భటిండా విమానా శ్రయం దాకా రాగలిగాను. అందుకు మీ ముఖ్య మంత్రికి కృతజ్ఞతలు తెలియచేయండి!’ అని సాక్షాత్తు ప్రధాని వ్యాఖ్యానించారంటేనే ఈ తెంపరితనం ఎంతటిదో అర్ధమవుతుంది.

జనవరి 5 మధ్యాహ్నం పైరియానా సమీపంలో ప్రధాని కాన్వాయ్‌ని నిలిపివేయడం వెనుక బీజేపీ నాయకులు చెబుతున్నట్టు కుట్ర కోణం ఉంది. దానిని తోసిపుచ్చడం సులభం కాదు. ‘భౌతికదాడి ఉద్దేశం’ తోనే అంటున్న ఆ పార్టీ శ్రేణుల ఆక్రోశాన్ని అర్ధం చేసుకోవలసిందే. ఆ కోణం ప్రతి అడుగులోను కనిపిస్తుంది కూడా. హుసేనీవాలా అనేచోట నిర్మించిన అమరవీరుల స్మారక కేంద్రాన్ని మోదీ ఆ రోజు సందర్శించవలసి ఉంది. భగత్‌సింగ్‌ ‌వంటి త్యాగధనుల జ్ఞాపకార్థం ఈ కేంద్రం నిర్మించారు. తరువాత ఫిరోజ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల ప్రదర్శనను ఉద్దేశించి ఆయన ప్రసంగిం చాలి. వీటితో పాటు కోట్లాది రూపాయలతో చేపట్ట బోతున్న కొన్ని పథకాలకు కూడా ప్రధాని శంకు స్థాపనలు చేయవలసి ఉంది. ఈ కార్యక్రమాల కోసమే ప్రధాని ఉదయం భటిండా విమానాశ్రయంలో దిగారు.

ఎలా జరిగింది?

మొదట అనుకున్న ప్రకారం భటిండా విమానా శ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పూర్‌కు ప్రయాణం కావలసి• ఉంది. కానీ వాతావరణం ప్రతికూలంగా ఉంది. భారత త్రివిధ దళాల సమన్వ యకర్త బిపిన్‌ ‌రావత్‌ ‌ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ‌ప్రమాదానికి గురికావడానికి కారణం వాతావరణం లోని మార్పులేనన్న వాస్తవం అధికారికంగా తెలిసి అప్పటికి కొన్ని గంటలు కూడా కాలేదు. వాతావరణ పరిస్థితులలో మార్పు రావచ్చునన్న ఉద్దేశంతో భటిండాలోనే ప్రధాని 20 నిమిషాలు నిరీక్షించారు. తరువాత రోడ్డు మార్గంలోనే వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. రెండు గంటలు పట్టే ఆ ప్రయాణం గురించి పంజాబ్‌ ‌పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌కు వారు తెలియచేశారు. ఇందుకు సంబంధించి తగిన ధ్రువీకరణ వచ్చిన తరువాతనే ప్రధాని కాన్వాయ్‌ ‌బయలుదేరిందని కేంద్ర హోం శాఖ తెలియచేసింది. ఫిరోజ్‌పూర్‌కు 30 కిలోమీటర్ల ఇవతల ఉండగానే పైరియానా గ్రామం దగ్గరి ఫ్లైవోవర్‌ ‌మీద ధర్ణాకు దిగిన రైతులు కనిపించారు. వీరు రోడ్డును దిగ్బంధించిన సంగతి కూడా భద్రతా సిబ్బందికి అర్ధమైంది. మొదట రెండు వందల మంది ఉన్న ‘గుర్తు తెలియని వ్యక్తులు’, కాంగ్రెస్‌ ‌తదితర పార్టీలు, మేధావుల పరిభాషలో రైతుల సంఖ్య తరువాత పెరిగిపోవడం మొదలయింది. పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడడం ఆరంభమైంది. దీనితో వెనుదిరిగి వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. అనూహ్యంగా భారత ప్రధాని భద్రతాలోపంతో ప్రయాణం రద్దు చేసుకుని వెనుదిరిగారు.

ఆ నిరసన ఎవరిది?

ఫిరోజ్‌పూర్‌ ‌జిల్లా, ఘాల్‌ఖుర్ద్ ‌తహసీల్‌లోని పైరియానా దగ్గర ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకున్న దెవరు? సంయుక్త కిసాన్‌ ‌మోర్చా భాగస్వామి బీకేయు కాంత్రికారి (ఫూల్‌) ‌సభ్యులు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ రంగ సంస్కరణల చట్టాల రద్దు పేరుతో ఢిల్లీలో వీరంగం వేసిన సంఘాలలో ఇవి ప్రముఖమైనవి. ఈ కాంత్రికారి వర్గం సీపీఐ (ఎంఎల్‌)‌తో సత్సంబంధాలు కలిగి ఉంది. దీని నాయకుడు సుర్జీత్‌ ‌సింగ్‌ ‌ఫూల్‌. ‌పాకిస్తాన్‌ ‌బాహా టంగా సమర్థించే ఖలిస్తాన్‌వాదులు పెట్రేగి పోతున్నది వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమం పేరు తోనే. ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రాంతంలో భారత ప్రధాని కాన్వాయ్‌ 20 ‌నిమిషాల పాటు నిలిచిపోతే భద్రతా వైఫల్యం కాదని నిస్సిగ్గుగా మాట్లాడారు పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ ‌సింగ్‌ ‌చన్ని. వరస పెట్టి కాంగ్రెస్‌ ‌నాయకులంతా ప్రధాని నాటకమాడు తున్నారంటూ అత్యంత దిగజారి వ్యాఖ్యలు చేశారు. ఫిరోజ్‌పూర్‌ ‌సభకు జనం లేకపోవడం వల్లనే ప్రధాని వెనుదిరిగారని ఢిల్లీ నుంచి పంజాబ్‌ ‌దాకా ఉన్న చిన్నాపెద్దా కాంగ్రెస్‌ ‌నాయకులంతా కోళ్లై కూశారు.

ప్రధాని ఈ మార్గం వెంట వెళతారని తమకు తెలియదని క్రాంతికార్‌ ‌సంస్థ తెలియచేసింది. ఈ మాట అబద్ధమని తరువాత తేలిపోయింది. ఫిరోజ్‌పూర్‌లో జరుగుతున్న ప్రధాని కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడానికే తాము ధర్ణాలు చేశామని నాయకులు చెబుతున్నారు. కానీ సరిగ్గా ప్రధాని రాకకుముందే అక్కడికి అంతమంది నిరసనకారులు ఎలా వచ్చి చేరారని బీజేపీ ప్రశ్న. ఆ మార్గం వెంట ప్రధాని ప్రయాణిస్తున్నారన్న సంగతి ముందుగా ఈ రైతులకి ఎవరో సమాచారం ఇచ్చారు. ‘ఆయన వస్తున్నాడు’ అంటూ కొన్ని ఎస్‌ఎంఎస్‌లు ఆ ప్రాంతంలో రైతు ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలకు వెళ్లాయి. ఇదెలా జరిగిందన్నదే బీజేపీ ప్రశ్న. ఎవరు ఉప్పందించారన్నదే దేశ ప్రజల సందేహం. ప్రధాని మీద దాడికి అనుమతించడమంటే, దేశం మీద, అంతకంటే ముందు ప్రజాస్వామ్యం మీద దాడికి అనుమతించినట్టు కాదా అన్నదే ఇప్పుడు అందరూ వేసుకుంటున్న ప్రశ్న. 20 నిమిషాల పాటు ప్రధాని ఒక ఫ్లైవోవర్‌ ‌మీద చిక్కుపడిపోయారంటే, పంజాబ్‌ అనే సరిహద్దు రాష్ట్రంలో, ఒక సున్నిత వాతావరణం కలిగిన ప్రాంతంలో ఎనభయ్‌ ‌దశకం నాటి చరిత్ర పునరావృతమయినట్టేనని కూడా చాలామంది శంకిస్తున్నారు. ఆనాడు పొరుగునే ఉన్న ఇస్లామిక్‌ ‌రిపబ్లిక్‌ ‌తన తాబేదారులను జర్నయిల్‌ ‌సింగ్‌ ‌భింద్రెన్‌వాలే భక్తుల పేరిట ఎగుమతి చేసింది. పంజాబ్‌ ‌పాలనా యంత్రాంగంలో తన మనుషులను చొప్పించింది. శాంతిభద్రతల అమలు వ్యవస్థలో చేర్చింది. అదే పొరుగు దేశం మళ్లీ అలాంటి ప్రయత్నం పంజాబ్‌లో మరోసారి దిగ్విజయంగా పూర్తి చేసిందనడానికి రుజువులు కూడా ఉన్నాయని చెప్పేవారు ఉన్నారు. ఎలాంటి రుజువులు లేకుండానే గురుద్వారాలను అపవిత్రం చేశారంటూ మనుషులను చంపడం దీనినే సూచిస్తున్నదని చెబుతున్నారు. డ్రోన్‌ల ద్వారా ఆయుధాలను జారవిడవడం, అడ్డూ అదుపూ లేని మత్తుమందుల వినియోగం, ఖలిస్తాన్‌ ఏర్పాటును సమర్థించే కరపత్రాల పంపిణీ, తాజాగా కోర్టు ప్రాంగణాలలో ఆత్మాహుతి బాంబు పేలుళ్లు… ఇదంతా కూడా జాతి వ్యతిరేక శక్తులు బలపడినాయన డానికి ప్రబల నిదర్శనాలేనని చెప్పడానికి అభ్యం తరం ఉండాలా? ప్రధానిని 15 నుంచి 20 నిమిషాల పాటు దిగ్బంధనం చేసిన ప్రాంతంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్న అరాచక నేపథ్యం ఇది. దిగ్బంధనానికి సహకరించిన వారు, అందుకు ప్రోత్సహించినవారి చరిత్ర కూడా గుర్తు చేసుకుందాం. ఖలిస్తాన్‌ ‌సమర్థకులు ఒక ప్రధానిని పొట్టన పెట్టుకున్నారు. ఇక సీపీఐ (ఎంఎల్‌) ఎం‌తమంది నేతలను కడతేర్చిందో లెక్క లేదు. ఈ రెండు సంస్థలు కలసి ఎన్నివేల మంది సాధారణ ప్రజల ఉసురు తీశారో అంచనాకు కూడా అందేది కాదు. నాటి ప్రధాని ఇందిర ఖలిస్తాన్‌వాదుల చేతిలో దుర్మరణం పాలైన సంగతి, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా ప్రజలు వాళ్ల తుపాకీ గుళ్లకు బలైన వాస్తవం, ఎందరో పంజాబీలు ప్రాణాలు విడిచిన చేదు నిజం కాంగ్రెస్‌ ‌వాళ్లకీ, మోదీ వ్యతిరేకులకు, సామాజిక మాధ్యమాల ద్వారా సంబరాలు జరుపుకున్న కుసంస్కారులకు గుర్తుకు రాలేదెందుకు? ఎందుకో మరి కాంగ్రెస్‌ ‌నాయకులే అయినా మనీష్‌ ‌తివారీ, అనిల్‌ ‌జాఖడ్‌ ‌విజ్ఞతతో ఈ ఉదంతం గురించి వ్యాఖ్యానించారు. అది మెచ్చదగినది. ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. కేంద్రంలో, రాష్ట్రాలలో వేర్వేరు పార్టీలు అధికారంలోకి వచ్చే సంప్రదాయం కూడా ఉంది. ఎన్నికల బరిలో పోరాడే పద్ధతి ఉంది. కానీ ప్రజాస్వామ్యానికి కీలకమైన ఈ పంథా దేశభద్రత విషయంలో రాజీ పడేదిగా తయారు కావడానికి అనుమతించరాదు. రాజకీయ విభేదాలు వ్యక్తిగత విభేదాలుగా, ఇంకా చెప్పాలంటే మత ద్వేషంగా మారకూడదు.

జరిగినది ప్రధాని పర్యటనకు సంబంధించిన భద్రతా లోపం. ఇందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కాబట్టి వాస్తవాలు బయటకు రాక తప్పదు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను బట్టి చైనా భక్తులు, ఖలిస్తాన్‌వాదులు, పాకిస్తాన్‌ ‌దాసులు, జస్టిస్‌ ‌ఫర్‌ ‌సిక్స్ ‌దోషులుగా కనిపిస్తారు. అడ్డుకున్న రైతులంతా కాంతికార్‌లే. సీపీఐ (ఎంఎల్‌)‌ను అంట కాగే ఈ సంస్థ చైనాను ఆరాధించేదేనని చెప్పడానికి మొహమాటపడక్కరలేదు. ఖలిస్తాన్‌వాదులు పాకిస్తాన్‌ ‌ప్రాపకం ఉన్నవాళ్లే. జస్టిస్‌ ‌ఫర్‌ ‌సిక్స్ ‌సంస్థ దేశ విద్రోహ సంస్థ. ప్రధాని మోదీ మీద ‘భౌతికదాడి’ జరపాలన్న వీరందరి ఆకాంక్షకు ఆస్కారం కల్పించినదే పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం. శాంతియుతంగా ధర్ణా చేస్తున్న రైతుల మీద లాఠీచార్జికి తాను ఆదేశించలేనని ముఖ్యమంత్రి చన్ని చెప్పడం వెనుక అంతరార్థం ఇది కాదా? ఆ విధంగా రెండు ‘కె’లు సాధిస్తామన్న (కశ్మీర్‌, ‌ఖలిస్తాన్‌) ‌పాకిస్తాన్‌ అజెండాకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు పరోక్షంగా మద్దతు పలికారు.

ప్రధాని భద్రతా వైఫల్యంలో జాతి వ్యతిరేక కోణం ఒక వాస్తవం. రైతుల పేరుతో 2020లో పంజాబ్‌ ‌నుంచి ఢిల్లీ ప్రయాణమైన కొందరిలో ఒక వ్యక్తి ఏమన్నాడో గుర్తు చేసుకోక తప్పదు. ‘తమ’ వాళ్లు ఇందిరను హత్య చేశారు. తరువాత ఆ గతి మోదీకే అంటూ ఆ ‘రైతు’ మీడియా ముందే పేలాడు. ఇవన్నీ చూశాకనే ఈ విషయంలో పంజాబ్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం దారుణమైన అలక్ష్యం వహించిందని అంతా (కాంగ్రెస్‌లోని కొందరు సహా) అభిప్రాయానికి వచ్చారు. హఠాత్తుగా మారిన ప్రధాని రోడ్డు ప్రయాణం గురించి అంత వేగంగా బయటకు సమా చారం ఎలా వెళ్లింది? ఆ రోడ్డును రాష్ట్ర పోలీసులు ఎందుకు ప్రధాని రాకకోసం సిద్ధం చేయలేదు? ఈ విషయం మాకు పోలీసులు చెప్పారు, కానీ రోడ్డును దిగ్బంధనం చేయకుండా పోలీసులు ఆడుతున్న నాటకమని మేం భావించాం అని ఒక రైతు నాయకుడు ఒప్పుకున్నాడు. బహుశా ఆ విషయం చెప్పాకనే కాబోలు గుర్తు తెలియని ఆ దుండగులు, పోలీసులతో కలసి వర్షపుజల్లులో టీ సేవించారు! ఫిరోజ్‌పూర్‌లో జరుగుతున్న ప్రధాని బహిరంగ సభకు బీజేపీ వారిని వెళ్లనివ్వకుండా చేయడానికే తాము జనవరి 5న ధర్ణాలు నిర్వహించామని రైతు నేతలు చెబుతున్నారు. అంటే పైరియానా ఫ్లైవోవర్‌ ‌దగ్గర జరిగిన ధర్ణాలో కుట్ర కోణం లేదని చెప్పడానికే ఆ మాట అన్నారని సులభంగానే అర్ధం చేసుకోవచ్చు. అయినా ఒక పార్టీ కార్యక్రమానికి, ఆ పార్టీని అభిమానించేవారు వెళ్లకుండా అడ్డుకోవడం ఎలాంటి ప్రజాస్వామ్యం? ఎలాంటి హక్కుల స్పృహ?

అశ్విని శర్మ (బీజేపీ పంజాబ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు)

పంజాబ్‌లో జరిగినది ఒక వ్యవస్థ పట్ల జరిగిన వైఫల్యం. ఆ అత్యున్నత వ్యవస్థకు ఇవ్వవలసిన గౌరవం పట్ల కనిపించిన నిర్లక్ష్యం. కానీ దానిని ఒక వ్యక్తి, లేదా రాజకీయ ప్రత్యర్థికి ఎదురైన వైఫల్యంగా ప్రతిపక్షాలు, వాళ్లని సమర్థిస్తున్న మీడియా పరిగణించ డమే విచిత్రం. ప్రధాని హఠాత్తుగా ప్రయాణంలో మార్పులు చేసుకోవలసిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంత గుడ్డిగా మాట్లాడడం ఈ దేశంలోని మేధావులకీ, వీళ్లని అడ్డగోలుగా సమర్ధించే మీడియాకీ, కాంగ్రెస్‌కే చెల్లింది. ఇక్కడ గుర్తించవలసిన అంశం మరొకటి ఉంది. హుసేనీవాలా దగ్గర ప్రధాని పర్యటన వేళ నిరసనలు జరిగే అవకాశాలు ఉన్నా యంటూ ఇంటెలిజెన్స్ ‌బ్యూరో రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. రైతు సంఘాలే ప్రధానికి నిరసన పేరుతో ధర్ణాలకు దిగుతాయని ఇంటెలిజెన్స్ ‌బ్యూరో హెచ్చరించిందని, పంజాబ్‌ ‌నుంచి వెలువడే ట్రిబ్యూన్‌ ‌పత్రిక వార్త ప్రచురించింది. ఆ నిరసన కారులు సిక్కు ఉగ్రవాదులు, ఖలిస్తాన్‌ అనుకూల వాదులని కూడా ఐబీ సుస్పష్టంగా చెప్పిందని ఆ పత్రిక వెల్లడించింది. కాబట్టి జరిగినదంతా అప్పటికప్పుడు అనుకోకుండా జరిగిపోయినదేమీ కాదు.

ఇంత జరిగి, ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే జాతి మొత్తం ఖండిచవలసింది పోయి, కొందరు ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించక తప్పదన్నట్టు సామాజిక మాధ్యమాలో పోస్టులు పెట్టారు. సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దులలో రైతులు పడిగాపులు పడేటట్టు చేసిన మోదీకి, దేవుడు ఈ విధంగా ప్రతిక్రియ చేశాడని మరొకరు వ్యాఖ్యా నించారు. సంచలనం కోసమే బీజేపీ ఈ లోపాన్ని ఉపయోగించుకుంటున్నదని కొట్టిపారేస్తున్నవారు ఇంకొందరు. ఫిరోజ్‌పూర్‌ ‌సభకు జనం లేరు కాబట్టే ప్రధాని, బీజేపీ ఇలాంటి చర్యకు దిగారని కొందరు చెప్పడం బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట.

పంజాబ్‌ ‌ప్రభుత్వం ప్రదర్శించిన ఈ వైఖరిని, రైతుల పేరుతో దుండగులు సాగించదలుచుకున్న అరాచకాన్ని, మళ్లీ హింసకు పట్టం కట్టే ధోరణి పెరిగిపోవడాన్ని మీడియా తేలికగా తీసుకుంటున్నదని చెప్పాలి. చాలా పత్రికలు, వార్తా చానళ్లు ఇది భద్రతా వ్యవస్థలో జరిగిన ఒకానొక లోపంగానే అవి భావిస్తున్నట్టు అనుకోవాలి. ఒక వర్గం హింసా పథంలోకి వెళ్లిపోతున్న సంగతిని మీడియా మౌనంగా వీక్షిస్తున్నది. ఒక వర్గాన్ని హింసాపథంలోకి నెట్టడమనేది ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం. ఇలాంటి వ్యాపారం ఇప్పుడు మతోన్మాదులు, ఉగ్రవాద మార్క్సిస్టులు కలసి చేస్తున్నారు. దీనికి మానవత్వం ఉంటుందని ఎవరూ భావించలేరు. ఈ హింస వల్ల కొందరు ప్రముఖులు పోతే పోవచ్చు. కానీ ప్రధానంగా బలయ్యేది సామాన్య ప్రజానీకమే. ఆ కుటుంబాలే. దేశాన్ని రకరకాల కారణాలతో వ్యతిరేకించేవారికి బయట నుంచి నిధులు అందు తున్నాయి. పంజాబ్‌లో మరొకసారి హింసావాదులు చెలరేగడం ఇందులో భాగమే. కష్టపడేవారు, త్వరగా నేర్చుకునే వారు అని భారతీయ ఉద్యోగులను విదేశాలలో శ్లాఘిస్తూ ఉంటే, విద్రోహ శక్తులు మాత్రం ఫాసిస్టులు, పురాతనవాదులు అని ముద్ర వేస్తున్నాయి. ఇక్కడ కూడా బీజేపీ మీద రాజకీయ పోరాటానికి ఫాసిజం మీద పోరాటం అంటూ పేరు పెడుతు న్నాయి. ఇలాంటి ప్రచారంలోని వాస్తవాలను మీడియా చూపడం లేదు. దీనితో బీజేపీకి నష్టం మాటెలా ఉన్నా, వాస్తవంగా ఫాసిజాన్ని బాహాటంగా ప్రదర్శిస్తున్న మతోన్మాదులకు ఆమోదం లభిస్తోంది.

ఫిరోజ్‌పూర్‌ ఎస్‌ఎస్‌పిని రాష్ట్ర ప్రభుత్వం బదలీ చేసింది. ఈ ఉదంతం జరిగిన కాలంలో పదవిలో ఉన్న పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌సిద్ధార్థ చటోపాధ్యాయ స్థానంలో వీరేశ్‌కుమార్‌ ‌భవ్రాను నియమించారు. ఇదొక ప్రహసనం. కెప్టెన్‌ అమరీందర్‌ ‌సింగ్‌ ‌కాలంలో పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌గా దినకర్‌ ‌గుప్తా ఉన్నారు. చన్ని ముఖ్యమంత్రి అయిన తరువాత ఇక్బాల్‌ ‌ప్రీత్‌సింగ్‌ను తెచ్చి పెట్టుకున్నారు.ఇక్బాల్‌ ‌నియామకం పట్ల పంజాబ్‌ ‌పీసీసీ అధ్యక్షుడు సిద్ధు మండిపడ్డారు. దీనితో తోకముడిచిన చన్ని సిద్ధార్థ చటోపాధ్యాయను నియ మించారు. అంటే నెలలో ముగ్గురు పోలీసు డైరెక్టర్స్ ‌జనరల్‌ ‌మారారు. ఒక సరిహద్దు రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీ వైఖరి ఇది.

1947లో ఏ పాకిస్తాన్‌ ‌వాదులైతే తమ మీద, తమ ఆస్తుల మీద, మహిళల మీద జరపరాని ఘోరాలు జరిపారో, ప్రపంచ చరిత్ర కూడా నిర్ఘాంతపోయే అకృత్యాలు చేశారో, రక్తపాతం సృష్టించారో, నేడు వారి పంచన చేరి భారత దేశానికి హాని చేయాలని ఉవ్విళ్లూరుతున్న కొన్ని పంజాబీ శక్తులకు జ్ఞానోదయం ఎప్పుడు?

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram