– సుజాత గోపగోని, 6302164068

రాష్ట్రంలో ఉపాధ్యాయులు భగ్గుమంటు న్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏ నినాదంతో ఆవిర్భవించిందో.. ఆ మహోన్నత ఆశయాలకు, లక్ష్యాలకు సొంత ప్రభుత్వమే తూట్లు పొడిచిందని కన్నెర్రజేస్తున్నారు. స్థానికతను అటకెక్కిస్తున్న వ్యవహారంలో ముఖ్యంగా సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఖరిని తూర్పారబడుతున్నారు. ఉపాధ్యాయులను మానసికంగా వేధింపు లకు గురిచేసే నిర్ణయాలు తీసుకున్నారని ఆగ్రహం చెందుతున్నారు. సర్కారు అమలు చేస్తున్న కొత్త పద్ధతిలో టీచర్ల కుటుంబాలు, చిన్న పిల్లలు కూడా తీవ్రమైన అవస్థలకు, స్థానికత సమస్యలకు గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర విభజన సమయంలో స్థానికత ఆధారం గానే ఆస్తులు, అప్పులు, ఉద్యోగులను 52:48శాతం చొప్పున కేటాయించారు. రాష్ట్రం విడిపోయినప్పుడే స్థానికత ఆధారంగా విభజన చేపట్టారని, ఇప్పుడు జిల్లాలను విభజించిన సమయంలో స్థానికత ఎందుకు చూడటంలేదంటూ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అసలు తెలంగాణ వచ్చిందే స్థానికత నినాదంతో కాదా? అని నిలదీస్తున్నారు. ఆ ప్రాథమిక అంశానికే కేసీఆర్‌ ఎసరు పెడుతున్నాడని గొంతెత్తి నినదిస్తు న్నారు. జీవో నెంబర్‌ 317 ఒకరకంగా ఉపాధ్యాయుల పాలిట ఉరికొయ్యలా మారిందని వాపోతున్నారు.

అసలు స్థానికత గొడవేంటి? 317 జీవోలో ఉన్నదేంటి? ఉపాధ్యాయుల సమస్య ఏంటి? తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమేంటి? రాష్ట్రంలో చర్చనీయంగా మారిన ఈ అంశానికి సంబంధించి గొడవెందుకు జరుగుతోంది? రాజకీయంగానూ, రణరంగంగా మారిన దీనిపై తెలం గాణ సర్కారు మొండిగా ఎందుకు ముందుకెళ్తోంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన విధానమేంటి? ఇప్పుడు తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి ఏంటి? వివరంగా చూద్దాం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ నియామకాలకు మూడు రకాల విధానాలను ప్రభుత్వం అమలు చేసేది. ప్రధానంగా జోనల్‌ వ్యవస్థ అమలులో ఉండేది. అప్పుడు ఉమ్మడి ఏపీలో ఉన్న మొత్తం ఏడు జోన్లలో తెలంగాణను రెండు జోన్లుగా విభజించి ఆ జోన్ల వారీగా ఉద్యోగ నియామకాలు జరిగేవి. జిల్లా స్థాయి ఉద్యోగ నియామకాల్లో 80శాతం స్థానికులకు, 20శాతం స్థానికేతరులకు అవకాశం కల్పించారు. అలాగే, జోనల్‌ స్థాయి ఉద్యోగ నియామకాల్లో 70శాతం స్థానికులకు, 30శాతం స్థానికేతరులకు ఉద్యోగాలు లభించేవి. ఇక రాష్ట్రస్థాయి ఉద్యోగాల నియామకాల్లో 60శాతం స్థానికులకు, 40శాతం స్థానికేతరులకు రిజర్వేషన్‌ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారు. అయితే, ఈ విధానంతో స్థానికులైన తెలంగాణ ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం జరిగిం దంటూ అనేక పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నినాదంలోనే ఈ అంశం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ప్రధాన డిమాండ్లతో తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఎట్టకేలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. కానీ, ఇప్పుడు ఆ ప్రాథమిక నినాదాన్నే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్కన పడేయడం ఉపాధ్యాయుల ఆక్రోశానికి కారణమవుతోంది.

తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో భౌగోళికంగా 10 జిల్లాలు ఉండేవి. పరిపాలనా సౌలభ్యం పేరుతో కేసీఆర్‌ 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు. అలాగే, 33 జిల్లాలను ఏడు జోన్లుగా రూపొందించారు. అయితే, తొలుత 31 జిల్లాలుగా విభజించగా.. తర్వాత మరో రెండు జిల్లాలను పెంచి మొత్తం 33 జిల్లాలుగా మార్చేశారు. 31 జిల్లాలుగా విభజించిన సమయంలోనే.. 2018 ఆగస్టులో తెలంగాణలో కొత్త జోనల్‌ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. అయితే, ఇన్నాళ్లు ఆ అంశాన్ని పట్టించుకోని కేసీఆర్‌ సర్కారు.. ఇప్పుడు ఒక్కసారిగా హడావిడిగా ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టింది. దీనికోసం గత డిసెంబర్‌ 6న 317 జీవోను జారీచేశారు. కనీసం సమయం కూడా ఇవ్వకుండా శరవేగంగా బదిలీల ప్రక్రియకు పూనుకున్నారు.

తెలంగాణ ఉద్యమ నినాదం పరంగా చూసినా, జోనల్‌ వ్యవస్థ ప్రాథమిక సూత్రం ప్రకారం చూసినా స్థానికత ఆధారంగానే ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి. కానీ, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం కొత్త నినాదం ఎత్తుకుంది. సీనియారిటీ ప్రాతిపదికన బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానంలో జూనియర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. కుటుంబాలకు కుటుంబాలే చెట్టుకొకరు, పుట్టకొకరుగా అల్లాడిపోయే పరిణామాలు గోచరిస్తున్నాయి. స్థానికులు తమ పల్లె, ఊరూ విడిచి ఎక్కడెక్కడికో పరుగులు తీయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. తమ పిల్లలను మరెక్కడికో తీసుకెళ్లి అక్కడి స్థానికతను బలవంతంగా అంటగట్టాల్సిన దుస్థితి అనివార్యంగా మారుతోంది. కనీసం కౌన్సిలింగ్‌ వ్యవస్థ అందుబాటులో ఉన్నా ఉపాధ్యాయులు స్థానికత ఆధారంగా, స్థానికంగా ఉన్న ఖాళీల ఆధారంగా ఆప్షన్‌ ఎంచుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఈ జీవో పుణ్యమాని అన్ని సదుపాయాలు, సౌలభ్యాలు, పాత విధానాలకు పాతర పడబోతోంది. దీంతో, తమ మెడమీద కత్తిపెట్టి చెప్పిన చోటికి బలవంతంగా పంపిస్తారా? తమ కుటుంబాలకు అన్యాయం చేస్తారా? అని జూనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అంటే ఇదేనా? అని నిలదీస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించింది ఇందుకేనా? అని ఆక్రోశిస్తున్నారు.

జీవో నంబర్‌ 317ను తక్షణమే రద్దు చేయాలని అన్ని పక్షాలూ డిమాండ్‌ చేస్తున్నాయి. జీవో 317 వివాదాస్పదం కావడం వెనుక కారణాలు చూస్తే… టీచర్‌ ఉద్యోగాలను జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. గతంలో జిల్లాల విభజనకు పూర్వం టీచర్‌ ఉద్యోగాలను సర్కార్‌ భర్తీ చేసింది. అయితే, ఇప్పుడు ఆ ఉద్యోగాలను కొత్త జిల్లాల వారీగా కేటాయిస్తు న్నారు. జిల్లాల ఏర్పాటు సమయంలో ఉమ్మడి జిల్లాలోని కొన్ని మండలాలు వేరే ఉమ్మడి జిల్లాల్లోకి వెళ్లాయి. ఉదాహరణకు గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న మద్దూరు, చేర్యాల, కొమురవెల్లి తదితర మండలాలు ఇప్పుడు సిద్ధిపేట జిల్లాలోకి చేరాయి. సిద్ధిపేట జిల్లా గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో భాగంగా ఉండేది. గతంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా లోని హుస్నాబాద్‌, కోహెడ, బెజ్జంకి తదితర మండ లాలు సైతం సిద్ధిపేట జిల్లాలో చేర్చారు. గతంలో షాద్‌నగర్‌, ఆమనగల్లు, మాడ్గుల తదితర మండలాలు ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఉండేవి. ఇప్పుడు వాటిని రంగారెడ్డి జిల్లాలో చేర్చింది సర్కార్‌.

నిరుద్యోగులకూ నష్టమే

ఉద్యోగులకే కాదు.. నిరుద్యోగులకు కూడా జీవో నెంబర్‌ 317 గొడ్డలిపెట్టు అని అందరూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ వివాదాస్పద జీవో 317ను తక్షణం రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులను కొత్త జిల్లాల వారీగా కేటాయిస్తున్న సమయంలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుం టోంది. దీంతో సీనియర్లు అంతా పట్టణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. గత రెండు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు సాధించిన జూనియర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాను పరిశీలిస్తే.. సీనియర్లు అనేక మంది వరంగల్‌, హన్మకొండ తదితర పట్టణాలకు సమీపంలోని పాఠశాలలను ఎంచు కున్నారు. దీంతో జూనియర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి. తమ ప్రాంతం కాకపోయినా కొత్త జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని జూనియర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన అనేక మంది సీనియర్లు పట్టణాలకు ఆప్షన్లు పెట్టుకోవడంతో సీనియారిటీ ఆధారంగా వారికి అక్కడి ఖాళీలనే కేటాయించారు.

ఈ విధానంతో నిరుద్యోగులకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు వరంగల్‌ లాంటి అర్బన్‌ ప్రాంతాలకు వెళ్లిన సీనియర్లు జూనియర్లతో పోల్చితే త్వరగా పదవీ విరమణ చేసే అవకాశం ఉంటుంది. అయితే మారుమూల, వెనుక బడిన జిల్లాలకు, ఏజెన్సీ ఏరియాలకు వెళ్లిన జూనియర్ల ఉద్యోగ విరమణకు మాత్రం ఇంకా చాలా ఏళ్లు ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఖాళీలు ఇప్పట్లో ఏర్పడే అవకాశమే ఉండదు. దీంతో వెనుకబడిన ప్రాంతాల్లోని నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. టీచర్ల కేటాయింపునకు ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం హేతుబద్ధంగా లేదని దాదాపు అన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సంజయ్‌ దీక్షతో జడుసుకున్న ప్రభుత్వం

కేసీఆర్‌ సర్కారు తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 317 వెనక ఉన్న వాస్తవాలను బట్టబయలు చేసి.. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ రంగంలోకి దిగింది.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్వయంగా కరీంనగర్‌లో జాగరణ దీక్షకు దిగారు. కానీ, పోలీసులు ఆ దీక్షను రణరంగంగా మార్చేశారు. కరోనా నిబంధనలు, ఇతర ఆంక్షల పేరుతో ఓ బందిపోటును, ఉగ్రవాదిని అరెస్టుచేసిన మాదిరిగా అత్యంత కఠినంగా వ్యవహ రించారు. లాఠీఛార్జీలు, తోపులాటలతో కరీంనగర్‌ ఎంపీ ఆఫీసు యుద్ధక్షేత్రాన్ని తలపించింది. దీంతో, కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రాత్రికి రాత్రే బండి సంజయ్‌ దీక్షను పోలీసులు భగ్నంచేశారు. కానీ, తెల్లవార్లూ పోలీస్‌స్టేషన్‌లోనే సంజయ్‌ దీక్ష కొనసాగించారు.

జీవో నెంబర్‌ 317కు సవరణలు చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 2న రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు జాగరణ దీక్ష చేస్తున్నట్లు బండి సంజయ్‌ ప్రకటించారు. అయితే, దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో, కరీంనగర్‌లోని తన ఎంపీ కార్యాలయంలో లోపలి నుంచి తాళం వేసుకుని సంజయ్‌ దీక్షకు దిగారు. అయితే, రాత్రి 10 గంటల సమయంలో, కార్యాలయం గేటును కట్టర్లతో కట్‌ చేసి, తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించిన పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేశారు. రెండోతేదీ మధ్యాహ్నం నుంచే బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యా యులు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి చేరుకున్నారు. అయితే, ఈ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయినా, సాయంత్రానికి భారీ సంఖ్యలో బండి సంజయ్‌ దీక్షా స్థలికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జనం చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దశలవారీగా లాఠీచార్జీలు, అరెస్టులతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ కూడా స్వయంగా లాఠీఛార్జి చేయడం గమనార్హం.

 బండి సంజయ్‌ అరెస్ట్‌ను బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. సంజయ్‌పై గతంలో ఉన్న పాత కేసులను, ఐపీసీ సెక్షన్‌ 333ను పెట్టడాన్ని బీజేపీ నేతలు తప్పు పట్టారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రఘునందన్‌, విజయశాంతి, డికె అరుణ తదితరులు కేసీఆర్‌ సర్కారుపైనా, పోలీసుల తీరుపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు.. బండి సంజయ్‌కు పూర్తి మద్దతు ఇస్తామని, పార్టీ జాతీయ అధ్యుక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యా యుల కోసం బండి చేస్తున్న దీక్షను ప్రశంసించారు. కేసుల గురించి చూసుకుంటామని భరోసా ఇచ్చారు.

బీజేపీ చేపట్టిన జాగరణ దీక్షకు ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు.. నిరుద్యోగులు కూడా భారీగా మద్దతు తెలపడం, ప్రజలు కూడా బీజేపీ పోరాటానికి అండగా నిలిచిన పరిస్థితులు స్వయంగా చూసిన కేసీఆర్‌ ప్రభుత్వం జడుసుకుందని, అందుకే కావాలనే బండి దీక్షను భగ్నంచేసి రణరంగం సృష్టించేందుకు కారణమయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

About Author

By editor

Twitter
Instagram