అమరావతి క్యాపిటల్‌ ‌సిటీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (ఎసిసిఎంసి) పేరుతో రాజధానిని ముక్కలు చేద్దామనే ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు తిప్పికొట్టారు. ఎసిసిఎంసి ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన గ్రామసభల్లో ప్రభుత్వ ప్రతిపాదనలపై వ్యతిరేకత వ్యక్తమైంది. 19 గ్రామాల్లో జరుగుతున్న గ్రామసభలను వరుసగా వ్యతిరేకిస్తూ 29 గ్రామాలతో కూడిన రాజధాని ప్రాంతాన్ని సీఆర్డీయే బృహత్‌ ‌ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసిన తర్వాతే నగరపాలక సంస్థగా ఏర్పాటుచేసేందుకు సమ్మతిస్తామని తీర్మానాలు చేస్తున్నారు. అమరావతి నగరం అంటే 29 గ్రామాలు. ల్యాండ్‌ ‌ఫూలింగ్‌లో రైతుల నుంచి భూములు తీసుకున్నప్పుడు గానీ, సీఆర్డీయే చట్టంలో కూడా అదే ఉంది. సీఆర్డీయే చట్టం అమలులో ఉండగా, ఆ చట్ట పరిధిలోని గ్రామాలను ఎలా విభజిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అమరావతి ప్రాంతం మీద కక్ష గట్టినట్టు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. రెండున్నరేళ్లు కాలయాపన చేసి, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో భూముల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. అమరావతి నగరాన్ని 13 జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఉండవల్లి, పెనుమాకతో పాటుగా మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, బేతపూడి పంచాయతీల నుండి అమరావతి కార్పొరేషన్‌ని విడదీయడం అసంబద్ధ నిర్ణయాలకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. మూడు రాజధానుల చట్టం రద్దు చేసినా, దాని ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించిన ప్రభుత్వం కపటోపాయంతో రాజధాని రైతుల్లో వైషమ్యాలు రెచ్చ గొట్టేందుకు ప్రయత్నిస్తోంది. 19 గ్రామాలను కలిపి అమరావతి క్యాపిటల్‌ ‌సిటీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌గా అప్‌‌గ్రేడ్‌ ‌చేయడం ద్వారా పెరిగిన భూముల విలువలతో అసూయ కలిగించి తమ ఐకమత్యం చెడగొట్టాలనేది ప్రభుత్వ కుట్రగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


రాజధాని అమరావతి ప్రాంతం ముక్కలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాదిలోనే రాజధాని సిటీ పరిధిలో ఉండే ఉండ వల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు గ్రామాలను రాజధాని పరిధి నుండి మినహాయిం చారు. మంగళగిరి రూరల్‌ ‌మండల పరిధిలోని కురగల్లు, నీరుకొండ, కృష్ణాయపాలెం గ్రామాలను రాజధానిలోనే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అమరావతి క్యాపిటల్‌ ‌సిటీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (ఎసిసిఎంసి) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత నెల 16న గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ‌నుంచి గుంటూరు జిల్లా కలెక్టర్‌కి ఆదేశాలు రావడంతో 2021 డిసెంబర్‌ 29‌న గుంటూరు కలెక్టర్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. మంగళగిరి మండలంలో మూడు గ్రామాలు, తుళ్లూరు మండలంలో 16 గ్రామాలు కలిపి కొత్త కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు పక్రియ ప్రారంభించారు. వివిధ గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామ సభల షెడ్యూల్‌ ‌విడుదల చేశారు. జనవరి 5 నుంచి అవి ప్రారంభమై 12వ తేదీ వరకూ జరుగుతాయి. మంగళగిరి మండలం నీరుకొండ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తుళ్లూరులో జరిగే గ్రామసభతో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తవుతుంది.

ఈ నోటిఫికేషన్‌ ‌ప్రకారం జరుగుతున్న గ్రామ సభల్లో ఒకే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 19 గ్రామాతో అమరావతి క్యాపిటల్‌ ‌సిటీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఏర్పాటుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఫూలింగ్‌ ‌సమయంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌, ‌జాయింట్‌ ‌కలెక్టర్‌ ఇచ్చిన హామీ మేరకు తాము భూములిచ్చామని, వాటిని అమలు చేయాలని కోరుతున్నారు. రాజధానికి భూములిచ్చి రోడ్డున పడ్డాం. ఇప్పుడు మళ్లీ కార్పొరేషన్‌ అం‌టున్నారు.. రాజధానిలో ఎస్సీల జీవనం దుర్భరమైంది. పింఛను, పట్టా భూములతో సమానంగా ప్యాకేజీ పెంపు హామీ అమలుకాలేదు.. అసైన్డ్ ‌రైతులకు ఇప్పటికీ కౌలు ఇవ్వలేదు అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా గ్రామస్తులు చేతు లెత్తి తమ నిరసన తెలుపుతున్నారు. గ్రామస్తుల అభి ప్రాయాన్ని గ్రామసభ తీర్మానంగా నమోదు చేసి ప్రభు త్వానికి పంపుతామని అధికారులు ప్రకటించారు.

తిప్పి కొడుతున్న సభ్యులు

ఆర్టికల్‌ 243 (ఎ) ‌ప్రకారం ఏ గ్రామసభకు అయినా శాసనసభకు ఉన్న అధికారాలుంటాయి. పంచాయతీ రాజ్‌ ‌చట్టం సెక్షన్‌ 6ఏ ‌ప్రకారం గ్రామసభలో మెజారిటీ సభ్యులు తమ పంచాయతీని మున్సిపాలిటీగా అప్‌‌గ్రేడ్‌ ‌చేసేందుకు అంగీకరిస్తూ తీర్మానించాలి. ఈ తీర్మానం చేయకుంటే అది చెల్లదు. దీనిని గ్రామసభల్లో సభ్యులు విజయవంతంగా తిప్పికొడుతున్నారు.

సీఆర్డీయే ఒప్పందంలో ఏముంది?

రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. 2050 నాటికి 35 లక్షల మంది ప్రజలు అక్కడ నివసిస్తారని వారి అవసరాల మేరకు విజయవాడ, గుంటూరు నగరాల మధ్యలో కృష్ణానది తీరానికి ఆనుకుని కొత్త రాజధానిని అమరాతి పేరుతో నిర్మించాలని తీర్మానించింది. ఈ మేరకు 2015 అక్టోబర్‌ 22‌న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 25 పంచాయతీ లను కలిపి అమరావతి నగరంగా అభివృద్ధి చేసేందుకు అప్పట్లో ప్రణాళికలు తయారుచేశారు. 29 గ్రామాలను కలిపి 217.23 చ.కి.మీల పరిధిలో అమరావతి నగర విస్తరణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ గ్రామాల్లో ప్రస్తుతం 27వేల కుటుంబాలకు చెందిన లక్షమంది జనాభా అమరావతి పరిధిలో ఉన్నారు. అలాగే రాజధాని పరిధిలో పరిపాలనా నగరం, హెల్త్ ‌సిటీ, ఎడ్యుకేషన్‌ ‌సిటీ, మీడియా సిటీ, స్పోర్టస్ ‌సిటీ ఇలా 9 ప్రాంతాలుగా విడగొట్టి అభివృద్ధి చేస్తామని కూడా గత ప్రభుత్వం తెలిపింది. రాజధాని కోసం రైతుల నుంచి భూములను సేకరించింది. మొత్తం 27 వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించగా, ప్రభుత్వ భూములు కూడా దానికి కలిపితే మొత్తం 53,748 ఎకరాల్లో రాజధాని అమరావతి నగర విస్తీర్ణం చేయాలని నిర్ణయించారు. అందులో 27,885 ఎకరాలను రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, ఇతర ప్రజావసరాలకు అనుగుణంగా వినియోగించాలని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు 14,037 ఎకరాలు వినియోగించా లని నిర్ణయించారు. అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు వారి వాటా కింద ఫ్లాటుల నిర్మాణం, ఇతర అవసరాలకు 11,826 ఎకరాలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. సచివాలయం, సెక్రటేరియేట్‌, ‌హైకోర్టు భవనాలను 2017 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు, న్యాయాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటుగా సిబ్బంది కోసం నిర్మించిన భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. స్పీడ్‌ ‌యాక్సెస్‌ ‌రోడ్డు వంటి విశాలమైన 8 లైన్ల రోడ్ల నిర్మాణం కూడా కొంతమేరకే ముందుకు సాగింది.

ప్రైవేటు విద్యా సంస్థలు ఎస్‌ఆర్‌ఎం, ‌విట్‌ ‌వంటివి అమరావతి ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహిస్తు న్నాయి. ఇతర ప్రతి పాదనలన్నీ అంచనాలుగానే మిగిలాయి.

3 రాజధానుల అంశం

2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అమరావతి నగర నిర్మాణానికి లక్షల కోట్ల నిధులు అవసరమౌతాయని, అన్ని నిధులు ప్రభుత్వం వద్ద లేవని సాకు చెబుతూ 3 రాజధానులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. శాసనసభలో 3 రాజధానుల ఏర్పాటు, సీఆర్డీయే వ్యవస్థ రద్దు చేసి శాసనమండలికి పంపితే మండలి దానిని సెలెక్ట్ ‌కమిటీకి పంపింది. 3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించిన అమరావతి రైతులు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఒక్క రాయిని, గంపెడు ఇసుకను సైతం అక్కడ వేయలేదు. రాజధాని అభివృద్ధి ఆగిపోయింది. ఈ దశలో ఇటీవల 3 రాజధానుల ఏర్పాటు కేసు ముగింపు దశకు చేరుకుంది. ప్రభుత్వం కేసు ఓడిపోనున్నట్లు ప్రచారం జరిగింది. తాము చేసిన చట్టంలో సాంకేతిక లోపాలు న్నట్లు ప్రభుత్వం గ్రహించి 3 రాజధానుల చట్టం ఏర్పాటు, సీఆర్డీయే రద్దు చట్టాలను ఉపసంహరించు కుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. మళ్లీ సమగ్రంగా ఈ బిల్లును తీసుకొస్తా మని చెప్పింది. ఆ క్రమంలోనే అమరావతి సిటి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ అం‌శం తెరపైకి వచ్చింది. రాజధానిలో ప్రభుత్వం ఏం చేయాలన్నా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, న్యాయస్థానాల అనుమతి తప్పనిసరని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. దానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ ‌కో ఇప్పటికీ అమల్లో ఉంది, దాన్ని ధిక్కరించేలా ప్రభుత్వం ఇప్పుడు 29 గ్రామాలను కాదని, 19 గ్రామాలతో అమరావతి మున్సిపల్‌ ‌కేపిటల్‌ ‌కార్పొరేషన్‌కు శ్రీకారం చుట్టింది.

విభజించి పాలించే కుట్ర

అమరావతి రాజధానిలో ఉంటున్న గ్రామస్తులపై ప్రభుత్వం చేయని కుట్రలేదు. తమ డిమాండ్‌ల కోసం ఉద్యమం చేస్తున్న రైతుల సమస్యలను కనీసం ప్రభుత్వం వినలేదు. ముఖ్యమంత్రి అయితే వారితో కనీసం మాట్లాడలేదు. ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులని విమర్శించారు. శిబిరాల్లో కూర్చున్నవారిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిం చారు. మహిళలపై సైతం దౌర్జన్యం చేసిన సంఘటన లను ప్రజలంతా తప్పుపట్టారు. ఆందోళనల సమయంలో పోలీసులు అక్రమకేసులు బనాయిం చారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. పైగా అమరావతి రాజధానికి వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా కొందరిని కిరాయికి తెచ్చి టెంట్లు వేసి ఒకటి రెండు రోజులు ఉద్యమాలు చేయించారు. అమరావతికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అడ్డుకుంటున్నారని లబ్ధిదారులను ఉసిగొలిపారు. వరదలొస్తే అమరావతి ప్రాంతం మునిగిపోతుందని అసత్యప్రచారం చేశారు. అమరావతి స్మశానం అని స్వయంగా మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. అక్రమ కొనుగోళ్లు జరిగాయని, సాక్ష్యాధారాలు లేని కేసులు పెట్టి అభాసుపాలయ్యారు. తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకుని తమ గోడు చెప్పుకుందామని రైతులు విజ్ఞప్తి చేస్తే ఆ యాత్రను ప్రభుత్వం అనుమతించలేదు. చివరకు కోర్టును ఆశ్రయించి యాత్ర జరిపినా దారి పొడవునా ఆనేక ఆంక్షలు విధించారు. యాత్రకు ఏ మాత్రం సహకరించలేదు. యాత్రకు మద్దతిచ్చిన రాజకీయపార్టీల నాయకులపై కేసులు పెట్టారు.

రాజధాని భూములు తాకట్టు

రెండున్నరేళ్ల నుంచి అమరావతి రాజధానిలో ఒక్క పని జరగకపోవడం, ప్రజలు కూడా ప్రభుత్వాన్ని తప్పపట్టడంతో చివరి దశలో ఉన్న కొన్ని నిర్మాణాలను అయినా పూర్తిచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దాంతో వాటి నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం మళ్లీ అప్పు చేయడానికి నిర్ణయించు కుంది. ఈ అప్పులకు అమరావతి కోసం రైతులిచ్చిన భూములను బ్యాంకులకు హామీపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భూముల్లో దాదాపు 481 ఎకరాలు,

రూ. 3,760 కోట్లకు పైగా విలువ చేస్తుందని, ఆ భూముల తాకట్టుతో రూ.2,994కోట్లు అప్పు తీసుకోవాలని డీపీఆర్‌ ‌తయారుచేయించారు. 481 ఎకరాలు రూ.3,760కోట్లు అయితే, ఒక్కో ఎకరా దాదాపు రూ.7కోట్ల పైన పలుకుతోంది. అమరావతిని గతంలో ఎడారిగా పేర్కొన్న మంత్రులు, అదే ప్రభుత్వం బ్యాంకులకు తాకట్టుపెట్టడానికి తయారుచేసిన డీపీఆర్‌లో ఎకరం భూమి విలువ రూ.7కోట్లని చెప్పారు. ఆ లెక్కన చూసినా, మొత్తం రాజధాని రైతులిచ్చిన 34వేల ఎకరాల విలువ

రూ. 2లక్షల 38వేలకోట్లు అవుతుంది. అత్యంత విలువైన భూములను ఉంచుకుని రాజధాని కట్టడానికి ఎందుకు సంకోచిస్తున్నారనేది అంతుబట్టని విషయం.1

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram