ఆంధప్రదేశ్‌లో విదేశీ విషసంస్కృతి పురివిప్పుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, ఎడ్ల పందేలు, కత్తికట్టని కోడిపందేలు జరిగేవి. ఊరూవాడా అందరూ ఉత్సాహంగా పాల్గొని పండుగ చేసుకునేవారు. ఐకమత్యంగా ఉండేవారు. మారుతున్న పరిస్థితుల్లో మన తెలుగు సంస్కృతి ఏమైనా కాస్త కనబడాలంటే సంక్రాంతి రోజుల్లోనే. ఇప్పుడు యువత విదేశీ సంస్కృతి పట్ల ఆసక్తి చూపుతున్నారు. మద్యం మొదలుకొని జూదం ఆడుతూ, అర్ధనగ్న నృత్యాల్లో మునిగితేలుతూ జేబులు, ఒళ్లు గుల్లచూసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాం నుంచే ఈ సంస్కృతి ఉన్నా ఇటీవల రెండున్నరేళ్ల నుంచి ఇది తీవ్రంగా మారింది.

ఈ ఏడాది ఆంధప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు పెద్దఎత్తున జరిగాయి. వీటిని సంబరాలు అనేకంటే విచ్చలవిడి జూదం, అశ్లీల ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్రం నడిబొడ్డు కృష్ణాజిల్లా గుడివాడ కేంద్రంగా జరిగిన కేసినో  వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మూడురోజల పాటు జరిగిన కేసినో జూదంలో సుమారు రూ.200 కోట్లు చేతులు మారయని ప్రచారం జరుగుతోంది. ఒమిక్రాన్‌, ‌కరోనా థర్డ్ ‌వేవ్‌ ‌విజృంభిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇక్కడ కేసినో సెంటర్‌ను నిర్వహించారు. మద్యం, జూదం, పేకాట, అశ్లీల నృత్యాలు ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతుంటే పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కిమ్మనలేదు. ఈ వ్యవహారం ‘రచ్చ’ కావడంతో ప్రభుత్వం నవ్వులపాలైంది.

జాతీయ వార్తల్లో గుడివాడ

ఈ కేసీనో వ్యవహారంతో గుడివాడ పేరు జాతీయస్థాయిలో మార్మోగింది. నియోజకవర్గంలోని నందివాడ సమీపంలోని ఒక ప్రదేశంలో ఈ తతంగం జరిగింది. అధికార పార్టీ నేతలు గత కొన్నేళ్లుగా కోడిపందేలు, ఎడ్ల పందేలు జరుపు తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఇక్కడ కేసినో కూడా నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. మంత్రి కొడాలి నాని దీనిని నిర్వహించినట్లు తెదేపా ఆరోపించడంతో తనకేం తెలీదని, తనే కేసినోను నిర్వహిస్తే పెట్రోలు పోసుకుంటానని కూడా ఆయన ప్రతిసవాల్‌ ‌విసిరారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఆరోపణలు పెరిగిపోయాయి. టీవీ ఛానళ్లలో వచ్చిన కొన్ని వీడియోలను తెదేపా చూపించి మంత్రి చెప్పేవన్నీ అసత్యాలని ఆరోపించింది. మంత్రి నానికి సన్నిహితుడైన ప్రవీణ్‌ ‌చికోటి అనే వ్యక్తి, ముంబైకి చెందిన ఏసెస్‌ ‌కేసినో సంస్థను గుడివాడలో ఓ కన్వెన్షన్‌ ‌వేదికగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. జనవరి 14న గుడివాడలోని కేసినోలో ఉన్నట్లు ప్రవీణ్‌ ‌చికోటి, ఏసెస్‌ ‌నిర్వాహకుడైన ప్రేమల్‌ ‌తన ఫేస్‌బుక్‌ ‌పేజీలో పోస్టు చేయగా ఈ ఫొటోలన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ ‌కావడంతో ఏసెస్‌ ‌సంస్థ, ప్రేమల్‌ ‌వాటిని తొలగించినట్లు దినపత్రికల్లో వార్తలొచ్చాయి. కేసినో పైకప్పు మొత్తం వైకాపా జెండా రంగులున్న వస్త్రాలతో అలంకరించారు. వేదిక వద్ద కొడాలి నాని నాని.. అంటూ చిందులు చేశారు. వేదికపై అశ్లీల నృత్యాల ప్రదర్శన, మహిళలపై డబ్బులు చల్లుతూ చిందులువేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. రెండు పార్టీల మధ్య గొడవ పెరిగిపోవడంతో గన్నవరం ఎమ్మెల్యే వంశీ తన స్నేహితులే అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు స్వయంగా ప్రకటించారు. మంత్రి కొడాలి నానికి గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్‌ ‌స్నేహితుడే కాక వ్యాపార భాగస్వామి అని కూడా చెబుతారు. మంత్రిపై ఆరోపణలు పెరిగి విషయం పెద్దదయి, జాతీయ స్థాయిలో రచ్చకావడంతో వంశీ తన వంతు సహకారం అందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు ఎక్కడ, ఏం మాట్లాడినా తెలిసిపోయే ప్రభుత్వానికి, పోలీసులకు గుడివాడలో జరిగిన కేసినో గురించి తమకేం తెలీదనడంతో ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

మూడు రోజుల పాటు ఈ కేసినోను ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిపారు. భోగి, సంక్రాంతి రోజుల్లో రూ.5 వేలు, కనుమ రోజు రూ.10 వేలు ఎంట్రెన్స్ ‌ఫీజు వసూలు చేశారంటున్నారు. పేకాట, జూదం మాత్రమే కాకుండా మద్యం ఏరులై పారిందట. గోవా నుంచి రప్పించిన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కేసినోలో పాల్గొన్న వేలాది మంది వ్యసనపరులు భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. ఏపీ నుంచే కాదు, తెలంగాణ నుంచి కూడా వచ్చారు. కోడిపందేలను చూద్దామని వచ్చిన వారు కూడా కేసినోకు వచ్చారు. జూదం అడినవారిలో కనీసం రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పొగొట్టుకున్న వారూ ఉన్నట్లు అంచనా.

దోపిడీకి కాపలాగా ప్రభుత్వ యంత్రాంగం!

ఇన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలు బహిరంగంగా జరుగుతుంటే అధికార యంత్రాంగం చేతులు కట్టుక్కూర్చున్న వైఖరిని ప్రజలంతా తప్పుపడు తున్నారు. బాగుచేస్తారని అధికారం ఇస్తే తమనే పీక్కుతింటున్నారని ఆరోపిస్తున్నారు. పెద్దల అండ దండలతోనే ఈ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది. అంతేకాదు, సకల సదుపాయా లతో జరిగిన కోడిపందేలు తిరునాళ్లు, జాతర్లను తలపించాయి. కొవిడ్‌ ‌నిబంధనలు గాలికి వదిలేశారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నాయకులే పందేలు జరిపినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ దారుణాలకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యతగా రాజకీయపార్టీలు ఆరోపిస్తున్నాయి. కోడి పందేలను నిషేధిస్తూ 2017లో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు అమలు పరచట్లేదు. సంక్రాంతి సందర్భంగా కోడిపందేలపై వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా కోడిపందేల నిర్వహణను అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందని ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శి కోర్టుకు హామీ ఇచ్చారు. ఆ హామీని ప్రభుత్వమే ఉల్లంఘించిందనడానికి రాష్ట్రంలో జరిగిన విచ్చలవిడి కోడిపందేలు, జూదాలే సాక్ష్యాలు.

సంస్కృతిపై దాడి!

తెలుగు సంస్కృతిపై విదేశీ సంస్కృతి దాడి కొత్త కాకున్నా సంక్రాంతి పండుగకు కేసినోను తీసుకు రావడం మరింత ఆందోళన కలిగించే అంశం. సంస్కృతి, సంప్రదాయాలు మన జీవనవిధానానికి ప్రతీకలు. ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా పండుగల సమయంలో సంస్కృతి, సంప్రదాయాలు బాగా ప్రకటితమవుతాయి. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేదే సంక్రాంతి పండుగ. అయితే దీనిని సైతం నాయకులు వ్యాపార సంపాదనకు అనుగుణంగా మార్చేశారు. వినోదాత్మకంగా సాగాల్సిన గ్రామీణ క్రీడలు కొందరు స్వార్థపరులు డబ్బు సంపా దించిపెట్టే సాధనాలుగా మార్చివేశారు. డబ్బంటే ఆశ ఉన్నవారు, వ్యసన పరులు ఈ ఉచ్చులో పడి బలైపో తున్నారు. ఇప్పటికే హిందూధర్మం, సంస్కృతిపై ఈ ప్రభుత్వం వివక్ష చూపుతున్నట్లు 30 నెలల పాలన గమనిస్తే  ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ఇతర మతాల వారి పండుగల సందర్భంలో ఎంతో కట్టుదిట్టంగా వ్యవహరించే ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంలోనే జూదాలు నిర్వహించే వెసులుబాటు ఎందుకిస్తోందని హిందువులు ప్రశ్నిస్తున్నారు.

వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలోకి విదేశీ సంస్కృతిని తీసుకొస్తోందని, ఈ విష సంస్కృతి వల్ల యువత, రాష్ట్ర భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని భయపడుతున్నారు. ఇదంతా పథకం ప్రకారమే హిందూ సంస్కృతిని విచ్ఛిన్నం చేసి ప్రజలను ఆర్థికంగా దెబ్బతీసి మతమార్పిడులకు అనుకూలంగా మార్చే యోజనగా ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై వారంరోజులుగా గొడవ జరుగుతుంటే ఎస్పీ గాని, డీజీపీ గాని, ముఖ్యమంత్రి గాని స్పందించకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి!

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram