– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

ఒమిక్రాన్‌.. ‌గత నెలరోజులుగా ఈ వ్యాధి యావత్‌ ‌ప్రపంచాన్ని ఊపేస్తోంది. తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ మహమ్మారి ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. అమెరికా, బ్రిటన్‌, ‌రష్యా, ఇటలీ, జర్మనీ, స్పెయిన్‌, ‌ఫ్రాన్స్ ‌వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అన్ని దేశాలూ దీంతో సతమతమవుతున్నాయి. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు కట్టదిట్టమైన చర్యలతో ముందుకు సాగుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ముందస్తు జాగ్రత్తలు ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని, ఈ విషయంలో ఎంతమాత్రం అలసత్వం లేకుండా అన్ని దేశాలూ తగిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ సూచించింది.

భారతదేశంలో పరిస్థితి ఒకింత ఆందోళనకరంగానే ఉంది. మరణాల సంఖ్య పెద్దగా లేనప్పటికీ రోజురోజుకూ పెరుగుతున్న కేసులు అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా, జనవరి 16న ఒక్కరోజే 2,71,202 మంది కొవిడ్‌ ‌బారిన పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో కేసుల సంఖ్య 3,71,22,164కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.28 శాతంగా నమోదైంది. క్రియాశీల కేసుల సంఖ్య 15,50,377కు చేరుకుంది. ఒక్కరోజులో 314 మంది మరణించారు. కేరళలో 106, బెంగాల్లో 39 మరణాలు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 4,86,066కు చేరింది. ఇవన్నీ జనవరి 16 నాటికి సంబంధించిన గణాంకాలు. దేశవ్యాప్త పరిస్థితిని విశ్లేషించినట్లయితే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈశాన్య రాష్ట్రమైన అసోం కఠిన ఆంక్షలు విధించింది. టీకా తీసుకోని ఒప్పంద ఉద్యోగులు తప్పనిసరిగా సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. గడువు ముగిసినా రెండో డోసు తీసుకోని వారికి సైతం ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. సెలవులు లేని ఉద్యోగులు నో వర్క్ ‌నో పే విధానం కింద వేతనం కోల్పోతారు. ఆరోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వర్కర్లు తప్పనిసరిగా ప్రికాషన్‌ ‌డోసు తీసుకోవాలి. లేదంటే వారికి జీతభత్యాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్‌ ‌తీసుకున్నట్లు ధ్రువపత్రం లేనివారిని ప్రభుత్వ కార్యాలయాలు, మాల్స్, ‌వాణిజ్య కేంద్రాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. కొవిడ్‌ ‌బారిన పడిన రాష్ట్ర గవర్నర్‌ ‌జగదీశ్‌ ‌ముఖి గువాహటిలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. కర్టాటకకు చెందిన కాంగ్రెస్‌ ‌దళిత నాయకుడు, రాజ్యసభలో విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే కొవిడ్‌ ‌బారిన పడ్డారు. చాలా రాష్ట్రాలు సైతం కఠిన చర్యల దిశగానే ముందుకు సాగుతున్నాయి.


‌ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌

‌రష్యాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నెల రెండోవారంలో ఒక్కరోజులో 33 శాతం అధికంగా కేసులు నమోదవ్వడం ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా 50 వేల మందికి పైగా విద్యార్థులు వైరస్‌ ‌బారిన పడినట్లు అంచనా. దాయాది దేశమైన పాకిస్తాన్‌లోనూ ఒమిక్రాన్‌ ‌ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ కేసుల పెరుగుదల, వైరస్‌ ‌విస్తరణతో ఇస్లామాబాద్‌ ‌పాలకులు హడావుడి పడుతున్నారు. గల్ఫ్ ‌దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (‌యూఏఈ)లో 99శాతం వ్యాక్సినేషన్‌ ‌పూర్తయినప్పటికీ కరోనా నియంత్రణ కావడం లేదు. ది ఎమిరేట్‌ ఆఫ్‌ అజమాన్‌ ‌సర్కారు కఠిన చర్యలతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైనా రెండోసారి క్వారంటైన్‌కు వెళ్లాల్సివస్తే వారికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయబోమని హెచ్చరించింది. ఉద్యోగుల్లో ఆరోగ్య క్రమశిక్షణ కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోపక్క మహమ్మారి గురించి అవగాహన ఉన్న వారు సైతం దాని పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం ఆందోళనకర పరిణామం. జర్మనీలోని ఐసీయూ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిలో అధికులు టీకా తీసుకోనివారేనని ఒక నివేదిక పేర్కొంది. బాధితుల్లో 62శాతం మంది ఎలాంటి టీకా తీసుకోలేదు. మిగతావారిలో 10 శాతం మంది పాక్షికంగా, 28 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్‌ ‌తీసుకున్నారు. ఈ గణాంకాలు ప్రభుత్వ, ప్రజల నిర్లక్ష్యాన్ని చాటుతున్నాయి. చాలా దేశాలు టీకా ద్వారా మహమ్మారి ఆటకట్టుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం డజనుకు పైగా టీకాలు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్ -ఆ‌స్ట్రాజెనెకా, ఫైజర్‌ -‌బయోఎన్‌ ‌టెక్‌, ‌సినోఫార్మ్, ‌మెడెర్నా, జాన్సన్‌, ‌సినోవాక్‌, ‌కొవాగ్జిన్‌, ‌కొవిషీల్డ్, ‌కాన్‌ ‌సినో, స్పుత్నిక్‌ ‌లైట్‌ ‌టీకాలను ప్రపంచ దేశాలు వాడుతున్నాయి. 289 కోట్ల డోసులను పంపిణీ చేసి టీకాల వినియోగంలో చైనా ముందు వరుసలో ఉంది. 155 కోట్ల డోసులను వేయడం ద్వారా భారత్‌ ‌రెండో స్థానంలో నిలిచింది. అగ్రరాజ్యమైన అమెరికా తన జనాభాలో 62.8 శాతం మందికి పూర్తిస్థాయిలో టీకాలు వేయించింది.


గతానుభవం నేపథ్యంలో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట కార్యాచరణతో, సమన్వయంతో, కలసికట్టుగా ముందుకు సాగుతున్నాయి. మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. కొవిడ్‌ ‌వెలుగు చూసినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో పరిస్థితిని సమీక్షిస్తూ తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. నేరుగా ముఖ్యమంత్రులతోనూ సమీక్షిస్తున్నారు. వారితో ఆన్‌లైన్లో సమావేశమవుతూ అవసరమైన నిధులు, వ్యాక్సిన్లు, ఇతర ఆరోగ్య పరికరాలను సమకూరుస్తున్నారు. ముఖ్యంగా దేశీయ టీకా తయారీకి శాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. వారికి అవసరమైన సాధన సంపత్తి సమకూర్చారు. వారికి మద్దతుగా నిలబడి భరోసా కల్పించారు. 2021 జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 16 నాటికి ఈ కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఏడాది కాలంలో 156 కోట్లకు పైగా టీకా డోసులు వేయడం విశేషం. వ్యాక్సినేషన్‌ను వ్యూహాత్మకంగా దశలవారీగా చేపట్టారు. తొలిదశలో వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, పోలీసులకు వేశారు. మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడిన వారికి, వయోజనుల్లో ఇతర జబ్బులు ఉన్న వారికి టీకాలు వేశారు. ఏప్రిల్‌ 1 ‌నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ‌మొదలుపెట్టారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేశారు. తాజాగా ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల మధ్య పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించారు. జనవరి 10 నుంచి మూడో డోసు కార్యక్రమం కూడా మొదలైంది. వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్ని ఒక క్రతువుగా పరిగణించిన ప్రభుత్వం దానిని విజయవంతం చేసేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లింది. తొలిరోజుల్లో కొంతమంది టీకాలపై విముఖత చూపారు. వ్యాధి తగ్గకపోగా కొత్త తలనొప్పులు వస్తాయని భావించారు. పల్లెలతోపాటు కొంతమంది పట్టణ ప్రాంత ప్రజలు కూడా ససేమిరా అన్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించారు. మారుమూల గ్రామీణులకు టీకాలు వేసేందుకు ఆరోగ్య సిబ్బంది ఎంతో సహనంతో ముందుకు సాగారు. ఇందుకోసం కొండలు కోనల్లో కాలినడకన వెళ్లారు. ఎడారుల్లో ఒంటెలపై ప్రయాణం చేశారు. శ్రమకోర్చి వాగులు, వంకలు దాటి వెళ్లారు. నదుల మీద పడవల్లో ప్రయాణం చేశారు. ప్రతి ఒక్కరికీ టీకా అందించాలన్న తపనతో అనేక కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన ఆరోగ్య సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. కరోనా కష్టకాలంలో తమ ఆర్యోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేసిన పోలీసుల సేవలకు వెలకట్టడం అసాధ్యం. వారి సేవలను అభినందించడానికి మాటలు చాలవని ప్రధాని పేర్కొన్నారు.

తొలి దశలో కరోనా ఆటకట్టుకు అనివార్యంగా ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ‌విధించాయి. దీనివల్ల ఉత్పత్తి కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఆనాటి పరిస్థితికి అది తప్పలేదు. ఈ చేదు అనుభవం నేపథ్యంలో కరోనా రెండో దశలో లాక్‌డౌన్‌ ఆలోచన తెరపైకి రాలేదు. కఠిన ఆంక్షలు, ముందస్తు జాగ్రత్తలతో మహమ్మారిని అధిగమించాలని ఆలోచన చేశాయి. ఈ ఆలోచన విజయవంతమైంది. అందువల్లే ఆర్థిక వ్యవస్థ కొంతమేరకు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ పెద్దగా ప్రభావితం కాలేదు. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు. స్వయంగా ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొన్న విషయం. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొందని, మళ్లీ పాత వైభవాన్ని పొందగలదని ఐరాస నివేదిక అంచనా వేసింది. దేశంలో టీకా పంపిణీ శర వేగంగా కొనసాగు తుండటంతో ప్రజల్లో ధైర్యం పెరిగింది. కొవిడ్‌ను అధిగమించ గలమన్న ఆత్మవిశ్వాసం వారిలో నెలకొంది. అదే సమయంలో లాక్‌డౌన్‌ ‌విధించకపోవడం వల్ల ఉత్పత్తి కార్యక్రమాలు యధావిథిగా కొనసాగుతున్నాయి. కొన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ అవి ఆర్థిక వ్యవస్థపై అంత తీవ్రంగా ప్రభావం చూపేవి కాకపోవడం కలిసి వచ్చే అంశం. 2022లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.5శాతంగా ఉంటుందని ఐరాస అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్‌ ‌సంకేతాలు (డబ్ల్యూఈఎస్పీ) – 2022 పేరిట ఐరాస విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. అదే సమయంలో బొగ్గు కొరత, చమురు ధరల పెరుగుదల కారణంగా కొంత ప్రతికూలత ఏర్పడే ప్రమాదాన్ని విస్మరించలేమని హెచ్చరించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5.9 శాతానికి పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. మొత్తానికి భారత ఆర్థిక వ్యవస్థను కరోనా పెద్దగా ప్రభావితం చేయలేదని అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థకు ఇది కచ్చితంగా సానుకూల పరిణామమేనని చెప్పడంలో సందేహం లేదు.

కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వాల పాత్ర ఎంత కీలకమో ప్రజల పాత్రా అంతే కీలకం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి, గమనించి తగిన చర్యలు తీసుకుంటే మహమ్మారులు మన జోలికి రావు. మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటించడం, వీలైనంతవరకు బయటకు వెళ్లకపోవడం, కాచి చల్లార్చిన నీటిని తాగడం, సామూహిక కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలో వెళ్లడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ముందస్తు జాగ్రత్తలు పాటించడం వంటి చర్యల ద్వారా మహమ్మారిని నియంత్రించడం కష్టసాధ్యమేమీ కాదు.

వ్యాధి వచ్చిన తరవాత చర్యలు తీసుకోవడం కాకుండా, అసలు వ్యాధే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యుత్తమం. ఈ జాగ్రత్తలను తుచ తప్పకుండా పాటించడం ప్రజల చేతుల్లో ఉంది తప్ప ప్రభుత్వం చేతుల్లో కాదన్న సంగతి గుర్తించాలి. తొలి, రెండు, మూడు దశల కరోనా చేదు అనుభవాల నేపథ్యంలో అపోహలను, అనుమానాలను వీడి అప్రమత్తంగా ఉంటూ అవగాహనతో ముందుకు సాగడమే మనముందున్న కర్తవ్యం.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram