జమలాపురపు విఠల్‌రావు

సౌదీ అరేబియా నుంచి ఆర్థిక సహాయం, అఫ్ఘానిస్తాన్‌లో ఆధిపత్యం నిలుపుకోవడం- ప్రస్తుతం పాక్‌కు అత్యంత ప్రధాన అంశాలు. అప్పులపై ఆధారపడి మనుగడ సాగించే దేశం పొరుగు దేశంపై ఆధిపత్యం చెలాయించాలనుకోవడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం. సహాయంలో పరిమితిని పాటిస్తున్న సౌదీ అరేబియాతో, తన సహాయంతో గద్దెనెక్కిన తాలిబన్‌ ‌ధిక్కార తీరుతో సతమతమవుతున్న పాకిస్తాన్‌ ‌దుస్థితికి వర్తమాన చరిత్రే సాక్ష్యం.


పాకిస్తాన్‌లో 3 బిలియన్‌ ‌డాలర్ల మేరకు సేఫ్‌ ‌డిపాజిట్లు, 1.2 నుంచి 1.5 బిలియన్‌ ‌డాలర్ల విలువైన చమురు సరఫరాలు చేసేందుకు వీలుగా సౌదీ అరేబియా 2021 నవంబర్‌లో ఒప్పందం చేసుకుంది. 2021 డిసెంబర్‌ 6‌న, పాక్‌ ‌కార్మికుల నియామకాలు, వారి నైపుణ్యాల పరిశీలనకు సంబంధించి పాక్‌-‌సౌదీల మధ్య రెండు ఒప్పందాలు కుదిరాయి. నిజానికి సౌదీ అరేబియాలో పనిచేసే పాక్‌ ‌కార్మికులు పంపే నిధులే ఆ దేశ విదేశీ మారక ద్రవ్యానికి ప్రధాన వనరు. ఆ విదేశీమారకద్రవ్యంలో వీరు పంపే నిధులు నాలుగోవంతు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అందువల్లనే నిండామునిగిన పాక్‌కు ఈ ఒప్పందాలు ఆనందం కలిగించడం సహజం. కానీ గుర్తించాల్సిన అంశం-ఇంత కాలంగా పాక్‌కు సహాయం అందిస్తున్న ఆప్తదేశం సౌదీ అరేబియాతో 2019-20లో పాక్‌ ‌ద్వైపాక్షిక వాణిజ్యం 3 బిలియన్‌ ‌డాలర్లు మాత్రమే. ఇదే ఏడాది భారత్‌తో సౌదీ ద్వైపాక్షిక వాణిజ్యం 44 బిలియన్‌ ‌డాలర్లు! మతలబు ఎక్కడుంది? మహమ్మద్‌ ‌బిన్‌ ‌సల్మాన్‌ ‌నేతృత్వంలోని సౌదీ అరేబియా డబ్బుకు మాత్రమే ప్రాధాన్యమిస్తుందని, ఇందుకు ముస్లిం ప్రపంచాన్ని కూడా ఖాతరు చేయబోదని ఇది నిరూపిస్తున్నది.

ఉయ్‌గిర్‌ ‌ముస్లింలపై చైనా జాతి హననానికి పాల్పడుతున్నా సౌదీ యువరాజు పట్టించుకోడు! ఎందుకంటే చైనా తమకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అదే చైనాతో పాక్‌ ‌సంబంధాలు కూడా అప్పులకే పరిమితం. ఎన్నో ఏళ్లుగా తన ప్రత్యర్థులతో ఉన్న విరోధానికే సౌదీ ప్రాధాన్యమిస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం పాక్‌ ఉత్తర్వులు పాటిస్తూ భారత్‌తో తన వాణిజ్యాన్ని పరిమితం చేసుకోవడానికి సౌదీ ఎంతమాత్రం సిద్ధంగా లేదు. అంతేకాదు పాకిస్తాన్‌ ‌కోసం ఇరాన్‌తో తన సంబంధాల విషయంలో సౌదీ పునరాలోచించదు. తన అర్థబలంతో సౌదీ అరేబియా ఇస్లామిక్‌ ‌ప్రపంచాన్నే శాసించగలదు. కశ్మీర్‌పై పాకిస్తాన్‌కు సౌదీ మద్దతు ఎన్నడూ లభించదు. కేవలం సౌదీని చూపి సంతోషపడటం తప్ప పాక్‌ ‌చేసేదేం లేదు. వర్తమాన చరిత్ర రెండు దేశాల సంబంధాలను ఇంతవరకు మాత్రమే పరిమితం చేసింది!!

ఈ బంధం ఈనాటిది కాదు

పాక్‌-‌సౌదీ అరేబియాల మధ్య సంబంధాలు ఈనాటివి కావు. 1960 నుంచి రెండు దేశాల మధ్య పరస్పర అవసరాల ఆధారంగా కొనసాగుతు న్నాయి. ముఖ్యంగా ఈజిప్టులో గమాల్‌ అబ్దుల్‌ ‌నాజర్‌ ‌నేతృత్వంలోని సోషలిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా తమ సైనిక దళాలకు శిక్షణ ఇవ్వడానికి పాక్‌ ‌ముందుకు రావడం సౌదీ అరేబియాకు సంతోషం కలిగించింది. 1960 మధ్యకాలంలో రెండు దేశాల మధ్య ఈమేరకు ఒప్పందం కుదరడం, పాక్‌ ‌రిటైర్డ్ ‌మిలిటరీ అధికారులు సౌదీకి వెళ్లి అక్కడి సైనికులకు శిక్షణ ఇవ్వడం కొనసాగింది. 1965, 1971 యుద్ధాల్లో భారత్‌ ‌చేతిలో చావుదెబ్బ తిన్న పాక్‌కు, సౌదీ సైనికులకు శిక్షణ కొనసాగించడం, అంతర్జా తీయ స్థాయిలో తన ఉనికిని చాటుకోవడానికి దోహదపడింది. 1971లో తూర్పు పాకిస్తాన్‌ను కోల్పోయిన తర్వాత ఈ రెండుదేశాలు మరింత సన్నిహితమయ్యాయి. 1979లో మక్కా మసీదు ముట్టడి, ఇరాన్‌లో విప్లవం, ఇరాన్‌-ఇరాక్‌ ‌యుద్ధం, అఫ్ఘానిస్తాన్‌లో అప్పటి సోవియట్‌ ‌సేనల ప్రవేశం వంటి పరిణామాల నేపథ్యంలో మరింత పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సౌదీ నిశ్చయించు కుంది. ఆ విధంగా 1981 నాటికి సౌదీలో రక్షణ, శిక్షణ కార్యకలాపాల నిమిత్తం 1500 నుంచి 2000 మంది తమ సైనికులను ఉంచినట్టు అప్పటి పాక్‌ ‌ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు ప్రతిగా సౌదీ అరేబియా పాక్‌కు అప్పట్లోనే ఒక బిలియన్‌ ‌డాలర్లు చెల్లించింది. ఆ విధంగా 1980 నాటికి పాక్‌ను విశ్వసనీయ మిత్రుడిగా సౌదీ పరిగణించింది. సౌదీ ఆర్థిక సహాయం పెరిగినకొద్దీ పాక్‌లో ఆర్థిక నిర్వహణలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఇదే సమయంలో సౌదీ కూడా సైనిక సహాయానికి కృతజ్ఞతగా పాక్‌లో పెద్ద ఎత్తున మదరసాల నెట్‌వర్క్ ఏర్పాటుకు, నిర్వహణకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ వచ్చింది. ఫలితంగా పాక్‌ ‌వ్యాప్తంగా మదరసాలు విపరీతంగా నెలకొన్నాయి. కానీ సౌదీ అరేబియా నిధులతో నడుస్తున్న మదరసాల్లో అరబిక్‌ ‌భాషను బోధించడంపై పాక్‌లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పాక్‌ ‌సమాజాన్ని ‘‘అరేబీకరణం’’ చేయడానికే ఈ చర్యలు దోహదం చేస్తాయని స్థానికుల వాదన. 1988లో పాక్‌ అణుపరీక్షలు జరిపినప్పుడు, అమెరికా విధించిన ఆంక్షల ముప్పు నుంచి రక్షణకు, పాక్‌ ‌ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడే విషయంలో సౌదీ ఆర్థికంగా ఆదుకుంది.

2015నాటి యెమెన్‌ అం‌తర్యుద్ధం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు అద్రాబుహ్‌ ‌మన్సూర్‌ అలీకి సౌదీ అండగా నిలిచింది. ఇందుకు పాక్‌ ‌మద్దతు కోరగా, ఇస్లామిక్‌ ‌దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయన్న మిషతో తటస్థంగా ఉండిపోవడం, సౌదీ ఆగ్రహానికి కారణమైంది. అయితే సౌదీని ప్రసన్నం చేసుకునేం దుకు 2016లో ‘‘నార్త్ ‌థండర్‌’’ ‌పేరుతో నిర్వహిం చిన సైనిక విన్యాసాల్లో సౌదీతో కలసి పాల్గొంది. తర్వాత సౌదీలో ఉన్న ఇస్లామిక్‌ ‌పవిత్ర ప్రదేశాల రక్షణకు 1600 మందికి తోడు మరో వెయ్యిమంది సైనికులను అప్పటి నవాజ్‌ ‌షరీఫ్‌ ‌ప్రభుత్వం పంపింది. 2017లో షరీఫ్‌ ‌ప్రభుత్వం సౌదీ నేతృత్వంలోని 41 దేశాల ‘‘ఉగ్రవాద వ్యతిరేక సంకీర్ణ ఇస్లామిక్‌ ‌సైనికదళాల్లో’’ పాక్‌ ‌చేరింది. పాక్‌ ‌సైనికదళాల మాజీ అధిపతి రహీల్‌ ‌షరీఫ్‌ ఈ ‌మొత్తం సైన్యానికి నేతృత్వం వహించారు. ఇవన్నీ సౌదీని ప్రసన్నం చేసుకోవడానికే.

ఇమ్రాన్‌ఖాన్‌ ‌హయాం

2018 ఆగస్టు నెలలో పాక్‌ ‌సైన్యం ఇమ్రాన్‌ ‌ఖాన్‌ను ప్రధానిగా ఎంపిక చేసింది. కొద్దికాలం ఇమ్రాన్‌, ‌సౌదీ యువరాజు మహమ్మద్‌ ‌బిన్‌ ‌సల్మాన్‌ల మధ్య స్నేహబంధాలు చక్కగా సాగాయి. ఇమ్రాన్‌ అధికారంలోకి రాగానే సౌదీ నుంచి పాక్‌ ‌సైన్యానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందింది. పెట్టుబడులపై చర్చించేందుకు రమ్మని ఇమ్రాన్‌ను సౌదీ యువరాజు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సమావేశం సందర్భంగానే మొత్తం 3 బిలియన్‌ ‌డాలర్ల రుణ ప్యాకేజీలో ఒక బిలియన్‌ ‌డాలర్లను సౌదీ, పాక్‌కు విడుదల చేసింది. సౌదీ సహ భాగస్వామి అబూదాబి కూడా పాక్‌కు ఉదారంగా సహాయాన్ని అందించింది. 2019 ఫిబ్రవరిలో సౌదీ యువరాజు మహమ్మద్‌ ‌బిన్‌ ‌సల్మాన్‌ ‌పాక్‌ను సందర్శించారు. ఆయనతో పాటు పెద్దఎత్తున వ్యాపారవేత్తలు కూడా రావడంతో మొత్తం 20 బిలియన్‌ ‌డాలర్లమేర పాక్‌లో పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇందులో సౌదీ ప్రముఖ కంపెనీ ఆరామ్‌కో, గ్వాదార్‌లో ఆయిల్‌ ‌రిఫైనరీని నెలకొల్పడానికి అంగీకరించింది.

కశ్మీర్‌పై రగడ

2019, ఆగస్టులో కశ్మీర్‌ ‌ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత పార్లమెంట్‌ ‌తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇస్లామిక్‌ ‌దేశాల మద్దతను కూడగట్టా లని పాక్‌ ‌చేసిన యత్నాలు ఫలించలేదు. ఈ విషయంలో సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ‌మౌనం దాల్చడం పాక్‌కు పుండు మీద కారం చల్లినట్లయింది. అయితే మలేసియా, టర్కీలు పాక్‌కు అనుకూలంగా మాట్లాడాయి. అరబ్‌దేశాలు పట్టించుకోకపోవడంతో ఈ మూడు దేశాలు ప్రత్యామ్నాయ ఇస్లామిక్‌ ‌బ్లాక్‌ను ఏర్పాటు చేయాలను కున్నాయి. ఇందుకోసం కౌలాలంపూర్‌లో ఒక సదస్సును ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించు కున్నాయి. సౌదీ అరేబియా బెదిరించడంతో పాక్‌ ఇం‌దులో పాల్గొనలేదు. కానీ సౌదీ ప్రత్యర్థులైన ఖతర్‌, ‌టర్కీ, ఇరాన్‌లు పాల్గొన్నాయి. ఇదిలా ఉండగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో దీన్ని నిరసిస్తూ, ప్రత్యేంగా ఓఐసీ సమావేశం ఏర్పాటు చేయాలన్న పాక్‌ ‌విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ‌ఖురేషి డిమాండ్‌ను ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో తాము మలేసియా, టర్కీ, ఇరాన్‌తో జట్టుకడతానని పాక్‌ ‌చేసిన బెదిరింపులకు ఆగ్రహించిన సౌదీ అరేబియా తాను ఇచ్చిన బిలియన్‌ ‌డాలర్ల రుణాన్ని తక్షణం తిరిగి చెల్లించాలని పాక్‌ను కోరింది. చైనా వద్ద అప్పు తీసుకొని సౌదీకి చెల్లిం చింది. ఈ పరిణామాలు పాక్‌-‌సౌదీ అరేబియాల మధ్య సంబంధాల్లోని పరిమితిని తెలియజేస్తున్నాయి.

పాకిస్తాన్‌-అఫ్ఘానిస్తాన్‌

అఫ్ఘానిస్తాన్‌ ‌నుంచి అమెరికా నేతృత్వలోని విదేశీ సేనల ఉపసంహరణ, అప్పటి దేశాధ్యక్షుడు అష్రఫ్‌ ‌ఘనీ విదేశాలకు పారిపోయిన తర్వాత తాలిబన్‌ అధికారాన్ని చేపట్టడంలో తెరవెనుక పాక్‌ ‌హస్తమున్న దన్న సంగతి జగద్వితమే. ఇక తాజా పరిణామాలకు వస్తే, పాక్‌-అఫ్ఘానిస్తాన్‌-ఇరాన్‌- ‌చైనాల మధ్య ఉన్న 2670 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు వెంట నిర్మిస్తున్న కంచె విషయంలో తాలిబన్‌తో ఘర్షణలు జరుగుతున్నాయి.

పాక్‌ ‌వేసిన కంచెను తాలిబన్‌ ‌పీకేస్తున్నారు. ఈ పరిణామాలు పాక్‌-‌తాలిబన్‌ ‌మధ్య సంబంధాలను ప్రశ్నార్థకం చేసేవే. డ్యూరాండ్‌ ‌సరిహద్దు రేఖ విషయంలో పాక్‌-అఫ్ఘానిస్తాన్‌ల మధ్య వివాదం ఇప్పటిది కాదు. తమ జాతీయ భద్రతకు, ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు డ్యూరాండ్‌ ‌సరిహద్దు వెంట కంచె నిర్మాణం తప్పనిసరి అని పాక్‌ ‌వాదిస్తుంటే, అసలు డ్యూరాండ్‌ ‌రేఖను తాము గుర్తించడం లేదని తాలిబన్‌ ‌చెబుతున్నారు. పాక్‌ ‌తమ భూభాగంలోనే కంచె నిర్మిస్తున్నదని, దీన్ని కొనసాగనివ్వబోమని స్పష్టం చేస్తున్నారు. ఫెన్సింగ్‌ ‌పనిలో ఉన్న అధికారులను హెచ్చరించే వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి.

దీనిపై పాక్‌ ‌విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ‌ఖురేషి మాట్లాడుతూ, సరిహద్దు కంచె విషయంలో వివాదం నిజమేనని, దీన్ని తాలిబన్‌ ‌ప్రభుత్వంతో దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పారు. పాక్‌ ఇప్పటివరకు 2600 కిలోమీటర్ల వరకు ఫెన్సింగ్‌ ‌నిర్మాణాన్ని పూర్తిచేసింది. అయితే అష్రఫ్‌ ‌ఘనీ అధికారంలో ఉన్నప్పుడే ఈ విషయంలో రెండు దేశాలమధ్య విభేదాలు రాజుకున్నాయి. ఇప్పుడు తాలిబన్‌ ‌పాలనలో కూడా ఈ విభేదాలు కొనసాగుతుండటం గమనార్హం. పాకిస్తాన్‌ ఈ ‌సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తుండగా, తాలిబన్‌ ‌ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్‌ ‌మాట్లాడుతూ అసలు ఫెన్సింగ్‌ ‌నిర్మాణం అవసరం లేదని, కేవలం ఇది పాక్‌ ఏకపక్ష నిర్ణయమంటూ విమర్శిస్తున్నారు. ఈ డ్యూరాండ్‌ ‌సరిహద్దు వివాదం కారణంగా అఫ్ఘానిస్తాన్‌లో పాక్‌ ‌వ్యతిరేకత పెరిగి పోయింది. వందలాది మంది అఫ్ఘాన్లు పాక్‌ ‌వ్యతిరేక బ్యానర్లు ధరించి ప్రదర్శనలకు దిగడంతో పాకిస్తాన్‌ ‌జాతీయ భద్రతా సలహాదారు మయూద్‌ ‌యూసుఫ్‌ ‌జనవరి 18న జరపాల్సిన తన అఫ్ఘాన్‌ ‌పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం పాక్‌ ఎన్‌.ఎస్‌.ఎ. ‌నేతృత్వంలో దౌత్య బృందాన్ని ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌పంపాలనుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఇది నిలిచిపోయింది.

డ్యూరాండ్‌ ‌రేఖ అఫ్ఘానిస్తాన్‌లోని పది ప్రావిన్స్‌ల నుంచి, పాకిస్తాన్‌లో ని ఖైబర్‌ ‌ఫక్తూన్‌ఖ్వా, సమాఖ్య పాలన కింద ఉన్న గిరిజన ప్రాంతాల (ఫతా), బెలూచిస్తాన్‌ల గుండా వెళుతోంది. 1893లో అప్పటి బ్రిటిష్‌ ‌దౌత్యవేత్త మోర్టిమర్‌ ‌డ్యూరాండ్‌, ‌నాటి అఫ్ఘాన్‌ ‌పాలకుడు అబ్దుర్‌ ‌రహమాన్‌ల మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం ఈ రేఖను నిర్ణయించారు. అప్పట్లో రష్యా, ఇండియాల మధ్య బఫర్‌ ‌జోన్‌ ఉం‌డాలన్న ఉద్దేశంతో నాటి బ్రిటిష్‌ ఇం‌డియా ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని కుదుర్చు కుంది. ఈ డ్యూరాండ్‌ ‌రేఖ, అఫ్ఘాన్‌ ‌పస్తూన్‌ ‌తెగల ప్రజలను విభజిస్తోంది. ఫలితంగా 42వేల చదరపు మైళ్ల అఫ్ఘాన్‌ ‌భూభాగం నాటి బ్రిటిషర్ల పాలన కిందికి వచ్చింది. అంటే దాదాపు సగం మంది అఫ్ఘాన్‌ ‌పస్తూన్‌లు బ్రిటిష్‌ ‌పాలనా పరిధిలోకి వచ్చారు. ఈ కారణంగానే అఫ్ఘాన్లు డ్యూరాండ్‌ ‌రేఖను చట్టబద్ధమైన సరిహద్దుగా అంగీకరించడం లేదు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram