‘మా యువకులు (ముస్లింలు) చట్టాన్ని తమ చేతులోకి తీసుకునే పరిస్థితి కనుక వస్తే, హిందువులకు దాక్కోవడానికి ఈ దేశంలో కాస్త చోటు కూడా దొరకదు….’ దేశంలోనే అత్యంత వివాదాస్పద ముస్లిం నాయకులలోనే అగ్రతాంబూలానికి అర్హుడు మౌలానా తౌకీర్‌ ‌రజా ఖాన్‌ అన్నమాటలివి. ఎక్కడో రహస్యంగా కాదు, బహిరంగ సభలోనే. ఈ జనవరి 7వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలోనే ఆ వ్యాఖ్యలు చేశాడాయన. అయితే తౌకీర్‌ను అరెస్టు చేశారా? లేదు. జైలుకు పంపారా? లేదు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టు చేయమని ఎవరైనా అడిగారా? అసలే లేదు. ఆ వ్యాఖ్యల ద్వారానే అతడి సత్తా ఏమిటో గ్రహింపునకు వచ్చినట్టు, ఆ వాక్పటిమకు డంగైపోయినట్టు శతాధిక సంవత్సరాల  కాంగ్రెస్‌ ‌పార్టీ జనవరి 17న అతడి మద్దతును సగౌరవంగా స్వీకరించింది. ఉత్తర ప్రదేశ్‌ ‌రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ ‌కుమార్‌ ‌లల్లు సమక్షంలో తౌకీర్‌ ఆ ‌పార్టీకి అభయమొసంగే కార్యక్రమాన్ని కూడా ఉత్సాహభరితంగా నిర్వహించింది.

ఆ రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూస్తున్న నెహ్రూ-గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంక గాంధీ తౌకీర్‌తో ఫోటో దిగి తమ పార్టీ ఘనకార్యం గురించి జాతికి ఎరుకపరిచారు. నిజం చెప్పాలంటే ఇదో రకం బలప్రదర్శన. కాంగ్రెస్‌ ‌బుద్ధి రోజురోజుకీ ఎలా వికసిస్తున్నదో చెప్పడానికి కొండగుర్తు కూడా. బీజేపీ నాయకుడు, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీని ముక్కలు ముక్కలుగా నరికెయ్యకపోతే అడగండి అంటూ 2014 సాధారణ ఎన్నికల సమయంలో ఇమ్రాన్‌ ‌మసూద్‌ అనే ఓ మతోన్మాది వీరంగం వేశాడు. ఆ ఇమ్రాన్‌ ‌కూడా ఉత్తర ప్రదేశ్‌ ‌వాడే. పైగా కాంగ్రెస్‌లోనే ఉన్నాడు. అప్పుడు నరేంద్ర మోదీనే ముక్కలు ముక్కలు చేస్తానన్నవాడు కాంగ్రెస్‌కు దిక్కయ్యాడు. ఇప్పుడు మొత్తం హిందువులకే దాక్కోవడానికి చోటు ఉండదు అని హెచ్చరించిన వాడికి కాంగ్రెస్‌ ఆ‌శ్రయం ఇచ్చింది. తౌకీర్‌ ‌లాంటి ఉన్మాదితో జట్టు కట్టడానికి ఈ కాంగ్రెస్‌కు సిగ్గుందా అని అడుగుతున్నారు నిదా ఖాన్‌ అనే మహిళ. ఈమె తౌకీర్‌ ‌సమీప బంధువు. తస్లీమా నస్రీన్‌ అనే బంగ్లా రచయిత్రి తల నరికి తెమ్మని ఆదేశం ఇచ్చిన ఘనత కూడా తౌకీర్‌కు ఉంది. ఇప్పుడు ఆయన మద్దతు సెక్యులర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి దక్కింది.

అతడి వర్గం యువకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే హిందువుల పని ఇంతేనని బహిరంగంగా చెప్పినంతమాత్రానే సెక్యులరిజం పట్ల తౌకీర్‌కు ఉన్న గౌరవాన్ని తొందరపడి శంకించరాదని కాంగ్రెస్‌ ‌భావిస్తున్నట్టే ఉంది. తౌకీర్‌ ‌స్థాపించిన రాజకీయ పక్షం ఇత్తేహాద్‌ ఇ ‌మిల్లత్‌ 2009‌లో కాంగ్రెస్‌ ‌పార్టీతో కలసి స్థానిక ఎన్నికలలో పోటీ చేసింది. అప్పుడు మిల్లత్‌, ‌కాంగ్రెస్‌లు కూడబలుక్కుని ఇచ్చిన నినాదం, ‘సెక్యులరిజం రక్షణ’. ఆ రక్షణ పరిధి చాలా పెద్దది. బరేలీలోనో, లేదా ఉత్తర ప్రదేశ్‌ ‌రాష్ట్రానికో వాటి సెక్యులరిజం రక్షణోద్యమాన్ని ఆ రెండు పార్టీలు పరిమితం చేయడంలేదు. మొత్తం భారతదేశంలోని సెక్యులరిజం రక్షణకు నడుం కట్టినట్టు ప్రకటించాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ, తౌకీర్‌లు కలసి ఇచ్చిన సెక్యులరిజం రక్షణ కార్యక్రమానికి అఖిల భారత తాన్జీమ్‌ ఉల్‌ ఇస్లాం వంటి పార్టీలు పెద్ద మనసుతో మద్దతు కూడా ప్రకటించాయి. ఇవన్నీ బరేలీ ప్రాంతంలో పనిచేసేవే. అక్కడ చాలామంది ముస్లిం మత గురువులను వాళ్లు పదే పదే ఇచ్చిన ఒక నినాదం చరిత్రకెక్కించింది. ఒకానొక శుక్రవారం ప్రార్థనల తరువాత అంతా రోడ్డు మీదకు వచ్చి మొదటిసారి ఆ నినాదం ఇచ్చారు. అదేమిటి? ‘మహ్మద్‌ ‌ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడినవారికి వేయాల్సిందే ఒకే ఒక్క శిక్ష- తల నరకడమే’. తమ నినాదం అవతలి వాళ్లు మరిచిపోకుండా, వీలు కుదిరినప్పుడల్లా ఆ మత గురువులు ఆ నినాదాన్ని మళ్లీ మళ్లీ వినిపిస్తూ ఉంటారు కూడా. గడచిన ఏప్రిల్‌ ‌మాసంలో, ఏమైందో ఏమో, ఒక శుక్రవారం ప్రార్థనలు అయిన తరువాత ప్రవక్తను తూలనాడిన హిందువులకు కూడా అదే శిక్షను అమలు చేయబోతున్నట్టు సుస్పష్టంగా నినాదాలు చేశారు.

ఇదేనా మీ సెక్యులరిజం అంటూ ఒక పక్క బీజేపీ వాళ్లు కాంగ్రెస్‌ను దుమ్మెత్తి పోస్తున్నారు.  ఇలాంటి తౌకీర్‌తో కాంగ్రెస్‌ ‌నాయకులు వేదిక ఎలా పంచుకుంటారు అని బీజేపీ ఘోషించింది పాపం. కానీ కాంగ్రెస్‌ను ఇలాంటి విమర్శలు సాధారణంగా తాకలేవు. పైగా, భారతదేశంలో ముస్లింలకు రక్షాకవచం కాంగ్రెస్‌ ‌మాత్రమేనని తౌకీర్‌ ‌పెద్ద సర్టిఫికెట్‌ ఇచ్చారు. రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమే నిజమైన సెక్యులరిస్టులని సమ్మోహనాస్త్రం ప్రయోగించారు. వీలైతే తౌకీర్‌కు అర్ధ సింహాసనం ఒసగి, అధికారమే పంచుకుందా మన్న విశాల దృక్పథంతో కదులుతున్న కాంగ్రెస్‌కి ఇలాంటి ఆరోపణలు తలకెక్కుతాయా!

కాంగ్రెస్‌ ‌పార్టీ తన మద్దతు తీసుకుంటున్నదన్న పొగరో, కాంగ్రెస్‌ ‌పంచన చేరడం ద్వారా తన మతోన్మాదానికి గట్టి మద్దతు దక్కిందన్న భరోసాయే తెలియదు కానీ, ఆ ఇచ్చిపుచ్చుకోవడాలకు కాస్త ముందు తౌకీర్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఏమిటి?

‘మా యువకుల కళ్లల్లో నేను ఆగ్రహం చూస్తున్నాను. ఆ ఆగ్రహం ఏదో ఒక రోజున బద్దలవుతుందేమోనని నా భయం. అలా వాళ్ల ఆగ్రహం కట్టులు తెంచుకున్న రోజున అదుపు తప్పిపోతారు. అప్పుడు ఏమౌతుంది? నువ్వు వృద్ధుడవయ్యావు. ఏమీ చేయలేవు అని అంటున్నారు, మా కుర్రాళ్లు. కానీ మీ కంటే నేనే ముందు చచ్చిపోతాను అని నేను వాళ్లకి చెబుతున్నాను. నా హిందూ సోదరులకి నేనొకటే చెప్పదలుచుకున్నాను. ఏదో ఒకరోజున మా యువకులు చట్టాన్ని తమ చేతులలోకి తీసుకుంటే ఈ భారతదేశంలో మీకు దాగే చోటు కూడా ఉండదు కదా అని నేను భయపడుతున్నాను.’  భారత దేశ భౌగోళిక పటాన్ని కూడా మార్చేయగలమని తౌకీర్‌ ఎలాంటి భయం లేకుండా చెప్పారు. కాంగ్రెస్‌ అం‌డ ఉంటే ఇక భయం ఎందుకు మరి!

ఇదంతా చూసే, కొత్త ప్రతిభను పార్టీలోకి తెచ్చుకున్నారు అంటూ కాంగ్రెస్‌ను బీజేపీ ఎత్తి పొడిచింది. అయితే ఈ మాత్రం దానికే కాంగ్రెస్‌ ‌మారిపోయి, చెంపలేసుకుని, తౌకీర్‌తో తలాక్‌ అం‌టుందని నరమానవుడన్నవాడు ఎవరూ భావించడం లేదు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నందుకు  తౌకీర్‌కు యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లల్లు ఘనంగా ధన్యవాదాలు తెలియచేశారు. తౌకీర్‌ ‌రిపబ్లిక్‌ ‌టీవీకి ఇచ్చిన వివరణ కూడా తమాషాగా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ అం‌టే విరక్తి చెందిన మాట నిజమే అయినా, తాము (ముస్లింలు) ఆ పార్టీని దూరం పెట్టి పెద్ద తప్పే చేశామని చెప్పారు. ఎందుకంటే ముస్లింలు కాంగ్రెస్‌ను దూరంగా పెట్టడం వల్లనే బీజేపీ ముందుకు చొచ్చుకు వచ్చేసిందట. ఆ కోణం నుంచి దేశానికి జరిగిన నష్టానికి తమదే బాధ్యత అని కూడా సెలవిచ్చారాయన. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడం ద్వారా ఆ తప్పును సరిదిద్దుకుంటున్నారట. ఈ ఎన్నికలలో కనుక ఓటు వేయకపోతే, రాష్ట్రంలో శాంతి ఉండదు అని బాహాటంగానే ఓటర్లకు తౌకీర్‌ ‌తాకీదు కూడా ఇచ్చారు. ‘నేను యావన్మంది ఉత్తర ప్రదేశ్‌ ‌ప్రజలకు చేసే విన్నపం ఒక్కటే. ప్రత్యేకంగా ముస్లింలకు చేసే విన్నపం కూడా. ఇక్కడ శాంతి భద్రతలు ఉండాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి’ అన్నారు. ఈ అంశం మీద కాంగ్రెస్‌కు బీజేపీ కీలెరిగి వాత పెట్టింది. హిందువులకు నిలువ నీడ లేకుండా చేయగలనన్న వాడికి కాంగ్రెస్‌ ‌పార్టీ ఆశ్రయం కల్పించింది అని.

కాంగ్రెస్‌కు తాను మద్దతు ఇస్తున్న శుభ సమయంలో తౌకీర్‌ ‌మరొక సంచాలనాత్మక ప్రకటన కూడా చేశారు. అదే బాట్లా ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారందరినీ అమరులుగా గుర్తించాలట.

2008 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగింది బాట్లా ఎన్‌కౌంటర్‌. ఇం‌దులో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌మోహన్‌ ‌చంద్‌ ‌శర్మను చంపినందుకు అరిజ్‌ఖాన్‌ అనే ఇండియన్‌ ‌ముజుహుదీన్‌ ఉ‌గ్రవాదికి ఢిల్లీ కోర్టు మార్చి 16, 2021న మరణశిక్ష విధించింది. ఇదే తౌకీర్‌ను బాగా బాధపెట్టేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జామియా నగర్‌ ‌పరిసరాలలో బాట్లా హౌస్‌ ఉం‌ది. ఈ ఎన్‌కౌంటర్‌ ‌జరగడానికి కొన్ని రోజులకు ముందే ఢిల్లీలో వరస పేలుళ్లు జరిగి 26 మంది చనిపోయారు. ఇంకొంచెం వివరాలలోకి వెళదాం. సెప్టెంబర్‌ 13,2008‌న కన్నాట్‌ ‌ప్లేస్‌, ‌గ్రేటర్‌ ‌కైలాశ్‌, ‌కరోల్‌బాగ్‌, ఇం‌డియా గేట్‌ ‌పరిసరాలలో ఐదు బాంబులు పేలాయి. ఈ పేలుళ్లు తమ పనేనని ఇండియన్‌ ‌ముజాహుదీన్‌ ఉ‌గ్రవాద సంస్థ ప్రకటించుకుంది. పేలుళ్లు జరిగిన మూడు రోజులకే సెప్టెంబర్‌ 16‌న బాట్లా హౌస్‌లోని ఒక ఫ్లాట్‌లో అనుమానితులు దాగి ఉన్నారని సమాచారం అందింది.

ఇన్‌స్పెక్టర్‌ ‌మోహన్‌చంద్‌ ‌శర్మ నాయకత్వంలో ప్రత్యేక పోలీసు బృందం వెళ్లింది. ఫ్లాట్‌లో ప్రవేశించగానే కాల్పులు జరిపారు. శర్మ, కానిస్టేబుల్‌ ‌బల్వంత్‌ ‌సింగ్‌ ‌గాయపడ్డారు. ఉగ్రవాదులు సాజిద్‌, అతీఫ్‌ అమీన్‌ ‌చనిపోయారు. అరీజ్‌ఖాన్‌ ‌పారిపోయాడు. సైఫ్‌ అనే మరొక ఉగ్రవాది లొంగిపోయాడు. 2018లో అరీజ్‌ను అరెస్టు చేశారు. పేలుళ్లు తమ పనేని ప్రకటించుకున్న ఇండియన్‌ ‌ముజాహుదీన్‌  ఉ‌గ్రవాదులనే కాంగ్రెస్‌ ‌కొత్త స్నేహితుడు తౌకీర్‌ అమరులుగా ప్రకటించాలని కోరుతున్నాడు.

ఈ వ్యాఖ్యల గురించి ఇంకాస్త వివరణ ఇవ్వండి అని అడిగిన న్యూస్‌ 18 ‌న్యూస్‌ ‌చానెల్‌ ‌డైరెక్టర్‌ అమన్‌ ‌చోప్రాను తౌకీర్‌ ఏమన్నారో కూడా గమనించాలి. ‘మీరు మా పట్ల హుందాగా ప్రవర్తించకుంటే చెంప పగులుతుంది’ అన్నారు.

అసలు ఈ కాంగ్రెస్‌కి విజ్ఞత ఏమైనా ఉందా? అని అడుగుతున్నారు నిదా ఖాన్‌. ఈ ‌సందేహం ఆమెకు ఎందుకు వచ్చిందంటే, కాంగ్రెస్‌ ‌పార్టీ తౌకీర్‌ ‌మద్దతు తీసుకున్నందుకు. ఇంతకీ నిదా ఖాన్‌ ఎవరు? తౌకీర్‌ ‌సొంత సోదరుడి కోడలు. కాంగ్రెస్‌లో చేరి వాళ్లిచ్చేదేదో స్వీకరించి మౌనంగా ఉండక తౌకీర్‌ ‌తాను మహిళల హక్కులను కాపాడతానని చెప్పాడు. సొంత ఇంట్లో ఆడవాళ్ల హక్కులే పట్టని తౌకీర్‌ ‌దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని నిదా ఖాన్‌ ‌నిలదీశారు. ఈమె భర్త షరీన్‌ ‌తలాక్‌ ‌చెప్పేశారు. కారణం అధిక కట్నం తేలేదు. అయితే ఈ విడాకులు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చింది.2018లో నిదాఖాన్‌ ‌తలాక్‌ ‌వ్యతిరేక పోరాటంలో కీలకంగా మారారు. బరేలీ కేంద్రంగా పనిచేసే ముస్లిం మత గురువులు, అఖిల భారత ఫైజాన్‌ ఎ ‌మదీనా కౌన్సిల్‌ ‌వెంటనే ఒక ఫత్వా జారీ చేశారు. మొదట ఆమెకు  గుండు గీస్తే రూ. 11,879 బహుమానం ప్రకటించింది. తరువాత మూడు రోజులలో దేశం వీడి వెళ్లకపోతే రాళ్లతో కొట్టి చంపేయమని ఆదేశించారు.

తౌకీర్‌ ‌గతంలోకి వెళితే ఇంకొక విభ్రాంతికర సంఘటన తెలుస్తుంది. వివాదాస్పద బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ‌తల నరికి తీసుకు రావల సిందని 2007లో తౌకీర్‌ ఆదేశించారు. అలాంటి మనిషితో మాటా మంతీ కలుపుతావా; వెళ్లి కలుస్తావా అని నవంబర్‌ 6,2013‌న ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ను బీజేపీ విమర్శించింది. ఇది కాదు అసలు సంగతి. తౌకీర్‌- ‌కేజ్రీ సమావేశాన్ని బీజేపీతో పాటు విమర్శించిన పార్టీ మరొకటి ఉంది. అది సాక్షాత్తు కాంగ్రెస్‌ ‌పార్టీయే. ఇంతకు మించిన వింత-‘తౌకీర్‌ ‌బరేలీ పట్టణంలోని మర్యాదస్థులలో ఒకడు. అందుకే కలుసుకున్నాను’ అని కేజ్రీ సమాధానం ఇచ్చారు. భారతదేశంలో సెక్యులరిజం అంటే ఎంత కురూపో కదా! ఎంత నీచమైనదో కదా! అయితే ఇలాంటి సెక్యులరిజానికి జన్మనిచ్చినది మాత్రం ఘనత వహించిన శతాధిక సంవత్సరాల కాంగ్రెస్‌ ‌పార్టీయే.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram