ఆంధప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో ఎలాంటి శాస్త్రీయత కనిపించడంలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజల వాంఛగా ఉన్నప్పటికీ కనీసం మంత్రివర్గ సమావేశంలో చర్చించకుండా, ప్రతిపక్ష పార్టీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ల సూచనలు, ప్రజాభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకుండా జిల్లాల విభజనకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. జిల్లాల విభజన ఒక్క మండలానికి సంబంధించిన అంశం కాదు. రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలకు సంబంధించినది. దీర్ఘకాలంగా ప్రభావంచూపే ఇలాంటి అంశాన్ని ఆషామాషీ వ్యవహారంగా తీసుకున్నారు.

పార్లమెంటు పరిధిని ఆధారంగా తీసుకుని జిల్లాల సరిహద్దులు నిర్ణయించారు. కేవలం అధికారులు తయారుచేసిన నివేదిక ఆధారంగా నోటిఫికేషన్‌ ‌విడుదల చేయడం ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. చర్చలకు అవకాశం కల్పించకపోవడంతో జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో ప్రజలు వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటులో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక సమతుల్యత పాటించినట్లు ప్రభుత్వం ప్రకటించడాన్ని మేధావులు ఖండిస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగడం లేదనడానికి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా రనడానికి ఇలాంటి నిర్ణయాలే సాక్ష్యాలు. దూరాన్ని పరిగణనలోకి తీసుకుని జిల్లాలను ఏర్పాటు చేశా మని చెప్పిన ముఖ్యమంత్రికి రాజధాని విషయంలో ఆ దూరం వర్తించదా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. ఉద్యోగుల పీఆర్‌సీ జీతాల కోసం చేస్తున్న ఉద్యమం, గుడివాడ కేసినో అంశాన్ని దారి మళ్లించేం దుకు ఈ కొత్త జిల్లాల ప్రతిపాదన తెచ్చినట్లు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలపై రాష్ట్రంలోని పార్టీలు జిల్లా కమిటీల ద్వారా స్థానిక ప్రజల అభిప్రాయాలు సేకరించి రాష్ట్ర కమిటీకి నివేదించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

నోటిఫికేషన్‌లో ఏముంది?

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలు, 62 రెవెన్యూ డివిజన్లుగా విభజిస్తూ జనవరి 26, 2022న నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. జిల్లాల విభజనకు సంబంధించి ప్రభుత్వం పేర్కొన్న ఏ అంశంపైనైనా ప్రజలకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా వాటిని నోటిఫికేషన్‌ ‌విడుదలైన 30 రోజుల్లోపు అంటే ఫిబ్రవరి 26, 2022 నాటికి తెలియజేయాలని రాజపత్రంలోనే పేర్కొంది. జిల్లాల పునర్విభజనకు చీఫ్‌ ‌సెక్రటరీ ఆధ్వర్యంలో 2020 ఆగస్టు 7న కమిటీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌ ‌స్థానాన్ని ఒక్కో జిల్లాగా చేయాలని అనుకున్నా.. రాష్ట్రంలో 25 పార్లమెంట్‌ ‌స్థానాలుండగా.. పాడేరు ఏజెన్సీ ప్రాంతం పెద్దదిగా ఉండటంతో రెండు జిల్లాలుగా విభజించారు. దీంతో మొత్తం 26 జిల్లాలయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో భౌగోళిక విస్తీర్ణం, జనాభా తదితర అంశాలని పరిగణనలోకి తీసుకున్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లా కేంద్రం దగ్గరగా ఉండటం, పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక వసతులు, పరిస్థితులు, వనరులు ఇలా అన్నింటిని పరిగణనలోకి తీసుకున్నామని ప్రభుత్వం చెప్పింది. ప్రతీ జిల్లాలో రెండు లేదా మూడు రెవెన్యూ డివిజన్‌లు ఉంచారు. ఒక శాసన సభ నియోజకవర్గం ఒక జిల్లా పరిధిలోకి కాకుండా రెండు జిల్లాల పరిధిలోకి రావడం వలన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే క్రమంలో ఒక శాసనసభ స్థానం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని విభజించకుండా ఆ జిల్లాలలోనే పూర్తిగా ఉండేలా చేశామని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజన, ఉద్యోగాల కల్పనపై సబ్‌ ‌కమిటీ పరిశీలిస్తుంది. ప్రతి జిల్లాలో కలెక్టర్‌ ఆఫీస్‌, ఎస్పీ ఆఫీస్‌, ‌జిల్లా కోర్టులు ఉంటాయి. కొత్త జిల్లాల విషయంలో ప్రజల అభ్యంతరాలు, వినతులు పరిగణనలోకి తీసుకుం టారు. ఉగాదికి కొత్తజిల్లాల ఏర్పాటు పక్రియ పూర్తిచేయాలని ఆలోచిస్తున్నట్లుగా ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది.

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన అప్పు డప్పుడూ వినిపిస్తూనే ఉన్నా ఇప్పుడు దాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కారణం ప్రస్తుతం రాష్ట్రాన్ని అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీను అమలుచేసే లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఆపసోపాలు పడుతోంది. అభివృద్ధి అనే మాటను పక్కన పెట్టింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమం పేరుతో ఓట్ల కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభిం చింది. అందుకోసం ప్రభుత్వ ఆదాయంతో పాటు అప్పులు తెచ్చి నగదును లబ్ధిదారులకు పంచుతోంది. రెండున్నరేళ్లలో ఈ ప్రభుత్వం చేసిన అప్పులే 3 లక్షల కోట్లు దాటాయి. ఏ మాత్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా చేస్తున్న ఈ కార్యక్రమాలతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒక పక్క నిధులు లేక ఏ ఒక్క మండలంలోనూ అభివృద్ధి జరగడం లేదు. కొత్త రోడ్లను వేయడం మాట అటుంచి కనీసం వాటికి మరమ్మత్తులు చేయడం లేదు. మరోపక్క ప్రభుత్వోద్యోగులు పీఆర్‌సీ అమలుకు ఆందోళన చేస్తున్నారు. జిల్లా విభజన కార్యక్రమంలో పని చేయాల్సిన ఉద్యోగులు ఆందోళనలో ఉంటే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు ఇలా అన్నీ వర్గాల నుంచి వచ్చే అభ్యంతరాలు ఎలా పరిశీలిస్తారనేది కూడా అయోమయంగా మారింది. ఇన్ని సమస్యల మధ్య జిల్లాల పునర్విభజనకు ఆఘమేఘాలపై ఆన్‌లైన్‌లో కేబినెట్‌ ఆమోదం తీసుకొని అర్ధరాత్రి జీఓలు ఇచ్చారు.

లోక్‌సభ పరిధిలో ఏర్పాటు సరికాదు!

కొత్త జిల్లాలు లోక్‌సభ పరిధిలో ఏర్పాటుచేయడం సరికాదు. ప్రజల సౌకర్యం, పాలనా సౌలభ్యం, చారిత్రక ప్రాధాన్యం, అప్పటికే అభివృద్ధి చెందడం వంటివి ప్రాధాన్యంగా తీసుకుని జిల్లాలను ఏర్పాటుచేయాలి. లోక్‌సభ కేంద్రంగా ఏర్పాటైతే పరిపాలనా సౌలభ్యం ఉండదు. అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలనే లక్ష్యం ఉంటే వెనుక బడిన ప్రాంతాలకు ప్రాతినిథ్యం ఇవ్వాలి. ఉదాహరణగా మార్కాపురం ప్రాంతాన్ని పరిశీలిస్తే దీనిని రాయలసీమ నుంచి విడదీసి ప్రకాశం జిల్లాలో కలిపారు. ఇది తీవ్రమైన వర్షాభావ ప్రాంతం. అభివృద్ధి అసలు లేదు. దీనిని రాయలసీమలో కలిపినా నిధులు కేటాయింపుతో అభివృద్ధి జరిగేదేమో. అందువల్ల మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకావాలి. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేసినట్లు విజయవాడ, తిరుపతిలను ప్రత్యేక జిల్లాలుగా మార్చాలి. పరిపాలన సౌలభ్యం కోసం కలెక్టరేట్లే అవసరం లేదు. కిందిస్థాయిలో పనిచేసే ఎమ్మార్వో, తాలూకా కార్యాలయాలు ఉంటేచాలు. 1979లో విజయనగరం జిల్లాను ప్రారంభిస్తే 20 ఏళ్లకు భవనాలు కట్టారు.

తెలంగాణ అనుభవం పరిశీలించారా?

తెలంగాణ ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్విభజన ఎటువంటి ఫలితాలనిచ్చిందో ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం పరిశీలించాలి. కేసీఆర్‌ ‌ప్రభుత్వం తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదారి పట్టించాలని, కొత్తగా పార్టీలోకి వచ్చిన ఫిరాయింపు దారులకు పదవులు కట్టబెట్టేందుకు, తెలంగాణ వస్తే ఏదో జరిగిపోద్దని చెప్పి ఓటేయించుకున్న ప్రజలను మభ్యపెట్టడానికి అప్పట్లో కొత్త జిల్లాల ప్రతిపాదన తెచ్చింది. 2014 ఎన్నికల సమయంలో అప్పుడున్న 10 జిల్లాలను 24 జిల్లాలుగా చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. తర్వాత మంత్రి వర్గ నిర్ణయం మేరకు కొత్తగా 27 జిల్లాలు చేయాలని నిర్ణయించింది. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లను అమలుచేసేందుకు 31 జిల్లాలకు పెంచింది. తర్వాత మరో రెండు జిల్లాలు పెంచింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న జిల్లాలు 33. అయితే ఎన్నో ఆర్భాటాలు, ప్రకటన లతో ఏర్పాటుచేసిన కొత్త జిల్లాల వల్ల ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందాయా? అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. కొత్త జిల్లా కేంద్రాలలో భవనాలు లేవు, వసతులు లేవు, ఉద్యోగులు లేరు. కొన్ని ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ ‌పేరిట వ్యవసాయ భూములన్నీ ప్లాట్లుగా మారడం తప్ప పెద్ద ఒరిగిందేమీ లేదు. ఇప్పటికీ ప్రజల ఆలోచనలో ఉమ్మడి జిల్లాలే ఉన్నాయి. కొంతకాలానికి అలవాటు పడినా, అక్కడ మౌలికవసతులు కల్పించడానికి అవసరమైన నిధులు మాత్రం ప్రభుత్వం వద్ద లేవు.

ప్రజల నిరసనలు – విబేధాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల ఏర్పాటుపై.. ప్రజల నుంచి చాలా చోట్ల నిరసన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన కొన్ని నియోజకవర్గాలను విడదీసి.. కొత్త జిల్లాల్లో కలిపారని, కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాలు అభ్యంతరకరమని పేర్కొంటూ.. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పలు చోట్ల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక, అనంతపురం జిల్లాను విడదీసి కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీసత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కాకుండా హిందూ పురాన్ని కేంద్రంగా నిర్ణయించాలని డిమాండ్‌ ‌చేస్తూ బంద్‌ ‌పాటించారు. అదేవిధంగా సీఎం జగన్‌ ‌సొంత జిల్లా కడపను విడదీసి ఏర్పాటుచేస్తున్న అన్నమయ్య జిల్లాకు రాయచోటి కాకుండా.. రాజంపేటను కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. డోన్‌ ‌నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోనే కొనసాగించా లని డిమాండ్‌ ‌చేస్తున్నారు. నంద్యాలకు ఆనుకుని ఉన్న పాణ్యంను కర్నూలు జిల్లాలో కలిపి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోన్‌ను నంద్యాల జిల్లాలో ఎలా కలుపుతారని ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమలను రాజ మహేంద్రవరం జిల్లాలో కలపడంపై ఆందోళన చేపట్టారు. నరసాపురం జిల్లా కేంద్రంగా భీమ వరాన్ని ప్రకటించడాన్ని నిరసిస్తూ నరసాపురంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. నరసాపురం కాకుండా భీమవరాన్ని జిల్లాగా ప్రకటించాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో కోనసీమ జిల్లాలో చేర్చిన మండపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి (రాజమహేంద్రవరం) జిల్లాలో కలపాలంటూ నాయకులు ఆందోళన చేపట్టారు. అదే విధంగా కొత్తపేట అసెంబ్లీ పరిధిలోని ఆలమూరు మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని ఆలమూరులో అఖిలపక్ష నాయకులు సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు. ప్రకాశం జిల్లాను మూడు ముక్కలు చేయడం అశాస్త్రీయమని పార్టీలు విమర్శించాయి. ఒంగోలు కేంద్రంగా తూర్పు ప్రాంతంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఒకటి, మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రాంతం లోని ఐదు సెగ్మెంట్లతో కలిపి మరో జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌వస్తోంది. మార్కాపురం జిల్లా కోరుతూ అఖిలపక్షం రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం నిర్వహించింది. కందుకూరు డివిజన్‌ ‌రద్దును వ్యతిరేకిస్తూ ఆందోళనకు స్థానికులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు గౌతు లచ్చన్న పేరు పెట్టాలని, సోంపేటలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. చిత్తూరులో మదనపల్లె జిల్లా ఏర్పాటు కోసం ఆందోళనలు కొనసాగాయి. నగరి నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని డిమాండ్‌ ‌చేశారు. గుంటూరు జిల్లా కేంద్రంగా తెనాలిని ప్రకటించాలని నాయకులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. నరసరావుపేట కేంద్రంగా ఏర్పడే జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని కోరుతు న్నారు. కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాకు స్వాతంత్య్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు పేరు పెట్టాలని భాజపా జాతీయ కార్యవర్గసభ్యులు కన్నా క్ష్మీనారాయణ డిమాండ్‌ ‌చేస్తున్నారు.

పాత పేర్లు ఉంచాలి!

ఇదిలా ఉంటే తమ జిల్లాకు పేరు మార్చాల్చిన అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. ఏళ్ల తరబడి సెంటిమెంటుగా ఉన్న పేరును మార్చేందుకు కొందరు ఇష్టపడటం లేదు. అలాగే తమ ఊరు లేదా గ్రామం ఫలానా మండలంలోనో, జిల్లాలోనే ఉండాలని, తమ నియోజకవర్గం ఫలానా నియోజకవర్గంలోనే ఉండా లని, లేదా గతంలో నుంచి స్థానికులు కోరుతున్న పేర్లు ఉండాలని డిమాండ్లు మొదలయ్యాయి. ఇలా కొత్త జిల్లాల ప్రతిపాదన అనేక వివాదాలకు కారణమవుతోంది.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram