చిరంజీవి సీతారాంతో 1964 నుండి- అంటే అతని తొమ్మిదో ఏడు నుండి- దహనమయ్యేంత వరకూ నా పరిచయం సాగింది. అసలు దహించే స్వభావంతోనే జీవించాడతడు. ‘అగ్గితో కడుగు’ అన్న గాయం సినిమా పాటలో అతడే కనిపిస్తాడు. అగ్నిపునీత సీతలా, పరమ పవిత్ర గంగాప్రవాహంలా, హిమాలయాలు వెదజల్లే తెల్లటి మంచులా, మలయమారుతంలా, గర్జించే పర్జన్యంలా తనలో తనను ఇముడ్చుకుంటూనే, జగమంత కుటుంబానికి తన భావాలనీ, అనుభవాలనీ పాటల్లో రంగరించి అందించిన ధన్యజీవి!

ఆగని, ఆరని, ఎడతెగని ఒక బంధం అయిదు దశాబ్దాల పాటు మా మధ్య సాగింది! అతడి నుండి నేను పొందిన గౌరవానికీ, నా వ్యక్తిత్వానికీ ఏ మాత్రం సంబంధం లేదు. ఆ గౌరవానికి ఎక్కడా సామీప్యత, అర్హత లేదని ఎన్నోసార్లు విన్నవించుకున్నా, నన్ను అందరికీ ఉన్నతంగా పరిచయం చేయడం అతని అత్యున్నత సంస్కారమే. నాకు అర్హత లేకపోయినా, అతని నుంచి అలాంటి అదృష్టం మాత్రం లభిస్తూనే ఉండేది. ఇదే వైరుధ్యం!

మూడు దశాబ్దాల పాటు వారం వారం ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూండేవి! బాధలు, కష్టాలు, కడగండ్లతోనే అతడి జీవితం ఎక్కువ భాగం గడిచింది. అందులో కొంత నాకూ భాగస్వామ్యం ఉంది! అతడికి నేను ప్రత్యక్షంగా పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడిని కాదు. సమవయస్కుడినీ కాదు. కలిసి చదువుకోలేదు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌మా ఇద్దరినీ కలిపింది. అదే వ్యక్తిగత స్నేహంగా మారింది. స్నేహితుడుగా, సన్నిహితుడుగా జీవితమంతా నడిపించింది! అతని గురించి రాసే అర్హత లేకున్నా, రాయమన్నారు ‘జాగృతి’ సంపాదకులు, చిరకాల మిత్రులు గోపరాజు నారాయణరావు. స్వీకరించాను బాధ్యతని!

సీతారం తండ్రి కీ.శే. డా. సి.వి.యోగి గారితో పరిచయం ఆ కుటుంబంతో నా బంధం ఇంతగా పెనవేసుకుపోవడానికి కారణం. మావాళ్లకి మీరు గార్డియన్‌గా ఉండి, సంస్కారవంతమైన, సంఘకార్యంలో భాగస్వాములను చెయ్యండి అని చెయ్యందించి, సీతారాం, శ్రీరామ్‌లను నా చేతిలో పెట్టారాయన. నాకు అదే ఓ దివ్య సందేశమైంది! జీవిత పర్యంత బాధ్యతా అయింది! 10వ తరగతి వరకూ అనకాపల్లిలో చదివి, తండ్రిగారి ఉద్యోగ రీత్యా కాకినాడ వెళ్లవలసి వచ్చింది. అయినా, స్వస్థలం అనకాపల్లితో, అక్కడి ఆయన వైద్యసేవలతో, మిత్రులతో బంధమూ వీటిలో ఏవీ నిలిచిపోలేదు. చివరికి డాక్టర్‌ ‌యోగి జీవితం అనకాపల్లిలోనే ముగిసింది! మహాపండితుడు. 16 భాషల్లో పాండిత్యం. చదివింది ఎస్‌.ఎస్‌.ఎల్‌.‌సి మాత్రమే. హోమియో వైద్య శిక్షణ పొందారు. ఏ సబ్జెక్టయినా పోష్టుగ్రాడ్యుయేట్సుకి ట్యూషన్స్ ‌చెప్పేవారు యోగి. ‘అన్ని విద్యలున్నా అన్నానికి కరవే’ అన్న కఠోర వాస్తవాన్ని చెప్పే సామెతకి ఉదాహరణ కూడా వారే.

సీతారాం జీవితం ఎన్నో మలుపులూ, మెలికలూ తిరిగింది. తండ్రి ఆకస్మిక మరణం తరువాత కూడా ఒక స్వాభావిక ఆవేశం నిపురు కప్పుకుని ఉండేది. ఎదిరించడం, నిలదీయడం, వాదించడం, తనదైన తర్కంతో ఎదుటివాడిని ఢీకొట్టి ఓడించడం నిత్యకృత్యం. అది తట్టుకోవడం చాలామందికి కష్టమై, దూరమయ్యేవారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌సంఘ శాఖా కార్యక్రమం ముగిశాక గంటల కొలది నాతోనూ వాదించేవాడు. ఓపిగ్గా వినేవాడిని. తెలిసిన మేర సమాధానాలూ, సంజాయిషీలూ ఇచ్చేవాడిని. అయినా అందరి దృష్టిలో సీతారాం వతీఙవతీ•వ• స్త్రవఅఱబ. నా దృష్టిలో, అనుభవంలో వతీ•వమీ• స్త్రవఅఱబ. మా సంభాషణ అందరికి విసుగు పుట్టించేది! కాకినాడ వెళ్లాక అదే కవిత్వంలో, పాటల్లో ప్రతిధ్వనించింది. అతడు రాసిన ప్రతి పాటా వారంలోగా ఉత్తరంలో దర్శనమిచ్చేది! కాకినాడ సాయంశాఖలో ముఖ్యశిక్షక్‌గా, ప్రాథమిక శిక్షావర్గకీ వెళ్లి వచ్చాడు. కీ.శే.కొత్తపల్లి ఘనశ్యామలప్రసాద్‌ ‌గారు తన పాటల్ని మెచ్చుకోవడం సీతారాంకు మరింత ప్రోత్సాహం కలిగించేది! గంగావతరణం పాట కె. విశ్వనాథ్‌గారి దృశ్యీకరణ ప్రతిభని దృష్టిలో పెట్టుకొని రాసినా, ఆ దర్శకుడి వద్దకి చేరడం ఆలస్యమైంది! ‘జననీ జన్మభూమి’ సినిమాలో ముచ్చటపడి, రామచంద్రపురం సంఘ కార్యకర్తల అనుమతితో రచయిత పేరు తెలియకుండానే సినిమాలో పెట్టారు. అదొక అదృష్టం. మలుపు తిప్పిన ఘటన. విశాఖలో చదువుతున్న వైద్య విద్యను ఆపేసి, టెలిఫోన్సు శాఖలో గుమాస్తా ఉద్యోగంలో చేరిపోయి, తన సాహిత్య విజృంభణకి స్వేచ్ఛ లభించినట్లు భావించాడు సీతారాం. తాడేపల్లిగూడెంలో, రాజమండ్రిలో, కాకినాడలో తన కవితలనే పాటల రూపంలో బల్లపై దరువేస్తూ పాడేవాడు. కొంతమంది కవులు ‘డప్పు పాటగాడు’ అనేవారు, అసూయతో.

తండ్రిగారి మరణం ఆ కుటుంబాన్ని దీనమైన పేదరికంలోకి నెట్టేసింది. మకాం పెంకుటిల్లు నుండి తాటాకుల పాకలోకి మారింది. అప్పులు పెరిగాయి. చిత్రంగా, కవిత్వ ధారా పెరిగింది. పేరు ప్రఖ్యాతులున్న కవులతో పరిచయం, వారి మధ్య ప్రత్యేక స్థానం తెచ్చింది. ఒకవైపు అప్పులు,ఆ తిప్పలు. మరొకవైపు అర్ధరాత్రి కవితా వ్యాసంగం. చదువుకుంటున్న తమ్ముళ్లూ, చెల్లెళ్ల బాధ్యత బరువెక్కింది. ఆ బరువు తగ్గించడానికి శ్రీరాం ఆత్మీయులు ద్వారా ఎక్కడో రాంచీలో ఉద్యోగం చేసి, అర్థాకలిలో కడుపు మాడ్చుకుంటు రెండే జతల బట్టలతో గడుపుతూ ఇంటికి డబ్బు పంపేవాడు. అయినా అవసరాలు తీరేవి కావు. కుటుంబం కంటే, కవిత్వానికే సీతారాం ప్రాధాన్యమిచ్చేవాడు. ఫలితం- కుటుంబంలో, సమాజంలో, మిత్రులతో సంఘర్షణ. అప్పుల్లో కూరుకుపోతున్నా, కనిపించిన ప్రతి పుస్తకం, ప్రతి పత్రిక కొనే అలవాటు. రాబడంతా అలా ఖర్చయిపోయేది! అప్పుడే ఆత్మహత్యా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇది తెలిసి, కాకినాడ నుంచి టాన్స్‌ఫర్‌ ‌పెట్టించి, అనకాపల్లికి మకాం మార్పించక తప్పలేదు. నా సహాయం ఎంతయినా, మాష్టారున్నారు అనే భావన అక్కడ అతనికి అండగా ఉండేదనిపిస్తుంది. అదో కనపడని రక్షా కవచం. అంతే! ఆత్మహత్యాయత్నం నుండి ఆత్మవిశ్వాసం వైపు మలుపు తిరిగింది జీవితం. ఆగిపోయిన చదువు, డిగ్రీ చదువు, మళ్లీ ప్రారంభమైంది. ఎమ్‌.ఏ. ఇం‌గ్లీష్‌ ‌కట్టించాం! రెండేళ్ల పరీక్షలు ఒకేసారి రాస్తానని పట్టుబట్టాడు. అలాగే అన్నాను.

ఇంతలోనే రామచంద్రపురంలో గంగావతరణం పాట కొత్త అవతారం ఎత్తింది. దర్శకుడు విశ్వనాథ్‌గారు పేరు తెలుసుకొని రచయితకి ఉత్తరం రాశారు. పారితోషికం అవసరంలేదు గాని, తెరపై పేరుండాలని కోరాడు సీతారాం. జననీ జన్మభూమి సినిమా టైటిల్సులో ఆ పేరు చూసి అంతా గెంతులేశాం! సినిమా విజయం సాధించకపోయినా, సీతారాం సినీ జీవితంలో విజయ సూచనలు ప్రారంభమైనాయి! సంభాషణల రచయిత ఆకెళ్ల సూర్యనారాయణగారు సీతారాంకి మంచి మిత్రుడు. విశ్వనాథ్‌గారి సిరివెన్నెల సినిమాకి మాటలు రాసే అవకాశం ఆయనికి లభించింది. పాటల రచయిత కావాలనగానే సీతారాం పేరు చెప్పారు ఆకెళ్ల. వెంటనే తీసుకొనిరమ్మని ఆదేశించారు విశ్వనాథ్‌. ఆకెళ్ల మా ఇంటికొచ్చి, ‘మాష్టారూ! సినిమా అవకాశం వచ్చింది, మద్రాసు పంపించండి!’ అని అడిగారు. ‘ఎమ్‌.ఏ. ‌పరీక్షలు, ఎలా?’ అన్నాను. నిర్ణయం మీదే అని నాకొక పరీక్ష పెట్టాడు. అటు సినిమా ఛాన్సు. ఇటు ఎమ్‌.ఏ. ‌పరీక్షలు. అవి పూర్తయితే లెక్చరర్‌ ఉద్యోగం! మధ్య ఊగిసలాట! చివరికి సినిమా వైపే మొగ్గింది త్రాసు.

సీతారాం మద్రాసులో అడుగుపెట్టడం, విశ్వనాథ్‌ ‌గారిని కలసి, తన పాటలు వినిపించడం, ఆయన ముగ్ధుడై, సిరివెన్నెల సినిమా కథ చెప్పి ఓ పాట రాసి తెమ్మనడం వరసగా జరిగిపోయాయి. తన మొదటి పాట ‘విధాత తలపున ప్రభవించినదీ అనాది జీవనగానం’ పాట అలా వచ్చింది. ఆశ్చర్యం, ఆనందంతో స్వీకరించిన దర్శకుడు బాలూగారితో పాడించి రికార్డు చేశారు. ఆ రికార్డు పాట పట్టుకొని, పరమానందంతో కేసెట్‌ ‌తెచ్చాడు. రోజంతా తిరిగి టేప్‌రికార్డర్‌ ‌సంపాదించి విన్నాం! పరవశంతో ఉప్పొంగిపోయాం! మళ్లీ మళ్లీ కేసెట్‌ ‌వేసుకొని విన్నాం, వినిపించాం. ఇలా ప్రారంభమైంది సీతారాం సినీ జీవితం.

ప్రతిభకి పట్టం కట్టేవారి వద్దకు చేరాడు సీతారాం. అయినా అక్కడెన్నో ఒడుదుడుకులు. పోరాటాలు. ఆ పోటీలో నలిగిపోయాడు. విసుగెత్తి అనకాపల్లి చేరాడు, ఇక వెళ్లకూడదన్న నిశ్చయంతోనే. తిరిగి విషాదయోగం! మిత్రులందరం కూర్చొని ప్రోత్సహించాం, వినలేదు. ఓదార్చి, కోప్పడి, బ్రతిమిలాడి, మళ్లీ మద్రాసు ట్రయిన్‌ ఎక్కించాం! విజయవాడ వరకూ ఓ ఎస్కార్ట్- ‌మధ్యలో దిగిపోకుండా. తనేమిటో నిరూపించుకొని, నిలదొక్కుకునే సరికి, పాటల కోసం చిన్న సినిమా నిర్మాతలు రావడంలేదు. ఒక్క విశ్వనాథ్‌గారికే ఈయన పనికొస్తాడు తప్ప, మిగిలినవాళ్లకు నిరుపయోగం అన్న ముద్ర. మధ్యలో మళ్లీ ఓసారి అనకాపల్లి వచ్చాడు. తిరిగి పంపించాం అందరం కలసి! ఎన్నో బాధలనుభవించాడు. తరువాత ఖ్యాతి వచ్చింది. పోటీ పెరిగింది! పాండిత్యం గల కవులు ప్రవేశించారు. కానీ సీతారాంకి వారితో స్నేహమేగాని పోటీలేదు!

చివరిగా, సీతారాం ప్రస్థానంలో పలికిన బంగారు పలుకుల గురించి కొంచెం. దశాబ్దకాలంగా, విదేశీ పర్యటనలోగాని, సభలు, సమావేశాల్లోగాని కళాశాల, విశ్వవిద్యాలయాల్లోగాని తను మాట్లాడినప్పుడు సంఘం ఆలోచన కార్యపద్ధతి, సిద్ధాంత మౌలిక లక్షణాల గురించి వివరించడానికి ప్రాధాన్యం ఇచ్చాడు. భారతీయత అనేది ప్రాదేశిక, ప్రాంతీయ సరిహద్దులకూ, ఒక నిర్ణీత కాలానికీ పరిమితమయ్యేది కాదనీ, అలా పరిమితం చేయాలనుకోవడం సరైనది కాదనీ సీతారాం గట్టి నమ్మకం. అది విశ్వజనీనమైనదని చెప్పేవాడు. సమస్త మానవాళికి మార్గదర్శనం చేసే సిద్ధాంతంగా ఆవిష్కరిస్తూ ఉండేవాడు. అదొక తత్త్వం, జీవన విధానమని చాటుతూ ఉండేవాడు.

సద్గురు పూజ్య శివానందమూర్తిగారి సాన్నిధ్యం, ఆయన రచించిన ‘భారతీయత’, ‘మార్గదర్శకులు మహర్షులు’, ‘కఠోపనిషత్‌’ ‌వంటి గ్రంథాలూ; ఎమ్‌.‌వి.ఆర్‌.‌శాస్త్రిగారి పుస్తకాలు సీతారాంలో జాతీయ భావాలను పటిష్టం చేశాయి. కన్నతండ్రి సి.వి.యోగి ప్రభావంతో బాల్యంలోనే భారతీయత పట్ల, హిందూ వాఙ్మయంపట్ల అవగాహన కలిగింది. తెలుగులో వచ్చిన కొన్ని పురాణ చిత్రాలు, అందులోని పాత్రలు కూడా సీతారాంను ప్రభావితం చేశాయి. అలాగే నాటకాలు. భారతీయమైన పాత్రలతో నిర్మించిన ప్రాంతీయ సినిమాలు సహకరించాయి. విశ్వనాథ సత్యనారాయణగారి సాహిత్యం, కె.విశ్వనాథ్‌ ‌వంటి తెలుగుదర్శకులు భారతీయతను ప్రతిబింబించేలా తీసిన సినిమాలు తెలియ కుండానే సీతారాంలో భారతీయతా దృష్టిని విస్తృతం చేశాయి. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మాట్లాడేవారు సీతారాం. సత్యంవైపు పయనించేదే భారతీయ జీవన విధానమని వక్కాణించడమూ ప్రారంభించాడు. దీనిని దృష్టిలో పెట్టుకొని పాటలు రాయడం మొదలుపెట్టాడు. భారతీయతను సమస్త మానవాళికి అందించే బాధ్యత హిందూజాతిది. ఈ జాతి ప్రజలు ప్రపంచమంతా తిరిగారు. ఇప్పుడు స్థిరపడ్డారు. ఏ దేశంలో ఉన్నప్పటికి, ఆ దేశాన్ని సుసంపన్నం చేయడమే హిందుత్వం. గతంలో ఈ విషయం చెప్పినప్పుడు అడ్డుకునే శక్తుల బలమైన ప్రయత్నం ఉండేది. డాక్టర్జీ అనుచరులు వందేళ్ల పాటు చేసిన తపస్సు, నిర్విరామ కృషితో, సామాజిక స్పృహతో, సేవాతత్పరతతో ఆ ప్రతిబంధకం తొలగింది. ఆనాటి మహర్షులే ఇవాళ్టి సంఘ కార్యకర్తలుగా వచ్చి పనిచేస్తున్నారు- ఇదే సీతారాం భావన. కలియుగం నిద్రాస్థితి, ద్వాపరం మెలకువ స్థితి, త్రేతాయుగ లక్షణం ప్రయత్నం, ఇక కృతయుగ లక్షణం, ముందుకు సాగడం. అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు కాలానుగుణమైనన చరైవేతి కృతయుగ లక్షణంవైపు మనం ముందుకు సాగాలని దీనదయాళ్‌ ఉపాధ్యాయ 1967 కాలికట్‌ ‌నుంచి వెలువడే ఒక పత్రికకు రాసిన సంపాదకీయంలో వివరించారు.

అలాగే, విదేశాల నుండి శాస్త్రీయత, సాంకేతికత దిగుమతి చేసుకోవచ్చుగాని, సంస్కృతిని దిగుమతి చేసుకోవల్సిన అవసరం లేదన్నారు దీనదయాళ్‌.

 ‌భారతీయ సంస్కృతిని ప్రపంచం దిగుమతి చేసుకుంటే, నిజమైన పురోభివృద్ధి, అంటే శాస్త్రీయ సాంకేతికాలు నిలుస్తాయి. లేకపోతే అభివృద్ధి తిరోగమనం వైపు యుటర్ను తీసుకుంటుంది. భారతీయ సంస్కృతి- శాస్త్రీయతను, సాంకేతిక అభివృద్ధిని, సుస్థిరం చేస్తుంది, మానవాళిని ఉత్తమ జీవనం వైపు నడుపుతుందని సీతారాం విదేశాల్లో సభలలో మాట్లాడినప్పుడు చెప్పేవాడు. వివేకానందుడు, డాక్టర్‌ ‌హెడ్గేవార్‌, ‌దీనదయాళ్‌జీ చూపిన మార్గమే ఆచరించదగిందీ, అనుసరించదగిందీ అని చెప్పినప్పుడు సభలు కరతాళధ్వనులతో మారుమ్రోగేవి.

‘ఈ ఆపరేషన్‌ ‌నుండి కోలుకున్నాక ఇక నా ప్రస్థానం అటే మాష్టారూ!’ అన్నవే థియేటర్‌లోకి వెళ్లేముందు ఆ నోటి నుంచి నేను విన్న అమృతవాక్కులు. ఇక మిగిలిన కాలమంతా శివానందగారు ఆదేశించినట్లుగా సంఘమార్గంలో పయనిస్తానని మా• ఇచ్చాడు. వినయంగా పాదాభివందనంచేసి, ఆలింగనం చేసుకొని కంట తడిపెడుతూ లోపలికి వెళ్లాడు. రెండురోజులకి కోలుకొని, ‘మాష్టారు రాలేదా!’ అని అడిగాడట. ఇంతలో ఆకస్మికంగా పొలమారి ఊపిరాడలేదు. తరువాత మూడురోజులు మృత్యువుతో పోరాడి సెలవంటూ అందర్నీ వదలిపెట్టి అందని లోకాలకి చేరుకున్నడా పుణ్యమూర్తి. తెలుగుతనం నుండి తన దృష్టిని భారతీయత వైపు పయనింపజేసాడు. అన్ని ప్రాంతాలు భారతీయతలో అవయవాలే అంటూ, ఆ సంగతి సినిమావారికీ గుర్తు చేయగలిగినంత ఎత్తుకు ఎదిగి, భగవాధ్వజాన్ని ఎగురవేశాడు.

– యర్రంశెట్టి సత్యారావు

(వ్యాసకర్త బీవీకే కళాశాల, విశాఖపట్నం విశ్రాంత అధ్యాపకులు. సీతారామశాస్త్రికి గొప్ప ఆత్మీయులు)

By editor

Twitter
Instagram