– రామచంద్ర రామానుజన్‌

తెలంగాణలో ప్రసిద్ధ శివాలయాలలో కొమరవెల్లి మల్లన్న ఆలయం ఒకటి. కుమారస్వామి కొంత కాలం ఈ ప్రాంతంలో తపస్సు చేయడం వల్ల కుమారవెల్లి అని పేరు వచ్చి, కాలక్రమంలో ‘కొమరవెల్లి’గా, వాడుకలో ‘కొమ్రెల్లి’గా మారిందని చెబుతారు. ఈ క్షేత్రాన్ని అపర శ్రీశైలంగా భావిస్తారు. అక్కడికి వెళ్లలేని వారు ఈ మల్లన్నను దర్శించుకునే ఆనవాయితీ ఉంది.

నేటి సిద్ధిపేట జిల్లాలోని మండల కేంద్రం కొమ రెల్లిలో 11వ శతాబ్దంలో ఇంద్రకీలాద్రి అనే శిఖరంపై పరమశివుడు మల్లికార్జునస్వామిగా వెలసినట్లు పురాణోక్తి. వీరశైవ మతారాధకులు మాదిరాజు, మాదమ్మ దంపతులకు పుత్రుడిగా జన్మించిన పరమే శ్వరుడు తన మహిమలతో భక్తులను కాపాడాడని, కాపాడుతున్నాడని స్థలపురాణాన్ని బట్టి తెలుస్తోంది. శివాంశ సంభూతుడు మల్లన్న మామూలుగా సంప్రదాయబద్ధంగా కనిపించే లింగా కారంలో కాకుండా గంభీరరూపుడిగా, కోరమీసాలతో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. శిరస్సున నాగేంద్రుడు పడగ విప్పి కనిపిస్తాడు. మల్లన్న పరమేశ్వరుడి అవతారమైన మార్తాండ భైరవుడు అని చెబుతారు.

కాకతీయుల పాలన సమయంలో పుట్టమన్నుతో చేసిన స్వామి వారి విగ్రహాన్ని ఇక్కడి గుహలో ప్రతిష్టించారు. మహరాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా మాలెగావ్‌ ప్రాంతంలో ఖండోబా (మల్లికార్జున స్వామి) ఆలయ పూజారికి స్వామి కలలో కనిపించి ‘కొమరవెల్లి కొండ గుహలలో వెలసినట్లు’ చెప్పడంతో ఆ పూజారి ఇక్కడికి వచ్చి శివలింగానికి పూజాది కాలు మొదలుపెట్టారట. కొన్నాళ్లకు ఆ శివలింగంపై పెరిగిన పుట్ట మట్టితోనే మాలెగావ్‌లోని స్వామి విగ్రహం తరహాలో ఇక్కడ మూర్తిని తయారు చేశారని తమ పూర్వికులు చెప్పినట్లు ఆలయ అర్చకులు పేర్కొంటున్నారు. మృత్తికా విగ్రహం నాటి నుంచి పూజలందుకుంటున్నప్పటికీ చెక్కుచెదరకపోవడాన్ని విశేషంగా పేర్కొంటారు. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు స్వామివారి ప్రతిష్టనాడే అంకురరూపం దాల్చిందని చెబుతారు. భక్తులు ముందుగా ఆ చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. మొక్కుబడిగా కొబ్బరికాయను వస్త్రంలో చుట్టి దానికి కడతారు.

మల్లన్న దేవుడు యాదవ, లింగబలిజ సామాజిక వర్గాలకు చెందిన కేతమ్మ, మేడాలమ్మలను పెళ్లాడాడని, ఆ బాంధవ్యంతోనే ఆయా సామాజిక వర్గాల వారే ఆలయంలో పూజాదికాలు నిర్వహిస్తారు. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు మొదలయ్యే వార్షిక జాతర ఫాల్గుణ మాసం చివరి ఆదివారం (ఉగాది ముందు వచ్చే ఆదివారం) వరకు కొనసాగుతుంది. ఆ ఆదివారమే ఆలయం తోటబావి ప్రాంగణంలో జరిగే మల్లన్న కేతమ్మ మేడాలమ్మ కల్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాల సమర్పణ ఆనవాయితీగా వస్తోంది. కల్యాణోత్సవాన్ని వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. రెండు వంశాల వారు అంటే` పగిడన్న వంశీయులు స్వామివారి తరఫున, మహా దేవుని వంశంవారు అమ్మవార్ల తరఫున పెళ్లి తంతు నిర్వహిస్తారు. ఈ సంబరాలు స్వామివారి కల్యాణో త్సవంతో మొదలై అగ్నిగుండాలనే కార్యక్రమంతో ముగుస్తాయి.

మల్లన్న జాతర

మకర సంక్రాంతి నుంచి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాలలో మల్లన్న జాతర జరుగుతుంది. సంక్రాంతి తరువాతిది ‘పట్నం’ వారంగా, రెండవ ఆదివారాన్ని, బోనాలను లష్కర్‌ వారం అంటారు. ఆ రెండు రోజులు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవు తారు. తమ ఆడబిడ్డ మేడలాదేవిని మల్లన్న వివాహ మాడినందున ఈ వారాన్ని యాదవులు అత్యంత ప్రీతికరంగా భావిస్తారు. భక్తులు ఆ మూడు నెలల కాలంలో బోనం, పట్నం అనే విశేష కార్యక్రమాలలో మొక్కుబడులు సమర్పించుకుంటారు. మల్లన్నను కీర్తిస్తూ జానపద శైలిలో ‘ఒగు’్గ వాయిస్తూ పాటలు పాడతారు. జాతర చివరిలో, అంటే కామదహనం (హోలీ) పండుగకు ముందు ‘పెద్దపట్నం’ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రకృతి సిద్ధమైన అయిదు రంగులతో వేసే ముగ్గులను ‘పట్నం’ అని, అది పరిమాణంలో భారీగా ఉంటే ‘పెద్దపట్నం’ అంటారు. విశాలమైన ముగ్గు మధ్యకి స్వామిని ఆవాహన చేసి సామూ హికంగా ఒగ్గులు వాయిస్తూ స్వామిని కీర్తిస్తారు (‘పట్నం’లో వాడిన ముగ్గును జాతర తరువాత సేకరించి పంటపొలాల్లో చల్లుతారు). ఆ రాత్రి భారీ పరిమాణంలో కట్టెలను పేర్చి మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ట చేసి కణకణలాడే నిప్పుల మీదుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను మూడుసార్లు దాటిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు వారిని అనుసరిస్తారు.

మహాశివరాత్రిని లింగోద్భవ వారంగా వ్యవహరి స్తారు. లింగోద్భవ సమయంలో మల్లన్నకు మహన్యాస రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఒగ్గు పూజారులు 49 వరుసలతో పెద్దపట్నం (ముగ్గు)వేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మల్లన్నస్వామి ఆలయానికి కొంత చేరువలో కొండపై కొలువుదీరిన రేణుకాదేవిని ఆయన సోదరిగా భావించి భక్తులు బోనాలు సమర్పిస్తారు, జాతర నిర్వహిస్తారు.

మట్టిపాత్రల ప్రసాదం

భక్తులు మల్లన్నకు మట్టి పాత్రలలో పదార్థాలను నైవేద్యంగా పెడతారు. ఆ తరువాత ఆ పాత్రలను పాడిపంటల అవసరాలకు వినియోగిస్తారు. దీనివల్ల పాడిపండలు సమృద్ధిగా ఉంటాయని విశ్వాసం. ఆ మట్టి పాత్రలను గృహవసరాలకూ వినియోగిస్తారు. గతంలో ఈ ఆలయంలో ఈ మూడు నెలల్లో ఏడు వారాల పాటే జాతర కొనసాగేదట. దానిని సత్తేటి వారాల జాతర అనే వ్యవహరించేవారు. భక్తుల రద్దీ కూడా అంతంత మాత్రమే కావడంతో ఈ మూడు నెలలు మాత్రమే ఆలయం తెరిచి ఉండేది. రానురాను జాతర సమయంతో పాటు ఇతర సమయాల్లోనూ భక్తుల రద్దీ పెరుగుతోంది. అందుకు తగినట్లుగా మండపాలు, సత్రాలు, నూతన నిర్మాణాలు చేపట్టారు. సుమారు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నీటి పథనానికి ‘మల్లన్న సాగర్‌’ అని రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది.

వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌

By editor

Twitter
Instagram