– రంజిత్‌, న్యాయవిద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ

‘పెళ్లి’` ఇద్దరు మనుషులనే కాదు, రెండు కుటుంబాలనూ దగ్గరచేసే గొప్ప బంధం. అగ్నిసాక్షిగా ఒక్కటైన ఈ బంధం.. వేదమంత్రాలతో చేసిన ప్రమాణాలతో, పంచభూతాల సాక్షిగా కడదాకా కలిసి ఉండాలనే ఉద్దేశం ఇందులో ఉంది. వివాహం అంటే రెండు తనువులు కాదు, మనసులు కూడా ఒకటై పరస్పరం తోడు`నీడగా కష్టసుఖాలలో ఒకరికి`ఒకరుగా ప్రయాణించే అద్భుత ప్రయాణం.

కానీ నేటి సమాజంలో అన్యోన్యంగా సాగాల్సిన సంసారం, ‘ఒకరికొకరు’ అన్నట్టుగా గడపాల్సిన దంపతులు చిన్నపాటి మనస్పర్థలకు కూడా విడిపోతున్నారు. విడాకుల కోసం కోర్టు తలపులు తడుతున్నారు. పెళ్లయి ఏడాది తిరగకుండానే దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం భయాన్ని కలిగిస్తున్నది, ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచిన మన భారతీయ వివాహ వ్యవస్థ ఇప్పుడు విడాకుల చిచ్చులో చిక్కుకుపోతున్నది.

పెళ్లి అంటే నూరేళ్ల పంట అనే నానుడి స్థానంలో పెళ్లంటే ఒక బందీఖానగా భావిస్తుండటం, ఆ బంధం మూన్నాళ్లకే ముక్కలవడం బాధాకరం. భరించేవాడు- భర్తÑ భూదేవి అంత సహనం గలది- భార్య. కాపురంలో కలతలు సహజం అనే విషయాన్ని మర్చిపోయి చిన్న చిన్న సమస్యలకే విడాకులు పరిష్కారం అని కోర్టును ఆశ్రయిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా విడాకుల సంస్కృతి బాగా పెరిగిపోతోంది. విడాకులు కోరుతున్న వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతోంది. పాశ్చాత్య పోకడలు, ఆధునికత, నగరీకరణ, వ్యక్తిగత స్వేచ్ఛ, దాంపత్య జీవితంలో మూడో వ్యక్తి ప్రమేయం, సోషల్‌ మీడియా, మొబైల్‌ ఫోన్స్‌, పని ఒత్తిడి, అత్తమామల అజమాయిషీ, సినిమాల ప్రభావం.. ఇలా అనేక కారణాలు దంపతు లపై ప్రభావాన్ని చూపి విడాకులకు దారితీస్తున్నాయి. నేటి దంపతులు పాశ్చాత్య పోకడలను అలవాటుగా చేసుకొని కలహాలను కొని తెచ్చుకుంటున్నారు.

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ..! నాతిచరామి అని వరుడు నోటపలికే ఈ మంత్రం ఎన్ని కష్టాలు వచ్చినా భార్య చేతిని విడిచిపెట్టనని ప్రమాణం చేయిస్తుంది. కానీ చిన్న చిన్న కారణాలకే (టీవీ రిమోట్‌ ఇవ్వలేదని, నచ్చిన సీరియల్‌ పెట్టలేదని, కాఫీ ఇవ్వలేదని) విడాకులు ఇస్తున్నారు. పంతాలు, మనస్పర్థలకు వెళ్లి జీవితాలను సుడిగుండంలో నెట్టేస్తున్నారు.

విడాకుల సుడిగుండంలో మొదటి పది రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. నేడు దేశంలో అత్యధికంగా నమోదవుతున్నవి విడాకుల కేసులే. హైదరాబాద్‌ నగరంలో రోజుకు 50 నుంచి 80 కేసులు నమోదవుతున్నాయి. ఇలా ఏటా 18 వేల నుంచి 20 వేల మంది విడాకులు కావాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వీరిలో 25 నుంచి 35 మధ్య వయస్కులు 75 శాతం. 35 సంవత్సరాలు పైబడిన వాళ్లు 25 శాతం ఉన్నారు. ఏడాది తిరగకుండానే విడిపోతున్న దంపతులు 60 శాతం. ఒక్క హైదరాబాద్‌లోనే 2016లో 3,080 జంటలు విడిపోయినట్లు నివేదికలు వెల్లడిరచాయి. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది తప్ప, తగ్గడం లేదు.

మన భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. కానీ నేటి యువత మన భారతీయ విలువలు, సాంప్రదాయాల్ని మరచిపోతున్నారు. ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకునే వారు. లేదా ఆ సమస్యను పెద్దల దృష్టికి తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు అలాకాదు, ఏ చిన్న సమస్యనైనా ‘కోర్టులోనే తేల్చుకుందాం’ అంటున్నారు. మనస్పర్థలకు పరిష్కారం ‘విడాకులే’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విడాకులు తీసుకునే దంపతుల వల్ల రాబోయే తరాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశా లున్నాయి. కాబట్టి ఈ సమస్యను గుర్తించి ప్రభుత్వాలే తగిన పరిష్కార మార్గాలను వెతకవలసిందే.

About Author

By editor

Twitter
Instagram