‘‘‌వినయ న మానత్‌ ‌జలధి జడ్‌, ‌గయే తీనీ దిన్‌ ‌బీతీ

బోలే రామ్‌ ‌సకోప్‌ ‌తబ్‌ ‘‌భయ బిన హోయ న ప్రీతి’’

తులసీదాస్‌ ‌రచించిన రామచరిత మానస్‌లోని ఈ చౌపాయి, ముఖ్యంగా ‘భయ బిన హోయ న ప్రీతి’ (భయం లేకుండా భక్తి ఉండదు) అని మనం వాడుకలో ఉపయోగించే మాటలు చాలామందికి చిరపరిచితమే. సముద్రుడిని దారివ్వమని మూడురోజులు ఎంతో వినయంగా ప్రాధేయపడినా, సముద్రుడు అహంకారం ప్రదర్శించడంతో ఆగ్రహించిన శ్రీరాముడు తన విల్లును ఎత్తి ‘ఆగ్నేయాస్త్రాన్ని’ సంధించిన వెంటనే సముద్రుడు దారిచ్చిన సందర్భాన్ని వివరించే చౌపాయి అది.

సరిగ్గా భారత్‌ ‌పరిస్థితి కూడా ప్రస్తుతం అలానే ఉంది. ఒకవైపు బుద్ధి మార్చుకోని పాకిస్తాన్‌, ‌మరోవైపు అన్నిదిక్కుల నుంచీ చుట్టుముడుతున్న చైనా… ఈ నేపథ్యంలో తన ‘దివ్యాస్త్రాన్ని’ ప్రదర్శించడం ద్వారా భయాన్ని కలుగచేసి వారిని నిలవరించవలసిన అవసరం ఏర్పడింది. అందుకే రెండు మూడు రోజుల తేడాతోనే ఎంఐఆర్‌వి 5 అగ్ని క్షిపణిని ప్రదర్శించడమే కాదు, త్రివిధ దళాలూ ఆత్మనిర్భర్‌ ‌భారత్‌కు అద్దం పట్టే ఆయుధాలను ప్రదర్శిస్తూ ‘భారత్‌ ‌శక్తి’ రక్షణ విన్యాసాలు నిర్వ హించాయి. ముఖ్యంగా ఒడిషా తీరంలో డీఆర్‌డీఓ సంస్థ ఎపిజె కలాం ద్వీపంలో పరీక్షించిన ఎంఐఆర్‌వి 5 అగ్ని విజయంతో భారత్‌ అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరి, వారు ఉలిక్కిపడేలా చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యదేశాలైన అమెరికా, రష్యా, యుకె, ఫ్రాన్స్, ‌చైనాల వద్ద మాత్రమే ఈ సాంకేతికత ఉందిట!

ఇది డీఆర్‌డీఓ విజయం

విజయవంతంగా ఈ క్షిపణిని పరీక్షించిన డిఫెన్స్ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (‌డీఆర్‌డీఓ) శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ అభినందించారు. ‘ స్వతంత్రంగా బహుళ లక్ష్యాలను ఛేదించగల రీ ఎంట్రీ వెహికల్‌ (ఎంఐఆర్‌వి) సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేసి రూపొందించిన అగ్ని -5 క్షిపణిని మిషన్‌ ‌దివ్యాస్త్ర కింద తొలిసారే విజయ వంతంగా ప్రయోగించిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నాను’ అంటూ ప్రధాని మోదీ వారిని అభినందిస్తూ ‘ఎక్స్’‌లో పోస్ట్ ‌చేశారు.

ఏమిటీ ఎంఐఆర్‌విలు?

మిషన్‌ ‌దివ్యాస్త్ర కింద పరీక్షించిన అగ్ని-5, ఒకే క్షిపణి నుంచి భిన్న లక్ష్యాలను స్వతంత్రంగా ఛేదించేందుకు ప్రయోగించగల బహుళ బాలిస్టిక్‌ ‌క్షిపణుల రీ-ఎంట్రీ వాహనాలు (ఎంఐఆర్‌వి) కలిగినదే ఎంఐఆర్‌వి. నాటి సోవియట్‌ ‌రష్యా, యుఎస్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ కాలమైన 1960ల్లో మొదటిసారిగా ఎంఐఆర్‌వి సాంకేతికతను అభివృద్ధి చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే ఒకే క్షిపణితో వేరు వేరు లక్ష్యాలను కొట్టేందుకు అణు ఆయుధాలను ప్రయోగించడమే ఈ సాంకేతికత. భిన్న వేగాలతో, భిన్న దిక్కులలో ఈ ఆయుధాలను ఉపయో గించవచ్చు. వాషింగ్టన్‌కు చెందిన పరిశోధన సంస్థ, సెంటర్‌ ‌ఫర్‌ ఆర్మస్ ‌కంట్రోల్‌ అం‌డ్‌ ‌నాన్‌ ‌ప్రొలిఫరేషన్‌ ‌ప్రకారం ఇవి లక్ష్యాల మధ్య దూరం 1,500 కిలోమీర్లు ఉన్నప్పటికీ వాటిని ఛేదించగలవు. అంతేకాదు, ఇవి ఉద్దేశించిన లక్ష్యాలను ప్రత్యర్ధి దేశాలు కాపాడుకోవడాన్ని ఎంఐఆర్‌విలు క్లిష్టతరం చేస్తాయి.

 తొలుత వీటిని సెన్సార్లు, ఇంటర్‌సెప్టర్‌ ‌మిస్సైళ్ల నెట్‌వర్క్ అయిన బాలిస్టిక్‌ ‌మిస్సైల్‌ ‌డిఫెన్స్ (‌బిఎండి) వ్యవస్థలను భంగపరచాలన్న ఉద్దేశంతో రూపొందించ లేదు. కానీ ఈ ఆధునికత సాంకేతికత వాటిని ఓడిస్తుంది. అందుకు కారణం అస్త్రాలు కలిగిన మూలవాహనాలు బహుళ డికాయ్‌లతో ఉద్దేశించిన లక్ష్యాలను చేరుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. చైనా బిఎండి సామర్ధ్యాలను కలిగి ఉందే తప్ప ఎంఐఆర్‌వి సాంకేతికతను కాదు. దీనితో అగ్ని 5 తన లక్ష్యాలను విజయ వంతంగా ఛేదించే అవకాశాలు మెండు.

ప్రస్తుతం రక్షణ వర్గాల ప్రకారం ప్రయోగించిన సమయంలో అగ్ని 5 కేవలం ఆరు వార్‌హెడ్‌లను ఉపయోగించినా, వాటి సంఖ్యను తర్వాత పెంచు కోవచ్చు. తొలి పరీక్షలోనే ఆరు వరకు ఆయుధాలను ఉపయోగించినందున ఈ సంఖ్యను పెంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అధికారికంగా, అగ్ని-5 అన్నది మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ ‌క్షిపణి (ఐఆర్‌బిఎం) కనుక దీని పరిధి 5,000 కిమీలు ఉంటుంది. అయితే, మీడియా నివేదికలు, విశ్వసనీయ వర్గాల ప్రకారం ఇది ఖండాంతర బాలిస్టిక్‌ ‌క్షిపణి (ఐసి బిఎం). కనుక దీని పరిధి 5,500 కిమీల కన్నా ఎక్కువే ఉంటుంది. వాస్తవానికి చైనా అధికారులు అగ్ని -5 వాసనను పట్టేసి, దాని పరిధి కనీసం 8వేల కిలోమీటర్లంటూ పేర్కొంటున్నారు. రెండేళ్ల కిందటే కొన్ని వార్తా సంస్థలు అగ్ని 5 క్షిపణి బరువును గణనీయంగా తగ్గించడంవల్ల 7వేల కిలోమీటర్ల ఆవల ఉన్న లక్ష్యా లను ఛేదించగల దంటూ కథనాలు ప్రచురించాయి. అయితే ఈ విషయంలో పాకిస్తాన్‌ ఏం ‌వెనుకబడి లేదుట. దాదాపు 2,200 కిమీల పరిధిగల ‘అబబీల్‌’ ‌బాలిస్టిక్‌ ‌క్షిపణిని ఆ దేశం పరీక్షించినట్టు, దానికి ఎంఐఆర్‌వి సామర్ధ్యం ఉన్నట్టు ప్రకటించు కుంది.

ఇస్రో సాధించిన విజయమే స్ఫూర్తిగా?

 ఒకే క్షిపణి బహుళ ఆయుధాలను ప్రయోగించ గలదన్న విషయంలో మనం ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. ఎందుకంటే, 2017లో ఇస్రో సంస్థ ఒక అద్భుతాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించింది. ఆ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన పీఎస్‌ఎల్‌వి -సి 37ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా అనూహ్య రీతిలో 104 ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో ఇస్రో నిలిపింది. ప్రధాన పేలోడ్‌ అయిన కార్టోశాట్‌ – 2 ‌శ్రేణి ఉపగ్రహం దాదాపు 700 కిలోల బరువును కలిగి ఉంది. సుమారు 12 నిమిషాల పాటు సాఫీగా సాగిన, కచ్చితమైన ఆపరేషన్‌లో అన్ని ఉపగ్రహాలు ప్రయోగ వాహనం నుంచి విజయవంతంగా వేరు అయ్యాయి. వీటిలో 96 సూక్ష్మ ఉపగ్రహాలు యుఎస్‌ ‌నుంచి వచ్చినవే కావడం గమనార్హం. ఈ విజయానికి విస్త్రత ప్రచారాన్ని భారత్‌ ఇవ్వనప్పటికీ, క్షిపణి ప్రయోగశక్తులు ఈ విజయాన్ని పరిగణనలోకి తీసుకోవడమే కాదు, నాడే భవిష్యత్తు గురించి తమ ఆందోళనలను వ్యక్తం చేశారు.

రక్షణలో వ్యూహాత్మక మార్పుకు నాంది

వాస్తవానికి ఎంఐఆర్‌వితో ప్రేరితమైన వ్యూహాత్మక మార్పు లోతైనది. ఎందుకంటే ఇది శత్రు క్షిపణి రక్షణ వ్యవస్థల ప్రభావాన్ని తగ్గించి, వారికి ఎక్కువ నష్టాన్ని కలిగించడానికి తోడ్పడుతుంది. దీనివల్ల ప్రపంచ అణు నిరోధకత అన్న భావననే పూర్తిగా మార్చనుంది. ఎంఐఆర్‌వి సాంకేతికతను కలిగి ఉండటం అన్నది దేశ సైనిక పరాక్రమాన్ని సూచించడమే కాక అంతర్జాతీయ భద్రత, అణు నిరోధక వ్యూహాలను రూపొందిం చడంలో కీలకపాత్ర పోషించేందుకు తోడ్పడుతుంది.

పొరుగు దేశాలను పక్కకు పెడితే, ఎంఐఆర్‌విల లక్ష్యాన్ని సాధించిన భారత్‌ ‌తదుపరి అడుగు సబ్‌మెరైన్‌ ‌లాంచ్డ్ ‌బాలిస్టిక్‌ ‌క్షిపణులు (ఎస్‌ఎల్‌బిఎంలు). ఈ సాంకేతికత కారణంగా అత్యంతగా అవి లబ్ధి పొందుతాయి. జలాంతర్గా ములలో జాగా తక్కువగా ఉంటుంది కనుక ఎక్కువ క్షిపణులు మోసుకుపోలేదు. అంతేకాదు, అణ్వా యుధాలతో కూడిన క్షిపణులను మోసుకుపోగల, అణుశక్తితో కూడిన జలంతర్గాములు అత్యంత ఖరీదైనది, ఎక్కువ సంఖ్యలో వీటిని మోహరించడం క్లిష్టం. కాగా, వాటికి అణు దాడిని ఎదుర్కొని కూడా ఉనికిలో ఉండగల అవకా శాలు ఎక్కువ. అధికారికంగా భారత్‌ ‌తన ఎస్‌ఎల్‌బిఎంల సంఖ్యను పెంచుకోనున్నట్టు వార్తలు వెలువడనప్పటికీ, హిందూ మహాసముద్ర ప్రాంతం, ఇండో పసిఫిక్‌ ‌ప్రాంతాలలో చురుకుగా ఉంటూ ఆ ప్రాంతాల్లోని మిత్ర దేశాలకు రక్షణ కల్పిస్తున్నందున వీటి అవసరం ఎంతైనా ఉందని చెప్పకతప్పదు.

ఫిక్సిడ్‌ ‌డిపాజిట్లలా ఆయుధాల సేకరణ

ప్రపంచం ఒక యుద్ధరంగంగా మారి, ఎవరు ఎవరిపై దాడికి దిగుతారో తెలియని తరుణంలో ఎవరి జాగ్రత్తలో వారుండటం అత్యంత అవసరమై పోతున్నది. మనవైపు నుంచి రెచ్చగొట్టే చర్యలు ఏమీ లేకుండానే అటు పాకిస్తాన్‌, ఇటు చైనా కూడా గతంలో మనపై యుద్ధానికి వచ్చాయి. ముఖ్యంగా చైనా, చిన్న చిన్న ముక్కలుగా భారతదేశంలోని ప్రాంతాలను ఆక్రమించుకొని చొచ్చుకువచ్చే ప్రయత్నాలను మానలేదు. ఎన్నిరకాల దౌత్యపరమైన చర్చలు జరిగినప్పటికీ, చైనా మాత్రం తన మంకు పట్టువిడవకుండా తన ప్రయత్నాలను తాను సాగి స్తోంది. ప్రస్తుతం అగ్ని 5ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా చైనా సహా మనపట్ల ప్రతికూలత కలిగిన దేశాలన్నింటికీ భారత్‌ ఒక సందేశాన్ని పంపినట్టు అయింది. ఒకవైపు తైవాన్‌ను తన కబ్జాలోకి తీసుకో వాలను కుంటున్న చైనా, తన శక్తు లన్నింటినీ ఆ వైపుగా మోహరించి ఉన్న సమయంలో ఈ పరీక్ష విజయవంతం కావడం విశేషం. ఇంకొక ఐదు నుంచి పది సంవత్సరాలలోపు అభివృద్ధి చెందిన దేశంగా ఎదగనున్న భారత్‌, ‌మన ఆక్రమిత ప్రాంతాలు సహా టిబెట్టు ప్రాంతాన్ని కూడా ఆ వారి కబ్జా నుంచి విడిపించినా మనం ఆశ్చర్యపో నవసరం లేదు.

భారత్‌ ‌శక్తి

ప్రపంచానికి అగ్ని 5 ఇచ్చిన షాక్‌ ‌వెంటనే పోఖ్రాన్‌లో ‘భారత్‌ ‌శక్తి’ పేరుతో జరిగిన సమీకృత విన్యాసాలు కూడా ప్రత్యర్ధి దేశాలకు వ్యూహాత్మక సందేశాన్ని ఇచ్చాయని వేరే చెప్పనవసరం లేదు. మార్చి 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ ‌జనరల్‌ అనిల్‌ ‌చౌహాన్‌, ‌నావికాదళ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌. ‌హరికుమార్‌, ఐఎఎఫ్‌ ‌చీఫ్‌ ఎయిర్‌చీఫ్‌ ‌మార్షల్‌ ‌విఆర్‌ ‌చౌధరి, సైన్యాధ్యక్షుడు మనోజ్‌ ‌పాండే, రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ ‌శర్మ, అత్యున్నత సైనికాధికారుల సమక్షంలో జైసల్మేర్‌లోని పోఖ్రాన్‌లో శుష్కభూభాగంలో జరిగిన ఈ విన్యాసాలలో పాల్గొన్న త్రివిధ దళాలకు చెందిన సాయుధ బలగాలు తమ సామర్ధ్యాలను ప్రదర్శించాయి. ఈ విన్యాసాలలో ప్రధానంగా దేశీయంగా రూపొందించిన ఆయుధాలు, విమానాలు, యుద్ధ ట్యాంకులు ప్రదర్శితమయ్యాయి. ‘ఆత్మనిర్భర్‌ ‌భారత్‌’‌కు అనుగుణంగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు, తుపాకులు కాల్పులు జరుపగా, స్వదేశీ విమానాలు గాలిలో గర్జించాయి. భారతీయ సైన్యం ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు జరిగాయి.

మన ఆయుధ సంపద

ఎల్‌సిఎ తేజస్‌, ఎఎల్‌హెచ్‌ ఎం‌కెוలు తమ గర్జనలతో ఆకాశాన్ని ప్రతి ధ్వనింపచేయగా, ప్రధాన యుద్ధ ట్యాంక్‌ అర్జున్‌, ‌కె-9 వజ్ర, టి-90 భీష్మ ట్యాంకులు, ధనుష్‌, ‌షరంగ్‌ ఆర్టిలరీ తుపాకీ వ్యవస్థలు ఆ గ్రౌండ్‌లోని ఫైరింగ్‌ ‌రేంజ్‌లలో వీర విహారం చేశాయి. మరొక ముఖ్యవిశేషం, ఈ ఫైరింగ్‌ ‌రేంజ్‌లు అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంగా స్థితమై ఉండటం. ఇక పినాకా రాకెట్‌ ‌తన ప్రతాపాన్ని ప్రదర్శించడం మొదలిడగానే ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో స్పందించారు.

దాదాపు 50 నిమిషాల పాటు సాగిన ఈ విన్యాసాలలో భారత్‌ ‌దేశీయంగా నిర్మించిన తన రక్షణ పరికరాలు లేదా సామాగ్రి శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించింది. అంతేకాకుండా, కమ్యూనికేషన్లు, శిక్షణ, అంతర్‌- ‌కార్యాచరణ, లాజిస్టిక్స్ ‌వంటి వివిధ అంశాలలో సాధిస్తున్న ఏకీకరణను, ఐక్యతను ప్రదర్శిస్తోంది. కాల్పులు జరపడాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం అన్నది విస్మయాన్ని కలిగించగా, వివిధ పరికరాలు, ఆయుధాలను ప్రదర్శించిన తీరు సాయుధ దళాల దేశీయ వేదికలను సమగ్రంగా వీక్షించేందుకు అవకాశాన్నిచ్చింది. ఇందులో వివిధ డ్రోన్‌ ‌వ్యవస్థలు, కౌంటర్‌ ‌డ్రోన్‌ ‌వ్యవస్థలు, సిమ్యులేటర్లు, కమ్యూనికేషన్‌ ‌వ్యవస్థలు, రాడార్‌ ‌వ్యవస్థలు, మల్టీ మోడ్‌ ‌హ్యాండ్‌ ‌గ్రనేడ్‌ (ఎంఎం‌హెచ్‌జి), 3డి- ప్రింటెడ్‌ ‌బంకర్లు, కృత్రిమ మేధ (ఎఐ) ఆధారిత ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ వ్యవస్థ సహా పలు పరికరాలు ప్రదర్శనలో ఉన్నాయి. భారతదేశపు భారీ రక్షణ తయారీ సామర్థ్యాన్ని అంగీకరించవలసిందేనని ‘భారత్‌ ‌శక్తి’ ప్రపంచ సైనిక సమాజానికి కూడా సూచించిందనే చెప్పాలి.

అందుకే, ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ, దీనిని నూతన భారత్‌ ‌చేస్తున్న సవాలు అంటూ పేర్కొనడం గమనార్హం. పోఖ్రాన్‌ అన్నది భారతదేశ అణుశక్తికి సాక్షిగా నిలిచిన ప్రాంతం, నేడు మనం ‘స్వదేశీకరణ్‌ ‌సే స్వశక్తికరణ్‌ (‌స్వదేశీకరణ నుండి సాధికారత వరకు) బలాన్ని వీక్షిస్తున్నాం. సాహసానికి మారుపేరైన రాజస్థాన్‌లో ఈ ‘భారత్‌ ‌శక్తి’ వేడుకలు జరుగుతున్నప్పటికీ, దాని ప్రతిధ్వని కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచం యావత్‌ ‌వినిపిస్తోందని, మోదీ అన్న మాటలు అక్షరసత్యాలని చెప్పకతప్పదు. ఈ రకంగా, పోఖ్రాన్‌ ‌భారత ‘ఆత్మనిర్భరత, విశ్వాసం, ఆత్మగౌరవానికి సాక్షి అయింది. ఈ పరిణామాలు ప్రపంచాన్ని కుదిపివేయగా, పొరుగుదేశాలను అసూయకు కూడా గురి చేయడం గమనార్హం.

డి.అరుణ

About Author

By editor

Twitter
Instagram