‘‌భారత సిలికాన్‌ ‌వ్యాలీ’గా ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరం నేడు గుక్కెడు నీళ్ల కోసం విలవిలలాడిపోతున్నది. వేలకొద్దీ స్టార్టప్‌లు, గూగుల్‌ ‌నుంచి వాల్మార్ట్ ‌వరకూ అనేక అంతర్జాతీయ ఐటి కంపెనీలు, సంస్థలు కలిగిన ఆ మెగా నగరం నేడు ప్రకృతి మనకు ఉచితంగా ఇచ్చే ఆ నీరు ఎంత ‘విలువైన’దో తెలుసుకుంటున్నది. ప్రజలు నీటి ట్యాంకర్ల వెనుక పరుగులు తీస్తున్నారు. బలహీనమైన నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు తగ్గి కావేరీ నది బేసిన్‌లోని రిజర్వాయర్లను భూగర్భ జలాలను తిరిగి నింపకపోవడంతో తగ్గిపోయా యని చెబుతున్నా, ప్రణాళిక లేకుండా అడ్డదిడ్డంగా నగరం విస్తరించడం ప్రధాన కారణమన్నది వాస్తవం. పచ్చదనానికి ప్రతీకగా ఉండే బెంగళూరు నగరంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడం విచిత్రమే. ఇంకా పూర్తిగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపకుండానే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, రానున్న రెండు నెలలు ఎలా ఉంటుందో అని అక్కడి ప్రజలు వణికి పోతున్నారు.

ఇదేదో కేవలం కర్ణాటకకు సంబంధించిన విషయమే అనుకోవడానికి లేదు. దక్షిణ భారత రాష్ట్రాలు కూడా సమస్యను ఎదుర్కొంటున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుందని నిపుణులు అంటున్నారు. కాగా, కర్ణాటక పొరుగు రాష్ట్రాలకన్నా భిన్నమైన అవసరా లను కలిగి ఉండడం చేతనే వేసవి రాకముందే ఎక్కువ నిల్వ జలాలను వినియోగించు కోవలసి వస్తోందని అంటున్నారు. నీటి వ్యవస్థకు ఆటంకాలు కల్పిస్తూ దీర్ఘకాలికంగా సాగిన విధ్వంసం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. దేశ విదేశాల నుంచి వ్యక్తులు వచ్చే నగర పరిస్థితే ఇలా ఉంటే, చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.

దెబ్బతింటున్న ఉపాధులు

ఇంత పెద్ద నగరంలో నీటి సమస్య అంటే కేవలం ప్రజల గొంతులు మాత్రమే ఎండిపోతాయని మనం భావిస్తే అది మన అమాయకత్వమే అవుతుంది. జీవనానికి మౌలికమైన నీటి సమస్య వల్ల పలువురి ఉపాధులు కూడా దెబ్బతిం టాయి. హోటల్‌ ‌వంటి వ్యాపారాలు తిరోగమనంలోకి వెడతాయేమోనని వారు ఇప్పుడే ఆందోళన చెందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాడిపడేసే ప్లేట్ల దగ్గర నుంచి రెస్ట్ ‌రూముల్లో నీరు ఎంత తక్కువగా నీరు వాడాలనే సూచనల వరకు చేతులు కాలిన తర్వాత నీటి క్రమశిక్షణను పాటిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ట్యాంకర్ల వేటలోపడి ఆఫీసులకు ఆలశ్యంగా వస్తున్నారని దీనివల్ల ఉత్పాదకత తగ్గుతోందని బహుళజాతి సంస్థలు గగ్గోలు పెట్టడంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు. అలాగే, అనేక సాఫ్ట్‌వేర్‌ ‌కంపెనీలు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పించాయి. ఇంటి నుంచి అంటే బెంగళూరులో ఇంటి నుంచి కాదు సుమా, మీ ఊరు వెళ్లి హాయిగా అక్కడి నుంచి పని చేసుకోండి అంటూ తమ ఉద్యోగులను పంపినట్టు వార్తలు వస్తున్నాయి.

పలు ప్రాంతాలలో బోరుబావులు ఎండిపోవడం వల్లనే ఈ సంక్షోభం నెలకొందని నిపుణులు అంటు న్నారు. మీడియా వార్తల ప్రకారం దీని కారణంగా, 257 ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా ఉండనుంది. ఈ విషయాలను మీడియా బహిరంగ పరిచిన తర్వాత బెంగళూరు వాటర్‌ ‌సప్లై అండ్‌ ‌సివరేజ్‌ ‌బోర్డ్ (‌బిడబ్ల్యుఎస్‌ఎస్‌బి) మార్చి 8వ తేదీన వాహనాలను కడుక్కోవడానికి, మొక్కలకు, నిర్మాణ పనులకు మంచినీటిని వాడకూడదని నిషేధాన్ని విధించింది.

నీటి కొరతకు కారణాలు

వెల్‌ ‌లాబ్స్ అన్న ప్రముఖ జల పరిశోధనా సంస్థ నగర జల సమతుల్యత అన్న పేరుతో నివేదికను వెలువరించింది. మితిమీరిన దోపిడీకి గురైన భూగర్భ జలాలపై అధికంగా ఆధారపడడం, బిడబ్ల్యుఎస్‌ఎస్‌బి పైప్‌లైన్లు అందుబాటు పరిమితంగా ఉండటం, చెరువుల నిర్వహణలో నిర్లక్ష్యం, జలశుద్ధి కేంద్రాలను పూర్తిగా వినియోగంలో పెట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నివేదిక పేర్కొనడం గమనార్హం. అయితే, 2023లో ఏర్పడిన వర్షాభావ ప్రభావం ఇదని కూడా భూగర్భ జల నిపుణులు పేర్కొంటున్నారు. కురిసిన వాన నీటిలో 45శాతం నదులు, చెరువులను చేరుకుంటోంది. అయితే, శుద్ధి చేసిన, చెయ్యని వ్యర్ధ జలాలతో నిండిన ఈ చెరువులు వాన నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యాన్ని కలిగి లేకపోవడం పౌరుల స్వయంకృతమే.

బృహత్‌ ‌బెంగళూరు మహానగర పాలిక పరిధిలో దాదాపు మూడు లోయలవ్యాప్తంగా లంకె కలిగిన 173 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల నెట్‌వర్క్ ‌నగర వరద నిర్వహణకు కీలకం. ఒక చెరువు నుంచి మరొక చెరువుకు పారేలా లంకెలు కలిగిన నెట్‌వర్క్‌తో కూడి ఉండడంతో అధిక జలాలు అలా పారుతాయి. మొదట్లో ఈ కాలానుగుణం చెరువులు వానాకాలంలో పూర్తిగా నిండి, భారీ వానలు పడినప్పుడు తన నెట్‌వర్క్ ‌ద్వారా వరదలు రాకుండా ఉపయోగపడేవి.

పట్టణీకరణ ఈ పద్ధతిపై భారీ ప్రభావాన్నే చూపింది. ముఖ్యంగా, చెరువుల్లోకి ప్రవహించే జలాల మేళనం మారిపోయింది. చెరువుల్లోకి ప్రవహించే నీటిలో దాదాపు సగం వ్యర్ధ జలాలు. ఇందులో శుద్ధి చేసినవి, చేయనివి కూడా కలుస్తున్నాయి. ఈ కారణంగా నగరంలో చెరువులు ఎప్పుడూ నిండుగా కనిపించడమే కాదు, వర్షపు నీరు అందులో నిల్వ ఉండే ఆస్కారం లేకుండా చేస్తున్నాయి. వానాకాలంలో నగరంలో వరద పరిస్థితులు ఏర్పడటానికి ప్రధాన కారణమిదే. వానాకాలంలో వృధాగా ప్రవహించే సగటు జలాలు దాదాపు 982 ఎంఎల్‌డి ఉంటుందని అని నివేదిక పేర్కొంది. అదనంగా, ఇష్టంవచ్చినట్టుగా చోటు చేసుకుంటున్న నిర్మాణాల వల్ల చెరువుల మధ్య గల లంకెలు తెగిపోతుండడంతో అధిక నీటి ప్రవాహం మరొక చెరువులోకి మళ్లకుండా ఊళ్లోకి ప్రవహించి, వరదలను, నీటి నష్టాన్ని కలిగిస్తున్నాయి.

నగరంలో సంచిత వ్యర్ధ జలాల్లో కేవలం 24 శాతం మాత్రమే శుద్ధి అవుతున్నాయి. శుద్ధి చేసిన వ్యర్ధ జలాల్లో 63శాతం మాత్రమే కేంద్రీకృత శుద్ధికి గురవుతాయని, మిగిలిన 13 శాతం వేర్వేరు ప్లాంట్లలో శుద్ధి అవుతాయి. కాగా, మొత్తం నగర వ్యర్ద జలాల్లో కేవలం 30 శాతాన్ని మాత్రమే పున: ఉపయోగిస్తున్నారు. శుద్ధి చేసే మౌలిక సదుపాయా లను విస్తరింప చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే, నిర్మాణ కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాలు, తోటల పెంపకాల వంటివాటిలో ఈ జలాలను ఉపయోగించవచ్చు.

నిజానికి ఈ వ్యర్ధ జలాల్లో అధికశాతం వినియోగంలోకి పెట్టని వనరు. దీనిని ఉపయో గించడం ద్వారా మంచినీటి వినియోగంపై భారాన్ని తగ్గించి, తక్కువ వానలు పడుతున్న కాలంలో నీటికి లోటు లేకుండా చూసుకోవచ్చని ఆ వెల్స్ ‌నివేదిక పేర్కొనడం గమనార్హం. అత్యవసరం కాని కార్యకలా పాల కోసం శుద్ధి చేసిన జలాలను ఉపయోగించడం అన్నది దీర్ఘకాలంలో ఎంతో ఉపయుక్తమైనదని నిపుణులు చెబుతున్నారు. నగరంలో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు తృతీయశ్రేణి జల కేంద్రాలను కోరవచ్చని ప్రభుత్వం చెబుతోంది. మొన్నమొన్నటి వరకూ ఈ వనరును తక్కువగా ఉపయోగించారు.

చుక్కలనంటుతున్న నీటి ట్యాంకర్ల ధరలు

రోజు మార్చి రోజు స్నానం చేసినప్పటికీ, కనీస అవసరాల కోసం నీరు అవసరమని పౌరులు, హౌజింగ్‌ ‌సొసైటీలు ట్యాంకర్ల కోసం పడుతున్న పోటీ కారణంగా వాటి ధరలు చుక్కలనంటుతున్నాయి. ముఖ్యంగా కావేరీ నదీ జలాల అందుబాటులేని ప్రాంతాలలో సాధారణ వ్యక్తులు నీరు కొనుక్కోవడం కంటే బంగారం కొనుక్కోవడం తేలికని భావిస్తు న్నారు. కాగా, నీటి ట్యాంకర్ల ధరలను నియంత్రించేం దుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చినప్పటికీ, ఆచరణలో పెద్దగా దాని ప్రభావం కనిపించడం లేదు.

ఒకవైపు డిమాండ్‌ అధికంగా ఉండడం ఒక కారణమైతే, దూరాల నుంచి నీటి తీసుకువచ్చి సరఫరా చేయవలసి రావడం కూడా ధరలను పెంచుతోంది. ఒకవైపు పెట్రోలు, మరొకవైపు నీటి ధరలు కలిసి తడిసిమోపెడవుతున్నాయి. ఈ అదనపు ధరల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటే తప్ప అటు సామాన్య పౌరులకు, ట్యాంకర్ల వారికీ కూడా ఊరట కలుగదు. అంటే, కనీసం ఆ వాహనాలకు వాడే పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌మీది పన్నులను ఉపసంహ రించుకున్నా, కొంతలో కొంత మేలు కలుగుతుంది.

ప్రతి ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు నగరంలో నీటి సమస్యను తీరుస్తామనే హామీ ఇస్తుంటారే తప్ప దీనిని పరిష్కరించాలనే నిబద్ధతతో లేకపోవడంవల్లనే ఈ సమస్య కొనసాగుతోంది. దీనితో పాటుగా, వర్షపు నీటి మీద అధికంగా ఆధార పడటం, నిల్వలకు తగిన చర్యలు తీసుకోకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణం. కేవలం 20శాతం లైవ్‌ ‌స్టోరేజీ సామర్ధ్యాన్ని మాత్రమే రాష్ట్రం కలిగి ఉండటం వల్ల, కేవలం ఒక సీజన్‌కు సరిపడ మాత్రమే దాని దగ్గర నీటి నిల్వలు ఉంటున్నాయన్న మాట.

దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలూ ప్రమాదం అంచున?

నైరుతి రుతుపవనాల కాలంలో 2023లో తక్కువ వర్షపాతం నమోదు కావడం కేవలం కర్ణాటకకే కాదు, దక్షిణాదిలోని రాష్ట్రాలు అన్నింటికీ శాపంగా మారింది. ఆ తర్వాత అక్టోబర్‌ ‌నుంచి డిసెంబర్‌ ‌మధ్య కాలంలో పడే వానలు కూడా 13శాతం తక్కువగా పడడం వల్ల రిజర్వాయర్లలో నీటి స్థాయిలు తగ్గిపోయాయి. ఈ రాష్ట్రాలలోని ప్రధాన పట్టణ కేంద్రాలలో చెరువుల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడం, భూగర్భ జలాలను అవసరానికి మించి వినియోగించడం వల్ల ప్రస్తుత సంక్షోభానికి కారణమయ్యాయి.

కేంద్ర జల కమిషన్‌ (‌సిడబ్ల్యుసి) తాజా నివేదిక ప్రకారం ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులలోని 42 రిజరాయర్లన్నింటిలో వాటి వాస్తవ సామర్ధ్యమైన 53.334 బిలియన్‌ ‌క్యూబిక్‌ ‌మీటర్ల నీటికి బదులుగా మొత్తం 12.287 బిసిఎం ఉంది. అంటే, మొత్తం నీటి సామర్ధ్యం 23 శాతానికి పడిపోయిందన్న మాట. గత పదేళ్లలో ఇదే కాలంలో ఉన్న సగటు నిల్వలతో పోలిస్తే ఇది చాలా తక్కువని నిపుణులు అంటున్నారు.

ఆంధప్రదేశ్‌లో నిల్వలు సాధరణం కన్నా 69 శాతం తక్కువ కాగా, తమిళనాడు (30శాతం), కర్ణాటక (24శాతం), తెలంగాణ (12శాతం) తక్కువగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. కేవలం కేరళమాత్రమే తన రిజర్వాయర్ల నిల్వలను నిర్వహిస్తూ, సాధారణం కన్నా ఒకశాతం మెరుగ్గా ఉందని చెబుతున్నారు. తూర్పు నుంచి పశ్చిమానికి, పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహించే నదుల నిల్వ స్థాయిలు అత్యంత తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.

అయితే, దక్షిణాదిలో ఉన్న రిజర్వాయర్లపైనే సాధారణ దృష్టి ఉన్నా, దేశ వ్యాప్తంగా కూడా పరిస్థితులు అంతగొప్పగా లేవని నిపుణులు చెబుతు న్నారు. గత పదేళ్లలో నమోదు చేసిన సగటు నిల్వలతో పోల్చినప్పుడు ప్రస్తుతం ఉత్తరభారతదేశం (33శాతం), పశ్చిమ భారతం (45శాతం), మధ్య భారత్‌ (46‌శాతం) తక్కువగా నమోదు చేశాయి. దేశంలో అంతో ఇంతో ఆరోగ్యవంత మైన నిల్వలను కలిగి ముందుకు సాగుతున్నది తూర్పు ప్రాంతమే. అక్కడ నిల్వలు 49శాతంగా ఉన్నాయి.

ఈ లెక్కలన్నీ కూడా పూర్తిగా వేసవిలో ప్రవేశించిన తర్వాతవి కాదు. ముందు పరిస్థితులే… ముందుంది ముసళ్ల పండుగ అన్నట్టు భయపెడు తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇప్పుడప్పుడే భయపడవలసిన పరిస్థితి కానీ, అవసరం కానీ లేవని జూన్‌ ‌వరకు సరఫరా చేసేందుకు నీరు ఉందని హామీ ఇస్తున్నాయి. ఆ తర్వాత, రుతుపవనా లకు ముందు, తర్వాత పడే వాన నీటితో చెరువులు, రిజర్వాయర్లు నిండుతాయని భావిస్తున్నారు.

 పట్టణీకరణపై భారాన్ని తగ్గించడం, ప్రణాళికా బద్ధంగా, కబ్జాలు లేని నిర్మాణాలు జరగడం, నీటిని నిల్వ చేసే కాలువలను, చెరువులను కాపాడుకోవడం, వ్యర్ధ జలాల పునర్వినియోగంతో పాటుగా నీటి వృధా నివారణ వంటి చర్యలను చేపట్టకపోతే, మన చేతులతో మనమే మన ప్రాంతాలను ఎడారులుగా మారుస్తామన్నది వాస్తవం.

-నీల

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram