ఏప్రిల్‌ 4 చల్లా సత్యవాణి జన్మదినం

చల్లా సత్యవాణి. 83 సంవత్సరాలు.  ఆమె పేరు ముందు రెండు పదాలు. డాక్టర్‌ (మేజర్‌). బోధన వృత్తిరీత్యా డాక్టరేట్‌. ఎన్‌సీసీ ఆఫీసరుగా మేజర్‌. ఎస్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసరుగానూ అనుభవశీలి. హిందీ, రాజనీతిశాస్త్రం, ఫిలాసఫీ అంశాల్లో మాస్టర్‌ డిగ్రీలు. రాజమండ్రి కళాశాలలో అధ్యాపకురాలిగా, ప్రిన్సిపల్‌గా,  డైరెక్టరుగా  బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో నిత్య ఉత్సాహి.  ఇప్పటికీ మానసికంగా అంతే ఉత్తేజం.

ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నుంచి దాదాపు రెండు దశాబ్దాల క్రితమే స్వర్ణపతక స్వీకారం. అదీ రఘుపతి వెంకటరత్నం నాయుడు పేరిట. స్వస్థలం కోనసీమలోని రాజోలు ప్రాంతం మోరి గ్రామం అయినా, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన రాజమహేంద్రవరంలోనే శాశ్వత నివాసం. ఉంటున్న ఇంటిపేరూ విశిష్టమే ‘ప్రణవకుటి.’ ప్రణవం అంటే ఓంకారం అని, కుటి అనేది కుటీరానికి రూపాంతరమని తెలుసు. ఇందులో అంతా ఆధ్యాత్మికమే.

అంతటి శక్తి ఉన్నందునే, ఇప్పటికే నాలుగు పదుల సంఖ్యలో అధ్యాత్మిక పుస్తకాలు రాశారు సత్యవాణి. వీటిల్లో చాలామటుకు సందర్శించి తెలుసుకున్నవే. అనేకం నదీ తీర ప్రాంతాలు.

నర్మద నదీ పుష్కరాలు మే ఒకటిన మొదలై పన్నెండున ముగుస్తాయి. ఇదే సందర్భంలో ఆ పుస్తక రచన, ప్రచురణ ప్రక్రియల్లో నిమగ్నులయ్యారీమె. ధార్మిక, తత్వచింతన కలిగిన యాత్రికులతో సహా అందరికీ సమాచారం అందించాలని ఇప్పటి ప్రయత్నం. ఇప్పటిదాకా  రచించిన పుస్తకాలను వితరణ చేయడమే సహజ స్వభావం. మే ఉత్సవాలకీ ఇదే విధానం కొనసాగిస్తానంటున్న ఈ మహిళామణి ఉత్సాహం చూస్తుంటే… వయసు 83 అనిపించదు. ఏ 38 సంవత్సరాలోను అనిపిస్తుంది!

సత్యవాణి రచనా వ్యాసంగం దరిదాపు పాతికేళ్లనాడు మొదలై విస్తరిస్తూ వచ్చింది. ప్రథమంగా ` తన పేరు కలిసి వచ్చేలా ‘సత్య`వ్యాస కదంబం.’ భాగాలుగా వెలువడిరది ఆ పుస్తకం. ‘ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర దర్శిని’ అటు తర్వాతది.

జ్యోతి స్వరూపుడు మహేశుడు. మన దేశాన నాలుగువైపులా జ్యోతిర్లింగాలు ఉన్నాయి. రామేశ్వర, సోమనాథ, నాగేశ్వర, మహాకాళేశ్వర, త్రయంబ కేశ్వర, మరెన్నో. అన్నీ శివతేజస్సులు. ద్వాదశ ఆదిత్య ప్రతీకలు. మల్లికార్జున, ఓంకారేశ్వర, వైద్యనాథ, కేదారేశ్వర, భీమశంకర, విశ్వేశ్వర,ఘృష్ణేశ్వర… వేటి ప్రత్యేకత వాటికి ఉంది. అనంత శివతత్వం. అన్నింటినీ సమగ్రంగా పుస్తకీకరించారు సత్యవాణి. అనంతరం ఏడాదికే గోదావరి పుష్కర దర్శిని, అదే సంవత్సరం నవజనార్దన క్షేత్రదర్శిని వెలువడ్డాయి. తదుపరి కాలంలో పంచారామ క్షేత్రదర్శిని.

నవజనార్ద్ధన, పంచారామ క్షేత్రాల దర్శినులతో భక్తజనుల పర్యటనలు విస్తృతమయ్యాయి. ఎంతగా అంటే  అప్పట్లో రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక యాత్రా ప్రణాళికలు అమలు చేసేంతగా! బస్సు ప్రయాణికు లందరకీ క్షేత్ర దర్శన పుస్తకాలు అందేలా చేశారీమె. వీటివల్ల అనిర్వచనీయ అనుభూతి తన సొంత మైందని ఈనాటికీ చెప్తూనే ఉంటారు.

ద్వాదశ నారసింహ క్షేత్రదర్శిని వెలువడి ఇప్పటికి పదహారేళ్లు. ‘నృసింహ ద్వాదశ నామ స్తోత్రం’ గుర్తొస్తోంది కదూ!

‘స్వభక్త పక్షపాతేన తద్విపక్ష విదారణమ్‌

నృసింహ మద్భుతం వందే పరమానంద విగ్రహమ్‌’

ఇది ముందుగా ధ్యానం.

హిమాలయ క్షేత్రదర్శిని సైతం సత్యవాణి విరచితమే.

మరి అష్టమూర్తి శివక్షేత్ర దర్శినికి సంబంధించి `సదాశివుడి రూపాలు ఎనిమిది. సూర్యచంద్రులు, పంచభూతాలతోపాటు జీవుడిలో..ఈశానుడు, మహదేవుడు, శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి. ఇలా….

ఇక, తిరుమల`తిరుపతి శ్రీ వేంకటేశ్వర యాత్రాదర్శిని. సుప్రభాతం కనువిందుగా, వీనులవిందుగా వర్థిల్లుతోంది.

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి

నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి ముఖ్యాం

ఆఖ్యాం త్వదీయ వసతేరనిశం వదంతి

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ

వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే

శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత…

తలచుకుంటేనే మది ఆనంద తరంగితం అవుతుంది. ఇంతటి అనుభూతినీ సత్యవాణి పుస్తకాలు భక్తజనులకు అందించాయి, నేటికీ అందిస్తూనే ఉన్నాయి.

గోదావరి, కృష్ణ…. ఈ రెండు నదుల పరీవాహక క్షేత్రాలు, ఆలయాల గురించీ ఏనాడో రచనలు చేశారీ విద్వన్మణి.

ఇందులో ఎంతగా తన్మయులయ్యారంటే

తను రాసిన మరో పుస్తకం పేరు `‘శ్రీపర్వత వర్ధనీ సమేత ఉమా రామలింగేశ్వర పంచాయతన ఆలయం. శ్రీపద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామివార్ల క్షేత్ర మహాత్మ్యం.

అంతేకాకుండా, శ్రీ మహావిష్ణు ఏకాదశ దివ్యక్షేత్రాలు, విష్ణు ఆలయాల, సప్త మోక్షపుర యాత్రాదర్శినులనూ అక్షరబద్ధం చేశారు. వీటితోపాటు వినాయక వైభవం, గణపతి ఆలయాల చరిత్రను అక్షరీకరించారు. సుబ్రహ్మణేశ్వర, సీతారామాంజనేయ దేవాలయాల విశేషాంశాలనూ పుస్తక రూపాల్లోకి తెచ్చారు.

‘మాఊరి గుళ్లు`తరలి వచ్చిన దేవుళ్లు’ అనే పుస్తకం ప్రాంతీయంగా అపార పాఠకాదరణ పొందింది.‘అంతా దైవ అనుగ్రహ బలం’ అంటారు ఎప్పుడూ.

స్థలచరిత్ర వివరాల్ని రాయడమే కాదు, వాటి సందర్శన సమాచారాన్నీ విపులీకరించడం సత్యవాణికి మరింత పేరు తెచ్చిపెట్టింది.ఆలయాలు ఎక్కడ ఉన్నా, అవి ఏ ప్రాంతాన ఉన్నా ఆమె వెళ్లి తీరాల్సిందే! వెళ్లి చూసిన సమస్త వివరాలనీ గ్రంథస్తం చేయాల్సిందే! ఆ గ్రంథాలన్నింటినీ ఉచితంగా అందించాల్సిందే అందరికీ!

పుస్తక ప్రచురణ ఎంత కష్టమో అందరికీ తెలిసిందే.వ్యయ ప్రయాసలన్నింటినీ ఆనందంగా భరించి పుస్తక వితరణను అనేక సంవత్సరాలుగా నిరంత రాయంగా మహోద్యమంగా సాగిస్తూ వస్తున్నారు.

మొదటి నుంచీ వనితాస్ఫూర్తి ఎవరంటే, దుర్గాబాయి దేశముఖ్‌ పేరు చెప్తుంటారు. ఆ స్ఫూర్తి ప్రదాతలోని నిత్యచైతన్య తత్వమే తనను ఆకట్టుకుందని అంటుంటారు.

సప్తమోక్షపురాల గురించి మీరూ విన్నారు కదూ!

  1. అయోధ్య 2. మధుర, 3. మాయ.
  2. కాశి 5. కంచి, 6. అవంతిక, 7. ద్వారవతి.

అత్యంత పురాతన క్షేత్రాలు ఇవన్నీ. అన్నీ చక్రపూరితాలు. అవి : సహస్రాకార, ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూరక, మూలాధార చక్ర సమన్వితాలు.

అయోధ్య అనగానే రామదర్శనం, వీక్షణ భాగ్యం.‘నా మది నిండా రాముని రూపమే

అక్షర, స్వర, పదార్చన రామనామమే!’

ఆలాపన, ఆరాధన, ఆత్మీయగానం

అయోధ్య రామునికే, ఆనందధామునికే!

అనునిత్యం తలవాలి ఆ రాముని నామం

అనుక్షణం చూడాలి శ్రీరామ స్వరూపం!’..

అని తలపులోనికి వచ్చి భక్తి భావం అంతటా నిండుతుంది. అటువంటి తాదాత్మ్యం పుస్తక ప్రదానంతో కలుగుతుందంటారు చల్లా సత్యవాణి. అష్ట సోమేశ్వర క్షేత్ర ప్రత్యేకతలనీ ఆ రోజుల్లోనే విశదీకరించిన భక్తితత్పర.

చంద్ర ప్రతిష్ఠిత లింగరూపాలు ఎనిమిది. అవి: కోలంక, వెంటూరు, కోటిపల్లి, వెల్ల, కోరుమిల్లి, సోమేశ్వరం, పెనుమాళ్ల.

అష్టసోమేశ్వరాలతో దాక్షారామాన్ని కలిపితే నవలింగాలు. వాటి దర్శనం పుణ్యప్రదమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధార్మికతతోపాటే క్రమశిక్షణాయుత జీవన సరళినీ ప్రబోధించారీ నారీరత్నం. ఇందులో ఒక భాగంగా నేషనల్‌ కేడెట్స్‌ గురించిన ఆంగ్ల పుస్తకాన్నీ వెలయించారు.

ఈ కార్ప్స్‌ అనేది భారత సాయుధ దళాల యువవిభాగం. యువతుల విభాగం 1949లోనే ఏర్పాటైంది. ఇదే ఎన్‌సీసీ నినాదం ‘కర్తవ్యం… జ్ఞానం’ ఇదే మాదిరిగా ` ఐక్యత, క్రమశిక్షణ.

మేజర్‌ బాధ్యత వహించిన సత్యవాణి పలు కార్యక్రమాలను చేపట్టారు. నినాద అంశాలన్నింటినీ ఆచరించి, యువతతో ఆచరింపజేసి, తనదైన ముద్రవేశారు.

ప్రాంతీయతను ధార్మికతతో మేళవించిన కారణంగా, త్రిలింగ క్షేత్రాలనీ అక్షర రూపాలతో పొందుపరిచారు. ప్రామాణిక సమాచారమున్న ఆంధ్ర కౌముది కావ్యాన్ని ఉదహరించారు. ఇది గణపవరపు వేంకటపతి కవి విరచితం. ప్రబంధ రాజవిజయ వేంకటేశ్వర విలాసము, ఆంధ్ర ద్విరూప కోశము వంటి గ్రంథాల కర్త.

‘కౌముది’ వ్యాకరణ గ్రంథంలో త్రిలింగక్షేత్ర ప్రస్తావనలున్నాయి.

  1. కాళేశ్వరం
  2. భీమేశ్వరం,
  3. శ్రీశైలం.

వీటన్నింటినీ విశేషించి విస్తరించి రాశారు ఈ రచయిత్రి. భారత జాతీయ సమైక్యతను ప్రస్ఫుటపరచే చైతన్య తరంగాలుగా మహా మహేశ్వర క్షేత్రాలను అభివర్ణించారు.

 ఫలశ్రుతి ఇదీÑ

ఐతిహ్యంబనురక్త శంకర

ముదాత్తలోక మీ ద్వాదశ

జ్యోతిర్లింగ మహామహేశ్వర

వరస్తోత్రంÑ బెవండేనియున్‌

భ్రాంతస్సంధ్యల యందు

దీని జదువన్‌ ప్రాప్తించు తద్‌ ద్వాదశ

జ్యోతిర్మూర్తుల గన్న పుణ్యముÑ

లభించున్‌ స్వామి కారుణ్యమున్‌!

ఇవే జ్యోతిర్లింగాలను శంకర భగవత్పాదులు దర్శించడం విదితమే. సంస్తుతి అందించడమూ తెలిసిందే. తిరుమలేశుని గురించి రచించినపుడు తన హృదయంలో కలిగిన భావాలను పద్యరూపాన ఆవిష్కరించారు. శ్రీనివాస ఉదాహరణాన్ని ప్రస్తావించారు సత్యవాణి.

‘ఆపద మొక్కుల ఆశ్రిత బంధూ

కాపాడంగదె కరుణాసింధూ!

ఆలింపుము మొర ఆది వరాహా

పాలింపుము ప్రియభక్త సమూహా!

ఆదుకొనవయా ఆనందమయా

చేదుకొనవయా శ్రితముని నిచయా!

నిస్తుల దీక్షా! కౌస్తుభ వక్షా!

త్రిజగన్మోహన, ద్విజరాడ్వాహన

అరిజన మర్దన, శరణు జనార్దన

పంకజ నయనా! వేంకటరమణా!’

భక్తితత్వాన్ని, సేవానిరతిని, నిరంతర తత్పరతను తనదిగా చేసుకున్న ఈ రచయిత్రి వినమ్రతకు మారుపేరు. విశ్రాంత జీవనం సాగిస్తున్న తనలో ఆలోచన తరంగాలు అనేకం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం తెలిసిన సత్యవాణి….

‘శాంతపావన శ్రీమదనంత శయన

పద్మనాభ ప్రభు ప్రభా ప్రాభవములు

శ్రీ జగన్మాత దివ్య నీరాజనములు

నవనవశ్రీలు చిందు నా రచనయందు’

అని ‘శుభకాంక్ష’ వ్యక్తపరుస్తూనే ఉన్నారు నేటికీ. ప్రతిభను సేవతో మిళితం చేసిన విలక్షణ వ్యక్తిత్వం ఆమెది. అక్షరాభివందనం.

About Author

By editor

Twitter
Instagram