ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా గల దేశాల్లో భారత్‌ ఒకటి. రమారమి 130 కోట్ల జనాభాతో చైనా తర్వాత భారత్‌ ‌రెండో స్థానంలో ఉంది. ఇంతమంది ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే అందుకు కారణం సైనికుల నిరుపమాన త్యాగాలేనని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. రాత్రీ పగలు తేడా లేకుండా వారు సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడటం వల్లే దేశవ్యాప్తంగా ప్రజలు క్షేమంగా ఉండగలుగుతున్నారు. కుటుంబాలకు, కన్నవారికి, స్నేహితులకు దూరంగా సరిహద్దుల్లో వారు చేస్తున్న సేవలు చిరస్మరణీయమైనవి. అమూల్యమైనవి. ఎముకలు కొరికే చలిలో, చిమ్మచీకట్లో ప్రాణాలకు తెగించి, విధులు నిర్వహిస్తున్న వారి రుణం తీర్చుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వారికి ఎన్నిమార్లు శాల్యూట్‌ ‌చేసినా తక్కువే. విధి నిర్వహణలో భాగంగా అమరులవుతున్న వారిని చూసి తమ సొంత కుటుంబ సభ్యులే దూరమయ్యారంత బాధతో యావత్‌ ‌జాతి తల్లడిల్లుతోంది. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ప్రకటిస్తోంది. వారి నిరుపమాన సేవలను పదేపదే ప్రస్తుతిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్నిరకాలుగా అండగా ఉంటామని అభయమిస్తున్నాయి. అయినప్పటికీ కన్నబిడ్డను కోల్పోయిన తల్లితండ్రులు, కట్టుకున్న భర్తను కోల్పోయిన అర్థాంగి, తండ్రికి దూరమైన బిడ్డలను ఓదార్చడం ఎవరికైనా శక్తికి మించిన పనే. త్యాగధనులను తిరిగి తీసుకురావడం అసాధ్యమే అయినప్పటికీ అనుక్షణం వారిని స్మరించుకోవడం వల్ల ఆ లోటును కొంతవరకు తీర్చగలం.


ఇటీవల జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు. శత్రువుల చొరబాటును అడ్డుకునే పక్రియలో భాగంగా వారు వీరోచితంగా వ్యవహరించి ముందుతరాల వారికి మార్గదర్శకంగా నిలిచారు. దేశ రక్షణ ముందు తమ ప్రాణాలు ఓ లెక్కకాదని చాటారు. ఓ సైనికుడికి దేశ సేవలో కన్నుమూయడం కన్నా మించింది ఏమీ ఉండదని నిరూపించారు కల్నల్‌ ‌సంతోష్‌ ‌బాబు, ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, ర్యాడా మహేశ్‌. ‌శత్రుమూకలను తరిమి కొట్టడంలో, సరిహద్దులను కాపాడటంలో వారు చూపిన తెగువ, సాహసం తిరుగులేనిది.

నిజామాబాద్‌ ‌జిల్లా వేల్పూరు మండలం కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్‌ ‌పాకిస్తాన్‌ ‌చొరబాటుదారులను మట్టుబట్టేందుకు సాహసో పేతంగా పోరాడారు. ఈ క్రమంలో ముష్కరులను మట్టుబెట్టారు. చివరికి అమరుడయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ ఓ ‌సీ- లైన్‌ ఆఫ్‌ ‌కంట్రోల్‌) ‌వద్ద మచిల్‌ ‌సెక్టార్‌ ‌సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2014లో సైన్యానికి ఎంపికైన మహేశ్‌ ‌గతంలో అసోం, కశ్మీర్‌, ‌డెహ్రాడూన్‌లలో పనిచేశారు. ఆయన తండ్రి గంగమల్లు సామాన్య రైతు కుటుంబానికి చెందినవారు. అన్నయ్య భూపేశ్వర్‌ ‌మస్కట్‌లో వలస కూలీగా పని చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే మాజీ సైనికాధికారి కూతురు సుహాసినిని ప్రేమించి పెళ్లాడారు. వారికి పిల్లలు లేరు. గత డిసెంబరులోనే స్వగ్రామానికి వచ్చారు. తనకేమీ ఇబ్బంది లేదని తల్లిదండ్రులు, భార్య ధైర్యంగా ఉండాలని చెప్పారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపారు. చిన్నప్పటి నుంచి సైన్యంలో పనిచేయాలన్న లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా ఉందని బంధు మిత్రులు వద్ద చెప్పేవారు. తనలాగే గ్రామ యువత కూడా సైన్యంలో చేరాలని, వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజెప్పేవారు. మహేశ్‌ అం‌తిమ సంస్కారాలకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. మహేశ్‌ అమర్‌ ‌రహే నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. సైనిక దళాల గౌరవ వందనం, పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడం ద్వారా అంత్యక్రియలు ముగిశాయి. మహేశ్‌ ‌భౌతికకాయంపై జాతీయ జెండాను కప్పినప్పుడు కన్నవారు, కట్టుకున్న భార్య, బంధుమిత్రుల బాధ వర్ణనాతీతం. జిల్లామంత్రి వేముల ప్రశాంతరెడ్డి, కలెక్టర్‌ ‌నారాయణరెడ్డి, నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌కార్తికేయ మహేశ్‌కు కడసారి వీడ్కోలు పలికారు. దేశమాత సేవలో కన్నుమూసిన మహేశ్‌కు ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. స్థానిక భారతీయ స్టేట్‌ ‌బ్యాంకు ప్రమాద బీమా కింద కొంత మొత్తాన్ని అందజేసేందుకు చర్యలు చేపట్టింది.

ఇదే ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన చీకల ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అమరుడయ్యారు. ఐరాల మండలంలోని రెడ్డివారిపల్లి ఆయన స్వగ్రామం. తల్లిదండ్రులు చీకల ప్రతాప రెడ్డి, సుగుణమ్మ. వారిది సాధారణ రైతు కుటుంబం. భార్య రజిత, కూతురు, కుమారుడు ఉన్నారు. 18 ఏళ్ల క్రితం సైన్యానికి ఎంపికైన ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మద్రాస్‌ ‌రెజిమెంటులో పని చేస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మచిల్‌ ‌సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ ‌శత్రుమూకలను అడ్డుకుని అమరుడయ్యారు. దేశంలో కల్లోలం రేపేందుకు సరిహద్దుల నుంచి అక్రమంగా ఉగ్రవాదు లను చొప్పించడం దాయాది దేశానికి వెన్నతో పెట్టిన విద్య. వారి ఆట కట్టించేందుకు భారత సైన్యం రేయింబవళ్లు కంటిలో ఒత్తులు వేసుకున్న చందాన పని చేస్తుంటోంది. అయినప్పటికీ పాక్‌ ఉ‌గ్రమూకలు ఏదో ఒక సమయంలో కన్నుగప్పి చొరబడుతుంటాయి. వారిని అడ్డుకునేందుకు భారత సైన్యం పని చేస్తుంటోంది. ఈ క్రమంలోనే ప్రవీణ్‌ ‌వీర మరణం పొందాడు.

 ప్రవీణ్‌ ‌భౌతిక కాయాన్ని చూసిన రెడ్డివారిపల్లి ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. వారికి నోట మాట రాలేదు. యావత్‌ ‌గ్రామం దుఃఖ సాగరంగా మారింది.  తమకు దిక్కెవరంటూ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు గుండెలవిసేలా రోదించారు. సంక్రాంతి పండగకు వస్తానని చెప్పిన ప్రవీణ్‌ ‌బదులు ఇప్పుడు అతని భౌతిక కాయం వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విగతజీవిగా మారిన ప్రవీణ్‌ ‌భౌతికకాయం చూసినవారి గుండె బరువైంది. కుమారుడు లీలేష్‌ ‌రెడ్డి తండ్రి భౌతిక కాయానికి నిప్పంటించారు. ఇంకెంతో కాలం చేయి పట్టుకుని నడిపించాల్సిన తండ్రి అప్పుడే తనకు దూరమయ్యాడని లీలేష్‌ ‌రెడ్డి విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, స్థానిక శాసనసభ్యుడు ఎంఎస్‌ ‌బాబు, కలెక్టర్‌ ‌భరత్‌ ‌గుప్తా, ఆర్డీవో రేణుక పలువురు ప్రజా ప్రతినిధులు ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు పలికారు.

మహేశ్‌, ‌ప్రవీణ్‌ ‌పాకిస్తాన్‌ ‌సరిహద్దుల్లో అమరులు కాగా కల్నల్‌ ‌సంతోష్‌ ‌బాబు చైనా సరిహద్దుల్లో జూన్‌ ‌మూడోవారంలో వీర మరణం పొందారు. సంతోష్‌ ‌బాబుది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని కేశొరాం గ్రామం. ఈ ఏడాది మార్చి నుంచి చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌ ‌ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. భారత్‌- ‌చైనాల మధ్య గల వాస్తవాధీన రేఖ వద్ద ఓ సైనిక దళానికి నాయకత్వం వహిస్తున్న కల్నల్‌ ‌సంతోష్‌బాబు చైనా చొరబాటు దారులను అడ్డుకునేందుకు దళంతో వీరోచితంగా పోరాడారు. గాల్వాన్‌ ‌లోయ వద్ద శత్రుమూకలతో సాహసో పేతంగా, హోరాహోరీగా పోరు సాగించారు. కొంతమంది చైనా సైనికులను మట్టుబెట్టారు. వారిని సరిహద్దుల్లోకి చొరబడకుండా అడ్డుకోవడంలో విజయం సాధించారు. చివరకు ఈ పక్రియలో కల్నల్‌ ‌సంతోష్‌ ‌బాబు అమరుడయ్యారు. సంతోష్‌బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్‌ ‌భారతీయ స్టేట్‌ ‌బ్యాంకు అధికారి. చిన్నప్పుడు స్థానిక సరస్వతీ శిశుమందిర్‌లో చదివిన సంతోష్‌ ‌తరువాత ఇప్పటి ఆంధప్రదేశ్‌లోని కోరుకొండ సైనిక స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలన్న ఆసక్తి ఉండేది. ఫుణెలోని నేషనల్‌ ‌డిఫెన్స్ అకాడమీలో, డెహ్రాడూన్‌లోని భారతీయ మిలటరీ అకాడమీలో శిక్షణ పొందారు. 2004లో సైన్యంలో చేరారు. తొలుత కశ్మీర్‌లో కొద్దికాలం, ఆ తరువాత అసోంలో పని చేశారు. సైన్యంలోని వివిధ హోదాల్లో బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. 16వ బిహార్‌ ‌బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తూ తూర్పు లద్దాఖ్‌లో బాధ్యతలు చేపట్టారు. అక్కడ పని చేస్తూనే దేశమాత సేవలో అమరుడయ్యారు. భార్య సంతోషి, తొమ్మిదేళ్ల కూతురు అభిగ్న, నాలుగేళ్ల కుమారుడు అనిరుధ్‌ ఉన్నారు.

సంతోష్‌ ‌బాబు అంత్యక్రియలకు యావత్‌ ‌సూర్యాపేట పట్టణం హాజరైంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కన్నీరుమున్నీ రయ్యారు. ముఖ్యంగా తల్లిదండ్రులు భార్య సంతోషి, కూతురు అభిగ్న, కుమారుడు అనిరుధ్‌ను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. వారు గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. సంతోష్‌ ‌బాబు అమర్‌ ‌రహే అంటూ ప్రజానీకం నినదించింది. బాబు భౌతిక కాయంపై జాతీయ పతాకాన్ని కప్పినప్పుడు కుటుంబ సభ్యులను ఆపడం కష్టతరమైంది. బాబు ధరించిన దుస్తులు, పతాకం, ఇతర వస్తువులను సైనికాధికారులు అప్పగించినప్పుడు అతని భార్య సంతోషి బాధ చెప్పనలవి కాలేదు. స్థానిక శాసనసభ్యుడు, జిల్లాకు చెందిన విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌ ‌రెడ్డి, కలెక్టర్‌, ‌జిల్లా పోలీసు ప్రధానాధికారి ఇతర ప్రజా ప్రతినిధులు సంతోష్‌ ‌బాబు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

సువిశాలమైన భారత్‌ అనేక దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, ‌నేపాల్‌, ‌భూటాన్‌, ‌మయన్మార్‌, ‌చైనాలతో భారత్‌ ‌సరిహద్దులను కలిగి ఉంది. శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలతో తీర ప్రాంత సరిహద్దులను పంచుకుంటోంది. అన్నింటికన్నా చైనా, పాకిస్తాన్‌ ‌సరిహద్దులు అత్యంత కీలకమైనవి. ఉద్రిక్తమైనవి, వివాదాస్పదమైనవి. ముఖ్యంగా రమారమి 3310 కిలోమీటర్ల సరిహద్దు గల నియంత్రణ రేఖ భారత్‌, ‌పాకిస్తాన్‌లను విడ దీస్తోంది. ఇక్కడ నిత్యం ఉద్రిక్తత రాజ్యమేలుతుంటోంది. ఉభయదేశాల ప్రధానులు అటల్‌ ‌బిహారీ వాజపేయి, ఝాఫరులల్‌ ‌జమాలీఖాన్‌ ‌హయాంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం దాయాది దేశానికి పరిపాటిగా మారింది. ప్రపంచం లోనే దీనికి సున్నితమైన సరిహద్దుగా పేరుంది. పంజాబ్‌ ‌లోని వాఘా సరిహద్దుల్లో నిత్యం పతాకావిష్కరణ, అవనతం ఉత్సవం జరుగుతుంటోంది. అయినప్పటికీ ఇస్లామాబాద్‌తో నిత్యం ఉద్రిక్తతలు షరామాములే. చైనాతో గల 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వద్ద ఆ దేశ సైన్యం తరచూ ఉద్రిక్తతలను రాజేస్తోంది. చొరబాట్లకు పాల్పడటం బీజింగ్‌ ‌సైన్యానికి అలవాటుగా మారింది. గత ఆరేడు నెలలుగా వాస్తవాదీన రేఖ వద్ద నెలకొన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్‌తో గల దాదాపు నాలుగువేల కిలోమీటర్ల సరిహద్దుల నుంచి అక్రమ వలసలు జరుగుతుంటాయి. భూటాన్‌తో 578 కిలోమీటర్లు, మయన్మార్‌తో 1458, నేపాల్‌తో 1752, అఫ్గనిస్తాన్‌తో 106 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నప్పటికీ పెద్దగా వివాదాలు లేవు. శ్రీలంక, మాల్దీవులతో తీర ప్రాంత సరిహద్దు ఉన్నప్పటికీ వివాదాలు లేవు. భారతీయ జాలర్లు లంక సముద్ర జలాల్లోకి ప్రవేశించడం, లంక జాలర్లు భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించడం వంటి చిన్నా చితక ఘటనలు తప్ప పెద్దగా వివాదాలు లేవు. ఉన్న సమస్యల్లా పాకిస్తాన్‌, ‌చైనా సరిహద్దులతోనే. దీంతో అక్కడే భారత సైన్యం భారీగా బలగాలను మోహరించాల్సి వస్తోంది. సైన్యం ఇక్కడ అనుక్షణం అప్రమత్తంగా ఉంటోంది. కంటికిరెప్పలా సరిహద్దు లను కాపాడుతోంది. ఉగ్రవాదుల పీచమణుస్తోంది. వారికి కాళ్లూ చేతులాడని, ఊపిరాడని పరిస్థితిని కల్పిస్తోంది. ఈ క్రమంలో అప్పడప్పుడూ కొందరు భారతీయ సైనికులు అమరులవుతున్నారు. దేశమాత సేవలో వీర మరణం పొందుతున్నారు. వారి కుటుంబాలకు భారత ప్రభుత్వం, ప్రజానీకం చేదోడు వాదోడుగా నిలుస్తోంది. అన్నివిధాలా అండగా ఉంటోంది. బరోసా కల్పిస్తోంది. వారి సేవలను, త్యాగాలను, పోరాట పటిమను నిత్యం స్మరించుకుంటూ జై జవాన్‌ అం‌టూ శాల్యూట్‌ ‌చేస్తోంది.

– గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్‌ : సీనియర్‌ ‌పాత్రికేయుడు

By editor

Twitter
Instagram