– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

భారత రాజ్యాంగం.. ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాల్లో ఒకటి. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. వందల కొద్దీ అధికరణలు, ఉపఅధికరణలతో పాలనకు నిర్దేశం చేసే లిఖిత ప్రతి. అధికార వికేంద్రీకరణ భారత రాజ్యాంగం మూల సూత్రం. ఏ ఒక్కరి చేతిలో సంపూర్ణ అధికారాలు ఉండరాదన్నది అసలు ఉద్దేశం. అలా చేసినట్లయితే అధికారం అంతా ఒకేచోట కేంద్రీకృతమై, నియంతృత్వ పాలనకు దారితీస్తుంది. అందువల్లే శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికార పరిధిని చాలా స్పష్టంగా నిర్దేశించింది. ఒకరి అధికార పరిధిలోకి మరొకరు చొరబడరాదని, పరస్పర గౌరవం, విశ్వాసంతో ముందుకు సాగాలని, అంతిమంగా ప్రజాస్వామ్య బలోపేతానికి పాటుపడాలని పేర్కొంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సారథ్యంలో రూపొందిన ఈ రాజ్యాంగం కాలగమనంలో మేలిమి రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. గత ఏడు దశాబ్దాల్లో అనేక ఆటుపోట్లను తట్టుకుని కాలపరీక్షకు నిలిచింది. అవసరమైనప్పుడు అది సవరణలకు కూడా గురైంది.

ఇంతటి పవిత్రమైన రాజ్యంగం పట్ల ప్రతి ఒక్క పార్టీకి గౌరవం ఉండాలి. దాని పవిత్రతను గుర్తించాలి. దానికి సంబంధించిన కార్యక్రమాలకు హాజరు కావడాన్ని బాధ్యతగా భావించాలి. ఏటా నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవం జరుగుతుంది. పార్లమెంటు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌, ప్రధాన మంత్రి తదితరులు పాల్గొంటారు. రాజ్యాంగానికి సంబంధించి సుదీర్ఘ చర్చ జరుగుతుంది. లోటు పాట్లపైనా చర్చలు చేస్తారు. ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగ, ప్రభుత్వ అధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రసంగాలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు అన్ని పార్టీలు హాజరై రాజ్యాంగాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు, మరింత మేలిమిగా తీర్చిదిద్దేందుకు తమ వంతు పాటుపడాలి. అలా చేయడం హుందాగా ఉంటుంది. విపక్షాలుగా తమ బాధ్యతను నిర్వర్తించినట్లు అవుతుంది. కానీ దేశంలోని మెజార్టీ ప్రతిపక్షాలు ఆ దిశగా ఆలోచించక పోవడం ఆందోళన, ఆవేదన కలిగించే పరిణామం. ఏవో చిన్నాచితకా పార్టీలు, కుటుంబాలు, కులాలు ప్రాతిపదికన నడిచే కొన్ని ప్రాంతీయ పార్టీలు అపరిపక్వంగా వ్యవహరించినట్లయితే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. అవి ఇంకా ఆ స్థాయికి ఎదగ లేదని భావించవచ్చు. కానీ స్వాతంత్య్ర సముపార్జనలో కీలకపాత్ర పోషించామని గొప్పలు చెప్పుకునే పార్టీ, దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన పార్టీ, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్లమెంట్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించటం పూర్తిగా బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఇలా చెప్పడం కొంచెం కటువుగానే ఉన్నప్పటికీ ఇది వాస్తవం. చేదు నిజం. ఈ నేపథ్యంలో వందేళ్లకు పైగా చరిత్ర గల హస్తం పార్టీ కనీస హుందాతనాన్ని పాటించలేకపోయిందన్న విమర్శలు వివిధ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. వీటిని తోసిపుచ్చడం కష్టమే. గైర్హాజరుకు గల కారణాలపై కాంగ్రెస్‌ స్పందన పేలవంగా ఉంది. అధికార పార్టీ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని, అందువల్లే ఆ కార్యక్రమానికి తాము దూరంగా ఉన్నామని ఆ పార్టీ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. పార్టీ నేత ఆనందశర్మ విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ సర్కారు అవమానపరుస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని, అందువల్లే తాము గైర్హాజరయ్యామని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. పార్లమెంట్‌ పరిశీలన, చర్చ లేకుండా చట్టాలు చేస్తున్నారని, సమాజంలో గందరగోళ పరిస్థితులకు ప్రభుత్వం కారణమవుతుందని ధ్వజమెత్తారు.

ఆనందశర్మ వ్యాఖ్యలను, ఆరోపణలను, విమర్శలను కాసేపు పక్కన పెడదాం. సహజంగానే విపక్షం సర్కారుపై విమర్శల దాడికి దిగుతుంది. ఇందులో వింతేమీ లేదు. తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు. అయినప్పటికీ పార్టీల పరంగా ఉన్న విభేదాలను పక్కన పెట్టి రాజ్యాంగపరమైన కార్యక్రమాలకు హాజరు కావడం ఆయా పార్టీల బాధ్యత. అలా చేయడం వల్ల వాటి హుందాతనం పెరుగుతుంది. రాజ్యాంగం పట్ల అవి తమ గౌరవాన్ని చాటుకున్నట్లు ఉంటుంది. కానీ ఆ విషయాన్ని విపక్షాలు గుర్తించినట్లు లేదు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలి. రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించేది ప్రభుత్వం కాదని, వీటిని పార్లమెంటు ఆధ్వర్యంలో నిర్వహించామని, ఈ విషయాన్ని విపక్షాలు గుర్తించలేదని వ్యాఖ్యానించారు. అందువల్ల ఈ కార్యక్రమానికి విపక్షాలు కూడా హాజరైతే నిండుగా ఉండేదని, మరింత శోభాయమానంగా ఉండేదని పేర్కొన్నారు. అందువల్ల ఒక సభాపతిగా గైర్హాజరు కావాలన్న విపక్షాల వైఖరిని సమర్థించలేనని ఆయన విస్పష్టంగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ చర్చల నుంచి పుట్టుకొచ్చే నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తాయని అన్నారు. సదుద్దేశంతో, సానుకూల ధోరణితో ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలు, సూచనలు విపక్షాలు పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు.

రాజ్యాంగ దినోత్సవాన్ని ఒక్క కాంగ్రెసే బహిష్కరించలేదు. దశాబ్దాల చరిత్ర గల ప్రాంతీయ పార్టీలు, అంతర్జాతీయ పార్టీలుగా తమను తాము చెప్పుకునే వామపక్షాలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. వచ్చే సాధారణ ఎన్నికల్లో విపక్షాలను కూడగట్టి ఢల్లీి పీఠాన్ని చేజిక్కించుకోవాలని తపన పడుతున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ కూడా ఉండటం విశేషం. ఢల్లీి పీఠంపై కన్నేసిన ఆ పార్టీ ఆ దిశగా కనీస హుందాతనాన్ని పాటించకపోవడం బాధాకరం. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు సైతం టీఎంసీ వైఖరిని సమర్థించలేకపోతున్నారు. ఇది ఆ పార్టీకి శోభ తెచ్చేది కాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కీలక ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ సైతం రాజ్యాంగ దినోత్సవానికి దూరంగా ఉండిపోయి విమర్శల పాలైంది. యువనేత, ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కు రాజ్యాంగం గురించి పెద్దగా తెలియక పోవచ్చు. కానీ పార్టీ వ్యవస్థాపకుడైన ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నాయకుడు ములాయంసింగ్‌ యాదవ్‌కు తెలియదని అనుకోలేం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ కూడా ఉంది. అక్కడ అధికారంలోకి రావాలనుకుంటున్న సమాజ్‌వాదీ పార్టీకి రాజ్యాంగ ప్రాధాన్యం తెలియకపోవడం విచారకరం. ఇక సీపీఎం, సీపీఐలు కూడా ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గుర్తించిన, గౌరవించిన ఈ పార్టీలు దానికి ప్రాతిపదిక అయిన రాజ్యాంగం పట్ల ఉదాసీనత ప్రదర్శించడం వాటి స్థాయిని తగ్గిస్తుంది. దశాబ్దాల చరిత్ర గల తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయింది. ఆ పార్టీ అధినేత స్టాలిన్‌ అక్కడ ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఆ పదవి ఆయనకు రాజ్యాంగ పరంగా సంక్రమించినదే. ఆ విషయాన్ని గుర్తించలేక పోతున్నారు, స్టాలిన్‌. దేశంలో సీనియర్‌ నాయకుల్లో ఒకరైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్‌పవార్‌ సైతం గైర్హాజరయ్యారు. ప్రధాని కావాలని ఎప్పటినుంచో కలలు కంటున్న, వచ్చే సాధారణ ఎన్నికల్లో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్న ఈ నేత రాజ్యాంగ దినోత్సవానికి హాజరై ఉంటే గౌరవంగా ఉండేది. ఆయన స్థాయికి తగ్గట్లుగా ఉండేది. మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని సంకీర్ణ సర్కారులో ఈ పార్టీ కీలక భాగస్వామి. ఇక జాతీయభావాల గురించి, హిందూత్వ గురించి అదేపనిగా పలవరించే మహారాష్ట్రకు చెందిన మరో ప్రాంతీయ పార్టీ శివసేన రాజ్యాంగ దినోత్సవానికి గైర్హాజరు కావడం ఆశ్చర్యం కలిగించింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎస్‌సీ) కశ్మీర్‌ సమస్యపై తరచూ గొంతెత్తు తుంది. రాజ్యాంగం పట్ల గౌరవం ప్రకటిస్తూనే కశ్మీర్‌ సమస్యపై చర్చలు జరపాలని డిమాండ్‌ చేస్తుంది. కానీ పరిపాలనకు దిక్సూచి వంటి రాజ్యాంగం పట్ల గౌరవం చూపలేకపోయింది. ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం ఈ కార్యక్రమానికి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత విద్యను అభ్యసించిన, ఏడేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేజ్రీవాల్‌కు రాజ్యాంగ ప్రాధాన్యం తెలియదనుకోలేం. ఢల్లీితో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించాలని ప్రయత్ని స్తున్న ఈ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌, గోవాల్లో అధికారం కోసం ఆరాటపడుతోంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ పోటీ చేయాలని ఆలోచన చేస్తోంది. పంజాబ్‌లో చాలాకాలం పాటు అధి కారాన్ని చలాయించిన, నిన్నమొన్నటి దాకా భాజపాతో మైత్రి బంధం నెరిపిన అకాలీదళ్‌ కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని బహిష్కరించింది. ఇక లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సారథ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ), హేమంత్‌ సొరెన్‌ నాయకత్వంలోని జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం), మతతత్వ పార్టీ అయిన ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ (ఐయూఎంఎల్‌), రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ (ఆర్‌ఎస్‌పీ) వంటి పార్టీలు గైర్హాజరవడం పెద్దగా ఆశ్చర్యపరచలేదు. వాటి ఆలోచనా పరిధి, అవగాహన మొదటినుంచీ పరిమితమే. సంకుచిత భావాలతో అవి పని చేస్తుంటాయి. 2019లోనూ ఈ పార్టీలు రాజ్యాంగ దినోత్సవాన్ని బహిష్కరించడం గమనార్హం. నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డీఏ) భాగస్వామ్య పక్షాలతో పాటు ఒరిస్సాకు చెందిన బిజూ జనతాదళ్‌ (బీజేడీ), తెలంగాణకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలైన అధికార వైకాపా, విపక్ష తెలుగుదేశం రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్నాయి. రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొనడం ఆయా పార్టీల బాధ్యత. అంతేతప్ప ఇది ఎవరో పిలిస్తే వెళ్లాల్సిన కార్యక్రమం కాదు. ప్రభుత్వ కార్యక్రమానికి, రాజ్యాంగ కార్యక్రమానికి గల తేడాను విపక్షాలు అర్థం చేసుకోక పోవడం విచారకరం.

కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ప్రథమపౌరుడు రామ్‌నాథ్‌ కొవింద్‌ విలువైన సూచనలు చేశారు. ప్రజాస్వామ్యంలో పార్ల మెంటు దేవాలయం వంటిది. ప్రతి సభ్యుడూ పూజ గదిలో ఎంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో ఉంటాడో, పార్లమెంటులోనూ అదేవిధంగా ఉండాలి. ప్రభావ వంతమైన, దీటైన, బలమైన విపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం బలహీన పడుతుందని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌ సర్వోన్నత శిఖరం. దీని గౌరవాన్ని కాపాడటంలో అధికార, విపక్షాలకు బాధ్యత ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రాత ప్రతి డిజిటల్‌ వర్షన్‌ను ఆయన విడుదల చేశారు. సభ్యులు సభా కార్య కలాపాలకు అంతరాయాలు కలిగించడంపై ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యసభ ఉత్పాదకత క్రమంగా తగ్గుతుండటం పల్ల ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

కుటుంబ పార్టీలతో ప్రమాదమని, కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీల ప్రాబల్యం కనపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పార్టీలు కుటుంబం చేత, కుటుంబం కోసం, కుటుంబం ద్వారా నడుస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి పార్టీలు రాజ్యాంగ ఆద ర్శాలకు, ప్రజాస్వామ్య భావనలకు పూర్తి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి, లేదా కుటుంబం చేతిలో పార్టీ నడవటం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని అన్నారు. అంతకుముందు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలోనూ మోదీ ప్రసంగించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇష్టారీతిన మాట్లాడటం, ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం సమంజసం కాదన్నారు. ప్రతి హక్కుకూ పరిమితి ఉందన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. హక్కులతోపాటు బాధ్యతలనూ గుర్తించాలని సూచించారు. రెండిరటికి మధ్య సమతౌల్యం పాటించాలని కోరారు.

వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram