– జంధ్యాల శరత్‌బాబు

హింస అనగానే ఉలిక్కిపడతాం. ఏమైందా? అని చటుక్కున చుట్టూ చూస్తాం. బాధించడం, వేధించడం, గాయపరచడం, నిందించడం, దూషించడం, కష్ట నష్టాలకు గురిచేయడం, అన్ని విధాలా వెంటాడటం, మానసిక` శారీరక రీతులను దెబ్బతీయడం, అనరాని వినరాని చేయరాని పనులన్నీ చేసేయడం.. ఇదీ హింసించడం అంటే! చివరగా ఉసురు తీయడం. నానా రకాలుగా హింసకు పాల్పడటం, ఆఖరికి ప్రాణాన్నే హరించడం!! నేరం, ఘోరం, దారుణం, అన్యాయం, అక్రమం, హీనం `ఎన్ని పేర్లున్నా అవన్నీ హింసాత్మకాలు. అరాచకానికి పర్యాయ పదాలు. స్త్రీలపై హింసలు లెక్క లేనన్ని. అవి ఎక్కడ మొదలై ఇంకెక్కడి దాకా విస్తరిస్తాయో ఏ ఒక్కరూ చెప్పలేరు. తల్లి గర్భం నుంచి జీవనయానం ముగిసేదాకా ఎక్కడి కక్కడే నరకయాతన. వనితకీ మనసుందని గమనించి గౌరవించకుంటే మానవత మటుమాయమైనట్లే. అంతటి హింసా ప్రవృత్తిని తీవ్రస్థాయిన నిరసిస్తూ అంతర్జాతీయ దినోత్సవాలు ఈ మధ్యనే ముగిశాయి. హింస మాత్రం ముగిసిపోలేదు. ముందుగా ‘ఆమె’ను రచ్చకీడ్చి, అనుమాన పెను భూతాలను సృష్టించి, చోద్యం చూసే నైజం పెచ్చు పెరుగుతుంటే ఏమనాలి? ఆ తరహా హింసాకాండను ఏ పేరుతో పిలవాలి? సర్వోన్నత న్యాయస్థానం ఇదివరకే ప్రశ్నించినట్లు ‘అసలు ఈ సమాజానికి ఏమైంది?’

రాజకీయ, సామాజిక, ఆర్థిక.. అంటూ నాయకులు ప్రసంగాలు దంచుతుంటారు. అభివృద్ధి, సంక్షేమం పేరిట పదే పదే అవే పదాలను వల్లె వేస్తుంటారు. నిజానికి రాజకీయం అనే మాటకు అర్థాలు పలు విధాలు. రాజ్య (దేశ, రాష్ట్ర) వ్యవహారాలని స్థూలంగా చెప్పవచ్చు కానీÑ మరో రెండు కీలక అర్థ తాత్పర్యాలూ ఆ పడికట్టుకు ఉన్నాయి. అవి 1. కుట్ర, 2. రహస్య ఆలోచన. జతగా మోసం అనే దాన్నీ జోడిరచవచ్చు. అలా అని రాజకీయాలన్నీ కలుషితాలు కావు, కాలుష్య రహితాలూ కావు. ప్రజా ప్రయోజనం అనేది ఒకటుందని తెలిసినవారికి రాజకీయం మంచి. తెలియనివారికైతే అరాచకమే. మంచిని పెంచాలన్న సదుద్దేశంతోనే భారత రాజ్యాంగ కర్తలు అతిపెద్ద లిఖిత రూపమిచ్చారు. నిర్మాణానికి దాదాపు మూడేళ్లు పట్టింది. రాజ్యాంగ సభ అనేక పర్యాయాలు సమావేశమై, వేలాది ప్రతిపాదనలను చర్చించి పరిష్కారాలు సాధించింది. మన రాజ్యాంగాన్ని సభాపూర్వకంగా ఆమోదించి గత నవంబరు 26 నాటికి 72 ఏళ్లు. రాజ్యాంగం ఆత్మ, ప్రభుత్వం శరీరం అని ఈ సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్రం తేటతెల్లం చేసింది. రాజ్యాంగ పరిషత్తు (సభ) తొలి సమావేశం ఢల్లీి వేదికగా ఏర్పాటైంది. పార్లమెంటు భవనంలో డిసెంబరు 9 నాటి ఆ కార్యక్రమానికి పలువురు మహిళా ప్రతినిధులూ కీలకపాత్ర వహించారు. అవతారిక సహా అధికరణాలు, షెడ్యూళ్లు ప్రకారం` పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం లభించాయి. ప్రాథమిక హక్కులను అనుసరించి, ఇతరుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. అధికరణాలు (19 నుంచి 22 వరకు) ప్రకారం వాక్‌ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ, ప్రస్పుటీకరణలు అందరివీ. సర్వసహజంగానే ఈ అన్నీ మహిళా పౌరులకూ వర్తిస్తాయి. వీటిని పరిరక్షించాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రధానంగా శాసనస వ్యవస్థకు ఉంటుంది. అంటే పౌరుల ప్రాథమికాధికారాన్ని పదిలంగా ఉంచాల్సింది ప్రభుత్వాలే. కాకుంటే, మానవ హక్కుల ఉల్లంఘన దాపురించినట్లే!

న్యాయాలయమే వెన్నుదన్ను

తరుణీమణుల హక్కులను ఉద్దేశపూర్వకంగా హరించే ప్రయత్నాలు వివిధ స్థాయుల్లో కొనసాగుతున్నాయి. వీటికి నిదర్శనాలు ఏమిటన్నది తెలియనివారు ఎవ్వరూ ఉండరు. ఇది ఏ స్థాయి హింసో అర్థంకానంత అమాయకులు ఎందరుంటారు చెప్పండి? ఆడవారి ఆలోచనలు, అభిమతాలకు గుర్తింపు ఇంటా బయటా తక్కువని చెప్పేందుకు ప్రత్యేక సర్వేలవంటివి అవసరమే లేదు. పురుషుల సైగలు, మాటలు, చేతలు ఎన్ని రూపాల్లో ఉన్నా అదంతా హింసే! గౌరవానికి భంగం కలిగించడం కచ్చితంగా శిక్షార్హ నేరమే. చదువు, ఉపాధి, కుటుంబ అవసరాల కోసం బయటికొచ్చే స్త్రీలకు సాధింపుల పరంపరలు తప్పడం లేదు. ఇళ్లల్లో ఉండేవారినీ బాధల గాథలు వదలడం లేదు. విద్యార్థినుల నుంచి గృహిణుల దాకా, ఉదాహరిస్తే విషాద చరితలు అనంతం. ఐదేళ్ల కిందట సరిగ్గా డిసెంబరు నెలలోనే మహారాష్ట్రలోని నాగపూర్‌ ప్రాంతంలో ఒక సంఘటన. తినేందుకు ఏదైనా ఇస్తానంటూ 40 సంవత్సరాల వ్యక్తి ఓ బాలికను ఇంటికి తీసుకెళ్లి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎలాగో బయటపడిన బాధితురాలు అంతా వెల్లడిరచడంతో పోలీసులు రంగంలోకి దిగి, లైంగిక దాడుల నుంచి బాలలకు రక్షణ చట్టం నిబంధనల కింద కేసు నమోదుచేసి, న్యాయస్థానం ఎదుట నిందితుడిని బోనెక్కించారు. మూడేళ్ల కారాగారవాస శిక్ష పడినా, అప్పీలు తదుపరి పరిణామాలు అతడికి శిక్ష తగ్గేలా చేశాయి! శరీరాలు తాకకపోతే అది లైంగిక నేరం కాదని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును పరమోన్నత న్యాయస్థానం ఇటీవలే కొట్టి వేసింది. వాంఛ కలిగి ఉండటమూ తప్పిదమేనని తేల్చి చెప్పింది. శాసన లక్ష్యాన్ని చట్ట సభ సృష్టీకరించినప్పుడు, న్యాయస్థానాలు ఎటువంటి సందిగ్ధతనూ సృష్టించలేవని సుప్రీం ప్రకటించింది. ఇంత ప్రస్ఫుటంగా ఉన్నప్పుడే అమ్మాయిలకు హింస నుంచి పరిరక్షణ.

నాయకులకో మాట

శాసన వ్యవస్థలో స్పష్టత, పాలక రంగంలో క్రియాశీలత ఉంటే హక్కుల ఉల్లంఘనలు జరగవు. ఇంటి దీపాలకు కంటి రెప్పల్లా ఉంటామని ప్రకటనలు గుప్పించే ప్రభుత్వాలు, వాటి నాయకులు మాటమీదనే నిలబడాలని భారతీయ విద్యార్థిని మొన్న అంతర్జాకీయ వేదికమీద విన్నవించింది. ఆ సందర్భ అంశం వేరైనా, ప్రస్తుత దేశీయ పరిస్థితికీ అన్వయించవచ్చు. పట్టుమని పదిహేనేళ్లయినా లేని వినీష తమిళనాడు బాలిక. దేశాల అగ్రనేతలు హాజరైన సదస్సులో మాట్లాడుతూ అందరు నాయకులకూ విన్నపం చేసింది. ‘నేను కోరేది ఒక్కటే. మా బంగారు భవితకు అందరూ కృషి చేయాలే కానీ, హామీలతో ఇంకా కాలం గడపవద్దు’ అని. ఇవే మాటలను ప్రస్తుతంతో పోల్చి చూస్తే, అమ్మాయిల మొదలు గృహిణుల వరకు ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవ పరిరక్షణనే కోరుకుంటారు. హింసా ద్వేషాలకు తావులేని వాతావరణాన్నే అభిలషిస్తారు. వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వాలన్నీ భరోసా నిస్తున్నాయి. విచారణ సత్వరం పూర్తయ్యేలా చేసి, నేరగాళ్లకు కఠిన శిక్షలు పడేలా చూస్తామంటున్నాయి. రెండేళ్ల నాడు డిసెంబరులో తెలంగాణ సంఘటన దరిమిలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమూ కార్యాచరణ దిశగా ముందుకొచ్చింది. తెచ్చిన చట్ట సవరణలను బట్టి అత్యాచార సంబంధిత కేసుల్లో నిశ్చయ ఆధారాలు లభిస్తే, మూడువారాల లోపలే ముద్దాయిలకు అంతిమ శిక్ష పడుతుంది. ఈ మేరకు నేరశిక్షా స్మృతిలోని 173, 309 సెక్షన్లను సవరించడంతోపాటు, భారత పీనల్‌ కోడ్‌లో అదనంగా చేర్చారు. ఆ సెక్షన్లు 354 (ఇ)Ñ 354 (ఎఫ్‌), చట్ట నిబంధనల అమలుకు ఏపీ రాష్ట్ర స్థాయిన మహిళా అధికారుల నియామక ప్రక్రియలూ పూర్తిచేశారు. ప్రత్యేక పోలీసు ఠాణాల ఏర్పాట్లూ నిర్వర్తించారు. హింసా సంబంధ నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు నెలకొల్పాలన్నదీ చట్టంలోని మరో ప్రతిపాదన.

చట్టసభలతోనే రక్షణ

వీటన్నిటికీ జతగా; మహిళలకు గౌరవభంగం కలిగే పోస్ట్‌లు చేసే వ్యక్తులపైనా (మెయిల్‌, సామాజిక` డిజిల్‌ మాధ్యమాల్లో) కఠిన చర్యలు చేపట్టాలని చట్ట నిబంధనలు చెబుతున్నాయి. తొలిసారి తప్పిదానికి రెండు సంవత్సరాలు, మళ్లీ అదే దోషానికి పాల్పడితే అంతకు రెట్టింపుగా శిక్షలు విధించాలంటున్నాయి. దిశ చట్టమనేది ప్రచారానికో, ఆర్భాటానికో తెచ్చింది కాదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మహిళల భద్రతకే ప్రథమ ప్రాధాన్యమని అంటోంది. అన్ని రకాల హింసల నుంచీ వనితలను రక్షించే ఈ కృషిని ‘రాజకీయం’ చేయవద్దని కోరుతోంది. తెలంగాణలోనూ రక్షణ విధానాలను ప్రభుత్వం ముమ్మరం చేస్తూ వస్తోంది. ప్రత్యేక సమాచార వ్యవస్థను రూపొందించడం ద్వారా భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. వేధింపు, లైంగిక హింస, ఇతర నేరాలకు పాల్పడితే ఉక్కుపాదం మోపి తీరతామంటోంది. గృహహింసను అరికట్టడానికి విభిన్న స్థాయుల్లో ప్రయత్నాలు సాగిస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలు తమవంతు పాత్రను నిర్వర్తిస్తూ వస్తున్నా, ఆత్మపరిశీలన తృణావసరం. శాసనసభల సమావేశాల తీరు తెన్నులు గమనిస్తుంటే, స్వయం నియంత్రణ ప్రాధాన్యం తెలియడం లేదూ? అంతా చట్ట సభల చేతుల్లో, చేతల్లో ఉంది.

– వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌

By editor

Twitter
Instagram