– నిదానకవి నీరజ

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన

ఆఫీసు నుంచి ఇంటికొచ్చాను. ఫ్రెష్‌ అప్‌ అయి ఇలా కుర్చీలో కూర్చు న్నాను.. అలా ఘుమఘుమలాడే కాఫీ కప్పుతో ప్రత్యక్షమయింది, నా శ్రీమతి శాంతి. నా భార్య అడగక ముందే కాఫీ తెచ్చిందంటే ఏదో విషయం ఉందన్న మాట అనుకుని కాఫీని ఒక్క సిప్‌ ‌చేశానో లేదో వెంటనే ప్రొద్దున నేను చెప్పిన విషయం ఏం చేశారండీ.. అంటూ మొదలుపెట్టింది శాంతి. నేను రిలాక్స్ ‌మూడ్‌లో ఉన్నాను. ఎంత ఆలోచించినా ఆమె చెప్పిన విషయం ఏమిటో అన్న సంగతి తట్టనే లేదు. అదేనండీ మన చింటూ గాడికి టెన్నిస్‌ ‌నేర్పించే విషయం. ఓ ఆ విషయమా నేను మరిచిపోయాను. ఇప్పుడు బానే ఉన్నాడుగా. అయినా టెన్నిస్‌ ‌నేర్పించడం అంత అత్యవసరమా? అన్నాను. అయ్యో రామా మీరేకాలంలో ఉన్నారండి, మీవన్ని పాతకాలం ఆలోచనలు. ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి టెన్నిస్‌ ‌నేర్పిస్తే మీ ఆస్తులేవన్నా కరిగిపోతాయా? అరిగిపోతాయా? అంది. టెన్నిస్‌ ‌నేర్చుకోకపోవడం వల్ల జరిగే నష్టం ఏమిటి, ఒక వేళ టెన్నిస్‌ ‌నేర్చుకుంటే కలిగే లాభం ఏమిటి? అన్నాను. టెన్నిస్‌ ‌వల్ల పిల్లవాడికి ఏకాగ్రత పెరుగుతుంది. బాబు కుదురుగా ఉంటాడు. శారీరక ధృడత్వం కలుగుతుంది. ఇంకా బోలెడు లాభా లున్నాయి. అయినా ప్రతి విషయం మీకు వివరించి చెప్పాలంటే ఎక్కడ కుదురుతుంది అంది. ఆసక్తి ఉంటే వాడే అడగొచ్చు కదా మధ్యలో నీ రాయబారాలేమిటి అన్నాను. చిన్నపిల్లాడు వాడెలా అడుగుతాడండి అంది. సరేలే ఆలోచిద్దాం అని అక్కడితో చర్చను ఆపు చేశాను.

రాత్రి భోజనాల తర్వాత టీవీ చూస్తున్నాను.

సెల్‌ ‌మోగింది. ఎవరా! అంటే మా మామగారు. మా మామగారు మాధవరావు రైల్వేలో పెద్ద ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆయన దగ్గర ఉద్యోగిగా ఉన్న నాకు వాళ్ల కూతురునిచ్చి పెళ్లి చేశారు. మా మామగారంటే నాకు ఇప్పటికి భయం, భక్తీను. ఫోన్‌ ఎత్తి నమస్కారం మామగారు అన్నాను. ఏమయ్య అల్లుడు, ఎలా వున్నావు? చింటుగాడు టెన్నిస్‌ ‌నేర్చు కుంటానంటే వద్దన్నావంట కదా అమ్మాయి చెప్పింది.. అయినా ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోరిక తీర్చలేని నువ్వేం తండ్రివయ్య. మా రోజుల్లో ఐదుగురు పిల్లలను మేం ఎలా పెంచామో ఒక్కసారి ఆలోచించు. ఈ తరం తండ్రంటే చాలా మెడ్రన్‌గా ఉండాలోయ్‌. ‌పిల్లల ఆశలు తీర్చాలి. ఆలోచనలు గౌరవించాలి. నీతో కాకపోతే చెప్పు. ఆ డబ్బేదో నేనే పంపుతాను అన్నాడు. అయ్యో మామగారు అలా అనకండీ నేను ఉండగా మీకెందుకండీ శ్రమ. చింటూను తప్పకుండా టెన్నిస్లో చేరుస్తాను అన్నాను. అప్పటికి ఆయన శాంతించి ఫోన్‌ ‌పెట్టేశాడు. నా శ్రీమతి చేసిన పనికి చిరాకేసింది. ప్రతి చిన్న విషయాన్ని తండ్రికి చెపుతుంది. ఆయనేమో నన్ను వాయించి వదలి పెడ్తాడు. నా భార్యకు నేను మొగుణ్ణి. నాకేమో మా మామగారు మొగుడు.

ఈ నేర్పించడం అనే ప్రహసనం మా చింటుగాడు రెండేళ్లు ఉన్నప్పుడు ప్రారంభమయింది. రెండేళ్ల మా బాబు మీద నా శ్రీమతి పాండిత్య ప్రకర్ష మొదలైంది. రెండేళ్ల బాబుకి ఒక వంద దేశాలు – రాజధానులు, రాష్ట్రాలు రాజధానులు నేర్పింది. ఇంటికి ఎవరైనా రావడం ఆలస్యం వారి ముందు మా వాడి ప్రతిభా ప్రదర్శించేది. ఎవరు రాకపోతే తనే అందరిని పిలిచి కాఫీ, టీలు సరఫరా చేసి మరి మా వాడి ఘనతను తెలియజేసేది. ఫలితంగా కాఫీ, పంచదారల ఖర్చు తడిసి మోపెడు అయ్యేది. ఏవన్న అంటే ఏవండి మనవాడి గొప్ప నలుగురికి తెలియాలి కదా అనేది. స్కూల్‌లో వేసిన తర్వాత ప్రతి కల్చరల్‌ ‌పోగ్రామ్‌లో మా బాబు విధిగా పాల్గొనేవాడు. వాడికి నచ్చినా నచ్చకపోయినా తల్లి కోరిక మేరకు వాడు పాల్గొనవలసిందే. స్కూల్‌ ‌వాళ్లు ప్రతి పోగ్రామ్‌కు డబ్బు వసూలు చేసేవారు. రిహార్సులకు మా భార్య రోజూ వెళ్లేది. బాబు ఇలా డాన్స్ ‌చేస్తున్నాడండీ, అలా చేస్తున్నాడండీ అని వర్ణించి వర్ణించి చెప్పేది. అప్పుడప్పుడు పికప్‌ ‌చేసుకోవడం కోసం నేను వెళ్తే క్లాస్‌ ‌టీచర్‌ ‌కూడా అలాగే చెప్పేది. నిజమే కాబోలు అనుకుని స్కూల్‌ ‌డేకు వెళ్లాను. అన్ని క్లాసుల పిల్లలు రకరకాల డ్యాన్సులు చేశారు. చివరగా నర్సరీ పిల్లల డ్యాన్స్ అనగానే కెమెరా సర్దుకుని నిలబడ్డాను, ఫొటో తీయడానికి. ఇంతలో మ్యూజిక్‌ ‌స్టార్ట్ అయ్యింది. కింద నుంచి టీచర్స్ ‌డ్యాన్స్ ‌మూమెంట్స్ ‌చూపించి నప్పటికి కొంత మంది పిల్లలు తమకు తోచిన విధంగా చేస్తున్నారు. మరికొంత మంది పిల్లలు అదీ చేయలేక ఊరికే నిలబడ్డారు. నిలబడ్డవారిలో మా బాబు ఉన్నాడు. నా కప్పటికి జ్ఞానోదయం అయింది. అందరు పేరెంట్స్‌తో స్కూల్‌ ‌డే ఫీజు కట్టించడానికి ఆ టీచర్‌ అం‌దరికి అదే చెప్పిందని.

బాబు ఒకటవ తరగతికి వచ్చాడు. టి.వి.లో ఎవరో గణితంలో బాల మేధావి ఇంటర్వ్యూ చూసింది నా భార్య. అంతే బాబుకు అబాకస్‌ ‌నేర్పాలని పట్టు పట్టింది. ఇంటర్నెట్లో జల్లెడ పట్టి మా ఏరియాకు దగ్గర్లో ఉన్న ఒక సెంటర్‌ను కనిపెట్టింది. శని, ఆదివారాలు వారానికి రెండు క్లాసులు ఉంటాయని రెండు వేలు కట్టి అందులో చేర్చింది. ఫీజు కట్టగానే ఒక బ్యాగు, రెండు వర్క్‌బుక్స్, ఒక అబాకస్‌ ఇచ్చారు. ఇంటికి రాగానే వేళ్ల మీద లేదా నోటితో సులభంగా చేయగలిగే లెక్కలను బాబుతో అబాకస్‌పై చేయించి బాబు అప్పుడే గణితంలో బాలమేధావి అయినంత సంబరపడింది నా భార్య. మా బాబును ఆదివారాలు అబాకస్‌కు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాపై పడింది. కొన్ని రోజులు నేను ఆ డ్యూటీ చేశాను. శనివారాలు మాత్రం తనే వెళ్లేది. కొన్ని ఆదివారాలు కూడా. అబాకస్‌ ‌టీచర్‌ ‌వసంత గాయత్రి గారు వాళ్ల ఫ్యామిలీ, వాళ్ల అమ్మనాన్నలతో కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. క్లాసులు అదే ఇంట్లో ఒక రూమ్‌లో జరిగేవి. వసంత గారి తండ్రి రైల్వేలో పనిచేసి రిటైర్‌ అయ్యారట. ఇంకేముంది. మీరు రైల్వే, మేము రైల్వే అని కబుర్ల పరంపర ప్రారంభమయింది. అచిరకాలం లోనే గాయత్రి గారికి వారి తల్లిదండ్రులకు నా శ్రీమతి ఆప్తమిత్రులరాలైంది. మీ చీరలు ఎక్కడ కొంటారు, నగలు ఎక్కడ చేయిస్తారు. సరుకులు ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఫలానా సినిమా బాగుంది. అమ్మాయి ఆదివారం అనుబంధం ఫజిల్‌లో ఈ గడి కాస్త చూడమ్మ.. వగైరా వగైరా కబుర్లు. ఫలితంగా ఫస్ట్ ‌లెవెల్‌లో మా వాడికి అబాకస్‌ ‌పరీక్షలో మంచి మార్కులు రాలేదు. ఏమిటది శాంతి, అబాకస్‌కు బాబు కోసం వెళ్తున్నావా? లేదా నీ బాతాఖాని కోసం వెళ్తున్నావా అంటే, నెక్సట్ ‌లెవల్లో చూడండి పిల్లాడు వెలిగి పోతాడు అంది.

కాని నెక్సట్ ‌లెవల్లో చప్పగా చల్లారిపోయాడు వాడు. ఇంకేం చేస్తుంది. మరో అబాకస్‌ ‌సెంటర్‌లో చేర్చింది. కొన్ని రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత మా బాబు వెళ్లనని పట్టుబట్టడంలో ఆ అబాకస్‌ ‌కథ అంతటితో ముగిసింది.

కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి. స్వాతంత్య్ర దినోత్సవం నాడు బాబుతో పాటు స్కూల్‌కెళ్లిన మా ఆవిడ అక్కడ పిల్లలు పాటలు పాడటం, కీ బోర్డు వాయించడం చూసి బాబుకు సంగీతం నేర్పించాలని నిర్ణయించుకుంది. నిజానికి నా భార్య వీణా పాణి. వీణలో డిగ్రీ చేసింది. అయినప్పటికి పెళ్లి చూపుల్లో తప్ప మరోసారి ఆమె వీణ వాదన నేను వినలేదు. ఇప్పుడు బాబుకు సంగీతం అంటే నువ్వే నేర్పొచ్చు కదా అన్నాను. అంతే నా భార్య నా మీద ఇంతెత్తు ఎగిరిపడింది. నేను నేర్చు కున్నది కర్ణాటక మ్యూజిక్‌. ‌వాడికి నేర్పించాలను కుంటున్నది వెస్ట్రన్‌ ‌మ్యూజిక్‌ – ‌కీబోర్డు ఆ మాత్రం తేడా తెలియదా అంటూ నా మీద విరుచుకుపడింది. ఫలితంగా మా బాబును కీ బోర్డులో జాయిన్‌ ‌చేశాము. పెద్ద కీబోర్డు కూడా కొన్నాము. ఆరు నెలల తరువాత మా బాబు ఆ క్లాసు మానడం, కీ బోర్డు మూల పడవేయడం జరిగింది.

కొన్ని రోజులు హాయిగా, ఆనందంగా జరిగాయి. ఇదిగో ఇప్పుడు ఈ టెన్నిస్‌ ‌గోల ప్రారంభమయింది. మా కాలనీలోనే ఐదు వందల గజాల ఖాళీ స్థలాన్ని లీజుకి తీసుకుని చదును చేసి టెన్నిస్‌ ‌కోర్టుగా మార్చాడు ఆ సారు. ఆ కోర్టు రోడ్డుకు దగ్గర ఉండటం, దగ్గర్లో రెండు పేరు పొందిన స్కూళ్లు ఉండటం సారుకి కలిసి వచ్చిన అంశాలు. మా శాంతి వెళ్లడం. సార్‌ని కలవడం. ఆయన డెమో క్లాస్‌ ‌పేరిట శాంతి ముందే మా పిల్లవాణ్ణి గంట టెన్నిస్‌ ఆడించడం, రేపు మీ నాన్నాగార్ని నన్ను కలవమను అని బాబుకు చెప్పడం అన్ని చకచకా జరిగిపోయినవి. శాంతి నేను ఇంటికొచ్చిన దగ్గరనుండి ఒకటే పనిగా టెన్నిస్‌ను పొగడటం, సార్‌ని పొగడటం, బాబుని పొగడటం.. ఏవండి మీరు తప్పక సార్‌ని కలవవలసిందే అని ఆర్డర్‌ ‌వేసింది. ఏం చేయగలం. అనుకున్న ప్రకారం మరునాడు సార్‌ని కలిశాను. మా వాడు టెన్నిస్‌ ఆడటం చూశాను. సార్‌ ‌నాతో అన్న మొదటి మాట- సార్‌ ‌మీ బాబు బాగా పొడవు, టెన్నిస్‌లో పొడవుగా ఉండటం ఒక ప్లస్‌. అదీ గాక బాబు చాలా షార్ప్‌గా ఉన్నాడు. తొందరగా గ్రహిస్తున్నాడు. కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటే తొందర్లోనే మంచి పొజిషన్‌కి వెళ్తాడు అన్నాడు. అతని మాటలు విని నాకు కొంత ఆనందం వేసింది. ఆనక తెలిసింది, కొత్తగా వచ్చిన ప్రతి పేరెంట్‌తో సార్‌ ఆ ‌మాటే చెబుతాడని. తర్వాత ‘సార్‌ ‌మీకు తెలియంది ఏముంది టెన్నిస్‌ అనేది ఖర్చుతో కూడుకున్న ఆట. టెన్నిస్‌ ‌రాకెట్‌ ‌బ్యాట్‌ ‌ఖరీదు కొంచెం ఎక్కువే. నెల రోజుల దాకా మేమే ఇస్తాం. తర్వాత మెల్లగా కొందురు గాని. ముందు షూస్‌ ‌కొనాలి’ అన్నాడు. స్పోర్టస్ ‌షూస్‌ ‌కదా మా వాడికి ఉన్నాయి అన్నాను. కాదు సార్‌ ‌టెన్నిస్‌కు ప్రత్యేకంగా షూస్‌ ‌దొరుకుతాయి. వాటిని ఫలానా షాప్‌లో కొనండి అని నంబర్‌ ఇచ్చాడు. నెల రోజుల తర్వాత మూడు వేలు పోసి రాకెట్‌ ‌కొన్నాం. షూస్‌ ‌కొన్నాం, బాబు రోజు టెన్నిస్‌కు వెళ్తున్నాడు. శాంతి రోజుకో డ్రస్‌ ‌వేసుకోవడం, నీట్‌గా తయారవ్వడం, బాబుతో కూడా వెళ్లడం చేస్తుంది.

ఒకరోజు ‘శాంతి టెన్నిస్‌ ‌కోర్టు ఇంటికి దగ్గరే కదా. బాబు ఒక్కడే వెళ్లివస్తాడు, అంతదానికి రోజూ నువ్వు వెళ్లడం దేనికి? అన్నాను. అంతే. ఏవండీ ఏ లోకంలో ఉన్నారు? రోజు పేపర్‌లో చదవడం లేదా? పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయని, పిల్లవాణ్ణి ఎత్తుకుపోయిన తర్వాత అప్పుడు ఏం చేయలేం. అందుకే ముందు జాగ్రత్త పడాలి అంది. నిజమే కదా అన్పించింది. బాబు టెన్నిస్‌కు వెళ్తున్న రోజు నుంచి శాంతి రాత్రి పూట వంట చెయ్యడం అరుదుగా జరుగుతుంది. ఏం అంటే అలసిపోయాను అంటుంది. ఇంకేం చేస్తాం, కర్రీస్‌ ‌బయట నుంచి తెచ్చి సర్దుకుంటున్నాం. ఈ వంట చేసే టైమ్‌లో శాంతి సెల్‌ ‌ఫోన్లో వాట్సప్‌ ‌చూడటంలో మునిగి పోతుంది. వాట్సప్‌ ఏం‌టి శాంతి అంటే, మీకు చెప్పనే లేదు కదండీ టెన్నిస్‌కు పిల్లల్ని తీసుకువచ్చే వాళ్లమంతా కలిసి ఒక వాట్సప్‌ ‌గ్రూప్‌గా ఫామ్‌ అయ్యాము అంది. ఎందుకు అన్నాను, చిరాగ్గా. ఎందుకంటారేమిటండీ క్లాస్‌ ఎప్పుడుందో ఎప్పుడు లేదో తెలియనవసరం లేదా? అంది. నిజమే అనుకున్నాను.

ఒక రోజు ప్రొద్దున్నే శాంతి నా దగ్గరికొచ్చి ఏవండి చిలుకూరు బాలాజీ టెంపుల్‌కెళ్తున్నాను అంది. ఆమె మాట సరిగ్గా వినని నేను నాకెలా కుదురుతుంది శాంతి? అన్నాను. మీకు కుదరాల్సిన అవసరం ఎందుకండీ అంది. మరి ఎలా వెళ్తావు అంటే టెన్నిస్‌ ‌గ్రూప్‌ ఆడాళ్లమంతా కలిసి వెళ్తున్నాం అంది. మరోసారి టెన్నిస్‌ ‌గ్రూప్‌ ఆడళ్లంతా కలిసి ఫంక్షన్‌ ‌కెళ్లారు. ఇంకోసారి సినిమాకెళ్లారు. ఒక్కసారి షాపింగ్‌ ‌కెళ్లారు. ఇదంతా చూసి టెన్నిస్‌ ‌మా బాబుకో, మా శాంతికో అర్థం కాలేదు.

ఒకసారి బాబును టెన్నిస్‌ ‌కోర్టు వద్ద దింపి నేను అక్కడే వెయిట్‌ ‌చేస్తున్నాను. టెన్నిస్‌ ‌కోర్టులో ఇరవై మంది పిల్లలదాకా ఉన్నారు. కోర్టు చుట్టూ ఉన్న గ్యాలరీల్లో ఈ పిల్లల తాలూకు తాతలు, బామ్మలు, అమ్మమ్మలు, తండ్రులు, తల్లులు కూర్చుని గత వంద సంవత్సరాలుగా మనిషి ముఖం చూడనట్లు, మనిషితో మాట్లాడనట్టు ఒకరితో ఒకరు ఆబగా, ఆత్రంగా ప్రపంచాన్ని మరచి కబుర్లు చెప్పుకుటున్నారు. నేను ఒక తాతగారితో మాటలు కలిపాను. సంవత్సర కాలంగా ఇద్దరు మనవలను ఇక్కడికి తీసుకొస్తున్నాడట. మరి పిల్లలు బాగా నేర్చుకున్నారా? అన్నాను. ఎక్కడండి బాబు, సార్‌ ‌కొత్త పాఠం నేర్పితే కదా ప్రాక్టీస్‌ ‌ప్రాక్టీస్‌ అం‌టూ అదే ఆడిస్తాడు అన్నాడు. మరి మాన్పించలేకపోయరా అంటే ఇంట్లో వీళ్ల అల్లరి భరించలేక వీళ్ల అమ్మనాన్న వీళ్లని ఇందులో వేశారు అన్నాడు. ఏ మాట కామాట చెప్పుకోవాలి బాబు. ఒక్కరోజు ఇక్కడికి రాకపోయినా నాకు ఏం తోచదు అన్నాడు. ఒక అబ్బాయి తల్లి దగ్గరికెళ్లి మాట్లాడాను. ఆమె రెండు సంవత్సరాలుగా బాబుని తెస్తుందంట. మరి బాబుకు ఏమైనా ఆట వచ్చిందా అంటే సార్‌ ‌పట్ల ఆమె కూడా అసంతృప్తిని వ్యక్తంచేసింది. మరి మాన్పించలేకపోయారా అంటే.. నేను వర్కింగ్‌ ఉమెన్‌ ‌నండీ స్కూల్‌ ‌తర్వాత బాబును చూసే వాళ్లు లేరు. అందుకు బాబును ఇక్కడ జాయిన్‌ ‌చేశాను అంది.

మరోపిల్లాడి తండ్రిని పలకరించాను. పిల్లాడికి ఆట అంటే ఇష్టామా అన్నాను. ఇష్టమా, పాడా? ఇంట్లో ఉంటే ఎప్పుడు టి.వి. లేదా ట్యాబ్‌ ‌లేదా సెల్‌ఫోన్‌ ‌వీటి మీదే వాడి ధ్యాస. అందుకే వాణ్ణి ఇందులో బంధించాను. ఇప్పుడు హాయిగా ఉంది అన్నాడు. అక్కడ నాలుగేళ్లు, నాలుగున్నర సంవత్స రాలు ఉన్న పిల్లలు కూడా ఆడుతున్నారు. వాళ్లు రాకెట్‌ ‌కూడా సరిగ్గా పట్టుకోలేక పోతున్నారు. మరి వీళ్ల తల్లిదండ్రులు ఎందుకు చేర్పించారో అర్థం కాలేదు. అదే విషయం సార్‌ని అడిగాను.

దానికి సార్‌ ‌నాలుగున్నర సంవత్సరాల బాబు పేరు కుశల్‌. ‌వీళ్ల బంధువుల్లో ఎవరో టెన్నిస్లో అండర్‌ ‌సిటీలో ఛాంపియన్‌ అయ్యాడట. వీళ్ల తల్లిదండ్రులకు వీడు అలా కావాలని ఆశ. అందుకే  ప్రొద్దున ఐదున్నర నుంచి ఆరున్నర క్లాసుకు తీసుకొస్తారు. ఇంకొకడు క్రిష్‌. ‌వాడిది ఇదే పరిస్థితి. నిజానికి ఆరు సంవత్సరాల వయసు పిల్లలకు ఏం చెపుతున్నామో అర్థం అవుతుంది. వీళ్లకు ఏమి అర్ధం కాదు. కానీ వాళ్ల పేరెంట్స్ ‌మాత్రం మీరు చెప్తూ వెళ్లండి సార్‌ ‌వాళ్లే అర్ధంచేసుకుంటారు అంటారు. వాళ్లేమో నిద్రలో జోగుతుంటారు. తల్లిదండ్రుల ఆశలకు వీళ్లు బలి. కుశల్‌ ‌వాళ్లు వెజిటేరియన్‌ ‌ఫ్యామిలీ. అయినా పిల్లవాడు ఛాంపియన్‌ ‌కావాలని రోజు బాయిల్డ్ ఎగ్‌, ‌నాన్‌వెజ్‌ ఇస్తున్నారు. ఇన్ని డైఫ్రూట్స్ ‌కూడా తినిపిస్తారు అని చెప్పాడు. వీళ్లే కాదు ఇలాంటి పిల్లలు మా దగ్గర పది మంది దాకా ఉన్నారు అన్నాడు. అవాక్కయ్యాను నేను.

పక్కనే ఉన్న మరో సార్‌ ‌రవి పిల్లలకు కొత్త పాఠం ప్రారంభించాడు. ఇంతలో నాతో మాట్లాడిన సూర్య సార్‌ ‘‌రవి ముందు పిల్లలతో ప్రాక్టీసు చేయించు. అది ముఖ్యం’ అని కొత్త పాఠం ఆపు చేశాడు. ఇంతలో వంశీ అనే బాబు నన్ను పలకరించాడు. ఎన్ని సంవత్సరాలుగా నేర్చుకుంటున్నావు బాబు అన్నాను. నాలుగు సంత్సరాలుగా నేర్చుకుంటున్నాను అంకుల్‌ అన్నాడు. నాకేమో టెన్నిస్‌ అం‌టే ఇష్టం. సార్‌ ఏమో సరిగా నేర్పడు. కొత్త కోచ్‌ ‌కోసం వెతుకుతున్నాను అంకుల్‌. ‌నా కనిపిస్తుంది ఆట మీద ప్యాషన్‌ ఉన్న కోచ్‌ అయినా దొరకాలి లేదా కోచ్‌కు పిల్లలుగానైనా పుట్టాలి. ఈ రెండు సందర్భాల్లోనే ఛాంపియన్స్ అవుతారు అంకుల్‌ అన్నాడు. వంశీ మాటలు అక్షర సత్యాలనిపించాయి. ఇక్కడకు వచ్చే వాళ్లలో చాలా మందికి ఇది ఒక టైమ్‌ ‌పాస్‌. ‌చెప్పే కోచ్‌లకు డబ్బు యావ తప్ప సీరియస్‌నెస్‌ ‌లేదు. వీళ్ల ఇద్దరి మధ్య వంశీ లాంటి పిల్లలకు అన్యాయం జరుగుతుంది. తల్లిదండ్రుల నెరవేరని కలలని పిల్లల మీద బలవంతంగా రుద్దటం వల్ల అక్కడ చాలా మంది పిల్లలు తమ ఇష్టాలతో సంబంధం లేకుండా తల్లిదండ్రుల ఆశలు తీర్చడానికి, కలలు నేరవేర్చ డానికి, తమ చిట్టి భుజాల మీద ఆకాశమంత బరువు మోస్తున్నారనిపించింది నాకు.

About Author

By editor

Twitter
Instagram