– డా. చింతకింది శ్రీనివాస్‌

‌జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


ఇక్కడికి ఈ పర్వాన్ని శాంతిమయం చేసి సవరించకపోతే ప్రమాదమేదో వచ్చినా రావచ్చునన్న జ్ఞానంతో ప్రణవులవారే ముందుగా మేల్కొన్నారు. నందపురం వెళ్లి పెళ్లి మాటలు ఆడివచ్చింది ఆయనే కదా. ఆ చనువూ గన్నిక విషయంలో ఆయనకు ఉండనే ఉంది. అందుకనే,

‘‘మహారాణీ! మీ మానసం ఎందుకు కించ పడిందో చూచాయగా అంచనా కట్టాను. ఇవాళ మీకు రాచధర్మాలన్నీ ఉపదేశించే ప్రయత్నానికి దిగను. అయినప్పటికీ కొత్త దేశానికి అలవాటుపడే ప్రయత్న మేదో మీరూ చేయవలసి ఉంది. రేపటి సింహాసనానికి యువరాజును అందించవలసింది మీరేకదా!’’ కర్ర విరగని, పాము చావని మోస్తరున నెమ్మదిగా భాషించాడు.

ప్రణవశర్మ పట్ల గన్నియకు గౌరవం ఉంది. ఆయన రాజభక్తి మీద నమ్మకముంది. అయినప్పటికీ ఆ రోజు ఆమె పడుతున్న సంఘర్షణ చెప్పనలవి కానిది. కాబట్టే ఎంత సుతిమెత్తగా మాట్లాడాలను కున్నా వీలుకాలేదు. ఫలితంగానే,

‘‘నేనడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం రాబట్టాలనేదే నా లక్ష్యం. నేనెందుకు మొత్తుకుంటు న్నానో మీకు తెలిసే ఉంటుంది.’’ వర్రవర్రగానే మాట్లాడింది. ప్రణవశర్మ తొట్రుపాటు పడలేదు.

‘‘భూముల కొనుగోళ్ల మీద మీరేదో అన్నారని రాజమాత చెప్పుకొచ్చారు.’’ నెమ్మదిగా అన్నాడు.

‘‘వారు చెప్పింది నిజమే. భూములు అమ్మడం ఏంటి? కొనడం ఏంటి? దున్నేవాడికే అవి దక్కాలి కదా! ఇదేం రాజ్యమండీ బాబూ? పత్రాలేంటి? నాణాలేంటి? మా దేశంలో ఇవన్నీ ఎరగం. కొంత మంది మాత్రమే సొంత ఆస్తులు పెంచుకుంటూ పోతే పేద ప్రజలు మరింతగా నిర్భాగ్యులవుతారు. కొందరి దగ్గరే నేలతల్లి పోగుబడితే దేశం నాశనం అయిపోతుంది. స్వార్థపరులు కండపడతారు.’’ కొరకొరలాడింది గన్నియ.

‘‘మరి భూముల క్రయవిక్రయాలు లేకపోతే సర్కారు బొక్కసం నిండేదెలా?’’ మెత్తని గద్దె మీదనుంచి అదాటున లేచి మందిరానికున్న కిటికీవైపు విసవిసాపోతూ ఎకసెక్కంగా వగచాడు దేవేంద్రుడు. దీంతో గన్నియ ఇంకింతగా పెరపెరలాడిపోయింది.

‘‘రైతుల ముక్కు పిండి వసూలుచేస్తున్న పంటల మీది పన్నులు ఏం చేస్తున్నారు? వ్యవసాయోత్పత్తులపై వేసిన సుంకాలు ఎవరు దిగమింగుతున్నారు?’’ వెటకారంగానే సమాధానమిచ్చింది.

మహారాజు, మహారాణీ భార్యాభర్తలుగా కాకుండా అధికార, విపక్షాల్లా విరగబడు తుండటంతో పూర్ణిమాదేవి కనలిపోయినట్టుగా అయింది. ఆ మంటలను ఆర్పమన్నట్టుగా ప్రణవయ్య కళ్లల్లోకి దీనంగా చూసింది. ఆయన మరో దఫా జోక్యం చేసుకున్నాడు.

‘‘భూములన్నీ సేద్యం చేసేవాడి పరమైపోతే రాజునెవరు పట్టించుకుంటారో చెప్పండమ్మా!’’ చిన్నగా అన్నాడు.

‘‘ఎవరు పట్టించుకోవాలండీ? అసలెందుకు పట్టించుకోవాలి! రాచరిక వ్యవస్థ సరళంగా సమాజాలను నడిపించిననాడే పౌరుల క్షేమం సాకారమవుతుంది. అంతర్గత, బాహిర భద్రత, వైద్యం, విద్య, సైన్యం ఇవి కాకుండా ఏ విషయాన్న యినా ప్రభుత్వం అసలెందుకు పట్టించుకోవాలి? పెద్దచదువులు చదివిన నాగరికులు కదా మీరంతాను. మా కొండరాజ్యం కంటే తీసికట్టుగా అఘోరిస్తున్నారే.’’ విరుచుకుపడింది గన్నియ. ఇందుకు ప్రతిగా ఏదో మాట్లాడబోయిన దేవేంద్రుణ్ణి సైగలు చేసి మరీ ఆపేశాడు ప్రణవుడు.

‘‘సరేనమ్మా. మీ ఆలోచనలను మంత్రిపరిషత్తులో చర్చించి మంచి నిర్ణయం చేస్తాం. ఇంకా మీరు చేయదగిన ప్రస్తావనలు ఏమైనా ఉన్నాయా!’’ వందనంగా మంత్రి హోదాలో తెలుసుకోగోరాడు.

‘‘మీరు నన్ను అడగడం కాదు. ముందుగా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. వడ్డాదిరాజ్యంలో మగనాలిమెట్టలున్నాయా?’’ పంటిబిగువన ఆవేశాన్ని అణిచిపెట్టుకుంటూ గన్నియ ఇలా అనేసరికి దేవేంద్రునికి చిర్రెత్తుకొచ్చినట్టే అయింది. ప్రణవుల వారు మాట్లాడేందుకు సిద్ధపడుతున్నా ఆయనను ఆపేసి మరీ గోదాలోకి దిగిపోయాడు.

‘‘మీ కొండాళ్లలా మాకు మారుమనువులుండవు. రంకులమెట్టలు, బొంకులమెట్టలు అవసరం లేదు. మగనాలి మెట్టలకు చేరి తగవులు తీర్చుకోవడం, ఓలికి ముప్ఫయి.. ఆలికి అరవై.. లెక్కన తప్పులు కట్టుకోవడం మా జాతకాల్లోనే లేవు.’’ రోషప్రపూరితుడై పలికాడు. ఆ మాటలకు అరణ్యపు జెర్రిలా రెచ్చిపోయింది గన్నియ.

‘‘అవునవును. కొండవాళ్లలా ఉండే అదృష్టం మనకెందుకుంటుంది. మనమంతా నవీనులం. కులీనులం. పల్ల్లాల పండితులం. మరంచేతనే ఇష్టం ఉన్నా లేకున్నా ఇక్కడి ఇల్లాళ్లు మొగుళ్లతో కాపురాలు చేసి తీరాలి. తమను తామే మోసగించుకుంటూ సంసారాలు కానివ్వాలి. పిల్లల్ని కంటుండాలి.’’ భార్య ఇలా సెగరేగిపోవడంతో దేవేంద్రునికి ఎక్కడో ఏదో మంట అంటుకున్నట్టయింది. అప్పటివరకూ పొంకనాలు చూపించినవాడల్లా ఉన్నట్టుండి భవనపు కుడ్యానికి చేరగిలబడినట్టుగా నిలబడిపోయాడు.

మామూలుగా అయితే ఈ సమయంలో ఇంతకన్నా ఎక్కువగా గన్నియమ్మ మాట్లాడి ఉండక పోను. కానీ వడ్డాది రాజుల వక్రబుద్ధి ఒక్కొటొక్కటిగా తెలిసి వస్తుండటంతో తోకమీద లేచిన నాగులా బుసలుకొట్టింది. నోరు పెంచేసింది.

‘‘ఆహారనిద్రామైథునాలన్నవి సభ్యసమాజంలో వ్యక్తిగతమైనవి. ఇవి అదుపులో ఉండి తీరవలసిందే. అంతమాత్రం చేత మనసు చంపుకుని మగనితో తప్పని తద్దినంలా బతుకు వెళ్లదీయడమూ అన్యాయమే. పతివ్రతలకు వ్యవస్థలో చోటు ఉన్నట్టే, తాము ఎవరితో కలిసి బతకాలో నిర్ణయించుకునే మనుషులకూ స్థానం ఉండితీరాలి. బలవంతంగా చట్టాలు చేసి, పత్రాలు రాసి, ఆడామగలచేత ఏలికలే సంసారం చేయిస్తే అది ఇల్లు అనిపించుకోదు. నరకం అనిపించుకుంటుంది. భార్యాభర్తల తగవులు తీర్చడానికి తగుమనుషులు కూడే మగనాలిమెట్ట లేనినాడు అది దేశమే కాదు. ఇష్టంలేనివాడితో మనజాలనని, చిత్తమైనవాడితో కలిసిబతుకుతానని స్త్రీలు చెప్పలేని వ్యవస్థ ఉండినా మండినా ఒకటే. ఈ మాత్రం దానికి• కొరడాదెబ్బల శిక్ష కూడాను. మనసు మార్చలేని దండన శుద్ధదండగ. ఛ. ఛ. ఇదేం ఊరు. ఇదేం ఉనికి. దీనికంటే అడవి నయం.’’ విరసంగానే మనసు వెల్లడిచేసింది. దేవేంద్రుడయితే బొక్కబోర్లాపడినట్టుగా అయిపోయాడు. ఎప్పుడూ ఆలకించని సిద్ధాంతాలను తొలిసారిగా వింటున్నట్టూ కలవరపడ్డాడు.

ఇదేసమయంలో వడ్డాది రాజప్రాసాదపు తొలి పావంచాలో వేంచేసిన క్షేత్రపాలకుడు నరసింగరాజస్వామికి అర్చకులు సంధ్యాహారతి పడుతున్నారు. గట్టి మంత్రమై వారు చేస్తున్న వేదనాదాలు భక్తిప్రసారాలుగా మందిరంలోకి విచ్చేశాయి.

ఆపత్కాలంలో భగవంతుడే ఆదుకున్నాడని పూర్ణిమాదేవి ఆ పరిణామానికి సంబరపడింది. పీఠం నుంచి లేచి నిలబడి చేతులు జోడించి సింగమయ్యకు లోలోనే నమస్సులు అర్పించింది. సమయం కొంచెమైనా కరిగితే గన్నియమ్మ చల్లబడవచ్చునన్న విశ్వాసంతో ప్రణవయ్యా చేతులెత్తి మొక్కాడు. దైవమార్గమూ అప్పుడప్పుడు రాజనీతికి తోడ్పడు తుందన్న భావన హృదయానికి అంటగా లోలోనే స్థిమితపడ్డాడు. ఇదంతా చూసిన దేవేంద్రుడు బలమైన ఊపిరులు తీస్తూనే గోడకు చేరబడినవాడు చేరబడినట్టుగానే హస్తాలు ముకుళించాడు.

‘కొండపిల్లను అనవసరంగా కట్టుకున్నాను.’ భగవంతునికి జోరచేస్తూనే హృదయాన్ని కాగబెట్టు కున్నాడు.

పరమాత్ముడి సేవలో కొన్ని క్షణాలు మలిగి పోవడంతో అప్పుడిక గన్నియ శీతల అయినట్టుగా అయింది. ఇదే అదునుగా మాట్లాడేందుకు పూర్ణిమ ఉపక్రమించింది. వడ్డాది సింహాసనానికి భావి ప్రభువును దయచేయవలసిన గన్నియ అదుపుతప్పితే ప్రమాదమని తలంపుచేసి అనునయస్వరంతో,

‘‘మహారాణీ! నీ మనసు ఇక్కడి వారందరికీ తెలుసు. ఇరురాజ్యాల వికాసం కోసమే నంద, మత్స్యాలు ఆకులూ పోకలూ అందించుకున్నాయి. ఇక్కడ నువ్వయినా, అక్కడ నా బిడ్డ దేవేంద్రాలయినా రాజ్యవికాసం కోసం సలహాలు ఇవ్వవచ్చును. వాటిని ప్రభువులు పాటించనూవచ్చును. అంతమాత్రానికే ఇంత ఆవేశం తగునా?’’ వాణి వినిపించింది. అంతకు ముందటి జోరు లేకపోయినా మాట పెళుసును మాత్రం గన్నియ తగ్గించుకోలేకపోయింది.

‘‘ఆవేశం కాదత్తయ్యా. ఇది నా ఆవేదన. సామ్రాజ్యాలు రెండూ సుభిక్షంగా వర్థిల్లాలని మీరంటున్నారు. ఈ కుండమార్పిడి మనువులు చేసింది అందుకేనని చెబుతున్నారు. వాస్తవానికి అంతా ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. మీకు తెలుసో లేదో! శిలానదికి కాలువ తవ్వి నందరాజ్యం నీళ్లను మీ అబ్బాయిగారు అపహరిస్తున్నారు. వడ్డాది వేటగాళ్లు అనునిత్యమూ నందవనాల్లో చొరబడి వన్యప్రాణులను క్రూరంగా వేటాడుతున్నారు. ఏనుగు దంతాలు, దుప్పిచర్మాలు, పునుగులు, కస్తూరి కణికెలు ఎన్నని దోచుకుంటున్నారో తెలుసునా! కలప దోపిడీకయితే అంతూదరీ లేదు. జంగలాన్ని, జంగలపు జలాలనీ, జంగలపునేలనీ కూడా వదిలి పెట్టడం లేదు. ఇప్పటికీ నాదో సందేహం. భార్యగా నన్నే దేవేంద్రులవారు ఆక్రమించుకుంటున్నారా? లేక, నందరాజ్యలక్ష్మినీ పెళ్లాంగా తలచి ఆమె మీదికే ఎగబడుతున్నారా?’’ చింతనిప్పుల్లా నేత్రాలు ఇంతింత చేసుకుని రాచగన్నియ గళమెత్తడంతో పూర్ణిమాదేవికి పాలుపోలేదు. ఆమెకు ఈ విషయాలపై తెలిసింది కొంత, తెలియంది కొంత. వెంటనే చూపులు ప్రణవుల కేసి తిప్పింది. ఆయన బుర్ర దించేసుకున్నాడు. అప్పటికి గానీ రాజమాతకు గన్నియ ఎడద, అందలి దుఃఖం అర్థం కాలేదు. పరిస్థితి చేయి దాటిపోకూడదన్న వివేచనతో బరిలోకి దిగిన యోధుడిలా కదిలింది.

‘‘నువ్వు చెప్పింది నిజమే తల్లీ. నేనూ కర్ణాకర్ణీగా వింటున్నాను. మంత్రివర్యులవారూ దీనికి మీ సమాధానం ఏమిటి?’’ రాజమాత దాలోనే ప్రణవయ్య వైపు తిరిగి హుంకరించింది. ప్రణవశర్మ తడబడ్డాడు. నిజానికి ఇందులో అతని బాధ్యతేమీ లేదు. ఇందుకు సంబంధించిన నిర్ణయాలేవీ అతని ద్వారా జరగనూ లేదు. ఇనుముతో చేరిన అగ్నికి సమ్మెటపోట్లు తప్పవన్నట్టుగా దోషిగా నిలబడవలసివచ్చింది.

‘‘రాణీ రాచగన్నియ మా దృష్టికి తెచ్చిన అంశాలన్నీ రేపటిదినం పొద్దువాటారకుండానే పరిష్కార మవుతాయి. అందుకు మాది హామీ.’’ ఈ మూడుముక్కలు మాత్రం అమాత్యశేఖరుని అధికారంతో చెప్పగలిగాడు. దేవేంద్రుడు మాత్రం చలించలేదు.

‘గన్నియ చెప్పినదంతా నూటికినూరుపాళ్లూ నిజమే కావచ్చును. అయినా మావ సొమ్ము అల్లుడు తింటే తప్పేంటి?’

గొణుక్కుంటూనే మందిరం మూలకు పని లేకపోయినా ఏదో పెద్ద పని ఉన్నట్టుగా మరలి పోయాడు. ఆ గొణుగుళ్లూ అర్థం కావడంతో మరోమారు గన్నియ ప్రబలంగా పేట్రేగిపోయింది.

‘‘మామ సంపద అల్లుడు మెక్కవచ్చు. అల్లుడు మాత్రం మామకి కేశపాశమంతయినా మర్యాదా ఇవ్వబోడు. చిన్నమెత్తు సాయమూ చెయ్యబోడు. కనీసం పిల్లను పంపమని బతిమలాడినా పుట్టినింటికి పంపడు. మనదంతా ఎప్పుడూ ఒక దోవ ప్రేమే. ఇరురాజ్యాల సంక్షేమం అంటే ఇదేనేమో! ఇందుకేనేమో ఇద్దరు ఆడకూతుళ్ల మానాన్నీ, ప్రాణాన్నీ, శీలాన్నీ పెళ్లిపీటలకు ఎక్కబెట్టారు.’’ విపరీతంగా విసుక్కు పోతూ గడగడా అనేసింది.

దీంతో, పూర్ణిమాదేవి పెద్ద మార్పే వచ్చినట్టుగా అయింది. ఆ పట్టున గన్నియను కదిలించకపోతేనే మంచిదన్నట్టుగా మారిపోయింది. చేస్తున్నదంతా చేస్తూ పెద్ద మాటలాడుతున్న కొడుకును దూరం నుంచే కళ్లతో ఛీకొట్టింది.

పరిస్థితి విషమించకముందే ప్రణవయ్య తేరుకున్నాడు. కన్నుమూసి తెరిచేటంతలోనే దేవేంద్రుణ్ణి చేరిపోయాడు. ఏవో మంతనాలు జరిపాడు. తృటిలోనే దేవేంద్రుడు గన్నియ సమక్షానికి వచ్చాడు. నోరు కదిపాడు.

‘‘రేపటినుంచీ పాలన అంతా నీకు నచ్చినట్టే జరుగుతుంది. ఈ విషయాలను ఇంత దూరం తేవడం దేనికి! నాతో వల్లించినా ఈసరికి నీ చిత్తాను సారమే రాజాజ్ఞలు వెలువడి ఉండేవి.’’ అన్నీ తెలిసీ ఏమీ ఎరుగని నంగనాచిలా పలికాడు.

కిందపడ్డా కాళ్లుమీదకి ఎత్తిపెట్టేసి ‘మీదవాడినే.. మీదవాడినే..’ అంటూ వెకిలి వేషాలేసే గంధోళిగాడే కొడుకును చూసిన ఆ క్షణాన పూర్ణిమాదేవికి గుర్తుకు వచ్చాడు. గట్టిగా ఊపిరులు వదులుతూనే తన మందిరానికి వెళ్లిపోయింది. మంత్రివర్యులకు ప్రణామాలు అర్పించి అత్తగారి అడుగుజాడల్లో నడిచిపోయింది గన్నియ.

ఇంత జరిగినా దేవేంద్రునిలో పెద్దగా మార్పు రాలేదు. భార్యకిచ్చిన మాటకోసం అప్పటికయితే గిరి దోపిడీకి తాత్కాలికంగా స్వస్తి పలికాడు. కొన్ని నెలలకు ‘మళ్లీ మామూలే’ అన్నట్టుగా మారిపోయాడు.

వడ్డాదిలో రాచగన్నియ స్థితి ఇలా కంటకప్రాయం కాగా అక్కడ నందరాజ్యంలో కొత్తకోడలు దేవేంద్రాలు సైతం ఏమంత గొప్పగా లేదు. అలా అని గన్నియ అంతటి వ్యాకులత ఆమెకు లేదు. వెంకటేశుడు వడ్డాది దేవేంద్రుడంతటి గండ కాదు. అయినప్పటికీ మరోరకమైన బాధ దేవేంద్రాలని పట్టిపీడిస్తోంది. తోబుట్టువే తన రాజ్యానికి పెనువిపత్తుగా పరిణ మించాడని దేవేంద్రాలు వేదన చెందుతోంది. ఆమె రోసిపోవడానికి దారితీసిన నిమిత్తం ఒకటి కాదు. ఎన్నో. ఎన్నెన్నో!

* * * * * *

నందపురానికి కూతవేటు దూరంలో ఉంటుంది కరుకుపుట్టు. ఈ రోజు ఆ ఊరికి పండుగ వచ్చినట్టుంది. వాస్తవం మాట్లాడుకోవాల్సివస్తే గిరుల్లో పండగలేని రోజు ఏముంటుంది! కొర్రలు కోసినా, గుమ్మళ్లు పూసినా, అరికెలు ఎగసినా, కందులు కాసినా, పనసలు పండినా, మావిళ్లు మురిసినా పండగే. ‘వెన్నులు ముంపడం.. కొత్తలు కలపడం..’ పేరిట గిరిప్రజ ఆనందోత్సవాలు జరుపుకుంటూనే ఉంటుంది. అధికంగా మత్తు ఇవ్వని ఔరజ్ఞానం కల్లు తాగేవారు కొందరు. తిక్కలు రేపే మడ్డికల్లు పుచ్చుకునే వారు ఇంకొందరు. మధ్యస్థంగా మెదిలే జీలుగు కల్లు గ్రోలేవారు మరికొందరు. అందరూ పానం మీద పానంచేసి జాకరమ్మమెట్టకు పోతుంటారు. కొత్త పంటను అక్కడే అమ్మవారికి నివేదిస్తారు. తింటారు. ఇది ఎప్పుడూ ఉన్నదే. చైత్రంలో వచ్చే ఇటిం పండగవేళ అతిథులను గౌరవించడం, మార్గశిరంలో పంటలు చేతికివచ్చే పలకం మాసాన నంది పండగనాడు చెదపుట్టకు కల్లు పొయ్యడం, ఫాల్గుణం పొగును నెలలో భూదేవి పండగప్పుడు విత్తనాలు జల్లడం, మాఘంలో శివరాత్రి, పుష్యంలో సంకురాత్రి ఇవన్నీ పర్వపు రోజులే. ఉత్సాహదినాలే.

అయితే, కరుకుపుట్టులో ఇప్పటి హడావుడి అలాంటిది కాదు. ఇంకా చెప్పాలంటే వీటన్నింటికీ మించినది. సాక్షాత్తూ నందపురం ఆస్థానంలోని ప్రధాన దండనాయకుడు జంగయ్య బగత కూతురు నెలవంక పెళ్లి. పెళ్లికొడుకు పోలడు డుడుం జలపాతానికి సమీపంలోని సుజనకోట కుర్రాడు. కలిగినవాడు. నందరాజ్యంలో ప్రముఖ వాణిజ్య కేంద్రమని చెప్పదగ్గ జయపురంలో తండ్రికి వ్యాపారంలో సహాయపడుతున్నవాడు. నెలవంకకు తగినవరుడు. ఇందువల్లే వివాహ ఏర్పాట్లను అంగరంగ వైభవంగా జంగయ్య చేపట్టాడు.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram