పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌లకు భారత్‌తో దౌత్య సంబంధాలు ఉన్నాయి. వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. విరోధం కూడా ఉందన్న మాటను కాదనలేం. కానీ వీటన్నింటిని వాస్తవంగా శాసించేది భారత్‌ ‌పట్ల హిందువుల పట్ల ఆ రెండు దేశాలకు ఉన్న మత విద్వేషమే. చిత్రంగా పాకిస్తాన్‌ ‌లేదా బంగ్లాదేశ్‌ అనుసరిస్తున్న ఇలాంటి విద్వేషం ఇక్కడి కొందరు పౌరులు కూడా ప్రదర్శిస్తున్నారు. దసరా సందర్భంగా దుర్గామాతకు బంగ్లాదేశ్‌లో జరిగిన అపచారం, అక్టోబర్‌ 24‌న దుబాయ్‌లో ఇండియా-పాక్‌ ‌మధ్య జరిగిన టి20 క్రికెట్‌ ‌మ్యాచ్‌లో భారత్‌ ఓటమి తరువాత దేశంలో తలెత్తిన పరిణామాలు ఆ విద్వేషానికి కొనసాగింపే. తమ మత గ్రంథానికి అవమానం జరిగిందంటూ అభూత కల్పనలు ప్రచారం చేసి బంగ్లాదేశ్‌ ‌మైనారిటీలు హిందువులను ఊచకోత కోశారు. క్రికెట్‌ ‌మ్యాచ్‌ను క్రీడగా కాకుండా, అందులోను జిహాద్‌ను దర్శిస్తూ జేబులలో నుంచి మత గ్రంథాన్ని తీసి ప్రార్ధనలు చేసే పాకిస్తాన్‌ ‘‌క్రీడాభిమానులు’ కోకొల్లలు. పాక్‌ ‌గెలిచినందుకు ఆ బృందాన్ని అభినందించవచ్చు. కానీ పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు ఎందుకు? సొంత దేశాన్ని మురదాబాద్‌ అనడం ఎందుకు? వైద్య కళాశాలల్లో పాకిస్తాన్‌ ‌జాతీయగీతం పాడవలసిన అవసరం ఎందుకొచ్చింది? ఆ రెండు తాజా ఘటనలు కూడా సగటు భారతీయులకు అత్యంత జుగుప్స కలిగించాయి. పాక్‌ ‌క్రికెట్‌ ‌బృందం గెలిచినందుకు భారత్‌లో సంబరాలు చేసుకున్నవారు ఈ గడ్డను వీడి పోవాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోతే ఆ మూకలని మనమే పాకిస్తాన్‌ ‌పంపాలంటూ మండిపడ్డారు.భారత్‌లో పాకిస్తాన్‌ ‌భక్తి ఒక జాడ్యం. బంగ్లాలో మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం దారుణమైన మౌఢ్యం. ఉదారవాదులు యథాప్రకారం ఒకచోట నిద్ర నటించారు. మరొకచోట కల్లు తాగిన కోతులయ్యారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల మీద జరిగిన హత్యాకాండ గురించి ఉదారవాదులూ, సెక్యులరిస్టులు నోరెత్త లేదు. కానీ భారత్‌ ‌వ్యతిరేక నినాదాలు చేసి పాకిస్తాన్‌ ‌జాతీయగీతం పాడి, సంబరాలు చేసుకున్న వారి మీద కేసులు పెడితే కడవల కొద్దీ కన్నీళ్లు కారుస్తున్నారు.


నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్‌ను 370 రద్దు చేసిన తరువాత అక్కడ పాకిస్తాన్‌కూ, ఇక్కడి పాకిస్తానీ భక్తులకూ దిక్కుతోచడం లేదు. ఎంత చిన్న సందర్భం దొరికినా, దానిని ఆసరా చేసుకుని భారత్‌ ‌మీద విషం చిలకరించడానికి పాకిస్తాన్‌కు సాయంగా, ఇక్కడి పాకిస్తాన్‌ ‌భక్తజనం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ విషయాన్ని సాక్షాత్తు జమ్ముకశ్మీర్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌నాయకుడు ఫారుక్‌ అబ్దుల్లాయే అంగీకరించారు. ‘టీ 20 దుబాయ్‌ ‌మ్యాచ్‌లో భారత్‌ ఓటమి తరువాత శ్రీనగర్‌లో విద్యార్థులు చేసిన ఆ నినాదాలు 370 అధికరణం రద్దు చేసిన బీజేపీని రెచ్చగొట్టడానికే. అలా సంబరాలు చేసుకున్నవారికీ పాకిస్తాన్‌కీ ఎలాంటి సంబంధం లేదు. వాళ్లంతా పిల్లలు, బాలకులు’ అంటూ తెలిసో తెలియకో మొత్తానికి ఫారూక్‌ అబ్దుల్లా పూంచ్‌ ‌జిల్లాలోని సురానాకోటే బహిరంగ సభలో చెప్పడం ఒక వాస్తవాన్ని అంగీకరించినట్టే.

ఫారుక్‌ ‌వ్యాఖ్య నిజమే. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జమ్ముకశ్మీర్‌లోనే పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో సంపూర్ణ శాంతి వాతావరణం ఏర్పడే వరకు తమకు తృప్తి ఉండదని ప్రకటించారు. అలాంటి సమయంలో టీ20లో పాకిస్తాన్‌ ‌గెలుపును అవకాశంగా తీసుకుని విచ్ఛిన్నకర శక్తులు రెచ్చిపోయాయి. స్థానికుల పేరుతో కశ్మీరీ యువత, విద్యార్థులు ఆగడాలు ఆరంభించిన అక్టోబర్‌ 24, 25 ‌తేదీలలో హోం మంత్రి అక్కడే ఉన్నారు. తన పర్యటన పొడిగించి 25వ తేదీ రాత్రి పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ ‌జవాన్లు ఉన్న లెత్పోరా శిబిరంలో బస చేశారు కూడా. 2019 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదులు వీరి మీదే దాడి చేసి నలభయ్‌ ‌మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంలోనే ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగైందని అనడమే కశ్మీరీ యువతకి నచ్చలేదని అనిపిస్తుంది. విశ్వవిద్యాల యాలు, విద్యాలయాల ప్రాంగణాలలో కూర్చుని కారుకూతలు కూసే వారికి కశ్మీర్‌ ‌వాస్తవ పరిస్థితులపై ఎరుక లేకున్నా అక్కడి పరిస్థితులు చాలావరకు మారిపోయాయి. ఇది గులాం నబీ ఆజాద్‌ ‌వంటి కాంగ్రెస్‌ ‌నాయకుడు కూడా అంగీకరించారు. లోయలో ఉగ్రవాదం తగ్గిందని ఈ దుర్ఘటనలకు కొద్ది ముందే గులాం నబీ వ్యాఖ్యానించారు. ఇందుకు బలమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అమిత్‌షా చెప్పిన ప్రకారం 2004-14 మధ్య సగటున సంవత్సరానికి 208 మంది సాధారణ పౌరులు, 105 మంది భద్రతా సిబ్బంది బలయ్యారు. కానీ 2014-21 మధ్య సగటున 30 మంది పౌరులు, 60 మంది భద్రతా దళ సిబ్బంది ఉగ్రవాదానికి బలైన సంగతి తెలుస్తుంది. ఆ ముప్పయ్‌ ‌మంది పౌరులు మాత్రం ఎందుకు చనిపోవాలన్నదే తమ ప్రశ్న అని అమిత్‌ ‌షా అనడం లోయలో చాలామందికి నచ్చదు. ముఖ్యంగా అప్ఘాన్‌ ‌పరిణామాలతో ప్రేరణ పొంది, ఆ ఉగ్రమూకలు భారత్‌లో చొరబడే సమయం కోసం వేచి చూస్తున్న వారికి అసలే నచ్చదు. వీలు చిక్కినప్పుడల్లా జరుగుతున్న భారత వ్యతిరేక ప్రదర్శనలు, గోల ఆ ధోరణి ఫలితమే.

దుబాయ్‌ ‌మ్యాచ్‌లో భారత్‌ ఓడిన తరువాత దేశంలో ఒక్క కశ్మీర్‌లోనే కాదు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌, ‌రాజస్తాన్‌లలో కూడా పాకిస్తాన్‌ ‌భక్తులు రెచ్చిపోయారు. వీరంతా కశ్మీర్‌కు చెందినవారే కావడం విశేషం. అంతా విద్యార్థులే. ఈ అల్లర్లకు సంబంధించి జమ్ముకశ్మీర్‌ ‌పోలీసులు శ్రీనగర్‌లోని రెండు వైద్య కళాశాలల విద్యార్థుల మీద రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. అక్టోబర్‌ 24, 25 ‌తేదీలలో రాత్రివేళ స్కిమ్స్‌లో ఎంబీబీఎస్‌, ఇతర డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఉండే అవివాహితుల హాస్టల్‌లో నినాదాలు చేసి, బాణసంచా కాల్చారు అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అన్‌ ‌లాఫుల్‌ ‌యాక్టివిటీస్‌ ‌ప్రివెన్షన్‌ ‌యాక్ట్ (ఉపా)లోని 105ఎ, 505 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు.

కశ్మీర్‌లో మతోన్మాద శక్తుల భారత వ్యతిరేకత ఇప్పటిది కాదు. అది క్రికెట్‌ ‌క్రీడలో పాక్‌, ‌భారత్‌ ‌గెలుపోటముల మీద ఎన్నోసార్లు ప్రతిఫలించింది. ఆట చూడడానికి వచ్చినవాళ్లలో కొందరు జేబులలో పెట్టుకొచ్చిన చిన్న ఖురాన్‌ ‌గ్రంథాన్ని బయటకు తీసి పట్టుకుని తమ ఆటగాళ్ల గెలుపు కోసం స్మరిస్తూ ఉంటారని కరాచీ కేంద్రంగా పనిచేసే జర్నలిస్ట్ ఎబాద్‌ అహ్మద్‌ ‌చెప్పాడు. వాళ్లందరి ఉద్దేశం దైవం తమ బృందం వైపు ఉండాలని. క్రికెట్‌ ‌మ్యాచ్‌లలో భారత్‌ ఓడినప్పుడు కశ్మీర్‌ ‌లోయలో సంబరాలు జరుపు కోవడం, దాని మీద కేసులు నమోదు కావడం పాత సంగతే. అక్టోబర్‌ 13,1983‌న షేర్‌ ఇ ‌కశ్మీర్‌ ‌స్టేడియం (శ్రీనగర్‌)‌లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ ‌జరిగినప్పుడు కూడా ఈ ధోరణే కనపించింది. వెస్టిండీస్‌తో భారత్‌ ఆడింది. జనంతో కిక్కిరిసిన ఆ స్టేడియంలో ఆ రోజు భారత్‌ ఆటగాళ్లను వెక్కిరిస్తూ అరుపులు వినిపించాయి. భారత ఆటగాళ్లులో పరాయివాళ్లమన్నట్టు, వెస్టిండీస్‌ ఆటగాళ్లు సొంత గడ్డ మీద ఉన్నట్టు భావించుకోవలసి వచ్చింది. ఈ అనుభవాలను సునీల్‌ ‌గవాస్కర్‌ ‌తన రన్స్ ‘ఎన్‌’ ‌రూయిన్స్‌లో రాశారు. భారత్‌ ఓటమి పాలైంది. స్టేడియంలో మాత్రం పాక్‌ అనుకూల నినాదాలు మిన్నుముట్టాయి. అక్కడ మేం ఆడింది వెస్టిండీస్‌తోనే గానీ, పాకిస్తాన్‌తో కాదని కూడా ఆయన వ్యంగ్యంగా గుర్తు చేయవలసి వచ్చింది. 1986 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ ‌మధ్య మ్యాచ్‌ ‌జరిగినప్పుడు కూడా ఇదే పునరావృతమైంది. నిజానికి మ్యాచ్‌ ‌జరగడానికి కొన్ని గంటల ముందు కొందరు యువకులు పిచ్‌ ‌మీద గోతులు తవ్వేశారు. తరువాత షాబిర్‌ అహ్మద్‌ ‌షా, ముస్తాక్‌ ఉల్‌ ఇస్లాం, షౌకత్‌ అహ్మద్‌ ‌బక్షి అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కానీ 28 ఏళ్ల విచారణ తరువాత అక్కడి కోర్టు ఆ ముగ్గురిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. 2016లో ఇండియా- వెస్టిండీస్‌ల మధ్య మ్యాచ్‌ ‌జరిగినప్పుడు కూడా కశ్మీర్‌లోని నిట్‌లో (శ్రీనగర్‌) ‌సంబరాలు జరుపుకున్నారు. ఎందుకంటే ఆ మ్యాచ్‌ ‌లోనూ భారత్‌ ఓడిపోయింది. 2014లో జరిగిన సంఘటన మరీ దారుణం. ఆసియా కప్‌లో భారత్‌ ‌పాకిస్తాన్‌ ‌మీద ఓడిపోయినప్పుడు మీరట్‌లోని స్వామి వివేకానంద శుభార్తి విశ్వవిద్యాలయంలో ఉత్సవాలు చేసినందుకు 67 మంది కశ్మీరీ విద్యార్థులను హాస్టళ్ల నుంచి బహిష్కరించారు. ఇందుకు పాకిస్తాన్‌ ‌విదేశీ వ్యవహారాల కార్యాలయం నిరసన వ్యక్తం చేయడంతో, దౌత్య స్థాయిలో విభేదాలు తలెత్తాయి. 2009లో శ్రీలంక క్రికెట్‌ ‌బృందం మీద ఉగ్రవాద దాడి జరిగిన తరువాత పదేళ్లపాటు పాకిస్తాన్‌ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ ‌కూడా నిర్వహించలేకపోయింది. తరువాత క్రమంగా అంతర్జాతీయ బృందాలు మళ్లీ పాకిస్తాన్‌ ‌రావడం మొదలయింది.ఒకసారి ప్రపంచ కప్‌ ‌సందర్భంలోనే న్యూజిలాండ్‌ ‌హఠాత్తుగా పాక్‌ ‌పర్యటనను రద్దు చేసుకుంది. ఇందుకు భద్రతా కారణాలను చూపింది. తరువాత ఇంగ్లండ్‌ ‌జట్టు కూడా అదే చేసింది. 2020లో కూడా దక్షిణ కశ్మీర్‌లో స్థానిక క్రికెట్‌ ‌టీమ్‌కు చెందిన తొమ్మిది మంది క్రికెటర్ల మీద పోలీసులు ఉపా చట్టం ప్రయోగించారు. అంత క్రితమే లోయలో చనిపోయిన ఒక తీవ్రవాది బొమ్మ ఉన్న చొక్కాలు ఆ ఆటగాళ్లు వేసుకున్నారు.

తమ పాక్‌ ‌భక్తికి అడ్డొచ్చిన వాళ్లని కూడా రకరకాలుగా బెదిరించడం, ముద్రలు వేయడం కూడా కశ్మీర్‌లో పరిపాటి. టీ20 మ్యాచ్‌లో గెలిచిన పాక్‌కు అనుకూలంగా సంబరాలు చేయడం గురించి ప్రశ్నించిన ‘బయటి’ విద్యార్థులకు చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్‌ ‌కాల్స్ ‌వెళ్లాయి. స్కిమ్స్ ‌సౌరా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థిని అనన్య జమ్వాల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అబ్దుల్లా ఘాజీ అనేవాడు ఆమెను దోషి అంటూ, పోలీస్‌ ఇన్ఫార్మర్‌ అం‌టూ వేధించడం పోస్టులు పెట్టాడు. స్కిమ్స్ ‌విద్యార్థుల మీద పోలీసులు కేసు పెట్టడానికి కారణం అనన్య అంటూ అతడు ఆరోపిస్తున్నాడు. ‘ఆమె పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌. ఉపా కేసుల నమోదుకు విద్యార్థులను గుర్తించడంలో ఆమె సహకరించి, దోషిగా నిలిచారు. ఆమె ‘బయటి వ్యక్తి’ డోగ్రా. ఈమె కూడా అక్కడే ఎంబీబీఎస్‌ ‌చదువుతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సభ్యురాలు. సంగహాన్‌, ఇతర ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సభ్యులతో కలసి స్థానిక కశ్మీరీ విద్యార్థుల మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. జైలుకు పంపుతామనీ, ఎన్‌కౌంటర్‌ అవుతారనీ బెదిరిస్తున్నారని కూడా ఘాజీ వరసగా ట్వీట్లు చేశాడు. అయితే ఘాజీ ఆరోపణలు నిజం కాదని అనన్య చెప్పారు. తాను ఎలాంటి వీడియోలు బయటపెట్టలేదని చెప్పారు. మెహక్‌ ‌పిరదౌసి అనే మరొక విద్యార్థిని కూడా అనన్య మీద ఇలాంటి ప్రచారమే ప్రారంభించింది. కశ్మీర్‌లో విలసిల్లుతున్న ఆత్మీయతని ఇలాంటి శక్తులు నాశనం చేస్తున్నాయని మెహక్‌ ఆరోపణ. ఇది ఎంత దారుణమైన అబద్ధమో చెప్పడానికి లక్షల ఉదాహరణలు ఉంటాయి. హాస్టల్‌లో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలు బయటకు రావడానికి అనన్య కారణమని కూడా ఈమె ఇన్‌స్టాగ్రామ్‌ ‌కథనంలో ఆరోపించింది. ఆమెను మేమంతా కలసి ఏకాకిని చేశామని కూడా ఘనంగా చెప్పుకుంది.

ఈ ప్రభుత్వ వైద్య కళాశాలల కథ ఇలా ఉంటే, అక్కడే ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ కథ వేరుగా ఉంది. టీ 20 సెమీ ఫైనల్స్‌లో భారత్‌తో ఆడిన వెస్టిండీస్‌కు అనుకూలంగా కశ్మీరీ విద్యార్థులు నినాదాలు చేయడంతో ఇక్కడ గొడవ మొదలయింది. మిగిలిన వారు భారత్‌ ‌టీమ్‌కు అనుకూలంగా నినదించారు. ఇదే హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. తమను ‘బయట నుంచి వచ్చిన విద్యార్థులు’ నెట్టి వేశారని కశ్మీరీ విద్యార్థులు ప్రచారం మొదలుపెట్టారు. ఇది లోయలోనే ఉద్రిక్తతలు సృష్టించింది. అలాగే ఇంతియాజ్‌ ‌షేక్‌ అనే ఒక కొరియర్‌ ‌సర్వీస్‌ ‌బాయ్‌, ‌పార్సిల్‌ ఇవ్వడానికి వెళ్లిన తనను చితకబాదారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొందరు కశ్మీరీయేతర విద్యార్థులు మువ్వన్నెల జెండా ఎగుర వేయడానికి ప్రయత్నిస్తూ, ‘భారతమాతకు జై’ అని నినాదాలు ఇవ్వడంతోను ఘర్షణలు జరిగాయి. ఇదంతా నిట్‌ ‌ప్రాంగణంలోనే జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి త్రివర్ణ పతాకాన్ని స్వాధీనం చేసుకుని పరిస్థితిని అదుపు చేయడానికి పాటుపడ్డారట. ఇది ఇక్కడితో ఆగలేదు. ఈ ఘటనలు జరిగిన తరువాత అధ్యాపక బృందంలో స్థానికులైన వారు తమ పట్ల వివక్ష చూపించడం ఆరంభించారని కశ్మీర్‌ ‌బయట నుంచి వచ్చిన విద్యార్థులు చెబుతున్నారు. గతంలో నిట్‌లో పూర్తిగా కశ్మీరీ విద్యార్థులే ఉండేవారు. కొన్నేళ్ల క్రితం దీనిని కేంద్రం తన అధీనంలోకి తెచ్చుకున్న తరువాత యాభయ్‌ ‌శాతమే కశ్మీరీలకు కేటాయించారు. మిగిలిన వాటిలో సగం జమ్ము, లెహ్‌ ‌ప్రాంతాల వారికీ, బయటివారికి కేటాయిస్తున్నారు. దీనితో సమీకరణలు మారాయి.

మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ఆలస్యం లేకుండా స్పందించారు. ఈవిడ మరీ వికృతంగా పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వారి మీద ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ యావద్దేశాన్ని ఆడిపోసుకుంది. 370 రద్దు తరువాత ఇక్కడ ఎంత మంది మిఠాయిలు పంచుకున్నారో, ఇలా పాక్‌ అనుకూల నినాదాలు చేస్తున్నవారిని విమర్శిస్తున్నవారికి తెలియదని కూడా ఈ మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈ దేశద్రోహులను (పాక్‌ అనుకూలురు) కాల్చిపారేయాలంటూ కొందరు ట్వీట్లు పెట్టడం దారుణమని ఆమె అభిప్రాయం. ఇలాంటి వాళ్లంతా విరాట్‌ ‌కోహ్లి చూపించిన క్రీడా స్ఫూర్తిని చూపాలని కూడా సూత్రీకరించారామె. అయితే గెలిచిన బృందానికి మైదానంలోనే అభినందనలు తెలియచేయడానికీ, పాకిస్తాన్‌కు జే కొడుతూ, భారత్‌ను దూషిస్తూ, పాక్‌ ‌జాతీయ గీతం పాడుతూ వీరంగం వేసే వారికీ మధ్య తేడా తెలియని ఈమె కశ్మీర్‌ ‌రాష్ట్రానికి పెద్ద నాయకురాలు.

టీ20లో పాక్‌ ‌గెలుపు సందర్భంగానే సంబరాలు చేసుకున్న మరొక ఏడుగురు ముస్లిం యువకులను ఉత్తర ప్రదేశ్‌ ‌పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురి మీద దేశద్రోహ నేరం మోపుతామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌వెల్లడించారు కూడా. వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నందున సైబర్‌ ‌టెర్రరిజమ్‌ ఆరోపణలు వీరి మీద నమోదు చేస్తున్నారు. ఆ ఏడుగురిలో ముగ్గురు కశ్మీరీలే. ఆగ్రాలోని రాజా బల్వంత్‌సింగ్‌ ‌కాలేజీలో చదువు తున్నారు. వీరే పాకిస్తాన్‌కు అనుకూలంగా సోషల్‌ ‌మీడియాలో మెసేజ్‌లు పంపారు. వీళ్లని ఇప్పటికే కాలేజీ సస్పెండ్‌ ‌చేసింది. మరో ముగ్గురిని బరేలీలో, ఇంకొకరిని లక్నోలోను అరెస్టు చేశారు. పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు చేస్తున్నవారిని అరెస్టు చేయాలని కోరుతూ ఆ సంస్థ ప్రాంగణంలోకి దూసుకు వచ్చారన్న ఆరోపణతో కొందరిపై కేసు నమోదు కావడం విశేషం.

అక్టోబర్‌ 27‌న రాజస్తాన్‌లో ఒక ఉపాధ్యాయు రాలిని కూడా ఇదే విషయం మీద అరెస్టు చేశారు. ఆ వెంటనే ఆమె పనిచేసే పాఠశాల యాజమాన్యం కూడా ఉద్యోగం నుంచి పీకేసింది. ఉదయ్‌పూర్‌లోని నీరజా మోది పాఠశాలలో పనిచేసే నఫీసా అతారి మనం గెలిచాం, గెలిచాం అంటూ సామాజిక మాధ్యమాలలో పోస్టు పెట్టారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఉన్న భాయి గురుదాస్‌ ఇనిస్టిట్యూట్‌ ‌కూడా ఇలాంటి గొడవలకు వేదిక అయింది. ఈ ఇంజనీరింగ్‌ ‌టెక్నాలజీ సంస్థలో చదువుతున్న కశ్మీరీ విద్యార్థులను పాక్‌ ‌గెలుపు పండగ చేసుకున్నందుకు ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌కు చెందిన విద్యార్థులు దాడి చేశారు. మేం మా హాస్టల్‌ ‌గదులలో కుదురుగా కూర్చుని ఉంటే ఆ విద్యార్థులు వచ్చి దాడి చేశారని కశ్మీరీ విద్యార్థులు చెబుతున్నా దేశం నమ్మడం లేదు.

పదహేనుమంది భారత క్రికెట్‌ ‌బృందంలో ఏకైక ముస్లిం మహమ్మద్‌ ‌షమిపై మరొక కోణం నుంచి నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. ఇతడు కొన్ని విషయాలు పాకిస్తాన్‌ ‌బృందానికి ముందే అందజేశాడని నెటిజన్ల ఆరోపణ. దేశద్రోహి అంటూ దూషణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలు సరికాదని క్రికెట్‌ ‌దిగ్గజాలు వాపోయాయి. ఇక్కడే ఒక చిత్రమైన అంశం కూడా చూడాలి. భారత్‌ ఓటమితో సంబరాలు చేసుకున్న పాకిస్తాన్‌ అనుకూలుర మీద వెల్లువెత్తిన విమర్శల కంటే, షమి మీద కురిసిన సానుభూతే ఎక్కువ.

ఇది ‘భక్తుల’ ఓటమి అంటూ నోరు పారేసు కున్నారు సాక్షాత్తు కాంగ్రెస్‌ ‌నాయకురాలు రాధికా ఖెరా. ఆ పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్‌ ‌రాధిక ఈ నోటి దురుసుకు సొంత పార్టీ నుంచి కూడా విమర్శల పాలయ్యారు. భక్తులు ఓడిపోవడం అన్న మాట పాకిస్తాన్‌లో ఒక మతపెద్ద నోటి నుంచి రావల సిన మాట. ఔను ఇవాళ కాంగ్రెస్‌కు చాలా సంతోషం కలిగిచే రోజే కదా అంటూ బీజేపీ ప్రతినిధి సంబిత్‌ ‌పాత్రా సమాధానమిచ్చారు. ఇలా క్రీడలనీ, మతాన్నీ కలపడం సరికాదు అంటూ ఢిల్లీ కాంగ్రెస్‌ ‌నాయకుడు సందీప్‌ ‌దీక్షిత్‌ ‌కూడా చీవాట్లు పెట్టారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram