– ‌గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

అం‌తర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ ఆది నుంచీ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది. దేశ ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ ప్రయోజనాలకూ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోంది. విదేశాంగ విధానం ప్రతి అడుగులోను విశ్వ శ్రేయస్సు కనిపించడం వెనుక భారతీయమైన చింతన ఉంది. మొదటినుంచీ వసుధైక కుటుంబం అన్న భావనకు కట్టుబడి ఉంది. విపత్కర పరిస్థితులు ఎదురైన వేళ తనవంతుగా సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వెళుతోంది. ఇందుకోసం నిధులు సమకూర్చడం, కొత్త ఆలోచనలను పంచుకోవడం, వాటికి రూపకల్పన చేయడం ద్వారా తన పాత్రను చిత్తశుద్ధితో పోషిస్తోంది. తాజాగా జరిగిన ‘కాప్‌’ (‌కాన్ఫరెన్స్ ఆఫ్‌ ‌పార్టీస్‌), ‌జీ-20 సదస్సుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై భారత్‌ ‌వాణిని ప్రధాని నరేంద్ర మోదీ బలంగా వినిపించి ప్రపంచ దేశాల అధినేతల మన్ననలు పొందారు. ఇటలీ రాజధాని రోమ్‌లో జరిగిన జీ20 సదస్సు, బ్రిటన్‌లోని గ్లాస్గో నగరంలో జరిగిన కాప్‌ ‌సదస్సులలో అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఆయన భారత్‌ అభిప్రాయాలనూ, వాదనలనూ సమర్థంగా వినిపించారు. వాటికి పరిష్కార మార్గాలను సైతం సూచించారు. ఇందుకోసం తనవంతుగా భారత్‌ ఏం ‌చేయనుందో వివరించిన మోదీ వివిధ దేశాల అధినేతల ప్రశంసలు పొందారు.

పర్యావరణం… ప్రస్తుతం ప్రతి దేశం ఎదుర్కొం టున్న ప్రధాన సమస్య. పర్యావరణ పరిరక్షణలో వైఫల్యం కారణంగా అనేక దేశాలు పలు అనర్థాలు ఎదుర్కొంటున్నాయి. దీని నుంచి బయటపడే మార్గం లేక అంతర్జాతీయ సమాజం సతమతమవుతోంది. వాతావరణంలో ప్రతికూల మార్పులను నియంత్రించ డానికి 1992లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఒక ఒప్పందం రూపుదాల్చింది. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలనే ‘కాప్‌’ (‌కాన్ఫరెన్స్ ఆఫ్‌ ‌పార్టీస్‌) అని వ్యవహరిస్తున్నారు. దీనికి అనుగుణంగానే 2015లో పారిస్‌ ఒప్పందం తెరపైకి వచ్చింది. ఈ ఒప్పందం అమలుకు నిర్ణయాలు చేసే అధికారం కాప్‌నకే ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా భూతాపాలను 1.5 సెల్సియస్‌ ‌డిగ్రీలు దాటరాదని పారిస్‌ ఒప్పందం చెబుతోంది. వాతావరణ మార్పుల నిరోధానికి ఏటా రూ.10వేల కోట్ల డాలర్ల అంతర్జాతీయ సాయం అందించాలని పారిస్‌ ఒప్పందం నిర్దేశించింది. వెనకబడిన దేశాలు హరిత సాంకేతికతలలో పెట్టుబడులు పెట్టడానికి, వాతావరణ మార్పుల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటానికి, జీవనోపాధిని పెంచడానికి ఈ నిధులను వెచ్చించాలన్నది లక్ష్యం. ఈ నేపథ్యంలో అక్టోబరు 31 నుంచి బ్రిటన్‌లోని గ్లాస్గో నగరంలో ప్రారంభమైన కాప్‌ -26 ‌సదస్సు నవంబరు 12 వరకు జరిగింది. ఇందులో వివిధ దేశాల అధినేతలు, దౌత్యవేత్తలు, పర్యావరణ వేత్తలు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ సదస్సు జరగడం ఇది 26వసారి. అందుకే కాప్‌-26 ‌సదస్సు అని వ్యవహరిస్తున్నారు.

పర్యావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న అనర్థాలు అన్ని దేశాలకూ అనుభవంలోకి వచ్చాయి. దీని ప్రభావం పేద దేశాలకే పరిమితం కాలేదు. ప్రగతిలో ముందంజలో ఉన్నామనుకునే పాశ్చాత్య దేశాలూ దీని ప్రభావానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపాల్లో వానలు ముఖం చాటేశాయి. అడవుల్లో కార్చిచ్చు పుట్టకొస్తున్నది. ఫలితంగా చెట్లు, జంతుజాలం దెబ్బతిన్నాయి. జర్మనీ, చైనాలను భారీ వరదలు ముంచెత్తాయి. భారత్‌ ‌పైనా దీని ప్రభావం లేకపోలేదు. థార్‌ ఏడారి నుంచే కాకుండా, సౌదీ అరేబియా నుంచి సైతం ఎడారి దుమ్ము, ధూళి హిమాలయాలపైకి వచ్చిపడి వేగంగా మంచు కరిగిపోతోంది. ఢిల్లీ తదితర నగరాల నుంచి కూడా దుమ్ము కణాలు ఎగిరి వస్తున్నాయి. ఆసియా ఖండ వాతావరణ సమతుల్యతకు హిమాలయాలు ఆయువుపట్టు. సరిగ్గా దానిమీదే భూతాపం దెబ్బ కొడుతోంది. దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరా ఖండ్‌లో ఈ ఏడాదిలో హిమనీ నదాలు కరిగి మెరుపు వరదలు వచ్చి రెండు ఆనకట్టలు కొట్టుకుపోయాయి. హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌జమ్ము కశ్మీర్‌ ‌ల్లో ఆకస్మిక వరదలు వచ్చాయి. వేసవిలో భానుడి భగభగలు ఏటా అధికమవుతున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో సంభవించే తుపానులు, వాయుగుండాల సంఖ్య, వాటి ప్రభావం ఏటేటా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఈ దుష్పరిణామా లను ప్రభావవంతంగా వివరించేందుకు ఐరాస ఈసారి వినూత్న ప్రయత్నం చేసింది. వందల ఏళ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న డైనోసార్‌ ఆకస్మికంగా ఒక్కసారిగా ఐరాస వేదికపైకి వచ్చి పర్యావరణ మార్పులపై ఆలోచన రేకెత్తించే ప్రసంగం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే యావత్‌ ‌మానవాళికి ముప్పుందని హెచ్చరించింది. గ్రాఫిక్స్‌తో ఈ డైనోసార్‌ను రూపొందించారు.

 ఈ నేపథ్యంలో సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ఆహూతులను ఆకట్టుకుంది. ఆలోచింపజేసింది.  పుడమి జనాభాలో 17 శాతం గల భారత్‌ది మొత్తం ఉద్గారాల్లో కేవలం అయిదు శాతమేనని చెప్పడానికి గర్విస్తున్ననాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వాతావరణ మార్పులను నియంత్రించడంలో భారత్‌ ‌శక్తికి మించిన ప్రయత్నం చేస్తోంది. ఈ దిశగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయడం లేదు. వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. 2030 నాటికి శూన్య ఉద్గార స్థాయికి చేరుకోవాలని భారతీయ రైల్వే నిర్దేశించు కుంది. అప్పటికి కార్బన్‌ ఉద్గారాలను ఒక బిలియన్‌ ‌టన్నుల మేరకు తగ్గిస్తాం. 2070 నాటికి భారత్‌ ‌సున్నా ఉద్గారాల స్థాయిని చేరు కుంటుంది. ఆ దిశగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వాడకాన్ని పెంచుతున్నామని పేర్కొన్నారు.

సౌరశక్తితో మేలు…

పర్యావరణ మార్పులను అధిగమించేందుకు ప్రధాని మోదీ సరికొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. తన ప్రతిపాదనను ప్రపంచ నేతల ముందు ఉంచారు. ‘ఒకే సూర్యుడు… ఒకే ప్రపంచం… ఒకే గ్రిడ్‌’ అన్న భావనను ఆయన కొత్తగా తెరపైకి తీసుకువచ్చారు. అన్ని దేశాలు ఒకే గ్రిడ్‌ ఏర్పాటు చేసుకుంటే ప్రపంచ అవసరాలకు సరిపడా సౌర విద్యుత్‌ ఉత్పత్తి అసాధ్యమేమీ కాదని పేర్కొన్నారు. సర్వ సృష్టికి మూలం సూర్యుడే. ఈ విషయాన్ని ‘సూర్యోపనిషత్‌’ ‌స్పష్టంగా చెబుతోంది. సూర్యుడి నుంచే అన్నీ పుట్టుకొచ్చాయి. శక్తి మొత్తానికి మూలం భానుడే. ఆ శక్తిపై ఆధారపడే అందరం జీవిస్తున్నాం. ప్రకృతితో మానవాళి బంధం బాగున్నంత కాలం భూగోళం పదిలంగా ఉంటుంది. కానీ ప్రగతి పథంలో ముందుండాలన్న ఉద్దేశంతో మనిషి ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బ తీశాడు. పర్యావరణానికి ఎనలేని హాని కలిగించాడు. ప్రకతి సమతుల్యాన్ని సాధించేందుకు సూర్యుడే కీలకం. ఒకే సూర్యుడు…ఒకే ప్రపంచం… ఒకే గ్రిడ్‌ ‌ప్రాజెక్టే అత్యుత్తమ పరిష్కార మార్గం. మొత్తం మానవాళి ఇంధన అవసరాలను తీర్చగల శక్తి సూర్యరశ్మికి మాత్రమే ఉంది. అపరిమితమైన ఈ శక్తి చాలా శుద్ధమైనది. సుస్థిర మైనదని… దీన్ని సమర్థంగా వినియోగించుకోవడంపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. యావత్‌ ‌ప్రపంచాన్ని అనుసంధానిస్తూ ఒకే గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తే ఎల్ల వేళలా శుద్ధ ఇంధనం అందుబాటులోకి వస్తుంది. సౌర ప్రాజెక్టుల వినియోగం పెరుగుతుంది. కర్బన ఉద్గారాలు దిగి వస్తాయి. వివిధ దేశాల మధ్య కొత్త సహకార వేదికలు అవతరిస్తాయని మోదీ తన భావనలను ఆవిష్కరించారు.

ప్రపంచ నేతలకు చురకలు…

అంతర్జాతీయ చర్చల్లో వాతావరణ మార్పులకు అనుగుణంగా జీవనాన్ని సర్దుబాటు చేసుకోవడానికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదని మోదీ పేర్కొన్నారు. విపత్తుల అనంతరం ఉపశమనానికి తీసుకునే చర్యల స్థాయిలో దానిపై దృష్టి పెట్టడం లేదని ఆయన ఆక్షేపించారు. దీనివల్ల దుర్బల దేశాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణీత సమయం కంటే పది నిమిషాలు ఎక్కువసేపు ప్రసంగించినందుకు మోదీ క్షమాపణలు కోరారు. అయితే మోదీ విలువైన ప్రసంగం, ఆయన చూపిన మేలైన పరిష్కారాల ముందు పది నిమిషాల సమయం చిన్నదని అంతర్జాతీయ నేతలు పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలో వాస్తవికత, దార్శనికత ఉందని అభినందించారు. పెద్ద మేథో మథనం చేయకుండానే మన పూర్వీకులు గుర్తించిన, ఆచరించిన తేలికైన పరిష్కార మార్గాలను చూపడం ద్వారా దిశా నిర్దేశం చేశారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే సమయంలో మోదీ తన ప్రసంగంలో ప్రపంచ దేశాల అధినేతలకు చురకలు అంటించారు. తామిచ్చిన హామీలకు వారు కట్టుబడి ఉండాలని సూచించారు. వర్థమాన దేశాలకు ఏటా వంద కోట్ల డాలర్ల పరిహారం అందజేత హామీని నిలబెట్టుకోవాలని పాశ్చాత్య దేశాల అధినేతలను కోరారు. అంతర్జాతీయ సౌర సంకీర్ణం వంటి వాతావరణ సంబంధ కూటములను బలోపేతం చేయాలని కోరారు. 2025 తరవాత చేయాల్సిన దీర్ఘకాల వాతావరణ ఆర్థిక సాయంపై దృష్టి పెట్టాలన్నారు. ఆయా దేశాలు సమస్యపై తమ దేశ కోణంలో కాకుండా విశాల కోణంలో ఆలోచించాలని అభ్యర్థించారు.

చిన్న దీవులకు చేయూత…

వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడేలా చిన్న దీవుల దేశాల్లో మౌలిక వసతులను కల్పించేం దుకు తన వంతుగా భారత్‌ ‘ఐరిస్‌’ (ఇన్‌ ‌ఫాస్ట్రక్చర్‌ ‌ఫర్‌ ‌రెజీలియంట్‌ ఐలాండ్‌ ‌స్టేట్స్) ‌కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మోదీ ప్రకటించారు. వాతావరణ మార్పులతో పెనుముప్పు ఎదుర్కొంటున్న దేశాలకు ఈ కార్యక్రమం వల్ల మేలు జరుగుతుందన్నారు. ఆయా దేశాలకు ఎంతో కొంత మేలు చేశామన్న సంతృప్తి తమకు మిగులుతుందన్నారు. మోదీ ప్రకటనపై ఆతిథ్య దేశమైన బ్రిటన్‌ ‌ప్రధాని బోరిస్‌ ‌జాన్సన్‌, ఆ‌స్ట్రేలియా ప్రధాని స్కాట్‌ ‌మోరిసన్‌, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ‌హర్షం వ్యక్తం చేశారు. ఐరిస్‌ ‌కార్యక్రమంలో భాగంగా చిన్న దేశాల్లో వాతావరణ మార్పుల వల్ల తలెత్తే సమస్యలను అధ్యయనం చేస్తారు. ఈ మార్పులను తట్టుకుని నిలబడే మౌలిక వసతులను నిర్మిస్తారు. ఆయా దేశాల సామర్థ్యం పెంపునకు, వనరుల సమీకరణకు తోడ్పాటు అందిస్తుంది. ముందు ప్రయోగాత్మకంగా కొన్ని చిన్న ప్రాజెక్టులను చేపడతారు.

చైనాపై విమర్శలు…

అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతున్నామని భావించుకునే చైనాకు కాప్‌-26 ‌సదస్సులో ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన కాప్‌ ‌సదస్సుకు చైనా అధినేత షి జిన్‌ ‌పింగ్‌ ‌ప్రత్యక్షంగా హాజరు కాకపోవడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ‌తప్పుపట్టారు. గ్లాస్గో వేదికగా జరిగిన ఈ సదస్సుకు వందకు పైగా దేశాలు గ్రీన్‌హౌస్‌ ‌వాయు ఉద్గారాల తగ్గింపు దిశగా హామీలు ఇచ్చాయి. కానీ చైనా మాత్రం అలాంటి హామీ ఇవ్వలేకపోయిందని బైడెన్‌ ఎత్తి చూపారు. కాప్‌-26‌తో పాటు జి-20 సదస్సుకు సైతం చైనా డుమ్మా కొట్టడం గమనార్హం. సదస్సులకు గైర్హాజరు కావడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే శక్తిని బీజింగ్‌ ‌కోల్పో యిందని దౌత్య నిపుణులు విశ్లేషించారు. చైనా గైర్హాజరుకు వేరే కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్బన ఉద్గారాల కట్టడిలో తమ దేశం తరఫున గట్టి హామీ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగానే చైనా ముఖం చాటేసిందని చెబుతున్నారు. తమ దేశంలోని షింజియాంగ్‌ ‌ప్రావిన్స్‌లో ముస్లిముల అణచివేత, హాంకాంగ్‌లో పౌర హక్కుల ఉల్లంఘన వంటి అంశాలు తెరపైకి వస్తాయని, తద్వారా తాను ఇరుకున పడతానన్నది చైనా భావన. అందుకే గైర్హాజరైంది. అదే సమయంలో దేశంలో నెలకొన్న తీవ్ర ఆహార కొరత, కరోనా మళ్లీ విస్తరించడం వంటి అంశాలు బీజింగ్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇవి కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అయితే వాస్తవాలు ఇలా ఉండగా వాటికి మసిపూసి మారేడుకాయ చేసేందుకు కాప్‌ ‌నిర్వాహకులపై ఎదురుదాడి చేయడం గమనార్హం. నిర్వాహకులు వీడియో అనుసంధానం చేయకపోవడం వల్లే తమ అధినేత జిన్‌ ‌పింగ్‌ ‌ప్రసంగించలేకపోయారని, అందువల్లే ప్రకటన చేయాల్సి వచ్చిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెన్‌ ‌బిన్‌ ‌పేర్కొనడం విస్తుగొల్పుతోంది. అదే సమయంలో కాప్‌-26, ‌జి-20 సదస్సులో భారత్‌ ‌కు లభించిన ప్రాధాన్యం, వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్ర మోదీకి లభించిన గౌరవం, ఆయన ప్రసంగానికి లభించిన ప్రశంసలు బీజింగ్‌కు ఎంతమాత్రం మింగుడు పడలేదన్నది వాస్తవం. కేవలం తన ప్రయోజనాల గురించి ఆలోచించే చైనాకు, విశ్వ మానవాళి శ్రేయస్సు గురించి ఆలోచించే భారత్‌కు గల తేడాను ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజం చాలా స్పష్టంగా గుర్తించింది.

గ్లాస్గోలో ఘన స్వాగతం..

ఇటలీ రాజధాని రోమ్‌ ‌నగరంలో జరిగిన జి-20 సదస్సు అనంతరం కాప్‌ ‌సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్‌లోని గ్లాస్గో నగరానికి వచ్చిన మోదీకి ఘన స్వాగతం లభించింది. స్కాట్లాండ్‌ ‌బ్యాగ్‌ ‌పైపర్లు బాణీలను ఆలపిస్తూ ఆయనకు స్వాగతం పలికారు. మోదీని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రవాస భారతీ యులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ‘భారతమాతాకీ జై’ అని నినదించారు. భారత సంతతి ప్రతినిధులతో మోదీ భేటీ అయ్యారు. వీరిలో ప్రముఖ వైద్యులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ తన శిలా ప్రతిమను ఆవిష్కరిం చారు. హకీం అనే ప్రవాస భారతీయ వైద్యుడు దీనిని బహుకరించారు. ఈ విగ్రహానికి పెట్టేందుకు మోదీ తన కళ్లద్దాలను ఇచ్చారు. బ్రిటిష్‌ ‌రాకుమారుడు ప్రిన్స్ ‌విలియమ్‌ ‌నిర్వహించిన ‘ఎర్త్ ‌షార్ట్ ‌ప్రైజ్‌’ ‌విజేత, ఢిల్లీకి చెందిన రీసైక్లింగ్‌ ‌సంస్థ టకాచార్‌ ‌వ్యవస్థాపకుడు మోహన్‌, ‌సౌరశక్తితో నడిచే ఇస్త్రీ బండిని రూపొందించిన తమిళనాడుకు చెందిన 14 సంవత్సరాల బాలిక వినిషా ఉమా శంకర్‌ ‌ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.

ఉచితంగా 500 కోట్ల టీకాల డోసులు…

ఇటలీ రాజధాని రోమ్‌ ‌వేదికగా జరిగిన జి-20 సదస్సులోనూ మోదీ కీలకపాత్ర పోషించారు. కేవలం గంభీరమైన ప్రసంగాలకే పరిమితం కాకుండా టీకాల సరఫరాకు భారత్‌ ‌సిద్ధంగా ఉందని ప్రకటించి ప్రపంచ దేశాల అధినేతల మన్ననలు పొందారు. కరోనా కారణంగా గత ఏడాది జి-20 సదస్సును వర్చువల్‌ ‌గా నిర్వహించారు. పరిస్థితులు కొంతమేరకు కుదుటపడటంతో ఈసారి ప్రత్యక్షంగా నిర్వహించారు.

2022 చివరి నాటికి 500 కోట్ల డోసుల టీకాల సరఫరాకు సిద్ధంగా ఉన్నామని అంతర్జాతీయ సమాజానికి హామీ ఇచ్చారు. అవసరమైన మేరకు టీకాలను తయారు చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందని చెప్పారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో 150కి పైగా దేశాలకు డోసులను సరఫరా చేశామని ఆయన గుర్తు చేశారు. టీకా డోసులకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటిని సులభతరం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. టీకా ధ్రువీకరణను పరస్పరం గుర్తించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పిలుపిచ్చారు. వ్యాక్సిన్‌ ‌కొరతను ఎదుర్కొంటున్న పేద దేశాలను ధనిక దేశాలు ఆదుకోవాలని కోరారు. అత్యంత పేద దేశాల్లో కేవలం మూడు శాతం ప్రజలు మాత్రమే టీకాలు వేయించు కున్నారని, ధనిక దేశాల్లో ఇది 70 శాతం ఉందని గుర్తు చేశారు. ఇది నైతికంగా ఎంతమాత్రం సమర్థనీయం కాదని మోదీ ఆక్షేపించారు.

నేతలతో చర్చలు…

కాప్‌-26, ‌జి-20 సదస్సులకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ క్షణం తీరిక లేకుండా గడిపారు. ప్రపంచ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక, అంతర్జాతీయ సమస్యలపై చర్చలు జరిపారు. వారితో ఉల్లాసంగా గడిపారు. జర్మనీ ఛాన్సలర్‌ ఏం‌జెలా మెర్కెల్‌, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ‌బ్రిటన్‌ ‌ప్రధాని బోరిస్‌ ‌జాన్సన్‌, ‌ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ ‌మెక్రాన్‌, ఇటలీ ప్రధాని మారియో దరావితో, కెనడా ప్రధిన జస్టిన్‌ ‌ట్రూడో, సింగపూర్‌ ‌ప్రధాని లీ సిన్‌ ‌లూంగ్‌, ‌దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ ‌జె ఇన్‌, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ‌వంటి నేతలతో కీలక అంశాలపై చర్చలు జరిపారు. వాటికన్‌ ‌సిటీలో క్రైస్తవ మత గురువు పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ ‌తోనూ సమావేశమయ్యారు. భారత పర్యటనకు రావాల్సిం దిగా ఆయనను ఆహ్వానించారు. 2013లో ఫ్రాన్సిస్‌ ‌పోప్‌ అయిన తరవాత భారత ప్రధాని ఆయనతో భేటీ కావడం ఇదే తొలిసారి. గత రెండు దశాబ్దాల్లో భారత ప్రధానులు ఎవరూ పోప్‌ను కలవలేదు. 2000 సంవత్సరంలో నాటి ప్రధాని వాజపేయి నాటి పోప్‌ ‌జాన్‌ ‌పాల్‌- 2‌ను కలిశారు. ఇప్పుడు మోదీ వాతావరణ మార్పులపై తీసుకువచ్చిన పుస్తకాన్ని, వెండితో రూపొందించిన ప్రత్యేక జ్ఞాపికను పోప్‌కు బహుకరించారు. ఎడారి ఒక పూదోటగా మారుతుందన్న… అర్థాన్ని ఇచ్చే సందేశం గల కాంస్య ఫలకాన్ని మోదీకి కానుకగా పోప్‌ ఇచ్చారు. 20 నిమిషాల పాటు జరగాల్సిన ఈ భేటీ గంటకు పైగా సాగడం విశేషం.

రోమ్‌లో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా సనాతన్‌ ‌ధర్మ సంఘ్‌ అధ్యక్షురాలు హంసనందగిరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి యోగ క్షేమాల గురించి మోదీ అడిగి తెలుసు కున్నారని చెప్పారు. తమిళనాడు అంటే తనకు ఇష్టమని చెబితే తమిళంలో మాట్లాడారని తెలిపారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ ‌గేట్స్‌తో సమావేశమయ్యారు. భారత్‌లో జరుగుతున్న సుస్థిర ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, వాతావరణ మార్పులు, వాటి ప్రభావం, కరోనా టీకాలపై పరిశోధన, బిల్‌ ‌గేట్స్ ‌సాగిస్తున్న సహాయ కార్యక్రమాలపై చర్చించారు. ఇజ్రాయెల్‌ ‌ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్‌తో మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. బెంజమన్‌ ‌నెతన్యాహు స్థానంలో ఇటీవలే ఆయన కొత్తగా బాధ్యతలు చేపట్టారు. మోదీకి తమ దేశంలో మంచి ప్రజాదరణ ఉందని, అందువల్ల ఆయన తమ పార్టీలో చేరాలని ఈ సందర్భంగా బెన్నెట్‌ ‌సరదాగా వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పడి 30 ఏళ్లవుతున్న సందర్భంగా తమ దేశంలో పర్యటించా లని ఆయన మోదీని ఆహ్వానించారు. నేపాల్‌ ‌ప్రధాని సూర్య బహదుర్‌ ‌దేవ్‌బాతో మోదీ మాట్లాడారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన దేవ్‌ ‌బా ఇటీవలే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నేపాలీ కాంగ్రెస్‌కు మొదటినుంచి భారత్‌ ‌నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు, వాతావరణ మార్పులపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌జెలెన్‌ ‌స్కీ తోనూ మోదీ చర్చలు సాగించారు. ఒకప్పటి సోవియట్‌ ‌యూనియన్‌లో భాగమైన ఈ దేశంతో భారత్‌కు సన్నిహిత సంబధాలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఉక్రెయిన్‌ ‌మనకు ఆక్సిజన్‌ ‌కాన్సంట్రేటర్లను సరఫరా చేసింది. ఇందుకు మోదీ ధన్యవాదాలు తెలియ జేశారు.

ఐరోపా దేశాలకు చెందిన పలువురు దేశాధి నేతలతో మోదీ సమావేశమయ్యారు. ఐరోపా మండలి అధ్యక్షుడు ఛార్లెస్‌ ‌మైకెల్‌, ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ ‌డెర్‌ ‌లెయాన్‌తో వాణిజ్యం, పెట్టుబడులు, కరోనా, వాతావరణ మార్పులు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. టీకా ఎగుమతులును భారత్‌ ‌మళ్లీ ప్రారంభించాడాన్ని వారు హర్షించారు. ప్రదాని అయిదు రోజుల ఐరోపా పర్యటన (ఇటలీ, బ్రిటన్‌) ‌విజయవంతమైంది. ఆయన దార్శనికతను అంతర్జాతీయ సమాజం గుర్తించింది. భారత వాణిని వినిపించడంలో నరేంద్ర మోదీ చూపించిన చొరవ, నైపుణ్యం అంతర్జాతీయ నేతలకు విశేషంగా ఆకట్టుకుంది. భారత ప్రతిష్టను పెంచడంలో మోదీ విజయవంతమయ్యారనడం అతిశయోకిత కాదు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram