– గంటి భానుమతి

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన

‘‘అపరాజిత చూస్తోంది కానీ నన్ను గుర్తించడం లేదు. నన్నెందుకు ఈ భూమ్మీదకి తెచ్చావ్‌? అని అడుగుతున్నట్లుగా అనిపిస్తోంది’’ అంది వినీల.

‘‘అలా అనుకోకు. మత్తుమందుల ప్రభావం ఉంటుంది. నొప్పి కూడా ఉంది. అందుకే తన లోకంలో తాను ఉండిపోయింది. లేకపోతే నీ చేతిని పట్టుకోవడానికి ఎప్పుడూ వెనకాడలేదు.’’

‘‘నువ్వన్నది రైటు. పాప నా చేతిని గబుక్కున పట్టుకునేది. ఈ క్షణం వరకూ నా వేలు తన అరచేతిలో ఉంచగానే ఆ స్పర్శకి వెంటనే కళ్లు తెరిచేది. ఇప్పుడే చెయ్యడం లేదు’’

వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం అయి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అంతవరకూ ఏం మాట్లాడని ఆ సిస్టర్‌ ‌మాట్లాడడం మొదలెట్టింది. ఆమె గొంతు ఎంతో మృదువుగా, మెల్లగా, మర్యాదగా, ఏదో మంత్రం చదువుతున్నట్లుగా ఉంది.

‘‘మేం అందరం అపరాజితని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మేం కూడా ఏం చేయలేని స్థితికి వచ్చేసాం. ఎందుకంటే ఏ ట్రీట్‌ ‌మెంటు ఇచ్చినా చెడు చేస్తోంది. అది అగ్రెసివ్‌ ‌ట్రీట్‌మెంటు అవుతుంది. అయినా దేవుడున్నాడు.’’

 వాళ్లకి ఏదీ వినపడడం లేదు. అర్థం అయింది మాత్రం ఒకటి, అపరాజిత బతకడం కష్టం. ఈ విషయం చెప్పడానికి అందరూ కష్టపడుతున్నారు.

 ఇప్పుడు పాప జీవితం వాళ్ల చేతుల్లో లేదని తెలిసింది. మరి ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉంది. నమ్మకం కలిగించాల్సిన బాధ్యత దేవుడిది. అవును దేవుడిది. ఇంతకు ముందు చేసిన ప్రార్థనలని మర్చిపోయాడేమో, దేవుడికి మరోసారి గుర్తు చెయ్యాలి. అందుకే సుధీర వినీలని తీసుకుని గుడికి వెళ్లింది. అక్కడ చాలా సేపు కూచున్నారు. వచ్చాక డాక్టర్‌ని కలిసారు.

ఆయన అన్నది ఒకటే మాట. ఆమెలో ఏమీ ఇంప్రూవ్‌మెంటు కనిపించడం లేదు.

‘‘పొద్దున్న బాగానే ఉన్నట్లుంది కదా, రాత్రి కూడా బాగానే నిద్ర పోయిందని అన్నారు కదా?’’

‘‘అవును అప్పుడు అలా ఉంది. కాని ఇప్పుడు ఏం బాగా లేదు’’

వినీల ఒక్కసారి కూలబడింది. పక్కకి తీసుకెళ్లి, కూచో పెట్టింది.

సుధీర పాప దగ్గర ఉండి, తదేకంగా చూస్తోంది.

 కళ్లు మూసుకుని ఉంది. ఇంతకు ముందు అందులో కలలుండి ఉంటాయి. ఇప్పుడు, ఆ మూసిన రెప్పలపై కలలు వాలుతాయి. మెల్లగా ఈ లోకం విడిచి వెళ్లిపోతుంది. అది స్పష్టంగా తెలుస్తోంది. ఇంతేనా జీవితాలు? ఈలోకంలోకి వస్తారు, వెళ్తారు. అంత దానికి ఈ బంధాలూ అవీ ఎందుకు? ఈ అపరాజితతో తన పరిచయం ఓ పదిరోజులు మాత్రమే. అయినా తన కూతురులాగా అనిపిస్తోంది. ఎంతో దగ్గరైపోయింది. ఈ బంధం ఎప్పటిదో!

డాక్టర్లు వస్తున్నారు, వెళ్తున్నారు. నర్సింగ్‌ ‌స్టాఫ్‌ ‌మారింది. సుధీర అక్కడే కూచుంది. ఇంక్యుబేటర్‌లో ఉన్న అపరాజిత కేసి, మానిటర్ల కేసి చూస్తోంది.

 విక్రాంత్‌ ‌వస్తున్నానని మెసేజ్‌ ‌పెట్టాడు. వినీల భర్త కూడా శాన్‌‌ఫ్రాన్సిస్కో నుంచి వచ్చాడు. అందరూ ఉన్నారు. ఒకరి తరవాత మరొకరు, పాపని చూస్తున్నారు. అందరి మొహాల్లో నిరాశ. మొగవాళ్లు కాబట్టి విక్రాంత్‌, ‌వినీల భర్త కిషోర్‌ ‌పైకి ఏ భావం కనిపించడం లేదు.

 వాళ్ల కంత అటాచ్‌మెంటు లేదు. ఎందుకంటే వాళ్లు కనలేదు. వాళ్లు దగ్గరుండీ ఏదీ చూడలేదు. కాబట్టి తమ అంత బాధ ఉండదని అనుకుంది సుధీర. కానీ అది తప్పు. వినీల భర్త ఏడవడం సుధీర చూసింది. విక్రాంత్‌ అతని పక్కనే కూచుని నిశ్శబ్దంగా చూస్తున్నాడు.

ఇప్పుడు కాలం ఆగుతోందో, పరిగెడ్తోందో తెలీదు.

వినీల బాధ, ఆమె భర్తది ఒకటే. కాకపోతే మొగవాడు. పైకి వ్యక్తీకరించడంలో ఇద్దరిలో తేడాలుంటాయి.

 మానిటర్‌లో అపరాజిత హార్ట్ ‌రేట్‌ ‌మెల్లిగా తగ్గుతోంది. సెప్టికేమియా మూలంగా కిడ్నీలు కూడా పని చేయడం లేదు. యూరిన్‌ అదీ రాలేదు. సిస్టం అంతా విషం అయిపోయిందని డాక్టర్లు అంటూంటే తెలిసింది.

అపరాజిత దగ్గర ఉండనివ్వలేదు. అందరిని బయట కూచోమంటే అంతా బయట కూచున్నారు.

విక్రాంత్‌, ‌వినోద భర్త, వినీల భర్త అందరూ ఓ మూల కూచుని ఏదో మాట్లాడుకుంటున్నారు.

వినీలకి చెరోవైపు సుధీర, వినోద నిశ్శబ్దంగా కూచున్నారు.

వినీల సెల్‌ ‌మెసేజ్‌ ‌శబ్దం చేసింది.

సుధీర చూసి వినోదకిచ్చింది. అందరూ చూసారు. ‘‘అపరాజిత ఉన్న దగ్గరికి తొందరగా రండి.’’

సుధీర ఒక్కసారి లేచింది.

‘‘నేను వెళ్తాను, నాకు బాగా తెలుసు ఎక్కడికి వెళ్లాలో, మీరంతా వినీలని చూస్తుండండి.’’ అంటూ పరిగెత్తింది సుధీర.

‘‘మీరు వచ్చారా, ఆమె రాలేదా? మీరు ఎక్కడున్నారో తెలీక మెసేజ్‌ ‌పెట్టాను. అపరాజిత హార్ట్ ‌రేట్‌ ‌బాగా పడిపోయింది.’’

సుధీర వెంటనే మానిటర్‌ ‌కేసి చూసింది. 30- 28 -26- 25-

‘‘నేను ఒక్కసారి నా చేతుల్లోకి తీసుకోనా?’’ అప్రయత్నంగా అంది సుధీర.

‘‘మీరు కాకుండా పాప తల్లి వినీల అపరాజితని దగ్గరికి తీసుకుంటే బావుంటుంది. ఆమె గుండెకి దగ్గరగా. ఆ స్పర్శ వేరు. ఆ దగ్గరితనం వేరు. ఆ అనుభవం ఆ ఇద్దరికీ వస్తుంది. ఇన్నిరోజులు ఓ ప్లాస్టిక్‌ ‌పెట్టెలో ఉంది. ఇప్పుడు మనుషుల చేతుల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా తల్లి చేతుల్లోకి వెళ్తుంది.’’

 సుధీర వినోదకి ఫోన్‌ ‌చేసింది, ‘‘వినీలని పంపించు’’ అని.

వినీల వెంటనే వచ్చింది. ఆమెని చూసి డాక్టరు కళ్లతో సైగ చేసారు.

వెంటనే నర్సులు, డాక్టర్లు, ఆ పెట్టెలోంచి అపరాజితని తీసారు. వెంటిలేటర్‌ ‌ట్యూబుని ఉంచారు. సుధీర, మానిటర్‌ ‌కేసి చూసింది. 20 -17-11-

‘‘నేను చూడలేను.’’ అంటూ కళ్లు మూసుకుంది వినీల.

‘‘అలా కాదు ఒక్కసారి ముద్దు పెట్టుకో.’’

వెంటనే వినీల వొంగి నాజూకుగా ఉన్న ఆ చిన్న శరీరాన్ని చూపుడు వేలితో రాసి, ముద్దు పెట్టుకుంది. ఆమె చెవిలో ఏదో అంది. పాప ఏం అనలేదు.

వినీల ఆ చెవిలో ఏం చెప్పి ఉంటుంది. ఈ తల్లిని క్షమించమని అడిగి ఉంటుంది. నీకు ఈ లోకాన్ని చూపించలేని అశక్తురాలినని అని ఉంటుందని సుధీర అనుకుంది.

వెంటనే సుధీర కూడా తన చేతితో ఆ పాప బుగ్గలని నిమిరింది. దూది కన్నా మెత్తగా ఉంది.

అదేంటీ. మానిటర్‌ ‌కేసి చూడు ఆ గీత వస్తోందేంటీ, నంబర్లేమయ్యాయి అని వినీల అనగానే సుధీర కూడా మానిటర్‌ ‌కేసి చూసింది.

అక్కడ రీడింగ్‌ ఏం ‌లేదు. ఓ లైను గీసినట్లుగా ఉంది.

‘‘ అయిపోయిందా’’ అంటూ నోరు తెరిచి అలాగే ఉండిపోయింది సుధీర. అలాగే వెర్రిగా మానిటర్‌ ‌కేసి చూసింది.

ఒక్కసారి నిశ్శబ్దం. దేవుడితో చేసిన యుద్ధంలో పాప జయించలేకపోయింది. ఆ దేవుడిలో ఒదిగి పోవడానికే సిద్ధం అయింది.

‘‘అంతా అయిపోయింది వినీలా’’ అని సుధీర వినీలని పాపతో సహా పట్టుకుంది. అలాగే ముద్దు పెట్టుకుంది.

‘‘ట్యూబు తీసేస్తే అక్కడ ఏం కనిపించదు, ఆమె గుండె ఎప్పుడో ఆగిపోయింది’’

‘‘ఆగిపోయిందా, ఎప్పుడు?’’ అంటూ అడుగుతోంది వినీల. ‘‘నేనే బాధ్యురాలిని, నన్ను ఆ దేవుడు క్షమించడు’’ అంటూ ఏడుస్తోంది.

 ‘‘దేవుడికి ఎప్పుడు ఏం చెయ్యాలో మనకన్నా ఆయనకే బాగా తెలుసు. ఆయన తనకి ఎవరు కావాలో, ఎవరంటే ఎక్కువ ఇష్టమో, వాళ్ల ఒంటి మీద వేలితో రాస్తాడు. మరణించడం అంటే దేవుడి ఇంట్లో నిద్రపోవడం అంతే. మరేం లేదు. అంతే.’’ అని అక్కడున్న సిస్టర్‌ అం‌ది.

ఒడ్డున కూచుని నీటి లోతుల గురించి చెప్పే మాటలు మెట్ట వేదాంతం కావచ్చు. ఇప్పుడు ఆ వేదాంతం పనికొస్తోంది. అంతే అని ఆ సిస్టర్‌ ‌తేలిగ్గా అనేసింది. కానీ అంతే కాదు. అది గుండెలో నొప్పి, సహజంగా ప్రకృతి ఇచ్చే ఓ వెయ్యి షాకులు.

ఆమె తనదైన రీతిలో ఓదార్చింది. అలా అంటున్న నర్సు వైపు చూసారు. ఆమె కళ్లనిండా నీళ్లు. ఆమెకిది మొదటి అనుభవం కాదు. ఇక్కడ చేరినప్పటినుంచీ ఎన్నో చూసి ఉంటుంది. అయినా మనసు, గుండె ఊరుకోవు కదా. ఆమె ఓ మనిషి. అందుకే ఆ కన్నీళ్లు.

వాళ్లు అపరాజితని లోపలికి తీసుకెళ్లారు. వినీలని పట్టుకుని సుధీర పేరెంట్స్ ఉన్న గదిలోకి వెళ్లింది.

‘‘అపరాజితని చూస్తారా, నేను తీసుకురానా?’’ అంటూ నర్సు వచ్చింది.

వినీల భర్తకి ఏం అనాలో తెలీలేదు. సుధీర కలగచేసుకుంది.

‘‘అలాగే తీసుకురండి.’’ ఆమె వెళ్లిపోయింది.

 మరో ఐదు నిమిషాలకి ఎడమ చేతిని ఉయ్యాలలాగా చేసి, తెల్లటి మెత్తటి షాల్‌ ‌లాంటి బట్టతో చూట్టబడిన అపరాజితని తీసుకొచ్చింది.

అందరూ దుఃఖాన్ని దిగమింగుకోలేకపోతున్నారు. మొహానికి, కళ్లకి చేతులు అడ్డు పెట్టుకుంటున్నారు.

 ఓ సీతాకోక చిలుకని పట్టుకున్నట్లుగా ఉంది. ప్రాణం ఉన్నట్లుగానే ఉంది. ఈ పది రోజుల్లో ఎంతో దగ్గరైన పాప ఈ క్షణాన ఇలా, ఆఖరు సారిగా ముద్దు పెట్టుకుంది. శరీరం కొంచెం చల్లగా ఉంది.

పేరు అపరాజిత కాని, పోరాటంలో ఓడిపోయింది.

 చరిత్ర యుద్ధాలని గుర్తు పెట్టుకుంటుంది కాని, మట్టిలో కలిసిపోయిన రక్తాన్ని మరిచిపోతుంది. ఈ అపరాజిత విషయంలో కూడా అంతేనా! ఆమె చేసిన పోరాటమే గుర్తుండి పోతుందా! ఆమె పడ్డ బాధలు, ఆమె తన నోరు విప్పి చెప్పుకోలేని బాధ తమకు గుర్తుండదా?

ఆ మందులు, ఆ సర్జరీలు, ట్యూబులూ, వైర్లూ, ప్రార్థనలూ ఏవీ పని చెయ్యలేదు.

 ఏఁవిటో ఎన్నో అనుకుంటారు, ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు. ఓ నెల రోజుల క్రితం మామ్మ కూడా అందరూ చూస్తూండగానే పోయింది.

 ఇప్పుడు కూడా, అపరాజిత చేతుల్లో చూస్తూండగానే పోయింది. సుధీరకి అన్నీ ప్రశ్నలు. అపరాజిత మృత్యువుతో ఎన్నో ప్రశ్నలు వెంటాడు తున్నాయి. మన సమీప వ్యక్తి చనిపోయినప్పుడు జీవితం ఎంత చిన్నదో తెలుస్తుంది. ఇక్కడే మనిషిలో వేదాంతం పుడుతుంది.

ఈ లోకం వదిలాక ఎక్కడికి వెళ్తారు? గీతలో అన్నట్లు మళ్లీ పుడతారా? పుడితే ఎక్కడ పుడతారు?

పైన ఆకాశాన్ని , దేవుడిని కొన్ని ప్రశ్నలు అడగాలి అని అనుకునేది. ఇలాంటి ప్రశ్నలు చిన్నప్పుడు అడిగింది. ఇప్పుడు మళ్లీ అపరాజిత మరణంతో మళ్లీ అవే ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. జవాబులు దొరకని ప్రశ్నలు. ఇప్పుడు కూడా దొరుకుతుందన్న నమ్మకం లేదు. కొంత మందినే ఎందుకు ప్రేమిస్తాము? ఆ ప్రేమించినవాళ్లు చచ్చిపోతే ఎక్కడికెళ్తారు, చచ్చిపోయేటట్లైతే పుట్టించడం ఎందుకు? దేనికోసం పుట్టాను అని ఆలోచించుకునే లోపే అసలు ఎందుకు పుట్టాము అనే ప్రశ్న వెంటాడుతోంది.

వీటికి జవాబులు దొరకవని తెలుసు. అయినా ఆగిపోలేదు. ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఒక్కసారి ఆమె చుట్టూ విశాలము, వినీలమూ, అనంతమూ అయిన ఆకాశం ఒక్కసారి ఖాళీ అయినట్లుంది. అంతా శూన్యం. ఎంప్టీనెస్‌. ‌చుట్టూ అన్నీ ఉన్నాయి. కానీ ఏదీ కనిపించడం లేదు. అపరాజిత మరణం ఆమెని ఏదో మాయ కమ్మేసింది. గొంతులో ఏదో ఉండలాంటిది అడ్డుపడుతోంది. ఏడవకుండా ఉండడానికి ప్రయత్నించింది. కాని కష్టం అనిపించింది.

 అపరాజిత గుప్పిళ్లు మూసుకుని పోయింది. మామ్మగారు, చేతులు తెరుచుకుని పోయారు. రెంటి దగ్గరా శూన్యమే. ఏమీ లేదు. మిగిలేది ఏం లేదు.

 మామ్మ అన్నట్లు ఈ భూమి కింద పెద్దా చిన్నా అన్న భేదం లేదు. అందరూ ఆ మట్టి కింద పడుకుంటారు. ఓ ఇసక దుప్పటీ కప్పుకుంటారు.

అంతేనా, ఈ జీవితాలు అంతేనా? ఈ మట్టి కిందకి వెళ్లాల్సిన జీవితం కోసం ఎందుకో కోపాలు, పంతాలు సాధింపులు. గుర్తింపు కోసం ఎందుకింత తపన?

కన్నీళ్లు తుడుచుకోవడానికి కూడా మనసు రాలేదు. తల ఆనించుకోవడం కోసం భుజం కోసం చూసింది.

ఒక్కసారి విక్రాంత్‌ ‌దగ్గరికెళ్లి, అతని చేతులు తీసుకుని తన మొహానికి ఆనించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సుధీర. విక్రాంత్‌ ఆమెని పట్టుకున్నాడు. ఆ స్పర్శ ఆమెకి కాస్త ధైర్యాన్నిచ్చింది. వెంటనే విక్రాంత్‌ ‌భుజం మీద మొహం దాచుకుంది.

 ఈ విక్రాంత్‌ని వదిలి వెళ్దామనుకుందన్న సంగతి మర్చిపోయింది. ఇప్పుడు పోయిన అపరాజిత వారి బంధాన్ని గట్టి పరిచింది. ఇది సుధీరలోని మార్పా, లేకపోతే అపరాజిత మరణం తట్టుకోలేక వస్తున్నదా?

‘‘నీకు బాధ తెలీదనుకున్నాను. నువ్వు చాలా సున్నితురాలివి. నువ్వు ఆ సుధీరవి కాదు.’’ అన్నాడు ఆమె తల నిమురుతూ..

‘‘అవును. నేను ఆ సుధీరని కాదు, నేను మారిపోయాను. ఎక్కడెక్కడికో మానసికంగా ప్రయాణం చేసాను. ఏమీ తెలియని దారుల్లోంచి వెళ్లడానికి ప్రయత్నించాను.’’ అని కళ్లు మూసుకుంది.

ఏదో రక్షణ, చాలా రోజుల తరవాత అనిపించింది. విక్రాంత్‌ ‌హృదయ వైశాల్యం కుంచించుకుపోలేదు. అదే హుందాతనం, ఏమాత్రం తొణక్కుండా ప్రవర్తించే మనిషి. అతని ఔదార్యం, ఔన్నత్యం, మంచితనం అన్నింటి ముందు ఆమె ఓ మరుగుజ్జులా అయిపోతోంది. సంఘర్షణ లేకుండా జీవిత సత్యాలు బయట పడవు.

 ఇన్నాళ్లూ ఓ గాజు తలుపుకి ఇవతల నుంచుని అవతల ఉన్న విక్రాంత్‌ని, ఆ ఇంట్లోవాళ్లని మసక మసకగా చూసింది. ఇప్పుడు ఆ గాజు తలుపు బద్ధలైంది. అవతల నుంచున్న వాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఆ అందరి మొహాల్లో అదే హుందాతనం, అదే పెద్దరికం.

 ప్రతీ కోణంలోంచి ఆశ్చర్యం, ఎన్నో సందేహాలు. అపరాజిత గురించి ఆలోచించకూడదు అని అనుకున్నా ఆమె గుర్తుకు వస్తూ ఉంది. ఆమె పుట్టుక చూసింది. ప్రతీక్షణం ట్యూబులతో, వైర్లతో అల్లుకుపోయి మానిటర్ల మధ్య కళ్లు మూసుకుని ఉన్న ఓ గులాబీ పువ్వు లాంటి అపరాజిత కనిపిస్తోంది.

ఆమె వెళ్లిపోతూ ఏదైనా నేర్పించిందా!?

ఎన్నో నేర్పించింది. కుటుంబ పరిధిని పెంచుకోవాలని మామ్మ అన్నారు. అదే విషయాన్ని మరో లాగా నేర్పించింది. ఒక్కసారి తమ చుట్టూ ఎంతో మంది. వీళ్లందరూ తనకి ముందు తెలీదు. అపరాజిత మూలంగా అందరితో బంధుత్వం ఏర్పడింది.

 జీవించే ప్రతీ క్షణంలో ఎన్నో కోల్పోతాం. కొన్ని సంపాదిస్తాం. ఇది ప్రకృతి ధర్మం. ఏ రుతువు ఆగిపోదు. అయితే తర్వాత ఏంటీ? అనే మహా వాక్యమే మనని నిరంతరం నడిపించేది.

(అయిపోయింది)

About Author

By editor

Twitter
Instagram