– డా॥ చింతకింది శ్రీనివాసరావు

జాగృతి ` ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

 ఆ అలికిడిని అర్థం చేసుకున్న మాకలి, ‘‘లోపలికి అనుమతి ఉంది!’’ కేకవేసింది. పూజగది ద్వారం సమీపానికి వచ్చిన భటుడు,

‘‘రాజమాత ఆజ్ఞమేరకు వడ్డాది అతిథులవారిని సమాలోచన మందిరానికి చేర్చాం. మిగిలినది తమ ఆనతి!’’ వినయంగా తలవంచి వల్లింపు చేశాడు.

‘‘మేం చెప్పేవరకూ వారిని అక్కడే విడిది చేయించండి. మా మాటకోసం మీరు ఎడంగా వేచి ఉండండి!’’

రాచగన్నియ భటుని పురమాయించింది. ఆదేశం అందుకున్న ఉద్ధారకుడు పెద్దల దృష్టి నుంచి తొలగిపోయాడు. మరోసారి అసలు మాటల వైపు వస్తున్నట్టుగా గన్నియ తన సందేహాలను తల్లి వద్ద బయటపెట్టింది.

‘‘వడ్డాది దిగువరాజ్యం. దిగువ మర్మాలు తెలిసిన రాజ్యం. సంప్రదాయం, సంస్కృతి, భాష, ఆచారం, వ్యవహారం అన్నింటా మనకి వ్యతిరిక్తమే. అలాంటప్పుడు పెళ్లిబంధాలు ఎలా నిలవగలవు?’’ అడగనే అడిగింది.

ఆలకించిన మాకలి గొంతున పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. వెంకటేశుడు ఎప్పటిలాగానే వెర్రితర్రగా మొహం పెట్టాడు. తేరుకున్న మాకలి,

‘చెప్పవలసినదానికంటే ఇప్పటికే ఎక్కువగా కూతురికి చెప్పిఉన్నాను. రాజ్య సంక్షేమమే కాకుండా గన్నియ జీవితమూ ఈ విషయంతో మమైక్యమై ఉంది. ఇంతకుమించి తను చెప్పకూడదు. పక్కవారి బతుకులను గురించిన గీతలను దాటకూడదు.’ లోలోనే తలపోసింది. మరుక్షణమే కర్తవ్యనిష్ఠతో,

‘‘పాలకోసం రాళ్లు మోసి తీరాలన్నది నా అభిమతం. అయినప్పటికీ మీ మనుగడకు సంబంధిం చిన నిర్థారణలు మీరే చేయవలసి ఉంటుంది. మీ తీర్పులే అంతిమం. వడ్డాది రాయబారిని పిలిపిస్తాను. ఆయనతోనే మాట్లాడండి. చెప్పవలసిందేదో చెప్పి పంపండి. ఈ పర్వాన్ని ఇంక సాగదీయవద్దు.’’ అంటూనే ఉద్ధారకుణ్ణి కేకవేసి పిలిచింది. వెంకటేశుడు, రాచగన్నియ ఏం మాట్లాడతారోననేది తనకు అనవసరమన్నట్టుగా ప్రణవశర్మను ప్రవేశపెట్ట వలసిందిగా ఆనతి ఇచ్చేసింది. అనుకోని ఈ ఘటనకు బిడ్డలిద్దరూ తొలుత తత్తరపడినా జరగాల్సింది జరుగుతుంది అన్నట్టుగా ఉండిపోయారు.

మాకలిశక్తి ఆదేశాలు విడుదలైన కొద్దిసేపటికే ప్రణవశర్మ పూజాగృహానికి విచ్చేశాడు. వచ్చినవెంటనే పాలవెల్లిలో కొలువుతీరిన నీలకంఠునికి భక్తిగా నమస్సులు చెల్లించాడు. మనసులోనే శివుని స్తుతిస్తూ కొన్ని క్షణాలు ఉండిపోయాడు. ఆ మీదట నందరాచ ప్రతినిధుల సమీపానికి వచ్చాడు. వారికి వందనాలు అర్పణ చేశాడు. ప్రతినమస్కారాలు అందుకున్నాడు. వారు అభ్యర్థించిన మీదట ఉచితాసనాన్ని స్వీకరిం చాడు. పులుకూపులుకూ అందరినీ చూస్తూ ఉండి పోయాడు. మాట మాత్రం బయల్వెడలించలేదు.

కాలం కొంచెంసేపు అక్కడ లయమందినట్టుగా అయింది. సృష్టి మొత్తం స్తంభీభూతమైనట్టే అయింది. ముందుగా కదిలింది రాచగన్నియే. మాకలి తల పోసిందీ అదే. ఏ అంశం మీదనయినా ఓంప్రదంగా మాట్లాడేది గన్నియే. వెంకటేశుడు చెల్లిమాటకు కట్టుబడేవాడే కానీ మరొకటి కాదు. ఆమె తలచి నట్టుగానే కుమార్తె అందుకుంది. ఎదురుగా కూర్చున్న ప్రణవశర్మకు చేతులు జోడిరచి జోర పలుకుతూ,

‘‘కీసుబాసదేశము.. కిముడు నందపురము.. మీకు స్వాగతం చెబుతోంది. మా మర్యాదలు మిమ్ము సావధానులను చేసినట్టుగా భావిస్తాం!’’ మన్ననగా మాట్లాడినట్టు మాట్లాడిరది. అయినప్పటికీ ఆ మాటల్లోని కాసింతగా కలగలిసి ఉన్న వెటకారపు ఛాయలు మాకలిశక్తికీ, ప్రణవులవారికీ అర్థం కాకపోలేదు.

‘ఇంత పెడసరం పెద్దల సమీపాన కూడదు.’ కూతురుతో అనాలనే ఉన్నా లోలోపలే ఈ మాటను మలిగించుకుంది మాకలి. గన్నియ వాచలోని పిండితార్థం ప్రణవుడు గ్రహించినా, గ్రహించనట్టే ఉండిపోయాడు.

కీసుబాసదేశమని, అనాగరిక కిముడు నంద పురమనీ వడ్డాదివారే కాదు. దిగువరాజులందరూ ఎగువ దేశమైన నందాన్ని సతనిత్యమూ వెక్కిరింత పెడుతుంటారనేది ప్రణవశర్మకు తెలియందికాదు. ఆ సంగతే గుర్తుచేస్తున్నట్టుగా ఇప్పుడు గన్నియ ముదలకిస్తోందనీ ఆయనకు తోచకపోలేదు. అయినా సంయమనాన్నే శరణువేడాడు. ప్రణవయ్య సామాన్యుడు కాదు. ఇలాంటి వ్యవహారాలెన్నో వడ్డాదిలో నడిపించి తలపండిరచుకున్నవాడు. షష్ట్యబ్ది ఎప్పుడో దాటినవాడు. అసలైన వ్యవహర్త. సిసలైన తగుమనిషి. చక్కని తీర్పరి. పట్టిన పనిని సానుకూలం చేసుకునేదాకా పట్టువీడని మనిషి. నోరుపెట్టి వ్యాజ్యాన్ని పాడుచేయడం అతని జీవితంలోనే లేదు. అందుకే ఆయన అడుగిడిన చోటల్లా శుభోజయం. అలా అని మాట దగ్గర మాట వచ్చినప్పుడు నంగిరిపింగిరిగా వ్యవహరిస్తాడనీ అనుకునే వీల్లేదు. అది అతని తత్వానికే పడదు. ఆయన మంచికి మంచి. చెడ్డకి చెడ్డ. గట్టికి గట్టి. మెత్తకు మెత్త. అందుకే పరి పక్వమానస చతురునిగా వాక్కులు వండి వార్చాడు.

‘‘యువరాణీ రాచ గన్నియ పలికిన స్వాగతవచనాల గూడా ర్థాన్ని గ్రహించక పోలేదు. ఇరుగద్దెలకూ కల్యాణకంకణాలను ధరింపజేయాలన్న కాంక్షతో వచ్చినవాణ్ణి. అంతకు అంతగా మాటలు పలకడం మంచిది కాదు. ఇక కీసుబాసలంటున్నారు. రాజ్య యశోచంద్రికలు ఆ చంద్రతారార్కమూ నిలిచి ఉంటాయి గానీ భాషలతో ఏం పని! అవి చలనశీలమైనవి. అనునిత్యమూ మార్పులు చెందుతూ ఉండేవి. వాటిపై ఆలోచన ఎందుకు?’’ తెలివిగా ప్రణవశర్మ ముక్తాయించేసరికి మాకలిశక్తి మోదం పొందింది. వెంకటేశుడి చిత్తమూ స్థిమితపడిరది. గన్నియ మాత్రం వడ్డాదిమంత్రి తన మనసు మొత్తాన్నీ ఔపోసన పట్టేశాడన్న ఇంగితానికి వచ్చింది. ఆ వెంటనే తనదేం తప్పుకాదన్నట్టుగా,

‘‘నేనేం మాటవరసకు చెప్పిన స్వాగతం కాదది. మనసులోంచి వచ్చినదే.’’ సర్దుకోబోయింది. అంత సర్దుబాటు ఆ పిల్లకు అవసరం లేదన్నట్టుగా,

‘‘మాటలు వయసును బట్టి కూడా వెడలివస్తాయని నాకు తెలియదా అమ్మా! పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు. రేపు వడ్డాది మహారాణీవయితే నిన్ను సేవించు కోవాల్సిన ధర్మం నాది.’’ నిబద్ధతగలిగిన రాజో ద్యోగిలా పలికాడు. గన్నియ విచిత్రపడిపోయింది.

‘ఎంతలో ఎంతగా వాక్యకోవిదుడయ్యాడీ అమాత్యశేఖరుడు. చాకచక్యమంటే ఇతనిదేను. అందుకే నేటికీ వడ్డాది సింహాసనం పరాయివారితో అంటు కాలేదు.’ మదిలోనే అనుకుంటూ,

‘‘ప్రణవయ్యా! వడ్డాదికీ, నందానికీ అందమైన వివాహబంధం సాధ్యమేనంటారా? బహుభంగుల భేదాల ఎగువ దిగువ అధికారపీఠాలు బాసికాలు కట్టుకుంటే బంధుసూత్రాలు బిగుసుకుంటాయంటారా? వాళ్లది దుకాణం మీద బియ్యం, దుక్కమీద ముక్క తంతు. మాది కోసుకుని, తెంపుకుని, కొట్టుకుని మింగే వంతు. జరగరానిది జరిగితే రెండు దేశాలకూ ముప్పేనే.’’ అడగవలసిన ప్రశ్నలన్నీ అడగనట్టుగానే తెలివిగా వేలార్చింది. చెల్లెలి వాదన తమందపు వెంకటేశుణ్ణీ కొద్దిపాటిగా కదిలించింది.

‘వయసొచ్చాక ఏదో ఒక పెళ్లి పేల్చుకోక తప్పదు కదా! సింహాసనం కోసమే అయితే అలాంటి వివాహం చేసుకోవడానికి అభ్యంతరం ఏంటట.’ లోలోనే విసుక్కున్నాడు. మాకలిమాత ఈ విధాన యోచించలేదు.

‘అడగవలసిందే. ఈ పట్టున గన్నియ ఎన్ని సందేహాలు తీర్చుకుంటే అంతమంచిదే. పెళ్లయ్యాక భార్యాభర్తలకు పొరపొచ్చాలు రావడం మంచిది కాదు.’ మాదిరిగా తలచింది.

ప్రణవశర్మ రాచగన్నియ అంతరంగాన్ని గ్రహించాడు.

‘పిల్ల గట్టిగా మాట్లాడవచ్చునేమోగానీ బుద్ధిగలది. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మంచిదన్న ఆ పాప భావనను తక్కువచెయ్యలేం.’ అనుకుంటూ గన్నియకు సరైన జవాబులిచ్చేందుకు సిద్ధపడ్డాడు.

‘‘మెరకపల్లాలు రెండూ భిన్నమైనవని, వాటి నడత, నడక విభన్నమైనవని నాకూ తెలిసిందేనమ్మా! అయితే ఇవన్నీ మనుషులు సృష్టించుకున్నవే గనక మానవప్రకృతే వీటిని పరిమార్చగలదు. మీరు మరో ఆలోచన పెట్టుకోకండి. అటు వడ్డాదిని ఆశించి పావులు కదుపుతున్న ముష్కరుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్టే, ఇటు నందరాజ్యాన్నీ దత్తం చేసుకునేందుకు కొందరు దుర్మార్గులు తహతహ లాడుతున్నారు. ఈ తరుణంలో మనం మేల్కొనవలసి ఉంది. అప్పుడెప్పుడో గజపతులు ఈ పద్ధతిలోనే మీతో వియ్యమంది నందాన్నీ, కటకాన్నీ కాపాడుకున్న వైనం ఎలా మరువగలం?’’ ఉన్నదున్నట్టుగా చెప్పేశాడు.

కటకం గజపతుల అంశం ఎప్పుడయితే ప్రస్తావనకొచ్చిందో అప్పుడిక పూజామందిరమంతా మరింత మౌనం పట్టినట్టుగా మారిపోయింది. ఈ మౌనానికి తగినట్టుగానే తైలదీపాలు ఆరిపోవడంతో దీపనిర్వాణగంధం ప్రజ్వరిల్లింది. అప్పటివరకూ దేవతామూర్తుల ముందు వెలువడిన గంధపు సువాసనలు మెల్లగా గది గవాక్షాలనుంచి బాహ్య ప్రపంచంలోకి చేరిపోయాయి. ఈ సమయంలోనే మాకలిశక్తి కంఠం ఖంగుమంది.

‘‘విప్రులవారూ! నాదొక మనవి.’’ చిన్నమెత్తు అలసత్వమూ లేకుండా ఈ మాటలు దొర్లించింది. ఇందుకు బదులుగా,

‘‘చెప్పండమ్మా!’’ శర్మ స్పందించాడు.

‘‘మీరొక్కపరి వడ్డాది మంత్రి అనే సంగతి మరచిపోండి. నందపురపు పురోహితులని తల పోయండి. మీరయితే పల్లం నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనను నందప్రభువులతో అంగీకరింప జేస్తారా?’’ చిక్కుప్రశ్న ఏదో చిలకరించినట్టుగా మొహం పెడుతూ మాకలి అడిగేసింది.

ఇదే అదనుగా ప్రణవయ్య చెలరేగిపోయాడు. ఏమాటకు ఆ మాటగానే చెప్పాలి. నందం, వడ్డాది గద్దెశక్తులు రెండూ అతనికి ఇష్టదేవతలే. అందుకే దొరికిన అవకాశాన్ని వదిలిపెట్టకూడదనుకున్నాడు. నోరుపెంచేశాడు.

‘‘నేనే నందపురమంత్రినయితే ఈ కుండమార్పిళ్లకు ఒప్పుదల ప్రకటిస్తాను. మా రాజు చేత ప్రకటింప జేస్తాను. మరో అడుగు ముందుకువేసి చెబుతున్నాను. ఇదే నా పరిస్థితి అయితే నా కుమార్తెను వడ్డాది కోడలుగా పంపుతాను. వడ్డాదివారి పుత్రికను కోడలిగా తెచ్చుకుంటాను. జన్మంటూ ఎత్తాక ఒకానొక దశ వరకే స్వార్థం. రాజ్యం విషయానికి వచ్చినప్పుడు అమాయక జనమే కళ్ల ముందు మెదలాలి. సొంత ప్రయోజనం ఎప్పుడూ జాతి ప్రయోజనాలకంటే తక్కువే. శత్రు సంకెళ్లతో చెరసాలలో గడపడంకంటే, మనం సుఖిస్తూ మన ప్రజలను సుఖింపజేస్తూ ఉండటమే మంచిది. అందినవాడికి ఆకు వెయ్యాలి. అందని వాడికి కేక వెయ్యాలి.’’ నిర్మొహమాటంగా, నిర్మోహంగా, కంచుఢక్కలో మోగిపోయాడు.

ఇదేక్షణాన అతని మాటలే సరైనన్నట్టుగా భైరవదుర్గ విగ్రహానికి అలంకరించిన మందారాలు శుభసూచకంగా ప్రతిమ పాదాలమీద రాలాయి. అనుకోని ఈ ఘటన అందరినీ చకితులను చేసింది. అప్పటికిగానీ గన్నియ స్థిరత్వం పొందలేదు. ఆమె మనసు మెత్తబడటం మొదలైంది. ఆ మెత్తబాటులోనూ ‘చాప చిరిగినా చదరంత..’ చందంగా,

‘‘మేం శివభక్తులం. వారు నారాయణ సేవకులు. మేం శైలోద్భవులం. శిల వంశీయులం. వారు గంగపుత్రులు. మత్స్యరాజులు. మా స్థాయి శివ సముద్రం. వారు ఆ సాగరంలో తిరుగాడే చేపపిల్లలు. మేం విక్రమార్కుని వారసులం. మాది ఘన వాకాటక చరిత. వడ్డాదికి గతంలో మేం ఎంతగానో సాయపడ్డాం.’’ గన్నియ గునిసింది.

ఆమె మెల్లగా మాట్లాడినా అదేదో అస్తిత్వపు ఘోషగానే వినబడిరది ప్రణవశర్మకి. పైగా తన సింహాసనాన్ని ఆ పిల్ల తక్కువ చేస్తున్నట్టుగానూ అనిపించింది. అతగాడు మరిక ఆగలేకపోయాడు. అసలే ప్రణవశర్మ. పేరుకు తగ్గట్టుగానే ఓంకార స్వరం. ఇకనేం. ఆ స్వరాన్ని శంఖం చేసి పలికిం చేశాడు. ఆ పలికింపులన్నీ గన్నియకే గుచ్చుకునేలా ఆమె కళ్లల్లోకి చూస్తూ స్వరచాలన సాగించేశాడు.

‘‘మీరు శివభక్తులా! కాదన్నదెవరు. అయితే మేమేం తక్కువ? మాది నారాయణ సైన్యం. శివుడి భార్య పార్వతి ఎవరు? నారాయణి కాదా! ఆమె మా నారాయణుని సోదరి కాదా? మీరు సముద్రం కావచ్చు. మేం మామూలు చేపలం కాదు. సాక్షాత్తూ విష్ణుమూర్తి ఎత్తిన మత్స్యావతారులం.’’ ఆవేశమేదో పొంగిపొరలి వస్తున్నప్పటికీ దాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకుని తేటగానే అనేశాడు శర్మ. అప్పటికీ ఆగలేదు, ‘‘ఒకప్పుడు నందపురపు ప్రతాపగంగరాజు, మా వడ్డాది ప్రతాపవీరార్జునదేవుడూ స్నేహితులు. అనంతరకాలంలో మీ గంగరాజు మా అర్జునదేవుడూ మిత్రులు. ఎవరు ఎవరికీ ఎక్కువగా సాయాలు చేసేసుకోలేదు. సమఉజ్జీలుగానే మెలిగారు. దేవేంద్రుని కాలంలో కొంత మార్పువచ్చిన మాట నిజం. ఆ మార్పు వడ్డాదిలోనే కాదు. నందరాజ్యం సహా సకల సామ్రాజ్యాల్లోనూ వచ్చిన కాలమహిమ. ఆ మహా మహిమను తట్టుకుని నిలిచేందుకే ఇప్పటి ఈ ప్రయత్నం. ప్రస్తుతాంశ విచారణ మేలు. గత జల సేతుబంధనాలు మంచివి కావు. మీలో విక్రమార్కుని జన్యువులు ఉండవచ్చు. వడ్డాదివారూ తక్కువకారు. వారు పాండవుల అంశలు.’’ ఘంటారావమై గణగణలాడిపోయాడు.

ఈ మాటలన్నీ మాకలిశక్తికీ, వెంకటేశుడికీ బాగా నచ్చాయి. రాచగన్నియ మాత్రం అదోలా అయి పోయింది. ఉద్వేగపూరితంగా, స్వరితంగా, ప్రణవ నాదంలా శర్మ సారిస్తున్న పదబంధాల ఉదుటుకు కొద్దిగా డస్సిపోయినట్టుగానూ అయింది. ప్రణవశర్మ మరింతగా మాట్లాడితే కఠినమైన మరికొన్ని చురకలు తగులుతాయేమోననే బెంగతో బుర్రవేలేసుకుని కూర్చుండిపోయింది.

గన్నియ ఈ మాదిరిగా అనుకున్నా మాకలిశక్తి మాత్రం శర్మ వాగ్విన్యాసాన్ని ఇంకాస్త చూపితేనే తన పిల్లలకు అసలు విషయాలన్నీ బోధపడతాయన్నట్టుగా భావించింది. ఆమె మనసును ఎరింగినట్టుగా శర్మ తన పదవిలాసాన్ని కొనసాగించాడు.

వడ్డాదిప్రభువుల నిజవారసత్వాన్ని గళప్రస్తారాన ఈ మాదిరిగా పలికించాడు.

‘‘మత్స్యవంశం విష్ణువు కాలం నాటిది. విష్ణువు నాభినుంచి బ్రహ్మ ఉదయించాడు. అతని కుమారుడు అత్రి. అత్రి కొడుకు కశ్యపుడు. ఇతని వంశంలోని వాడు సారంగముని. ఒకానొక సందర్భంలో ఆకాశయానం చేస్తున్న సారంగుడు ముకుంద పర్వతాన్ని ఆనుకుని నిష్కామంగా సాగిపోతున్న మత్స్యనదిని చూశాడు. ఆ నదిఒడ్డుకు చేరి గత జన్మల ప్రారబ్ధాలను పోగొట్టుకునేందుకు ఘోరమైన తపస్సు మొదలెట్టాడు. దీన్ని భంగపరచాలన్న యోచనతో మంజుఘోష అనే అప్సరసను మత్స్యనది సమీపానికి ఇంద్రుడు పంపించాడు. ఆమె ప్రేమ పాశానికి బందీ అయ్యాడు సారంగుడు. అతనికి తపోభంగమైంది. ఇదంతా ఇంద్రుడి పన్నాగమని తెలుసుకున్న సారంగుడు మత్స్యనదిలో చేపగా పుట్టమని మంజుఘోషను శపించాడు. అప్పటికే మునివల్ల గర్భం ధరించిన మంజుఘోష చేపగా నీళ్లల్లో ఈదుతూనే ముద్దులొలికే బాలుని కన్నది. అతనే సత్యమార్తాండుడు. పెరిగిపెద్దయిన ఈ శౌర్యశాలి మత్స్యరాజ్యాన్ని స్థాపించాడు. సత్యమార్తాండుని బలపరాక్రమాలు తెలుసుకుని జయత్సేనుడనే రాజు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. నాటినుంచీ మత్స్యరాజ్యం విష్ణుభగవానుని ఆదిదేవునిగా తలుస్తూ, విరాట దేశమై విరాజిల్లుతోంది.’’ ఎప్పుడయితే ప్రణవశర్మ మత్స్యరాజ్య చరిత్రను గర్వంగా చెప్పు కుంటూ వెళ్లాడో మాకలిశక్తి ఆనందం అర్ణవమైంది. వెంకటేశుడూ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. మత్స్యరాజ్యం తక్కువది కాదని రాచగన్నియా తెలుసుకుంది. అంతటితో శర్మ వదిలిపెట్టలేదు.

‘‘విక్రమార్కం, విరాటం కలిసిమెలిసి ఉంటే విలసిల్లుతాయి. వచ్చిన సదవకాశాన్ని పోగొట్టుకుంటే వికలమై వివర్ణమవుతాయి. నిర్ణయం మీదే.’’ చెప్పవల సిన చివరిముక్కలూ చెప్పేసి చెమటపట్టిన ముఖాన్ని తుడుచుకుంటూ ఆసనం మీద స్థిరత పొందాడు. ప్రసంగధారగా శర్మ చెప్పిన విశేషాలు తెలుసుకున్న మాకలిశక్తి ఏమనుకుందో ఏమో. మరుక్షణంలోనే,

‘‘ఈ సంబంధాలు చేసుకోవడం మాకు సమ్మతమే. వడ్డాదితో వియ్యం మాకు సమ్మోదమే. వడ్డాది దేవేంద్రాలు ఇకమీదట నందపురం కోడలు. మా వెంకటేశుని సతి. నందరాజ్యం రాచగన్నియ మెట్టినిల్లు వడ్డాది మత్స్యదేశం. ఆమెకు దేవేంద్రుడే పతిదేవుడు. ఈ కుండమార్పిడి పెళ్లిళ్లే ఇరురాజ్యాల సంక్షేమాల పొదరిళ్లు.’’ ఎవరు ఏమంటారోననే మొగమాటా ల్లేకుండా చెప్పేసింది.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram