– మధురాంతకం మంజుల

ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌గౌరవార్ధం ఎంపికైన కథ

————-

‘‘ఎందుకు తాతయ్యా నీకు రారాజు అని పేరు పెట్టారు?’’ అని అడిగాను ఎప్పుడో ఓసారి మేడమీద వెన్నెల్లో తాతయ్య పక్కన పడుకున్నప్పుడు.

‘ఏమ్మా, ఎందుకు అడుగుతున్నావ్‌?’’ అన్నాడు తాతయ్య నా తల నిమురుతూ.

‘‘స్కూల్లో నా ఫ్రెండ్స్ అం‌దరూ నన్ను గేలి చేస్తుంటారు తాతయ్యా.

మీ తాతయ్యకు రాజ్యమూ లేదు, సింహాసనమూ లేదు. మరి రారాజు ఎలా అయ్యాడంటూ నవ్వుతుంటారు’’ అన్నాను అలకువగా.

‘‘ఓ అలాగా! మరేం లేదమ్మా మా నాన్నేమో మనూరి కోటలో తోటపని చేసేవాడు. కోట ముందున్న కలుపు మొక్కలను తీసేసి నేల చదును చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రాకారాలను, బురుజులను ఎంతో ఆశ్చర్యంగా చూసేవాడట. రాజుల దర్పాన్ని, శౌర్యాన్ని గురించిన కథలను వింటున్నప్పుడు విస్మయంతో ఆయన రోమాలు నిక్కబొడుచుకునేవట. మనిషిగా పుట్టినవాడు రాజంతటి గొప్పవాడు కావాలి. రారాజులా అందరి దగ్గరా మన్ననలందుకోవాలి అనుకునేవాడట. అందుకే నేను పుట్టగానే ఆయన నాకు రారాజు అని పేరు పెట్టాడట’’ అన్నాడు తాతయ్య.

‘‘అయితే నువ్వు రారాజంతటి గొప్ప వాడివయ్యావా తాతయ్యా?’’ అన్నాను నేను టకీమని. తాతయ్య ఎందుకనో నేనడిగినదానికి బదులు చెప్పలేదు. నా తలగడను సరిచేసి ‘‘ఇక నిద్రపో చిన్నమ్మా.. చాలా రాత్రయింది’’ అని అటు తిరిగి పడుకున్నాడు.

నిజానికి ఆరోజు తాతయ్యను నేను అలా అడిగుండకూడదు. అప్పుడు నేను మూడో తరగతి చదివేదాన్ని. చాలా చిన్నదాన్ని. ఏమడగొచ్చో, ఏమడగకూడదో నాకెలా తెలుస్తుంది? ఇప్పుడైతే కాస్తా పెద్దదాన్నయ్యాను. ఐదో తరగతికొచ్చాను. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా కొద్దిగా నేర్చుకున్నాను. కానీ ఏం లాభం. ఇప్పుడు తాతయ్యతో కబుర్లు చెప్పడానికే వీలు పడడం లేదు. పొద్దున నాలుగింటికల్లా తాతయ్య పాల పాకెట్లు సరఫరా చేయడానికి ఊర్లోకి వెళ్లిపోతాడు. సాయంత్రాల్లో కోట నుండీ వస్తూనే పుస్తకాలకు అట్టలు వేయడానికి కూర్చుంటాడు. స్కూళ్లు తెరిచినప్పుడైతే పిల్లల టెక్టస్ ‌బుక్స్ ‌తాతయ్య ముందు కుప్పలు కుప్పలుగా పడిపోతాయి. వాళ్లిచ్చే ఐదు రూపాయలకో, పది రూపాయలకో ఎందుకు మామయ్యా ఆరోగ్యం పాడుచేసుకుంటారని అమ్మ అన్నా తాతయ్య పట్టించుకోడు. పుస్తకాలన్నింటికీ అట్టలు వేసి పడుకోవడానికి తాతయ్యకు రాత్రి ఏ పదకొండో అయి పోతుంది.

ఆరోజు మా స్కూల్లో వాళ్లు ఆరో తరగతి పిల్లలకు కోట చూపెట్టడానికి తీసుకెళుతున్నారు. నాకు భలే సంతోష మేసింది. పరిగెట్టుకుంటూ మా క్లాస్‌ ‌టీచర్‌ ‌దగ్గరకు వెళ్లి నేను కూడా కోట చూడడానికి వెళతాను టీచర్‌ అన్నాను.

‘‘కోట చూడడానికి ఆరో తరగతి వాళ్లే వెళుతున్నారు. వాళ్లతో బాటు నిన్ను పంపడానికి ఎలా వీలవుతుంది. అయినా మీ తాతయ్య కోటదగ్గర గైడు కదా, అతనితో వెళ్లొచ్చుగా నువ్వు’’ అంది టీచర్‌.

అయినా టీచర్‌కేం తెలుస్తుంది. గైడు కావడం వల్ల వచ్చే యాత్రికులకు కోట విశేషాలు చెప్పడానికే తాతయ్యకు సరిపోతుంది. మరి నన్నెలా అక్కడికి తీసుకెళతాడు అనుకుని గిరుక్కున వెనుదిరిగి వచ్చేశాను.

ఆ మరుసటి రోజు సాయంత్రం స్కూలు నుండి బయటికొచ్చి ఇంటికెళ్లడానికి ఆటో కోసం చూస్తూ నిలబడ్డాను. నన్ను చూస్తూనే కొంతమంది ఆరో తరగతి పిల్లలొచ్చి నా చుట్టూ మూగిపోయారు. ‘‘ఏయ్‌ ఇం‌దుబాలా, కోట దగ్గర పనిచేసే లోకల్‌ ‌గార్డ్ ‌గ్రాండ్‌ ‌డాటరివా నువ్వు?’’ అడిగిందో అమ్మాయి. అవునని తలూపాను.

‘‘వావ్‌, ‌వాట్‌ ఎ ‌నైస్‌ ‌పర్సన్‌, ఎం‌తబాగా చెప్పాడనుకున్నావు. మన చంద్రగిరి కోటకు కూడా ఇంత చరిత్ర ఉందా! అనిపించింది. ఆనాటి కట్టడాలు, చిత్రకళ, శిల్పకళ, రాజుల కళాపోషణ, వాణిజ్యం, యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు ఇలా ఒక్కటి కూడా వదలకుండా మీ తాతయ్య చెబుతుంటే మేము నిజంగా ఆ రోజులకే వెళ్లిపోయామనుకో’’ అన్నాడు ఒక అబ్బాయి.

‘‘మీ తాతయ్య ఇంట్లో కూడా నీకు ఈ కథలన్నీ చెబుతాడా?’’ అని అడిగింది మరో అమ్మాయి.

‘‘వాళ్ల తాతయ్య కదా, చెప్పకుండా ఉంటాడా’’ అంటూ నా చేయి పట్టుకుని ‘‘ఎంత మంచి తాతయ్య ఉన్నాడు నీకు, నిజంగా నువ్వు ఎంత లక్కీ’’ అంది ఇంకో అమ్మాయి.

‘‘ఇంటికెళ్లగానే మేమందరం థ్యాంక్స్ ‌చెప్పామని చెప్పు మీ గైడ్‌ ‌తాతయ్యకు’’ అన్నాడు అందరిలోకీ పొడుగ్గా ఉన్న అబ్బాయి.

‘‘మా తాతయ్య పేరు రారాజు’’ అన్నాను నేను నాతల కొంచెం పైకెత్తుకుంటూ. ఇంతలో వాళ్లు వెళ్లాల్సిన వ్యాన్‌ ‌రావడంతో వాళ్లు వెళ్లిపోయారు. తాతయ్యను వాళ్లు అలా పొగుడుతుంటే నాకు చెప్పలేనంత ఆనందమేసింది. రేపు ఆదివారం ఎలాగైనా తాతయ్యతో పాటు కోటకు వెళ్లాలి. ఆ కట్టడాలను, ఆ శిల్పాలను నేనూ చూడాలి అనుకున్నాను.

ఇంటికి వస్తూనే అమ్మ దగ్గరకు వెళ్లి ‘‘అమ్మా మనం రేపు తాతయ్యతో పాటు కోటను చూడడానికి వెళదామా?’’ అన్నాను.

‘‘నాకెలా కుదురుతుంది ఇందూ, రేపు నాలుగు డేలివరీ కేసులు ఉన్నాయి. డాక్టరమ్మ రేపు ఏడింటికల్లా డిస్పెన్సరీకి రమ్మంది’’ అంది అమ్మ.

‘‘అవును నువ్వేమో హాస్పిటల్లో నర్సువి. తాతయ్యేమో కోటదగ్గర లోకల్‌ ‌గైడ్‌. ‌మరి నేనెవరితో వెళ్లాలి?’’ అన్నాను బుంగమూతి పెట్టుకుంటూ.

‘‘సరేలే, తాతయ్య ఇంటికొస్తూనే రేపు నిన్ను కోటకు తీసుకెళ్లమని ఆయనతో చెబుతాను. కానీ మండే పరీక్షకు ఈరోజే చదివేసుకోవాలి నువ్వు, సరేనా?’’ అంది అమ్మ.

‘‘అలాగే అమ్మా’’ అని గబగబా వెళ్లి చుదువు కోవడానికి కూర్చున్నాను. ఆ రాత్రంతా కోట గురించిన ఆలోచనలే. చిన్నప్పుడు వెన్నెల రాత్రుల్లో తాతయ్య నాకు చెప్పిన కోట కథలన్నీ గుర్తుకొచ్చాయి.

చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రగిరి కోటంటే తెలియనివాళ్లు మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే లేరంట. తిరుపతి కొండకొచ్చే యాత్రికులంతా మన చంద్రగిరి కోటను కూడా చూసి వెళతారట. చంద్రగిరి కోటను యాదవ రాజులు నిర్మించారట. సాలువ నరసింహరాయుల కాలంలో అన్నమయ్య అనే ఓ పెద్దాయన మన తిరుపతి వెంకన్న మీద ఎన్నో పాటలు రాశాడంట. దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పిన శ్రీకృష్ణదేవరాయలు కూడా చిన్నప్పుడు మన చంద్రగరి కోటలోనే ఉండేవాడట. ఆయన మంత్రి తిమ్మరుసు కూడా చంద్రగిరిలోనే పుట్టాడంట. ఇలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియలేదు. ‘‘లేలే చిన్నమ్మా కోటకు రావాలంటే తొందరగా లేచి సిద్ధం కావాలి కదా’’ అంటూ తాతయ్య లేపడంతో గబుక్కున లేచి కూర్చున్నాను. టైమ్‌ ‌చూస్తే ఎనిమిది. అప్పటికే అమ్మ హాస్పిటల్‌కు వెళ్లిపోయినట్లుంది. నేను లేచి గబగబా రెడీ అయ్యాను. టిఫిన్‌ ‌తిని మేము కోట దగ్గరకు వెళ్లేసరికి సరిగ్గా పదిన్నర. అప్పటికే చాలామంది యాత్రికులు టికెట్లు కొని లోపలికి వచ్చేశారు. కళ్లు రెండూ పెద్దవి చేసుకుని నేను ఆ పరిసరాలను చూస్తూ ఉండి పోయాను. తాతయ్య వచ్చిన యాత్రికులను కొంతసేపు గమనించి ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలూ ఉన్న ఒక గుంపువైపు వెళ్లారు. నేను కూడా తాతయ్యను వెంబడించాను. ఆ గుంపులోని వాళ్లందరూ కన్నడ మాట్లాడుతున్నారు. ఎలా నేర్చుకున్నాడో ఏమోగానీ తాతయ్యకు తెలుగే కాకుండా కన్నడ, తమిళం కొద్దిగా మళయాలం, ఇంకా కొద్దిగా ఇంగ్లిషు కూడా వచ్చు.

‘‘నా పేరు రారాజు, నేనిక్కడ గైడును. మీకు కావాలంటే ఈ స్థల చరిత్రను వివరిస్తాను’’ అన్నాడు. వాళ్లు తాతయ్య వైపు వింతగా చూశారు. ‘‘ఇంత చిన్న కోటకు ఏమంత చరిత్ర ఉంటుంది?’’ అన్నాడు ఆ గుంపులో ఒకాయన.

‘‘కర్ణాటకలోని హంపీని పరిపాలించిన విజయనగర రాజులే చంద్రగిరిని కూడా పరిపాలిం చారు. ఆ చరిత్రతో పాటు ఈ చరిత్ర కూడా తెలిస్తేనే మీకు అన్ని విషయాలు అవగతమవుతాయి. నేను చెప్పేది వినండి. నచ్చితే డబ్బులు ఇవ్వండి. నచ్చకపోతే ఇవ్వకపోయినా ఫరవాలేదు’’ అన్నాడు తాతయ్య. వాళ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ‘సరే చెప్పండి వింటాం’ అన్నారు.

అర్ధ చంద్రాకారంలో ఉన్న కొండ, కొండ దిగువన ఉన్న చంద్రగిరి దుర్గం, కోట చుట్టూ ఉన్న రాతి గోడలు, సైనికులు పహారా తిరిగే కోట బురుజులు, రాజమహల్‌, ‌రాణి మహల్‌ ఇలా వాళ్లకు అన్ని విషయాలు వివరిస్తూ, వాళ్లు తిరగ గలిగినంత దూరం తిరిగి కోటనంతా చూపెట్టారు తాతయ్య. ఇంట్లో తాతయ్యకు, ఇక్కడి తాతయ్యకు చాలా తేడా కనిపించింది నాకు. ఆనాటి చరిత్ర మాత్రమే కాదు ఆనాటి రాజుల ఆచార వ్యవహారాలు, వాళ్ల కళా పోషణ, వాళ్ల సంస్కృతి సంప్రదాయాలు ఇలా అన్ని విషయాలు చెప్పి అక్కడక్కడా కొన్ని కథలను కూడా జతజేర్చాడు తాతయ్య. ఆ కథలలో కొన్ని నాక్కూడా కొత్తవే. వాటిని విన్నప్పుడు చాలా ఆశ్చర్యమేసింది.

రాజులు తమ శరీరాలను బలంగా ఉంచు కోవడానికి బంగారు తీగలను వేడివేడి అన్నం మీద వేసుకుని తినేవాళ్లట. శ్రీకృష్ణదేవరాయలు కొండమీద దేవునికి ప్రసాదం పెట్టాక అక్కడి పూజారి కొట్టే గంట విని తాను భోజనం చేసేవాడట. రాణిమహల్‌ ‌పక్కన కొండమీద రాతితో చెక్కిన ఒక ఉరిస్తంభం ఉంది. దానిమీద తప్పుచేసిన వాళ్లను ఉరి తీసే వాళ్లట. కొన్నిచోట్ల తాతయ్య వేసే జోకులకు ఆ కన్నడా వాళ్లు పగలబడి నవ్వేవాళ్లు. కొన్ని విషయాలను విన్నప్పుడు కళ్లలో నీళ్లు తిరగడం కూడా నేను చూశాను. నాక్కూడా అప్పుడు ఏడుపొచ్చింది. అన్నీ చూపెట్టి వాళ్లకు నమస్కారం చేసి వెనుదిరగ బోయాడు తాతయ్య.

‘‘ఇదిగో రారాజు, ఈ డబ్బులు తీసుకో. అన్ని విషయాలూ బాగా వివరించావు’’ అంటూ మగవాళ్లు వాళ్ల వాళ్ల జేబుల్లోంచి డబ్బుతీసి తాతయ్య చేతిలో పెట్టారు. ఆ తర్వాత రెండు, మూడు గ్రూపుల వాళ్లకు కూడా తాతయ్య ఇదేవిధంగా కోట విశేషాలు వివరించారు. చివరికి సాయంత్రం ఐదు గంటలకు నేనూ, తాతయ్య రాజమహల్‌, ‌రాణిమహల్‌ ‌మధ్యనున్న ఒక మర్రిచెట్టు నీడలోకి వెళ్లి కూర్చున్నాం.

‘‘రోజు చెప్పిన కథలే చెబుతుంటావు బోరు కొట్టదా తాతయ్యా నీకు’’ అన్నాను.

అందుకు తాతయ్యా అన్నాడు ‘‘బోరు కొట్టడమా! నాకా, ఈ శిథిలాలలో నాకు రోజూ ఒక అద్భుతం కనిపిస్తుంది చిన్నమ్మా. వినగలిగే మనసున్నోళ్లకు ఈ రాళ్లు చెప్పే కథలు కోకొల్లలు. బుడిబుడి నడకలు వేస్తున్నప్పుడే ఈ కోటకు మా నాన్నతో పాటు వచ్చేవాడిని. ఇక్కడున్న ప్రతి చెట్టూ చేమా, రాయీ రప్పా అన్నీ నాకు మిత్రులే. అవి చెప్పే గాథలను శ్రద్ధగా వింటాను. వాటితో నా సాదకబాదకాలు చెప్పుకుంటాను. సాళువ నరసింహరాయలుతో మాట్లాడేటప్పుడు నేను అన్నమయ్యను, శ్రీకృష్ణదేవరాయలతో మాట్లాడేటప్పుడు తిమ్మరుసును ఇలా ఊహించుకుంటూ ఈ చరిత్రలో నేను లయించి పోయానో లేక ఈ చరిత్రే నాలో లీనమైపోయిందో నాకు తెలియదు.’’ ఊపిరి పీల్చుకోవాలన్నట్లు కాసేపు ఆగాడు తాతయ్య.

‘‘చరిత్రంటే నీకెందుకు తాతయ్యా అంత ఇష్టం?’’ అన్నాను.

‘‘ఎందుకంటే చిన్నమ్మా ఈ చరిత్ర నాకు కొత్తగా కనిపించదు. రాజుల కాలం నుండి ఇప్పటివరకు శిథిలమై రోజురోజుకు రూపు మాసిపోతున్న ఈ రాళ్లగుట్టళ్లో నేను ఒక మట్టి పెళ్లనే. అందుకేనేమో జీవితాంతం ఆ రాజులు చేసిన పనే నేనూ చేస్తా వుండా. వాళ్లు కనిపించే శత్రువులతో పోట్లాడితే నేను కనిపించని శత్రువులతో పోట్లాడతావుండా. ఎన్నిసార్లు సంధి చేసుకున్నా పేదరికమనే శత్రువు ఇంకా దండయాత్రలు చేస్తూనే వుంది. కాలమనే పగవాడు ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచాడో చెప్పడానికి అలవికాదు.

రోగాలనేవి మనలాంటి పేదవాళ్ల పాలిటి ఉన్నట్టుండి మీదపడే మెరుపుదాడులు చిన్నమ్మా. అవి మనం కన్నుమూసి తెరిచేలోపే మన బ్రతుకుల్ని తలకిందులు చేసిపారేస్తాయి.

క్యాన్సర్‌ అనే రాచపుండు ధాటికి తట్టుకోలేక చావు ముందు మోకరిల్లడం కన్నా వేరేదారి కనబడలేదు మీ నాయనమ్మకు. నా వొక్కగానొక్క కొడుకు అదే మీ నాయన తిరుపతిలో సబ్‌ ‌పోస్టాఫీసులో క్లర్క్‌గా పనిచేసేవాడు. ఉద్యోగం చేస్తూనే పై చదువులు చదువుకుంటూ ఉండేవాడు. గుండె దిటవుండే బిడ్డ. బ్రతుకు బరిలో దిగి పోరాటానికి సిద్ధమవుతూ ఉండగానే గుంతనక్కలా పొంచివున్న ప్రమాదం వాడ్ని పొట్టనబెట్టేసుకుంది. ఒకరోజు సాయంత్రం పని చూసుకుని తిరుపతి నుండీ చంద్రగిరికి స్కూటర్‌లో తిరిగొస్తావుంటే లారీ వచ్చి గుద్దేసింది. నిన్ను కడుపులో పెట్టుకుని నిండు గర్భిణీగా ఉన్న మీ అమ్మ భర్త చావు కబురు వినగానే స్పృహదప్పి దబ్బుమని కిందపడిపోయింది. వారం రోజులదాకా మూసిన కండ్లు తెరవలేదు. పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. నాబిడ్డ పోయినందుకు అంగలార్చాలా లేక ఇంకా పుట్టని వాడి బిడ్డను కాపాడుకోవాలా అని నేను కొట్టుమిట్టాడి పోయినాను. కానీ బాధపడి మాత్రం చేసేదేముంది. మహా మహా శ్రీకృష్ణదేవరాయల వారికే పుత్రవియోగం తప్పలేదు. ఆయన ముందు నేనెంత. విషయం తెలిసి మీ అమ్మమ్మ వాళ్లు కూడా పరిగెత్తుకుని వచ్చినారు. మీ అమ్మమ్మ వాళ్లు కూడా మనిషి సహాయమైతే చేస్తారు గాని డబ్బు సహాయం చేసేంత ఉన్నోళ్లు కాదు. మీ అమ్మను తీసుకెళ్లి తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్పించి ఎట్లనో నిన్ను, మీ అమ్మను కాపాడుకోనొస్తిని. నా తర్వాత మీరిద్దరు ఏమైపోతారో అని ఆలోచించి కొన్నాళ్లయ్యాక మీ అమ్మను నర్సు ట్రైనింగ్‌కు పంపించి చదివిస్తిని. ఇలా గెలుపు ఓటమి నన్ను చిన్నప్పటినుండి వెంటాడుతూనే ఉన్నాయి చిన్నమ్మా. వయసు మీదపడుతున్నా వీటి నుండి తప్పించుకునే ఉపాయం మాత్రం తెలియడం లేదు నాకు’’ అని కాసేపు గుక్కిళ్లు దిగమింగుకుంటూ ఉండిపోయాడు తాతయ్య.

తాతయ్యా ఏడుస్తున్నాడా అని నాకనుమానమేసింది. నేను తాతయ్యతో పాటు ఏడ్చేస్తానేమోనని కూడా అనిపించింది. కానీ నేను ఏడిస్తే తాతయ్యను బుజ్జగించే వాళ్లు ఎవరు! అందుకే ఏం మాట్లాడాలో తెలియక ‘‘పోనీ తప్పించుకునే ఉపాయమేదైనా ఉంటే చెప్పమని మీ రాయల వారిని అడక్కపోయావా తాతయ్యా’’ అన్నాను ఆరిందలా.

‘‘అడిగాను చిన్నమ్మా, అడక్కుండా ఉంటానా. ‘ఏమోయ్‌ ‌రారాజు! జీవితంలో గెలిచామా ఓడామా అన్నది ముఖ్యం కాదు. అసలు నువ్వు పోరాడుతున్నావా లేదా అన్నదే ప్రధానం. సమస్యలతో పోరాడే ప్రతి మనిషీ వట్టి రాజు మాత్రమే కాదు. రారాజు కూడా, తెలిసిందా’ అన్నాడమ్మా రాయలవారు’’ అన్నాడు తాతయ్య ఎదురుగా ఉన్న రాజమహల్‌ ‌వైపు తలెత్తి చూస్తూ.

‘‘అయితే ఆ రాయలవారే ఒప్పుకున్నారన్న మాట నువ్వు రారాజువని’’ అన్నాను సంతోషంగా.

‘‘అలా అనడం రాయలవారి ఉదారత చిన్నమ్మా. ఆయనతో నాకు పోలికేమిటి? ఆయన జీవితం కథైంది. కథ చరిత్రయింది. ఆ చరిత్ర బడిలో పాఠమయింది. నా కథ ఎవరికి కావాలి. చరిత్ర తెలసిన ఈ రాళ్లు మూగబోయినట్లే నా చరిత్రా నోరులేక మూగబోయింది. ఇప్పుడు సామాన్యుని కథ రాసే చరిత్రకారులు లేరు. రాసినా ఆ చరిత్రను తెలుసుకోవాలనుకునే మగ మహారాజులూ లేరు’’ అన్నాడు తాతయ్య నిరాశగా.

‘‘పోనీ నీ కథ నువ్వే రాసుకోవచ్చుగా తాతయ్యా’’ అన్నాను ఆయనకు ధైర్యం ఇవ్వాలని. ‘‘మన కథ మనమే రాసుకుంటే అది జీవితచరిత్ర అవుతుంది గానీ చరిత్ర ఎలా అవుతుందమ్మా?’’ అన్నాడు తాతయ్య.

‘‘అయితే మనలాంటి పేదవాళ్ల కథలన్నీ ఎవరికీ తెలియకుండానే పోతాయా తాతయ్యా?’’ అన్నాను దిగులుగా.

‘‘సామాన్యుల జీవితకథలు చరిత్ర పుటలకెక్కాలంటే ఆ సమాజంలోని జనులందరూ అతి సామాన్యులై ఉండాలి చిన్నమ్మా. అలాంటి సమాజంలో ఒక సాధారణ వ్యక్తి జీవితగాథ కూడా మనసును హత్తుకునే కథగా కలకాలం నిలిచిపోతుంది. ఘననీయమైన చరిత్రగా చిరకాలం మిగిలిపోతుంది.’’ అని ‘‘అయినా నువ్వు ఇంకా చిన్నదానివి. ఇవన్నీ నీకు ఎలా అర్థమవుతాయి?’’ అంటూ నా చేయి పట్టుకుని లేచి ‘‘లైట్‌ ‌షోకు టైమయింది. వెళదాం పద’’ అన్నాడు తాతయ్య.

ఆయన వెంట వెళుతూ అనుకున్నాను- ‘‘నువ్వేమీ బాధ పడకు తాతయ్యా. పెద్దదాన్నయ్యాక నీ కథ నేను రాస్తాను. అప్పుడది మా తాతయ్య కథగా నిలిచిపోతుంది. ఒక రారాజు చరిత్రగా మిగిలిపోతుంది.’’

About Author

By editor

Twitter
Instagram