ఒంటరితనం ఎప్పుడూ బాధాకరమే. అటువంటి వనితల జీవితాలు ప్రశ్నార్ధకమే అవుతున్నాయి. ఇప్పటి సామాజిక స్థితిగతులు గమనిస్తుంటే వేదన, ఆగ్రహం- రెండూ తప్పడం లేదు. వారికి ఎదురవుతున్న అనుభవాలు ఇంత అని చెప్పలేనంత! కారకులెవరు? అని పరికించి చూస్తే, సమస్యకు పరిష్కారం ఎందుకు సాధ్యం కావడం లేదన్నది గ్రహిస్తే, మిగులుతోంది ధర్మాగ్రహమే! ఈ లోకంలో నాకు ఏ ఒక్కరూ లేరు అంటూ ఏ ఆడపిల్ల అయినా కంటతడి పెట్టిందంటే, ఇక అంతే. నేలమీద ఒక్క మొక్కా మొలవదు. నాది ఒంటరి బతుకని ఇంకా ఇంకా కుమిలిపోవాల్సి వస్తే, ప్రపంచంలో వెలుగన్నదే ఉండదు. రోజూ పత్రికలు, టీవీలు, ఇతర సామాజిక మాధ్యమాల్లో హృదయ విదారకాలెన్నో చూస్తున్నాం. మనకు తెలియని, మనం కనీసం ఊహించలేని వాస్తవాలు అనేకం. వివిధ రకాల కారణాలతో పరిచ్యుతులు, తిరస్కృతులు, బహిష్కృతలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎందరో ఉన్నారు. అడుగడుగునా దుర్భరత తాండవిస్తుంటే, దిక్కుతోచక మూగగా రోదించే అభాగినులూ దేశంలో అసంఖ్యాకం. పేదరికం ఒక్కటే కారణం కాదు; అంతకు మించి ఇంటాబయటా చిన్నచూపు, అన్నివిధాలా కించపరిచే ధోరణి. చిరకాలపు ఈ సాంఘిక వ్యాధికి మందేది? భయానకంగా తరుముకొస్తున్న రుగ్మతకు చికిత్స ఎక్కడుంది?

పెళ్లికాని, చేసుకోని వారుంటారు. భర్తని కోల్పోయి, విడివడిన స్థితిలోని మహిళలూ ఉంటారు. జీవనాధారం కరవై కొందరు, పసిబిడ్డలతో కాలం గడపక తప్పని మరికొందరు. అక్కడా ఇక్కడా నానా చాకిరీ చేస్తే తప్ప పొట్టగడవనివారు ఇంకెంతమందో! కుటుంబానికి దూరమై, కుటుంబంలోనే ఉన్నా మనుగడ భారమైన అనేకులు. ప్రమాదాల్లోనో ప్రకృతి వైపరీత్యాల వల్లనో అయినవారిని పోగొట్టుకున్న స్త్రీలు ఎంతమంది లేరు? గుండె మండితే జరిగిపోయిన వాటికి కారాగారాలపాలై విడుదలైన తరుణులూ చాలామంది. చేయని పాపానికి చెరసాలవాసం పొందివచ్చినవారికీ కొదవ లేదు. చీకటి కూపాల విముక్తులు సైతం ఇంకెందరో. దృష్టిని కేంద్రీకరిస్తే- కుటుంబ సభ్యులతో ఒకే చోట ఉంటూ కూడా, ఒంటరి చింతన వీడని ముదితలు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తారు. ఇంతకుముందే చెప్పినట్లు- అన్నిటికీ ఆర్ధికమే మూల కీలకం కాకపోవచ్చు. అందరూ ఉన్నా, వారిలో ఎవ్వరూ తనవారు కాదన్న నిశ్చయానికి ఆడపిల్ల వచ్చిందంటే… ఆ పాపం సమస్తం ఇంటి లోపల ఉన్నవారిదే. చట్టం దానికి ఏ పేరుపెట్టినా, పీడితులు మాత్రం మహిళలే. ఒంటరితత్వం ఎందరిని ఎన్ని రకాలుగా హింసిస్తోందో లెక్కతేల్చే వ్యవస్థ సంబంధిత సేవాసంస్థల జాతీయ సమాఖ్యకైనా ఉందని అనలేం. సమస్య తీవ్రత మటుకు ఊహాతీతంగా మారిందంటే, మనమంతా నమ్మి తీరాలి.

మనసు కరగదా?

జీవనయానంలో ఒక్కరే ఉండాల్సి రావడం ఊబిలో దిగబడటంతో సమానం. అందులోనే కుంగి కృశిస్తున్న ఆడవారికి దోహదపడి అండదండ లందించాల్సిన ప్రాథమిక బాధ్యత సమాజంలోని ఇతరులకు ఎంతైనా ఉంటుంది. దీన్ని విస్మరించే పాలకులకు, తదితరులకు పుట్టగతులుంటా యంటారా? అని సంస్కర్త రాజా రామ్మోహన్‌ ‌రాయ్‌ ఏనాడో నిలదీశారు. ఆర్తులకు ఊతమివ్వడమన్నది కర్తవ్యం. ‘ఉద్ధరణ’ వంటి పెద్ద పదాలు వాడాల్సిన పనేమీ లేదని అప్పట్లోనే హితవు పలికారాయన.

ఇప్పటి అనేక ప్రభుత్వాల హామీల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది! ఒంటరి మహిళల ఆలనా పాలనా చూస్తామని వాగ్దానం చేయని రాజకీయపక్షమంటూ లేదు దేశంలో. చెప్పినవాటికి కట్టుబడిన సందర్భాలనూ వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అవకాశాల్లో సగం అనేది తర్వాత సంగతి, ముందు అన్నిటా అంతటా నిరాదరణకు గురవుతున్న స్త్రీల అతీగతీ పట్టించుకుంటే అదే పదివేలు. ఎప్పుడూ ఎన్నడూ వనితల గౌరవానికి భంగం కలగనివ్వబోమని ప్రతిజ్ఞలు చేసే పాలక పక్షాల్లోనే- పనిగట్టుకొని గండికొట్టే ప్రబుద్ధులు తయారయ్యారు. ఆ ప్రజాప్రతినిధుల, అధికారుల, బాధ్యుల పేర్లు చెప్పాల్సి వస్తే… ఎక్కడ చూసినా చేంతాడంత జాబితాలు కనిపిస్తాయి. మహిళా సాధికారత, సమానత వగైరాలు ప్రసంగాలు, పుస్తకాలకే పరిమితం. జాతీయ విధాన ముసాయిదా రూపకల్పనలు బాధితుల్లో ఆశలు రేకెత్తించాయే కానీ, ఆచరణలోనైతే ఎండమావులే! మునుపు ఒకానొక సమయంలో సాక్షాత్తు భారత రాష్ట్రపతే ‘వనితలపై ఇంకా చిన్న చూపేనా?’ అంటూ వ్యాఖ్య చేయడం మనలో నేటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. న్యాయస్థానాలైతే గతంలో, వర్తమానంలోనూ విధివంచితల ప్రస్తావనలు చేశాయి, చేస్తున్నాయి. దేశవ్యాప్త యంత్రాంగమున్న స్వచ్ఛంద సంస్థలు నాడు సమర్పించిన నివేదికల వివరాలనీ అవి పరిశీలించాయి. పరమ దయనీయ జీవితాలు కొనసాగిస్తున్న వితంతు స్త్రీల పరంగా కోర్టులు తీవ్ర ఆందోళనలనే ప్రకటించాయి. ‘అసలే బాధిత హృదయాలు, ఆపై నానాటికీ పెచ్చుపెరుగుతున్న వివక్ష ధోరణులు.. వారిలో కొందరు ఉంటున్నవి ఆశ్రమాలా- ఇంకెన్నో రకాల సమస్యల నిలయాలా?’ అని పరమోన్నత న్యాయస్థానం అలనాడు చేసిన వ్యాఖ్య వాస్తవిక స్థితికి సూచిక కాక మరేమిటి?

మనిషితనానికి దూరం కావద్దు!

ప్రభుత్వాలు అసలేమీ చేయడం లేదని కోర్టులు తప్పుపట్టడం లేదు. చెప్పినవాటికి, చేసే పనులకీ మధ్య పొంతన అవసరమని మాత్రం గుర్తుకు తెస్తున్నాయి. ఆ మాటకొస్తే, ఒంటరి స్త్రీలకు ప్రభుత్వాలు, పౌర సమాజాల నుంచి ఎటువంటి ఆసరా లభిస్తోందో తేల్చడానికి సుప్రీంకోర్టు ఏళ్ల క్రితమే అధ్యయన సంఘాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా జాతీయస్థాయి మహిళా కమిషన్‌ ‌సమర్పించిన పరిశీలనాంశాలనీ దృష్టిలో పెట్టుకుంది. అంతటితో ఆగకుండా వివిధ స్థాయుల్లో న్యాయసేవా సంస్థలు రూపొందించిన నివేదికలనీ ‘సుప్రీం’ సమగ్ర అధ్యయనం చేసింది. ఆదరణ కరవైనవారి వైపు ఒక్కసారి చూపు సారిస్తే, ఎంతటివారికైనా కళ్లల్లో నీళ్లు తిరగక మానవు. మనసుపెట్టి చూసినప్పుడు మనకే తెలుస్తుంది. ఎవ్వరికైనా సరే, కనీస అవసరాలంటూ ఉంటాయి కదా! అందునా ఆరని తీరని వేదనలో కూరుకుపోతున్న స్త్రీమూర్తులకు భరోసా కలిగించడాన్ని మించిన మానవత ఉంటుందా ఎక్కడైనా? ఏటా బడ్జెట్‌ ‌నిధుల కేటాయింపులను పెంచండన్న సామాజికవేత్తల సూచనను ప్రభుత్వాలన్నీ నెత్తిన పెట్టుకోవాలి. ఇప్పుడలా జరుగుతోందా అంటే, మళ్లీ ప్రశ్నార్ధకం. అందరూ మరో పర్యాయం మహిళాభివృద్ధి మంత్రిత్వశాఖ పనితీరుని గమనించడం అత్యవసరం. విద్య, ఉపాధి, వైద్యం, భద్రత ఇవన్నీ కావాల్సిందే. వీటికంటే మొదట బాధిత వనితలు, ప్రత్యేకించి ఒంటరివారి పట్ల శ్రద్ధచూపి ఆదుకోవడమే న్యాయం, ధర్మం, అన్నీ. ఇవన్నీ ప్రబోధాలతోనో ఆదేశాలతోనో ఒనగూడేవి కావు. మనిషితనం మనలో ఇంకా మిగిలే ఉందని వెల్లడించే మార్గాలు.

ఆశల పల్లకి

దేశంలోని అభాగినుల రీతి ఆసాంతం మారేలా కార్యాచరణ ప్రణాళిక లేదా అంటే, ఒకటి కాదు-చాలా ఉన్నాయి. పథకాల కంటే సదాచరణ మిన్న. ఎన్నో కారణాల మూలంగా ఇళ్లకు మళ్లలేని మహిళలూ ఉంటుంటారు. వారికి వర్తించాల్సిన స్వాధార్‌ ‌తరహా సహాయక చర్యలు వేగవంతం కావాల్సిందే. ఉదాహరణకు- వితంతు పింఛన్లు పొందడానికి పేర్లు నమోదైనవారు మొత్తంమీద 27 శాతమేనని నాలుగేళ్లనాటి లెక్క. కాలక్రమంలోనూ ఈ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదంటే ఇంకేమనాలి? ఒకటిన్నర దశాబ్దంనాటి వరకూ ఒంటరి వనితలకు అందిన నెలవారీ పింఛను వందల రూపాయలకే మితమయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రద్ధాసక్తుల పర్యవసానంగా, ఆ మొత్తాలు పెరిగినా పంపిణీ లోపాలు నేటికీ వేధిస్తూనే వస్తున్నాయి. సంక్షేమం, ప్రగతి ఎంత ప్రధానమో; అంతకు మించింది మానవత. అవకాశమంటూ ఇస్తే, ఎక్కడ ఏ రంగంలోనైనా మహిళలదే అగ్రస్థానమన్నది తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై అక్టోబరు తొలివారంలో ఒక సదస్సు సందర్భంగా చేసిన అభిభాషణ. వనితా పురోగతికి అంతరిక్షమే హద్దు కావాలంటూ శుభకామన వ్యక్తపరచారు. ఆకాశంలో, అవకాశాల్లో సగభాగమైన ఆడపిల్లను సమాజం ఎంత బాగా చూసుకోవాలో సూటిగా చెప్పారామె. మహిళల కళ్ల నుంచి నీళ్లు కాదు, వెన్నెల కురవాలి మరి. ఇంకో సందర్భంలో – ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్‌… ‌బాధితలకు సంబంధించి మానవతా ప్రాధాన్యాన్ని విఫులీకరించారు. వీటన్నింటి నేపథ్యంలో, ఒంటరి బతుకు తోటల్లో వెలుగు పూలనే మనమంతా కోరుకుందాం.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram