జనవరి 4, 2015: మాటలకందని ఒక అనుభూతిని నాకిచ్చిన రోజు అది. సాహితీ సమరాంగణా సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలవారి రచన ఆముక్త మాల్యద. ఈ దేశం మొత్తం మీద తాళపత్ర గ్రంథం రూపంలో ఆ ప్రబంధం ఒక్క తంజావూరు మహారాజా సెర్ఫోజీ గ్రంథాలయం లేదా సరస్వతీ మహల్‌లో లభ్యమవుతున్నది. ఆ అపురూప తాళపత్ర ప్రతి ఆరోజే నా చేతులలో దాదాపు పది నిమిషాల పాటు ఉంది. ఆ తాళపత్ర గ్రంథం అక్కడ నాలుగు వందల ఏళ్ల నుంచి ఉందని గ్రంథాల యాధికారి చెప్పడం నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది కూడా. తన రచనను రాయలవారు కొండలలో నెలకొన్న ఆ కోనేటి రాయుడికి అంకితం ఇవ్వడం మరొక విశేషం.

తెలుగు సాహిత్యానికి రాయలవారితో వచ్చిన మరొక కీర్తి అష్టదిగ్గజాలు. నిజానికి తంజావూరు సరస్వతీ మహలే ఒక అపురూపు గ్రంథాలయం. 816 మహోన్నత తాళపత్ర గ్రంథాలు అక్కడ చూడవచ్చు. ఆ ఆనందక్షణాలను తలుచుకున్న ప్రతిసారి విజయనగరాధీశుడు, ఆయన విజయ యాత్రలు, క్షేత్ర సందర్శనాలు, అంతిమంగా తెలంగాణ కోటల మీద దాడులు గుర్తుకు వస్తూనే ఉంటాయి. నా అబి •ప్రాయం ఒక్కటే. ఆ యుద్ధవీరుడు గజపతులతో వైరం కొనసాగించకుండా, చేయి చేయి కలిపి ఉంటే, తెలంగాణ ముస్లిం పాలనలో అంత సుదీర్ఘకాలం బాధలు పడే అవసరం ఉండేది కాదు.

తుళువ వంశీకుడు శ్రీకృష్ణదేవరాయలు 1509-1529 మధ్య విజయనగర సామ్రాజ్యాన్ని ఏలాడు. తన శత్రువులందరినీ పాదాక్రాంతం చేసుకున్నాడు. తిరుమల శ్రీవారు సహా ఎన్నో హిందూ దేవాలయాలకు దానధర్మాలు చేశాడు. శ్రీవేంకటేశ్వర స్వామిని రాయలు ఏడుసార్లు దర్శించుకున్నాడు. మొదటిసారి ఫిబ్రవరి 10,1513లో దర్శించు కున్నాడు. తమ కులదైవంగా పూజించాడు. చివరిగా ఫిబ్రవరి 17, 1521న దర్శించుకున్నాడు (దేవస్థానం శిలాశాసనాలపై ఎస్‌. ‌సుబ్రహ్మణ్యశాస్త్రి నివేదిక). కొన్నిసార్లు తన దేవేరులతో కలసి స్వామివారిని దర్శించుకున్నాడు. అయితే ఆయన ప్రతి తిరుమల యాత్ర ఆధ్యాత్మికం కాదు. ఆ యాత్రలన్ని చరిత్ర ప్రసిద్ధమైనాయి. ఎంతో సమాచారం ఇస్తున్నాయి. దండయాత్రలు చేసి, విజయోత్సాహంతో తిరిగి హంపీ వెళుతూ స్వామివారిని దర్శించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ యాత్రలన్నింటి గురించి శ్రీవారి ఆలయం చుట్టుపక్కల దొరికిన యాభయ్‌ ‌వరకు శిలాశాసనాలలో కనిపిస్తుంది. ఆ శాసనాలన్నీ మూడు భాషలు- తెలుగు, తమిళం, కన్నడలలో ఉన్నాయి. ఆ మూడు భాషాప్రాంతాలను ఆయన పాలించాడు.

 తిరుమలకు మొదటిసారి వెళ్లినప్పుడు ఇద్దరు దేవేరులు చిన్నాజీదేవి, తిరుమదేవి రాయల వెంట ఉన్నారు. ఆ సందర్భంగా ఆ ముగ్గురు తిరుమలేశునికి ఇచ్చిన కానుకల వివరాలను ఎనిమిది శిలాశాసనాలు చెబుతున్నాయి. మే2, 1513లో రెండోసారి దర్శించినప్పుడు రాణులు వెంటలేరు. మూడోసారి అంటే జూన్‌ 13, 1513‌న తిరుమలకు ఆయన వెళ్లాడు. అప్పుడే ఆ ఆలయానికి ఐదు గ్రామాలను దానంగా ఇచ్చాడు. శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా ఆ రోజే దర్శించాడు. అక్టోబర్‌ 25, 1515‌న నాలుగవసారి వెళ్లాడు. ఆ సందర్భంగా ప్రతిష్టించిన శిలాశాసనంలో గజపతుల మీద విజయాల గురించి చెక్కించారు. జనవరి 2, 1517న ఐదవసారి వేంకటేశుని చూశాడాయన. ఇది కూడా గజపతులతో జరిగిన దీర్ఘ యుద్ధాల తరువాతే. ఈ సందర్భంగా వేయించిన శాసనంలోనే తెలుగు రాజ్యం మీద ఆయన చేసిన దాడి ప్రస్తావన ఉంది.

తెలుగు రాజ్యం అంటే నేటి తెలంగాణ. ఇందు లోనే కొన్ని కోస్తా ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో కృష్ణరాయలు ఈ ప్రాంతంలోని ఉండ్ర కొండ, ఉర్లగొండ, అరవపల్లి, జల్లిపల్లి, కందికొండ, కప్పులవాయి, నల్లగొండ, కంభంమెట్ట, కనకగిరి, శంకరగిరి మొదలైన కోటలు స్వాధీనం చేసుకున్నాడు. ఈ కోటలను ధ్వంసం చేసిన తరువాత రాజ మహేంద్రవరం వెళ్లి, అక్కడ నుంచి తన రాజధాని హంపీ విజయనగరం చేరుకున్నాడు.

ఐదవ పర్యాయం జరిగిన తిరుమల యాత్రలోనే స్వామివారి విమానం (గోపురం) బంగారుపూతకు రాయలవారు 30,000 వరహాలు అర్పించాడు. కూడా ఉన్న రాణులు కూడా 200 వరహాలు సమర్పించారు. ఆరో తిరుమల యాత్ర అక్టోబర్‌ 16, 1518‌లో జరిగింది. ఇది తనకు అప్పుడే కలిగిన సంతానాన్ని దీవించమని స్వామివారిని విన్నవించు కోవడానికి చేసినది (కానీ దురదృష్టవశాత్తు ఆ బాలుడు ఆరో ఏటనే చనిపోయాడు (ఈ మరణం వెనుక అనేక సందేహాలు ఉన్నాయి). అంటే ఇది పూర్తిగా తీర్థయాత్రే. ఫిబ్రవరి 17, 1521న కడసారిగా స్వామిని రాయలు చూశాడు. అప్పుడే 10,000 వరహాలు కైంకర్యం చేయించాడు. చివరి ఐదేళ్లు రాయలు తన రాజప్రాసాదం వీడి రాలేదు. ఇటీవలనే లభ్యమైన ఒక శిలాశాసనం ప్రకారం ఆయన అక్టోబర్‌ 17,1529‌న కన్నుమూశాడు.

ముస్లిం దండయాత్రలతో కునారిల్లిన హిందూ ధర్మానికీ, మతానికీ పూర్వ వైభవం తెచ్చిన ఘనత విజయనగర సామ్రాజ్యానిదే. దక్షిణ భారతదేశ చరిత్రలో ఆ కాలానికి స్వర్ణయుగమని ఖ్యాతి. దక్షిణాన కృష్ణా నది వరకు వ్యాపించింది. కృష్ణకు ఉత్తరాన ముస్లిం పాలకులు ఉన్నారు. పశ్చిమాన హిందూ పాలకులు గజపతులు ఉన్నారు. కృష్ణరాయలు పట్టాభిషిక్తుడయిన నాటికి బహమనీ రాజ్యం పతనావస్థలో ఉంది. దాని శిథిలాల నుంచే అదిల్‌ ‌షాహి, నిజాంషాహీ, కుతుబ్‌ ‌షాహి, బదీర్‌ ‌షాహి, ఇమద్‌ ‌షాహి అనే రాజ్యాలు ఉద్భవించాయి. కానీ ఇవి పటిష్టంగా లేవు. రెండు నదుల మధ్య ప్రాంతమైన రాయచూర్‌ ‌కోసం ముస్లిం పాలకులతో రాయలు కేవలం రెండు యుద్ధాలే చేశాడు. ఇందులో మొదటిది 1510లో జరిగింది. కోవిలకొండ యుద్ధం ఇదే. ఈ యుద్ధంలోనే తన శత్రువు యూసుఫ్‌ అదిల్‌ ‌షాను చంపి రాయచూర్‌ను రాయలు స్వాధీనం చేసు కున్నాడు. బీజాపూర్‌కు చెందిన అదిల్‌షాహి వంశ స్థాపకుడు ఇతడే. కానీ గజపతులతో యుద్ధాలతో తలమునకలై ఉన్నప్పుడు ఇస్మాయిల్‌ అదిల్‌ ‌షా నాయకత్వంలో మళ్లీ రాయచూర్‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే రాయచూర్‌ ‌దగ్గర జరిగిన యుద్ధంలో ఇస్మాయిల్‌షాను రాయలు ఓడించి తిరిగి దానిని తన వశం చేసుకున్నాడు. కానీ రాయల చివరిదశలో ఏకైక హిందూ సామ్రాజ్యానికి కూడా బలహీన పాలకులు వచ్చారు. వారు ముస్లింలతో పోరాడలేదు. ఇక్కడ మా తెలంగాణ శతాబ్దాల తరబడి ముస్లిం ఏలుబడిలో ఉండిపోయింది.

తెలంగాణకు, రాయలకు ఉన్న సంబంధం గురించి ఒకసారి చూడాలి. కృష్ణకు ఉత్తరంగా ఉండడం వల్ల తెలంగాణ ప్రాంతం ఏనాడూ రాయల పాలన కిందకు రాలేదు. కానీ ఒక సమయంలో మాత్రం ఆయన దాడులను చవి చూసింది. పదిహేడు కోటలు ధ్వంసమైనాయి. ఈ వివరాలే తిరుమలకు రాయలు ఐదో పర్యాయం వచ్చిన సందర్భంగా వేయించిన శాసనంలో కనిపిస్తాయి. ఆ తరువాత మళ్లీ ఆయన తెలంగాణ రాలేదు. అయితే స్థానిక పాలకులను బలహీన పరిచి ఐదువందల ఏళ్లు ముస్లిం పాలన కొనసాగేందుకు ఆ యాత్ర ఉపక రించింది. అందుకే తెలంగాణ ప్రాంతంలో రాయలకూ, విజయ నగర వైభవానికీ గుర్తింపు ఉండదు. ఆయన గజపతులను అణచివేశాడు సరే! తెలంగాణ మీద ఎందుకు దాడి చేసినట్టు? అదీ తెలుగు రాజ్యం కదా! ఒక కారణం కనిపిస్తుంది. రాయల దాడిలో నాశనమైనవన్నీ హిందూ పాలకుల కోటలే. వారంతా గజపతులతో సత్సంబంధాలు ఉన్నవారే. రాయల ఆగ్రహానికి ఇదే కారణం కావచ్చు. నిజానికి గజపతులు కొద్దికాలం ఈ కోటల మీద ఆధిపత్యం కలిగి ఉన్నారు. తెలంగాణ మారుమూల ప్రాంతాలలో కూడా గజపతుల కాలం నాటి నాణేలు లభ్యమైనాయి కూడా. అప్పటికే తెలంగాణలోని హిందూ పాలకులు బహమనీల ప్రతాపానికి గురి అవుతున్నారు. కాబట్టి పటిష్టమైన విజయనగర సైన్యం చేతిలో ఓడిపోవడం వింతకాదు. మరొక వాస్తవం- అప్పటికి తెలంగాణ ప్రాంత హిందూ పాలకులు ముస్లిం పాలనలో కేవలం సంస్థానాధీశులుగా మిగిలారు. అంతేకాదు, సంప్రదాయబద్ధంగా హిందు వులు ధరించే పంచెలు, తలపాగాలు, అంగవస్త్రాలు వదిలేశారు. పైజమాలు, షేర్వాణీలు, రూమీ టోపీలు ధరించడం మొదలయింది. అలాగే ముస్లిం పాలకులకు విధేయులుగా కూడా మారారు. తెలంగాణ సాధారణ ప్రజానీకం మాత్రం వారి సంప్రదాయ వస్త్ర ధారణను, ఆచార వ్యవహారాలను, మత విశ్వాసాలను విడిచిపెట్టలేదు.

మరొక మాట కూడా చెప్పుకోవాలి. విజయనగర పాలకులు తెలంగాణకు ఎంతో రుణపడి ఉన్నారు. విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహర, బుక్కరాయలు కాకతి ప్రతాపరుద్రుని దగ్గర రెవెన్యూ అధికారులు (నరసింహమూర్తి, గిరిజాపతి). ప్రతాప రుద్రుడిని తుగ్లక్‌లు ఓడించిన తరువాత ఆ ఇద్దరు ఆనెగొందెకు వెళ్లి, స్థానిక పాలకుని వద్ద ఉద్యోగులుగా చేరారు. తరువాత ఆనెగొందె కూడా తుగ్లక్‌ల వశమైంది. అప్పుడు ఆ ఇద్దరిని బందీలుగా తుగ్లక్‌ ‌సేనలు ఢిల్లీ తీసుకుపోయాయి. కానీ వారిని మహమ్మద్‌ ‌బిన్‌ ‌తుగ్లక్‌ ‌విడిచిపెట్టాడు. దక్షిణాదిన ఢిల్లీ ప్రతినిధులుగా నియమించాడు. కొంతమంది వాదన ప్రకారం ఆ ఇద్దరిని మతం మార్చాడు తుగ్లక్‌. ‌బలీయమైన తుగ్లక్‌ల పాలనలో విజయనగర ప్రాంతంలో ఒక సామ్రాజ్యమే స్థాపించాలన్న ధైర్యం వారికి ఎక్కడ నుంచి వచ్చింది? తెలంగాణ పరిణా మాల నుంచే! సుల్తాన్లను కూడా ఓడించవచ్చునని ఇక్కడ ఐదుసార్లు రుజువైంది. మైదాన ప్రాంతంలో ప్రతాపరుద్రుడు, ఇంకా ఎలగందల, నాగనూరు అనేచోట్ల ఖిల్జీ సేనలు ఓడాయి. అయితే అంతిమంగా కాకతీయ సేనలు 1323లో ఓడిపోయాయి. ఆ సేనలే యాదవ వంశీకుడు రామచంద్రుని కూడా ఓడించాయి. నిజానికి అసలు అతడితో పోరాటమే లేదు. లొంగిపోయాడు. తెలంగాణలో తుగ్లక్‌లకు సంభవించి ఓటములను ముస్లిం చరిత్రకారులు దాచిపెట్టారు. కానీ కొన్ని రాగిశాసనాలలో ఈ వివరాలు ఉన్నాయి. వాటిని కృష్ణశాస్త్రి వెలికి తీశారు.

రాయలవారు తిరుమల వెంకన్నకు భూరి విరాళాలే ఇచ్చాడు. దేవస్థానాల హుండీ సంపదను పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు వెల్లడైనాయి. తొలి దర్శనం సందర్భంగా రాయలు 30,000 వరహాలు ఇచ్చాడు. మిగిలిన దానాల సంగతి ఏమిటి? ప్రస్తుతం దేవస్థానం అధీనంలో 1213 బంగారు నాణేలు ఉన్నాయి. ఇందులో విజయనగర రాజుల కాలానికి చెందినవి 274. ఇచ్చినవారు అచ్యుతరాయ (13), మొదటి దేవరాయ (73), రెండో దేవరాయ (1), మొదటి హరిహర (6), రెండో హరిహర (105), కృష్ణదేవరాయ (5), సదాశివరాయ (5), మిగిలినవి ఆరవీడు వంశీకులవి. వీటి మీద పేర్లు లేవు. చరిత్రలో ‘అయితే’ అన్న వ్యక్తీకరణకు స్థానం లేదు. అదే గతం గత: అంటే. చరిత్ర నుంచి ఎవ్వరూ పాఠాలు నేర్చుకున్న దాఖలాలు లేవు. ఎక్కడో ఉత్తరాది నుంచి దక్షిణాదికి మహా సైన్యంతో వచ్చిన ముస్లిం పాలకులు ఇక్కడి రాజ్యాలను ఎలా గెలుచుకోగలిగారో చరిత్రకారులకు ఇప్పటికీ అంతుపట్టని విషయమే. నాలుగు ప్రముఖ వంశాలు హోయసాల, యాదవ, కాకతీయ, పాండ్య రాజులు ఓడిపోయారు. ఎందుకు? వారిలో ఐకమత్యం లేదు. కృష్ణరాయలే కనుక గజపతులతో చేయి కలిపి ఉంటే, ఆ రెండు రాజ్యాల ఉమ్మడిశక్తి నా తెలంగాణలో ఇంత సుదీర్ఘకాలం ముస్లిం పాలనకు తావిచ్చేది కాదు.

(సంప్రతించిన గ్రంథాలు: టీటీడీ సేకరించిన శాసనాల సంకలనం, ఎస్‌. ‌సుబ్రహ్మణ్యశాస్త్రి, 1998. ఏవీ నరసింహమూర్తి: విజయనగర నాణేలు. 1997. గిరిజాపతి ఎం: విజయనగర సామ్రాజ్య చరిత్ర, నాణేలు, 2009. రాజారెడ్డి దేమె: తిరుపతి హుండీలో బంగారు నాణేలు, ఒక పరిశీలన, 2014).

– డా।। దేమె రాజారెడ్డి, వ్యాసకర్త : న్యూరో సర్జన్‌, అపోలో

By editor

Twitter
Instagram