సోవియెట్‌ ‌రష్యా కమ్యూనిస్టు నియంత జోసెఫ్‌ ‌స్టాలిన్‌ ‌పాలన అకృత్యాలకు పెట్టింది పేరు. సిద్ధాంత రక్షణ పేరిట, అభివృద్ధి పేరుతో, సామూహిక వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటు పేరుతో, సంస్కరణల సాకుతో అతడి కాలంలో సోవియెట్‌ ‌రష్యాలో గాలిలో కలసిన ప్రాణాలు వేలు కాదు, లక్షలలోనే. ఆఖరికి వ్లాదిమర్‌ ‌లెనిన్‌తో పాటు బోల్షివిక్‌ ‌పోరాటంలో కీలకంగా ఉన్న ట్రాట్‌స్కీని కూడా స్టాలిన్‌ ‌వెంటాడిన చంపిన సంగతి దాచేస్తే దాగని సత్యం. కానీ ఆ కాలంలో జరిగినట్టు చెబుతున్న అకృత్యాల గురించి తాము ఎన్నడూ వినలేదని ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో ఆ దేశ యువతరం చెప్పడం గొప్ప వింతేమీ కాదు. చరిత్రను వక్రీకరించడం, లేదా మరుగుపరచడం వామపక్ష సిద్ధాంతంలో, రాజకీయాలలో ఒక వ్యూహం. కానీ ఎవరు ఏ సిద్ధాంతం పేరుతో, పాలన పేరుతో ఎలాంటి అకృత్యాలు చేసినా మళ్లీ ఆ కాలమే బయట పెడుతుంది.ఇప్పుడు విచ్ఛిన్న రష్యాలో ఇదే జరుగుతోంది.

గ్రేట్‌ ‌పర్జ్ (1937-38) ‌లేదా స్టాలిన్‌ ‌నాటి భీతావహంతో కనీసం ఏడున్నర లక్షల సోవియెట్‌ ‌రష్యా పౌరులు చనిపోయి ఉంటారని అంచనా. సర్వేలో మాట్లాడిన యువతలో 47 శాతం అసలు స్టాలిన్‌ అరాచకాల గురించి ఇంతకాలం వినలేదనీ, ఇప్పుడిప్పుడే వింటున్నామనీ నేటితరం వారు చెప్పారు. మూడోవంతు జనం మాత్రం తమ తాతలను అక్రమంగా సొంత గ్రామాల నుంచి పంపించి వేయడం, లేదా బలవంతంగా ఆస్తులు లాక్కోవడం వంటివి జరిగాయని తమకు తెలుసునని ఇన్నాళ్లకి ధైర్యంగా వెల్లడించగలుగుతున్నారు. ఎందుకో తెలియదు, ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమర్‌ ‌పుతిన్‌ ‌స్టాలిన్‌ అపకీర్తికి మళ్లీ ముసుగులు వేయాలని చూస్తున్నట్టు చెబుతున్నారు. తాజాగా బయటపడిన స్మశానవాటికల చరిత్రకు సంబంధించిన పత్రాలు, ఇతర పత్రాలు మాకు ఇవ్వడానికి ప్రస్తుత రష్యా ప్రభుత్వం నిరాకరిస్తున్నదని సెర్జీ గుత్‌సాల్యూక్‌ ‌చెప్పారు. ఆమె ఉక్రేనియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌నేషనల్‌ ‌మెమరీ ఉస్సాద్‌ ‌శాఖ అధిపతి. ఇప్పుడు అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం లేదు. అందుచేత నాడు దారుణమైన పరిస్థితులలో చనిపోయిన వారి పట్ల కనీస సానుభూమి చూపడం నేటి ప్రభుత్వ కర్తవ్యమని చరిత్రకారులు, పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇంతకీ స్టాలిన్‌ ‌కాలం నాటి కమ్యూనిస్టు పాలనకు సంబంధించి ఇప్పుడు తాజాగా వెలువడిన ఆ అకృత్యం ఏమిటి?

 ఈ ఆగస్ట్ ‌మూడోవారంలో పాత ఉక్రెయిన్‌లో కొన్ని స్మశాన వాటికలు బయటపడ్డాయి. ఆ ప్రాంతానికి దక్షణింగా ఉన్న ఉదెస్సా విమానాశ్ర యానికి పక్కనే కొత్త భవంతుల పునాదుల కోసం తవ్వుతుంటే అవి బయటపడినాయి. దాదాపు పాతిక స్మశానవాటికలు. ఆ విమానాశ్రయాన్ని విస్తరించే పని స్టాలిన్‌ ‌నిర్వాకాన్ని బయట ప్రపంచంలోకి తెచ్చింది. బయటపడ్డాయి.వాటి నిండా ఎముకలే. అందుకే తవ్వకాలు చేస్తున్న వారి గుండె చెదిరి పోయింది. అవన్నీ 5000 నుంచి 20,000 మందికి చెందిన ఎముకలని అభిప్రాయపడుతున్నారు. ఇంతమందిని ఒకేసారి ఎలా పాతిపెట్టారో, అసలు ఎలా చనిపోయారో పెద్దగా ఆలోచించకుండానే ఉదెస్సా స్ధానిక అధికారులు తడుముకోకుండా చెప్పేశారు. అవన్నీ స్టాలిన్‌ ‌కాలానికి చెందినవేనని చె•ప్పేశారు. వీటిని బట్టి ఆనాడు జరిగిన రక్తపాతం ఎంతో, మరీ ముఖ్యంగా ఉస్సాద్‌లో ఎంత రక్తం చిందిందో ఊహించడం కష్టకాదని చరిత్రకారులు చెబుతు న్నారు.1930 దశకంలో వీళ్లందరిని స్టాలిన్‌ ‌రహస్య పోలీసు వ్యవస్థ ఎన్‌కేవీడీ హత్య చేసి ఉంటుందని నేషనల్‌ ‌మెమరీ ఇనిస్టిట్యూట్‌ ‌ప్రాంతీయ కార్యాలయం అధిపతి సెర్జీ గుత్‌సల్యూక్‌ ‌చెప్పారు. ఆ బీభత్స పాలనలో కనీసం ఏడున్నర లక్షల మందిని చంపారని హిస్టరీ.కామ్‌ ‌చెబుతోంది. ఉదెస్సాలో చెత్తాచెదారం నిండి ఉన్న ఆ ప్రాంతంలో గోతులు తవ్వేవారని, కాల్చి చంపి తెచ్చి ఈ గోతులలోకి విసిరేవారనీ, లేదంటే ఆ గోతుల దగ్గర నిలబెట్టి కాల్చేవారని, ఆపై ఆ చెత్తనే శవాల మీద కప్పేవారని ఆర్కియాలజిస్ట్ ‌తెత్యానా సామ్యోలోవా ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెప్పారు. కొన్ని లక్షల మంది గులాగ్‌ అని పిలిచే శిబిరాలలో నిర్బంధించి ఉంచేవారు. ఒక రాక్షస పాలనలో నిస్సహాయంగా చనిపోయిన వారందరికీ స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని ఉదెస్సా మేయర్‌ ‌గెన్నాది త్రుఖనొవ్‌ ‌చెప్పారు కూడా.

ఇప్పుడే కాదు, నిరుడు కూడా ఉస్పాద్‌ ‌ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు కూడా కొన్ని సామూహిక స్మశాన వాటికలు బయటపడ్డాయని కూడా ఆయన చెప్పారు. వాళ్లందరు ఎవరు? ఎలాంటి ఆరోపణతో ఇలా సామూహికంగా ఖననం చేశారు అనే అంశాలను ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదని కూడా ఆయన చెప్పారు. నిజానికి ఇంతకాలం తరువాత చెప్పడం అసలే కష్టం. అవన్నీ ఆనాడు అత్యంత రహస్యంగా జరిగిపోయేవి. కానీ ఒక చారిత్రక వాస్తవాన్ని ఎవరూ కాదనడం లేదు. స్టాలిన్‌ ‌కాలంలో ఉక్రెయిన్‌కీ, మాస్కోకీ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణమే ఉంది. కారణం- సామూహిక వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటు. సాగు రంగంలో స్టాలిన్‌ ‌తెచ్చిన సంస్కరణలతో దారుణమైన క్షామం కూడా ఏర్పడింది. కొన్ని లక్షల మంది చనిపోయారు. 1935-1937 మధ్యలో స్టాలిన్‌ ‌భీతావహ పాలన సాగింది కాబట్టి, ఇవి ఆకాలానికి చెంది ఉంటాయని చెప్పడం సత్యదూరం కాదనే అనుకుంటున్నారు. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించిన తరువాత పాత సోవియెట్‌ ‌యూనియన్‌ ‌భాగాలు విడిపోయాయి.

1930 దశకంలో స్టాలిన్‌ ఏలుబడిలో వేలాది మంది ఉక్రేనియన్లను జైళ్లలో ఉంచారు. లేదా చంపారని ఉక్రేనియన్‌ ‌చరిత్రకారులు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఆ కాలంలో కీవ్‌ అనే పట్టణం శివార్లలో ఉన్న అటవీ ప్రాంతంలో బైకివినాయి గ్రామంలో ఆ కాలంలో విపరీతంగా హత్యలు జరిగాయి. 1937-1941 మధ్య వేలాది మందిని అక్కడే పూడ్చిపెట్టారు. స్టాలిన్‌ అరాచకాలకి తోడు 1932-1933 ప్రాంతంలో దారుణమైన దుర్భిక్షం కూడా ఏర్పడిందని చెబుతున్నారు.

ఇలాంటివి మొత్తం 29 స్మశానవాటికలు బయటపడ్డాయి. నల్లసముద్రం నౌకాశ్రయం ఉన్న పట్టణం ఉదెస్సాలోనే ఇవన్నీ బయటపడ్డాయి. ఈ ప్రాంతాన్నే తాతార్కా అంటారు.

 ఉదెస్సాలో 1930 దశకంలో జరిగిన సామూహిక హత్యాకాండకు సంబంధించి రుమేనియా ఆర్కైవ్స్‌లో చరిత్రకారుడు ఒలేక్సాందర్‌ ‌బబీచ్‌ ‌కొన్ని పత్రాలు ఇదివరకే సంపాదించారు. ఈ తవ్వకాలలో ఆయన కూడా పాల్గొన్నారు. కనుగొన్న ఆ 29 స్మశాన వాటికలలోను ఐదు పొరలు ఉన్న సంగతిని కూడా ఆయన వెల్లడించారు. సోవియెట్‌ ‌రష్యా కాలంలో అక్కడ ఉన్న సైనిక శిబిరం వరకు కూడా ఈ స్మశానవాటికలు విస్తరించి ఉండవచ్చునని ఆ పత్రాలు చెబుతున్నాయి. ఇక్కడ పాతిపెట్టిన వారిలో ఎందరు పురుషులు, ఎందరు స్త్రీలు అనే విషయం కోసం పరిశోధిస్తున్నారు. ఆ లెక్కలన్నీ ఎప్పటికి తేలినా ఉక్రెయిన్‌లోని ఈ స్మశాన వాటిక అతి పెద్ద స్మశాన వాటికలలో ఒకటని చరిత్రకారులు ఇప్పటికే తీర్పు చెప్పేశారు.

1930 దశకంలో స్టాలిన్‌ ‌తన బీభత్స పాలనలో ఎంతమంది సోవియెట్‌ ‌రష్యా దేశవాసులను చంపారో ఇప్పటికీ తెలియదు. మాస్కోలోని మెమోరియల్‌ ‌హ్యూమన్‌ ‌రైట్స్ ‌సెంటర్‌ ‌లెక్క ప్రకారం ఆ సమయంలో కనీసం 12 మిలియన్లు (కోటీ 20 లక్షలు) కారాగారాలలో ఉన్నారు. లేదా హత్యకు గురయ్యారు. వీరంతా అమాయకులే. కానీ రష్యాలోని గులాగ్‌ ‌హిస్టరీ మ్యూజియం చెబుతున్న ఆధారాల ప్రకారం అలా అరెసుస్టయి కారాగారాలలో ఉన్నవారి సంఖ్య 20 మిలియన్లు. అంటే రెండు కోట్లు. ఇందులో పది లక్షల మందిని చంపారు.

ఈ సంవత్సరం మే 21న మాస్కో టైమ్స్ ‌ప్రచురించిన వార్త కూడా ఇలలాంటిదే. మాస్కో నగర శివార్లలో శవాలను పూడ్చిపెట్టడానికి తీసే అనేక గోతులు కనుగొన్నారు. అవన్నీ ఆనాడు అసమ్మతివాదులను పాతేయడానికి తీసిన గోతులేనని చెబుతున్నారు. ఇలా అసమ్మతివాదుల సంఖ్య 10,000.

ఇవి కూడా స్టాలిన్‌ ‌కాలానికి చెందినవేనని కొమ్మెర్‌సాంట్‌ ‌బిజినెస్‌ ‌డైలీ వెల్లడించినట్టు మాస్కోటైమ్స్ ‌పేర్కొన్నది. మాస్కో వాయువ్య ప్రాంతంలో ఉన్న కొమునార్కా సంగతి కేజీబీ తన పురాతన పత్రాలను వెల్లడించినప్పుడు తెలిసింది.ఈ పురాతన పత్రాల పరిశీలనావకాశాన్ని సోవియెట్‌ ‌రష్యా పతనానికి కొంచెం ముందు నిలిపివేశారు. తరువాత కేజీబీ వారసురాలు ఎఫ్‌ఎస్‌బీ తిరిగి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సంస్థ అంచనా ప్రకారం 1937-1941 మధ్య 14,000 మందిని తుపాకీతో కాల్చి ఇలా సామూహిక ఖననం కోసం తీసిన గోతులలోకి తోసేపేవారని ఆ సంస్థ చెప్పింది. నిజానికి 2018 నుంచి సాంకేతిక పరిజ్ఞానంతో ఇలాంటి సామూహిక ఖననాలకు కోసం తీసిన గోతుల గురించి అన్వేషిస్తున్నారు. అప్పుడు 87 ఉంటాయని లెక్క తేల్చారు. కానీ తవ్వే కొద్దీ మరో 47 కూడా ఉన్నాయని తెలిసింది. అంటే 134.

మెమోరియల్‌ ‌హ్యూమన్‌ ‌రైట్స్ ‌గ్రూప్‌ ‌కొమ్మనార్కా దురాగతానికి సంబంధించి 6,609 మంది మృతుల పేర్లను బయటపెట్టింది. ఇందులో కమ్యూనిస్టు పార్టీకే చెందిన మేధావుల పేర్లుతో పాటు దౌత్యవేత్తలు, నిఘా సంస్థలలో పనిచేసిన వారి పేర్లు కూడా ఉన్నాయి. 1930 దశకంలో స్టాలిన్‌ ‌సామూహిక ఖననాలకు కోసం ఉపయోగించుకున్న మూడు ప్రదేశాలలో కొమ్మనార్కా కూడా ఒకటి. మిగిలిన రెండు దాన్స్‌కోయె, బుతోవో స్మశానవాటికలు. ఇది మాస్కో రింగ్‌రోడ్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 1937-38 ప్రాంతంలో ఇక్కడే 30,000 మందిని తీసుకొచ్చి చంపేశారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. 1953లో స్టాలిన్‌ ‌చనిపోయిన తరువాత కొందరు స్టాలిన్‌ అకృత్యాల గురించి వెల్లడించారు కూడా. ఆయన విధానాల కారణంగా వచ్చిన కరువు కాటకాలతో ఎందరో చనిపోయారని ఆరోపణ ఉంది.

About Author

By editor

Twitter
Instagram