హిందుత్వ అనేది బీజేపీ ప్రచారంలోకి తెచ్చిన ఎజెండా అనుకోవటం అమాయకత్వమవుతుంది. హిందూత్వ అనేది బీజేపీ వ్యతిరేక మీడియా సృష్టించి ఆ పార్టీ మీద విసిరినది. అయినా హిందూత్వ ముద్రను బీజేపీ ఇష్టంగానే ఇంతకాలం మోసింది, సమర్థించుకుంది. ప్రజలకు నచ్చజెప్పి ఒప్పించ గలిగింది. నేడు హిందుత్వం అనేది సమాజం అంగీకరించిన సిద్ధాంతం. కాషాయ జెండా అందరి గౌరవం పొందుతున్న జెండా. జై శ్రీరామ్‌ అనేది మతపరమైన పలకరింపు కాదు. భారతీయులందరు అనుసరించే నినాదం. హిందూ ఒక ప్రాంత జీవన విధానం కాదు. దానిని ప్రపంచమంతా గౌరవిస్తున్నది. గత మూడు దశాబ్దాలుగా బీజేపీని విమర్శించిన, తప్పుపట్టిన ఆ అంశాలే నేడు ప్రతిపక్షాలు అనుసరిస్తున్నాయి. ఒకనాడు, ‘మతపరమైన అంశాల పార్టీ మీది! అవి వదిలి వచ్చి ఎన్నికల రంగంలో నిలవండి! మీ పరిస్థితి ఏమిటో తెలుస్తుంది!’ అంటూ బీజేపీకి సవాలు విసిరిన పార్టీలన్నీ నేడు మా ఎండా కూడా హిందుత్వమేనని చెప్పుకుంటున్నాయి. మతతత్వ పార్టీ బీజేపీ అని విమర్శించిన కాంగ్రెస్‌, ‌బీఎస్పీ, ఎస్పీ, ఆప్‌లన్నీ హిందుత్వాన్నే శరణు వేడుకుంటున్నాయి. రాహుల్‌ ‌గాంధీ, మాయావతి, అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌వంటి వారంతా తామే అసలైన హిందువులమని బీజేపీ వారు నకిలీ హిందువులనే కొత్తమాట ప్రయోగిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలవాలంటే రాముడి దయ తప్పదన్న పాఠం అన్ని పార్టీలు నేర్చుకున్నాయి. ఎన్నికల వేళ నేడు అన్ని పార్టీల రామనామంతో ఉత్తరప్రదేశ్‌ ‌మారుమోగి పోతున్నది. రాబోయే ఐదు నెలలకాలంలో ఆ నినాదం మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తున్నది కూడా.

రామమందిరం విషయంలో ఓటర్లను గందర గోళానికి గురిచేసేందుకు కొత్త ఎత్తుగడలతో ప్రచారం నిర్వహిస్తున్నాయి ఆ పార్టీలు. ప్రాంతీయ, జాతీయ పార్టీలన్న తేడా లేకుండా అందరిది శ్రీరామరాజ్య బాట అనటం స్వాగతించాల్సిన విషయమే. గతంలో తాము రాముడికి, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు మరచిపోయి తమను క్షమించి, గెలిపించమని ఆయా పార్టీల నాయకులు ఓటర్లను బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితి. ఇది హిందూత్వ విజయం అని పరిశీలకులు అంటున్నారు. హిందూత్వం వైపు సీట్లకోసం, ఓట్ల కోసం ఇతర పార్టీలు మొగ్గుతున్న తీరు, పడుతున్న పాట్లు చూసి యూపీ ఓటర్లు నవ్వుకుంటున్నారు.

యూపీ ఎన్నికల్లోకి తాజాగా ప్రవేశించిన ఆమ్‌ ఆద్మీపార్టీ (ఆప్‌) ‌తన తొలి ఎన్నికల ఊరేగింపుకు ఎన్నుకున్నది అయోధ్య జిల్లానే కావటం గమనించాలి. బీజేపీని అనుకరిస్తూ తమ ఊరేగింపునకు ‘తిరంగా యాత్ర’ అని పేరు పెట్టుకుంది. ఆ యాత్రకు ఎంచుకున్న నినాదం కూడా బీజేపీ ప్రచారంలోకి తెచ్చిన ‘వందేమాతరం’ నినాదమే. అసలు సిసలు ‘రామరాజ్యం’ స్థాపన, అసలు సిసలు జాతీయభావం ప్రజలోకి తీసుకవెళతామన్న నినాదాలు ఆ పార్టీ నాయకులు చేసారు. ఆ ఊరేగింపు సమయంలో కార్యకర్తలు, నాయకులు ధరించిన తెల్లని టోపీలను మినహయిస్తే మిగిలినవన్నీ బీజేపీని అనుకరించటమే.

ఎన్నికల తొలి ఊరేగింపునకు ముందు ఆప్‌ ‌నాయకులందరూ అయోధ్య జిల్లాలోని గుడులన్నింటిని దర్శించి పూజలు చేశారు. ఆ ప్రాంతంలో కాషాయ దుస్తులు ధరించి కనిపించిన సాధువులందరి పాదాలకు మొక్కి, దీవెనలు తీసుకున్నారు. ఆ ఊరేగింపులో పాల్గొన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ ‌సిసొదియా శ్రీరామచంద్రుని ప్రస్థావన ప్రసంగంలో తేవటానికి ఏమాత్రం వెనుకాడలేదు. ‘‘భారతదేశంలో రామరాజ్యం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌మాత్రమే’’ నన్న మనీష్‌ ‌సిసొడియా ‘‘యూపీలో ఆప్‌ని గెలిపిస్తే శ్రీరామ చంద్రుని బోధనలకు అనుగుణంగా పాలన అందిస్తా మని ప్రకటించాడు. ఇటువంటి ప్రసంగాలే గతంలో బీజేపీ నేతలు చేసినప్పుడు అదంతా మతాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలన్న ఎత్తుగడ అంటూ అభ్యంతరం చెప్పారు ఆప్‌ ‌నాయకులు. ‘‘చేతనైతే అభివృద్ధి, పరిపాలనా అంశం ఎజెండాగా చేసుకుని మా మీద గెలవండి’’ అనే సవాలు కూడా వారు నాడు విసిరారు. తాము ఎన్నటికి అభివృద్ధి, పాలన ఎండాని వదలమని చెప్పిన అరవింద్‌ ఇప్పు‌డు హిందుత్వాన్ని ఎలా నెత్తిన పెట్టుకుంటున్నాడో వివరించాల్సిన అవసరముంది.

రాముని మీద, రామమందిరం మీద హఠాత్తుగా ‘ఆప్‌’‌లో పెల్లుబికిన ప్రేమ చూపరులకు చిత్రంగా ఉంది. అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించి, మసీదు అక్కడే కట్టాలన్న నిర్ణయం తీసుకున్న ఆప్‌ ‌నోట ‘‘అయోధ్యలో రామమందిరం త్వరగా పూర్తి చేయాలన్నా’’ డిమాండ్‌ ‌రావటమే చిత్రం. ఎన్నికలలో గెలుపుకోసం ఎటువంటి మాటలైనా చెప్పగల నేర్పు తమదని ఆప్‌ ‌నిరూపించింది మరోసారి. ఆ పార్టీ అధికార ప్రతినిధి హుడా జెరివాలా ‘‘అయోధ్య మందిరం భారతీయుల సెంటిమెంట్‌కి ప్రతీక, దేశ చరిత్రకు నిదర్శనం’’ అన్నాడు. ఆ మాటలే గతంలో బిజెపి చెప్పినప్పుడు అది మతతత్వం అన్నవారంతా ఇప్పుడు అవే పలుకులు ముద్దుముద్దుగా పలకటమే రాజకీయ చిత్రం. ‘జాతీయతావాదం’ ప్రమాదం అని వాదించిన ఆప్‌• ‌మేము జాతీయవాద ప్రతినిధులమని చెప్పుకుని రాష్ట్ర ఓటర్లను మోసం చేసే యత్నంలో ఉన్నాయి.

హిందుత్వంపై కొత్తగా ప్రేమ కురిపిస్తున్న మరో పార్టీ బీఎస్పీ. గతంలో ఎన్నడూ కనిపించని అంశాలు, నినాదాలు నేడు ఆ పార్టీ సమావేశాల్లో వినిపిస్తు న్నాయి. ఇటీవల ఆ పార్టీ లక్నోలో నిర్వహించిన ‘ప్రబుద్ధ జన సమ్మేళనం’ హిందూ పూజారుల సంస్కృత పూజలతో, శంఖాలు పూరింపుతో మొద లైంది. హరిహర మహాదేవ్‌, ‌జైశ్రీరామ్‌ ‌నినాదాలు మిన్నంటాయి. ఒక సంవత్సరం క్రితం వరకు కాషాయం, దైవ నినాదాలు నిషేధించిన మాయావతి నేడు తమ ది హిందూత్వ ఎజెండానే అంటున్నది.

నేటి వరకు ఏ ఒక్క బీఎస్‌పీ నేత అయోధ్యలోని రామమందిర దర్శనానికి వెళ్లలేదు. అలా వెళ్లకూడ దన్నది మాయావతి హుకుం. కాని నేడు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు సతీష్‌ ‌మిశ్రా అయోధ్యను దర్శించటమే కాదు, సరయు నదిని 125 లీటర్ల పాలతో అభిషేకం చేశాడు. రామమందిరానికి తమ మద్దతు ప్రకటించింది మాయావతి.

గతంలో తన పార్టీ గుర్తు అయిన ‘ఏనుగు’ తన అడుగులతో అగ్రవర్ణాల వారిని తొక్కి పారేస్తుందని చెప్పిన మాయావతి నేడు హఠాత్తుగా ఏనుగు గుర్తుకు కొత్త అర్థాలు చెపుతోంది. ఇది హథీ కాదు.. గణేష్‌.. ఇం‌దులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులున్నారు అని మాయావతి చెప్పటం ఆమెలో వచ్చిన మార్పు. అది ఎన్నికల కోసం వచ్చిందా లేక సహజంగా మనసు మారిందా అనేది ఎన్నికల ఫలితాల తర్వాత గాని తెలియదు.

అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేయటం తమ పార్టీ వాగ్దానాలలో ఒకటని అంటు న్నది బీఎస్‌పీ. ఇక మాయావతి అయోధ్య దేవాలయ దర్శనం ఏ క్షణంలో అయినా జరగవచ్చు. దానితో బీఎస్‌పీ హిందుత్వ బాట సంపూర్ణం.

యూపిలో బీఎస్‌పీ ప్రధాన ప్రత్యర్థి ఎస్పీ గతంలో కరసేవకుల మీద కాల్పులు జరిపించి 40మందికి పైగా ప్రాణాలు హరించిన ములాయం సింగ్‌ ‌యాదవ్‌ ఆ ‌పార్టీ వ్యవస్థాపకుడు. మాది యాదవ్‌- ‌ముస్లిమ్‌ల మైత్రి పార్టీ అని, ఇతర వర్గాల వారు మాకు అనవసరం అని ములాయం అతని వారసుడు అఖిలేష్‌లు చెప్పుకునేవారు. కాని ఆ పార్టీ కూడా మాది హిందూత్వమే అంటున్నారు.

నేడు ఆ పార్టీని నడిపిస్తున్న అఖిలేష్‌ ‌తన రాజకీయ రంగ ప్రవేశం హిందూ పవిత్ర క్షేత్రం చిత్రకూట్‌లో జరిగిన విషయం గుర్తు చేస్తున్నాడు. తాను 2000లో కందగిరి పర్వత ప్రదక్షణం చేసిన విషయం వివరించాడు. గత 20 ఏళ్లలో ఎన్నడూ హిందూ దేవాలయాల గురించి గాని, వాటి నిర్మాణం, పరిరక్షణ గురించి మాట్లాడని ఎస్పీ వారు ఇప్పుడు చంబల్‌ ‌ప్రాంతంలో ఒక భారీ మహావిష్ణు మందిరం నిర్మిస్తామంటున్నది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం త్వరగా జరగాలంటున్నది.

‘‘మా నాన్న ములాయం పవనపుత్ర హనుమాన్‌ ‌భక్తుడు, నేను పరశురామ భక్తుడిని’’ అన్నాడు అఖిలేష్‌ ఇటీవల. 2022 ఎన్నికల ప్రచారం చిత్రకూట్‌ ‌నుండి ప్రారంభిస్తున్నాడు. కాని అతనిలోని కరుడు కట్టిన హిందూ వ్యతిరేకతను మాత్రం అర్థం చేసుకోలేక పోయాడు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ ‌సిఎం తండ్రి యుపిలో పర్యటించినప్పుడు ‘‘బ్రాహ్మణులు విదేశీయులు, వారిని తరిమికొట్టాలి’’ అని అన్నప్పుడు అఖిలేష్‌ ‌స్పందించి ఖండించలేదు. కాని సిఎం యోగీ ఆదిత్యనాథ్‌ ‌దాస్‌ ‘‘‌గతంలో అఖిలేష్‌ ‌సిఎంగా ఉన్నప్పుడు ఉచిత రేషన్‌లను అబ్బాజాన్‌లు ఎగురేసుకు పోయారు’’ అని అనగానే అది ముస్లిమ్‌లను అవమా నించటమేనంటూ ఎదురుదాడి చేశాడు.

‘‘అయోధ్యలో రాముడికి దేవాలయం అనవసరం, అక్కడి మసీదు అక్కడే ఉండాలి, మరెక్కడికి వెళ్లటానికి ఒప్పుకోం’’ అన్న ఎస్పీ పార్టీ దాని నేత అఖిలేష్‌లు ఇప్పుడు హిందూత్వం వైపు మొగ్గు చూపుతూ తాము హిందూత్వవాదులమేనని చెప్పుకుంటున్నారు.

రాజకీయ ఊసరవెల్లి కాంగ్రెస్‌ ‌గురించి, దానికున్నా రంగుల మార్పు నేర్పు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కాంగ్రెస్‌ ‌యూపీలో తన ఉనికిని కాపాడుకునేందుకు నానా ఎత్తుగడలు వేస్తున్నది. తానే మెరుగైన హిందువును అంటున్నాడు రాహుల్‌గాంధీ. తన కులం బ్రాహ్మణ అని తన గొత్రం ఫలానా అని బహిరంగంగా చెప్పుకుంటున్నాడు. భుజం మీద లోపల ఉండాల్సిన జంధ్యం తన చొక్కా మీద వేసుకుని జొకర్‌లా తిరిగాడు గతంలో. మళ్లీ ఇప్పుడు అదే వేషం వేయబోతున్నాడు. బీజేపీ వారు నకిలీ హిందువులు నేను అసలు సిసలు హిందువును వారిని నకిలీ హిందుత్వ, కాంగ్రెస్‌దీ అసలైన హిందుత్వ అంటున్నాడు రాహుల్‌. ‌తన తండ్రి చేసిన శిలాన్యాస్‌ ‌వల్లనే రామాలయ నిర్మాణం సాధ్యమైందంటున్నాడు.

ఎన్నిరకాల వేషాలు వేసిన రాహుల్‌గాంధీ మనసులోని హిందూ వ్యతిరేకత ఎప్పటికప్పుడు బయట పడుతునే ఉంటుంది. ఛత్తీస్‌గడ్‌ ‌సిఎం భగేల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీవాడు. ఆయన తండ్రి భగే•ల్‌ ‌కూడా కాంగ్రెస్‌వారే. ఆయన యూపీలో బ్రాహ్మణులను తరిమి వేయమని నినదిస్తే ఒక్క కాంగ్రెస్‌వాదీ స్పందించలేదు. విమర్శలు పెరగటంతో ఆయన రెచ్చగొట్టే ప్రసంగం చేసిన యూపీలో కాక తమ ప్రభుత్వమున్న ఛత్తీస్‌గడ్‌లో కేసు పెట్టించి, తండ్రిని అరెస్టు చేసిన కొడుకు, సిఎం భగేల్‌ అనే అనుకూల ప్రచారం వాడుకునే యత్నం చేశాడు.

నేటి వరకు అయోధ్య రామమందిరం దర్శించన రాహుల్‌ ఇప్పు‌డు అక్కడి రామ మందిర నిర్మాణపు పనులు ప్రశిస్తున్నాడు. రామమందిర స్థల సేకరణలో కుంభకోణం జరిగిందన్న ప్రచారం చేస్తున్నాడు.

హిందూత్వ వ్యతిరేక పార్టీలు కొత్తగా హిందూత్వ వాదన అవసరాన్ని బట్టి వేస్తున్న వేషాలే. ఏం రాష్ట్రంలో దేనినుండి లబ్ది వస్తుందో ఆ నినాదం అందుకోవటం పార్టీలకు అలవాటే. యూపీలో ప్రదర్శించిన హిందూత్వని ఆప్‌ ‌పంజాబ్‌లో ప్రదర్శించలేదు. అంత రామ భక్తి హిందూతత్వం ఉంటే కేరళలో హిందూ త్వాన్ని కాంగ్రెస్‌ ఎం‌దుకు వ్యతిరేకించినట్టు? 2018 కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ‌చేసిన హిందూ వ్యతిరేక ప్రచారం ఎవరు మరువగలరు?

రాజకీయ రంగులు మార్చే ఊసరవెల్లి పార్టీ విషయంలో అప్రమత్తత అవసరం. వారి వారి రాజకీయాల కోసం వేసుకుంటున్న కొత్త డ్రస్‌, ‌ప్రదర్శిస్తున్న మారు మనసులే తప్పించి ఆయా పార్టీలు హిందుత్వ అనుకూలురు కాదన్నది వాస్తవం. కేరళలో ఒక క్రైస్తవ మత పెద్ద చేసిన ‘ఇస్లామిక్‌’ ‌లవ్‌ ‌జిహాద్‌ – ‌నార్కోటిక్స్ ‌జిహాద్‌ అన్న ప్రకటన మీద కాంగ్రెస్‌ ‌స్పందించిన తీరు బట్టే వారి సంకుచిత రాజకీయ ధోరణి తెలుస్తున్నది. ఎవ్వరూ ఎన్ని కొత్త వేషాలు వేసిన వారి అసలు వాసన పసికట్టలేని అమాయకులు కాదు ఓటర్లు.

– డా. దుగ్గరాజు శ్రీనివాసరావు,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram