వైకాపా ప్రభుత్వం ఎవరినీ వదలడం లేదు. ఇసుక, మద్యం వ్యాపారాలు చేస్తున్న ప్రభుత్వం మాసం దుకాణాలు, సినిమా టిక్కెట్లు అమ్ముతామని ప్రకటించింది. తాజాగా చేపల చెరువుల మీద పడింది. మత్స్యసంపదను పెంచే చెరువులను ఓపెన్‌ ఆక్షన్‌ ‌ద్వారా కేటాయించేందుకు 217 జీవోను జారీ చేయడం వివాదాస్పదమైంది. పంచాయతీలు, తీరప్రాంతాల్లో ఉన్న చేపల చెరువులను ఇప్పటి వరకు మత్స్యసహకార సంఘాలకు కేటాయిస్తున్నారు. మూడేళ్లకోసారి నామినల్‌గా పదిశాతం ధర పెంచి ఆ సంఘాలే చెరువులను నిర్వహించుకునేవి. కానీ ఇప్పుడు ఓపెన్‌ ఆక్షన్‌ ‌పద్ధతిలో వాటిని కేటాయిస్తామనడంలోనే చిక్కు వచ్చింది.

ఓపెన్‌ ఆక్షన్‌ ‌పద్ధతిలో చెరువులను కేటాయిస్తే వాటిని అసలైన మత్స్యకార సంఘాలు సాధించలేవు. పెద్ద కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఇందులో ప్రవేశించి పాడుకుంటారు. తమకు సహజసిద్ధంగా ఆదాయవనరుగా లభిస్తున్న చెరువులు, అందులోని మత్స్యసంపదను రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో తమ పార్టీ నాయకులు, తాబేదార్లకు కట్టబెట్టేందుకు జీవో నెంబరు 217 జారీచేసిందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని నీటి సంస్థలకు చెందిన 100 హెక్టార్లకు పైన ఉన్న చెరువులకు ఓపెన్‌ ఆక్షన్‌ ‌వర్తిస్తుందని ఈ జీఓలో ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న పేపరులో నెల్లూరు జిల్లాకు సంబంధించి 27 చెరువుల్లో మాత్రం అమలు చేస్తున్నట్లు ఉంది. ఈ అనుబంధ వివరాలు చూపించి ఈ జీవోను నెల్లూరు జిల్లాకే పరిమితం చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. 217 కేవలం నెల్లూరుకే పరిమితం చేసే పక్షంలో జీవోలో ఈ విషయాన్ని ఎందుకు చేర్చలేదు. జీవో విధివిధానాల్లో నెల్లూరు జిల్లాను ప్రయోగాత్మకంగా తీసుకున్నట్లు చెబుతోంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఇదే కార్యక్రమాన్ని అమలు చేస్తారని స్పష్టంగా తెలుస్తోంది. దీని ద్వారా లక్షలాది మత్స్యకారులకు అన్యాయం జరుగుతుంది. సంఘంలో మనిషికి గరిష్టంగా రూ.15 వేలు మాత్రమే ఆర్థిక వెసులుబాటును చూపించి శాశ్వత భుక్తంలో ఉన్న నదులు, చెరువులు వంటి నీటివనరులను కార్పొరేటర్లకు దారాధత్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్రానికి వందల కోట్ల నిధులు ఇస్తోంది. మత్స్యభరోసా పథకంలో 1.20 లక్షల మందికి రూ.10 వేలు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇందులో వైకాపా కార్యకర్తలు, అనర్హులకే లబ్ధిని చేకూర్చారన్న భాజపా ఆరోపణలకు వైకాపా నుంచి సమాధానం లేదు. మోపిదేవి వెంకటరమణ నియోజకవర్గం నిజాంపట్నంలో నకిలీ లబ్ధిదారులను మత్స్యశాఖ పట్టుకున్న విషయం గుర్తుచేసుకోవాలి. రాష్ట్రంలో ఇంకా 24 వేల మంది మత్స్యకారులకు భృతి అందలేదని చెబుతున్నారు. మత్స్యకారులకు నాలుగు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం గర్వంగా చెప్పింది. ఇలా ఏర్పాటుచేసిన నాలుగు కార్పొరేషన్ల ద్వారా ఇప్పటివరకు ఎన్ని కోట్ల నిధులు ఖర్చు పెట్టారో చెప్పాలి? ఎందుకంటే ఇంతవరకు ఈ కార్పొరేషన్‌లకు ఒక్క రూపాయి ఖర్చుచేయలేదని మత్స్యకారులే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక్కో ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయించి, ఖర్చుచేసి తమ సంక్షేమానికి కృషి చేయాలని మత్స్యకారులు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

ఫిషింగ్‌ ‌హార్బర్లు ఏం చేశారు?

ఫిషింగ్‌ ‌హార్బర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు కేటాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించాలి. గత చంద్రబాబు ప్రభుత్వం అంచనాలు పెంచి చూపించింది. వాటిని కేంద్రం ఆమోదించలేదు. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం రెండేళ్ల క్రితం పది ఫిషింగ్‌ ‌హార్బర్లు కేంద్ర సాయంతో తామే నిర్మిస్తామని కేంద్రానికి చెప్పి వాటికి సంబంధించిన ప్రాథమిక చర్యలు అట్టహాసంగా ప్రారంభించింది. వీటికి పర్యావరణ, అటవీశాఖ అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇంతవరకు వాటిని ప్రారంభించలేదు. పైగా ఈ పది హార్బర్లలో కేవలం నాలుగింటికే పనులు ప్రారంభిస్తామని పేర్కొనడం ఆరంభ శూరత్వంగా కనిపిస్తోంది. ఇప్పుడీ హార్బర్లను పూర్తిచేయడానికి ఎన్నేళ్లు పడుతుందో?

మత్స్యకారుల అభివృద్ధికి నరేంద్రమోదీ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసింది. రూ.20 వేల కోట్లు నిధులు కేటాయించింది. లక్షలాది మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు, వారికి ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రధాని మత్య్స సంపద యోజన ప్రవేశపెట్టారు. మత్స్యసంపద అపారమైనది. దీని ద్వారా వేల కోట్ల ఆదాయం లభిస్తుంది. కాబట్టి మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పలురకాల పథకాలను కేంద్ర మత్స్యశాఖ ప్రవేశపెట్టింది. సరికొత్త సాంకేతిక పక్రియలను కూడా మనదేశంలో అమలు చేస్తోంది. ఈ శాఖద్వారా మత్స్యకారుల అభివృద్ధికి వలలు, బోట్లకు కొనుగోలు సబ్సిడీ, కోల్డ్ ‌స్టోరేజ్‌ల ఏర్పాటు, మార్కెటింగ్‌ ‌సదుపాయం, సాంకేతిక నైపుణ్యాలు వంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, సీవీడ్‌, ‌పెరల్‌, ఆర్నమెంట్‌ ‌ఫిష్‌ ‌టెక్నాలజీలు ఇలా అనేక కార్యక్రమాలు కేంద్ర మత్స్యశాఖ అమలుచేస్తోంది. ఏపీలోను ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాని ఫలితాలు మాత్రం శూన్యం. దళారీ వ్యవస్థ వల్ల మత్య్సకారుల జీవన ప్రమాణాలు పెరగలేదంటున్న ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లే. మత్స్యకారులకు ఇచ్చే ఇన్‌పుట్‌ ‌సబ్సిడీ, నాణ్యమైన ఫీడ్‌ ఇవ్వలేకపోతున్నామని చెప్పడం రాష్టప్రభుత్వ చేతకాని పాలనే. ఇప్పటికే జీవో విడుదలైంది. దాని విధివిధానాలు మాత్రమే మారుస్తామంటున్నారు. కానీ ప్రైవేటుకు అప్ప గించాలనే నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఆ జీవోను వెనక్కి తీసుకోవాలి.

మైనార్టీలకు సబ్‌ ‌ప్లాన్‌ ‌రాజ్యాంగ విరుద్ధం కాదా?

మతం ఆధారంగా సబ్‌ప్లాన్‌లు అమలుచేయడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య. మైనార్టీ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం హిందూమతాన్ని అవమానించి అన్యమతస్తులను అందలమెక్కిస్తోంది. మైనార్టీలను ప్రసన్నం చేసుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వినాయక చవితిపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం గతేడాది పోలీస్‌స్టేషన్‌లో క్రిస్మస్‌ ‌పండుగను చేసుకోవడం మైనార్టీల సంతుష్టీకరణ కోసమే. ఆ పార్టీ నాయకులు టిప్పుసుల్తాన్‌ ‌విగ్రహాన్ని నిర్మించి తీరుతామని చెబుతున్నారు. ఇప్పుడు మైనార్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని నిర్ణయించి క్యాబినెట్‌ ‌సమావేశంలో ఆమోదించారు. మత రాజకీయాల కోసం ఇలాంటి ఆలోచన చేస్తే కచ్చితంగా హిందూ సమాజాం నుంచి వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం మైనార్టీ సబ్‌ప్లాన్‌ ఆలోచనతో చేసే ఓటుబ్యాంకు రాజకీయాలను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. మైనార్టీ సబ్‌ ‌ప్లాన్‌ అమలును ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని భాజపా డిమాండ్‌ ‌చేస్తోంది.

ఐదోతరగతి పుస్తకంలో మత ప్రస్తావన!

అన్యమతాలకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో హిందూ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మత మార్పిడి, పరమత ప్రచారానికి ప్రోత్సాహం ఇస్తూనే ఉంది. లౌకిక నిబంధనల ప్రకారం విద్యా విధానంలో మతానికి ప్రమేయం ఉండకూడదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐదోతరగతి పుస్తకంలో ఈ అంశాన్ని చేర్చింది. ఐదో తరగతి తెలుగు వాచకంలో విద్యార్థుల ఆలోచనా శక్తికి పదును పెట్టే అభ్యాసం ఉంది. అందులో ఒక మతానికి సంబంధించిన అంశాన్ని చేర్చారు. అందులో ‘గుణదల మేరీమాత చర్చికి వెళ్లాం. చర్చి దగ్గర భక్తులతో చాలా రద్దీగా ఉంది. భక్తులంతా కొండపైకి నడిచి వెళ్తున్నారు. మేమందరం కొండపైకి నడిచివెళ్లాం. ప్రార్థనలో పాల్గొన్నాం. మేరీమాతను దర్శించుకున్నాం’ అని రాసారు. దీనికి ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయాలన్నారు. సాధారణంగా అభ్యాసాలు ఏదైనా ఒక ప్రసిద్ధ వ్యక్తి గురించి, ప్రసిద్ధ ప్రదేశం గురించి మాత్రమే ఉంటాయి. కానీ ఒక మతానికి సంబంధించిన ప్రదేశం గురించి నిర్దిష్టంగా ఉండవు. ఐదో తరగతి చదివే బాలలకు పదేళ్లుంటాయి. వారికి మతాల పట్ల పెద్దగా అవగాహన ఉండదు. ఆ వయసులో వారికి ఇలాంటి అభ్యాసాలు ఇచ్చి మతపరంగా ఆకర్షించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ అభ్యాసంలో జంతు ప్రదర్శనశాల గురించి ఉండేది, దానిని మార్చేసి ఈ అంశాన్ని చేర్చారని ఉపాధ్యాయులంటున్నారు. తక్షణం దీన్ని పాఠ్యపుస్తకం నుంచి తొలగించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

శ్రీశైలంలో అన్యమత ప్రచారం

అన్యమత ప్రచారం రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వ అండదండలు కూడా పుష్కలంగా ఉండటంతో అన్యమత ప్రచారకులకు అడ్డం లేకుండా పోయింది. ఇళ్ల వద్ద ప్రచారం స్థాయి దాటిపోయి ఇప్పుడు ఆలయాల మీద పడ్డారు. తిరుమల, శ్రీశైలం, కనకదుర్గ, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల ఇలా ఒక టేమిటి పేరున్న ఆన్ని ఆలయాల్లో అన్యమత ప్రచారం చేస్తుండగా హిందువులే వారిని నిలదీస్తున్న ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా శ్రీశైలంలో సాధువుల వేషంలో కొందరు అన్యమత ప్రచారం చేస్తుండగా హిందువులు అడ్డుకున్నారు. శ్రీగిరి కాలనీలోని నివాసాల వద్ద నలుగురు వ్యక్తులు సాధువుల వేషంలో తిరుగుతూ స్థానికులను ‘ప్రెయిజ్‌ ‌ది లార్డ్’ అని దీవిస్తుండగా హిందువులు వారిని గుర్తించి నిలదీశారు. సాధువుల వేషంలో ఉన్న వ్యక్తి మెడలో సిలువ కూడా ఉంది.

తితిదే పదవుల పందేరం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కూర్పు, భారీగా ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై హిందువులు, ధార్మికవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తితిదే పాలకమండలి సభ్యుల సం•్యను ఛైర్మన్‌తో సహా 25 మంది సభ్యులుంటే; వారికి అదనంగా మరో యాభై మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం నియమించింది. ఈ ప్రఖ్యాత దేవస్థానాన్ని కూడా తమ అధికార రాజకీయాలకు, పదవుల పందేరాలకు వేదికగా ప్రభుత్వం భావిస్తోంది. తితిదేలో తొలి నుంచి చట్టం, నిబంధనలు అనుసరించే విధానం ఉండేది. మొత్తం వ్యవస్థను సక్రమంగా నడపడం కోసమే బోర్డు ఉంటుంది. భారీ సంఖ్యలో పాలకమండలి కూర్పు సొంత అవసరాలు తీర్చుకోవడం కోసమే అనేది స్పష్టంగా కనిపిస్తోంది. హైందవ సంస్థల విషయంలో అడిగే వారు లేరు. మాకిష్టం వచ్చినట్లు చేస్తామనేలా ఉంది ప్రభుత్వం తీరు. పాలకమండలి తప్ప ప్రత్యేక ఆహ్వానితులు అనేది చట్టంలో లేదు. నిజంగా పరిపాలన కోసమైతే పది మంది సభ్యులు చాలు. పాలకమండలిలో రాజకీయంగా నియామకాలు జరుగుతున్నా.. దానికి ఓ పరిమితం ఉండేది. పారదర్శకత అనేది నిర్ణయాల నుంచి వస్తుందని తితిదే పూర్వ ఈవో ఐవైఆర్‌ ‌కృష్ణారావు పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా కల్యాణ మండపాలు, దేవాలయాలు నిర్మించేందుకు ఈ సభ్యులు, ఆహ్వానితులు తీర్మానాలు చేయించి ఇక్కడి నిధులను అక్కడ ఖర్చు చేయిస్తారు. ఇప్పటికే కన్యాకుమారి, చెన్నై, మదురై, బెంగళూరు, ముంబయి, ఢిల్లీలలో తితిదే కమిటీలున్నాయి. వీటికి ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హిందూ ఆలయాల నిర్వహణపై జోక్యం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ, ముస్లిం ప్రార్థనాలయాల నిర్వహణలో జోక్యం చేసుకోగలదా?

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram