‘అంతర్యుద్ధ సమయంలో మాతో పోరాడిన భద్రతా బలగాలు, ప్రజలకు సంపూర్ణంగా క్షమాభిక్ష పెడుతున్నాం. వారిపై ఎలాంటి వేధింపులు, ప్రతీకార చర్యలు ఉండవు. గతంలో మాదిరిగానే వారు స్వేచ్ఛగా, నిర్భయంగా జీవనం సాగించవచ్చు. ఇస్లామిక్‌ ‌పాలనలో షరియత్‌ ‌ప్రకారం అఫ్ఘాన్‌ ‌ప్రగతికి పాటు పడటమే మా ధ్యేయం.’ గత నెలలో కాబూల్‌ను కైవసం చేసుకున్న అనంతరం తాలిబన్‌ ‌చేసిన ప్రకటన ఇది. కానీ గత (1996-2001 పాలన) చేదు అనుభవాల నేపథ్యంలో వారి హామీని చాలా మంది విశ్వసించలేదు. అంతర్జాతీయ సమాజం సైతం దాదాపు ఇదే అభిప్రాయంతో ఉంది. అందరూ ఊహించినట్లుగానే తాలిబన్‌ ఇప్పుడిప్పుడే తమ నిజరూపాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. అమెరికా బలగాలు వైదొలగే వరకు కొంత సంయమనం ప్రదర్శించిన వారు తాజాగా తమ పాత పాలనను ప్రతిఒక్కరికీ గుర్తుకు తెస్తున్నారు. మహిళల స్వేచ్ఛను హరిస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతున్న వారిని అణచివేస్తున్నారు. మళ్లీ మధ్యయుగాల పాలనను తీసుకువస్తున్నారు. ప్రతి సమస్యకూ హింసే పరిష్కారమన్న విధానంతో ముందుకు సాగుతున్నారు. చైనా సహకారంతో పాకిస్తాన్‌ ‌మార్గదర్శకత్వంలో పాలనను సాగిస్తున్నారు. తాలిబన్‌ ‌సర్కారంతా నేరగాళ్లతో నిండిపోయింది. పాలన పూర్తిగా తుపాకీ నీడన సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అఫ్ఘాన్‌ ‌భవితవ్యం అయోమయంలో పడిపోయింది. గత రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ సహకారంతో కొనసాగుతున్న ఆ దేశ ప్రగతికి అవరోధం ఏర్పడింది. ఒక పక్కన కరవు, మరో పక్కన మందుల కొరత, ఆహార కొరతతో దేశం సతమతమవుతోంది.

ప్రధానమంత్రి నుంచి ప్రావిన్స్ ‌గవర్నర్ల వరకూ అందరూ నేర చరితులే కావడం అఫ్ఘాన్‌ ‌ప్రగతిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగిస్తోంది. వీరి హయాంలో దేశం ఎలా ముందడుగు వేస్తుందో ఎవరికీ అర్థం కాని విషయం. 1996-2001 మధ్యకాలంలో తాలిబన్‌ ‌సర్కారులో విదేశాంగ మంత్రిగా పనిచేసిన ముల్లా మహ్మద్‌ ‌హసన్‌ అఖుంద్‌ ఇప్పుడు ప్రధానిగా చక్రం తిప్పుతున్నారు. తాలిబన్‌ ‌వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. ఐక్యరాజ్య సమితి ఆంక్షల జాబితాలో హసన్‌ ఎప్పటినుంచో ఉండటం విశేషం. ఉపప్రధానిగా పగ్గాలు చేపట్టిన ముల్లా అబ్దుల్‌ ‌ఘనీ బరాదర్‌ ‌మాజీ ఉగ్రవాది. ఇతన్ని 2010లో అమెరికా నిఘా సంస్థ సీఐఏ (సెంట్రల్‌ ఇం‌టెలిజెన్స్ ఆఫ్‌ అమెరికా), పాకిస్తాన్‌ ‌నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ఇం‌టర్‌ ‌సర్వీస్‌ ఇం‌టెలిజెన్స్) ‌బంధించి పాకిస్తాన్‌ ‌జైల్లో ఉంచింది. 2018లో నాటి అమెరికా అధినేత డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌సర్కార్‌ అతన్ని విడుదల చేసింది. 1996-2001 మధ్యకాలంలో తాలిబన్‌ ‌హయాంలో హెరాత్‌, ‌నిమ్రుజ్‌ ‌ప్రావిన్సల గవర్నరుగా పశ్చిమ అఫ్ఘాన్‌ ‌కోర్‌ ‌కమాండర్‌గా అఖుంద్‌ ‌వ్యవహరించారు. 2001లో అమెరికా దాడుల సమయంలో పలాయనం చిత్తగించాడు. మరో ఉపప్రధాని అబ్దుల్‌ ‌సలాం హనాఫీ చరిత్ర కూడా ఇంతకన్నా మెరుగ్గా ఏమీ లేదు. కీలకమైన అంతర్గత వ్యవహారాల మంత్రి సిరాజుద్దీన్‌ ‌హుక్కానీ కరడుగట్టిన ఉగ్రవాది. అతన్ని పట్టిచ్చిన వారికి గతంలో అమెరికా లక్ష డాలర్ల బహుమతిని ప్రకటించడం గమనార్హం. మాజీ అధ్యక్షుడు హమిద్‌ ‌కర్జాయ్‌పై హత్యాయత్నం సహా పలు కేసుల్లో ఇతను నిందితుడు. మరో మంత్రి ఖలీల్‌ ‌హుక్కానీ తలపైనా అమెరికా 50 లక్షల డాలర్ల బహుమతిని ప్రకటించింది. మంత్రులు మహమ్మద్‌ ‌ఫాజిల్‌, ‌ఖైరుల్లా, ముల్లా నూరుల్లా నూరి గతంలో గ్వాంటెనామా బే జైల్లో బందీలుగా ఉన్నారు. కరడుగట్టిన ఉగ్రవాదులను అమెరికా ఈ జైల్లో బందీలుగా ఉంచుతుంది.

ఇక కీలకమైన నిఘా అధిపతిగా నియమితులైన ముల్లా అబ్దుల్‌ ‌హక్‌ ‌వాసిఖ్‌ ‌చరిత్ర కూడా ఇంతకన్నా భిన్నం కాదు. రక్షణ మంత్రి ముల్లా యాకుబ్‌, ‌విదేశాంగ మంత్రి ముల్లా అమిర్‌ఖాన్‌ ఆయన సహాయకుడు మహమ్మద్‌ అబ్బాస్‌లను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ 1988లో ఉగ్రవాదులుగా గుర్తించి వారిపై నిషేధం విధించింది. ముల్లా యాకూబ్‌ ‌తాలిబన్‌ ‌వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ ‌కుమారుడు. సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఐరాస భద్రతా మండలి గుర్తిస్తుంది. వారిపై ఆంక్షలు విధిస్తుంది. తగిన చర్యల కోసం నేరగాళ్ల జాబితాలను అన్ని దేశాలకూ పంపిస్తుంది. వారిని బంధించాలని ఆదేశిస్తుంది. ఆ జాబితా ప్రకారం చూస్తే ప్రధాని అఖుంద్‌ ‌సహా 14 మంది మంత్రులకు నేరుగా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉంది. ఇటువంటి వ్యక్తులతో కొలువుదీరిన అఫ్ఘాన్‌ ‌సర్కారు ఎలాంటి పాలన అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్తాన్‌ ‌నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ఇం‌టర్‌ ‌సర్వీస్‌ ఇం‌టెలిజెన్స్) అధిపతి లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌ఫయిజ్‌ ‌హమీద్‌ ‌కాబూల్‌ ‌పర్యటన అనంతరమే మంత్రివర్గ కూర్పు సాగింది. తాలిబన్‌ అధినేతతో ఆయన సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించాలనే అంశంపై చర్చ జరిగింది. మొత్తం అఫ్ఘాన్‌ ‌పరిణామాల్లో చైనా తెర వెనక పాత్ర పోషిస్తుండగా పాకిస్తాన్‌ ‌తెరపైన ప్రత్యక్షంగా కనపడుతోంది. అఫ్ఘాన్‌ ‌నిలదొక్కుకునేందుకు చైనా ఆర్థిక సహాయం కూడా ప్రకటించడం గమనార్హం.

 కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే తమదైన పాలనను ప్రారంభించింది. 1996-2001 నాటి పాలనను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. షరియత్‌ ‌పాలన అంటూ పాలకులు అణచివేత చర్యలను ప్రారంభించారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడం మొదలు పెట్టారు. బహిరంగంగా ఉరేయడం, కాళ్లుచేతులు నరకడం వంటి అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. సంగీతాన్ని పూర్తిగా నిషేధించారు. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. షియా ముస్లిముల ఆధిక్యం గల పంజ్‌ ‌షేర్‌ ‌ప్రావిన్స్‌పై పైచేయి సాధించామంటూ కొందరు అత్యుత్సాహవంతులైన తాలిబన్లు రాజధాని నగరం కాబూల్లో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 17 మంది మరణించారు. ఈ ఘటనను పైకి మాత్రం తాలిబన్‌ ‌ఖండించారు. అదే సమయంలో మీడియా ఈ ఘటనను అతిగా చిత్రీకరించిందని ఆరోపించారు. మరోపక్క మీడియాలో భయాందోళనలు మొదలయ్యాయి. మీడియా స్వేచ్ఛ ప్రశ్నార్థకమైంది. అనేక టెలివిజన్‌ ‌సంస్థలు తమ ప్రసారాల్లో మార్పులు చేశాయి. సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ఆపేశాయి. కొన్ని సంస్థలు ఇప్పటికీ మహిళా యాంకర్లను కొనసాగిస్తున్నాయి. అయితే వారిపై ఏ క్షణంలో అయినా వేటుపడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాబూల్‌ను తాలిబన్‌ ‌కైవసం చేసుకున్న తరవాత అనేకమంది పాత్రికేయులు దేశం విడిచి వెళ్లారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలకు తాలిబన్‌ ‌పాల్పడుతున్నారు. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ‌సోదరుడైన రోహుల్లా అజీజి, ఆయన కారు డ్రైవరును కాల్చిచంపారు. షియా ముస్లిములకు పట్టున్న పంజ్‌ ‌షేర్‌ ‌ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా కో-ఎడ్యుకేషన్‌ను అనుమతించబోమని తాలిబన్‌ ‌స్పష్టంచేశారు. యువతుల చదువుకు తాము అడ్డంకిగా మారబోమని, అయితే యువకులతో కలసి చదువుకునేందుకు అనుమతించబోమని స్పష్టంచేశారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్‌ ‌బాకీ హుక్కానీ ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళలు తప్పనిసరిగా బురఖా ధరించాలని ఆయన హెచ్చరించారు. అంతేగాక పాఠ్యాంశాలను కూడా త్వరలో సమీక్షిస్తామని చెప్పారు. గతంలో మహిళలు చదువుకోవడాన్ని వారు నిషేధించడం గమనించదగ్గ విషయం.

అంతర్యుద్ధంతో గత రెండు దశాబ్దాలుగా సతమతమవుతున్న అఫ్ఘాన్‌లో తాజాగా తాలిబన్‌ ‌పాలనలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మందులకూ, ఆహారానికి కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క మార్కెట్లో నిత్యావసర సరకుల ధరలు నింగినంటుతున్నాయి. దీన్ని నియంత్రించే నాథుడు లేడు. దేశంలో సగం మంది చిన్నారులకు రాత్రి వేళల్లో భోజనం దక్కడం గగనంగా మారింది. లక్షల మందికి కడుపు నిండా తిండి దొరకని పరిస్థితి నెలకొంది. అఫ్ఘాన్‌కు గతంలో అంతర్జాతీయ సమాజం అందించిన ఆహార నిల్వలు సెప్టెంబర్‌ ‌నెలాఖరు వరకు మాత్రమే సరిపోతాయి. తరువాత పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల ఆకలిని తీర్చేందుకు తక్షణం రూ.1460 కోట్లు అవసమని అంచనా. ఔషధాల కొరతా ప్రజలను పట్టి పీడిస్తోంది. నిధులు కొరత కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు అందడం లేదు. మరోపక్క కరవు విలయ తాండవం చేస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుముఖం పడుతున్నాయి. దీనివల్ల మున్ముందు ఆహార సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాలిబన్‌ ఆ‌క్రమణ కారణంగా దేశానికి అందే అంతర్జాతీయ సాయంలో కోత పడింది. సహాయ కార్యక్రమాలకు సుమారు రూ.9,495 కోట్లు అవసరం కాగా, ఇప్పటివరకూ 39 శాతం మాత్రమే నిధులు అందుబాటులో ఉన్నాయి. సాయాన్ని అందించేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థతి లేదు. అఫ్ఘాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. అయిదేళ్ల లోపు చిన్నారుల్లో సగం మంది పోషకాహార సమస్యను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. గతంలోకన్నా మహిళలు, చిన్నారులకు అంతర్జాతీయ సహకారం ఆవశ్యకత ఇప్పుడు మరింత ఎక్కువగా ఉందన్నది వాస్తవం. వాస్తవానికి అఫ్ఘాన్‌ను అన్ని విధాలా ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం సిద్ధంగా ఉంది. అయితే తాలిబన్‌ ‌కారణంగా అనేక దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. ఎలా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థతిని ఆయా దేశాలు ఎదుర్కొంటున్నాయి.

గత రెండు దశాబ్దాలుగా అఫ్ఘాన్‌కు అనేక విధాలుగా ఆపన్నహస్తం అందించిన భారత్‌ అక్కడి పరిణామాలపై వేచిచూసే ధోరణిలో ఉంది. అత్యంత సంయమనం ప్రదర్శిస్తోంది. ఆచితూచి వ్యవహరి స్తోంది. భారత్‌ ‌వ్యతిరేక కార్యకలాపాలకు అఫ్ఘాన్‌ను అడ్డాగా మార్చుకోకుండా నిలువరించేందుకు న్యూఢీల్లీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కతార్‌ ‌రాజధాని దోహాలో తాలిబన్‌ ‌నేతలతో చర్చలు జరిపింది. కతార్‌లోని భారత రాయబారి దీపక్‌ ‌మిత్తల్‌ ‌తాలిబన్‌ ‌నేత షేర్‌ ‌మహమ్మద్‌ అబ్బాస్‌ ‌మధ్య ఈ చర్చలు జరిగాయి. మరోపక్క భారత దేశంతో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని తాలిబన్‌ ‌చెప్పడం గమనార్హం. కానీ ఆచరణలో ఇది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి. మన్ముందు పరిస్థితులు ఎలా మారుతాయోనన్న ఆందోళన అంతటా వ్యక్తమవుతోంది.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌,  ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram