శ్రీరామ జన్మభూమి ఉద్యమంతో పాటు గుర్తుకు వచ్చే పేర్లలో కల్యాణ్‌సింగ్‌ ‌పేరు ప్రముఖమైనది. రామమందిరం కోసం ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారాయన. అయోధ్యలో భవ్య మందిరం సాకారం కావడంతో తన జీవితకాల కోరిక నెరవేరిందని ఆనందించిన కల్యాణ్‌సింగ్‌, అది పూర్తి కాకుండానే శ్రీరాముని చరణాల చెంతకు చేరిపోయారు. నిబద్ధత, నిజాయితీగల నాయకునిగా తుది శ్వాస వరకూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జీవితాన్ని అర్పించిన కల్యాణ్‌సింగ్‌ను దేశ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు.

1992 డిసెంబర్‌ 6 ‌దేశ చరిత్ర గతినే మార్చేసిన రోజు. ఆనాటి పరిణామాల ప్రకంపనలు పెను చర్చలు, వాదనలకు దారి తీశాయి. కుహనా లౌకికవాదం ముసుగును తొలగించింది. భవ్య రామమందిర నిర్మాణం కోరుతూ లక్షలాది మంది కరసేవకులు అయోధ్యకు తరలి వచ్చారు. నిర్ణీత శిలాన్యాస కార్యక్రమానికి ముందే అదుపు తప్పిన వేలాది మంది కరసేవకులు వివాదాస్పద కట్టడం మీదకు చేరారు. వారిని అడ్డుకోవడం పోలీసులకు సాధ్యం కాలేదు. వెనక్కి వచ్చేయమని ఆనాటి సభాప్రాంగణంలో ఉన్న అగ్రనేతలు లాల్‌కృష్ణ అడ్వానీ, మురళీమనోహర్‌ ‌జోషి, అశోక్‌ ‌సింఘాల్‌, ‌విజయ్‌రాజె సింథియా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కరసేవకులు వినిపించుకోలేదు. కొద్ది గంటల్లోనే నాలుగున్నర శతాబ్దాల బానిసత్వ చిహ్నం కుప్పకూలింది. కరసేవకులను అడ్డుకునేందుకు కాల్పులు జరిపేందుకు ఆదేశాలు ఇవ్వాలని పోలీసు అధికారులు ఆనాడు ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్న కల్యాణ్‌సింగ్‌ను కోరగా ఆయన తిరస్కరించారు. ఆ తర్వాత వివాదాస్పద కట్టడాన్ని పరిరక్షిస్తామని ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టుకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తన చర్యను సమర్థించుకున్నారు.

వివాదాస్పద కట్టడం కూల్చివేతపై సుప్రీం కోర్టులో జరిగిన సుదీర్ఘ విచారణ.. న్యాయస్థానంలో తీర్పు రామజన్మభూమికి అనుకూలంగా రావడం.. ఆ తర్వాత అగ్రనాయకులపై నమోదైన కేసులను కొట్టేయడం వంటి పరిణామాలు అందరికీ తెలిసినవే. రామజన్మభూమి ఉద్యమంతో పాటుగా దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేతల్లో కల్యాణ్‌సింగ్‌ ‌ముఖ్యులు. తాను యూపీ సీఎంగా ఉన్న సమయంలో వివాదాస్పద కట్టడం కూలిపోవడం విధి రాత అని, అది కూలిపోకపోతే కోర్టులు ఎప్పటికీ యథాతథ స్థితి కొనసాగించేవని 2020 ఆగస్ట్‌లో అయోధ్య రామమందిర భూమిపూజ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన హృదయంలో రామునిపై అమిత భక్తి ఉందని.. జీవితంలో తనకు ఇక ఏ కోరికా లేదని.. మందిరం నిర్మాణం సాకారం అవుతు న్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.

60 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అరుదైన నేతగా కల్యాణ్‌సింగ్‌ ఉత్తరప్రదేశ్‌, ‌దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలిచారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ఎంపీగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందిం చారు. కల్యాణ్‌సింగ్‌ ‌జీవితంలోని ముఖ్యఘట్టాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

స్వయంసేవక్‌గా మొదలు

కల్యాణ్‌సింగ్‌ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ‌జిల్లా మధౌలీ గ్రామంలో తేజ్‌పాల్‌ ‌సింగ్‌ ‌లోధి, సీతాదేవి దంపతులకు 1932, జనవరి 5న జన్మించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌లో చేరారు. ప్రచారక్‌గా పని చేస్తున్న సమయంలోనే 1957లో జన్‌సంఘ్‌లో చేరడం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1967లో అత్రౌలి నియోజకవర్గం నుంచి భారతీయ జన్‌సంఘ్‌ ‌తరఫున పోటీచేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1980 ఎన్నికల్లో మాత్రమే స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం ఎదురైంది. ఆ తర్వాత 1985లో నుంచి 1996 వరకు అత్రౌలీ నుంచి విజయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1967 నుంచి 2002 మధ్య కాలంలో అత్రౌలి నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన కాలంలో కల్యాణ్‌సింగ్‌ 21 ‌నెలల పాటు జైలు జీవితం గడిపారు. 1977-79లో ఉత్తరప్రదేశ్‌లో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర ఆరోగ్యమంత్రిగా, సేవలందించారు.

ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా..

1991 జూన్‌లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కల్యాణ్‌ ‌సింగ్‌ ‌తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. శ్రీరామ జన్మభూమి ఉద్యమం కొనసాగుతున్న కాలం అది. అయోధ్యను దర్శించి రామమందిర నిర్మాణానికి ప్రతిన బూనారు కల్యాణ్‌సింగ్‌. ఆయన ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో  డిసెంబర్‌ 6 ,1992‌న ఆ ఘటన చోటు చేసుకుంది. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం 1993 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కల్యాణ్‌సింగ్‌ అ‌త్రౌలి, కాస్‌గంజ్‌ అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో దిగి రెండు చోట్లా విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. శాసనసభలో ఆయన ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఆ తర్వాత 1997లో జరిగిన ఎన్నికల్లో భాజపా గెలుపుతో కల్యాణ్‌సింగ్‌ ‌రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

భాజపాను వీడినా తిరిగి రాక..

1999లో కల్యాణ్‌సింగ్‌ ‌బీజేపీతో విభేదించి రాష్ట్రీయ క్రాంతి పార్టీని స్థాపించారు. 2004లో ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయీ కోరడంతో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అదే సంవత్స రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కల్యాణ్‌సింగ్‌ ‌బులంద్‌షెహర్‌ ‌నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2009లో మళ్లీ బీజేపీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ఏడాది ఎన్నికల్లో ఇటా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం తన కుమారుడు రాజ్‌వీర్‌ ‌సింగ్‌ ‌సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. నిజానికి బీజేపీకి దూరం కావడానికి కారణం కొడుకేనన్న ఆరోపణ ఉంది. అయితే సమాజ్‌వాదీ పార్టీతో ఆయన ఎలా ప్రయాణించగలరు? ఫిరోజాబాద్‌ ‌లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో సమాజ్‌వాదీ అభ్యర్థి ఓడిపోయారు. దీనితో నవంబర్‌ 14, 2010‌లో ములాయం సింగ్‌ ఒక ప్రకటన చేశారు. కల్యాణ్‌సింగ్‌ ‌వల్లనే ముస్లిం ఓట్లు పోయాయని, ఫలితంగా పార్టీ ఓడిపోయిందని నాడు సమాజ్‌వాదీ అధ్యక్షునిగా ఉన్న ములాయం ప్రకటించారు. ఆ సంవత్సరమే హిందుత్వకు మద్దతుగా ఉండే జన్‌‌క్రాంతి పేరిట కొత్త పార్టీని స్థాపించారు. 2013లో ఆ పార్టీని కూడా రద్దు చేసి తిరిగి బీజేపీలో చేరారు. కల్యాణ్‌సింగ్‌ ‌సెప్టెంబర్‌ 4, 2014‌న రాజస్తాన్‌ ‌గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2019 సెప్టెంబర్‌ 8 ‌వరకు కొనసాగారు. అదే కాలంలో 2015 జనవరి 28న హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు.

శ్రీరాముని చరణాల చెంతకు

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కల్యాణ్‌సింగ్‌ ‌జూలై 4న ఆరోగ్యం క్షీణించడంతో లక్నోలోని సంజయ్‌గాంధీ పోస్ట్ ‌గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతూ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. ఉత్తరప్రదేశ్‌ ‌గవర్నర్‌ ఆనందీబెన్‌ ‌పటేల్‌, ‌సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ‌బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆసుపత్రికి వెళ్లి కల్యాణ్‌సింగ్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆగస్ట్ 21‌న ఆయన తుది శ్వాస విడిచారు.

సార్థక నామధేయుడు

‘కల్యాణ్‌సింగ్‌’ ‌తల్లిదండ్రులు పెట్టిన పేరుకు అనుగుణంగానే జీవితం మొత్తం ప్రజాసంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన చేపట్టిన అన్ని బాధ్యతల్లోనూ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఆయన విలువైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే కాకుండా సాధారణ ప్రజల విశ్వాసానికి చిహ్నంగా నిలిచిన సమర్థుడైన నాయకుడని మోదీ పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌ ‌మరణం నేపథ్యంలో మూడు రోజులు సంతాప దినాలు పాటించింది. నరోరాలో గంగానదీ తీరాన ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అత్యక్రియలు జరిగాయి. అయోధ్య నగరంలో రామజన్మభూమికి వెళ్లే రహదారికి కళ్యాణ్‌సింగ్‌ ‌పేరు పెట్టనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. లక్నో, ప్రయాగరాజ్‌, ‌బులంద్‌షహర్‌, అలీఘడ్‌ ‌నగరాల్లో ఒక్కో రహదారికి కూడా ఆయన పేరును పెట్టాలని నిర్ణయించారు.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram