-సురేష్‌జీ సోని
ఆర్‌ఎస్‌ఎస్‌`అఖిల భారత కార్యకారిణి సదస్యులు

4. ‘సమాజ ఋణం’

సమాజ ఋణం నుండి ముక్తి పొందటానికి చేయాల్సింది ‘నర యజ్ఞం’.. ప్రాచీన కాలంలో నర యజ్ఞ నిర్వహణకు ఓ సాంప్రదాయముండేది. గృహస్థుడు ఒక నియమాన్ని పాటించేవాడు. భోజనం చేయటానికి ముందు తన ఇంటి ముందర నిలబడి ‘అందరూ భోజనం చేశారా? ఒకవేళ ఎవరైనా భోజనం చేయకపొతే మా ఇంటికి రండి, భోజనం చేసి వెళ్లొచ్చు’ అని గృహస్థుడు పెద్ద గొంతుకతో పిలిచేవాడు. ఆ రోజుల్లో తీర్థ యాత్రలకు వెళ్లేవారు ఎక్కడ కూడా పస్తులు ఉండే పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. కానీ ఇప్పుడు సమయం మారిపోయింది. సమయానుకూలంగా మనిషి మారాడు. అయినా ఆ నరుడే మరల ఆ స్వరూపాన్ని మార్చి పాత సాంప్రదాయాన్ని అమలు చేయగలడు. మనం వంట చేయటానికి ముందు ప్రతిరోజూ ఏదేని ధాన్యం ఒక గుప్పెడు తీసి ప్రక్కన ఉన్న డబ్బాలోనో, సంచిలోనో పెట్టే అలవాటు చేసుకోండి, ప్రక్కన తీసిపెట్టిన ఆ ధాన్యాన్ని ప్రతినెలా అవసరమైన వాళ్లకు ఇవ్వండి లేదా అనాథ శరణాలయానికో, పేద పిల్లల హాస్టల్‌కో ఇవ్వండి. దీంతో నర యజ్ఞానికి సంబంధించిన ఒక ప్రయత్నాన్ని సఫలం చేయగలిగిన వారమౌతాం.

సమాజంలో ఇవాళ కూడా గొప్ప సాంప్ర దాయాలు ఉన్నాయి. ఆళందిలో జ్ఞానేశ్వరీ (సంత్‌ జ్ఞానేశ్వర్‌ మహరాజ్‌ జీవిత చరిత్ర) చదివేందుకు పిల్లలు, పెద్దలూ వెళుతుంటారు. ఆ ఊరి ప్రజలు వీరికోసం ఉచితంగానే భోజన వ్యవస్థని ఏర్పాటు చేస్తుంటారు. సమయానికి వారు భోజనాలకి వెళ్లకపొతే వారున్న చోటికే ఊరి ప్రజలు భోజనాలను చేరవేస్తుంటారు. ఇలాంటి సాంప్రదాయం ఇవాళ్టికి మనకు కనబడుతోంది.

ఈ మధ్య కాలంలో నేను గుజరాత్‌లోని మా ఊరికి వెళ్లాను. ఆ గ్రామంలో ఇద్దరు సంఘ కార్యకర్తలున్నారు. గ్రామంలో దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్న ముసలి వారి గురించి ఏదైనా చేయాలని సంకల్పించారు. సుమారు 30 ఇళ్లలో దీన స్థితిలో ఉన్న ముసలివారు ఒంటరిగా చాలా దీనస్థితిలో బ్రతుకుల్ని వెళ్లదీస్తున్నారు. వాళ్ల పిల్లలు బయటి ప్రాంతాలకు వెళ్లడంతో, ఒంటరి వాళ్లైపోయారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఆ ఒంటరి వాళ్లకి మన కార్యకర్తలు సమయానికి రెండు పూటలా భోజనం తయారు చేసి పంపుతున్నారు. మన ఇద్దరు కార్యకర్తలు నిరంతరం కొనసాగిస్తున్న భోజన వ్యవస్థ కార్యక్రమానికి ఇప్పుడు గ్రామస్థులు కూడా తోడ్పాటు అందిస్తున్నారు. సమాజ ఋణం తీర్చుకోవటానికి ఈ విధంగా నర యజ్ఞ రూపంలో సాటి మనుషులకు చేయూత నివ్వాలి. తోటి మనుషుల గూర్చి ఆలోచిం చాలి. అంతేకాదు సమాజ రుణాన్ని తీర్చుకోవటానికి అవసరమైతే మన ఇంటినే కేంద్రంగా మార్చుకోవాలి. మన ఇంటినే ఆదర్శ కుటుంబంగా, మన కుటుంబ సభ్యులనే ఆదర్శ పౌరులుగా మార్చుకోవాలి. ఈ దృష్టితో కూడా మనం ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి.

5 సృష్టి ఋణం

ప్రస్తుతం అన్ని చోట్లా పర్యావరణ పరిరక్షణ విషయంలోనే చర్చ జరుగుతోంది. ఈ అంశం కూడా మనకు కేంద్ర బిందువు అవుతుంది. పాత సాంప్రదాయం మనకొకటుంది. భోజనం చేసే సమయాన మొదటి ముద్ద ఆవుకు, చివరి ముద్దా కుక్కకు పెట్టాలన్న నియమం ఒకటుండేది. ఇంట్లో భోజనం తయారు చేసే సమయాన తల్లి, చిన్న పిల్లవాడు మాత్రమే ఉంటారు. పిల్లవాడు బాగా ఆకలిగొని ఉన్నాడు, రొట్టెలు తయారు చేస్తున్న తల్లిని ‘అమ్మా, మొదటి రొట్టె నాకే ఇవ్వాలి’ అన్నాడు. ‘బిడ్డా! మొదటి రొట్టె నీకు కాదు, ఆవుకి’ అని జవాబిచ్చింది తల్లి. భూత దయ మన సాంప్రదాయంలో ఒక భాగమనే సంకేతాన్ని ఇస్తుంది ఆ తల్లి. దీని ద్వారా ఆ చిరు ప్రాయంలోనే అతని మనస్సులో భూతదయ చిగురిస్తుంది. అందువల్ల ‘భూత యజ్ఞం’లో ప్రాణులు, పశు పక్ష్యాదులు సహా సమస్త విశ్వం ఇమిడి ఉన్నాయి. పట్టణాలలో, నగరాలలో ఇవాళ పక్షులు కనబడటంలేదు. వృక్ష సంపద కానరాదు. మరి పక్షులు ఎక్కడుండాలి? ఇవాళ రేపు నగరాలలో పెద్ద ఎత్తున ‘ప్లాంటేషన్‌’ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్లాంటేషన్‌ ఎవరి కోసం? పశు పక్ష్యాదుల కోసం కాదు, స్వచ్ఛమైన గాలి పీల్చటం కోసం కాదు. కేవలం నగరాల సుందరీకరణ కోసం మాత్రమే జరుగు తున్నాయి. గతంలో వివిధ రకాలయిన చెట్లు ఉండేవి. ఆయా ఋతువులలో పక్షులకు వివిధ రకాలయిన పళ్లు ఆహారంగా దొరికేవి. కొంతవరకు అక్కడక్కడ మర్రి చెట్లు, మేడి చెట్లు, రావి చెట్లయినా కనబడు తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కొంత వరకు అవగాహన పెరిగితే బాగుంటుంది. అయినప్పటికీ అక్కడక్కడ చిన్నపాటి రకరకాలయిన పక్షి గూళ్లు తయారు చేయటం మొదలెట్టారు కొందరు. కేవలం పచ్చదనం, పక్షులు, పశువులు గోడల మీద పెయింటింగ్‌ రూపంలో కనిపిస్తే సరిపోదు, వాటిని ప్రత్యక్షంగా చూపేందుకు, చూసేందుకు సాకార రూపమివ్వాలి. మేము ఫలానా కాలనీలో ఉన్నామనీ, ఫలానా అపార్టుమెంట్లో ఉన్నామని మనం చెబు తుంటాం. అలాంటి చోట్ల పచ్చదనం కోసం పెద్ద ఎత్తున కుండీలలో చెట్లను పెంచితే బాగుంటుంది. ఈ మధ్య కాలంలో కిచన్‌గార్డెన్‌ల పెంపకం జోరందుకుంది కదా!

ఏది ఏమైనా ప్రకృతిని కాపాడాలి, ప్రకృతి శుద్దంగా ఉండాలంటే స్వచ్ఛత కూడా అందులో భాగమే కదా. సృష్టి ఋణం తీర్చుకోవాలి, అందుకోసం పశు-పక్ష్యాదులను కాపాడే విషయాన్ని చర్చించి కార్యరూపమివ్వాలి. పర్యావరణ పరిరక్షణ విషయాన్ని చర్చించి అడుగు ముందుకేయాలి. జల సంరక్షణ విషయాన్ని కూడా చర్చించి మీ మీ ప్రాంతాల్లో పాడు బడిన బావులు సహా ఇతర జల వనరులను బాగుపరిచే కార్యక్రమాలను చేపట్టాలి. మీ మీ ప్రాంతాల్లో మిగులు జలాలు ఉంటే దానిని వృధా చేయకుండా స్టోరేజ్‌ చేసి పెట్టాలి. మెల్లమెల్లగా వర్షపు జలాన్ని ఇంకుడు గుంతలలో నిల్వ చేయాలి. పంచ మహా భూతాలలో భూమి, నీరు ఒక భాగం. వీటి పరిరక్షణ కోసం ఒక కుటుంబ సభ్యుడిగా, ఇరుగు పొరుగు వాడిగా నేనేమి చేయగలను, ఇరుగుపొరుగు వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని ఎలా చేయగలనని ఆలోచించి కార్యరూపమివ్వాలి. మరో రెండు విషయాలని మీ ముందుంచి ముగిస్తాను.

స్వామి వివేకానంద – పంచ మహా యజ్ఞాలు

ఓడలో స్వామి వివేకానంద తన శిష్యులతో ప్రయాణిస్తున్నారు. ఒకరోజు స్వామీజీ గంభీర ధ్యాన ముద్ర నుండి మేల్కొన్న పిదప డెక్‌ మీదకు వెళ్లి తన శిష్యులనందరినీ పిలిచారు. ‘పంచ మహా యజ్ఞాల, పరంపరని మోడర్న్‌ టైమ్‌కు అనుగుణంగా వైబ్రెంట్‌ ఇంటర్ప్యూటేషన్‌ ఇవ్వాలి. అంటే ఈ పంచ మహా యజ్ఞాల ద్వారా లభించే సజీవమైన స్రోతస్సు మన విద్యా విధానంలో ఒక భాగమయితే దేశ పునరు జ్జీవనం (నేషన్‌ రెజెనరేషన్‌) అనే మన కల సాకారమవటానికి శక్తి అనేక రెట్లు పెరుగుతుంది’ అని స్వామీజీ తన శిష్యులతో చెప్పారు. ఇదే విషయాన్ని స్వామి వివేకానంద ఒకసారి సోదరి నివేదితకు ఉత్తరం రాశారు.

మనమంతా దేశ పునరుత్థాన / పునరుజ్జీవన కార్యంలో భాగమై లోక కల్యాణం కోసం పరి శ్రమించాలి. మనమంతా కార్యకర్తలం. దీని కోసం మనమంతా, ఒక వ్యక్తిగా కాకుండా, ఒక కుటుంబంగా కాకుండా సంఘటిత శక్తిలా మారి పని చేయాలి. ఈ విధంగా మనమంతా ‘కుటుంబ ప్రబోధన్‌’ కార్యంలో నిమగ్నం కావాలి, మన కార్యకర్తలే ఈ కార్యంలో స్వయం ఉదాహరణలుగా మారి కనపడాలి. ఒకసారి ఈ విషయమై ఒక ప్రబోధన్‌ అయినా జరగాలి. దీనికోసం ప్రతి కుటుంబంలో అనివార్యంగా అందరు కలిసి చర్చించుకునే (గోష్ఠుల) పరంపర ప్రారంభం కావాలి. ప్రతి ఇంట్లో వారానికొకసారి సమావేశం జరగాలి. కుటుంబ ప్రబోధన్‌కు సంబంధించిన అన్ని విషయాలు ఈ సమావేశంలో చర్చించాలి. ఇది ఒక పరంపరగా మారాలి. కుటుంబంలో అన్ని వయసుల వాళ్లుంటారు. సమయానుకూలంగా వారి వారి వయసుకు తగినట్లు, అర్థం చేసుకునేలా ఈ అంశాలన్నిటినీ వివరించాలి. మన బస్తీలలో, వీధుల్లో, కాలనీలలో, అపార్టుమెంట్లలో, ఊళ్లలో ఈ అంశాలన్నిటినీ చర్చించేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలి. పిల్లల కోసం వేరుగా, సోదరీ సోదరులకు విడిగా, యువత కోసం వేరుగా, పెద్దల కోసం విడిగా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ విషయాలను చర్చించాలి. ఈ పంచ మహాయజ్ఞాలపై జరిగిన చర్చలు, పంచ మహాయజ్ఞాల కోణంలో మన మన ఇళ్లలో కొన్ని ప్రయోగాలు, కొన్ని ప్రయత్నాలయినా చేశారా? ఒక వేళ ప్రయత్నాలు చేసి ఉంటే మీ మంచి మంచి అనుభవాలను అందరితో పంచుకోండి, చర్చించండి. ఇలాంటి పక్రియని కూడా మనం మొదలుపెడదాం.

ఎడారి ప్రాంతానికి చెందిన వ్యక్తితో మాట్లాడుతూ తోట అంటే ఇలా ఉంటుంది, అడవి అంటే అలా ఉంటుందని చెప్పండి. ఆ ఎడారి ప్రాంతపు మనిషి మీ కేసి ఎగాదిగా చూస్తాడు. తోట అంటే, అడవి అంటే అతనికేమీ అర్థం కాదు. వేల మైళ్ల దూరం దాకా అతడికి ఇసుక తప్ప ఇంకేమీ చూసి ఎరుగడు. అలానే ఇవాళ ఉమ్మడి కుటుంబాలు విడిపోయి చిన్న చిన్న (న్యూక్లియస్‌) కుటుంబాలుగా ఏర్పడి చివరకి మెట్రోపాలిటన్‌ నగరాల వైపుగా వెళ్లి జీవించడం మొదలు పెట్టారు. అక్కడేమో డబుల్‌ ఇన్కమ్‌ -నో కిడ్స్‌ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇలాంటి సందర్భాల్లో నేటితరం వారికి ఉమ్మడి కుటుంబాలంటే ఎడారిలో పచ్చదనం లాగా కనిపిస్తాయి. ఇలాంటి వారికి కనీసం చెప్పే లేదా చూపే ప్రయత్నమైనా చేయాలి. ఓకే కుటుంబంలో నాలుగు తరాల వారు, మూడు తరాల వారు కలిసి ఉన్నారని.. ఉంటున్నారని చెప్పాలి. చివరగా మరోసారి స్వామీ వివేకానంద స్వప్న వృత్తాంతాన్ని, ఆపై చెప్పిన మాటల్ని గుర్తు చేయాలనుకుంటున్నా. సంపూర్ణ భారతంలో పంచ మహాయజ్ఞాల కాన్సెప్ట్‌ని వ్యాప్తి చేయాలని చెప్పారు కదా. అందుకు మనం చేయాల్సిందల్లా ఒకటే, దీనికి సంబంధించిన యుగానుకూల వ్యాఖ్య, యుగానుకూల ప్రయోగాన్ని వ్యాప్తి చేయాలి. దీని కోసం ఇతరులని కూడా ఇందులో భాగస్వాముల్ని చేయడంలో కుటుంబ ప్రబోధన్‌ కార్యకర్త ఒక మాధ్యమం కావాలి. అందుకే కుటుంబ ప్రబోధన కార్యకర్త వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక సంస్థల్ని కూడా తనతో జత చేసుకొంటూ నగరాలేగాదు మారుమూల గ్రామాల్లో, కొండల్లో, గిరిజన ప్రాంతాల్లో ఎడారి ప్రాంతాల్లో అన్నిచోట్ల ఒక ప్రవాహరూపంగా ముందుకు సాగాలి. తద్వారా స్వామి వివేకానంద కలలుగన్న దేశ పునరుజ్జీవనం (‘నేషన్‌ రీజెనరేషన్‌’) తో లోక కల్యాణం, మానవ కల్యాణానికి పాటుపడాలి. ఈ దేశం ఇచ్చిన మహోన్నత జీవన విలువల ఆధారంగా మానవజాతి సుఖ సంతోషాలతో ఉంటుంది. ‘మాతృవత్‌ పర దారేషు, పర ద్రవ్యేషు లోష్టవత్‌ ఆత్మవత్‌ సర్వ భూతేషు యః పశ్యతి సపండితః’ అనగా పర స్త్రీని తల్లిగా భావించినప్పుడు నైతిక జీవన విలువలు చిగురిస్తాయి. పరుల ధనాన్ని మట్టిగా భావించినప్పుడు ఈ అవినీతి అతం అవుతుంది. సంపూర్ణ సృష్టిని తనదిగా భావించినప్పుడు అన్ని ప్రాణుల్లో తనవంటి ఆత్మయే ఉన్నదని తెలుసుకొని, అన్ని జీవులతో సమరస భావంతో మెలుగుతాడు. ఇటువంటి వారు శ్రేష్ఠులు అని అర్థం. ఇలాంటి శ్రేష్ఠమైన జీవన విలువలను వ్యహారంలోకి తెచ్చే మాధ్యమం పంచ మహాయజ్ఞాలు. ఈ పంచ మహాయజ్ఞాల ద్వారానే సంపూర్ణ విశ్వకల్యాణం జరుగుతుంది. ఈ పంచ మహాయజ్ఞాల ద్వారానే భారతదేశం పరమ వైభవ స్థితికి చేరుకుంటుంది.

(సమాప్తం)

అనువాదం : విద్యారణ్య కామ్లేకర్‌

About Author

By editor

Twitter
Instagram