టోక్యో వేదికగా ముగిసిన 2020 ఒలింపిక్స్‌లో భారత్‌ ‌మెరిసి మురిసింది. పన్నెండు దశాబ్దాల ఆధునిక ఒలింపిక్స్ ‌చరిత్రలో భారత బృందం అత్యధిక పతకాలు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 120 మంది అథ్లెట్ల బృందంతో 18 రకాల క్రీడాంశాల బరిలోకి దిగిన భారత్‌ ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించింది. పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. దీనిని బట్టి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ క్రీడావిధానం సత్ఫలితాలను ఇచ్చినట్లు స్పష్టమైంది.

పురుషుల జావలిన్‌ ‌త్రోలో యువకిశోరం నీరజ్‌ ‌చోప్రా బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టిస్తే.. హాకీ పురుషుల జట్టు నాలుగు దశాబ్దాల విరామం తర్వాత పతకం సాధించి వారేవ్వా! అనిపించుకుంది. పురుషుల విభాగంలో నాలుగు, మహిళల విభాగంలో మూడు పతకాలు గెలిచి భారత అథ్లెట్లు ‘మేరా భారత్‌ ‌మహాన్‌’ అనిపించుకొన్నారు.

జపాన్‌ ‌రాజధాని టోక్యో వేదికగా జరిగిన 32వ ఒలింపిక్‌ ‌క్రీడలు పలు సరికొత్త రికార్డులతో విజయవంతమయ్యాయి. కరోనా వైరస్‌ ‌మూడోదశ భయపెడుతున్నా.. నిర్వాహక సంఘం కట్టుదిట్టమైన నిబంధనల నడుమ పోటీలను నిర్వహించింది. 204 దేశాలకు చెందిన 11 వేల 500 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ దశాబ్ది మొట్టమొదటి ఒలింపిక్స్ ‌భారత్‌కు ఓ మధురజ్ఞాపకంగా, విజయగాథగా మిగిలిపోతాయి.

వాస్తవానికి టోక్యో ఒలింపిక్స్ ‌గత ఏడాదే జరగాల్సి ఉంది. కరోనా దెబ్బతో ఏడాదిపాటు వాయిదా పడటం భారత్‌కు బాగానే కలసివచ్చింది. టోక్యో గేమ్స్‌లో భాగంగా మొత్తం 28 రకాల క్రీడలు, 309కి పైగా అంశాలలో పోటీలు నిర్వహిస్తే భారత అథ్లెట్లు 18 రకాల క్రీడాంశాలలో అర్హత సంపాదించగలిగారు. తొలిసారిగా ఫెన్సింగ్‌ (‌కత్తియుద్ధం), గోల్ఫ్ అం‌శాలలో భారత మహిళలు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. వ్యక్తిగత, టీమ్‌ అం‌శాలలో మొత్తం 120 మంది అథ్లెట్లు బరిలో నిలిస్తే ట్రాక్‌ అం‌డ్‌ ‌ఫీల్డ్‌లో పురుషుల జావలిన్‌ ‌త్రో బంగారు పతకం; కుస్తీలో రజతం, కాంస్య పతకాలు; మహిళల వెయిట్‌ ‌లిఫ్టింగ్‌లో రజతం; బ్యాడ్మింటన్‌, ‌బాక్సింగ్‌ ‌విభాగాలలో కాంస్య పతకాలు, హాకీ పురుషుల విభాగంలో కాంస్య పతకం దక్కాయి. ఏదోఒక పతకం సాధించగలరన్న షూటర్లు, ఆర్చర్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమయ్యారు.


నీరజ్‌ ‌చోప్రా స్వర్ణయుగం

టోక్యో గేమ్స్‌లో భారత అథ్లెట్లు సాధించిన విజయాలలో ట్రాక్‌ అం‌డ్‌ ‌ఫీల్డ్ ‌హీరో, ఇరవై మూడేళ్ల నీరజ్‌ ‌చోప్రా సాధించిన బంగారు పతకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒలింపిక్స్ ఆఖరిరోజు పోటీలలో భాగంగా జరిగిన పురుషుల జావలిన్‌ ‌త్రోలో యువకెరటం నీరజ్‌ ‌చోప్రా స్వర్ణ పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. చెక్‌ ‌రిపబ్లిక్‌, ‌జర్మనీ, పాకిస్తాన్‌ ‌దేశాలకు చెందిన ప్రత్యర్థులను అలవోకగా అధిగమించి 87.58 మీటర్ల రికార్డుతో స్వర్ణవిజేతగా నిలిచాడు. ఆధునిక ఒలింపిక్స్ ‌వ్యక్తిగత విభాగంలో.. బంగారుపతకం సాధించిన భారత రెండో అథ్లెట్‌గా, ట్రాక్‌ అం‌డ్‌ ‌ఫీల్డ్‌లో తొలి స్వర్ణవిజేతగా రికార్డుల్లో చేరాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అభినవ్‌భింద్రా షూటింగ్‌లో తొలి బంగారు పతకం సాధిస్తే.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం లభించింది.

 స్వతంత్ర భారత తొలి అథ్లెట్‌

‌ప్రపంచంలోనే అత్యంత యువజన జనాభా కలిగిన భారత్‌ ఆశాకిరణంగా హర్యానా కుర్రాడు నీరజ్‌ ‌చోప్రా నిలిచాడు. జూనియర్‌ ‌స్థాయి నుంచే జావలిన్‌ ‌త్రోలో నిలకడగా రాణిస్తూ బంగారు బాట వేసుకున్నాడు. అండర్‌-19 ‌విభాగంలో ప్రపంచ జూనియర్‌ ‌చాంపియన్‌గా నిలిచిన నీరజ్‌.. ఆ ‌తర్వాత కామన్వెల్త్ ‌గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. ఒలింపిక్స్‌లో సైతం సత్తా చాటి తిరుగులేని విజేతగా నిలిచాడు. భారీ అంచనాల నడుమ ఒలింపిక్స్ ‌బరిలోకి దిగిన నీరజ్‌…అర్హత పోటీలలో కేవలం ఒకేఒక్క  త్రో తోనే అగ్రస్థానంలో నిలిచాడు. ఇక మెడల్‌ ‌రౌండ్‌లో రెండంటే రెండు త్రోలలోనే బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. క్వాలిఫైయింగ్‌ ‌రౌండ్లలో 86.65 మీటర్ల రికార్డు నెలకొల్పిన నీరజ్‌.. ‌గోల్డ్‌మెడల్‌ ‌రౌండ్‌ను 87.58 మీటర్లతో ముగించి సంచలనం సృష్టించాడు. నీరజ్‌ ‌విజృంభణతో జావలిన్‌ ‌త్రోలో ప్రపంచ మేటి విజేతలుగా గుర్తింపు పొందిన చెక్‌ ‌రిపబ్లిక్‌ ‌జోడీ జాకబ్‌ ‌వాల్డిచ్‌, ‌విటేస్లావ్‌ ‌వెస్లీ రజత, కాంస్య పతకాలతో సరిపెట్టుకోక తప్పలేదు.

స్వతంత్ర భారత ఒలింపిక్స్ ‌ట్రాక్‌ అం‌డ్‌ ‌ఫీల్డ్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం అందించిన అథ్లెట్‌గా నీరజ్‌ ‌చోప్రా చరిత్రలో నిలుస్తాడు. 1900 పారిస్‌ ఒలింపిక్స్ ‌ట్రాక్‌ అం‌డ్‌ ‌ఫీల్డ్‌లో నార్మన్‌‌ప్రిట్‌ ‌చార్డ్ ‌రెండు రజత పతకాలు సాధించగా.. ఆ విభాగంలో మరో పతకం సాధించేందుకు 100 సంవత్సరాలు పట్టింది. రానున్న ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు కచ్చితంగా బంగారు పతకం సాధించగల మొనగాడు ఎవరంటే నీరజ్‌ ‌చోప్రానే అని చెప్పక తప్పదు.

————————-

కట్టెలు మోసిన చేతులతోనే రజతం!

ఒలింపిక్స్ ‌తొలిరోజునే నిర్వహించిన మహిళల వెయిట్‌ ‌లిఫ్టింగ్‌ 49 ‌కిలోల విభాగంలో మీరాబాయి చాను రజతపతకం సాధించడం ద్వారా భారత్‌కు పతకాల పట్టికలో చోటు సంపాదించి పెట్టింది. స్నాచ్‌, ‌క్లీన్‌ అం‌డ్‌ ‌జెర్క్ ‌విభాగాలలో కలిపి 202 కిలోల బరువు ఎత్తింది. ప్రధాన ప్రత్యర్థి, స్వర్ణ విజేత, చైనా లిఫ్టర్‌ ‌హౌకి అడుగడుగునా గట్టి పోటీ ఇచ్చింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించిన భారత మహిళగా, రజత పతకం నెగ్గిన తొలి మహిళా లిఫ్టర్‌గా మీరాబాయి చరిత్ర సృష్టించింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగుతేజం కరణం మల్లీశ్వరి రెండు దశాబ్దాల క్రితం కాంస్యం సాధించిన విషయం తెలిసిందే.

ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్‌ ‌సంస్కృతిలో క్రీడలు కూడా ఓ ప్రధాన భాగంగా ఉన్నాయి. డింకోసింగ్‌, ‌మేరీకోమ్‌, ‌సరితాదేవి లాంటి అరుదైన బాక్సర్లను మాత్రమే కాదు, తోయిబా సింగ్‌ ‌లాంటి హాకీ దిగ్గజం, కుంజరాణిదేవి లాంటి ప్రపంచస్థాయి వెయిట్‌ ‌లిఫ్టర్‌ను, మహిళా సాకర్‌ ‌ప్లేయర్లను అందించిన ఘనత మణిపూర్‌కి ఉంది. ఆ పరంపరలో భాగంగానే మీరాబాయి చాను రూపంలో మరో మేటి లిఫ్టర్‌ ‌టోక్యో ఒలింపిక్స్ ‌బరిలో నిలిచింది.

ఇరవై ఆరేళ్ల సైఖోమ్‌ ‌మీరాబాయి చాను విలువిద్య క్రీడాకారిణి కాబోయి అయిష్టంగానే వెయిట్‌ ‌లిఫ్టింగ్‌ ‌వైపు మొగ్గుచూపింది. ఇంఫాల్‌లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఓ చిరుద్యోగి కుటుంబం నుంచి వచ్చిన మీరాబాయికి చిన్ననాటి నుంచే తీవ్రంగా శ్రమించడం అలవాటు. ఎనిమిది మంది సభ్యుల తన కుటుంబానికి అవసరమైన వంటచెరుకు కోసం అడవికి వెళ్లి 20 కిలోమీటర్ల దూరం నుంచి కట్టెలమోపులు మోసుకొంటూ రావడం ద్వారా శారీరక పటుత్వాన్ని, శక్తిసామర్థ్యాలను మెరుగుపరచుకుంది. ఆ అనుభవమే తనకు వెయిట్‌ ‌లిఫ్టర్‌గా రాణించడానికి ఎంతగానో ఉపయోగపడిందని మీరా చాలా సందర్భాల్లో చెప్పింది. వెయిట్‌ ‌లిఫ్టింగ్‌లో శిక్షణ ప్రారంభించిన ఏడాదికాలంలోనే తొలి బంగారు పతకం గెలుచుకొంది. 2009 జాతీయ వెయిట్‌ ‌లిఫ్టింగ్‌ ‌పోటీల యువజన విభాగంలో విజేతగా నిలిచిన మీరాబాయి కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో 170 కిలోల బరువు ఎత్తే స్థితికి ఎదిగింది. గ్లాస్గో వేదికగా 2014లో ముగిసిన కామన్వెల్త్ ‌గేమ్స్‌లో రజత పతకం సాధించడమే కాదు, 2016 రియో ఒలింపిక్స్‌కు సైతం అర్హత సంపాదించింది. క్లీన్‌ అం‌డ్‌ ‌జెర్క్, ‌స్నాచ్‌ ‌విభాగాలలో మొత్తం 192 కిలోల బరువెత్తడం ద్వారా కుంజరాణిదేవి పేరుతో ఉన్న 12 సంవత్సరాల జాతీయ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించింది. రియో ఒలింపిక్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 2017లో జరిగిన ప్రపంచ వెయిట్‌ ‌లిఫ్టింగ్‌ ‌పోటీలలో మీరాబాయి బంగారు పతకం సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది. 2018 కామన్వెల్త్ ‌గేమ్స్, ‌థాయ్‌ అం‌తర్జాతీయ వెయిట్‌ ‌లిఫ్టింగ్‌ ‌టోర్నీలతోపాటు ప్రపంచ వెయిట్‌ ‌లిఫ్టింగ్‌ ‌పోటీలలో పాల్గొన్న మీరాబాయికి మిశ్రమ అనుభవాలే ఎదురయ్యాయి. 2021 ఆసియా వెయిట్‌ ‌లిఫ్టింగ్‌ ‌పోటీల స్నాచ్‌ ‌విభాగంలో 86 కిలోల బరువెత్తిన మీరాబాయి సరికొత్త ప్రపంచ రికార్డు నమోదుచేసింది.

————————–

అ‘ద్వితీయ’ విజయం

ఒలింపిక్స్‌లో ఒక్క పతకం సాధించడమే కష్టం. అయితే ఐదు సంవత్సరాల వ్యవధిలో వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పాల్గొని రెండుసార్లూ పతకాలు సాధించిన భారత తొలి మహిళ తెలుగుతేజం పీవీ సింధు మాత్రమే.

6వ సీడ్‌గా పతకం వేటకు దిగిన సింధు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన 9వ ర్యాంకర్‌ ‌హీ బింగ్‌ ‌జియావోను వరుస సెట్లలో చిత్తుచేసి వరుసగా రెండో ఒలింపిక్స్‌లో సైతం పతకం సాధించగలిగింది. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ ‌తాయ్‌ ‌జు ఇంగ్‌ ‌చేతిలో ఎదురైన ఓటమి నుంచి తేరుకొన్న సింధు.. కాంస్య పతకం సాధించాలన్న పట్టుదలతోనే కోర్టులోకి అడుగుపెట్టింది. తనకంటే మూడు ర్యాంకులు దిగువన ఉన్న చైనా యువప్లేయర్‌ ‌బింగ్‌ ‌జియావోను తొలి గేమ్‌ ‌నుంచే ఆత్మరక్షణలో పడవేసింది. సింధు దూకుడుగా ఆడుతూ తొలిగేమ్‌ను 21-13తో గెలుచుకోడం ద్వారా పైచేయి సాధించింది. కీలక రెండోగేమ్‌లో సైతం ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడి 21-15 పాయింట్ల తేడాతో గేమ్‌ను, 2-0తో మ్యాచ్‌ను సొంతం చేసుకోడం ద్వారా కాంస్య పతకం దక్కించుకొంది.

ఐదేళ్ల క్రితం రియో వేదికగా ముగిసిన 2016 ఒలింపిక్స్‌లో ఫైనల్స్ ‌చేరడమే కాదు, రజత పతకం సాధించిన సింధు ఈ ఒలింపిక్స్‌లో మాత్రం కాంస్య పతకంతో సరిపెట్టుకోక తప్పలేదు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత తొలి అథ్లెట్‌గా మల్లయోధుడు సుశీల్‌ ‌కుమార్‌ ‌నిలిస్తే.. సింధు అదే ఘనతను ఇప్పుడు దక్కించుకోగలిగింది.

—————————

మేరీకోమ్‌ ‌సరసన లవ్లీనా

ఒలింపిక్స్‌లో భారత్‌ ‌తరఫున పతకం సాధించిన అసోం తొలి అథ్లెట్‌ ‌ఘనతను 26 సంవత్సరాల లవ్లీనా బోర్గెయిన్‌ ‌సొంతం చేసుకుంది. మహిళల 64-69 కిలోల విభాగం పోరులో ఏమాత్రం అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన లవ్లీనా క్వార్టర్‌ ‌ఫైనల్స్ ‌పోరులో తనకంటే అపార అనుభవం కలిగిన ప్రపంచ మాజీ చాంపియన్‌, ‌చైనీస్‌ ‌తైపీ బాక్సర్‌ ‌నియన్‌ ‌చిన్‌ ‌చెన్‌పై 4-1 పాయింట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఎంతో అనుభవం ఉన్న బాక్సర్‌లా పోరాడి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. మొత్తం మూడురౌండ్ల ఈ పోరులో లవ్లీనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి రౌండ్లో 3-2తో పైచేయి సాధించింది. కీలక రెండోరౌండ్లో ఆమెకు పోటీనే లేకపోయింది. మొత్తం ఐదుగురు జడ్జీలు 10కి 10 పాయింట్లు ఇచ్చారు. మూడోరౌండ్లో సైతం లవ్లీనా దూకుడు ప్రదర్శించడం ద్వారా 4-1 పాయింట్లతో సెమీస్‌ ‌బెర్త్ ‌ఖాయం చేసుకోగలిగింది. అయితే…టర్కీ దిగ్గజ బాక్సర్‌ ‌బసెనాజ్‌ ‌సుర్మెనెల్లీతో జరిగిన సెమీస్‌ ‌పోరులో మాత్రం లవ్లీనా సరిజోడీ కాలేకపోయింది. తొలిరౌండ్లో 5-0తో పైచేయి సాధించిన బసెనాజ్‌ ..‌రెండోరౌండ్లోనూ అదేజోరు కొనసాగించింది. మూడుకు మూడురౌండ్లలోనూ టర్కీ బాక్సర్‌ ‌దూకుడే కొనసాగింది. సెమీస్‌లో ఓడిన లవ్లీనా కాంస్యతో సరిపెట్టుకోక తప్పలేదు. లవ్లీనాతో పాటు అమెరికన్‌ ‌బాక్సర్‌ ఓషే జోన్స్ ‌సైతం కాంస్య పతకం అందుకుంది. బాక్సింగ్‌ ‌నియమావళి ప్రకారం సెమీస్‌లో పరాజయం పొందిన ఇద్దరు బాక్సర్లు కాంస్య పతకం కోసం పోటీలేకుండా పతకాలు అందుకోడం ఆనవాయితీగా వస్తోంది.

ఒలింపిక్స్ ‌బాక్సింగ్‌ ‌చరిత్రలో కాంస్య పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా, రెండో మహిళగా, అసోం తొలియువతిగా లవ్లీనా రికార్డుల్లో చేరింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో మేరీకోమ్‌ ‌కాంస్య పతకం సాధించిన తరువాత.. ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన మరో భారత మహిళా బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది.

————————–

 రజతయోధుడు

పురుషుల కుస్తీ 57 కిలోల విభాగం బరిలోకి ఏమాత్రం అంచనాలు లేకుండా దిగిన భారత వస్తాదు రవి దహియా ఏకంగా రజత పతకం సాధించడం ద్వారా హేమాహేమీల సరసన నిలిచాడు. ఫైనల్లో చోటు కోసం జరిగిన సెమీస్‌ ‌పోరులో రవి దహియా ఓటమి అంచుల నుంచి బయట పడి 9-7 పాయింట్ల తేడాతో కజికిస్తాన్‌ ‌వస్తాదు నూరిస్లాం సన్యేవ్‌ను అధిగమించడం ద్వారా గోల్డ్ ‌మెడల్‌ ‌రౌండ్‌కు చేరుకోగలిగాడు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన సెమీస్‌ ‌సమరం ఒక దశలో 2-9 పాయింట్లతో వెనుకబడిన దహియా ఆఖరి నిమిషంలో దెబ్బతిన్న బెబ్బులిలా పోరాడి ప్రత్యర్థిని పడగొట్టడం ద్వారా అనూహ్య విజయం అందుకున్నాడు. బంగారు పతకం కోసం జరిగిన సమరంలో మాత్రం రష్యన్‌ ‌వస్తాదు జవుర్‌ ఉగుయెవ్‌ ‌చేతిలో రవి 4-7 తేడాతో ఓటమి పొందాడు. అయితే ఒలింపిక్‌ ‌కుస్తీలో రజతం సాధించిన భారత రెండో మల్లయోధుడిగా రికార్డుల్లో చేరాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌కుమార్‌ ‌రజతం సాధించగా.. ఎనిమిది సంవత్సరాల విరామంలోనే రవి దహియా సైతం రజతం సాధించడం విశేషం. తొలిసారి ఒలింపిక్స్ ‌బరిలోకి దిగిన రవి ఏకంగా ఫైనల్‌ ‌చేరుకొని అందరినీ ఆశ్చర్యపరచాడు.

———————

భజరంగ్‌ ‌దూకుడు!

ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏదోఒక పతకం సాధించగల మొనగాడిగా పేరుపొందిన భజరంగ్‌ ‌పూనియా కంచుమోత మోగించాడు. 65 కిలోల విభాగం ప్రీ-క్వార్టర్స్, ‌క్వార్టర్‌ ‌ఫైనల్స్ ‌రౌండ్లలో నెగ్గుకు వచ్చిన భజరంగ్‌కు.. సెమీ ఫైనల్లో చుక్కెదురయింది. ప్రత్యర్థి, మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌ ‌చేతిలో ఓటమి పొందిన భజరంగ్‌.. ‌కాంస్య పతకం పోరులో మాత్రం చెలరేగిపోయాడు. తొలి రౌండ్‌ ‌నుంచే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడు ప్రదర్శించాడు. 8-0 పాయింట్ల తేడాతో కజికిస్తాన్‌ ‌యోధుడు దౌలత్‌ ‌నియాజ్‌ ‌బెకోవ్‌ను చిత్తు చేశాడు. ఒలింపిక్స్ ‌కుస్తీలో పతకం సాధించిన భారత ఆరవ రెజ్లర్‌గా, 5వ పురుష వస్తాదుగా రికార్డుల్లో చేరాడు.

——————————–

హాకీకి కొత్త ఊపు

హాకీ పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లు అంచనాలకు తగ్గట్టు రాణించి ప్రపంచంలో ప్రత్యేకతను కాపాడుకోగలిగాయి.

మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌నాయకత్వంలోని పురుషుల జట్టు కాంస్య పతకం సాధిస్తే రాణీరాంపాల్‌ ‌సారథ్యంలోని మహిళల జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో చివరిసారిగా పతకం నెగ్గిన భారత హాకీజట్టు మరో పతకం కోసం 41 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఒలింపిక్స్‌లో ఏదో ఒక పతకం సాధించడం ఓ నెరవేరని కలగా నిలిచిపోయింది. అయితే, ఆ చిరకాల స్వప్నాన్ని భారతజట్టు టోక్యో ఒలింపిక్స్ ‌ద్వారా సాకారం చేసుకొంది. కఠోరశ్రమకు తగిన ఫలితం దక్కింది. కరోనా మహమ్మారితో పాటు… ప్రత్యర్థిజట్లనూ జయించిన భారత హాకీజట్టు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేతగా నిలిచింది. ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ ‌స్వర్ణవిజేత భారత్‌..  ‌మారిన పరిస్థితులలో తిరిగి ఒలింపిక్స్ ‌పతకం గెలుచుకోవడానికి నాలుగు దశాబ్దాలపాటు అంతులేని పోరాటమే చేసింది.

1928 నుంచి 1980 వరకు

బ్రిటిష్‌ ‌పాలనలో ఆంగ్లసిపాయిల ద్వారా భారత్‌కు చేరిన క్రీడే ఫీల్డ్ ‌హాకీ. 1928 ఆమ్‌స్టర్‌ ‌డామ్‌ ఒలింపిక్స్ ‌నుంచి 1980 మాస్కో ఒలింపిక్స్ ‌వరకు భారతజట్టు ఎనిమిది బంగారు, ఓ రజతం, రెండు కాంస్య పతకాలు సాధించింది. దశాబ్దాల క్రితం మాస్కో వేదికగా ముగిసిన ఒలింపిక్స్‌లో చివరిసారిగా బంగారు పతకం సాధించిన భారత జట్టు… ఆ తర్వాత అంతర్జాతీయ హాకీలో వచ్చిన పెనుమార్పుల ఊబిలో కూరుకుపోయింది. సాంప్రదాయ రబ్బీసు, పచ్చిక హాకీ మైదానాలు కాస్తా సింథటిక్‌ ఆ‌స్ట్రో టర్ఫ్ ‌మైదానాలుగా మారిపోడంతో కళాత్మక భారత హాకీ ఎందుకూ కొరగాకుండా పోయింది. కాలానుగుణంగా మారడంలో విఫలమైన భారత హాకీ అగ్రస్థానం నుంచి పాతాళానికి పడిపోయింది. ప్రపంచ నంబర్‌వన్‌ ‌జట్టు కాస్త 12వ ర్యాంక్‌కు పడిపోయింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించడం సంగతి అటుంచి.. అర్హత సాధించడమే గగనమైపోయింది.

ఒడిషా ప్రభుత్వం అండతో..

జాతీయక్రీడగా నిరాజనాలు అందుకొన్న భారత హాకీ…క్రికెట్‌ ‌మర్రినీడన ఎదుగూబొదుగూ లేకుండా పోయింది. ప్రభుత్వాలు సైతం హాకీని పక్కనపెట్టి క్రికెట్‌, ‌బ్యాడ్మింటన్‌ ‌వంటి క్రీడలను అక్కున చేర్చు కోవడం మొదలైంది. అంతరించపోడానికి సిద్ధంగా ఉన్న భారత హాకీ పరిరక్షణ కోసం స్వయంగా అంతర్జాతీయ హాకీ సమాఖ్యే నడుంబిగించింది. విదేశీ శిక్షకులను, సలహాదారులను అందుబాటులో ఉంచింది. ఇదే సమయంలో స్పాన్సర్లు, క్రీడా మంత్రిత్వ శాఖ సైతం హాకీపట్ల సవతితల్లి ప్రేమను ప్రదర్శించడంతో నవీన్‌ ‌పట్నాయక్‌ ‌నేతృత్వంలోని ఒడిషా ప్రభుత్వం ముందుకు వచ్చింది. గత ఏడు సంవత్సరాలుగా భారత హాకీజట్లకు ఒడిషా ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్‌గా ఉంటూ, కోట్లాది రూపాయల ఆర్థికసాయం అందిస్తూ అండగా నిలిచింది. జట్టు ఎంపికలో ప్రతిభకే ప్రాధాన్యమిస్తూ పారదర్శక విధానాలు అనుసరించడం సత్ఫలితాలను ఇచ్చింది. భువనేశ్వర్‌ ‌వేదికగా పలు అంతర్జాతీయ హాకీ టోర్నీలకు సైతం ఒడిషా ప్రభుత్వం ఆతిథ్యమివ్వడం ద్వారా భారతహాకీకి ఊపిరి పోసింది.

అంతర్జాతీయ హాకీ సమాఖ్య చొరవ, ఒడిషా ప్రభుత్వ పూనిక, భారత హాకీ సమాఖ్య పట్టుదల కారణంగా అట్టడుగున ఉన్న భారత హాకీ గత ఐదేళ్ల కాలంలో పుంజుకోడం ప్రారంభమయింది. నిలకడగా రాణించడం ద్వారా 12వ ర్యాంక్‌ ‌నుంచి 5వ ర్యాంక్‌కు చేరుకోగలిగింది.

మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌నాయకత్వంలోని భారతజట్టు సభ్యులు గత 15 మాసాలుగా కఠోరసాధన చేస్తూ శ్రమించారు. జట్టులోని పలువురు ప్రధాన ఆటగాళ్లు కరోనా వైరస్‌ ‌బారిన పడినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యారు. గ్రూప్‌-ఏ ‌లీగ్‌లో ఐదురౌండ్లలో నాలుగు విజయాలు సాధించడం ద్వారా క్వార్టర్‌ ‌ఫైనల్స్ ‌నాకౌట్‌ ‌రౌండ్లో భారత్‌ అడుగుపెట్టింది. సెమీఫైనల్స్‌లో చోటు కోసం జరిగిన పోరులో గ్రేట్‌ ‌బ్రిటన్‌ను చిత్తు చేసిన భారత్‌ ‌ఫైనల్‌ ‌రౌండ్‌కు అర్హత సాధించలేకపోయినా కాంస్య పతకం సమరంలో మాజీ చాంపియన్‌ ‌జర్మనీపై 5-4 గోల్స్‌తో సంచలన విజయమే సాధించింది. గ్రాహం రీడ్‌ ‌శిక్షణలో రాటుదేలిన భారతజట్టు ఒలింపిక్స్ ‌మొదటి మూడు అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలవడం ద్వారా కళాత్మక భారతహాకీ పునరుజ్జీవనానికి గట్టి పునాది వేసింది.

భారతజట్టు కాంస్య పతకమే సాధించినా శతకోటి భారత అభిమానులకు మాత్రం ఇది స్వర్ణంతో సమానమే. ప్రధాని నుంచి పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సైతం హాకీజట్టును అభినందిస్తూ సందేశాలు పంపారు.

 టోక్యో ఒలింపిక్స్‌లో మొత్తం 204 దేశాలు తలపడితే 86 దేశాలు మాత్రమే ఏదో ఒక పతకం సాధించడం ద్వారా పతకాల పట్టికలో చోటు సంపాదించగలిగాయి. అమెరికా, చైనా, జపాన్‌, ‌గ్రేట్‌ ‌బ్రిటన్‌, ‌రష్యా దేశాలు మొదటి ఐదు స్థానాలలో నిలిచాయి. 2016 రియో ఒలింపిక్స్ ‌పతకాల పట్టికలో 68వ స్థానంలో నిలిచిన భారత్‌ 2020 ఒలింపిక్స్‌లో 20 స్థానాలు మెరుగుపరచుకొని 48వ స్థానంలో నిలిచింది.

పారిస్‌ ‌వేదికగా మరో మూడేళ్లలో జరిగే 2024 ఒలింపిక్స్‌లో భారత్‌ ‌మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుందాం!


‌ప్రశంసల హోరు నజరానాల జోరు

టోక్యో ఒలింపిక్స్‌లో అసాధారణంగా రాణించి స్వదేశం చేరిన భారత అథ్లెట్లపై ప్రశంసల వెల్లువ మాత్రమే కాదు, నజరానాల వానా కురుస్తోంది. స్వర్ణం సాధించిన నీరజ్‌ ‌చోప్రా కానుకల జడివానలో తడసి ముద్దవుతున్నాడు. భారత సైనిక దళాలలో నాయక్‌ ‌సుబేదార్‌గా పనిచేస్తున్న నీరజ్‌కు 6 కోట్ల రూపాయల నగదు బహుమతితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్‌-1 అధికారి ఉద్యోగం ఇవ్వనున్నట్లు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ‌ఖట్టర్‌ ‌తెలిపారు. పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి సైతం నీరజ్‌ ‌చోప్రాకు 2 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.

మరోవైపు భారత క్రికెట్‌ ‌నియంత్రణ మండలి ఒలింపిక్స్ ‌పతక విజేతలందరికీ భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. స్వర్ణం సాధించిన నీరజ్‌ ‌చోప్రాకు 2 కోట్ల రూపాయలు; రజత పతకాలు సాధించిన మీరాబాయి చాను, రవికుమార్‌ ‌దహియాలకు 50 లక్షల రూపాయల చొప్పున; కాంస్య పతక గ్రహీతలు లవ్లీనా, సింధు, భజరంగ్‌ ‌పూనియాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నారు.

పురుషుల హాకీజట్టుకు కోటి 25 లక్షలు నజరానాగా ఇవ్వనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అంతేకాదు, జట్టులోని పంజాబ్‌ ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ 4 కోట్ల రూపాయల చొప్పున నగదు పురస్కారం అందచేయనున్నట్లు పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి ప్రకటించారు. జట్టులో పంజాబ్‌కు చెందిన ఎనిమిది మంది ఆటగాళ్లు కీలక సభ్యులుగా ఉన్నారు. క్రికెటర్లతో పోల్చితే సంపాదనలో అట్టడుగున ఉన్న హాకీ క్రీడాకారులు జీవితంలో తొలిసారిగా భారీగా నగదు బహుమతులు అందుకోనున్నారు. కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ సైతం స్వర్ణ విజేతలకు రూ. 75 లక్షలు, రజత పతక గ్రహీతలకు రూ. 50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ. 25 లక్షలు ప్రోత్సాహక బహుమతులు ప్రకటించింది. మహిళల హాకీలో నాలుగో స్థానం సాధించిన భారతజట్టులోని హరియాణా ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలను ఆ రాష్ట్రం ప్రభుత్వం ప్రోత్సాహకంగా ప్రకటించింది. ఇంకా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సంస్థలు టోక్యో ఒలింపిక్స్ ‌విజేతలకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించాయి.

మీరాబాయి చానుకు భారీ ప్రోత్సాహకాలు

మహిళల వెయిట్‌ ‌లిఫ్టింగ్‌లో రజతపతకం సాధించిన మీరాబాయి చానుకు మణిపూర్‌ ‌ప్రభుత్వం కోటి రూపాయల నగదు బహుమతితో పాటు పోలీసుశాఖలో ఏఎస్పీగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే స్పోర్టస్ ‌కోటాలో ఈశాన్య రైల్వేలో ఉద్యోగిగా ఉన్న మీరాబాయికి 2 కోట్ల రూపాయల నజరానాతో పాటు ఆఫీసర్‌ ఆన్‌ ‌స్పెషల్‌ ‌డ్యూటీ (స్పోర్టస్)‌గా పదోన్నతి కల్పిస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ‌ప్రకటించారు.

విశాఖలో స్పోర్టస్ అకాడమీ

ఒలింపిక్స్ ‌బ్యాడ్మింటన్‌ ‌మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించిన ఆంధప్రదేశ్‌ ‌క్రీడాకారిణి పీవీ సింధుకు బీసీసీఐ, కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ చెరో 25 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వనున్నాయి. అంతేకాదు, విశాఖలో స్పోర్టస్ అకాడమీ ఏర్పాటు చేయటానికి వీలుగా 2 ఎకరాల స్థలాన్ని కేటాయించనుంది. రాష్ట్ర క్రీడావిధానంలో భాగంగా 30 లక్షల రూపాయలు నజరానాగా ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులకు ఎన్ని రకాల ప్రోత్సాహక బహుమతులు అందచేసినా అవి చంద్రునికో నూలుపోగులాంటివే అనడంలే ఏమాత్రం సందేహం లేదు.

– వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram