కట్టడాలు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కట్టడాలుగా గుర్తింపు పొందుతాయి. ప్రాంతీయ కట్టడాలు ఒక ప్రాంతం లేక రాష్ట్రంలోని జాతి, ప్రాంత సంస్కృతిని ప్రతిబింబిస్తే, జాతీయ స్థాయి కట్టడాలు దేశ సంస్కృతికి అద్దం పడతాయి. జాతీయ స్థాయిలో మేటి, సాటిలేని సార్వత్రిక విలువలకు, సార్వకాలిక కళాత్మతకు అద్దం పట్టేవాటినే అంతర్జాతీయ కట్టడాలుగా యునెస్కోకు చెందిన ఐకోమోస్‌ (ఇం‌టర్నేషనల్‌ ‌కమిటీ ఆన్‌ ‌మాన్యుమెంట్స్ అం‌డ్‌ ‌సైట్స్) ‌ప్రకటిస్తుంది. మనదేశంలో ఇప్పటివరకూ సహజసిద్ధమైన ప్రదేశాలు, మానవ కట్టడాలు కలిపి  38 వరకూ ఉన్నాయి. యునెస్కోలోని వరల్డ్ ‌హెరిటేజ్‌ ‌సెంటర్‌ (‌పారిస్‌) ఇటీవల చైనాలో జరిపిన సమావేశంలో తెలంగాణలోని ములుగు జిల్లా, పాలంపేట రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్డడాల జాబితాలో చేర్చినట్టు ప్రకటించింది.

పరచిన పచ్చటి తివాచీ లాంటి ప్రకృతి ఒడిలో, ఆ అందాన్ని ఇనుమడింప జేసే కొండసానువుల దిగువన ఉన్న పాలంపేట గ్రామమది. తన ప్రభువు మాదిరే శివునికి ఒక వినూత్న ఆలయాన్ని నిర్మించాలనుకొని, అక్కడి స్థలాన్ని ఆయన ఎంపిక చేసుకొన్నాడు. ఆ కళాహృదయుడు, శివభక్తుడు రేచర్ల రుద్రారెడ్డి. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని సైనాధ్యక్షుడాయన.

దాదాపు 200 సంవత్సరాల పాటు సుస్థిర పాలననందించి, వర్తక, వాణిజ్య, వ్యవసాయాభివృద్ధితో పాటు; సాహిత్యం, సంగీతం, శిల్పం, చిత్రలేఖనాలను పోషించిన కాకతీయులు తెలుగునాట- ప్రత్యేకించి తెలంగాణలో వేయికి పైగా దేవాలయాలను నిర్మించారు. హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, ఓరుగల్లు కోటలోని శంభుని గుడి, ఘనపూర్‌లోని కోటగుళ్లు, పాలంపేటలోని రామప్ప దేవాలయం కాకతీయ శిల్పుల కళాకౌశలానికి అద్దం పడుతున్నాయి. రేచర్ల రుద్రుడు కూడా పాలంపేటలో తన పేరిట రుద్రేశ్వరాలయాన్నీ, సముద్రాన్ని తలపించే చెరువునూ నిర్మించాడు. సార్వత్రిక కళానైపుణ్యంతో, అబ్బురపరచే సాంకేతిక పరిజ్ఞానానికీ, మేథో మథనం అందించిన సృజనాత్మకతకూ నిదర్శనంగా ప్రపంచ దృష్టినాకర్షించి, తెలంగాణ తల్లి కీర్తికిరీటంలో మణిమకుటంగా వెలుగొందుతున్నాయవి. వాటిలో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకొన్నదే రామప్ప గుడి. ప్రతి తెలుగువాడికీ గర్వకారణమైంది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.

ఆలయాన్ని రామప్ప అనే శిల్పి నిర్మించాడనీ, అందుకే రామప్ప దేవాలయమన్న పేరొచ్చిందనీ స్థానికులు చెబుతారు. చారిత్రకాధారాలు మాత్రం లేవు. అయితేనేం? అపురూపంగా వెలుగొందుతున్న రుద్రేశ్వరాలయం దక్షిణాదిలోనే అరుదైన ఆలయంగా గుర్తింపు పొందింది. ఇది గర్భాలయం, అర్ధమంటప, రంగ మంటప, నంది మంటపాలతో నిర్మితమైంది. చుట్టూ ప్రాకారంతో సుందర దేవాలయ సముదాయంగా రూపుదిద్దుకొంది. ఆలయ నిలువుభాగంలో ఉపపీఠం, అధి•ష్ఠానం, పాదవర్గం, విమానంతో; పైన బంగారు కలశంతో దివ్య విమానాన్ని పోలి ఉంది.

 ఆలయానికి కుడివైపున కామేశ్వరాలయం, కల్యాణ మంటపాలనూ, ఎడమవైపున కాటేశ్వరాలయం, భద్రతకోసం చుట్టూ ఎత్తైన ప్రాకారం, కట్టపైన నీటిపై తేలియాడే ఇటుకలతో నిర్మించిన మూడంతస్తుల విమానం, దానిముందు చిలుకముక్కులాంటి శుకనాసి, పైన కలశం అన్నీ మేళవించి అందాల భరణిలాంటి ఆలయంగా, సర్వాంగ సుందరంగా రూపొంది, తెలంగాణ దేవాలయాల్లో మేటిగా నిలిచి ఉంది.

ఆలయం ముందు శివుని వాహనం నంది కూడా ప్రధానాలయంలోని శిల్పరమ్యతకు ఏమాత్రం తీసిపోని కళాశోభితమే. వాస్తుకళా నైపుణ్యానికి నిలయంగా ఒక ఆలయాన్ని తీర్చిదిద్ది, అంతకుముందెన్నడూ, ఎక్కడాలేని అందమైన ఆభరణాలతో అలంకరించిన నంది విగ్రహాన్ని అంతే భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. రాతిని కరిగించి పోతపోశారనిపించేలా దానిని మలిచారు.

ఉపపీఠం ఎనిమిది వరుసలతో, చుట్టూ ప్రదక్షిణ చేయటానికి వీలుగా రామప్ప గుడిని నిర్మించారు. ఉపపీఠంపైన గల అధిష్ఠానం పైవరుసలో అందమైన అలనాటి మందగమనలైన ఏనుగుల వరుస, దానిపైన మళ్లీ ఏనుగుల వరుస, గణపతి, భైరవ, గజలక్ష్మి, మల్లయుద్ధం, సూర్యుడు, మొసలి శిల్పాలు కాకతీయ కళా వైభవానికి మచ్చుతునకలుగా భాసిల్లుతున్నాయి. కట్టడ భాగాలపై చెక్కిన శిల్పాన్ని వాస్తుశిల్పం అంటారు. కాకతీయ వాస్తుశిల్పం సమకాలీన హొయసల వాస్తుశిల్పానికి ఏమాత్రం తీసిపోని, వాసి గల శిల్పంగా పేరుగాంచింది. ఏనుగులు జీవం ఉట్టిపడుతూ, అలనాటి ధైర్యసాహసాలకు సాక్ష్యమిస్తున్నాయి.

చిన్నదైనా మన్నికగల అధిష్టానాన్ని రచించి, ఎత్తైన గోడలు, వాటిపై పొలాల్లో రైతులు వేసుకునే మంచె లాంటి కోష్టాలను, వాటిపైన శిఖరం, కలశాలతో అలంకరించారు. గోడలపైన కప్పు భాగంలో బాగా విస్తరించిన ప్రస్తర కపోతాన్ని తీర్చిదిద్ది, వర్షపు నీరు ఆలయ గోడలపై పడకుండా జాగ్రత్తలు తీసుకొని, నిర్మాణపరంగా ఆధునిక ఇంజనీర్లకు ఏమాత్రం తీసిపోమని కాకతీయ కాలం శిల్పులు నిరూపిం చారు. అంతేకాదు. చూరు కింది భాగాన రకరకాల చట్రాలు, పట్టీలతో చిత్రవిచిత్ర శిల్పాల కల్పనలతో చూపరులు మైమరచేలా మలిచారు.

ఆలయంలోకి ప్రవేశించగానే, అధిష్టానంపైన, భక్తులు విశ్రాంతి తీసుకొంటూ ఆధ్యాత్మికా నందానుభూతులకు లోనవటానికి వీలుగా కక్షాసనాల్ని తీర్చిదిద్దారు. వీటి బయటి భాగాన చెక్కిన శృంగార, మైథున, దేవతాశిల్పాలతో పాటు రుషి పుంగవులు, మైలారభటులు, కాలాముఖి, పాశుపత, లకులీశయతులు, జైన తీర్ధంకరులు, దంపతుల శిల్పాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ, ఆలయం అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.

దేవాలయ రంగమంటప అధిష్ఠానంపైన ఒక పిట్టగోడ లాంటి నిలువురాతిని వంకరగా నిలబెట్టారు. భక్తులు ఆనుకొని కూర్చోవటానికి వీలుగా తీర్చిదిద్దిన ఈ అరుగుపైన వాలురాయినే కక్షాసనం అంటారు. చుట్టూ ఉన్న ఇరవై కక్షాసనాల మీద వెలుపల జైన తీర్థంకరులు, కత్తీ డాలూ పట్టిన యోధులు, నాట్య గణపతి, చామరం పడుతున్న యువతి, విల్లంబులు ధరించి, వాటిని ఎక్కుపెట్టడానికి సిద్ధంగా ఉన్న ముగ్ధమనోహర వేటగత్తెలు, భటులు, భైరవులు, ఆలయనృత్యంలో సిద్ధహస్తులైన రుద్రగణికలు, వేణుగోపాలుడు, మల్లయుద్ధంలో మేటి జెట్టీలు, చెట్లకొమ్మలు పట్టుకొని వయ్యారాలను ఒలకబోస్తున్న అందగత్తెలు, నాట్యంలో మాకు మించినవారున్నారా అని సవాళ్లు విసురుతున్న జవరాళ్లు, అటూ ఇటూ మద్దెలలు వాయిస్తున్న మార్దంగికులు, నాగుబాములును పూలదండగా ఎత్తిపట్టుకొన్న నాగినులు, రతీమన్మథు లకే సురతికేళిలో మెలకువలు నేర్పుతామంటున్న యువతీయువకుల మైథున భంగిమల శిల్పాలు, జగమంతా మిథ్యేనని చాటి చెబుతూ నగ్నంగా తిరుగు తున్న రుషి పుంగవులు, శివుడే తమ సర్వస్వమను కుంటూ భక్తి పారవశ్యంలో మునిగిన శైవభక్తులు, మైలారీ భటుల శిల్పాలు, చక్కటి అంగసౌష్టవంతో ఆభరణాలు, అలంకరణలతో అందాన్ని కరగించి కాకతీయ శిల్పులు ఈ శిల్పాల్ని సృష్టించారా అన్న భ్రమకు గురౌతారు సందర్శకులు. శిల్పాల మధ్యలో నాలుగు దళాల పద్మాలను, పట్టీలను సుతారంగా చెక్కి తమ హస్తకళా లాఘవాన్ని ప్రదర్శించారు. కక్షాసనం లోపలివైపున రుద్రుని పరివారంగా, ఏడు చిన్న దేవాలయాల్లో, రెండింటిలో మాత్రం, మహిషాసురమర్దిని, గణపతి విగ్రహాలున్నాయి. ఇక అధిష్ఠానంపైన, ఆలయం గోడలపైన చక్కటి స్తంభాలు, చిన్న దేవాలయ నమూనాలు, మధ్యలో మూడంచెల కోష్ఠాలు, వాటికింద మళ్లీ ఉరుకుతున్న, నిలబడిన, చోద్యం చూస్తున్న ఏనుగుల వరుస, దానికింద ముచ్చటైన బుల్లి నంది శిల్పుల నేర్పరితనాన్ని వెల్లడిస్తున్నాయి.

 కప్పుల పైన ముందుకు పొడుచుకు వచ్చిన శుకనాసి, పై వరకూ అందంగా తీర్చిన విమాన శిఖరం, కలశం, ఆలయానికి నిండుదనాన్నిచ్చాయి. దేశంలో ఎక్కడాలేనట్లు విమాన శిఖరాన్ని నీటిలో తేలియాడే తేలికపాటి ఇటుకరాళ్లను మలచి నిర్మించి, గుడిని అద్భుత కట్టడంగా తీర్చిదిద్దడం ద్వారా కాకతీయ శిల్పులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. గర్భాలయ, అర్ధమంటపాల తరువాత, మూడువైపులా ప్రవేశ మార్గాలతో చదరపు రంగమంటపముంది. మధ్యలో నాలుగు నల్ల శానపురాళ్లతో నగిషీతో, అద్దంలో ప్రతిబింబం కనిపించేట్లు చెక్కిన స్తంభాలు, వాటిపైన దూలాలు శిల్ప సౌందర్యంతో మతి పోగొడతాయి. అంతటి నునుపును తెచ్చిన శిల్పుల సాంకేతిక నైపుణ్యానికి వందల, వేల వందనాలర్పించటం తప్ప మరేమీ చేయలేం! స్తంభాలపైన నాట్యగణపతి, సైనికులు, ఆలయ నిర్మాత రేచర్ల రుద్రారెడ్డి, అతని భార్య, నాట్యగత్తెలు, వాద్యగాండ్రు, రతీమన్మథులు, అమృత మథనం, గోపికా వస్త్రాపహరణం, చక్కటి ఆకృతులు, రాతిలో రకరకాల తాళ్లు, గొలుసులు, దండలు ఆనాటి శిల్పుల ఉలి విన్యాసాల సొగసును ప్రకటిస్తున్నాయి. దూలాల పైన, కింద, పక్కలా గల దేవీదేవతామూర్తుల్లో శివ-కల్యాణ సుందరమూర్తి, బ్రహ్మ, విష్ణువుల మధ్య నటరాజు, ఏకాదశ రుద్రులు, త్రిపుర సంహారమూర్తి, నందీశ్వర, అష్టదిక్పాలకులు, సప్తర్షులు, గజాసుర సంహారమూర్తి, సాగర మథనం అనంతరం అమృత కలశం అందుకోవడానికి అటూ ఇటూ నిలిచిన దేవతలు, రామరావణ యుద్ధం, శిల్పశాస్త్రాలు పేర్కొన్న దేవతా ప్రతిమ లక్షణం కనువిందు చేస్తున్నాయి. దూలాల పైన మూలరాళ్లపైన దిక్పాలకులు, మధ్యన నటరాజ శిల్పం చూపరుల దృష్టిని మరల్చకుండా చేస్తాయి.

నాగిని-మదనిక శిల్పాలు

రంగ మంటపం వెలుపల స్తంభాలు, దూలాల మధ్య ఏటవాలుగా, నల్ల శానపురాళ్లతో చెక్కిన ఏనుగు పైనున్న యాళి-గజకేసరి (ఏనుగుపై లంఘిస్తున్న సింహాన్ని పోలిన కల్పిత జంతువు) శిల్పాలు, నాగిని మదనిక శిల్పాలు కాకతీయ శిల్పుల నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకున్నాయి. తూర్పువైపు ద్వారానికి ఎడమ వైపు నున్న యువతి ఎత్తుమడమల పాదుకలతో ఉంది. మరో యువతి ఒంటిపై ఎంబ్రాయిడరి అల్లికల మాదిరి దుస్తులు, అప్పటికి కొంగ్రొత్త డిజైన్లు అద్దుకున్న బట్టలతో అందమంతా తన సొంతమేనన్నట్లు ఆనందాన్ని ఒలకబోస్తుంది. శిరోజాల అమరిక, చెవులకు అందమైన గుండ్రటి పెద్ద దుద్దులు, నాజూకైన బంగారునగలు, నాట్య భంగిమలు- ఆ సొగసుగత్తెల మాటేమోగానీ, చేయి తిరిగిన శిల్పుల పనితనానికి గొప్ప నిదర్శనాలనిపిస్తాయి. స్తంభాలు, దూలాలే కాదు, ద్వారశాఖల్ని సైతం శిల్పాలతో నింపారు. సహజ సిద్ధమైన గ్రామీణ యువతులు వేటకెళ్లి పడుతున్న పాట్లు, అటూ ఇటూ రాతి కిటికీలపై మలచిన నాట్యగత్తెలు, వాద్యగాళ్ల బొమ్మలు, ఆనాటి నృత్యరీతులకు అద్దం పడుతూ, పేరిణి ఆంధ్రనాట్యాల పునఃసృష్టికర్త పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ, కళాకృష్ణ వంటి వారికీ, పేరిణి రమేశ్‌ ‌బృందాలకు ప్రేరణ కాకుండా ఎలా ఉంటాయని పిస్తుంది.

ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చే ఆలయాన్ని నిర్మించ మన్న రేచర్ల రుద్రుని కోరికపై కాకతీయ శిల్పులు తమ ఉలులతో అపురూప శిల్పాల్ని కల్పించగలమని నిరూపించారు. రాబోయే తరాలకు ఒక రసరమ్య కావ్యాన్ని రాతిలో సృష్టించి అందించారు. తెలుగువారి మదిలో శాశ్వతంగా నిలిచిపోయారు. భారతదేశంలో కళలకు చిరునామాలుగా ఇంకొన్ని కట్టడాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఇలాంటి అంతర్జాతీయ గుర్తుంపును సాధించాలని కోరుకుందాం.


ఊహల్లో ఉలి కదలికలు

రామప్ప ఎవరో తెలియదుగానీ, అన్నీ తానై ఈ అపురూప ఆలయాన్ని సృష్టించిన వారు రేచర్ల రుద్రసేనాని. తన పేరిట రుద్రేశ్వరుని ప్రతిష్టించి, చరిత్రలో మిగిలిపోయాడు.

అది క్రీ.శ. 1203వ సంవత్సరం. కాకతీయ రాజ్యస్థాపనాచార్య బిరుదాంకితుడు, సమర్థ సైన్యాధ్యక్షునిగా గుర్తింపు పొంది, గణపతిదేవ చక్రవర్తి అభిమానాన్ని చూరగొన్న రేచర్ల రుద్రుడు కాకతీయ సామ్రాజ్యంలో ఎక్కడా లేనట్లు వాస్తుశిల్ప విన్యాసంతో అపురూప ఆలయాన్ని నిర్మించి చక్రవర్తిని అబ్బుర పరచాలనుకున్నాడు. రాజధాని ఓరుగల్లుకు ఐదు క్రోసుల దూరంలోని పాలంపేటలో స్థలాన్నెంచుకొని, దేవాలయ నిర్మాణాన్ని ఆరంభించారు.

 వాస్తు, శిల్పకళల్లో కొత్తపోకడలకు పేర్గాంచిన శిల్పుల్ని రప్పించాడు రేచర్ల రుద్రుడు. తానొక ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నాననీ, కాకతీయ సామ్రాజ్యానికే మకుటాయమానంగా ఆ ఆలయం భాసిల్లాలనీ తన తలంపును ప్రకటించాడు. ఇక అంతే! అద్భుత ఆలయాల నిర్మాణంలో సిద్ధహస్తులైన కాకతీయ శిల్పులు, అప్పటివరకూ అందుబాటులో ఉన్న ఆలయాలకు భిన్నంగా, ఒక అపురూప దేవాలయాన్ని బట్టపై చిత్రించి, కొయ్యతో నమూనా దేవాలయాన్ని చెక్కి చూపించారు. కళాపోషకుడు రేచర్ల రుద్రుని ఆమోదం పొందారు.

 మునుపటి కల్యాణీ చాళుక్య దేవాలయాల వాస్తునే ఎంచుకొన్నా, నిర్మాణం వరకే ఆ శైలికి పరిమితమై, ఎత్తైన ఉపపీఠంలో మరిన్ని వరుసలు చేర్చి, తమ ప్రయోగ పరంపరలో సాటిలేని మేటి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏమంత లోతు లేని పునాదుల్ని రచించి, ఆధారశిలతో ప్రారంభించి, నక్షత్రాకారపు ఉపపీఠాన్ని ప్రదక్షిణా పథంగా తీర్చిదిద్దారు.

నిర్మాణ కార్యక్రమ పరిశీలనకు వచ్చిన రుద్రునికి, శిల్పులు తరువాత తీర్చబోయే అధిష్టానం, ఆపైన రాబోయే కట్టడ భాగాల గురించి వివరించి చెప్పారు. కట్టడభాగాలకు పాలంపేట, రామానుజపురం మధ్యలో గల ఎర్ర ఇసుకరాతిని, ద్వారాలు, రంగ మంటప స్తంభాలు, దూలాలు, మధ్య, కప్పులు, రుద్రేశ్వర – శివలింగ పానవట్టాలు, నంది వాహనం; రంగ మంటపం ముందుభాగంలో చుట్టూ మదనికలు, అలసకన్యలు, నాగినులు, సురసుందరీ మణులను బోలిన అప్సరసల వంటి యువతుల శిల్పాలను నల్ల శాసనపురాతితోనూ; కప్పుపైన శిఖరా(విమానా)న్ని నీళ్లపై తేలియాడే ఇటుకలతో నిర్మించబోతున్నామని ప్రధాన శిల్పాచార్యుడు రామప్ప (కల్పితం) వివరించగా, సావధానంగా విన్న రుద్రుడు, చిరునవ్వుతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సైగలతో ఆమోదాన్ని తెలిపాడు. అన్ని ఏర్పాట్లు చేయమని ఉన్నతాధికారులను ఆదేశించి, ఏకశిలానగరానికి చేరుకొన్నాడు.

ఒక బృహత్తర నిర్మాణ పథకం ఊపందుకొంది.  కావలసిన పరిమాణాల్లో రాళ్లను గనుల నుంచి విడగొడుతున్నారు. వాటిని నిర్మాణ స్థలానికి తరలిస్తు న్నారు. దించిన తరువాత, వివిధ కట్టడ భాగాల రూపకల్పనకు పూనుకొన్నారు వందలాది శిల్పులు. వందల, వేల ఉలుల చప్పుళ్లతో వేదఘోషల్ని తలపించారు. అపురూప ఆలయ రూపు రేఖల గురించి విన్న గణపతిదేవ చక్రవర్తి, మహారాణి సోమలదేవి,  మహా ప్రధానులు, ప్రధానులు ఎప్పుడు పూర్తవుతుందా అని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఎర్ర ఇసుకరాయి స్థానికంగానే దొరికినా ద్వారాలకు, స్తంభాలకు కావలసిన నల్ల శాసనపురాతిని ఖమ్మం చుట్టు పక్కల నుంచి తరలించాల్సి రావటంతో మంటప నిర్మాణం కొంత ఆలస్యమైంది. విమానానికి కావలసిన సున్నం ఏటూరు నాగారం నుంచి తెచ్చారు. కోట చెరువు అడుగుభాగం మట్టిని తెచ్చి, రంపపు పొట్టు, ఊక, తుమ్మచెక్క, కరక్కాయలు, బెల్లం కలిపి బాగా కలియ దొక్కి, ఇటుకపెళ్లలను పోతపోసి, ఆవంలలో కాల్చి తేలికపాటి ఇటుకలు సిద్ధం చేసుకొన్నారు. కట్టడ భాగాలు, వాటిపై శిల్పాలు చెక్కి నిపుణులైన శిల్పులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోగా, అందరి పనితనాన్ని పర్యవేక్షిస్తున్న రామప్ప మాత్రం, ఎక్కడికక్కడ తగు సూచనలిస్తూ కలియ దిరుగుతున్నారు. అలా విశ్వకర్మ దిగొచ్చి రామప్ప అవతారమెత్తి, రేచర్ల రుద్రునితో భూలోక పుష్పకాన్ని మనకందించి, తరతరాల తెలుగువారి కీర్తికి స్ఫూర్తిగా నిలిచాడు.

 ముందుగా ఉలి, తరువాత అరపాశం, పలుమొనలు, సన్నం, రవసన్నం, ఉలులు, శానాలతో నునుపు చేసి, చివరగా ఆకురాతితో అరగదీసిన స్తంభాలు, దూలాలు, కిటికీలను పోలిన ద్వార శాఖల నేత్రాలపై నాటి మార్గ, దేశీ నృత్య రీతులు, పేరిణీ, ఆంధ్ర నాట్య విన్యాసాలు పాదచరీ, హస్తముద్రలు ఒక్కొక్కటిగా రూపు దిద్దుకొన్నాయి. రంగమంటపంలో చుట్టూ అరుగుపైన ఉపాలయాలు పరివారాలయా లయ్యాయి. వాటిలో గణపతి, మహిషమర్దిని, భైరవ, సప్తమాతలు కొలువు దీరారు.

రంగమంటప స్తంభాలపై నాట్య భంగిమలు, పురాణ, రామాయణ, భాగవత, భారత ఇతివృత్తా లను కళ్లకు కట్టినట్లు చెక్కారు. స్తంభాలపైన ఫలికా పద్మం. దానికింద ముత్యాల సరాలతో రాతి చుట్టలు, పైన బోదెలు, వాటిపైన నాగసర్పాలు సజీవంగా రూపుదిద్దుకొన్నాయి. దూలాలపై కాలనాళికలా అన్నట్లు అమృతమథనం, త్రిపురాసుర సంహారం, రామ-రావణ యుద్ధం, ధన్వంతరి శిల్పాలను హృద్యంగా మలిచారు. కప్పు రాళ్లపై, వాహనాలపై నున్న దిక్పాలకులు, మధ్యలో లయ విన్యాస చక్రవర్తి నటరాజమూర్తి శిల్పాలను శిల్పించటంలో తమ అనల్ప కళా చాతుర్యాన్ని ప్రదర్శించారు. రామప్ప నేతృత్వంలో శ్రమించారు శిల్పులు.

 పదేళ్లు నిర్మాణం సాగి, 31.03.1213న  రుద్రేశ్వరుడిని ప్రతిష్టించాడు రేచర్ల రుద్రుడు. ఆనాటి మరో ప్రతిష్ట, మరో కుంభాభిషేకాలకు చక్రవర్తి గణపతిదేవుని, పట్టపురాణి సోమలదేవిని, అప్పుడే పుట్టిన గారాల పట్టి రుద్రమదేవిని ఆహ్వానించాడు రుద్రసేనాని. అంగరంగ వైభవంగా, ఆగమ శాస్త్ర ప్రకారంగా కార్యక్రమాన్ని నిర్వహించి, స్థపతులు, శిల్పులను, గౌరవించి, బహుమానాలిచ్చి, తాను మాత్రం చక్రవర్తి అభిమానాన్ని బహుమతిగా పొందాడు. ఆలయ నిర్వహణకు విప్పర్లపల్లి, బోర్లపల్లి గ్రామాలను దానంచేసి, ఈ దానాన్ని తనకు శత్రువులైన వారు కూడా గౌరవించాలని వేడుకొంటూ ఒక శాసనాన్ని వేయించి దాతృత్వాన్ని చాటుకొన్నాడు. తన తండ్రి, తల్లి, తన పేరిట నిర్మించిన  కాటేశ్వర, కామేశ్వర, రుద్రేశ్వరాలయాల భోగాలకు నడికుడి అనే గ్రామాన్ని దానం చేశాడు.


గుడి చుట్టూ..

పాలంపేటలోను రామప్ప దేవాలయాలతో పాటు రేచర్ల రుద్రారెడ్డి మరిన్ని కట్టడాలను నిర్మించి ఆలయాన్ని సముదాయంగా తీర్చిదిద్దాడు. వాటిలో కాటేశ్వరాలయం, కామేశ్వరాలయం, కళ్యాణమండపం, ప్రాకారం, చెరువు కట్టపైన కొన్ని ఆలయాలను ఆయన ఆ తరువాతి తరం, కాకతీయ వాస్తుశైలిలో నిర్మించారు.

కామేశ్వరాలయం

రామప్ప దేవాలయానికి నైరుతి దిక్కులో నిర్మించిన కామేశ్వరాలయంలో చిన్న ఉపపీఠం, సాదా గోడలు, దానిపై చిన్న కపోతం, వ్యాళ వర్గాలున్నాయి. ముందుభాగంలో అటూ ఇటూ రెండు కక్షాసనాలుండటం గమనించదగ్గ విషయం. ద్వారబంధాలు కాకతీయ శిల్ప వైశిష్ట్యాన్ని తెలియజేస్తున్నాయి.

కల్యాణమంటపం

రామప్ప ఆలయ దక్షిణ భాగంలో ప్రాకారానికి మధ్యగల కల్యాణమంటపం శిథిలమైపోగా భారత పురాతత్త్వ సర్వేక్షణ శాఖవారు పదిలపరుస్తున్నారు.

ప్రాకారం

ఆలయాలను అపురూపంగా కట్టించిన రుద్రుడు వాటి భద్రతను గురించి కూడా ఆలోచించాడు. ఆలయాల భద్రతతో పాటు పచ్చటి పరిసరాల నడుమ అందం ఇనుమడించేటట్లు (రక్షార్ధం మున్నతార్ధంచ శోభనార్ధం ప్రాకారం ప్రకల్పయేత్‌) ‌చుట్టూ ఎత్తైన విశాలమైన ప్రాకారాన్ని నిర్మించాడు. తూర్పు, పడమర, దక్షిణ దిక్కుల్లో ప్రవేశ ద్వారాలను కల్పించాడు. ప్రాకారం ధృఢంగా ఉండటానికి రెండు వరుసలతో గోడలనుకట్టి, ఆ వరుసల మధ్య మట్టితో నింపి, పైన కప్పునూ, దానిపై అందంకోసం కలశాలను కోడిపుంజు తలపై ఉండే కిరీటాల రీతిలో నిర్మించాడు.

ఇతర దేవాలయాలు

రామప్పకు నైరుతి దిక్కులో 100 గజాల దూరంలో ఒక త్రికూటాలయం, వాయువ్యంలో చాళుక్య రీతిలో నిర్మించిన ఆలయం, చెరువుకట్టపై కుడివైపున కొండగట్టున మరో ఆలయం, చెరువుకట్ట ఎడమవైపున ఒక త్రికూటాలయం, మరో ఏక కూటాలయాలు శిథిలమైనప్పటికీ చూడదగ్గ కట్టడాలు.

శాసన మంటపం

గణపతిదేవుని అడుగుజాడల్లో నడిచిన రేచర్ల రుద్రుడు ఆలయాన్ని కట్టిన సందర్భంగా సంస్కృతంలో ఒక శాసనాన్ని వేయించి, దానిని నిలబెట్టి ఎండా వానల నుంచి రక్షణకు ఒక మంటపాన్ని కట్టించాడు. చక్కటి ఉపపీఠంపై నాలుగు స్తంభాలపై అందమైన కప్పుతో నిర్మించిన శాసన మంటపం కాకతీయ వాస్తు కట్టడాల్లో విలక్షణమైనదిగా గుర్తింపు పొందినది.

About Author

By editor

Twitter
Instagram