రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. నవరత్నాల పేరుతో ప్రజలకు ఏడాదికి సుమారు రూ.60 వేల నుంచి రూ.70 వేల కోట్లు పంచుతోంది. అయినా ప్రభుత్వం పట్ల ఆదరణ గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గిందని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే ఈ అసంతృప్తికి కారణం. పథకాల నిర్మాణం లోపభూయిష్టంగా, కొందరికే ఉపయోగపడేలా ఉందని ప్రజలు భావిస్తున్నారు. పథకాల అమలులో అన్ని కుటుంబాలకు సమానంగా లబ్ధి అందడం లేదు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.50 వేల వరకు పథకాల ద్వారా లబ్ధిచేకూరుతోంది. కొందరికి అందులో పదిశాతం కూడా రావడం లేదు. డ్వాక్రా సంఘాలకు మనిషికో విధంగా రుణమాఫీ, వయసులను బట్టి చేయూత పథకం, పీజీ విద్యార్థులకు రీయింబర్సు మెంటు తీసివేయడం, టిట్కో ఇళ్లు కేటాయించిన వారికి రద్దుచేయడం, మద్యం ధరలు పెంచి అమ్మడం, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోవడం, రేషన్‌ ‌కార్డుల తొలగింపు, పింఛన్‌ 3 ‌వేలకు పెంచకపోవడం వంటివి, కొందరికి అసలేం పథకాలు అమలు కాకపోవడం వంటివి ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరగడానికి కారణాలు.

డ్వాక్రా సంఘాల రుణమాఫీ పెద్ద ప్రహస నంగా కనిపిస్తోంది. రుణమాఫీ అందరికీ ఒకలా కాకుండా మనిషికో రకంగా ఉంది. ఒక నిర్ణీత తేదీని నిర్ణయించి ఎంత అప్పులుంటే అంత తీరుస్తానని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒక్కో డ్వాక్రా గ్రూపులో పది మంది మహిళలుంటారు. ఒక్కో గ్రూపుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బ్యాంకులు అప్పులిచ్చాయి. గ్రూపు రూ.5 లక్షల రుణం తీసుకుంటే ఒక్కో మహిళకు రూ.50 వేలు వస్తుంది. రూ.50 వేల నుంచి క్ష మధ్య రుణం తీసుకున్నవారే ఎక్కువగా ఉంటారు. తీసుకున్న రుణాన్ని సమానమొత్తంలో నెల వాయిదాలుగా చెల్లించాలి. ఎన్నికల సమయానికి కొన్ని సంఘాలు మొత్తం రుణం తీర్చేశాయి. కొన్ని సంఘాలు 90 శాతం రుణం తీర్చేశాయి. కొన్ని 80, కొన్ని 70 శాతం తీర్చేశాయి. కొన్ని సంఘాలు మాత్రం ఏడాది లేదా అరునెలలు, అయిదునెలల ముందే అప్పు తీసుకోవడంతో 10 నుంచి 20 లేదా 30 శాతం మాత్రమే వాయిదాలు తీర్చాయి. తక్కువ డబ్బు చెల్లించినవారికి ఎక్కువ డబ్బు మాఫీ అయింది. ఎక్కువ డబ్బు చెల్లించినవారికి తక్కువ డబ్బు మాఫీ అయింది.

ఉదాహరణకు ఒక డ్వాక్రా గ్రూపు సభ్యురాలు క్ష రూపాయల రుణం తీసుకుంటే ఆమెకు రూ.90 వేలు, పక్క ఇంటిలో ఉన్న మరో గ్రూపు సభ్యురాలికి రూ.10 వేల మాత్రమే రుణం మాఫీ అయింది. ఇదే ఇప్పుడు వ్యక్తుల మధ్య అంతరాలను సృష్టిస్తోంది. ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెంచుతోంది. తమకోలా, ఇంకొకరికోలా చూడటంపై అగ్రహం వ్యక్తమౌతోంది. ప్రభుత్వం అందరినీ సమానంగా చూడకుండా విచక్షణ లేకుండా ప్రవర్తించడాన్ని మహిళలు తప్పు పడుతున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో రుణమాఫీలు పొందిన మహిళల్లో సగం మంది ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు.

‘చేయూత’ అందదు!

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న చేయూత పథకం ద్వారా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఏడాదికి రూ.18,750 నగదును ఇస్తోంది. తర్వాత కాపు, ఇప్పుడు ఒసీ వర్గాల్లోని ఇతర కులాల వారికి కూడా ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నారు.

ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు 30 లక్షల మంది వరకు ఉన్నారు. లబ్ధి పొందుతున్నవారు ఆనందంగా ఉంటే, 45 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న మహిళలంతా అసంతృప్తితో ఉన్నారు. 45 ఏళ్లు పైబడ్డవారే ఓటర్లా, మేము కాదా? అని ప్రశ్నిస్తున్నారు. 25 నుంచి 45 ఏళ్ల వయసున్న మహిళలు 50 లక్షలకు పైగానే ఉన్నారు. వీరంతా అసంతృప్తితో ఉన్నారు.

వాహనమిత్ర పథకం

ప్రభుత్వం ఆటో, కారు, లారీ డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేస్తోంది. అయితే ఆటో, కారు, లారీ సొంతగా ఉంటేనే ఈ ఆర్థిక సహాయం లభిస్తుంది. ఆటోలు అద్దెకు తీసుకుని నడిపేవారు, కార్లు, లారీ డ్రైవర్లకు నగదు సహాయం అందడం లేదు. పనిచేసేవారికి కాకుండా వాహన యజమానికి డబ్బు ఇవ్వడం ఏ రకంగా సమంజసమో చెప్పాలని వీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. లబ్ధి పొందుతున్న వాహన యజమానులు 2.62 వేలు మందికి పైగా ఉండగా, లబ్ధిచేకూరని డ్రైవర్లు 10 లక్షలకు పైగా ఉన్నారు.

రీయింబర్స్‌మెంట్‌ ‌నిలిపివేత

పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫార్మసీ, ఎంటెక్‌, ‌లా, బీఈడీ వంటి పోస్టు గ్రాడ్యుయేషన్‌ ‌కోర్సులను రాష్ట్రంలో లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌సదుపాయం ఇచ్చేవారు. ఇప్పుడు దానిని ప్రభుత్వం తొలగించింది. పీజీ కోర్సుల ఫీజులు ఖరీదైనవి కావడంతో విద్యార్థులు డిగ్రీతోనే చదువు ఆపేస్తున్నారు. పీజీఈసెట్‌, ఐసెట్‌, ‌వర్శిటీసెట్‌లకు వచ్చే దరఖాస్తులు 70 శాతం తగ్గిపోయాయి. తాము విద్యకు దూరం కావడానికి ఈ ప్రభుత్వమే కారణమని విద్యార్థులంతా అసంతృప్తితో ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన ఇళ్లను లబ్ధిదారులకు గత ప్రభుత్వం కేటాయించింది. లబ్ధిదారులు రూ.25 వేలు, రూ.12,500 చొప్పున ప్రభుత్వానికి నగదు చెల్లిం చారు. కొందరు అప్పులుచేసి డబ్బుతెచ్చారు. 300 చదరపు అడుగుల లోపు ఉన్న ఇళ్లను రూపాయికే ఇస్తానని వైకాపా ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారం చేపట్టేనాటికి సుమారు 2.50 లక్షల ఇళ్లు పూర్తయినా నేటికి ఒక్క ఇంటిని ఇవ్వలేదు. ఇళ్ల కేటాయింపులో డబ్బు కట్టినవారికి తిరిగి చెల్లించలేదు.

ప్రభుత్వం తీరుపట్ల నిర్మాణరంగ కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలో నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు సుమారు 25 లక్షల మంది వరకు ఉన్నారు. ఎక్కువగా భవన నిర్మాణాల్లో పనిచేస్తారు. మిగతావారంతా అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఇసుకను అడ్డంపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నాటకం వీరికి ఉపాధి లేకుండా చేసింది. ప్రభుత్వం కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించింది. ఇసుకను మూడు రెట్లు అధికంగా బ్లాక్‌ ‌మార్కెట్‌లో అమ్ముతున్నారు. సిమెంటు ధరను రెట్టింపు చేశారు. ఈ ధరలు పెరగడానికి ప్రభుత్వమే కారణ మని నిర్మాణరంగం భావిస్తోంది. నిర్మాణరంగం కుదేలైపోయి కార్మికులంతా తీవ్రంగా చితికిపోయారు. నెలలో సగం రోజులు కూడా పనిదొరకడం లేదు.

పింఛన్ల పెంపు లేదు!

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్లకు రూ.3000 చెల్లించడం లేదు. రాష్ట్రంలో 62 లక్షల మందికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు ఇస్తున్నారు. నెలకు రూ.3000 ఇస్తామని వైకాపా ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కాని అంతమొత్తం ఇవ్వలేమని, ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతామని చెప్పారు. ఒక ఏడాది మాత్రం రూ.250 పెంచి రూ.2,2,50 ఇస్తున్నారు. రెండున్నరేళ్లు గడచినా పెంచలేదు. పైగా ఒక కుటుంబానికి ఒక పింఛను మాత్రమే ఇస్తూ రెండో పింఛన్‌ ‌పొందుతున్నవారికి నిలిపివేశారు. ఈ పరిణామాలు లబ్ధిదారుల్లో అసంతృప్తి నెలకొనేలా చేశాయి.

ప్రభుత్వ ఉద్యోగులు, ఏ పథకం ద్వారా లబ్ధి పొందని వారు సైతం ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. జీతాలు సరిగా రాకపోవడం, డీఏలు పెంచకపోవడం, పట్ల ప్రభుత్వ ఉద్యోగులు సర్కారు పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖకు అసెస్‌మెంట్లు సమర్పించిన ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులను అనర్హులుగా పేర్కొని వారికి ఇప్పటి వరకు ఉన్న రేషన్‌కార్డులను ప్రభుత్వం తొలగించింది. ఫీజురీయింబర్సు పొందుతుంటే దానిని నిలిపివేసింది. ఇదిలా ఉంటే కొందరు వ్యాపారులు దూరప్రాంతంలో ఉన్న తల్లిదండ్రుల పేర్లను యజమానులుగా చూపించి ఆదాయపు పన్ను శాఖ నుంచి తప్పించుకుని తాము మాత్రం రేషన్‌కార్డు పొంది యథేచ్ఛగా అన్ని పథకాల లబ్ధి పొందు తున్నారు. ఇదంతా కళ్లముందు కనిపిస్తుంటే పథకాలు రానివారు, తొలగింపునకు గురైనవారు ప్రభుత్వం పట్ల మండిపడుతూ, తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ-కేవైసీ ఇప్పుడే ఎందుకు?

ఈ-కేవైసీ నమోదు సమస్య ఇప్పుడు ప్రజలను ఇబ్బందిపెడుతోంది. రేషన్‌కార్డుల్లో పేర్లు ఉండి ఈ-కేవైసీ నమోదు చేసుకోని వారు, ఈ నెలా ఖరులోగా, కార్డులో నమోదైన అయిదేళ్లలోపు పిల్లలు సెప్టెంబరులోపు అప్‌డేట్‌ ‌చేసుకోవాలని లేకుంటే బియ్యం ఇవ్వరని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దాంతో లబ్ధిదారులు ఈ-కేవైసీ నమోదు కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 4,31, 84,543 మంది పేదలు బియ్యం పొందుతున్నారు. వీరిలో 98 లక్షల మందికి పైగా నమోదు చేయించుకోవాలి. గతంలో ఉన్న మీ సేవా కేంద్రాలు తొలగించడంతో కొన్నిటినే నడుపుతున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 50 నుంచి 60 మందికి మాత్రమే అప్‌డేట్‌ ‌చేస్తున్నారు. ఈ కేంద్రాల వద్ద జనం బారులు తీరడంతో తోపులాటలు కనిపిస్తున్నాయి. కరోనా థర్డ్‌వేవ్‌ ‌రావడానికి ఇంతకంటే అవకాశం ఏముంటుంది? కనీసం కేంద్రాలను పెంచడంలేదు. ఇప్పటితీరున నమోదుచేస్తుంటే కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుంది. ఈ-కేవైసీని ఇప్పుడే ఎందుకు అమలుచేయాలి. కనీసం డిసెంబరు వరకన్నా ఆపితే వ్యాక్సినేషన్‌ ఎక్కువ మందికి జరిగి కొవిడ్‌ ‌నుంచి రక్షణ లభిస్తుంది.

రహస్యంగా జీవోలు!

ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకుండా కేవలం ఆఫ్‌లైన్‌లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. ఇటీవల విషయం లేకుండా బ్లాంకు జీవోలు వెబ్‌సైట్‌లో పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఏవీ ఉంచరాదని నిర్ణయించు కుంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదనే ధోరణి సర్కారులో కనిపిస్తుంది. జీవోలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచితే సమస్యలు వస్తున్నాయని భావించడమే దీనికి కారణం. జీవోలు కూడా చట్టాల వంటివే. చట్టాలను ఎంత పారదర్శ కంగా వెల్లడిస్తారో జీవోలను అంతే పారదర్శకంగా వెల్లడించాలి. పబ్లిక్‌ ‌రికార్డుంటే ఎమిటన్నది ఇండియన్‌ ఎవిడెన్స్ ‌యాక్ట్ ‌సెక్షన్‌ 74, 76‌లో స్పష్టంగా ఉంది. ఆ సెక్షన్ల ప్రకారం జీవోలు కూడా పబ్లిక్‌ ‌రికార్డుల పరిధిలోకి వస్తాయి. అందువల్ల జీవోలను బయటపెట్టకపోవడం చట్టవిరుద్దమే అని నిపుణులు అంటున్నారు. జీవోల్లో దురుద్దేశం లేకుంటే పారదర్శకంగా ఉంటాయి. వాటిని బయటపెట్టడం లేదంటే ఏదో దాగి ఉన్నట్లుగా భావించాలి.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram