కరోనా మహమ్మారి రూపు మార్చుకొని మరీ ప్రజలను భయపెడుతోంది. కొత్త వేరియంట్లకు తోడు ఫస్ట్, ‌సెకండ్‌ ‌వేవ్‌లు పూర్తి చేసుకొని థర్డ్ ‌వేవ్‌కు చేరువలో ఉన్నామనే వార్తలు కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నారులపై మూడోదశ కరోనా ప్రభావం ఎంత అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా, ముప్పును తక్కువగా అంచనా వేయడం ఏమాత్రం తగదు. ప్రజల అజాగ్త్ర థర్డ్ ‌వేవ్‌ను మరింత చేరువ చేస్తోంది. వ్యాక్సినేషన్‌ ‌సక్రమంగా జరిగితే ఎన్ని వేవ్‌లు వచ్చినా తట్టుకోగలమని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు సెకండ్‌ ‌వేవ్‌ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని థర్డ్‌వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇందులో ప్రజల సంసిద్ధతే కీలకం అని చెప్పక తప్పదు.

కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పీడిస్తోంది. తీవ్రతలో గణాంకాల్లో భారత్‌ ‌ప్రపంచంలోనే రెండో స్థానంలో కనిపిస్తున్నా, జనాభా రీత్యా మనం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయనే చెప్పవచ్చు. ప్రతి మిలియన్‌ (10 ‌లక్షలు) జనాభాలో కరోనా కేసులు మన దేశంలో 23,253 మంది ఉంటే.. అమెరికాలో 1,15,677; మరణాలు మనదేశంలో 312 కాగా, అమెరికాలో 1,936.. అలాగే బ్రెజిల్‌, ‌రష్యా, ఫ్రాన్స్, ‌బ్రిటన్‌లతో పాటు అనేక దేశాల్లో భయానక పరిస్థితులను గమనించవచ్చు. కరోనా మొదటి దశను భారత్‌ ‌సమర్ధవంతంగా ఎదుర్కొన్నా రెండో దశ వచ్చేసరికి తప్పటడుగులు పడ్డాయి. ఇందుకు కారణాలు అనేకం. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించడంలో నిర్లక్ష్యంతో పాటు ఆంక్షలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల అజాగ్రత్తల కారణంగా మూల్యం చెల్లించక తప్పలేదు.

ప్రస్తుతం మనదేశంలో కరోనా వైరస్‌ ‌రెండో దశ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా రోజువారీ కేసులు మాత్రం 20 నుంచి 30 వేల మధ్య నమోదు అవుతోండటంతో మూడో దశ ముప్పు మొదల యిందనే ఆందోళన కనిపిస్తోంది. దేశంలో కరోనా థర్డ్ ‌వేవ్‌ ఆగస్ట్‌లోనే మొదలైందని, అక్టోబర్‌ ‌నాటికి గరిష్టస్థాయికి చేరుకోవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ బృందం తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్లు ఇటీవల ఓ వార్తా సంస్థ కథనం పేర్కొంది. అయితే రెండో దశ విజృంభణతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగానే ఉంటుందని అంచనా. అయితే అజాగ్రత్తగా ఉంటే మూడో దశ కరోనా వ్యాప్తి చాలా భయంకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌నుంచి కోలుకున్నామన్న ధైర్యంతో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. మాస్క్‌లు ధరించడం లేదు. ఇలానే ఉంటే మూడోదశ వ్యాప్తి ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలోని కేరళ, మహారాష్ట్ర, ఈశాన్యం సహా పది రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్టు ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. కేరళలో ప్రస్తుతం రోజూ 10 వేలకుపైగా పాజిటివ్‌ ‌కేసులు నమోదవు తున్నాయి. దీంతో కేరళ తదుపరి హాట్‌స్పాట్‌గా మారొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ స్వల్పకాలం పాటు కేసులు పెరుగు తున్నాయని నిపుణులు తెలిపారు. కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఇన్‌ఫెక్షన్లు పెరిగితే.. దేశవ్యాప్త కేసుల సంఖ్య మరోసారి పెరుగుతుందని హెచ్చరించారు.

కేరళలో తీవ్రం

కరోనాను ఎదుర్కోవడంలో కేరళ దేశానికి రోల్‌మాడల్‌గా నిలిచిందని కొందరు మేధావులు గొప్పగా ప్రచారం చేశారు. కానీ అవన్నీ గాలిమాట లేనని తేలిపోయింది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కొవిడ్‌ ‌కేసులు నమోదవుతుంటే కేరళలో మాత్రం నిత్యం 10వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల్లో సగం వరకూ ఒక్క కేరళలోనే ఉంటున్నాయి. దీంతో కేరళలో కొవిడ్‌ ‌పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని వైద్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొద్ది వారాల క్రితం కరోనా తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గినప్పటికీ కేరళలో ఇంకా 10 శాతానికిపైగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా ఐసీఎంఆర్‌ ‌జాతీయ స్థాయిలో నిర్వహించిన సీరో సర్వేలో దేశవ్యాప్తంగా సరాసరిగా 67.6శాతం మందిలో యాంటీబాడీలు ఉంటే, కేరళలో మాత్రం 42.7శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో 48శాతం కేరళ ప్రజలకు వైరస్‌ ‌ముప్పు ఇంకా పొంచిఉందని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేరళలో కరోనా వ్యాప్తి పెరగడానికి కారణం విదేశాల నుంచి నేరుగా రాకపోకలు పెరగడం, నిర్ధారణ పరీక్షలు పెంచడం, రాష్ట్రంలో మధుమేహ సమస్యలు అధికంగా ఉండటమేనని అక్కడి అధికారులు చెబుతున్నా, వాస్తవాలు మరో విధంగా ఉన్నాయి. ఆంక్షలను అమలు చేయడంలో కేరళ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కరోనా ముప్పు అధికంగా ఉన్నప్పటికీ బక్రీద్‌ ‌సమయంలో మూడురోజుల పాటు లాక్‌డౌన్‌ను సడలించడం సంతుష్టీకరణ రాజకీయాలకు పరాకాష్టగా నిలిచింది.

భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్‌కు ప్రధానంగా డెల్టా వేరియంట్‌ ‌కారణమవు తోంది. ప్రస్తుతం డెల్టా ప్లస్‌ ‌ముప్పు కూడా పొంచి ఉంది. థర్డ్ ‌వేవ్‌ ‌గరిష్ట దశలో రోజువారీ కేసుల సంఖ్య లక్షలోపు ఉంటుందని.. పరిస్థితులు మరింత దిగజారితే 1.5 లక్షలకూ చేరొచ్చని ఒక అధ్యనం చెబుతోంది. మ్యాథమెటికల్‌ ‌మోడల్‌ ఆధారంగా పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. హైదరాబాద్‌, ‌కాన్పూర్‌ ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు విద్యాసాగర్‌, ‌మణింద్ర అగర్వాల్‌ ‌నేతృత్వంలో ఈ అధ్యనం చేపట్టారు.

రెండు వారాల క్రితం బెంగళూరులో 5 రోజుల వ్యవధిలో 242 మంది చిన్నారులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. వీరిలో తొమ్మిదేళ్ల లోపు వయసున్న వారు 106 మంది ఉన్నారు. అలాగే 9-19 ఏళ్ల వయసున్న పిల్లలు 136 మంది ఉన్నట్లు వెల్లడించింది. కొవిడ్‌ ‌థర్డ్ ‌వేవ్‌.. ‌చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ పరిణామం ఇప్పుడు కలవరపెడు తోంది. మన దేశంలో చిన్నారులకు వ్యాక్సిన్‌ ఇం‌కా అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యహరించాలి. లక్షణాలు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. పెద్దవారిలో కనిపించినట్లుగానే వీరిలో సైతం జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు లాంటి లక్షణాలుంటాయని చెబుతున్నారు. చిన్నారులకు పోషకాహారం అందిస్తూ రోగనిరోధక శక్తి పెంచడానికి యత్నించాలి. మాస్కులు ధరించేలా చూసుకోవాలి. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం నేర్పించాలి. విటమిన్‌ ‌బి కాంప్లెక్స్, ‌విటమిన్‌ ‌సి, విటమిన్‌ ‌డి, కాల్షియం, జింక్‌ ‌లభించే ఆహారం ఇవ్వడం ద్వారా వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంటి వద్ద ఉన్నప్పటికీ చిన్నారులకు శారీరక శ్రమ చేయడం నేర్పించాలి. వ్యాయామం, యోగాసనాలు వేయడం వారిలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

కేంద్రం సిద్ధం!

కరోనా రెండో దశ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మూడో దశ ముప్పును ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. కరోనా చికిత్సలో కీలకమైన, ప్రాణాల్ని రక్షించే అత్యవసర మందులు, ముఖ్య వైద్య పరికరాలకు సంబంధించి చర్యలు చేపట్టింది. ఫార్మా, వైద్య పరికరాల సంస్థతో చర్చలు జరుపుతోంది. ఔషధాల విభాగం కింద వైద్య పరికరాల్ని ట్రాక్‌ ‌చేసేందుకు కేంద్రం నేషనల్‌ ‌టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్‌ ‌సిలిండర్లు కూడా భారీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, రానున్న విపత్తుకు సంసిద్ధంగా ఉన్నామని కేంద్రం పేర్కొంది. ఇందుకోసం రూ.23 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపింది.

వ్యాక్సినేషన్‌ ‌వేగవంతం

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ‌గతంతో పోలిస్తే ఈ మధ్య కాస్త వేగం పుంజకుంది. దేశవ్యాప్తంగా ఆగస్ట్ 22 ‌నాటికి 58,16,23,843 డోసుల వ్యాక్సిన్ల పంపిణీ జరిగింది. ఇప్పటి వరకూ రెండు డోసుల వ్యాక్సిన్‌ ‌తీసుకున్నవారు 12,98,10,316 మంది. మొదటి డోస్‌ ‌తీసుకున్నవారు 45,18,13,527.. వ్యాక్సినేషన్‌ ‌విషయంలో మన దేశం అగ్రదేశాలతో పోటీ పడుతోంది. అమెరికా సహా యూరోప్‌ ‌దేశాల జనాభాతో పోలిస్తే మన జనాభా ఎక్కువగా ఉన్నందున అందరికీ ఒకేసారి వ్యాక్సిన్‌ ఇవ్వలేక పోవచ్చు.. కానీ ప్రాధాన్యతా క్రమంలో దశల వారీగా పంపిణీ జరుగుతోంది. మొదట కరోనా యోధులు, వృద్ధులకు టీకాలు ఇచ్చారు. తర్వాత దశలో 45 ఏళ్లు నిండిన వారికి, 18 ఏళ్లు పూర్తయిన వారికి ఇస్తున్నారు. ఈ ఏడాది తొలి భాగంలో టీకాలు ఇవ్వడం ప్రారంభమైనా చాలా మంది తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. సెకండ్‌ ‌వేవ్‌ ‌తీవ్రత పెరగడంతో ఒక్కసారిగా జనం వ్యాక్సిన్‌ ‌కోసం పోటీ పడటంతో కొరత ఏర్పడింది.

మన దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్‌, ‌కొవిషీల్డ్, ‌స్పుత్నిక్‌ ‌వి టీకాల పంపిణీ జరుగుతుండగా.. అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్‌ అం‌డ్‌ ‌జాన్సన్‌ ‌టీకాల వినియోగానికి కూడా కేంద్రం ఇటీవల గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా ఈ జాబితాలో జైకోవ్‌-‌డి చేరింది. దీంతో దేశంలో అనుమతులు లభించిన వ్యాక్సిన్ల సంఖ్య ఆరుకు చేరింది. ముక్కు ద్వారా వేసే కరోనా టీకాలు రానున్నాయి. భారత్‌ ‌బయోటెక్‌ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసే కరోనా టీకా.. రెండు, మూడో దశ క్లినికల్‌ ‌పరీక్షలకు కేంద్రం అనుమతించింది. ఇప్పటికే దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో మొదటి దశ క్లినికల్‌ ‌పరీక్షలను భారత్‌ ‌బయోటెక్‌ ‌పూర్తి చేసింది.

టీకాలపై అపోహలు వద్దు!

దేశంలో వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్‌కు కొన్ని వర్గాలు అవరోధాలు సృష్టిస్తున్నాయి. వ్యాక్సిన్ల పంపిణీ ప్రారంభమైనప్పటి నుండి, కొంతమంది చేసిన వ్యాఖ్యలు సామాన్య ప్రజల మనస్సులలో సందేహాలను సృష్టించాయి. దేశీయ వ్యాక్సిన్‌ ‌తయారీదారులను నిరాశపరిచేందుకు, అనేక అడ్డంకులను సృష్టించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. వ్యాక్సిన్‌ ‌తీసుకున్నా కరోనా వస్తుందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది పాక్షిక సత్యం మాత్రమే. కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌దేహంలో రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా కరోనా ముప్పును అడ్డుకుంటుంది. కొంత మంది శరీరతత్వం ఇందుకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ కారణంగా కరోనా వచ్చిన వారి ద్వారా ఏర్పడే ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి పుకార్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది వారాల క్రితం దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌ ‌గురించి అవగాహన పెంచడంలో సహక రించాలని సమాజంలోని మేధావులను, యువతకు సూచించారు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram