హుజురాబాద్‌ ‌నియోజకవర్గంలో ఉపఎన్నిక మొదలవకముందే అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నైతికంగా ఓడిపోయిందని విశ్లేషించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇటీవలి కాలంలో కొద్దిరోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న హామీలు, హుజురాబాద్‌కు సంబంధించి జరుగుతున్న పరిణామాలన్నీ టీఆర్‌ఎస్‌ ఓటమి భయంతోనే చేస్తోందని చెప్పవచ్చు. ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇస్తోంది. నియోజకవర్గం పరిధిలో ఎక్కడ ఏది కావాలంటే దానికి సరే అంటోంది. వాటిని అమలు చేస్తోంది కూడా. అంతేకాదు, అడగని వాళ్లను పిలిచి మరీ అందలం ఎక్కిస్తోంది. ఆశపడుతున్న వాళ్లను సంతృప్తిపరుస్తోంది. మొత్తానికి కలలో కూడా ఊహించని నిర్ణయాలు తీసుకుంటోంది. ఈటల రాజేందర్‌ ‌రాజీనామా తర్వాత రాష్ట్ర రాజకీయ చరిత్ర ఓ సరికొత్త మలుపు తిరిగిందన్న చర్చ మొదలయింది. రాజకీయ ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయన్న వాదనలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రసమితి పూర్తిగా ఉద్యమ స్వభావం కోల్పోయి పచ్చి అవకాశవాద రాజకీయాలకు దిగజారిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కేవలం హుజురాబాద్‌ ఉపఎన్నికల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న హామీలు, అనూహ్య నియామకాలను ఓసారి పరిశీలిద్దాం!

దళితబంధు-ఓట్ల‘బంధు’

హుజురాబాద్‌ ఎన్నికల్లో గెలిచేందుకు స్వయంగా కేసీఆర్‌ ‌ప్రకటించిన పథకం దళితబంధు. ఎలక్షన్లలో ఓట్ల కోసమే తాము అమలు చేస్తున్నామని స్వయంగా సీఎం నోరుజారిన పథకం ఇది. దళిత కుటుంబానికి ఇంటికి పది లక్షల రూపాయల చొప్పున భారీ ఆర్థిక సాయం అందించే పథకం. అయితే ఆ పది లక్షలు టీఆర్‌ఎస్‌కు సంబంధించిన వాళ్లకే ఇస్తారని, అసలైన అర్హులకు అందవన్న చర్చ సాగుతోంది.  ఒక్క హుజురాబాద్‌ ‌నియోజకవర్గంలోనే ఉన్న దళితులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలంటే 2వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే.. దళితబంధు పథకం అమలుకు ఒక లక్షా 30వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని స్వయంగా కేసీఆర్‌ ‌ప్రకటించారు. కానీ వాస్తవానికి మరిన్ని ఎక్కువ నిధులే కావాల్సి వస్తుందంటున్నారు. అయితే, ఇవన్నీ ఇన్నాళ్లూ ఎస్సీల కోసం ఖర్చు చేయాల్సిన నిధులేనని, కేసీఆర్‌ ‌కొత్తగా ఇచ్చేదేమీ లేదన్న వాదన కూడా ఉంది.

57 ఏళ్లకే ఆసరా పెన్షన్‌

ఆసరా పెన్షన్‌ 57 ‌యేళ్లనుంచే వర్తింపజేస్తామని గతంలోనే చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు హుటాహుటిన ఆదేశాలు కూడా జారీచేశారు. తొలుత హుజురా బాద్‌లో ప్రతి దరఖాస్తుదారుడికి ఈ పథకాన్ని అమలుచేసే దిశగా కసరత్తులు చేస్తోంది ప్రభుత్వం. ఈ దిశగా కేవలం హుజురాబాద్‌లోని మీసేవా కేంద్రాలకే ఈ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయ్యేలా.. దరఖాస్తుదారుల వివరాలన్నీ నమోదు చేసేలా వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో ఇంకెక్కడా ఈ సదుపాయం అమలు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

కొత్త రేషన్‌కార్డులు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్త రేషన్‌కార్డులకు అడ్రస్‌ ‌లేకుండాపోయింది. ఒకే ఒక్కసారి మాత్రం ఏదో తూతూ మంత్రంగా రేషన్‌ ‌కార్డుల జారీ పక్రియను చేపట్టిన ప్రభుత్వం ఆ తర్వాత వాటిని అటకెక్కించింది. ఇప్పటికే ఉన్న రేషన్‌కార్డులలో కుటుంబసభ్యుల పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించలేదు. కానీ, హుజురాబాద్‌ ఉప ఎన్నికల పుణ్యమాని రాష్ట్రంలో రేషన్‌కార్డుల జారీ పక్రియకు మోక్షం లభించింది. ఆగమేఘాల మీద ఈ పక్రియను పూర్తిచేసింది తెలంగాణ ప్రభుత్వం.

కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ

కాంగ్రెస్‌పార్టీ మాజీనేత, ఏమాత్రం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలేని కౌశిక్‌రెడ్డి గవర్నర్‌ ‌కోటాలో ఎమ్మెల్సీ పదవిని చేజిక్కించుకున్నారు. అది టీఆర్‌ఎస్‌ ‌నేతలో, ఉద్యమకారులో, ప్రజలో కాదు.. ఆఖరికి కౌశిక్‌రెడ్డి కూడా ఊహించని పరిణామం. ఈ పరిణామం టీఆర్‌ఎస్‌కే కాదు.. ఉద్యమానికే ఓటమి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరవై ఏళ్లుగా పార్టీ కోసం, ఉద్యమం కోసం పనిచేస్తున్న వాళ్లు చూస్తుండగానే గద్ద తన్నుకు పోయినట్టు ఎమ్మెల్సీ తన్నుకు పోయాడు కౌశిక్‌రెడ్డి. నిజానికి తెలంగాణ రాష్ట్రం కల సాకారం కావడానికి అన్నీ త్యజించి పోరాడిన మేధావులు, నాయకులు, తత్వవేత్తలు, ఉద్యమకారులు వందల సంఖ్యలో ఉన్నారు. వారిలో ఇలాంటి పదవులు తప్పనిసరిగా పొందాల్సిన వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు. కానీ, తొలి నుంచీ అలాంటి మేధావులను, విషయ పరిజ్ఞానం కలిగిన వాళ్లను దూరంగా ఉంచుతున్న కేసీఆర్‌.. ‌వాళ్ల ముందే కౌశిక్‌రెడ్డికి కండువా కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించి రెండు రోజుల్లోనే ఎమ్మెల్సీ కిరీటం పెట్టారు. దీన్నిబట్టి టీఆర్‌ఎస్‌ అన్ని విలువలు కోల్పోయి గెలుపు కోసం ఎంతగా దిగ జారుతుందో స్పష్టం అవుతోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌ ‌పదవి

ఈటల అనుచరుడు బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పోరేషన్‌ ‌పదవి ఇవ్వడం, కనీసం ఆ దిశగా ఆలోచించడం అనేది హుజురాబాద్‌ ఉపఎన్నిక చలవే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌. ‌రమణను హుటాహుటిగా పార్టీలోకి ఆహ్వానించడం, కండువా కప్పడం కూడా హుజురా బాద్‌ అకౌంటే అంటున్నారు. రమణకు మంత్రి పదవి గానీ, ఎమ్మెల్సీ పదవి గానీ ఖాయమైందన్న ప్రచారం కూడా ఇందులో భాగమే అన్నది జగమెరిగిన సత్యం. వకుళాభరణం కృష్ణమోహన్‌రావును బీసీ కమిషన్‌ ‌చైర్మన్‌గా నియమించడం కూడా హుజురాబాద్‌ ఎన్నికల స్టంటే అని చెప్పాలి. అంతేకాదు, ఏడేళ్ల తరువాతైనా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి కేసీఆర్‌ ‌పూలమాల వేయడం హుజురాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలోనే అన్న చర్చ నడుస్తోంది.

అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాల పెంపు

ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ ‌చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను పెంచుతూ ఆగస్టు 18వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్‌సీ పెంచిన క్రమంలో వీరికి కూడా వేతన పెంపును వర్తింపజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇన్నేళ్లుగా డిమాండ్‌ ‌వినిపిస్తున్నా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆందోళనకు దిగినా పోలీసుల సాయంతో ఉద్యమాన్ని అణచివేసిన ప్రభుత్వం ఇప్పుడు హుటాహుటిన జీతాలు పెంచడానికి హుజురా బాద్‌ ఉపఎన్నికే కారణం.

గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు

రాష్ట్రంలో రెండు లక్షల మంది కల్లుగీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల ప్రభుత్వం తెలిపింది. మొదటి దశలో 15 వేల మంది లబ్ధిదారులకు మోపెడ్లను అందిస్తామని తెలిపారు. గౌడన్నలకు ఈ పథకం అమలు కోసం రూ.1,200 కోట్లు కేటాయించా మని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌చెప్పారు. రాష్ట్ర కేబినెట్‌ అనుమతి రాగానే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. ఇలాంటి డిమాండ్‌ ‌లేకున్నా.. విజ్ఞప్తులు రాకున్నా స్వయంగా ప్రభుత్వమే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం కూడా హుజురాబాద్‌ ఉపఎన్నిక ఎఫెక్టే అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఉపఎన్నిక పూర్తయితే ఈ పథకానికి దిక్కూ దివాణం ఉండదని ఉద్యమకారులు అభిప్రాయపడుతున్నారు.

అడగకపోయినా నిధుల విడుదల

ఇన్నాళ్లూ కనీసం రాష్ట్ర మంత్రులకు కూడా ప్రగతిభవన్‌లో ప్రవేశానికి అనుమతివ్వని కేసీఆర్‌.. ‌తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానించి ఏకంగా 11 గంటల పాటు భేటీ అయ్యారు. ఈ పరిణామం గురించి తెలంగాణలో ఆసక్తిగా చర్చ జరుగుతోంది.

హుజూరాబాద్‌ ‌పట్టణాభివృద్ధికి రూ.35 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అడక్కముందే, డిమాండ్లు రాకముందే ఈ స్థాయిలో నిధులు కేటాయించడంపైనా చర్చ జరుగుతోంది. హుజురాబాద్‌ అభివృద్దిని తామే చేశామని చెప్పుకునే విధంగా ప్రణాళిక రచించింది.

మాటతప్పను అనేది.. కేసీఆర్‌ ఊతపదం. కానీ, ఆయన ఎన్ని మాటలు తప్పారో, ఎన్ని హామీలు బూడిదలో పోశారో తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాననే ప్రాథమిక హామీకే దిక్కులేకుండా పోయింది. ఇక దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి హామి కాలగర్భంలో కలిసిపోయింది. అలాగే దళితబంధు పథకానికి కూడా అదే గతి పడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

– సుజాత గోపగోని,  63021 64068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram