నరేంద్ర మోదీ 2014 మే నెలాఖరులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన దక్షత, సమర్థతపై కొన్నివర్గాల నుంచి సందేహాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఆయనకు గల అవగాహన, అనుభవం గురించి చర్చకు వచ్చాయి. అప్పటివరకు మోదీ జాతీయ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండేవారు. అంతర్జాతీయ వ్యవహారాలపైనా అదే పరిస్థితి. ముఖ్యమంత్రిగా విదేశాలను సందర్శించిన సందర్భాలు తక్కువే. గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా అధికారిక పనుల నిమిత్తం తప్ప చాలామంది ముఖ్యమంత్రుల్లాగా తరచూ ఢిల్లీని సందర్శించేవారు కారు. ఢిల్లీతో లాబీయింగ్‌, ‌పైరవీలు ఆయనకు తెలియని విద్య. నిబంధనల మేరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు, పథకాలు రాష్ట్రానికి వస్తాయన్నది ఆయన భావన. ఈ విధానం సత్ఫలితాన్నే ఇచ్చినట్లు అనంతర పరిణామాలు రుజువు చేశాయి.

మోదీ ప్రధాని అయ్యేనాటికి ఆయనకు విదేశీ వ్యవహారాలపై అంతగా ఆసక్తి, అవగాహన, పట్టు లేదన్న అభిప్రాయాల నేపథ్యంలో శక్తిమంతమైన భారత ప్రధానిగా విదేశీ వ్యవహారాలను ఆయన ఎలా సమర్థించుకుంటూ వస్తారో అన్న ఆసక్తి మొదలైంది. కానీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటివరకు మోదీ ఎలాంటి తొట్రుపాటు లేకుండా విదేశాంగ విధానాన్ని సమర్థంగా ముందుకు తీసుకువెళుతూ భారత కీర్తి ప్రతిష్టలను పెంచారు. నెహ్రూ, వాజపేయి, పీవీ వంటి దిగ్గజాలకు దీటుగా వ్యవహరిస్తూ అంతర్జాతీయ యవనికపై దేశానికి ప్రత్యేక స్థానం కల్పించారు.

తాజాగా ఈ నెల 9న ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో జరిగిన బహిరంగ చర్చకు అధ్యక్షత వహించే అరుదైన అవకాశాన్ని ప్రధాని మోదీ పొందారు. గతంలో ఈ అవకాశం ఏ భారత ప్రధానికి లభించకపోవడం గమనించదగ్గ విషయం. వర్చువల్‌ ‌విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సముద్ర భద్రతపై చేసిన ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది. అంతర్జాతీయ అంశాలపై ఆయనకు గల అవగాహన, పట్టుకు ఆ ప్రసంగం దర్పణం పట్టింది. కార్యక్రమానికి హాజరైన వివిధ దేశాల అధినేతలు, మంత్రులు ప్రధాని ప్రసంగానికి జేజేలు పలికారు. సముద్ర యానంలో సమస్యలు, వివాదాలపై మోదీకి గల అవగాహన, ఆయన సూచించిన పరిష్కార మార్గాలను ప్రశంసించారు. గతంలో భారత ప్రధానులు ఐక్యరాజ్య సమితిలో, భద్రతా మండలిలో ప్రసంగించిన సందర్భాలు లేకపోలేదు. కానీ మోదీ లాగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సందర్భాలు లేవని దౌత్యరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. 1992 జనవరి 31న నాటి ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు భద్రతా మండలిలో దీటైన ప్రసంగం చేశారు. బహుభాషా కోవిదుడైన పీవీకి సహజంగానే విదేశీ వ్యవహారాలపై విశేష అవగాహన, మంచి పట్టుండేది. సునిశితంగా సమస్యలను ప్రస్తావిస్తూ, లోతైన విశ్లేషణలతో చేసే ప్రసంగం సహజంగానే ఆహుతులను ఆకట్టు కుంటుంది. పీవీ ప్రజ్ఞా పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1978 సెప్టెంబర్‌ 29‌న నాటి జనతా పార్టీ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి అటల్‌ ‌బిహారీ వాజపేయి నమీబియా స్వాతంత్య్రంపై చేసిన ప్రసంగం నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో సాగిందని నాటి తరం నేతలు గుర్తు చేశారు. వాజపేయికి అంతర్జాతీయ అంశాలపై తిరుగులేని ఆసక్తి, అవగాహన ఉండేది. సాధికారికంగా మాట్లాడే వారు. వాస్తవాల ప్రాతిపదికన దీటుగా మాట్లాడటం, సూటిగా విమర్శలు చేయడం, నీళ్లు నమలకుండా మాట్లాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అదే సమయంలో మధ్యమధ్యలో చతురోక్తులు విసిరి సమావేశాన్ని రక్తి కట్టించడం, గంభీర వాతావరణాన్ని తేలిక పరచడం, హాస్యాన్ని పంచడం వాజపేయికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. ప్రత్యర్థులు కూడా ఆయన ప్రసంగాన్ని అభినందించకుండా ఉండలేకపోయేవారన్నది వాస్తవం. ఐక్యరాజ్య సమితిలో స్వచ్ఛమైన హిందీలో ప్రసంగించిన తొలి భారత నేతగా చరిత్ర సృష్టించారు. తన మాతృభాషలో ప్రసంగించడం ద్వారా భారతీయులను ఆకట్టు కున్నారు. మాతృభాషపై తనకు గల మమకారాన్ని చాటుకున్నారు. వారికి దీటుగా మొన్నటి భద్రతా మండలి సమావేశంలో ‘సముద్ర భద్రత పెంపు- అంతర్జాతీయ సహకార ఆవశ్యకత’ అనే అంశంపై నరేంద్ర మోదీ ప్రసంగించి భారత వాణిని బలంగా వినిపించారు. కీలక అంశాలపై భారత విధానాన్ని, వైఖరిని విస్పష్టంగా, సాధికారికంగా, సోదాహరణంగా వివరించారు. విశ్వ మానవాళి శ్రేయస్సుకు, పారదర్శకతకు భారత్‌ ‌కట్టుబడి ఉందని, అంతేతప్ప సంకుచిత రాజకీయాల కోసం స్వార్థ పూరితంగా వ్యవహరించజాలదని వ్యాఖ్యానించారు. భారత విధానం నాటికి, నేటికీ ఇదేనని, ఈ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చిచెప్పారు. వసుధైక కుటుంబకం అన్న భావనతోనే అన్ని దేశాలనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రష్యా అధినేత వ్లాదిమిర్‌ ‌పుతిన్‌, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, ‌డెమొక్రటిక్‌ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌కాంగో అధినేత ఫెలిక్స్ ఆం‌టోయిన్‌ ‌హిసెకెడ్‌ ‌సిలంబో, నైజర్‌ ఉపప్రధాని హసౌమీ మసాదా, కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యెట్టా, వియత్నాం ప్రధాని ఫామ్‌ ‌మిన్‌చింగ్‌, ఐక్యరాజ్య సమితిలోని చైనా ఉపశాశ్వత రాయబారి డైబింగ్‌ ‌తదితరులు హాజరయ్యారు. మోదీ ఉపన్యాసం భారత విధానం, వైఖరి అంతర్జాతీయ సమాజానికి మేలుచేసే విధంగా ఉందని పేర్కొన్నారు. ఒక్క చైనా మాత్రమే మౌనంగా ఉండిపోయింది.

 దాదాపు 1200 ద్వీపాలు, సుమారు 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం భారత్‌ ‌కలిగి ఉంది. పశ్చిమ, తూర్పు, దక్షిణ భారతం తీర సరిహద్దులను కలిగి ఉంది. అందువల్ల తీరప్రాంత భద్రత, సముద్ర రవాణా, సముద్ర దొంగల బెడద, సాఫీగా అంతర్జా తీయ రవాణా.. తదితర అంశాలపై భారత్‌కు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ విషయాలు ప్రధాని మోదీ ప్రసంగంలో ప్రతిబింబించాయి. కొన్ని దేశాలు సముద్రాలు, మహాసముద్రాలతో సాంకేతికంగా తీరం కలిగి ఉన్నప్పటికి వాటిని యావత్‌ ‌ప్రపంచ ఆస్తిగా పరిగణించాలని మోదీ సూచించారు. యావత్‌ ‌దక్షిణ చైనా సముద్రం తనదేనని, తీరదేశాలైన ఫిలిప్పీన్స్, ‌మలేసియా, బ్రూనై తదితర తీర దేశాలకు ఎలాంటి హక్కులు లేవని చైనా మొండి వాదన చేస్తున్న సమయంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి. ఈ విషయంలో అంతర్జాతీయ ట్రైబ్యునల్‌ ‌తీర్పునూ బీజింగ్‌ ‌గౌరవించని సంగతి తెలిసిందే. సాగర భద్రతపై మరింత మెరుగైన సమన్వయం, సహకారం పెరగాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఉగ్రవాదం, దోపిడీల కారణంగా సముద్ర యానం దుర్వినియోగం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమాలియా తీరం సమీపంలో సముద్ర దొంగలు తరచూ సరకు రవాణా నౌకలను అడ్డుకోవడం, దోపిడీలకు పాల్పడుతున్నారు. సముద్ర దొంగల కారణంగా తీరరేఖను కలిగి ఉన్న దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోదీ గుర్తు చేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆయన పంచ సూత్రాలను ప్రతిపాదించారు. మోదీ ప్రతిపాదనలను అంతర్జాతీయ నేతలు సహర్షంగా స్వాగతించారు. వాటిని తక్షణం అమలు చేయాల్సిన ఆవశ్యకత గురించి వారు నొక్కి చెప్పారు.

పంచసూత్రాలు..

1.చట్టబద్ధమైన అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్యానికి ఎదురవుతున్న అడ్డంకులను తక్షణం తొలగించాలి. ఈ విషయంలో అన్ని దేశాలు కలసిరావాలి. సముద్ర మార్గాల్లో క్రియాశీల వాణిజ్యం పైనే అంతర్జాతీయ ప్రగతి ఆధారపడి ఉంటుంది. రవాణాలో ఎదురయ్యే ఆటంకాలు కేవలం కొన్ని దేశాలకే కాదు, యావత్‌ ‌ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తాయి.

2.సముద్ర సంబంధిత వివాదాలను, విభేదాలను, సమస్యలను శాంతియుతంగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి, ట్రైబ్యునళ్ల ద్వారానే పరిష్కరించుకోవాలి. అంతేతప్ప బలప్రయోగాలకు పాల్పడరాదు. పెద్ద దేశాలు చిన్న దేశాల హక్కులను హరించరాదు.

3.ప్రకృతి పరంగా ఎదురయ్యే విపత్తులను, ప్రభుత్వేతర శక్తుల వల్ల తలెత్తే ఇబ్బందులను అంతర్జాతీయ సమాజం ఐక్యంగా ఎదుర్కోవాలి. ఇది ఏదో ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు. ఈ విషయంలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించేందుకు భారత్‌ ఇప్పటికే ‘సాగర్‌’ (‌సెక్యూరిటీ అండ్‌ ‌గ్రోత్‌ ‌ఫర్‌ ఆల్‌ ఇన్‌ ‌ది రీజియన్‌) ‌వంటి కార్యక్రమాలను చేపట్టింది.

4.పర్యావరణ పరిరక్షణ పరిస్థితులు సముద్రాలపై ప్రభావం చూపుతాయి. సాగరాల్లో చమురు లీకేజి, ప్లాస్టిక్‌ ‌తదితర వ్యర్థాల పారబోత వల్ల కలుషితం అవుతున్నాయి. దీనిని తక్షణం అరికట్టాల్సి ఉంది.

5.సాగరజలాల్లో బాధ్యతాయుత అనుసంధాన తను ప్రతిదేశం ప్రోత్సహించాలి.

సముద్ర దొంగలు, కొన్ని దేశాలు సముద్ర సరిహద్దులపై పేచీలకు దిగడం ద్వారా అంతర్జాతీయ నౌకా రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు దక్షిణ చైనా సముద్రం వివాదంపై చైనా మొండివాదన సమస్యలను మరింత జటిలం చేస్తోంది. ఈ విషయమై అంతర్జాతీయ ట్రైబ్యునల్‌ ‌గతంలో ఇచ్చిన తీర్పును బీజింగ్‌ ‌బుట్టదాఖలు చేసింది. అసలు ఆ తీర్పును తాము గుర్తించబోమని ప్రకటించి అంతర్జాతీయ నిబంధనలకు గండి కొట్టింది. వాస్తవానికి అంతర్జాతీయ చిత్రపటంలో దక్షిణ చైనా సముద్రం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇది పసిఫిక్‌ ‌మహాసముద్రంలో ఒక భాగం. చైనాతోపాటు పైన పేర్కొన్న దేశాలకు ఈ సముద్రంతో సరిహద్దులు ఉన్నాయి. తూర్పు చైనా సముద్రంలో సెంకాకు దీవుల విషయమై జపాన్‌తో చైనాకు వివాదాలు ఉన్నాయి. ఇలాంటి సముద్ర వివాదాలను అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా శాంతియుతంగా, సామరస్యంగా, ఏ ఒక్కరి హక్కులను హరించకుండా పరిష్కరించుకోవాలన్నది భారత్‌ అభిప్రాయం.

 భారత్‌ ‌కూడా కొన్ని దేశాలతో కలసి పనిచేస్తోంది. అయితే అది ఇతర దేశాల ప్రయోజనా లకు విరుద్ధంగా వ్యవహరించడం లేదు. 2007లో జపాన్‌ ‌చొరవతో ‘క్వాడ్‌’ (‌క్వాడ్రిలేటరల్‌ ‌సెక్యూరిటీ డైలాగ్‌ – ‌చతుర్భజ కూటమి) కూటమి ఏర్పాటైంది. ఇందులో అమెరికా, జపాన్‌, ‌భారత్‌, ఆ‌స్ట్రేలియా భాగస్వాములు. ఈ నాలుగు దేశాలు వివిధ ఖండాల్లో విస్తరించి ఉన్నాయి. అయినప్పటికి ఉమ్మడి ప్రయోజనాల ప్రాతిపదికగా ఈ కూటమి ఏర్పాటైంది. ఎవరి ప్రయోజనాలను దెబ్బతీయడం దీని లక్ష్యం కానేకాదు. అయితే చైనా ఈ కూటమిని వక్రబుద్ధితో చూస్తోంది. దీనిపై అనేక సందర్భాల్లో తన అక్కసును ప్రదర్శించింది. అసహనాన్ని వ్యక్తంచేసింది. వ్యంగ్య విమర్శలు చేసింది. తనను దెబ్బతీయడానికే ‘క్వాడ్‌’ ‌కూటమి ఏర్పడిందని చైనా ఆరోపిస్తోంది. కానీ ‘క్వాడ్‌’ ఏర్పాటైనప్పటి నుంచి ఇంతవరకూ ఏ దేశ ప్రయోజనానికి విరుద్ధంగా వ్యవహరించలేదన్న విషయం చైనాకు తెలియనిది కాదు. అయినప్పటికీ అది ఏకపక్షంగా వ్యవహరిస్తూ అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది. వాస్తవాలపై అవగాహన గల ప్రపంచ దేశాలు చైనా వితండవాదాన్ని విశ్వసించే పరిస్థితిలో లేవు. అంతర్జాతీయంగా కేవలం సముద్ర, సరిహద్దు వివాదాలే కాకుండా ఏ ఇతర వివాదాలపైనా భారత్‌ ‌వైఖరి సుస్పష్టం. ఏ సమస్యను అయినా శాంతియు తంగా, సామరస్యంగా, వాస్తవాల ప్రాతిపదికగా, ఇతరుల హక్కులకు గండి కొట్టకుండా పరిష్కరించు కోవాలన్నదే భారత్‌ ఆది నుంచీ అనుసరిస్తున్న విధానం. ఈ విషయం చైనా, పాకిస్తాన్‌లకు తప్ప మిగిలిన అంతర్జాతీయ సమాజానికి సుపరిచితం. వాటికీ భారత్‌ ‌వైఖరి తెలుసు. అంతరంగాల్లో ఈ విషయాన్ని ఒప్పుకుంటాయి. అయితే బహిరంగంగా అంగీకరించడానికి భేషజం అడ్డువస్తోంది. అంతే తప్ప మరొకటి కాదు. మొత్తానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సర్వసభ్య సమావేశంలో అధ్యక్ష హోదాలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం అందరి అభినందనలు అందుకుంది. వాస్తవాలకు దర్పణం పట్టింది. భారత్‌ ‌చిత్తశుద్దిని, నిబద్ధతను మరోసారి చాటింది.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌,  ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram