నేను తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురంకు దగ్గరలో, ఉప్పాడ కొత్తపల్లి మండలం, నాగులాపల్లి గ్రామంలో ఉంటాను. నేడు మా గ్రామ జనాభా సుమారు 10 వేలు, ఓటర్ల సంఖ్య 5,600. సామాజికంగా రెడ్లు ఎక్కువ. గ్రామంలో రెడ్లు, యాదవులు, బలిజ, నాయి బ్రహ్మణ, ఉప్పరులు, ఎస్సీలు అందరూ ఉన్నారు. గ్రామంలో రామాలయం, శివాలయం, శ్రీకృష్ణ మందిరం, దుర్గామాత దేవాలయం, అయ్యప్ప దేవాలయం అన్ని కలిపి 20 దేవాలయాలున్నాయి. ఎస్సీ కాలనీల్లో 13 చర్చిలు ఉన్నాయి. గ్రామంలో 75% కుటుంబాలు వ్యవసాయ భూమి లేనివారే!

ఒకప్పుడు మిగిలిన గ్రామాలలో వలె మా గ్రామ జీవితంలో కుల అంతరాలు ఉండేవి. సుమారు 40 సంవత్సరాల క్రితం మా గ్రామంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌శాఖ ప్రారంభం అయింది. సంఘ శిక్షావర్గ (సంఘ ట్రైనింగ్‌ ‌క్యాంప్‌) అయినవారు 30 మంది ఉంటారు. గ్రామంలో సామాజిక మార్పు కోసం స్వయంసేవకుల ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి. వివిధ కులాల మధ్య సోదరభావం ఏర్పడింది. అంటరానితనం లేదు.

నిర్వహించిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు:

2002వ సంవత్సరం శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా గ్రామంలోని అన్ని కులాల వారిని సాదరంగా ఆహ్వానించాము. అందరూ ఉత్సవంలో పాల్గొన్నారు. అక్కడే కలసి భోజనం చేశారు.

అప్పటినుండి వివిధ పండుగలు, అన్ని దేవాలయాల దగ్గర జరిగే కార్యక్రమాలలో కుల బేధం లేకుండా అందరూ పాల్గొంటున్నారు.

2006-07లో ఎస్సీ కాలనీలో స్వామిసాయి, రత్నకుమారిల వివాహానికి అన్ని కులాల వారిని ఆహ్వానించాం. అన్ని కులాల వారు రావడంతో పాటు, అందరూ ఆ ఎస్సీ కాలనీలో భోజనం చేశారు.

2014లో తూర్పుగోదావరి జిల్లా, ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌కార్యకర్తల ఏడు రోజుల శిక్షణ శిబిరం నాగులాపల్లి గ్రామంలో జరిగింది. ఒకరోజు వివిధ కులాలకు చెందిన కుటుంబాల వారు భోజనం తమ ఇంటి నుండి తీసుకువచ్చారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌స్వయం సేవకులు వారు తెచ్చిన భోజనాన్ని వారితో కలసి చేశారు.

2015లో శివాలయం పునర్నిర్మాణం అయింది. శిఖర ప్రతిష్ట ఎస్సీ దంపతుల ద్వారా అయింది.

కులాంతర వివాహాలు:

గ్రామంలో సామాజిక సమరసత కోసం వివిధ కార్యక్రమాలు చేయడం ఒక ఎత్తు. కులాంతర వివాహాలు అందరి ఆమోదంతో జరగడం మరొక యెత్తు.

2019 నవంబర్‌లో జరిగిన కులాంతర వివాహంలో వరుడు కాపు యువకుడు దుర్గాప్రసాద్‌ ‌తరఫున కృష్ణారెడ్డి దంపతులు, వధువు ఎస్సీ యువతి సుప్రియ తరపున దుర్గారెడ్డి దంపతులు పెళ్లి పీటలపై కూర్చున్నారు.

కాపు యువకునితో ఎస్సీ యువతి వివాహం గ్రామంలోని రామాలయంలో అందరి సమక్షంలో జరిగింది. నేడు అనేక కులాంతర వివాహాలు గ్రామంలో జరుగుతున్నాయి.

తాజాగా 2021 ఫిబ్రవరిలో అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణం కొరకు గ్రామంలో అందరూ నిధిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో అన్ని కులాల మహిళలు చురుగ్గా పాల్గొన్నారు. నిధి సేకరణ అనంతరం గ్రామంలోని ఎస్సీలు నిధిని తమ తలపై పెట్టుకుని ఊరేగింపుగా గ్రామంలో ఉన్న స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా శాఖకు వెళ్లి పండుగ వాతావరణంలో జమ చేశారు. నిధిని సంగ్రహించిన ప్రతిసారి ఈ విధంగా ఊరేగింపుగా వెళ్లి బ్యాంకులో జమ చేయడం గ్రామస్థులందరికి ప్రేరణ కలిగించింది.

మా గ్రామంలో రెండు హైస్కూళ్లు ఉన్నాయి. అన్ని కులాల విద్యార్థులు చదువుకుంటున్నారు.

వివిధ దేవాలయాల్లో, ఆట స్థలాల్లో ఎస్సీలతో సహా అన్ని కులాల యువకులు వాలీబాల్‌ ‌వంటి ఆటలు కలిసి ఆనందంగా ఆడుకుంటారు.

గ్రామంలో వ్యవసాయ పనుల కొరకు బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ ‌నుండి ప్రతి సంవత్సరం సుమారు 200 మంది కూలీలు వస్తుంటారు. ప్రతి సంవత్సరం వారితో ఒకరోజు వారి యోగక్షేమాలు గురించి తెలుసుకొని, వారికి కావలసిన సహాయ సహకారాలు కొరకు వచ్చిన వారందరితో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత వారితో గ్రామపెద్దలు, స్వయం సేవకులు అందరూ కలిసి సహ పంక్తి భోజనాలు చేయడం 2015 నుండి ప్రారంభమై నేటికి కొనసాగుతుంది. ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమంలో విభాగ్‌ ‌బౌద్దిక్‌ ‌ప్రముఖ్‌ ‌పాల్గొని అయోధ్య రామ మందిరం ఉద్యమంపై మాట్లాడారు. కార్యక్రమం అయిన వెంటనే వారందరూ మాట్లాడుకుని అయోధ్య రామ మందిర నిర్మాణం కొరకు 5116/- రూపాయలు నిధి సమర్పణ చేశారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌స్వయంసేవకులు చొరవ వల్ల మా గ్రామంలో వివిధ కులాల ప్రజల మధ్య సామరస్య వాతావరణం నేడు నెలకొన్నది.

– కూత సుధాకర్‌రెడ్డి, నాగులాపల్లి

About Author

By editor

Twitter
Instagram