దడ పుట్టించిన జన్మదిన శుభాకాంక్షలు

వలసవాదం కాలగర్భంలో కలసిపోయినా, దాదాపు అలాంటి అణచివేతను ఇప్పటికీ అనుభవిస్తున్న దేశాలు ఏ కొన్నో ఉన్నాయని అనుకుంటే, అందులో ప్రథమ స్థానం దక్కేది టిబెట్‌కే. ఇంకా చెప్పాలంటే వలసవాదులను మించిన కమ్యూనిస్టుల అణచివేత ఇక్కడ దశబ్దాలుగా సాగుతోంది. టిబెట్‌ ‌పట్ల చైనా వైఖరి ఇప్పటికీ అత్యంత వివాదాస్పదమే. చైనా అక్కడి ప్రజలను ఇప్పటికీ ద్వితీయశ్రేణి పౌరులుగానే చూస్తోంది. టిబెట్‌ ‌మీద ఆధిపత్యం గురించి తప్పితే అక్కడి ప్రజల బాగోగుల పట్ల కనీస శ్రద్ధ కానరాదు. టిబెటన్ల సంక్షేమం, ఆ ప్రాంత అభివృద్ధి అంటే మొదటినుంచీ బీజింగ్‌కు చిన్నచూపే. టిబెట్‌ ‌తనదేనని చైనా 1950 దశకం నుంచి చెబుతోంది. కానీ చైనాలోని ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే టిబెట్‌ ఎం‌తో వెనకబడి ఉందన్నది కాదనలేని సత్యం. అక్కడి దేశాధినేతలకు ఆ ప్రాంతాన్ని సందర్శించాలన్న ఆలోచనే ఉండదు. ప్రత్యేక పరిస్థితుల్లో చుట్టపుచూపుగా వచ్చిపోవడమే ఉంటుంది.

రాజకీయ హక్కులు ఎలాగూ లేవు, టిబెటన్ల మనోభావాలను గుర్తించకపోవడం, ఆధ్యాత్మిక భావనలను గౌరవించకపోవడం వంటి చర్యలతో నిరంకుశత్వానికి మించి చైనా వ్యవహరిస్తోంది. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు14వ దలైలామా జన్మదిన వేడుకలను కూడా అనుమతించకపోవడం ఇందుకు నిదర్శనం.

జులై 6న ఆయన జన్మదిన వేడుకలకు ప్రజలను దూరం చేసింది. వారిపై అనేక ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు దలైలామా జన్మదినాన్ని పర్వదినంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వన భోజనాలు, ప్రార్థనలు, ప్రదర్శనలు నిర్వహించారు. భక్తిప్రపత్తులతో ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. హిమాచల్‌‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస జీవితం గడుపుతున్న బౌద్ధ గురువుకు అనేకమంది దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్‌ ‌ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా వెల్లడించడం విశేషం. ఆయన ఇలాంటి వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మోదీ మనసారా ఆకాంక్షించారు. ధర్మశాలలోని టిబెటన్ల ప్రవాస ప్రభుత్వమైన సెంట్రల్‌ ‌టిబెట్‌ అడ్మినిస్ట్రేషన్‌ (‌సీటీఏ) అధ్యక్షుడు లోబ్‌ ‌సాంగ్‌ ‌సంగే తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకను ‘ఇయర్‌ ఆఫ్‌ ‌గ్రాటుడ్యూడ్‌’ ‌గా ప్రకటించారు.

 1959 టిబెట్‌ ఆ‌క్రమణ సమయంలో దలైలామా అక్కడి నుంచి భారత్‌ ‌వచ్చారు. ఆయనతో పాటు వేలమంది బౌద్ధులూ వచ్చారు. మొదట్లో అప్పటి యూపీలోని ముస్సోరి (ప్రస్తుత ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రం)లో కొంతకాలం గడిపారు. తరవాత హిమాచల్‌‌ప్రదేశ్‌లోని ధర్మశాలకు మకాం మార్చారు. బౌద్ధం ప్రపంచంలోని నాలుగో అతి పెద్ద మతం. సుమారు 2500 సంవత్సరాల క్రితం ఈ మతం భారత్‌లో ఆవిర్భవించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 500 మిలియన్ల మంది బౌద్ధులు ఉంటారని అంచనా. ఒక్క బీజింగ్‌ ‌మాత్రమే ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంది.

దలైలామా జన్మదిన వేడుకలను బహిష్క రించడం, నిరసించడం చైనాకు కొత్తేమీ కాదు. 2019లో వాస్తవాధీన రేఖ సరిహద్దుల్లోని ‘దెమ్‌ ‌చౌక్‌ ’ ‌ప్రాంతంలో దలైలమా జన్మదిన వేడుకలను బహిష్కరిస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టింది. సైనికులు బ్యానర్లను, ప్లకార్డులను ప్రదర్శించారు. అసలు దలైలామా ఉనికినే గుర్తించని చైనా ఆయన జన్మదిన వేడుకలకు అనుమతి ఇవ్వడాన్ని ఊహించలేం. అయితే పైకి దలైలామాను విస్మరించినట్లు కనపడుతున్నప్పటికీ ఆయన అంటే బీజింగ్‌కు లోలోన భయం లేకపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా టిబెటన్లపై ఆయన ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడం లేదు. ఎంత కాదనుకున్నప్పటికీ ఆయన ప్రాధాన్యాన్ని గుర్తించక తప్పడం లేదు.

 టిబెట్‌లో దలైలామా ప్రాధాన్యాన్ని తక్కువ చేసి చూపేందుకు చైనా అధినేత షి జిన్‌పింగ్‌ ‌జులై 21 నుంచి 23వరకు ఆకస్మిక పర్యటన జరిపారు. హఠాత్తుగా అప్పటికప్పుడు ఖరారు చేసిన పర్యటన. టిబెట్‌ ‌పట్ల ఆయనకు ప్రేమే లేదు. ఆ మాటకొస్తే చైనా అధినేతలందరిదీ అదే ధోరణి. ఎప్పుడో 1991లో నాటి అధ్యక్షుడు జియాంగ్‌ ‌జెమిన్‌ ‌తరవాత మూడు దశాబ్దాల అనంతరం టిబెట్‌ను సందర్శించిన తొలి అధ్యక్షుడు జిన్‌పింగే కావడం గమనార్హం. దీనిని బట్టే టిబెట్‌ అం‌టే బీజింగ్‌ ‌పాలకులకు గల ఉదాసీనత, నిర్లక్ష్యం అర్థమవుతుంది. 2012లో అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం జిన్‌పింగ్‌ ‌టిబెట్‌ ‌లో పర్యటించడం ఇదే ప్రథమం. ఉపాధ్యక్ష హోదాలో 2011లో ఒకసారి టిబెట్‌ను సందర్శించారు. మళ్లీ రావడం ఇప్పుడే. జిన్‌పింగ్‌ ‌మూడురోజుల పర్యటనలో టిబెట్‌ ‌స్వయం ప్రతిపత్తి ప్రాంతం (టీఏఆర్‌… ‌టిబెట్‌ అటానమస్‌ ‌రీజియన్‌) ‌ఛైర్మన్‌ ‌చౌదలా ఆయన వెంట ఉన్నారు. ఈయన పూర్తిగా చైనా కనుసన్నల్లో నడిచే మనిషి. టిబెట్‌ ‌ప్రజల సమస్యలు, ఇక్కడి వెనుకబాటు గురించి ప్రస్తావించే కనీస ప్రయత్నం కూడా చేయరు. చైనా పాలకులకు అయిష్టం కలిగించే ఏ పనీ చేయరు. ఎప్పుడూ వారిని సంతప్తి పరచడానికే ప్రయత్నిస్తుంటారు.

 జిన్‌పింగ్‌ ‌పర్యటన ఉద్దేశం కూడా ఈ ప్రాంత ప్రగతిని ఉద్దేశించింది కాదు. ఇక్కడి ప్రజల్లో దలైలామా ప్రభావాన్ని తగ్గించడం అసలు లక్ష్యం. అందుకే ఆయన దలైలామా జన్మదినం అనంతరం కావాలని పని కట్టుకుని వచ్చారు. అరుణాచల్‌‌ప్రదేశ్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోని నియంగ్చి విమానాశ్రయంలో పటిష్ఠ భద్రత మధ్య అడుగు పెట్టిన జిన్‌పింగ్‌ ‌మూడు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా టిబెట్‌ ‌రాజధాని లాసా నగరంలోని అప్పట్లో దలైలామా నివసించిన భవనాన్ని (పోటల్‌ ‌ప్యాలెస్‌)‌ను సందర్శించారు. నియంగ్చి నుంచి టిబెట్‌ ‌రాజధాని లాసా నగరానికి నిర్మించిన బుల్లెట్‌ ‌రైలును ప్రారంభించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. రెండు నగరాల మధ్య దూరం దాదాపు 435 కిలోమీటర్లు. 2014లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. బ్రహ్మపుత్ర నదిని పరిశీలించారు. దీనిని చైనీయులు ‘యార్లంగ్‌ ‌జాంగ్సో’ అని వ్యవహరిస్తారు. ఈ నదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భారత్‌ ‌నీటి వాటాకు బీజింగ్‌ ‌గండి కొడుతోంది. ఈ విషయమై ఎన్నోసార్లు దౌత్య మార్గాల్లో అభ్యంతరాలు, ఆక్షేపణలు తెలియజేసినా అరకొర సమాధానాలతో సరిపెడుతోంది. అంతేతప్ప నిర్దిష్ట వివరణలు ఇవ్వడం లేదు. టిబెట్‌ ‌నుంచి ఈ నది మన దేశంలోని అరుణాచల్‌‌ప్రదేశ్‌, అస్సాం మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తోంది. అక్కడ బంగళాఖాతంలో సంగమిస్తుంది. బ్రహ్మపుత్రకు అస్సాంలో అతి పెద్ద పరివాహక ప్రాంతం ఉంది. అసోం ప్రజలకు ఇది జీవనాడి.

 టిబెట్‌ ‌పర్యటన సందర్భంగా ఆ ప్రాంతానికి మేలు చేసే పథకాలను, కార్యక్రమాలను జిన్‌పింగ్‌ ‌ప్రకటించలేదు. లేకపోగా టిబెట్‌ ‌లోని ప్రతి ఇంటి నుంచి ఒకరు సైన్యంలో చేరాలని అప్పటికే చైనా నిర్దేశించింది. ఆధునిక ప్రపంచంలో వ్యక్తులు ఎవరైనా సైన్యంలో చేరాలన్నది వారి అభీష్టంపై ఆధార పడి ఉంటుంది. ఎక్కడా ఏ ప్రభుత్వం తప్పనిసరి చేయలేదు. అలాంటి కఠిన నిబంధనను టిబెటన్లపై రుద్దారు చైనా అధినేత. అదే సమయంలో వారిపై ఆంక్షలు విధించారు. సైన్యంలో చేరే యువత చైనా కమ్యూనిస్టు పార్టీ పట్ల విధేయత కలిగి ఉండాలని, మతపరమైన నమ్మకాలకు, విశ్వాసాలకు దూరంగా ఉండాలని నిర్దేశించారు. చైనా అధికార భాష అయిన ‘మాండరిస్‌’ ‌నేర్చుకోవడం తప్పనిసరని పేర్కొన్నారు. సైన్యంలో నియామకాలకు సంబంధించి చైనీయులకు ఇలాంటి నిబంధనలు నిర్దేశించకపోవడం ఇక్కడ గమనార్హం. టిబెటన్ల పట్ల పక్షపాతానికి ఇంతకు మించిన మరో నిదర్శనం అక్కర్లేదు. సైన్యంలో టిబెట్‌ ‌యువతను చేర్చుకోవాలన్న నిర్ణయం వెనక అసలు కారణం మరొకటి ఉందన్నది టిబెట్‌ ‌రాజకీయ వర్గాల విశ్లేషణ.

సుమారు 3488 కిలోమీటర్ల సరిహద్దు గల వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ – లైన్‌ ఆఫ్‌ ‌యాక్చువల్‌ ‌కంట్రోల్‌) ‌పై చైనా మొదటి నుంచీ పేచీ పెడుతోంది. నాటి బ్రిటిష్‌ అధికారి మెక్‌ ‌మహన్‌ ఎల్‌ఏసీని నిర్థారించారు. ఈ ప్రాంతమంతా కొండలు, గుట్టలు, పర్వతాలతో నిండి ఉంటుంది. పూర్తిగా నిర్జన ప్రాంతం. విపరీతమైన చలి ఉంటుంది. ఇక శీతాకాలంలో పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఇరు దేశాల జవాన్లు పూర్తిగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితు లను గమనంలోకి తీసుకునే సరిహద్దులను కాపాడుకునేందుకు భారత్‌ ఐటీబీపీ (ఇండో-టిబెటన్‌ ‌బోర్డర్‌ ‌ఫోర్స్), ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ (‌స్పెషల్‌ ‌ఫ్రాంటియర్‌ ‌ఫోర్స్) ‌ను ఏర్పాటు చేసుకుంది. చైనాతో యుద్ధంలో ఎదురైన చేదు అనుభవాలతో వీటిని 1962లో ఏర్పాటు చేశారు. ప్రతికూల, కఠిన వాతావరణ పరిస్థితుల్లో పని చేయడం ఈ దళాల ప్రత్యేకత.

1971 బంగ్లాదేశ్‌ ‌విమోచన పోరాటం, 1984 సియాచిన్‌ ‌ఘర్షణలు, 1999 కార్గిల్‌ ‌యుద్ధంలో ఈ దళం క్రియాశీలకంగా వ్యవహరించింది. గత ఏడాది జూన్‌లో గల్వాన్‌ ‌లోయ ప్రాంతంలో ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణల్లోనూ ఈ దళం ప్రశంసనీయ పాత్ర పోషించింది. టిబెట్‌ ‌నుంచి వచ్చిన శరణార్థులే దళాల్లో ఎక్కువ మంది ఉన్నారు. చైనా సరిహద్దుల్లో సైనికులతో పాటు ఈ దళాలు కూడా విధుల్లో పాల్గొంటాయి. ఈ దళాల పోరాట పటిమ వల్లే ఇప్పటివరకు భారత సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయన్నది వాస్తవం.

ఈ నేపథ్యంలో ఇలాంటి దళాలు తమకూ అవసరమని జిన్‌పింగ్‌ ‌గుర్తించారు. టిబెట్‌ ‌యవకులకు అయితే స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన ఉంటుంది. ఎముకలు కొరికే చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ వారు పని చేయగలరు. ఈ క్లిష్టతరమైన బాధ్యతలను చైనా సైనికులు సరిగా నిర్వర్తించలేరన్న అభిప్రాయం సైనిక వర్గాల్లో ఉంది. అందుకే టిబెట్‌ ‌యువత ఇంటికొకరు చొప్పున తప్పనిసరిగా సైన్యంలో చేరాలని జిన్‌పింగ్‌ ఆదేశించారన్నది సైనిక వర్గాల అభిప్రాయం. దేశ రక్షణలో స్థానిక యువతను భాగస్వామ్యం చేయకుండా ఏమీ చేయలేమన్నది ఏడు దశాబ్దాల అనుభవం చెబుతోంది. అంతేకాక భారత్‌పై టిబెట్లను ఉసిగొల్పడం కూడా ఇందుకు ఒక కారణమని చెబుతున్నారు. ఇంటికొకరు చొప్పున టిబెట్‌ ‌యువత సైన్యంలో చేరాలని నిర్దేశించిన జిన్‌పింగ్‌ ఈ ‌ప్రాంత అభివృద్ధి, విద్య, వైద్యం, రహదారుల వంటి మౌలిక సౌకర్యాల గురించి ఒక్క మాటా మాట్లాడకపోవడం గమనార్హం. టిబెట్‌ ‌పట్ల బీజింగ్‌ ‌వివక్షకు ఇంతకు మించి మరో నిదర్శనం అక్కర్లేదన్న ప్రశ్నకు సమాధానమేదీ?

దలైలామాకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతోనే, చైనా అధినేత టిబెట్‌లో వచ్చి వాలడం ఇంకా చాలా ప్రశ్నలకు అవకాశం ఇస్తుంది.

– దోర్బల పూర్ణిమాస్వాతి,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram