మద్యంపై ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తక్కువ పెట్టుబడితో నాలుగింతల లాభం వచ్చే ఆదాయవనరుగా దీనిని మార్చేసింది. పైగా ఈ మద్యం ఆదాయాన్ని చూపించే బ్యాంకుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 వేల కోట్లు అప్పులు తెచ్చింది. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వచ్చినా ఖాతరు చేయలేదు. తీసుకున్న అప్పుపై కేంద్ర ఆర్ధికశాఖకు వివరణ ఇవ్వ డాన్ని కూడా ఖాతరు చేసేలా కనిపించడం లేదు. ఆర్ధికశాఖ నుంచి వస్తున్న ఒత్తిడితో బ్యాంకులను సంతృప్తిపరిచి అప్పులు పుట్టించుకునే మార్గాలు సజీవంగా ఉంచుకోవడమే ఇప్పుడు జగన్‌ ‌ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం.

అందుకోసం మద్యంపై ఆదాయం ఏ మాత్రం తగ్గకుండా పెంచుకునే ఏర్పాట్లు చేసుకుంటోంది. అమ్మే ప్రతి సీసాలో అసలు విలువలో దాదాపు 80శాతం ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుంది. మద్యం ద్వారా ప్రతిరోజూ రూ.50 కోట్లు తగ్గకుండా ప్రభుత్వ ఖజానాలో పడుతుంది. ముందుగా ఈ రాబడి తగ్గకుండా చూసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,934 మద్యం షాపుల్లో అతి తక్కువగా అమ్మకాలున్న వంద షాపులను గుర్తించారు. అనంతపురంలో 26, చిత్తూరులో 32, కర్నూలులో 11, కృష్ణాలో 10, తూర్పుగోదావరి, గుంటూరులో చెరో ఏడు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళంలో చెరో రెండు, విజయనగరంలో ఒక షాపులో అమ్మకాలు తగ్గినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిని రద్దీగా ఉండే ప్రాంతాలకు తరలిస్తోంది. అమ్మకాలు పెరిగేందుకు సూచనలు ఇవ్వాలని మద్యం షాపుల్లో పనిచేసే సూపర్వైజర్లు, సేల్స్‌మెన్‌లను సలహాలు కోరింది. ఏమైతేనేం అమ్మకాలు పెరిగాయి. గతేడాది ఆగస్టు వరకు రూ.1600 కోట్లకు అటూ ఇటూగా ఉన్న అమ్మకాలు సెప్టెంబరు నుంచి ఒక్కసారిగా పెరిగిపోయాయి.

2020 జనవరిలో నెలకు సగటున రూ. 1800 కోట్లు ఆమ్మకాలుంటే, కొన్ని నెలలుగా సగటు అమ్మకాలు రూ. 2వేల కోట్లపైనే ఉంటున్నాయి. మద్యంపై గరిష్టస్థాయిలో ఆదాయం కోసం వినియోగదారుల సౌకర్యార్థం వాక్‌ ఇన్‌ ‌స్టోర్‌ ‌పేరుతో మద్యం మాల్స్ అం‌దుబాటులోకి తెచ్చింది. కొత్తగా పర్యాటక ప్రాంతాల్లోనూ మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు మద్యం అమ్ముతున్నారు. తాము అమ్మే మద్యమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్‌ ‌డ్యూటీ పెయిడ్‌ ‌లిక్కర్‌, ‌నాటు సారాపైనా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి మూడు సీసాలు తెచ్చుకునే వెసులుబాటును నేరంగా పరిగణిస్తోంది. మద్య నిషేధంపై రాష్టప్రభుత్వ అసలు రంగు క్రమంగా బయటపడుతోంది. అంచెలంచెలుగా మద్య నిషేధం అమలుచేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం అటుంచి ఆదాయాన్ని పెంచుకునే స్థితిలో పడింది.

జలకళ విఫలం

రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన వైఎస్‌ఆర్‌ ‌జలకళ పథకం ఆచరణలో విఫలమైంది. వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు వేసి విద్యుత్‌ ‌పంపుసెట్‌ ‌సమకూర్చి రై•తుకు భరోసా ఇవ్వాలనేది వైఎస్సార్‌ ‌జలకళ ముఖ్యఉద్దేశం. ఈపథకం ద్వారా బోర్లు వేయించుకోవాలనే ఆశతో వేలాదిమంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కాని పథకం అమలు తీరు రైతుల ఆశలను నీరుగారుస్తోంది. రైతుల పొలాల్లో బోర్లు వేసేందుకు అప్పగించిన ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు చెల్లించలేకపోవడంతో బోరు యజమానులు కొత్త బోర్లు వేసేందుకు ముందుకు రావడం లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరిలోని మెట్టప్రాంతాల్లోని రైతులు బోర్లతోనే వ్యవసాయం చేస్తున్నారు. బోర్లు తవ్వుకోవడం బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో రైతుల నీటి సమస్య పరిష్కరించేందుకు వైఎస్సార్‌ ‌జలకళ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఈ పథకం ప్రారంభించి దాదాపు ఏడాది కావస్తోంది. పథకం అమలుకు రూ.2,340 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ సమయంలో మెట్ట పొలాల్లో పైర్లు ఉన్నందున అవి చేతికొచ్చాక బోర్లు వేస్తామని దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు. 1,88,082 మంది రైతులు ఉచిత బోర్లు వేయించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో 50,333, ఆఫ్‌లైన్‌లో 1,37,749 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఐదు శాతం మందికైనా బోరు వేయని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తుల్లో వీఆర్‌ఓ ‌స్థాయిలో దాదాపు 62 వేల దరఖాస్తులు తిరస్కరించారు. 1,26,712 దరఖాస్తులను అప్రూవల్‌ ‌చేశారు. వీఆర్‌ఓ ‌పోర్టల్‌ ‌నుంచి 1,26,712 దరఖాస్తులు రిగ్గు కాంట్రాక్టర్లకు చేరగా, అందులో 33,610 దరఖాస్తులను మాత్రమే జియాలజిస్టులు సర్వేచేసి అప్రూవల్‌ ఇచ్చారు. ఇంకా దాదాపు లక్ష దరఖాస్తులు జియాలజిస్టు సర్వే కోసం ఎదురుచూస్తున్నాయి. జియాలజిస్టుల సిఫార్సులతో వెళ్లిన 33,610 దరఖాస్తుల్లో 25,682కు మాత్రమే బోర్లు వేసేందుకు అధికారులు సిఫార్సులు చేశారు. అందులో బోర్లు వేసిన వాటిలో ఒక్కదానికైనా విద్యుత్‌ ‌కనెక్షన్‌ ఇవ్వలేదు. ఇప్పటికే ఆర్‌డబ్ల్యుఎస్‌లో వేసిన బోర్లుకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం నిలిపివేయడంతో రిగ్గు యజమానులు కొత్తబోర్లు వేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో జలకళ పథకం స్తంభించి పోయింది. ఆన్‌లైన్‌ ‌వెబ్‌సైట్‌ ‌పనిచేయకపోగా, క్షేత్రస్థాయిలో సర్వేలు నిలిచిపోయాయి. జలకళ పథకం ఆర్భాటంగా ఆరంభించిన పాలకులు వాటి నిధుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారు. పనిచేసిన వాటికి నిధుల కోసం ఏజన్సీలు, బోర్లు ఎప్పుడు వేస్తారా అని రైతులకు ఎదురుచూస్తున్నారు.

సూక్ష్మ పోషకాలపై సబ్సిడీ ఎత్తివేత

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే ప్రోత్సాహాన్ని రానురాను తగ్గించుకుని రాయితీలను వదిలించు కోచూస్తోంది. రాయితీ పథకాలను ఒక్కోదాన్ని నెమ్మదిగా ఎత్తేస్తోంది. ఆ జాబితాలోకి ఇపుడు సూక్ష్మ పోషకాల పథకం కూడా వచ్చి చేరింది. గతంలో సూక్ష్మపోషకాలు ఉచితంగా ఇచ్చేవారు. 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ పోషకాల ఉచితాన్ని తొలగించి 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ ఏడాది ఈ 50 శాతం సబ్సిడీని తొలగించింది. రైతులు ముందుగా పూర్తి డబ్బులు చెల్లిస్తేనే సూక్ష్మ పోషకాలను ఆర్బీకేల ద్వారా అందిస్తామని పేర్కొంది. బహిరంగ మార్కెట్‌లో పది కేజీల జింకు రూ.550. జిప్సం 50 కేజీల సంచి రూ.1,150. బోరాన్‌ ‌కిలో రూ.500. కంపెనీలను బట్టి ఈ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం డబ్బు కడితేనే ఇవి ఇస్తామనడం వల్ల ఎకరాకు రూ.2,000 వరకు రైతులకు అదనపు భారం పడుతుంది. అదీ రైతులు సమీప ఆర్‌బీకేల్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ చెబుతోంది.

తూతూ మంత్రంగా భూసార పరీక్షలు

వ్యవసాయం లాభసాటి కావడానికి, భూసారాన్ని పరిరక్షించడానికి సూక్ష్మ పోషకాలు చాలా ముఖ్యం. సూక్ష్మ పోషకాలు భూమికి ఎంతో మేలు చేస్తాయి. దిగుబడి పెంచుతాయి. రసాయన ఎరువులు వాడటం కన్నా ఏటా సాగుకు ముందు భూసార పరీక్షలు చేసి, ఏ నేలకు ఎలాంటి పోషకాలు అందిస్తే పంట దిగుబడి బాగా వస్తుందో గుర్తించి, వాటిని రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం భూసార పరీక్షల పథకం ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన భూసార పరీక్షల కార్డుల పథకంలో పొలంలో మట్టి పరిస్థితిని తెలుసుకుని వాటికి అవసరమైన జింకు, జిప్సం, బోరాన్‌ ‌వంటి పోషకాలను అందించేవారు. దీని వల్ల రైతులకు వ్యవసాయ దిగుబడుల పట్ల భరోసా ఉండేది. కాని రెండేళ్ల నుంచి భూసార పరీక్షలు కూడా చిత్తశుద్ధిగా చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. భూముల్లో పోషక లోపం తెలియజేసే యంత్రాంగం కూడా కరువైంది. మట్టి నమూనాలు తీసుకెళితే ఆర్‌బీకేల్లో పరీక్షలు చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారేగాని క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని రైతులంటున్నారు. సూక్ష్మసేద్యం పథకం అమలు చేస్తామంటూ ప్రభుత్వం ఇటీవల ప్రకటన విడుదల చేసినా వాటికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. భూమిలో పోషకాల లోపం తెలియకుండా వ్యవసాయం చేయడం వల్ల పంటల దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.

ఉద్యాన రైతులకు ప్రోత్సాహం ఏదీ?

రెండేళ్ల నుంచి సబ్సిడీలు, ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఉద్యాన రైతులు నిరాశకు లోనవుతున్నారు. రైతులను పూలు, పండ్లు, కాయగూరలు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఆయిల్‌ ‌ఫామ్స్ ‌సాగుకు పోత్సహించడం ఉద్యానశాఖ లక్ష్యం. సాగుకు అవసరమైన విత్తనాన్ని సబ్సిడీతో అందించడం, వచ్చిన దిగుబడిని తరలించడానికి అవసరమైన ట్రేలను సమకూర్చడం, మార్కెట్‌కు తరలించడానికి సబ్సిడీతో వాహనాలను అందించాలి. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా నేటికి ఉద్యాన రైతులకు అవసరమైన ఎటువంటి సబ్సిడీ పథకాలను అందించలేదు. ఉద్యానానికి ఊతమిచ్చేలా రైతులకు ఫారంపాండ్స్ ‌తవ్వించడం, ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పంటల సాగుకు వీలుగా పాలీహౌజ్‌ ‌లను ఏర్పాటు చేయడం, ద్రాక్ష, బీర, కాకర వంటి తీగజాతులకు శ్వాశ్వత పందిళ్లు వంటివి ఏర్పాటు చేయలేదు. మరికొంత కాలం ఇలాగే సాగితే ఉద్యాన పంటలు సాగు చేసే రైతాంగం తగ్గిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెల్లూరులో, ప్రకాశంలో బత్తాయి, మామిడి, నిమ్మ, చిత్తూరులో అరటి, మామిడి, పూలు, అనంతపురంలో బత్తాయి, అరటి, పుచ్చ, కర్భూజ, కర్నూలులో మామిడి, బత్తాయి, అరటి, కడపలో బత్తాయి, నిమ్మ, విరివిరిగా రైతులు సాగు చేస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల్లో ఇప్పటివరకు రైతులకు ఎటువంటి శిక్షణ, అవగాహనా కార్యక్ర మాలు నిర్వహించలేదు. వ్యవసాయాన్ని పండుగలా చేస్తామని ఆర్భాటాలు చేస్తూ రైతులను ప్రభుత్వం మోసం చేస్తోంది. కరోనా ప్రభావతో నేలచూపులు చూస్తోన్న ఉద్యాన రైతులకు ఊతమివ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది.

హతాశులైన ఆశావహులు

తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జనాభా లెక్కల అనంతరమేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న నేతలు హతాశులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ప్రస్తుతమున్న 119 నియోజక వర్గాలు 158కు, ఆంధప్రదేశ్‌లో 175 స్థానాల నుంచి 225 పెరుగుతాయని, తద్వారా ఎన్నికల బరిలో ఉండవచ్చని పార్టీల్లో నేతలు ఆశించారు. 1978వ సంవత్సరంలో నియోజక వర్గాల పునర్విభజన జరిగిన తర్వాత 1983, 1989, 1994, 1999లో శాసన సభకు ఎన్నికలు జరిగాయి. 2004లో జరిగిన నియోజక వర్గాల పునర్విభజనతో కొత్త నియోజక వర్గాలు ఏర్పడి 2009లో ఆ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా, తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరపున కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలపై ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రుల తనయులు, సతీమణులు, దగ్గరి బంధువులు ఇప్పటికే పాగా వేసి స్థానికంగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు ఆయా నియోజకవర్గాలు పెరుగుతున్నాయని అక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తానని భరోసా కూడా ఇచ్చారు. ఈ పరిస్థితి అన్ని పార్టీల్లోనూ ఉంది. నియోజకవర్గాల పెంపు ఉండదన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఆశావహులు ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చున్నారు.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram