-తురగా నాగభూషణం
రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ, అన్యమతాల సంతుష్టీకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. హిందువులు అందరిలో దైవత్వాన్ని చూస్తారు. ప్రకృతి, చెట్లు, నదులు, జంతువులను కూడా పూజ్యభావంతో ఆరాధిస్తారు. హిందూ మతంలో గోవుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. సమస్త దేవతలు ఆవులోనే ఉంటారని, ఆవును దేవతల నిలయంగా భావించి కొలుస్తారు. గృహప్రవేశాల్లో మంచి జరగాలని ఆవులను ముందు ఇంటిలోకి తీసుకువస్తారు. ఆవుపాలు, మూత్రం, పేడ అన్నిటిని పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు, గోవును తల్లిగా చూస్తున్నారు. గోమాత అంటున్నారు. గోవు ప్రాధాన్యాన్ని గుర్తించే.. దానిని రక్షించే బాధ్యతను రాజ్యాంగం తీసుకుంది.

గోవును సంరక్షించాలనే ఉద్దేశంతో డా।। బి.ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌రాజ్యాంగంలో గోహత్యను నిరోధించేలా 48వ ఆర్టికల్‌లో స్పష్టం చేశారు. దీనిని అనుసరించి పలు రాష్ట్రాలు గోవధ నిషేధ చట్టాలు చేశాయి. కాని ఒక మతం వారు మహిళను ఆస్తిగా చూసినట్లు ఆవును మాంసాహారంగానే భావిస్తున్నారు. గోవులను అక్రమంగా ఎత్తుకుపోయి సంహరిస్తున్నారు.

జూలై 10న బక్రీద్‌ ‌సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులోని ఒక మదర్సాలో కొన్ని గోవులను అక్రమంగా తరలించి వధించేందుకు ప్రయత్నిస్తున్న వారిని కొందరు గో ప్రేమికులు అడ్డుకున్నారు. వారు వినలేదు. పోలీసులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేదు సరికదా… గోవధకు ఉత్సాహం చూపిస్తున్నవారంతా పోలీసుల ముందే వారిని చితకబాదారు. గోప్రేమికులు పెద్దల సహాయంతో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేస్తే, నిందితులను వదిలేసి ఫిర్యాదుచేసిన వారిపై పోలీసులు కేసులుపెట్టారు. ఈ సంఘటన ఊరంతా తెలిసి సంచలనమై సభ్యసమాజం మొత్తం గోహత్యలను ఖండిస్తూ, బాధపడింది. దెబ్బలు తిని, పోలీసు కేసుల్లో ఇరుక్కున్న బాధితులపై సానుభూతిని చూపించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి 24వ తేదీన మదర్సా పెద్దలు, పట్టణ మున్సిపల్‌ ‌వైస్‌ ‌ఛైర్మన్‌తో మీడియా సమావేశం నిర్వహించారు. గోహత్యా నిరోధక చట్టం కాలం చెల్లినదని, అది అమలుచేయడానికి వీలుకాదని, పైగా ఆవును ఆహారంగా కొన్ని వర్గాలు తీసుకుంటున్నాయని అందువల్ల గోవును తినడంలో తప్పేంటని పేర్కొన్నారు. గోవును ఒక జంతువుగా, వస్తువుగా భావిస్తూ ఒక వర్గాన్ని సంతుష్టీకరించేలా మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా పట్టించు కోకుండా మాట్లాడటాన్ని భాజపా ఖండించింది. మతమార్పిడులు పెరగడం, ఏదొక మతాన్ని భుజాన వేసుకుని మరో మతం ఆచార, వ్యవహారాలకు ఇబ్బందులు కలిగించడం, ఒక మతానికి చెందిన ఆర్థిక వనరులను మరో మత ప్రచారానికి వాడుకోవడం, ఇతర మతస్తులపై దాడులు వంటి సంఘటనలు రెండేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి.

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో రాజంపల్లి చెంచుల గ్రామం ఉంది. ఐటీడీఏ ఆర్థిక సహకారంతో 30 ఏళ్లుగా కొందరు చెంచులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. కాలనీలో ఉన్న 60 సెంట్ల స్థలంలో గిరిజన పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్‌ ‌నిర్మాణం కోసం అధికారులకు ప్రతిపాదన చేశారు. అయితే అన్యమతస్తులు కొందరు ఈ భూమిని కబ్జా చేసి అక్కడ చర్చి కట్టాలని ప్రయత్నించారు. చెంచులను మతం మారాలని అన్ని రకాలుగా ప్రలోభపెట్టారు. వీరు మారలేదు. దాంతో బెదిరింపులకు దిగారు. అదీ కుదరలేదు. ఇక దండో పాయానికి దిగారు. బలవంతంగా స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించగా చెంచులు అడ్డుకున్నారు. దీంతో దౌర్జన్యం చేసి వారిపై మారణాయుధాలతో దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు చెంచులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే జిల్లా మంత్రి ఒత్తిడితో నిందితులకు స్టేషన్‌ ‌బెయిల్‌ ‌లభించేలా చిన్న కేసులు నమోదుచేశారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కేంద్రంలో హరిజన వాడలో మతం మారలేదని, గుడి కడుతున్నారనే కక్షతో ఇటీవల హిందువులపై పోలీసుల సమక్షంలో రాజేందప్రసాద్‌ అనే ఫాస్టర్‌ ‌బృందం దాడులు చేసింది. ఈ డాడుల్లో బుజ్జి మున్నయ్య కుటుంబం తీవ్రంగా గాయపడింది. ఈ దాష్టీకాలను ప్రశ్నించేందుకు భాజపా అధ్యక్షులు సోమువీర్రాజు ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రభుత్వ నిర్వాకాన్ని ఎత్తిచూపారు. ఈ చర్యలను ఖండించారు. హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వారసత్వ సంపద

తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోని రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. భారత శిల్పకళకు, మన సంస్కృతికి దక్కిన గౌరవంగా భావించవచ్చు. సాంకేతిక నైపుణ్యం లేని రోజుల్లోనే ఎత్తైన భవనాలతో అపురూపమైన శిల్పాలతో నిర్మించిన మన దేవాలయాలు ప్రపంచంలోనే ప్రాచుర్యాన్ని పొందాయి. వీటిని భరించలేని విదేశీ ముష్కర మూకలు దేశంలోని ఎన్నో ప్రధాన ఆలయాలను ధ్వంసం చేశాయి. ఆ దాడులను సైతం తట్టుకుని మన సంపద నిలబడగలిగింది. దేశంలోని పలు రాష్ట్రాల్లోని దేవాయాలు, ప్రకృతి ఆవాసాలకు వారసత్వ గుర్తింపు లభించినా తెలంగాణకు మొట్టమొదటి గుర్తింపు రామప్ప ఆలయం ద్వారా లభించింది. మన ఆంధప్రదేశ్‌లోనూ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందదగిన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో లేపాక్షి ఆలయం మొట్టమొదటిది. ఆర్కియలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా ఇటీవల చేసిన చర్యల్లో భాగంగా ఈ ఆలయాన్ని యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చారు. త్వరలోనే లేపాక్షి ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇస్తుందని భావించవచ్చు.

లేపాక్షి అద్భుత కళాఖండం

లేపాక్షి ఆలయం పర్యాటక ప్రాంతమే కాదు గొప్ప ఆధ్యాతిక కేంద్రం. చారిత్రక సంపదకు నిలయం. శిల్పకళలకు పెట్టింది పేరు. శిల్పుల నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యం లేపాక్షి దేవాలయం. 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కాందపురాణం తెలియచేస్తుంది. ఇక్కడ గల పాపనశేశ్వర స్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్టించారని స్థలపురాణం చెబుతోంది. పెనుకొండ రాజధానిగా విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతరాయలు (క్రీ.శ. 1530 నుంచి 1542) పాలనలో ఆయన ఆస్థానంలో రాజకోశాధికారిగా పనిచేస్తున్న విరూపణ్ణ లేపాక్షి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం కూర్మగిరి అనే కొండపై ఏడు ప్రాకారాల్లో నిర్మిత మైంది. ఆలయంలో ప్రధానదైవం వీరభద్రస్వామి. ఆలయంలో మొత్తం 878 స్తంభాలున్నాయి. అందులో 246 స్తంభాలపై ఎన్నో శిల్పకళాకృతులు దర్శన మిస్తాయి. గర్భగుడిలో వీరభద్రస్వామికి విరూపణ్ణ కుటుంబం మొక్కుతున్న తైలవర్ణ చిత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్ద తైలవర్ణ చిత్రంగా గుర్తింపు పొందింది. పంచముఖ లింగాలు, భక్త శిరియాళ నీతికథలు, అభిషేకమూర్తి, నాట్యగణపతి శిల్పం, శివపార్వతులు ఇతివృత్తం, విరూపణ్ణ పరివాహిక తైలవర్ణ చిత్రాలను ఈ ఆలయంలో చూడొచ్చు. విభిన్న దేవ్‌-‌దేవతామూర్తుల విగ్రహాలు, ఆకట్టుకునే వటపత్రసాయి చిత్రం, పద్మినీజాతి మహిళ శిల్పం, శతపత్రాలుగా చెక్కిన కమలం ఒకటేమిటి ఏ శిల్పం చూసినా చూపరులను కట్టిపడేసే శిల్పకళా సౌందర్యం లేపాక్షి సొంతం.

లేపాక్షిలోని ప్రధాన ఆకర్షణ బసవయ్య విగ్రహం. 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన విగ్రహం ఇది. ఇంతటి ఘనమైన చరిత్ర, శిల్పకళ, భాష సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన లేపాక్షి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందే అవకాశాలు ఉండటంతో ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారమవు తోందనే ఆనందం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

గుర్తింపు పక్రియలోనే..

లేపాక్షి ప్రాచుర్యాన్ని చాటుతూ 2016లో కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందింది. ఆ శిల్పకళలను కాపాడుకోవడంతో పాటు పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందేందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. లేపాక్షి ఆలయంలోని శిల్పకళలు, ప్రాచుర్యం, ఏకశిలా నంది విగ్రహంతో పాటు ప్రతి శిల్పం భావం, చరిత్ర, ఆలయం పుట్టుపూర్వోత్తరాలు, విస్తీర్ణం, దేవాలయం విశిష్టతను తెలిపే నివేదిక రూపొందించి పురావస్తుశాఖ ద్వారా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖకు పంపారు. యునెస్కో గుర్తింపు కోసం ఆర్కియలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా లేపాక్షిని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఆదర్శ స్మారకాల జాబితాలో లేపాక్షి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపునకు అన్ని అర్హతలు ఉన్నాయి. లేపాక్షికి వారసత్వ గుర్తింపు వస్తే.. పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. తద్వారా కరవు జిల్లా అనంతపురం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా లభిస్తుంది.

జీవో 198ను ఆమోదించడం చారిత్రాత్మక తప్పిదం

రాష్ట్రంలోని నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నులు పెంచుకునే జీవో నెంబర్‌ 198 ‌ను ఆమోదించడం చారిత్రాత్మక తప్పిదంగా భావించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బహుమానంగా పన్ను వెన్నుపోటు పొడిచింది. ఏకపక్షంగా జీవోను ఆమోదించుకుంది. ఒక్క వైసీపీ కార్పొరేటర్‌, ‌కౌన్సిలర్‌ ‌కూడా పన్నుల పెంపును వ్యతిరేకించకపోవడం దుర్మార్గం. కొన్ని కౌన్సిళ్లలో ప్రతిపక్షాలు జీవో నెంబర్‌ 198‌పై మాట్లాడేందుకు కేవలం రెండు నుంచి మూడు నిమిషాలు సమయం ఇవ్వడం వారి నిరంకుశ విధానాన్ని తెలియచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఇచ్చే డబ్బును చూపించి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గెలిచారు. ఈ జీవో ద్వారా తమకు కలిగే నష్టం ప్రజలకు తెలియదు. ఈ జీవోను అమలు చేసేటప్పుడు ప్రతిఘటన తప్పదు.

పేద విద్యార్థులకు ప్రయోజనం

వైద్య, డెంటల్‌ ‌కళాశాలల్లో జాతీయ కోటా సీట్లలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్‌లు ఇవ్వడం చారిత్రక నిర్ణయం. దీని వల్ల ఎంబీబీఎస్‌లో 1,500 మంది ఓబీసీలు, 550 మంది ఈడబ్ల్యూఎస్‌ ‌విద్యార్థులకు; పోస్ట్ ‌గ్రాడ్యుయేషన్‌ (‌పీజీ)లో 2,500 ఓబీసీలు, వెయ్యి మంది ఈడబ్ల్యూఎస్‌ ‌విద్యార్థులకు మొత్తం దేశంలోని 5,500 మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ ‌కేటగిరీకి చెందిన విద్యార్థులు ఆలిండియా కోటాలో ఏ రాష్ట్రంలోనైనా మెడిసిన్‌ ‌సీటు పొందేందుకు వీలవుతుంది. వైద్య కోర్సుల సీట్లలో ఓబీసీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ఈ మధ్య ఢిల్లీలో నిర్వహించిన ఓబీసీ సమావేశంలో చర్చించారు. ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్‌ ‌యాదవ్‌ ‌ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ ‌రిజర్వేషన్లను కల్పించారు. ఈ నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు మేలు జరుగుతుంది. పేదలు, బలహీన వర్గాలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న నమ్మకాన్ని మరింత పెంచింది.

పెరిగిన సీట్లు, కాలేజీలు

పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకు రావాలని భావించిన మోదీ ప్రభుత్వం వైద్యకళా శాలలు, సీట్లను భారీగా పెంచింది. ఎంబీబీఎస్‌ ‌సీట్లు 2014లో 54,348 ఉండగా.. 2020 నాటికి 84,649 సీట్లకు పెరిగాయి. అంటే 56 శాతం పెరుగుదల నమోదైంది. అదే పీజీ కోర్సుల్లో 30,191 నుంచి 54,275కి పెరిగాయి. ఈ కాలంలో 80 శాతం సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. కాలేజీల విషయానికి వస్తే ఈ ఆరేళ్లలో 179 కొత్త కాలేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశంలో 558 వైద్య కాలేజీలుండగా అందులో 289 ప్రభుత్వ కాలేజీలు, 269 ప్రైవేట్‌ ‌కాలేజీలున్నాయి.

-వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram