మళ్లీ ఉమ్మడి పౌర స్మృతి

నిజమే, ఉమ్మడి పౌర స్మృతి అనగానే బీజేపీ ఎన్నికల హామీ అన్న చందంగా ప్రజల ఆలోచనా ధోరణి రూపుదిద్దుకున్నదంటే నమ్మవలసిందే. 370 అధికరణ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం వలెనే ఉమ్మడి పౌర స్మృతి కూడా ఆ పార్టీ వ్యవహారంలా చూడడం పరిపాటి అయింది. వివక్షకు ఆలవాలంగా ఉన్న కొన్ని వైయక్తిక చట్టాలన• ఆ సాకుతో బతికిస్తూ కొన్ని మతాలు, వర్గాలు పబ్బం గడుపుకుంటున్నాయి. 370 అధికరణ మాదిరిగానే నిర్దిష్ట గడువు పెట్టకపోవడంతో ఉమ్మడి పౌర స్మృతి కూడా చిరకాలంగా ఎటూ తేలక త్రిశంకుస్వర్గంలో వేలాడుతోంది. దేశ పౌరులందరికీ వర్తించే ఒక పౌర స్మృతిని నిర్మించుకోవాలని భారత రాజ్యాంగంలోని 44వ అధికరణం గుర్తు చేస్తూనే ఉంది. ఈ జూలై 7వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశంతో మరొకసారి అది చర్చనీయాంశమైంది. ఆధునిక భారతీయ సమాజం క్రమంగా సమజాతీయతను సంతరించుకుంటున్నది. సంప్రదాయక కట్టుబాట్ల పరిధిలోని కుల, మత, కమ్యూనిటీ అంతరాలు అంతర్ధాన మవుతున్నాయి. ఈ దశలో ఉమ్మడి పౌర స్మృతి నెరవేరని ఆశగా మిగిలిపోరాదు అని జస్టిస్‌ ‌ప్రతిభా ఎం సింగ్‌ ‌తన ఆదేశంలో స్పష్టం చేశారు. వివాహం వంటి విషయాలలో వైయక్తిక చట్టాల కారణంగా యువతరం సంఘర్షణకు గురికాకూడదన్నదే ఆ ఆదేశం సారాంశం.

షాబానో కేసు (1985) సహా, వివిధ సందర్భాలలో ఉమ్మడి పౌర స్మృతి గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనూ, 44వ అధికరణ సందేశం గురించి కూడా హైకోర్టు తన ఆదేశంలో ఉటంకించింది. ఉమ్మడి పౌర స్మృతి దేశ సమైక్యతకు ఉపకరిస్తుందని షాబానో కేసు తీర్పు వేళ సుప్రీంకోర్టు చాటింది. కాబట్టి ఉమ్మడి పౌర స్మృతి ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకుని బీజేపీ లేదా సంఘపరివార్‌ ‌చేస్తున్న పరోక్ష యుద్ధమన్న తిక్క వాదనకు ఉదారవాద మేధావులు, స్వయం ప్రకటిత సెక్యులరిస్టులు, ముస్లిం మతోన్మాదులు ఇకనైనా స్వస్తి పలకాలి.

2012లో వివాహం చేసుకున్న ఒక జంట విడాకులకు కోర్టుకు ఎక్కడం తాజా ఆదేశానికి కారణమైంది. ఆ జంటలో పురుషుడు హిందూ వివాహ చట్టం 1955 నిబంధనల ప్రకారం విడాకులు ఇప్పించాలని కోరాడు. కానీ మహిళ ఆ చట్టం నుంచి ఆమె సామాజిక వర్గానికి (మీనా) మినహాయంపు ఉంది కాబట్టి విడాకుల అభ్యర్థనను నిరాకరించాలని కోర్టుకు విన్నవించుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశం వచ్చింది.

ఉమ్మడి పౌర స్మృతి ఆవిర్భావానికి ఒక్క సంఘపరివార్‌ ‌నుంచి తప్ప చాలా వైపుల నుంచి మొహమాటాలు కనిపిస్తాయి. గడువు ముగిసినప్పుడు 2017 డిసెంబర్‌లో లా కమిషన్‌ 185 ‌పేజీల పత్రాన్ని విడుదల చేసి, ఉమ్మడి పౌర స్మృతి అవసరం లేదని పేర్కొన్నది. రాజ్యాంగ బద్ధ రక్షణ ఉన్నందున వైయక్తిక (పర్సనల్‌) ‌చట్టాలను పక్కన పెట్టడం సాధ్యం కాదని కమిషన్‌ అధ్యక్షుడు బల్బీర్‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌తేల్చారు. పైగా వర్తమాన పరిస్థితులు అనువుగా లేవన్నది కమిషన్‌ అభిప్రాయం. వైయక్తిక చట్టాలలో లోపాలను సవరిస్తే చాలునన్నది కమిషన్‌ ఉద్దేశం. కాంగ్రెస్‌ ‌నాయకుడు, న్యాయశాఖను నిర్వహించిన వీరప్ప మొయిలీ కూడా ఉమ్మడి పౌర స్మృతి సాధ్యంకాదనే 2016లో చెప్పారు. కానీ జాతీయ సమైక్యతను కోరే బీజేపీకి ఇది చిరకాల స్వప్నం. 1998 ఎన్నికల ప్రణాళికలో ఉమ్మడి పౌర స్మృతిని ఇస్తామని హామీ ఇచ్చింది. 2019, 2020లలో ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది కూడా.

రాజ్యాంగానికీ, వైయక్తిక చట్టాలకీ మధ్య ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. అవి అనివార్యం. ఎందుకంటే, పౌరులందరినీ సమానంగా చూస్తుంది రాజ్యాంగం. వైయక్తిక చట్టాలలో వివక్ష సహజం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ అభిప్రాయాల మేరకే కాదు, రాజ్యాంగంలోని 44వ అధికరణ ప్రకారం కూడా లా కమిషన్‌ అభిప్రాయాలతో ఎవరూ ఏకీభవించలేరు. కాబట్టి లా కమిషన్‌ ‌మాటలే కాదు, ఉమ్మడి పౌర స్మృతి నిర్మాణానికి వ్యతిరేకంగా ఎవరు ఇంకా పాత పాటే పాడినా డాక్టర్‌ అం‌బేడ్కర్‌ అభిప్రాయాలకీ, 44వ అధికరణ స్ఫూర్తికీ విరుద్ధమే. వివిధ మతస్థులకు వేర్వేరు సంప్రదాయాలు, విశ్వాసాల పునాదిగా వైయుక్తక చట్టాలు ఉన్నాయి. వివాహం, విడాకులు, పునర్వివాహం, దత్తత, వారసత్వం, సంరక్షకుడు (గార్డియన్‌షిప్‌) ‌వంటివాటిని ఆ చట్టాలు శాసిస్తాయి. ఒక్క ఉదాహరణ- ఇస్లాంలో బహుభార్యాత్వం ఉంది. హిందూ జీవనవిధానంలో అది నిషిద్ధం. కానీ విశ్వాసాలు కావచ్చు, మతాచారాలు కావచ్చు; అవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు, లింగ సమానత్వాన్ని నిరాకరిస్తున్నప్పుడు వాటిని రద్దు చేయవలసిందేనని సుప్రీంకోర్టు ఎప్పుడో తేల్చి చెప్పింది. అంటే వైయక్తిక చట్టాలైనా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. వైయక్తిక చట్టాల కారణంగా స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష, ఏకపక్ష తలాక్‌, ‌నికా హలాలా, బహుభార్యాత్వం ఆచారాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని చాలాకాలం క్రితమే కొందరు ముస్లిం మహిళలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఏ విధంగా చూసినా కొన్ని మతాలలో అమలవుతున్న వైయక్తిక చట్టాలు వివక్షకు తావిచ్చేవే. కాబట్టే ఉమ్మడి పౌర స్మృతి వాస్తవం కావాలి.

వైయక్తిక చట్టాలు మైనారిటీలను భారతీయ జీవన స్రవంతికి దూరం చేస్తున్నాయన్న వాదనను కాదనడం కష్టం. కాబట్టి ఈసారి ముస్లిం పర్సనల్‌ ‌లా బోర్డు కూడా ఉమ్మడి పౌర స్మృతికి అంగీకరించాలని శివసేన కోరడంలో దురుద్దేశాలను చూడనక్కరలేదు. వైయక్తిక చట్టాల పుణ్యమా అని ఆ వర్గంలో జనాభా పెరుగుదల మీద చర్చ రేగి, జనాభా నియంత్రణ చట్టాలు రావాలన్న అభిప్రాయం బలపడుతున్నది. ఇందుకు అస్సాం, ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రాలు శ్రీకారం చుట్టబోతున్నాయి. ఈ తరుణంలో ఉమ్మడి పౌర స్మృతి గురించి కూడా దేశ ప్రజలు- మెజారిటీలు, మైనారిటీలు ఏకాభిప్రాయానికి రావడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram