తల్లిగర్భం నుంచి భూమ్మీద పడి కేరుమని ఏడిచే శిశువు నోటికి అమృతం అందుతుంది. అమ్మపాలే ఆ అమృతం. ధర్మం, సంప్రదాయం, శాస్త్రం, కాలం ఏకగ్రీవంగా ఆమోదించిన, ఆమోదిస్తున్న సత్యమిది. కాబట్టి శాశ్వత సత్యం. స్తన్యం అంటే తల్లి తనకు తాను ఇచ్చుకునే కానుకే కాదు, బిడ్డకీ, పుడమికీ కూడా ఇచ్చే కానుక. మానవ మనుగడ స్తన్యం మీదే ఆధారపడి ఉంది. పుట్టిన గంట తరువాత బిడ్డ లేత నాలుక రుచి చూసే ఆ మధురామృతం పుడమి గర్భంలో పవళించే వరకు, జీవిత పర్యంతం పనిచేసే దివ్య ఔషధం. తల్లి గర్భం నుంచి పుడమితల్లి గర్భం వరకు సాగే మనిషి ప్రయాణానికి ఉపకరించే శక్తి. ఇది అతిశయోక్తి కాదు. శాస్త్ర సమ్మతం.

కానీ దురదృష్టం. ఆ మూడు- ‘ధర్మం, సంప్రదాయం, శాస్త్రం’తో విభేదించకుండానే కాలం తల్లీబిడ్డల ఆ సహజ హక్కును త్రిశంకు స్వర్గంలోకి నెడుతున్నది. నిజమే, కాలం మారుతుంది. కానీ ఆ క్రమంలో మౌలిక ధర్మాలూ, మానవ మనుగడకు సంబంధించిన సూత్రాలూ కూడా మారిపోవచ్చునన్న భ్రమే  వింత. మార్పు మాటున చొరబడే అమానవీయత పట్ల మౌనం దాల్చడం మరొక వికృతి. ఈ భ్రమకీ, వికృతికీ మొదటిగా బలవుతున్నది నవజాత శిశువులే కనుక  చెప్పక తప్పదు. కాలం మారుతూనే ఉంటుందన్న స్పృహను కోల్పోకుండానే, మౌలిక ధర్మాలనీ, సూత్రాలనీ గౌరవిస్తూ ఉండడమే మానవాళి కర్తవ్యం. ఇలాంటి మేల్కొల్పు అవసరాన్ని అంతర్జాతీయంగా గుర్తిస్తున్నారు. ఏటా ఆగస్ట్ ‌మొదటివారాన్ని అమ్మపాల వారోత్సవంగా జరుపుకోవడం అందుకే. 1991లో ఇలాంటి మహోన్నత యోజనకు అంకురార్పణ జరిగింది.

చనుబాలు సక్రమంగా, సంపూర్ణంగా అందించగలిగితే ఏటా 8,20,000 పసిప్రాణాలను రక్షించుకోవచ్చునని చెబుతున్నాయి ఐక్యరాజ్య సమితి, యునిసెఫ్‌. అం‌టే ఇవి స్తన్యం అందక కొడిగడుతున్న ప్రాణాలే కదా! అభం శుభం తెలియనివారి జీవించే హక్కు ఏ కారణంగా అయినా గాలిలో కలిసిపోవడం అమానుషం కాదా! పెరిగిన హక్కుల స్పృహకు నవజాత శిశువుల ఆ తొలి ఆక్రందన కూడా వినపడాలి కదా! మానవాళిని నిస్సహాయులను చేసి యథేచ్ఛగా సాగిపోతున్న ఈ పోకడను ఆపడానికి 120 దేశాలు ఏకత్రాటి మీదకు రావడం నిజంగా శుభ పరిణామమే.  ప్రసవవేదనానంతర స్థితి నుంచి బయటపడడానికి ఎక్కువ సమయం తీసుకునే తల్లులు ఉంటారు. గుండె స్పందిస్తున్నా, వక్షం అసహాయతతో బిడ్డకు పాలు ఇవ్వలేని తల్లులు ఉంటారు. ఈ అనావృష్టి కొందరిదైతే అతివృష్టితో బాధపడేవారూ ఉన్నారు. తల్లిపాలు అందినా ఇతర కారణాలతో మరణించిన శిశువులు ఉంటారు. కానీ ఆ పాలకు నోచుకోని శిశువుల మరణాలు వాటి కంటే ఇవి మూడు నాలుగు రెట్లు ఎక్కువేనంటున్నాయి అధ్యయనాలు. వీ•న్నిటి మీద ఇప్పుడు వైద్యశాస్త్రం, ప్రపంచం దృష్టి పెడుతున్నాయి. కొన్ని పరిష్కారాలు వచ్చాయి కూడా. హైదరాబాద్‌కు చెందిన ‘ధాత్రి తల్లిపాల నిధి’తో పాటు దేశంలో పలుచోట్ల ఇలాంటి సేవాసంస్థలు స్తన్యానికి నోచుకోని నవజాత శిశువుల రక్షణ కోసం నడుం బిగించాయి. అమ్మపాలు అమ్మరాదు అన్న గొప్ప నైతిక సూత్రం ఇప్పటికి సజీవంగా ఉండడం అదృష్టమే.

 భూగోళం మీద ఈ క్షణంలో కళ్లు తెరిచిన కొందరు శిశువుల పాలిట ఈ తల్లిపాల వారోత్సవాలు పండుగ రోజులే. కానీ ఈ తరం భారతీయులు ఈ వారోత్సవాలను వేరొక కోణం నుంచి కూడా చూడగలిగితే ధన్యులవుతారు. మన జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయి. ఇవాళ వైద్యశాస్త్రం ఎన్నో లోతులను తరచి చూసింది. ఇప్పుడు ఆ ఆధునిక వైద్యశాస్త్రమే తల్లిపాల ప్రాధాన్యం గురించి చెబుతున్న సత్యాలను మన ఆయుర్వేద ఆచార్యులు శతాబ్దాల కిందట ప్రవచించారు. నిజంగా ఇది రోమాంచితం చేసే సంగతి. వీటిని విస్మరించాం. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా, వాటిని స్మరించుకుంటే గొప్ప ప్రయోజనమే సిద్ధిస్తుందన్నది వాస్తవం.

మొదటి ఆరుమాసాలు శిశువుకు స్తన్యం ఇవ్వాలని ఆయుర్వేద ఆచార్యులు నిర్దేశించారు. ఆవుపాలు పవిత్రమే. వాటిలోని శాస్త్రీయత, పోషక విలువల ఘనత మనకు శిరోధార్యమే. అయినా నెలల బిడ్డకు తల్లిపాలే శరణ్యమన్నారు వారు. మాతాశిశువుల మధ్య స్పర్శతోనే, శిశు రోదనంతోనే వక్షం పరివర్తన చెందుతుందంటూ మానసిక విశ్లేషణ చేయగలిగారు. అసలు ఆయుర్వేదమే మానసిక వైక్య, ఉద్వేగాలకూ, శారీరక మార్పులకూ నడుమ ఉన్న అదృశ్య లంకెను ఆవిష్కరిస్తుంది. పాలు పంపించే దమని, అక్కడ కండరాల పనితీరునూ నాటి ఆచార్యులు వివరించారు. పాలివ్వడానికి సిద్ధపడుతున్న తల్లి పాటించవలసిన పరిశుభ్రత, పాలలో ఉండే దోషాలు ఏమిటో, ఎలా ఉంటాయో తెలియచెప్పారు. దోషాలను ఎలా పరీక్షించాలో, ఎలా నివారించాలో సూచించారు. కన్నతల్లి పాలు ఇవ్వలేకపోతే మరొక తల్లి చేత ఇప్పించమన్నారు. అలా పాలిచ్చే యువతే ధాత్రి. ధాత్రినే పాశ్చాత్యులు వెట్‌నర్స్ అం‌టున్నారు. బిడ్డ భవిష్యత్తు స్తన్యంతోనే నిర్మితమౌతుందనీ సిద్ధాంతీకరించారు. శిశువు శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండూ తల్లిపాల పుణ్యమేనని తేల్చారు కూడా.

పాలిచ్చే తల్లుల దేశం మనది. దానిని నిరూపించేటట్టు ఉంది మన ఆయుర్వేద ఆచార్యుల పాఠం. కానీ వర్తమాన దృశ్యమే కొంచెం బాధిస్తున్నది. తల్లిపాలు ముద్దు.. డబ్బాపాలు వద్దు అన్న సరళమైన నినాదం అందరికీ వేదవాక్యం కావాలని ఆశిద్దాం. చివరిగా ఒక్కమాట- ‘సీసాపాలు బిడ్డ కడుపు నింపుతాయి. స్తన్యం ఆత్మను నింపుతుంది’. స్తన్యమిచ్చే ప్రతి తల్లికి జాగృతి నమశ్శతములు.

About Author

By editor

Twitter
Instagram