– వల్లూరి విజయకుమార్‌

‌శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీకి ఎంపికైనది

సీతారావుడు నాతో చెప్పింది యథాతథంగా వాడి మాటల్లోనే మీ ముందుంచుతున్నాను. ఇక కథలో కెళ్లిపోండి.

నాకప్పుడు ఐదో, యెన్నో… ఏళ్లుంటాయ్‌.

‌నాన్న మళ్లీ మళ్లీ చూడాలనిపించడు.

ఎప్పుడూ కొర కొరలాడుతూ ఉంటాడు.

అమ్మ అలాక్కాదు, చక్కగా ఉంటుంది. అంటే అందంగా అని తర్వాత అర్ధం అయింది లెండి.

రంగురంగుల చీరా, ఇంత బొట్టూ…

పాపిడి తీసిన జుత్తు… రాత్రుళ్లు అమ్మ జడలో చక్కగా తెల్ల పువ్వులు పూస్తాయి. మంచి వాసనగా, జడ ఇలా అలా కదులుతుంటే మంచిగా!

అసలు నాన్న ఇంటిపట్టునే ఉండడు.

పొద్దున్న లేవగానే కుర్చీలో దర్జా! అమ్మే కాఫీ తేవాలి, ఇవ్వాలి.

కాఫీ కూడా పెట్టుకోలేడు నాన్న.

‘ఈ వెధవ లేవలేదా ఇంకా’ అంటాడు.

నాకు సీతారాం పేరున్నా ఎప్పుడూ పేరుపెట్టి పిలవడే… వెధవా, బడుద్దాయి, బండగాడూ… అమ్మ నవ్వుతుంది.

అంతే, నాన్న మరి కనిపించడు, సైకిలెక్కి ఎక్కడికో పోతాడు.

ఒకసారడిగాను ‘అమ్మా రోజూ ఎక్కడికి పోతాడు నాన్నా’ అని.

‘ఆఫీసుకి రా, కచేరీకి.. పాపం పొద్దుటి నుంచి మనకోసం కష్టపడతాడు’

అంతా అబద్ధమే. సాయంత్రాలు గంగయ్య ఇంటికెళ్లి పేకాడాల్సిందే. నాన్నతో షాపింగ్‌ ‌చేసిన రోజులు అట్టే జ్ఞాపకం లేవు.

పొద్దుటినుంచి అమ్మే కష్టపడుతుంది.

పొద్దుటే కోడితో లేచిపోయి, సూరీడుని లేపుతుంది. అప్పుడు సూరీడు మెల్లిగా వెలుగిస్తాడు.

రోజు తులసమ్మ చుట్టూ, జుత్తు ముడిపెట్టుకొని, రెండు చేతుల్తో నమస్కారం పెడుతూ తిరుగుతుంది.

అప్పుడే మేజిక్కులా…

వంటింట్లో పొయ్యిలు అవీ వెలుగుతుంటాయ్‌.

అమ్మ చుట్టూ ఉన్న కూరలు గబగబా గిన్నెల్లోకి వెళ్లిపోతాయి.

నాన్న పడేసి వెళ్లిపోతే ఆయన బట్టలూ అవీ కష్టపడి ఉతుక్కుంటుంది. నా బట్టలు చిన్నవేలెండి, పెద్ద కష్టం కాదు.

నేనలా ఆడుకుంటూ ఉంటే చాలు, అమ్మకి బోలెడు సాయం చేసినట్టే అంటుంది. సరేనని ఆడుకుంటూ బయటకెళ్లి మళ్లీ ఇంట్లో ఉందో లేదోనని వచ్చి చూస్తుంటా.

అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఇల్లు తుడుచుకుంటూ, బట్టలారవేసుకుంటూ, బియ్యాలేరుకుంటూ, పిండి విసురుకుంటూ… తనలో తను పాడుకుంటూ….

——————————–

నేనిలా ఆనందంగా ఉండడం నాన్న కిష్టంలేదు మరి.

ఒకరోజు నన్ను పట్టుకెళ్లి ఎక్కువ పిల్లలున్న ఇంట్లో పడేసాడు.

దాన్ని బడి అనాలిట.

పలకా, బలపం, జారిపోతున్న పొట్టి లాగు చొక్కా మీదకి లాక్కుంటూ నేను బడికి రోజూ అమ్మ వెంట నడవడం.

నేను బడికెళ్లాలన్నా అమ్మే తలదువ్వాలి, ముస్తాబు చెయ్యాలి, లాగూ, చొక్కా తొడగాలి…

నా టిఫిన్‌ ‌బాక్సు మోసేది కూడా అమ్మే!

బుద్ధిగా చదూకో, అని బుగ్గలు నిమిరి, అమ్మ నన్ను బడి ముందు దింపేస్తుంది రోజూ. అలా బుగ్గలు నిమిరించుఁకోడం కోసమే నేను బడికెళ్లానుకునే వాణ్ణి.

————————————

ఒక్కరోజూ నాన్న కూర తరగ్గా చూళ్లేదు, ఇల్లు తుడవడం చూళ్లేదు. పొయ్యి కూడా వెలిగించలేడు…. సిగరెట్టు తప్ప!

‘పై చదువులు చదువుకో ఫో వెధవా’

అని నాన్నంటే, పక్కూరి కాలేజీకి వెళ్లిపోయాను. నాన్న కచేరీకి నడిస్తే నడిచాడు కానీ, తన సైకిలు మాత్రం నాకిచ్చేసాడు.

మూడేళ్ల డిగ్రీ ఎలా పూర్తి చేస్తానో అనుకునేలోగా, ఫైనల్‌ ‌పరీక్షలు రాయడం కూడా అయిపోయింది.

‘గట్టెక్కుతావా?’ ఆఖరి పరీక్ష రాసి ఇంటికొచ్చినప్పుడు నాన్న అడిగాడు.

‘వాడికేం, మహారాజులా పాసవుతాడు. ముందు కాళ్లు చేతులూ కడుక్కోరా, తిన్నాక మీ నాన్నతో ఎంతసేపైనా మాట్లాడుకో’ అమ్మకంత నమ్మకం!

అమ్మకెలా తెల్సిపోతుందో మరి, కానీ… నాన్నకి తట్టదు కొడుకు ఆకలితో ఉన్నాడని.

రిజల్టస్ ‌వచ్చి నేను పాసయితే అమ్మదే హడావుడి.

పక్కింటి పెద్ద అమ్మమ్మని పిలిచి ‘‘బామ్మగారూ, మీ చేత్తో దిష్టి తియ్యరూ’’ అంటూ మిరపకాయలు, ఉప్పు పట్టుకొచ్చేసింది.

‘శాంతం ఇంక వీడికి పెళ్లి చేసెయ్యాలే’ అంటూ అమ్మలాగే బుగ్గలు నిమిరింది.

అమ్మమ్మలు అల్పసంతోషులు. కాళ్లకి దండం పెడితే చాలు ‘దీర్ఘాయిష్మాన్‌భవ’ అని దీవించేస్తారు.

———————————

‘ఈ వెధవకి బ్యాంకులో ఉద్యోగం వచ్చేసిందే.. ఫరవాలేదు, కష్టపడి చదివించినందుకు బానే గట్టెక్కాడు. వీడికి మంచి రేటే వస్తుందిలే’

స్వగతంలా అన్నా.. నాన్న మాటలు జనాంతికం!

మొదటి జీతంతో అమ్మకి మంచి చీరా, పక్కింటి దీవించే బామ్మకి నాలుగు పళ్లు, నాన్నకి సిగరెట్ల ప్యాకెట్టు బండిలూ, ఒకపేక దస్తా! నే తెచ్చిన గిప్టులు.

‘ఒరే, నువ్వుకానీ సిగరెట్లు తాగుతున్నావా యేంటి, లేదు కదా.. వూ…యిలా యివ్వు’. ఇదీ నాన్న ఆశీర్వాదం.

‘యివన్నీ ఎందుకురా’…..బామ్మగారు పళ్లు తీసుకుంటూ అంది.

‘మీ అమ్మకి ఓ కోడల్ని ఇచ్చావనుకో పాపం తనకీ సందడిగా కూడా ఉంటుంది కదా… ఏమంటావ్‌ ‌శాంతలూ’

‘మీరు చెప్పారు కదా, మీ మాట వింటాడులెండి’ బుద్ధిమంతుడు.

———————————

వీడు వెలగపెడుతున్న ఉద్యోగం ఇదా, నాన్న ఇంట్లోకొస్తూనే అక్షింతలు పట్టుకొచ్చినట్టున్నాడు. ఏడీ వాడు!

‘ఏమైందేమిటి, లోపలున్నాడు’ కొంగుతో చెయ్యి తుడుచుకుంటూ అమ్మ.

‘ఎవరితోనో తిరుగుతున్నాట్ట.

కామేశ్వరరావు వీధిలో వెళ్తుంటే మనవాడు బండిమీద ఎవరినో వెనక కూచోపెట్టుకొని, కనబడ్డాట్ట’

‘అమ్మాయ్‌ ‌బావుంటుందంటనా’?

అమ్మ అడిగిన మాటకి నాన్న బిత్తరపోయాడు.

‘సరే కనుక్కుందాం. ముందు మీరు లోపలికి రండి’.

‘శైలజ, గోడావారి అమ్మాయ్‌. ‌నాతో బ్యాంకులో పనిచేస్తుంది. చాలా నెమ్మదస్తురాలు. అమ్మా, నాన్న చిన్నతనంలో పోతే.. నాన్నమ్మ, తాతయ్య చదివించారు’

శైలజ గురించి నాకు తెలిసిందంతా చెప్పేసాను.

‘అంటే అనాధపిల్లన్న మాట’… నాన్న ఇంతకన్నా మృదువుగా మాట్లాడలేడు. కాసేపు నిశ్శబ్ధం.

‘రాముడూ, యింతకీ మనవాళ్లేనా?’ అమ్మ మెల్లిగా అడిగింది.

‘మనవాళ్లంటే… ఏమో తెలీదు… పెళ్లయితే మనవాళ్లవుతారు’

‘అఘోరించావ్‌, ‌నీ వయసులో యిలా లవ్వంటూ తిరిగామా!’

అమ్మ మెల్లిగా నాన్నని చూసింది. ‘లేదు… పెళ్లయ్యాక కూడా తిరగలేదు మరి’ గొణిగింది.

నాన్న డైలాగులు అయిపోయినట్టున్నాయ్‌, ‌జయా నాకు ఆకల్లేదంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు.

అమ్మ నన్నే చూసింది కన్నార్పకుండా.

‘సీతయ్యా పెద్దవాడివైపోయావు’ దగ్గరికొచ్చి మెల్లిగా తలనిమిరింది.

‘అమ్మా ’… చెప్పబోయాను. ‘ఒరే, నువ్వు తప్పు చెయ్యవురా’ పద అభోజనంగా పడుకోకు.

నాన్నని అర్ధం చేసుకోగలను కానీ అమ్మ త్వరగా అర్ధం కాదు. అలాగే నాన్న మాట్లాడినా, ఎంత మాట్లాడినా నన్ను అర్ధం చేసుకోలేడు, అమ్మ మాత్రం మాట్లాడకుండానే అందరినీ చదివేస్తుంది.

నాన్న ముభావంగా కచేరీకి వెళ్లిపోయాడు. నేను అన్యమనస్కంగా బ్యాంక్‌కి బయల్దేరాను.

అప్పుడే జరిగింది ఎదురుచూడని సంగతి, ఏమైందంటే….

మేము అలా వెళ్లగానే అమ్మ నేను పనిచేసే బ్యాంక్‌కి వచ్చిందిట. నాది మేడమీద లోన్ల సెక్షన్‌. ‌కింద బ్యాంకింగ్‌ ‌స్టాఫ్‌ ఉం‌టారు.

శైలజ మేడం, ఎవరని అడిగింది అమ్మ. అదిగో అని అటెండర్‌ ‌సీట్‌ ‌చూపించాడు.

చలాన్లు రాసుకుంటున్న శైలజ తలెత్తి చూసింది అమ్మని.

‘కూర్చోండి మేడం’, ఏ పనిమీద వచ్చారంటూ.

డిపాజిట్‌ ఓపెన్‌ ‌చెయ్యాలి, మీరు సాయం చేయగలరా….

తప్పకుండా, అలాగే కూర్చోండి. డిపాజిట్‌ అప్లికేషన్‌ ‌తెప్పించింది శైలజ. ‘ఎంత కట్టాలనుకుంటున్నారు’

పాతిక వేలు తల్లీ. నేను సరిగ్గా రాయలేను. కొంచెం రాసిపెట్టాలమ్మా.

ఎంత పనండీ, నేను చేస్తాగా! చెప్పండి, పేరు… అడ్రస్‌… ఎఫ్‌డి పెడతారా, ఎన్నేళ్లకి?

శైలజ అడుగుతూ ఫారం పూర్తి చేస్తున్నది.

నామినీ ఎవరండీ… ఎవరిపేరు పెట్టాలి!

‘నామినీ అంటే ఏంటమ్మా’, తెలీనట్టు అడిగింది అమ్మ.

అంటే, ఒకవేళ మీతదనంతరం, ఈ సొమ్ము ఎవరికి చెందాలి, అంటే వారసుడు అన్నమాట.

అమ్మ నవ్వుకుంటూ, నా పేరు చెప్పింది. శైలజ రొటీన్‌గా రాసింది.

ఎందుకైనా మంచిదని ఫోటో కూడా తెచ్చానమ్మా, ఇదిగో.

‘అవసరం లేదండీ’, అంటూనే శైలజ చూపులు ఫోటో మీద పడ్డాయి. ‘అంతే… శైలజ అవాక్కు’ మీరు.. మీరు తడబడుతూ లేచినిలుచుంది.

అవునమ్మా…. సరేకాని, నీకు నేను నచ్చానా, చక్కగా ఉన్నావు, నాకైతే ఎంతో హాయిగా ఉంది మనసిప్పుడు, త్వరలో మంచిరోజు చూసుకుని, మీ తాతయ్యగారిని, బామ్మగారిని కలుసుకుందాం. అమ్మ లేచింది. ‘డిపాజిట్‌ ‌రశీదు, అన్నీ మావాడికిచ్చి ఇంటికి పంపు, తొందర లేదులే తల్లీ, ఇదిగో కవర్లో డబ్బు.

ఒకసారి సరి చూసుకోమ్మా !

————————-

కథ అక్కడితో ఆగలేదు మరి. మరో మలుపు తిరిగింది. పువ్వులు, మిఠాయి కొనుక్కొని అమ్మ అక్కడినుండి నేరుగా, నాన్న పనిచేసే కచేరీకి వెళ్లిపోయింది!

విజిటర్స్ ‌రూంలో కూర్చున్నాక, ఎవరు కావాలమ్మా, అని అడిగాడు బిళ్ల బంట్రోతు. నాన్న పేరు, కామేశ్వరరావు గారి పేరు చెప్పింది.

అప్పుడే క్యాంటీన్‌ ‌నుండి ఇద్దరు వస్తున్నారు.

‘ఏమిటిలా వచ్చావ్‌, ‌నాన్న గొంతు పెగల్లేదు. ఎంతైనా ఆఫీస్‌ ‌కదా’.

‘అన్నయ్యగారూ’ ఇందండీ…

చొరవగా అమ్మిచ్చిన పువ్వులు, మిఠాయి అందుకున్నారు కామేశ్వరావుగారు.

‘మావారు చెప్పే ఉంటారు.. మీకు తీపి కబురు చెబుదామని ఇటే వచ్చేసాను. ఏం అనుకోరు కదా. రేపు వీలుచూసుకొని యిద్దరం మీ యింటికి వస్తాం’. అమ్మ అనర్గళంగా చెప్పుకు పోతుంటే వినడమే వాళ్లిద్దరి వంతు.

‘అబ్బాయ్‌ ‌సీతా రావుడికి పెళ్లి చేయాలనుకుని సంబంధాలు చూస్తున్నాం. ఇంతలో వాడే బ్యాంకులో పనిచేసే తోటి అమ్మాయ్‌ ‌శైలజని ఇష్టపడు తున్నాడని తెలిసింది’.

‘పిల్లా పిల్లాడు ఇష్టపడితే చేసెయ్యడమే, అందులోనూ బ్యాంకు ఉద్యోగమాయె’.. గుంభనంగా నవ్వాడు కామేశ్వరరావు.

‘మరేం…. మీరంటే ఉన్న చనువుకొద్దీ కచేరీకి వచ్చేసాను, మావారిని నమ్ముకోక. ఎల్లుండి మాఘ మాసం, శుక్రవారం, పెళ్లి మాటలకి పిల్ల వాళ్లింటికి వెళ్దామనుకుంటున్నాం. మీరు వదినగారితో తప్పక రావాలి. పెద్దవారు మాకు మీరేకదా’.

‘అబ్బో ఎంతమాటమ్మ, దగ్గరుండి జరిపించెయ్యమా అందరం, అందునా మా శేషయ్య ఇంటిపెళ్లి వ్యవహారమాయె!

ఏరా, చెప్పావు కాదూ అని కామేశ్వరరావు అంటే.. నాన్న మెల్లిగా మాటలు తుడుముకుంటూ ‘ఇంటావిడకన్నా నాదేముంది. మీరంతా ఎలాగు ఉన్నారు’ అనేసాడు.

నాన్నకి పరీక్ష పెట్టడం మాత్రమే వచ్చు. దిద్దడం రాదు.

అమ్మ అలాక్కాదు. ఆన్సర్‌ ‌పేపర్‌ ఇలా చూడగానే పాసా, ఫెయిలా చెప్పేస్తుంది. అమ్మదగ్గర చదివిన వాళ్లు ఫెయిలవడం ఉండదు!

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram