– ర్యాలి ప్రసాద్‌

‌వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

1924, జనవరి ఆరోతేదీ.

నాగోబా గుడి చుట్టూ ఉన్న ప్రహారీగోడకు దీపాలు పెట్టుకొనే అరల్లోంచి నూనె దీపాలు వెలుగుతున్నాయి. అక్కడే మేస్రం వంశం వాళ్లు వంటలు చేసుకుంటున్నారు. ఆనవాయితీ ప్రకారం ఇరవై రెండు పొయ్యిల మీద వాళ్ల మనసుల్లో వంశ మూలపురుషుడైన పెర్సెపనను తలచుకుని భక్తి పారవశ్యంలో ఉన్నారు. పుష్యమాసపు పౌర్ణమి రోజున బయల్దేరి వెళ్లి గోదావరి నీటిని కొత్త కుండలతో తీసుకొచ్చారు. ఈ నీరు వచ్చాకే నాగోబా జాతర మొదలవుతుంది. ఆ రోజు అమావాస్య నాగోబా దేవతను గోదారి నీటితో అభిషేకించి, తర్వాత తండాల నుండి తెచ్చిన పాలతో క్షీరాభిషేకం చేస్తారు. జాతర మొదలైంది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన గోండుజాతి వారితో పాటు ఇతర భక్తులు కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. శేషనారాయణ మూర్తి అయిన నాగోబా పడగ విప్పి నాట్యం చేస్తాడనీ, పూజారులు పోసే పాలు తాగుతాడనీ, వాళ్లను ఆశీర్వదిస్తాడనీ వాళ్ల నమ్మకం. గుడి దగ్గర్లోని మర్రిచెట్టు కింద విడిది చేసారు. కుండలు తయారుచేసే గుగ్గిళ్ల పెదరాజన్న వంటకోసం కుండలు, మూతలు, దీపాంతలూ సిద్ధం చేసుకుని కూర్చున్నాడు. చిన్నా పెద్దా కలిసి ఆనందంగా ‘గుసాడి’ నృత్యం చేస్తున్నారు.

భీము తన స్నేహితులతో కలిసి తాటాకు పందిరికింద నడుం వాల్చాడు. తెల్లవార్లూ జాతర జరిగింది. ఉదయాన్నే నిద్రలేచి, తూర్పు నుండి వచ్చిన గంటందొర ఆ దగ్గరలోనే ఉన్నాడని తెలిసి అతన్ని కలుసుకోవాలని అనుకున్నాడు. అతని ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాడు. గంటం దొర మన్యంలో గిరిజనుల బతుకులను బాగుపరచడానికి, తెల్లదొరల దారుణ అకృత్యాలను అరికట్టడానికి, మన్యానికి స్వేచ్ఛను ఇవ్వడానికి పోరాడుతున్న అల్లూరి శ్రీరామరాజు అనుచరుడు. రవి అస్తమించని బ్రిటిష్‌ ‌సామ్రాజ్యవాదాన్ని ఎదిరిస్తున్న వీరుడు, కర్మయోగి, దేశాలకు దేశాలే సామ్రాజ్యవాదానికి దాసోహమంటున్నప్పుడు మన్యం ప్రజలతో తెల్లదొరలకి చలిజ్వరం తెప్పిస్తున్న ధీరుడు.

అప్పటికే కలకత్తా వెళ్లి సురేంద్రనాథ్‌ ‌బెనర్జీని కలుసుకుని పోరాట మార్గాలను తెలుసుకుని వచ్చాడు. మన్యంలో శ్రీ రామరాజు చేస్తున్న గెరిల్లా పోరాటాలను గూర్చి చెప్పారు. సురేంద్రనాథ్‌, ఇరుగుపొరుగు ప్రాంతాల్లోని వాళ్లు ఒకరి ఉద్యమాలకు మరొకరు సహకరించుకోవాలన్నారు. ప్రపంచంలో ధనవంతులంతా ఒకటి కానక్కరలేదు. పేదవాళ్లూ ఒకటి కానక్కరలేదు కానీ అన్యాయాలకు, దోపిడీలకూ వ్యతిరేకంగా పోరాడేవాళ్లు ఒక్కటవ్వాలి. అప్పుడే ప్రజలు మనుషుల్లా బతకగలుగుతారు. ప్రపంచంలో జరిగే ఏ ప్రజా ఉద్యమాన్ని అయినా తలకెత్తుకుని గౌరవించవలసిందే అని ఆయన చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.

గంటం దొరను కలుసుకున్నాడు. అతని ద్వారా అనేక విశేషాలు విన్నాడు. గిరిజనులు ఆయన్ని భక్తితో ‘‘స్వామీ’’ అని పిలుస్తారట. త్వరలో స్వామిని కలుస్తానని గంటం దొరకు చెప్పాడు.

కొంతకాలం తర్వాత భీము శ్రీరామరాజును కలవడానికి బయల్దేరాడు. ధర్మపురి వెళ్లి యోగ, ఉగ్ర నరసింహునిగా ఉన్న శ్రీలక్ష్మి నరసింహుణ్ణి దర్శించుకున్నాడు. అక్కడి నుండి లక్సెట్టిపేట, పెద్దం పేట, రామగుండం మీదుగా మంథని వెళ్లాడు. తనతో కలిసివచ్చే మిత్రులతో నిజాం నవాబును ఎదుర్కొనే పధకాలను చర్చించాడు. అక్కడి నుండి గారేపల్లి, మణుగురు మీదుగా భద్రాచలం వెళ్లి శ్రీరామచంద్రుల దర్శనం చేసుకున్నాడు. ఆ రాత్రికి అక్కడే ఉన్నాడు. అక్కడినుంచి లక్కవరం, మారేడుపల్లి మీదుగా మంప గ్రామం చేరుకున్నాడు. మంపగ్రామ మునసుబును కలుసుకుని సర్దాపూర్‌ ‌నుండి వచ్చినట్లు చెప్పాడు. తను వచ్చిన విషయం గంటం దొరకు తెలియ జేయాలని మునసుబును కోరాడు. బంట్రోతు వెళ్లి గంటం దొరకు విషయం చెప్పాడు. అప్పటికే రాత్రయ్యింది. అర్ధరాత్రి అడవంతా నిద్రపోయేవేళకి గంటందొర నల్ల కంబళీ కప్పుకుని వచ్చాడు. ఇంట్లో దీపం వెలుతురులో చురుకైన కళ్లు. నల్లని నిగనిగలాడే స్ఫురద్రూపంతో గంటం దొర మునసుబు భీమును గుర్తుపట్టాడు. పరస్పరమూ నమస్కారాలు చేసుకొన్నారు. తన ప్రాంతంలో చేయాల్సిన విప్లవ పోరాటాలను గురించి వివరించాడు భీము. కలకత్తాలో సురేంద్రనాథ్‌ ‌బెనర్జీ చెప్పిన మాటల్ని చెప్పాడు. ఉదయాన్నే స్వామి దగ్గరకు తీసుకువెళ్తానని చెప్పాడు గంటందొర. భోజనాలు చేసాక గోండుల సాంప్రదాయాల గురించీ, తెలంగాణా జీవన పరిస్థితుల గురించీ, దేశంలో గిరిజనుల దైన్యస్థితినీ ఇద్దరూ చర్చించుకున్నారు. గంటం దొర స్వామి తెల్లదొరలతో పోరాడుతున్న విధానాన్ని వివరించాడు. మాట్లాడుకుం టూనే ఇద్దరూ నిద్రపోయారు.

తెల్లవారీ వారక ముందే ఇద్దరూ లేచి కాలకృత్యాలు తీర్చుకున్నారు. నిప్పుల్లో కాల్చిన కర్రపెండలం దుంపలు తిన్నారు. అమావాస్య రోజులు కావడంతో ఇంకా చీకటిగానే ఉంది. కోడికూత జాముకు ముందుగానే ఇద్దరూ అడవిలోకి వెళ్లిపోయారు. దట్టమైన కీకారణ్యం మధ్యనుండి ఫర్లాంగు దూరం వెళ్లాక దారి తెలియని బాట. చెట్లకు ఉన్న గుర్తులను చూస్తూ ముందుకు సాగుతున్నాడు గంటం దొర. భీము అనుసరిస్తున్నాడు. పూర్తిగా తెల్లవారింది. సూర్యుడు పూర్ణబింబంతో లోకాన్ని చూస్తున్నాడు.

రెండు తాటి చెట్లలున్న కొండలాంటి ప్రదేశం కనిపించింది. దానికి ఉత్తర దిక్కున రాళ్లు పోగుపడి ఉన్నాయి. ఒక్కో రాయీ గజమూ, గజమున్నర కై వారంతో నునుపుదేరి ఉన్నాయి. గంటందొర తన వెంట తెచ్చిన ఎర్రని గుడ్డను ఆ రాళ్ల మధ్యనున్న ఖాళీలోకి విసిరాడు. కొద్దిక్షణాల్లో గుహ లోపల్నుండి గంట శబ్దం వినిపించింది. గంటం దొర మూడుసార్లు రాయి మీద కర్రతో కొట్టాడు. లోపలి రాయి నెమ్మదిగా పక్కకు కదిలింది. వెలుగుతున్న కాగడాల కాంతి రాళ్ల మధ్య నుండి బైటికొచ్చింది.

పాలిగాడుతో కలిసి ‘‘దొరా! ఈయనెవరు’’ అంటూ భీము వైపు అనుమానంగా చూసాడు. ‘‘కొమరం భీమనీ, నైజాం ప్రాంతం నుండి వచ్చారు. స్వామిని కలవడానికి.’’ ముగ్గురూ లోపలకి నడిచారు.

గుహ లోపల మధ్యలో చిన్న కోనేరుంది.

ఆ పక్కనే రాయి కాషాయరంగు పంచె, ఉత్తరీయమూ నుదుట బొట్టూ ధరించిన పాతికేళ్ల యువకుడు. వెలుగుతున్న కాగడా కాంతి నీటిపై పడి దేదీప్యమానంగా మెరుస్తున్నాడు. కళ్లు మూసుకుని ప్రశాంతవదనంతో ధ్యానంలో ఉన్నాడు.

గంటం దొర భీముకు చెప్పాడు ‘‘ఆయనే స్వామి’’ అని. ‘‘స్వామి’’ అని పిలిచాడు గంటందొర. స్వామి కళ్లు తెరిచాడు. భీము వేపు తిరిగి ‘ఎవరు’ అన్నట్టు చూసాడు స్వామి.

‘‘భీమనీ గోండు యువకుడు ఆదిలాబాద్‌ అడవుల్లోని సంకేపల్లిలో ఉంటాడు. వ్యవసాయం చేసుకుంటున్న భీమూ తండ్రి చిన్నూని ఫారెస్టు డిపార్ట్‌మెంటు వాళ్లు చంపేసారు. 17-18 ఏళ్ల వయసులో జరిగిన ఈ సంఘటనతో కుటుంబం సర్దాపూరు వలస వెళ్లిపోయింది. అడవినే నమ్ముకుని బతుకుతున్న చిన్నూ కుటుంబం పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతుంది.’’

నిశ్శబ్దంగా విన్న శ్రీరామరాజు భీమువైపు తిరిగి పక్కనున్న రాయి మీద కూర్చోమని చూపాడు. భీము ఆ రాయి మీద కూర్చున్నాక గంటందొర మరో రాయి మీద కూర్చున్నాడు.

శ్రీరామరాజు ‘‘ఇపుడు నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నావు కదా! మరి విప్లవం బాట పట్టడానికి కారణమేంటి? భీమూ! విప్లవం సమస్తాన్నీ వదిలిపెట్టి చేయాల్సిన యజ్ఞం లాంటిది.’’

‘‘అవును స్వామీ! మీరు చెప్పింది నిజమే! కానీ వ్యవసాయం చేసుకుంటూ మా మానాన మేము బతుకుతుంటే మేము సాగు చేసుకున్న పొలాన్ని ఆక్రమించు కున్నారు. ఆ భూమికి వేరే వాళ్లు పట్టాదారులుగా ఉన్నారు. మా భూమిని కూడా సిద్దిఖీ అనే జమీందారు లాక్కోడానికి ప్రయత్నించాడు. అది తట్టుకోలేక నేను కర్రతో అతని తల పగలగొట్టాను. ఆ సిద్దిఖీ అక్కడిడకక్కడే చనిపోయాడు. అతను ఆసఫ్‌ ‌జహీ రాజవాసానికి చెందినవాడు’’.

శ్రీరామరాజు ‘‘ఆసఫ్‌జహీ రాజవాసం ఏంటి’’ అని అడిగాడు.

‘‘స్వామి! ఢిల్లీ పాదుషా ఔరంగజేబు ఆసఫ్‌ ‌జహీని దక్కనుకు సుబేదారుగా నియమించాడట. ఆ తర్వాత కొన్నాళ్లకి తనకు తానుగా స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుని అసఫ్‌ ‌జహీ వంశరాజ్యాన్ని నెలకొల్పాడట. ఆ వంశం వాళ్లే నిజాం ప్రాంతాన్ని పాలిస్తున్నారు. అలాంటి రాజవంశాన్ని ఎదుర్కోవడం సామాన్య గిరిజనులకు కష్టంగా ఉంది. స్వామీ! రాను రాను వాళ్ల పెత్తనం ఎక్కువైంది. గిరిజనులు కేవలం కూలీలుగానే ఉండిపోతున్నారు. ఎదురు తిరిగిన వాళ్ల మీద కేసులు పెడుతున్నారు. స్వామీ! అలాంటి వంశానికి చెందిన సిద్ధిఖీని చంపితే వాళ్లు ఊరుకుంటారా? అందుకే మరాఠ్యాడాకు పారిపోయాను. అక్కడ బల్లార్లా నుండి అస్సాపం వెళ్లి తేయాకు తోటల్లో కూలీపని చేయడం మొదలు పెట్టాను అక్కడే బైటి ప్రపంచాన్ని చూసాను. ఉర్దూ, మరాఠీ లాంటి కొత్త కొత్త భాషలు నేర్చుకున్నాను. కొత్త కొత్త పంటలు పండించడం నేర్చుకున్నాను స్వామి! కానీ ఎప్పటికైనా ఆసఫ్‌ ‌జహీ రాజవాసపు అరాచకాలను ఆపాలి. దానికోసమే పోరాడుతున్నాను స్వామి!’’ చెప్పాడు భీము.

శ్రీరామరాజు చాలాసేపటి వరకూ మాట్లాడలేదు. గుహంతా నిశ్శబ్దం అలుముకుంది. శ్రీ రామరాజు పైకి లేచాడు. వెంటనే భీమూ లేచాడు. గంటందొర వాళ్లను అనుసరించాడు.

శ్రీరామరాజు భీమువేపు తిరిగి భీమూ! ‘‘నీ పోరాటం చరిత్రలో నిలిచిపోయేది. చిన్న చిన్న సంఘటనల్లోంచే మహా ఉద్యమాలు పుట్టుకొస్తాయి. లక్షలాది మందికి ఆదర్శమవుతాయి. ఆచరణీయ మవుతాయి. అయితే ఈ దేశం పోరాటాలకు ఇంకా సిద్ధం కాలేదు. నీ ప్రాంతానికి శత్రువైన నిజాం ఆసఫ్‌ ‌జహీనిగానీ, దేశాన్ని కబళించిన ఈస్టిండియా కంపెనీగానీ ఎదుర్కొనే శక్తి ఈ దేశ ప్రజలకు పూర్తిస్థాయిలో లేదు.ఇక్కడి గిరిజన ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. మన్యంలో ప్రజలు విద్యావంతులు కావాలి. వాళ్ల హక్కుల్ని వాళ్లు తెలుసుకోగలగాలి. నేనిక్కడ అదే ప్రయత్నం చేస్తున్నాను భీమూ!’’ అన్నాడు.

‘‘కానీ స్వామీ! తిరుగుబాటు జరిగితేనే కదా, వాళ్లకూ భయం కలిగేది. కాస్తంతైనా తగ్గుతారు’’ అన్నాడు భీము.

‘‘అవును నిజమే! మనకు కావాల్సింది. వాళ్లకు భయం కలిగించడం మాత్రమే కాదు. సంపూర్ణ స్వాతంత్య్రాన్ని సంపాదించడం. దానికి తగ్గ ప్రయత్నాలు చేయాలి. అందుకోసం మనకు ఆయుధాలు కావాలి. కనుక మేమిక్కడ పోలీస్‌ ‌స్టేషన్ల మీద దాడి చేస్తున్నాము. అక్కడి నుండి తుపాకులు, తూటాలు పట్టుకెళ్తున్నాము. మేము చేసేది దోపిడీ కాదు కాబట్టి పట్టుకువెళుతున్న ఆయుధాల వివరాలు రిజిష్టర్లో రాస్తున్నాము. కానీ మీ ప్రాంతపు పరిస్థితి వేరు. మీ పోరు వేరుగా ఉంటుంది. గెరిల్లా పద్ధతి ద్వారా విప్లవ పోరాటాలు చేయడం ద్వారా తక్కువ ఆయుధాలతో శత్రువులతో పోరాడే అవకాశ ముంటుంది’’ అని శ్రీరామరాజు కోనేరు దగ్గరకి వెళ్లి కిందకు వంగి నీటితో ముఖాన్ని కడుక్కున్నాడు. పైకిలేచి గంటం దొర వేపు తిరిగి ‘‘గంటం దొరా! మనం రేపు అన్నవరం పోలీస్‌ ‌స్టేషను మీద దాడి చెయ్యా లనుకున్నాం. అంతా సిద్ధమేనా’’ అడిగాడు.

‘‘చిత్తం స్వామి! అంతా సిద్ధం. అన్నవరం చుట్టుపక్కల నుండి కొంతమంది కుర్రోళ్లు కూడా తోడువస్తామని కబురు పంపారు. చుట్టూ పక్కల ఊళ్ల నుండి చాలామంది తమ రాకకోసం ఎదురు చూస్తున్నారు స్వామి! రేపు ఉదయానికి మనం అన్నవరం చేరుకోవాలి స్వామీ’’ అన్నాడు గంటం దొర

‘‘అయితే ఉదయాన్నే అక్కడ ఉండేలా బయలు దేరాలి.’’ అన్నాడు శ్రీరామరాజు.

భీమును ఉద్దేశించి ‘‘భీమూ నవ్వు కూడా మాతో రా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుందువుగాని’’ అన్నాడు. ‘‘అలాగే స్వామి’’ బదులిచ్చాడు.

శ్రీరామరాజుతో సహా గంటం దొర మరో ఇరవై మంది అడవీ మార్గం గుండా అన్నవరానికి చేరుకున్నారు. వాళ్లను అనుసరిస్తూనే భీము కూడా దారి పొడుగునా భీముకు ఏ అసౌకర్యం కలగకుండా చూస్తున్నాడు శ్రీరామరాజు. మధ్యమధ్యలో ఎదురవుతున్న గ్రామాల ప్రజలు పూజా సామాగ్రితో శ్రీరామరాజును ఆరాధిస్తున్నారు. దారిలో ఎదురైన వ్యక్తులకు భీమును చూపించి ‘‘ఈయన నిజాం ప్రాంతంలో మహాధీరుడు’’ అని పరిచయం చేస్తుంటే భీమును కూడా ప్రజలు అఖండ మర్యాదతో గౌరవిస్తున్నాడు. భీము ఈ ప్రాంతంలో తనకు లభిస్తున్న గౌరవానికి ముగ్ధుడయ్యాడు.

అల్లంత దూరంలో అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ కనిపిస్తుంది. అందరూ దణ్ణాలు పెట్టుకున్నారు. కానీ అక్కడ గుడి ఉన్న అనవాళ్లేమీ లేదు. పెద్దగా జనసంచారమూ లేదు. చిన్న గ్రామం. వంద గడపలుంటాయేమో! అందరూ గుడి దగ్గరకు వచ్చారు. బావంచాల దగ్గర విశ్రాంతి తీసుకున్నారు. కాసేపయ్యాక శ్రీరామరాజు ‘‘భీమూ! మేము పోలీస్‌ ‌స్టేషన్‌కు వెళ్తాం. నువ్విక్కడే ఉండు. నీతో మా వాళ్లు కొందరు ఉంటారు’’ అన్నాడు.

‘‘నేనూ మీతో వస్తాను స్వామీ!’’ అన్నాడు భీము.

‘‘వద్దు భీమూ ఈ ప్రాంతం నీకు కొత్త. నీకు మాకూ మంచిది కాదు. ఇక్కడే ఉండు’’ అన్నాడు.

‘‘అలాగే స్వామి’’ అంగీకరించాడు స్వామి. వెళ్లిన అరగంటలోనే తిరిగి వచ్చారు. శ్రీ రామరాజు, అతని అనుచరులు ‘‘పోలీసులు లొంగిపోయారు. కానీ స్టేషన్లో ఆయుధాలేమీ లేవు. పదండి కొండమీదకెళ్లి సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని వద్దాము’’ అని భీమూనూ తన అనుచరులతో కలిసి కొండమీదకు తీసుకెళ్లాడు. మెట్లదారి పొడుగునా ప్రజలు ఆయనకు నీరాజనాలందించారు.

భక్తులూ, పరిసర గ్రామాల ప్రజలు ఆలయ పూజారులు శ్రీరామరాజుకీ, అతని పరివారానికి ఆలయంలోకి ఘనస్వాగతం పలికారు. పురోహితులు శ్రీరామరాజును కూర్చోపెట్టి సత్యన్నారాయణ స్వామి వ్రతం చేయించారు. ఎర్రగోధుమ నూకతో చేసిన ప్రసాదం ఇచ్చారు. అవి తీసుకుని అందరూ కొండ దిగారు. ప్రసాదాన్ని విస్తరాకుల్లో చుట్టి భీముకిచ్చాడు. శ్రీరామరాజు వాటిని కళ్లకద్దుకుని తీసుకున్నాడు. వెంట తెచ్చుకున్న సంచిలో దాచుకున్నాడు. అప్పటికే అక్కడికి ఆంధ్రపత్రిక, హిందూ పత్రికల విలేకర్లు వచ్చారు. చెరుకూరి నర్సింహమూర్తి అనే ఆంధ్రపత్రిక విలేఖరి శ్రీరామరాజు ఇంటర్వ్యూ తీసుకున్నాడు.

అదే సారాంశాన్ని ది హిందూ విలేకరి ఇంగ్లీషులోకి తర్జుమా చేనుకున్నాడు. ఉదయం పదయ్యింది. విలేఖర్లు వెళ్లిపోయాక, అందరూ శంఖవరం బయల్దేరి వెళ్లారు. అక్కడి ప్రజలు రాజును భక్తిప్రపత్తులతో ఆదరించారు. కానీ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా రాజును ఆ గ్రామ ప్రజలు ఆదరించిన విషయం తెలుసుకున్న కలెక్టర్‌ ‌జె.ఆర్‌. ‌హెగెన్స్ అన్నవరం వచ్చి ఆ గ్రామానికి నాలుగు వేల రూపాయలు జరిమానా విధించారు. విషయం తెలుసుకున్న శ్రీరామరాజు ‘‘నేను సాయంత్రం ఆరు గంటల వరకూ శంఖవరంలో ఉంటాను. నన్ను కలవ వలసిందని’’ కలెక్టరుకు మిరపకాయ టపా పంపాడు. మర్నాడు వరకూ కలెక్టరు శ్రీరామరాజు దగ్గరకు వచ్చే సాహసం చేయలేకపోయాడు.

శ్రీరామరాజు మరునాడు ఉదయాన్నే తన అనుచరులతో తిరిగి తన స్థావరానికి బయలుదేరాడు. వాళ్లతో కలిసి భీమూ బయల్దేరడానికి సిద్ధమవుతూ ‘‘స్వామి! నేను మా ఊరు బయల్దేరుతాను. మిమ్మల్ని కలుసుకోవడం నా జీవితంలో మరచిపోలేని సంఘటన. మీతో కలిసి చేసిన ఈ ప్రయాణం ఆసఫ్‌జహీ రాజువాసమ్మీద నేను చేయబోయే పోరాటానికి మరింత బలాన్నిస్తుంది’’ అంటూ శ్రీరామరాజు కాళ్లకు నమస్కరించబోయాడు.

శ్రీరామరాజును అతన్ని పైకిలేపి ‘‘ఈ ప్రాంతంలో నేనెంతో, మీ ప్రాంతంలో నువ్వు అంతే! మనిద్దరమూ ఒకే విధమైన పోరాటం చేస్తున్న వాళ్లం. నువ్వు నాకు సోదరునివి’’ అని గుండెలకు హత్తుకున్నాడు.

భీము కళ్లవెంట నీళ్లు కారసాగాయి. ‘‘కానీ స్వామీ తమరు అనుభవంలోనూ, వయసులోనూ పెద్దవారు. నా వంటి తరువాత తరం వాళ్లకి మార్గదర్శకులు’’ అన్నాడు భీము.

తన వెంట ఉన్న అనుచరులతో పంపిస్తే భీముకు ప్రమాదమని కిర్లంపూడి గ్రామానికి చెందిన శ్రీశైలపు సత్యమాచారినిచ్చి రైల్వే స్టేషనుకు పంపించాడు. హైదరాబాద్‌ ‌వేపు వెళ్లే ఏదో ఒక రైలు ఎక్కించమని చెప్పాడు. సత్యమాచారి భీమును తీసుకువెళ్తుంటే కొంతదూరం వెళ్లి స్వామిని వెనక్కి తిరిగి తనివిదీరా చూస్తూ ముందుకు కదిలాడు భీము. వాళ్లు వెళ్లిన కాసేపటికి రైలు వచ్చింది. ఎక్కి కూర్చున్నాడు. అతనికి నమస్కారం పెట్టి సత్యమాచారి వెనక్కి వెళ్లిపోయాడు. భీము కిటికీలోంచి బైటికి చూస్తుంటే అన్నవరం మీసాలదేవుడు సత్యనారాయణ స్వామి కొండ కనిపిస్తుంది.

‘‘ఇకపై అన్నవరం అంటే సత్యనారాయణ స్వామి కాదు మన్నెం వీరుడు అల్లూరి శ్రీరామరాజు గుర్తుకు వస్తాడు’’ అని మనసులో అనుకున్నాడు భీము.

By editor

Twitter
Instagram