సమీప గతాన్ని కూడా పరిశీలించే తీరిక లేదు. పరిశీలించినా వాస్తవాలు చెప్పాలన్న సత్య నిష్ట అసలే లేదు. ఇదే ఇవాళ్టి కొందరు మేధావులు, మీడియా పెద్దలలో కనిపిస్తున్న సహజ లక్షణం. మే రెండో తేదీన వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విశ్లేషణలు ఈ విషయాన్ని మరొకసారి తిరుగులేకుండా నిరూపించాయి. భారతీయ జనతా పార్టీ పతనానికి పశ్చిమ బెంగాల్‌ ‌ఫలితాలు నాంది పలికాయని దాదాపు ఏకగ్రీవంగా ఫలితాల విశ్లేషణలు ఘోషించాయి. వచ్చే సంవత్సరం ఆరంభంలో జరిగే ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మీద ఈ ఐదు రాష్ట్రాల ప్రభావం పడి బీజేపీ పతనాన్ని రూఢీ చేస్తాయని ఆగమేఘాల మీద తేల్చి చెప్పడం దీనికి కొసమెరుపు. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ భారతదేశంలో బీజేపీ ప్రాబల్యాన్ని ప్రశ్నించే స్థాయిలో ఆ ఫలితాలు లేవు. ఇంత వీరంగం వేయకుండా మీడియా కాస్త సంయమనంతో వ్యవహరించి ఉంటే అది అర్ధమవుతుంది.

1980లో దేశ రాజకీయాలలోకి ఒక కొత్త గాలిని తీసుకువచ్చిన బీజేపీ కేవలం ఎన్నికలు, దానితో వచ్చే అధికారం కోసమే కొనసాగుతున్న వృత్తి రాజకీయవేత్తల ముఠా కాదు. కుటుంబ పార్టీ అసలే కాదు. చిన్నదైనా పెద్దదైనా ఎన్నికను సవాలుగా తీసుకోవడం, వాటి ఫలితంతో దక్కే అధికారం బీజేపీ లక్ష్య సాధనలో భాగమే. ఇది ఈ దేశంలో ఉన్న చాలామందికి అంత త్వరగా అర్ధం కాదు. 1984లో బీజేపీకి లోక్‌సభలో ఉన్న బలం కేవలం 2. ఆ బలం 1989లో 89కి చేరింది. 1990 దశకంలో పార్టీ ఎన్నో ఎగుడుదిగుళ్లు చూసింది. అటల్‌ ‌బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అడ్వాణి వంటి ఉద్దండుల నాయకత్వంలోనే ఆ ఆటుపోట్లు తగిలాయి. ఆరేళ్లు అధికారంలో ఉంది. అది కూడా సంచలనమే. దేశ ప్రజల ఆలోచనలలో గుణాత్మకమైన మార్పును తెచ్చిన కాలమది. ఆ వైఫల్యాలూ, కుహనా లౌకకవాదుల దాడులూ, మీడియా దుష్ప్రచారం, పార్టీ నాయకత్వం లోని ఎన్‌డిఏ భాగస్వాముల వెన్నుపోట్లు తలుకు చుంటూ కూర్చుంటే పార్టీ నిరాశలో కూరుకుపోయి ఉండేది. కార్యకర్తలు చెల్లాచెదురైపోయి ఉండాలి. కానీ 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో కమలం 282 స్థానాలు గెలిచింది. 2019లో మోదీ నాయకత్వంలోనే 302 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రపంచ రాజకీయాల మీద బీజేపీ ముద్ర వేసింది. మోదీ రాకకు ముందు బీజేపీ ఏడు రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అవి నెమ్మదిగా 21కి చేరాయి. మళ్లీ ఇప్పుడు 17కు చేరాయి. ఈ ప్రయాణంలో కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు తప్ప దేశంలోని చాలా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు బీజేపీతో ఏదో ఒకకాలంలో, ఎంతో కొంత కాలం కలసి ప్రయాణించి నవే. బీజేపీ ఏ పార్టీనీ అంటరానిదిగా చూడలేదు. చిత్రంగా కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీలు భారత రాజకీయ చిత్రపటం నుంచి నిష్క్రమించడానికి తొందరపడుతున్నాయి. బీజేపీ మాత్రం అప్రతి హతంగా సాగుతోంది. ఈ నేపథ్యం నుంచి ఐదు రాష్ట్రాల ఫలితాలను పరిశీలించడానికి ప్రయత్నిం చాలి. పశ్చిమ బెంగాల్‌, ‌తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి (కేంద్ర పాలిత ప్రాంతం)లలో ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడినా, మిగిలిన నాలుగు వేరు.పశ్చిమ బెంగాల్‌ ‌వేరు.

పశ్చిమ బెంగాల్‌

‌పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌సాధించిన విజయాన్ని తక్కువ అంచనా వేయడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. 292 స్థానాలలో ఎన్నికలు జరగగా, అందులో 213 స్థానాలు ఆ పార్టీ గెలవడం పెద్ద విజయమే. కానీ ఆ పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ ఓటమిని తక్కువ చేసి చూపడానికి శతథా ప్రయత్నిస్తున్న మేధావులు, మీడియా సంస్థలు దేశం నిండా కనిపిస్తున్నాయి. బీజేపీని వ్యతిరేకించే ప్రతి రాజకీయ నాయకుడు చేస్తున్న పని ఇదే కూడా. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో బీజేపీ ఎదుగుదల, 1984-1989 మధ్య లోక్‌సభలో బీజేపీ వృద్ధి దగ్గరగా కనిపిస్తాయి. 2016లో బెంగాల్‌ అసెంబ్లీలో బీజేపీకి ఉన్న స్థానాలు మూడు. 2019 నాటి లోక్‌సభ ఎన్నికలలో 42 స్థానాలకు గాను బీజేపీ సాధించుకున్నవి- 18. ఇవే మమతలోని దుష్టశక్తి కోరలకు పదును పెంచాయి. అప్పటిదాకా ప్రత్యర్థుల పట్ల హింసాకాండను సాగించడంలో మార్క్సిస్టులను మార్గదర్శకంగా తీసుకున్న తృణమూల్‌ ‌నేత అప్పటి నుంచి నాజీల శైలికి మారారు. 2016 నాటి ఎన్నికలలో మూడు స్థానాలు గెలిచిన బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికలలో 77 స్థానాలు చేజిక్కించు కుంది. 2019 ఎన్నికలలో బీజేపీకి వచ్చిన ఓట్లు దాదాపు 40 శాతం. ఈ అసెంబ్లీ ఎన్నికలలో తగ్గినవి అందులో రెండు శాతం కంటే తక్కువ. అంటే 38.9 శాతం బీజేపీకి వచ్చాయి. తృణమూల్‌ ‌సాధించిన ఓట్ల శాతం 47.97 శాతం. సీట్ల సంఖ్యతో చూస్తే బీజేపీ వెనుకబడి ఉన్న మాట నిజమే. కానీ ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే దాని స్థానం ఎంత పదిలంగా ఉన్నదో కూడా అర్ధంకావాలి. దాదాపు ఎనిమిది శాతం ఓట్ల తేడాయే 137 స్థానాల తలరాత మార్చింది. ఇది విడమరచి చెప్పడానికి ఒక వర్గం మీడియాకు నోరు రావడం లేదు. బీజేపీ గెలుపుకోసం ప్రధాని, హోంమంత్రి 38 ర్యాలీలలో ప్రసంగించా రని, పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రులు అక్కడే ఉండి ప్రచారం చేశారని విమర్శిస్తున్నవారు కనిపిస్తున్నారు. నిజానికి దుష్ప్రచారం ద్వారా బీజేపీని ఒంటరిని చేయడానికీ, ఎలాగైనా ఓడించడానికీ జరిగిన ప్రయత్నాలతో పోల్చిచూస్తే రాజమార్గంలో వారు చేసిన ప్రచారం మరీ తీవ్రమైనదేమీ కాదు.

మమత, ఆమె అనుచరులు, బీజేపీ వ్యతిరేక ప్రచారకులు ఎన్నికల ముందువరకు చేసిన యాగీలోని అంశా సంగతి ఎలా ఉన్నా, అవి బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేశాయా? పుల్వామా దాడి సహా,తరువాత మోదీ తీసుకున్న అన్ని అంశాలను మమత విమర్శించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీని రాష్ట్రంలో ప్రవేశించబోనీయనని శపథం చేశారు. వ్యవసాయ సంస్కరణల కోసం తెచ్చిన మూడు చట్టాలను అమలు చేయనని కూడా చెప్పారు. ఇవేమీ ఎన్నికల ప్రచారాంశాలు కాలేదు. అందుకే కదా, ‘బయటివారు’ రాగం అందుకున్నారామె. జాతీయవాదంతో వస్తున్న బీజేపీని మమత ఉప జాతీయవాదం ద్వారా ‘ఇప్పటికి’ నిలువరించగలిగారట. ఉప జాతీయవాదం అంటే ప్రాంతీయవాదమనడానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటుందా? రోహింగ్యాలు, బంగ్లా చొరబాటుదారులు ఈమెకు బయటివారు కారు. ఆత్మీయులు. తన అధికారాన్ని సవాలు చేసే స్థాయిలో ఉన్న బీజేపీ మాత్రమే బయటివారిది. సౌగతారాయ్‌ (‌టీఎంసి ఎంపి) వంటి నాయకులు అదే తెంపరితనం ప్రదర్శిస్తున్నారు. సౌగతారాయ్‌ అయితే బెంగాల్‌ అస్తిత్వం పేరుతో వేర్పాటువాద అభిప్రాయాలు దేశం మీదకు వదులుతున్నారు. ఔట్‌సైడర్‌ అన్నమాటను ప్రయోగిస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికలలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌బయటివారు ఎలా కాకుండా పోతారో మాత్రం తెలియడం లేదు. ఈ పదేళ్ల కాలంలో మమత రాజకీయ ప్రత్యర్థుల మీద సాగించిన హింసాకాండ, ఆ పార్టీ కార్యకర్తలు చేసిన హత్యలు, పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్‌ ఎన్నికల వరకు చేసిన అకృత్యాలు అన్నీ కూడా ఆమెలోని బీజేపీ వ్యతిరేకత అనే ఒక్క లక్షణంతో దేశమంతా ఆమోదించాలని మేధావుల అభిప్రాయంగా కనిపిస్తున్నది. కట్‌మనీ, శారద చిట్‌ఫండ్స్ అ‌క్రమాలు.. ఒక్కటేమిటి! బీజేపీ బూచిని చూపి జనాన్ని మరచిపోయేటట్టు చేయాలని చూస్తున్నారు. తృణమూల్‌ ‌పార్టీ మీద బీజేపీ నేతలంతా అనేక అవినీతి ఆరోపణలు చేశారు. చిత్రంగా బీజేపీ మీద మమత ‘బయటివారు’ మంత్రం తప్ప తిరిగి ఒక్క అవినీతి ఆరోపణ చేయలేక పోయారు.

 మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల గురించి కూడా ఏ ఒక్క మీడియా ప్రశ్నించడం లేదు. అసలు ఆ ధోరణిలోని ప్రమాదాన్ని గుర్తించడానికి కూడా మీడియా సిద్ధంగా లేదు. సరిహద్దు రాష్ట్రంలో ఇలాంటి పోకడ దేశ భద్రతకు ఎంత ముప్పో వీరికి అవసరం లేదు. మమతకు ఎన్నిక కావడం ముఖ్యం. ఒక వర్గం మీడియాకు బీజేపీ ఓటమి ముఖ్యం. ఇద్దరు కలసి దేశ భద్రతను పరిగణనలోనికి తీసుకోవడం లేదు. ముస్లిం నేతలు మజ్లిస్‌ ఒవైసీనీ, ఫిర్జాది అబ్బాస్‌ ‌సిద్దికినీ ముందునుంచి విమర్శిస్తున్న మమత మొత్తం ముస్లిం ఓట్లను తనవైపు తిప్పుకున్నారు. చీలిపోకుండా జాగ్రత్త పడ్డారు. ముస్లింలంతా తనకే ఓటు వేసి గెలిపించాలని ఆమె బాహాటంగానే పిలుపునిచ్చారు. దీని మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ముస్లింలందరినీ ఎరలు చూపించి ఏకం చేస్తున్న మమత హిందూత్వం గురించి, రాముని గురించి, జైశ్రీరాం అని పలకడం గురించి మండిపడడం తెంపరితనం. ఈ ఎన్నికలలో నిజానికి ఏకమైనది ముస్లింలే. కానీ హిందువులు తమ విశ్వాసాల ఆధారంగా ఓటు వేయలేదు. దేశ ఐక్యత, మెజారిటీల విశ్వాసాలను గౌరవించని మత పెద్దల నాయకత్వంలో ఉండే ముస్లింలను ఏకం చేస్తుంటే కనిపించని తప్పు, మత సామరస్యం కలిగిన హిందువులను ఏకం చేస్తే తప్పు ఎందుకు అవుతుందో కనీసం ప్రశ్నించుకోవడం మీడియాకు సాధ్యం కావడం లేదు.

బీజేపీ పడిన శ్రమను పార్టీ వ్యతిరేకులు కూడా అంగీకరిస్తున్నారు. కానీ కొన్ని లోపాలు జరిగిన మాట నిజం. బరిలో దిగిన ఎంపీలలో ఎక్కువ మంది ఓడిపోయారు. బెంగాల్‌ ఆత్మగౌరవం అంటూ మమత చేసిన వాదనలోని అసంబద్ధతను బీజేపీ గుర్తించకుండా, సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిందనిపిస్తుంది. మమత ముస్లిం బుజ్జగింపు ధోరణి, అందులోని ప్రమాదాన్ని గురించి బెంగాలీ హిందువులను బయటపడేయడంలో బీజేపీ విజయవంతం కాలేదనే అనిపిస్తుంది. కానీ బీజేపీ వెనుకంజకు మీడియా చూపుతున్న కారణాలు చాలావరకు పనికిమాలినవి.

ఒకటి వాస్తవం. ఈ మందబలం చూసుకుని మమత, ఆమె పార్టీ బీజేపీ కార్యకర్తల మీద దాడులు పెంచడం తథ్యం. భవిష్యత్తు ఈ మూకలను భయపెడుతూనే ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెలువడుతాయనగానే ఆరాంఘర్‌ అనేచోట ఆ పార్టీ అభ్యర్థి ఓడి, బీజేపీ అభ్యర్థి గెలవగానే తృణమూల్‌ ‌మూకలు బీజేపీ కార్యాలయాన్ని దగ్ధం చేశాయి. మమత మాటలు, ఆమె పార్టీ ఎంపీలు, నాయకుల మాటలను బట్టి ఈ అంచనాకు రాక తప్పదు. ఆమె ఏమీ మారలేదు. ఇక ఆమె పార్టీ శ్రేణులు మారే అవకాశం ఎక్కడ?

మమత ఓడిపోతున్నా శరద్‌పవార్‌, ‌లాలూ ప్రసాద్‌, ‌కేజ్రీవాల్‌, అఖిలేశ్‌ ‌యాదవ్‌, ‌మాయావతి, శివసేన నాయకుడు సంజయ్‌ ‌రౌత్‌ ‌పెద్ద విశేషణాలతో ఆమెకు శుభాకాంక్షలు తెలియచేయడం మరీ వికృతం. ఆమె భవిష్యత్తులో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందని ఇప్పటి నుంచి కలలు కంటున్నారు. అసలు రాజకీయాలో పునరేకీకరణ జరిగిపోవచ్చునంటూ ఇంకొందరు విశ్లేషకులు తొందరపడి ముందే కూశారు కూడా. బెంగాల్‌ ఇవాళ ఏమి ఆలోచించిందో, రేపు భారత్‌ అదే ఆలోచిస్తుందన్న పాత పాటకు ఎప్పుడో కాలం చెల్లింది. ఆ లెక్కన సీపీఎం ఈ దేశాన్ని ఏలాలి. అది అక్కడే కాలధర్మం చెందింది. మమత పాలనను భారత్‌ అం‌తా కోరుకుంటుందన్న మాట మరీ అర్ధరహితంగా కనిపిస్తుంది. కానీ, ఓటమిని మమత తేలికగా తీసుకుంటారని అనుకోలేం. ఆ సంగతి కనిపించనీయకుండా ఈ కళ్లూ కాళ్లూ పనిచేయని మూలపడ్డ నేతల కోరిక మేరకు జాతీయ రాజకీయ రంగం మీదకు, బీజేపీ మీద పోరాటానికి సిద్ధపడు తున్నట్టు ప్రకటించేశారు. ఆ సంగతి విలేకరులకే చెప్పారు. ‘నా మొదటి ప్రాధాన్యం కరోనా కట్టడి. దేశమంతటికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలి. నా డిమాండ్‌ను నెరవేర్చకపోతే గాంధీ విగ్రహం ముందు ధర్ణా చేస్తాను!’ బాగానే ఉంది. అక్కడితో ఆగితే ఆమెను మమతా బెనర్జీ అనలేం. ఈ ప్రజాహిత ప్రకటన లాంఛనం కాస్తా పూర్తయ్యాక తన మనోగతం ఆవిష్కరించారు మమత, ‘నేను వీధి పోరాట యోధురాలిని. 2024 ఎన్నికల నాటికి ప్రజానీకాన్ని ఏకం చేసి ముందుకు నడిపించగలను.’ ఇది చాలు- వచ్చే ఐదేళ్లలో బెంగాల్‌ ఎలా ఉంటుందో చెప్పడానికి!

అస్సాం

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అల్లర్లతో అట్టుడికినట్టు ఉడికిన రాష్ట్రం అస్సాం. ఆనాటి అల్లర్లను చూసినవారు అక్కడ రెండోసారి బీజేపీ వస్తుందంటే నమ్మరు. కానీ సీఏఏ గాని, ఎన్‌ఆర్‌సీ గాని అసలు ఎన్నికల అంశమే కాలేదు. వాటి నేపథ్యంతో అక్కడి బీజేపీ ప్రభుత్వం మీద కనీసంగా కూడా వ్యతిరేకత కనిపించలేదు. ఇక్కడి ముస్లిం జనాభా, ఆనాడు వీధులకెక్కిన ముస్లింలు, ముస్లిం అనుకూలురు కూడా తక్కువేమీ కాదు. విదేశీయుల పేరుతో ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టడానికి కుట్రలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా తీవ్ర స్థాయిలోనే జరిగింది. అయినా ఇక్కడ ఎన్‌డీఏకు మళ్లీ జనం పట్టం కట్టారు. ఎన్‌డీఏ ప్రభుత్వం వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 74 స్థానాలతో ఎన్‌డీఏ ముందుంది. ఇందులో బీజేపీ బలం 59. అస్సాం గణపరిషత్‌ ‌సభ్యులు 9 మంది, యూపీపీఎల్‌ ‌బలం 6. కాంగ్రెస్‌ ‌నాయకత్వంలోని మహాకూటమి బలం 51. ఇందులో కాంగ్రెస్‌ ‌వాటా 30. అస్సాం అసెంబ్లీలో మొత్తం స్థానాలు 126. ఎగ్జిట్‌పోల్స్‌కు కాస్త దగ్గరగా వచ్చిన రాష్ట్రం అస్సాం. ఇక్కడ కాంగ్రెస్‌ ఓటమికి విశ్లేషకులు చెబుతున్న కారణాలు ఆలోచించేవిధంగా ఉన్నాయి. నిజానికి అస్సాంను కాంగ్రెస్‌ ‌నలభయ్‌ ఏళ్లు పాలించింది. కానీ ఈసారి ఎన్నికలలో ఆ పార్టీ ఓటమికి కారణం అంటే ఓటర్లు వేసిన శిక్షగానే భావించాలని విశ్లేషకుల అభిప్రా యంగా కనిపిస్తున్నది. ఆలిండియా యునైటెడ్‌ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌తో కాంగ్రెస్‌ ‌పార్టీ కలసి పోటీ చేయడంపై ఆ పార్టీలోనే ఏకాబి •ప్రాయం లేదు. దీనిని బద్రుద్దీన్‌ అజ్మల్‌ ‌స్థాపించారు. కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు, 2001-2016 మధ్య వరసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణ్‌ ‌గొగోయ్‌ అజ్మల్‌ను ఆమడదూరంలో ఉంచేవారు. అజ్మల్‌ ఒక అత్తరు వ్యాపారి. కానీ గడచిన నవంబర్‌ ‌తరువాత గొగోయ్‌ ‌మరణించిన తరువాత కాంగ్రెస్‌ ‌పార్టీ అజ్మల్‌కు చేరువైంది. అజ్మల్‌ ‌పూర్తిగా మతవాద రాజకీయ నాయకుడన్నదే గొగోయ్‌ ‌నిశ్చితాభిప్రాయం. ఇప్పుడైనా ఎగువ అస్సాంలో ఎన్నికల ప్రచారానికి అజ్మల్‌ను కాంగ్రెస్‌ ‌తీసుకుపోలేక పోయింది. సీఏఏ అల్లర్లకు అదే ఆనాడు ఆలవాలం. బంగ్లా ముస్లింల ఆధిపత్యాన్ని కోరుకునే అజ్మల్‌ ‌పార్టీకి సీట్లు వస్తే బంగ్లాదేశ్‌ ‌చొరబాటుదారుల చేతులలోకి అస్సాం పోతుందని అక్కడివారి భయం. దిగువ అస్సాం ముస్లిం ఓటర్లకు, కాంగ్రెస్‌లోని ముస్లిం నేతలకు కూడా అజ్మల్‌ అం‌టే పడదు. అతడి పార్టీ ఆధిపత్యం వస్తే, దిగువ అస్సాంలోని ముస్లిం ఓటు బ్యాంకు కూడా చెదిరిపోతుందని వారి అనుమానం. ఆ విధంగా అత్తరు వ్యాపారిని దగ్గరకు తీసుకుంటే, పార్టీ నిండా దుర్గంధాన్ని నింపాడు. కానీ ఈ రాష్ట్రంలోనే చిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. సీఏఏను రకరకాల కారణాలతో వ్యతిరేకించినప్పటికీ, దానిని పూర్తిగా సమర్ధించిన బీజేపీని అక్కడి మెజారిటీ ప్రజలు ఆమోదించారు. కానీ శివసాగర్‌ ‌నియోజక వర్గం నుంచి పోటీచేసిన అఖిల్‌ ‌గొగోయ్‌ ‌గెలుపొందడం వింత. అతడు సీఏఏ వ్యతిరేకోద్యమ కార్యకర్త. దేశద్రోహం కేసులో జైలులో ఉన్నాడు. అక్కడ నుంచే నామినేషన్‌ ‌వేశాడు. 85 ఏళ్ల అతడి తల్లి ప్రచారం చేశారు. రాయ్‌జోర్‌ ‌దళ్‌ అన్న పార్టీ ఇతడిదే. కాబట్టి అస్సాం కొత్త ప్రభుత్వానికి సీఏఏ వేడి మరొకసారి తగలక తప్పదు. ఎందుకంటే ఆల్‌ అస్సాం స్టూడెంట్స్ ‌యూనియన్‌ ‌సహా పలు ప్రాంతీయ పార్టీలు సీఏఏ వ్యతిరేక ఆందోళనను విడిచిపెట్టినట్టు ప్రకటించడం లేదు.

తమిళనాడు

ఇక్కడ దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకున్నట్టు పంచుకుంటు న్నాయి. అయితే 2016 ఎన్నికలలో ఈ సంప్రదా యాన్ని విస్మరించిన తమిళ ఓటర్లు వరసగా రెండో సారి అన్నా డీఎంకేకు పట్టం కట్టారు.ఆ తప్పిదాన్ని సవరించుకున్న తీరులో మళ్లీ ఈసారి డీఎంకేకు అధికారం ఇచ్చారు. అన్నాడీఎంకే దేవత జయలలిత, డీఏంకే నాస్తికదూత కె. కరుణానిధి లేకుండా జరిగిన తొలి ఎన్నిక ఇదే. కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌ ‌నేతృత్వంలో ఈసారి పార్టీ పోటీ చేసింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నది కాబట్టి అన్నాడీఎంకేను తమిళ ఓటర్లు పాతాళానికి పంపిస్తారన్న అంచనాలు తారుమారై ఈ పార్టీకి గౌరవ ప్రదమైన బలం (78) దక్కింది. 234 స్థానాలు ఉన్న తమిళ అసెంబ్లీలో డీఎంకే 156 గెలుచుకుంది. అన్నాడీఎంకేతో కలసి పోటీ చేసిన బీజేపీకి నాలుగు స్థానాలు వచ్చాయి. డీఎంకేతో కలసి పోటీ చేసిన కాంగ్రెస్‌కు 18 స్థానాలు వచ్చాయి. హేతువాదుల పార్టీగా, హిందూ వ్యతిరేక పార్టీగా పేరున్న డీఎంకేలో మరొక వారసుడు ఈ ఎన్నికలలో గెలుపొందాడు. ఆయన స్టాలిన్‌ ‌కుమారుడు ఉదయనిధి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన సినీనటుడు. చేపొక్కం-ట్రిప్లికెన్‌ ‌నుంచి నెగ్గిన ఉదయనిధికి మంత్రిమండలిలో స్థానం దక్కవచ్చునని అంచనా.

పుదుచ్చేరి

ఎన్నికల సర్వేలు చెప్పినట్టు పుదుచ్చేరిలో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ రాజకీయ వాతావరణానికి ప్రత్యేకత ఏమీ లేదు. 30 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఎన్‌డీఏ కూటమి 16 స్థానాలు గెలుచుకుంది. ఇందులో అఖిల భారత ఎన్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌కు 10, దీనితో కలసి పోటీ చేసిన బీజేపీకి 6 వంతున స్థానాలు దక్కాయి. రద్దయిన సభలో అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు కేవలం రెండు స్థానాలు వచ్చాయి. ఈ పార్టీతో కలసి పనిచేసిన డీఎంకేకు ఆరు స్థానాలు వచ్చాయి. ఇండిపెండెంట్లు ఆరుగురు నెగ్గారు.

కేరళ

తమిళనాడుకు పక్కనే ఉండే కేరళలో ఒకే విధమైన రాజకీయ సంప్రదాయం ఉంది. అక్కడ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య అధికారం బదలీ అవుతుంది. కేరళలో సీపీఎం నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్‌, ‌కాంగ్రెస్‌ ‌నాయకత్వంలోని యూడిఎఫ్‌ ‌మధ్య అధికారం దోబూచులాడుతూ ఉంటుంది. కానీ ఈసారి కేరళ వాసులు రోటీన్‌కు భిన్నంగా రెండోసారి కూడా ఎల్‌డీఎఫ్‌కు అధికారం అప్పగించారు. పినరయ్‌ ‌విజయన్‌ ‌రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపడుతున్నారు. ఇది నలభయ్‌ ఏళ్లలో వచ్చిన మార్పు. ఓటర్ల తీర్పును శిరసావహిస్తున్నప్పటికీ హిందువులను బాగా కలతపెట్టే ఫలితాలివి. లెఫ్ట్ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌కు 99 వచ్చాయి. గత సభలో కంటే మూడు ఎక్కువ. కాంగ్రెస్‌ ‌నాయకత్వంలోని యూడీఎఫ్‌కు 41 స్థానాలు మాత్రమే వచ్చాయి. రద్దయిన సభలో ఒక సభ్యుడు ఉన్న బీజేపీ ఈసారి ఆ స్థానం కూడా నిబెట్టుకోలేకపోయింది. శబరిమలై అంశం గురించి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ ‌నాయకులు కూడా పోరాడారు. కానీ ఈ రెండు పార్టీలు ఓట్లు, సీట్లు కూడా కోల్పోయాయి. అక్రమ బంగారం నిల్వల ఆరోపణలు కూడా పినరయ్‌ ‌ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఎదుర్కొన్నారు. ఈ అంశాన్ని కూడా కాంగ్రెస్‌, ‌బీజేపీ విస్తారంగా లేవనెత్తింది. అయినా ప్రజలు పట్టించుకోలేదు. మనీ లాండరింగ్‌ ‌కేసులో అరెస్టయిన ఒక యువకుడు సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి కుమారుడు. ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌ ‌కరోనాను దీటుగా ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఆ సమయంలో పంచిన కిట్లు పార్టీని మహిళలకు చేరువ చేశాయని అంచనా వేస్తున్నారు. వరదల సమయంలోను, కరోనా సమయంలోను హిందూ సంస్థలు కూడా తమ వంతు సేవ చేశాయి. అయితే ప్రచారం చేసుకోలేదు. అది నష్టమే. అలాంటి నష్టం దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా అనుభవానికి వచ్చింది. మెట్రోమెన్‌గా ప్రసిద్ధుడైన శ్రీధరన్‌ ‌కూడా ఈ ఎన్నికలలో ఓడిపోయారు. ఎల్‌డిఎఫ్‌ది పూర్తి హిందూ వ్యతిరేక వైఖరి. రాష్ట్రంలో లవ్‌ ‌జిహాద్‌ ‌తీవ్రంగా ఉంది. ఐఎస్‌ఐఎస్‌ ‌జాడలు కూడా ఉన్నాయి. వీటితో సీపీఎం పార్టీ సభ్యులకు నేరుగా పరిచయాలు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. లవ్‌ ‌జిహాద్‌ ‌గురించి ఒక్క సంఘపరివార్‌ ‌మాత్రమే కాదు, క్రైస్తవ సంస్థలు కూడా ఆరోపణలు గుప్పించాయి. అయినా గంపగుత్తగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా సీపీఎం పార్టీకి ఎందుకు ఓటు వేశాయో బీజేపీ వంటి పార్టీలు అధ్యయనం చేయడం అవసరం.

ఒక్క పుదుచ్చేరి ఫలితం తప్ప మిగిలిన నాలుగు- పశ్చిమ బెంగాల్‌, అస్సాం, తమిళనాడు, కేరళ ఫలితాలు ఒక కొత్త ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. అస్సాం, బెంగాల్‌ ‌ఫలితాలు హిందువుల ముందు చాలా ప్రశ్నలు ఉంచుతున్నాయి. బెంగాల్‌లో ముస్లిం ఓటు చీలిపోలేదు. అస్సాంలో హిందూ ఓటు ఏకీకృతమైంది. కేరళలో సెక్యులర్‌ ఓటు గల్లంతయింది. మత ప్రమేయం లేదని చెప్పే సీపీఎం ప్రధానంగా ముస్లింలు, క్రైస్తవుల ఓట్లతో, కొంతవరకు హిందువుల ఓట్లతోనే గెలిచింది. తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న ఎంకె స్టాలిన్‌ ఎన్నికలకు ముందు గుళ్లూగోపురాలకు, మఠాలకు తిరిగి ప్రచారం చేశారు. కేరళలో మళ్లీ అధికారం చేపడుతున్న పినరయ్‌ ‌విజయన్‌ ‌శబరిమలై వివాదంలో హిందువుల పట్ల చూపిన కటువైన వైఖరికి క్షమాపణలు చెప్పారు. కాబట్టి హిందూ ఓటు అనేది సెక్యులరిస్టులు, దొంగ మేధావులు చెబుతున్న విధంగా గంపగుత్తగా ఒకరికే పడుతున్నదన్న ప్రచారాన్ని నమ్మక్కరలేదు. కానీ హిందూ ఓటు బ్యాంక్‌ ‌నిర్మాణం మొదలయిందని మాత్రం చెప్పవచ్చు.


విజ్ఞత లేని విప్లవ నాయిక, వివేకం లేని వీధి పోరాట యోధ

విప్లవ నాయికగా ఏ చోటయితే ఆమెను నిలబెట్టిందో.. నాజీలను మించిపోయిన మార్క్సిస్టులను మట్టి కరిపించడానికి ఏ నేల అయితే ఆమెకు ఊపిరి పోసిందో, ఆనాడు ఏ ఓటరైతే వెన్నుతట్టి ముందుకు ఉరికించారో అదే చోట పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్య మంత్రి మమతా బెనర్జీ అత్యంత అవమానకరంగా ఓటమి పాలయ్యారు. భవిష్యత్‌ ‌దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు కావాలని ఆశపడుతున్న నాయకురాలికి ఈ ఓటమి ఎంత దుస్సహమో మీడియాకు తెలుసు. కానీ అది నిజం బయటపెట్టదు. ఆ నాయకురాలికి ఇంకా బాగా తెలుసు. ఆమె నిజం ఒప్పుకోరు. ఆ స్థలం పేరు నందిగ్రామ్‌. అది అప్పుడు మార్క్సిస్టుల అహంకారానికి సమాధి నిర్మించిన నేల. ఇప్పుడు ఎర్ర సమాధి పక్కనే మమత దురహంకారా నికీ అక్కడే సమాధి లేచింది. నందిగ్రామ్‌ ‌నియోజక వర్గంలో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమత 1,956 ఓట్ల తేడాతో పరాజయాన్ని చవిచూశారు. బీజేపీ సవాలుతోనే ఆమె అక్కడ పోటీ చేశారు. ప్రజాభిమానాన్నే కాదు, సవాలును కూడా బీజేపీ గెలిచింది. ప్రధాని నరేంద్రమోదీనీ, బీజేపీ దిగ్గజం అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలనూ నిలువరించిందంటూ చిలవలు పలవలుగా రాస్తున్న మీడియా, అలాంటి నాయకురాలినే కంగు తినిపించిన సువేందు అధికారి పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడం లేదు.

 నిజమే, మమతా బెనర్జీ సాధించిన విజయం ఘనమైనదే. పెద్ద వార్తే. కానీ ఆమె ఓటమి వార్త కూడా అంతే ప్రాధాన్యం కలిగి ఉండాలి. కానీ విలువను మీడియా ఎంత వరకు గౌరవించింది? ఆమె ఓటమి చిన్న విషయం కాదు. పార్టీ సాధించిన ఆ ఘన విజయానికి పెద్ద వెలితి. ఈ మచ్చను మసిపూసి మారేడు కాయ చేయాలని ఆమె తపన పడుతున్నారు. ఇది హుందాతనం కలిగిన నాయకురాలు చేయవలసిన పనికాదు. అయితే హుందాతనాన్ని మమత నుంచి ఆశించడం పెద్ద భ్రమ. బెంగాల్‌ ఎన్నికలలో ఏ విధంగా చూసినా బీజేపీది ఓటమి అనిపించుకోదు. బాణం గురి కాస్త తప్పింది. మమత మీద గురిపెడితే అది మార్క్సిస్టులను, వాళ్లని అంటకాగుతున్న కాంగ్రెస్‌ను జమిలిగా కూల్చింది. అంతే. 2016లో మూడు అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు 74 స్థానాలు అదనంగా సాధించింది. అంటే పశ్చిమ బెంగాల్‌ ‌శాసనసభలో బీజేపీ మొదటిసారిగా మొత్తం 77 స్థానాలతో ప్రవేశిస్తున్నది. అదే ప్రధాన ప్రతిపక్షం. నిజంగా, బీజేపీకి బీజం వంటి జనసంఘ్‌ ‌స్థాపకుడు డాక్టర్‌ ‌శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీకి తొలియత్నంలోనే బెంగాల్‌ ‌బీజేపీ ఇంత ఘనంగా నివాళి ఇవ్వగలిగిందని గుర్తించాలి.

మమతా బెనర్జీ పార్టీ గెలుపు మత్తులో తన ఓటమి తీవ్రతను, అది చెబుతున్న పాఠాన్ని కూడా గుర్తించడం లేదు. నందిగ్రామ్‌ ‌ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను అంటూనే, అది నాకు లెక్కలోనిదే కాదన్న రీతిలో వ్యాఖ్యానించారు. మొదట 1200 ఓట్లతో మమత గెలిచారని వార్తలు వచ్చాయి. నిజానికి లెక్కింపు రోజు ఉదయం పదిగంటల ప్రాంతంలోనే మమత ఎనిమిదివేల ఓట్లతో వెనుకబడి ఉన్నారు. తరువాత కొద్దిగా పుంజుకున్నారు. అంతిమంగా సువేందు గెలిచినట్టు ప్రకటన వెలువడింది. వెంటనే ఆమె, లెక్కింపులో అవినీతి అక్రమాలు జరిగాయని తనకు తెలిసిందని ఎన్నికల సంఘం మీద నింద మోపారు. ఇంత విజయంలో అలాంటి చిన్ని చిన్న త్యాగాలు చేసినా ఫర్వాలేదని పైకి చెప్పారు. ఓటమిని ఆమె హుందాగా అంగీక రిస్తుందని ఎవరూ భావించడం లేదు. అధికారం తమదేనని  భావించిన తన ప్రత్యర్థి బీజేపీని 77 స్థానాలకు పరిమితం చేసిన ఎన్నికలనీ, తనకు 213 స్థానాలు కట్టబెట్టిన ఎన్నికలనీ, వీటిని నిర్వహించిన అధికారులను ఆమె మొదటినుంచి శంకిస్తూనే ఉన్నారు. ఆఖరిఘట్టంలోనే అదే ధోరణి ప్రదర్శించారు. విజయోత్సవ సందేశంలో ఆమె చెప్పిన మాటలలోనే అది ధ్వనించింది- దురహంకారం, అంతులేని అజ్ఞానం. నందిగ్రామ్‌లో మళ్లీ కౌంటింగ్‌ ‌నిర్వహించాలంటూ ఫలితం వెలువడిన వెంటనే ముగ్గురితో కూడిన టీఎంసీ బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. అందుకు భారత ఎన్నికల కమిషన్‌ ‌నిరాకరించింది. కొన్ని చట్టవ్యతిరేక చర్యలు జరిగాయనే వినతిపత్రంలో ఆరోపించారు. అసలు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ ‌యంత్రాలతో తనకు ఘోర అన్యాయం జరిగి పోతుందని ఎన్నికల పక్రియ ప్రారంభంలోనే  మమతా బెనర్జీ దాడి ఆరంభించారు. కానీ ఆ ఈవీఎంలే ఆమెకు రెండువందలకు పైగా స్థానాలను కట్టబెట్టాయి. అలాంటి నోటి దురుసు ప్రవర్తనకు ఆమె కనీసం విచారమైనా వ్యక్తం చేయగలరా? ఆ సంస్కారమైనా ఆమె నుంచి ఆశించవచ్చా? భవిష్యత్తులో కూడా వీధి పోరాటాలనే ఆమె నమ్ముకోదలిచారు. ఇదొక గుర్తు పెట్టుకోవలసిన  పరిణామమే.

 మొగుడు కొట్టినందుకు కాదు, సవతి నవ్వినందుకు బాధ అన్నట్టు, ఎర్రతీర్థం కడుపారా పుచ్చుకున్న పాత్రికేయులు ఎల్లరూ, తమ పార్టీ ఓడిపోయినందుకు కాదు, బీజేపీ అధికారంలోకి రానందుకు బ్రహ్మానందపడుతున్నట్టు కనిపిస్తున్నది. బెంగాల్‌లో తమ పార్టీ తుడిచిపెట్టుకుపోయినా పట్టించుకోని సీపీఎం, నలభయ్‌ ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్టు వరసగా రెండోసారి కేరళలో మార్క్సిస్టులు అధికారంలోకి వచ్చినా పట్టించుకోని సీపీఎం తమ పాత కంచుకోట బెంగాల్‌లో బీజేపీ అధికారం చేపట్టలేకపోయినందుకు తృప్తి పడుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలోనే కాదు, ఆ తేదీలలోనే జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చూసినా బీజేపీ గౌరవ ప్రదమైన స్థానంలో ఉంది. ఇది కూడా మీడియాకు పట్టలేదు.

తను పోటీ చేసిన చోట, సొంత రాష్ట్రంలో మమత ఓడిపోయారు. ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రజలు తిరస్కరించారు. కానీ ఆమెను ఇప్పుడు మోదీని నిలువరించే శక్తిగా, జాతీయ స్థాయి ప్రత్యామ్నాయ శిబిరం పెద్దగా విపక్షాల నేతలు కొందరు తొందరపడి ముందే ఎత్తుతున్నారు. వీళ్లలో ఒక్కొక్కళ్ల వ్యాఖ్య ఎంత వెర్రితనంతో ఉందో గమనించాలి. ‘బీజేపీ సవాలును స్వీకరించి మమత ఒక్కచోటే పోటీ చేశారు. అందుకు ఆమెను అభినందించాల్సిందే. ఆమెను ఓడించడానికి బీజేపీ చాలా ఖర్చు పెట్టింది.’ అన్నారు శివసేన ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌. ‌బెంగాల్‌లో మమత సాధించిన విజయం చాలా గొప్పది. మతశక్తులను నిరో ధించింది. కానీ బెంగాలీలు (ముఖ్యంగా నందిగ్రామ్‌ ఓటర్లు) తమ మనసు చెప్పినట్టు ఓటేశారు అని శశి థరూర్‌ ‌వ్యాఖ్యానించడం విశేషం. మమతను అభినందించే క్రమంలో శరద్‌ ‌పవార్‌కు దేశంలోని నాయకులంతా కలసి కరోనా నివారణకు కలసి కట్టుగా పోరాడాలన్న జ్ఞానం వచ్చింది. ఈ మాటలో ఏ రాజకీయ సంకేతం ఉందో తరువాతైనా తెలుస్తుంది. ఆహా ఏమి పోరాటం, ఆహా ఏమి బెంగాల్‌ ‌ప్రజ అన్నారు ఢిల్లీ అర్బన్‌ ‌నక్సల్‌ ‌కేజ్రీవాల్‌. ‌విభజన శక్తులను ఓడించినందుకు బెంగాల్‌ ‌ప్రజానీకానికి వందనాలు అని చెప్పింది మెహబూబా ముఫ్తీ. అలాగే అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌వంటి అమాంబాపతు నేతలంతా శ్లాఘించారు. ఈ శుష్క ప్రశంసలు చూసుకునే కాబోలు, మమత ఫలితాలు వెలువడిన తరువాత, తనను నందిగ్రామ్‌వారు తిరస్కరించిన సంగతిని కూడా మరచిపోయి, ‘బెంగాల్‌ ‌విజయం అంటే మోదీ, షాల కాషాయ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడమే’ అని వాగాండబరం ప్రదర్శించారు. అంటే వచ్చే సంవత్సరం జరగబోయే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో, ఆ తరువాత రెండేళ్లకు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో మమతా బెనర్జీని విపక్ష ప్రతీకగా నిబెట్టాలన్నదే చాలామంది ఆశయంగా కనిపిస్తున్నది. ఇక్కడ ఒక్కటే ప్రశ్న- బెంగాల్‌లో బయటవారికి ప్రవేశం లేదన్న మమత అప్పుడే ఏ ముఖం పెట్టుకుని భారతదేశ చిల్లరమల్లర పార్టీల నేతగా రాజకీయ ప్రచారానికి వస్తారు? ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం. నాలుగైదు జిల్లాల నేత శరద్‌ ‌పవార్‌, ఈ ఎన్నికలలోనే కేరళలో ప్రచారం చేస్తూ అరేబియాలో దూకిన రాహుల్‌ ‌గాంధీ, బిహార్‌కే పరిమితమైన తేజస్వి యాదవ్‌, ఉత్తరప్రదేశ్‌కే పరిమితమైన అఖిలేశ్‌, ‌కశ్మీర్‌ ‌దాటితే ఎవరికీ తెలియని ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా, రాజకీయ ఊతకర్రలు లేకుండా లేవలేని ఉద్దవ్‌, అర్బన్‌ ‌నక్సల్‌ ‌కేజ్రీవాల్‌, ‌పరువు మీది, బరువు మాది అన్నట్టు ఉండే కామ్రేడ్ల కంటే మమత చాలా ఉన్నతంగానే కనిపిస్తారు.కానీ, ఒక్క ప్రజాస్వామిక లక్షణం కూడా లేని మమతను పెద్ద ప్రజాస్వామిక దేశ రాజకీయాలను నడపడానికి ముందు నిలబెడుతున్న విపక్షాల విజ్ఞత గురించి దేశ ప్రజలు ఆలోచించకుండా ఉంటారా? నిజానికి మమత నాయకత్వం అంటే కాంగ్రెస్‌ ‌పార్టీ అంగీక రిస్తుందా? సీపీఎం ఒప్పుకుంటుందా? ఆమె హింసా ప్రవృత్తి అందరికీ తెలుసు. ఆమె నోటి దురుసు కూడా తెలుసు. ఆమె కాలంలో జరిగిన అక్రమాలు కూడా తెలుసు. బీజేపీని ఈ ఎన్నికలలో అధికారంలోకి రాకుండా చేసినంతమాత్రానే ఆమె అవలక్షణాలన్నీ సలక్షణాలైపోవడమే పెద్ద వింత.


కమలం చేతిలో కమల్‌ ఓటమి

స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువే అంటూ వాగిన ఉన్మాది, నటుడు కమల్‌ ‌హాసన్‌. ‌నాథూరామ్‌ ‌గాడ్సేని దృష్టిలో పెట్టుకుని నిరుడు మే నెలలో తమిళనాడులో జరిగిన ఒక ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ చెత్త వ్యాఖ్య చేశారు. గాంధీ సిద్ధాంతాలంటే తనకు ప్రాణమని ఆయన నమ్ముతూ ఉంటారు. ఆయన సినీ, వ్యక్తిగత జీవితాలు రెండూ కూడా గాంధీ సిద్ధాంతాల సమీపానికి కూడా రావు. అయితే అది ఆయన నమ్మకం. ఇప్పుడు జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఈ తెర సెక్యులరిస్టును, ఆయన అభ్యుదయ మేకప్‌ను దక్షిణ కోయంబత్తూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు కడిగేశారు. పైగా ఆయన బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్‌ ‌చేతిలో 1800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన ‘విశ్వనటుడు’ అయితే కావచ్చు. కానీ విజ్ఞత, విచక్షణ లేనివాడు. పుల్వామా దాడి, అందులో 40 మంది జవాన్ల మృతి తరువాత ఈయన వ్యాఖ్య మరీ జుగుప్సాకరం. కశ్మీర్‌లో ప్లెబిసైట్‌ ‌నిర్వహించడానికి భారత్‌ ఎం‌దుకు భయపడుతోందని ప్రశ్నించారు. తుపాకీ నీడన ప్లెబిసైట్‌ ‌జరిగితే ఫలితం ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ఇలాంటి వ్యాఖ్య చేసి తన అజ్ఞానాన్ని నిరూపించుకున్నారు. కమల్‌ ‌సిద్ధాంతం ఒక కలగూర గంప. పాత ద్రవిడ హిందూ వ్యతిరేకత, కమ్యూనిస్టుల కుహనా సెక్యులరిజం, బీజేపీ వ్యతిరేకత, తెర పైత్యం, నాస్తికత్వం వంటి పంచకూళ్ల కషాయం. మక్కల్‌ ‌నీది మెయ్యం పార్టీ చాలా చోట్ల పోటీ చేసింది. ఎక్కడా నెగ్గలేదు. దాని నాయకుడే కమల్‌.


‌తిరుపతిలో వైఎస్‌ఆర్‌సీపీ

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్‌ఎస్‌ఆర్‌ ‌సీపీ గెలిచింది. అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు, కోర్టు ఆదేశాల నడుమ జరిగిన ఈ ఎన్నికలలో అధికార పార్టీయే 2,71,592 ఓట్లతో గెలిచింది. దొంగ ఓట్లు అధికంగా పడ్డాయని జనసేన, బీజేపీ, తెలుగుదేశం కోర్టుకు వెళ్లాయి. అయితే ఆ పిటిషన్‌లను కోర్టు కొట్టివేసింది.


ముస్లిం ఓట్లు చీలకుండా…

ఇంతకీ ముస్లింల 30 శాతం ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఆ వర్గానికి కొత్త అసెంబ్లీలో దక్కిన స్థానాలు ఎన్ని? రద్దయిన అసెంబ్లీలో 59 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 32 మంది టీఎంసీకి చెందినవారు. కాంగ్రెస్‌ ‌నుంచి 18, సీపీఎం నుంచి 9 మంది ఉండేవారు. కొత్త అసెంబ్లీకి ఎన్నికైన ముస్లింలు 44 మంది. ఇందులో 43 మంది మమత పార్టీ నుంచే వచ్చారు. ఒక్కరు మాత్రం ఇండియన్‌ ‌సెక్యులర్‌ ‌ఫ్రంట్‌ ‌నుంచి ఎన్నికయ్యారు. ఇతడి పేరు నషాద్‌ ‌సిద్దికి. ఇది చాలు ముస్లింలంతా మమతకే ఓటేశారని చెప్పడానికి. అలాగే 214 మందిలో 43 మంది ముస్లింలంటే వీరి మాట బాగానే చెల్లుబాటవుతుంది. ఇది గమనించవలసిన మాటే. నిజానికి ముస్లిం ఓటు చీలిపోకుండా మమత తీసుకున్న జాగ్రత్త ఆమె పార్టీని రక్షించింది. నిజమే, కానీ ఆ ఎత్తుగడ కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది. అందుకు ఆమె కూడా బలి అయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఈ దేశంలో ముస్లిం వర్గ నాయకులుగా ఎదుగుతున్న వారి, ఎదిగిన వారి ప్రాబల్యం తన ముస్లిం ఓటు బ్యాంకు మీద పడకుండా మమత పెద్ద వ్యూహమే రచించారు.

‘హైదరాబాద్‌ ‌నుంచి బీజేపీ మిత్రుడు ఒకరు వచ్చారు. ఆయనే ఫర్‌ఫురా షరీఫ్‌ ‌నుంచి ఒక కుర్రాడిని వెంటబెట్టుకు వచ్చి, కోట్లు విరజిమ్ముతున్నాడు. మత నినాదాలు చేస్తున్నాడు’ బెంగాల్‌ ఎన్నికల ప్రచారం ఆరంభంలోనే మమతా బెనర్జీ చెప్పిన మాటలివి. హైదరాబాద్‌ ‌నుంచి వచ్చిన బీజేపీ మిత్రుడంటే, ఆవిడ దృష్టిలో మజ్లిస్‌ ఇతేహాదుల్‌ ‌ముస్లిమీన్‌ ‌నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ. ఫర్‌ఫురా షరీఫ్‌ ‌నుంచి తీసుకువచ్చిన కుర్రాడు అంటే ఫిర్జాదీ అబ్బాస్‌ ‌సిద్దికి. ఇతడే ఎన్నికల ప్రకటనకు కాస్త ముందు ఇండియన్‌ ‌సెక్యులర్‌ ‌ఫ్రంట్‌ ‌పేరుతో ఒక సంస్థను స్థాపించాడు. దేశ రాజకీయాలలో ముస్లింల స్థానం గురించి మాట్లాడాడు. కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు కూటమిలో కలిసి 26 చోట్ల పోటీ చేశాడు. ఎక్కడా నెగ్గలేదు. అలాగే ఒవైసీ ఏడు చోట్ల పోటీ చేసి, 0.02 శాతం ఓట్లు మాత్రం గెలుచుకున్నారు. కానీ ఇద్దరినీ బెంగాల్‌ ‌ముస్లింలు నమ్మలేదని విశ్లేషకులు చెబుతున్నారు. చిరకాలంగా కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులను నమ్ముకుని ఉన్న ముస్లింలు తరువాత మమత నీడకు చేరిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మీద కూడా మమత ధ్వజమెత్తడంలోని అంతరార్ధం తరువాత బయటపడింది. మమత ఏం చేశారో తెలియదు. ముస్లిం ఓటు చీలిపోకుండా నిలువరించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ ఎట్టి పరిస్థితులలోను అమలు చేయబోనని హామీ మళ్లీ ఇచ్చారు. తమిళనాడులో టీటీ దినకరన్‌తో కలసి ఒవైసీ పార్టీ పోటీ చేసింది. అక్కడ కూడా సీట్లు రాలేదు. బిహార్‌, ‌మహారాష్ట్రలలో వలే బెంగాల్‌లో కూడా కాలు మోపవచ్చునని ఒవైసీ గట్టిగానే ఆశపడ్డారు. కానీ బొక్క బోర్లా పడ్డారు. బిహార్‌లో 2020లో 20 స్థానాలలో పోటీ చేసిన ఒవైసీ ఐదు సీట్లు గెలిచారు.

అస్సాంలో ఆలిండియా యునైటెడ్‌ ‌డెమాక్రటిక్‌ ‌ఫ్రంట్‌ 20 ‌చోట్ల పోటీ చేసి 15 చోట్ల గెలిచింది. ఈ ఫ్రంట్‌ ‌కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసింది. కేరళలో ఇండియన్‌ ‌యూనియన్‌ ‌ముస్లింలీగ్‌ ‌యూడీఎఫ్‌ ‌భాగస్వామిగా 15 స్థానాలు గెలుచుకుంది. ఇవన్నీ కూడా మతోన్మాదానికి సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నవే. అయినా కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు వీళ్లతో కలసి పోటీ చేస్తూ బీజేపీని హిందుత్వ మతోన్మాద సంస్థ అంటూ విమర్శలకు దిగడమే విచిత్రం. కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టుల మార్గంలోనే మమత కూడా ప్రయాణిస్తున్నారు.


ఉప ఎన్నికలలో ఎన్‌సీపీకి భంగపాటు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధప్రదేశ్‌లో ఖాళీ అయిన లోక్‌సభ స్థానాలకు కూడా అదే సమయంలో ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు కూడా మే 2వ తేదీనే వెలువడినాయి. అలాగే పది రాష్ట్రాలలో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలోని పంధర్‌పూర్‌-‌మంగల్వేధా అసెంబ్లీ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ మహారాష్ట్ర వికాస్‌ అగాఢి భాగస్వామి ఎన్‌సిపీ అభ్యర్థి ఓడిపోయారు. సమాధాన్‌ అవతాడే (బీజేపీ), భగీరథ్‌ ‌భాల్కే (ఎన్‌సీపీ)ని ఓడించారు. లోక్‌సభ ఉప ఎన్నికలలో తిరుపతి (వైఎస్‌ఆర్‌సీపీ), బెల్గాం (బీజేపీ), కన్యాకుమారి (కాంగ్రెస్‌), ‌మలప్పురం (ముస్లింలీగ్‌) ‌గెలుచుకున్నాయి. మొత్తం 13 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ 5, కాంగ్రెస్‌ 4, ‌జేఎంఎం, జడ్‌పీఎం, ఎన్‌డీడీపీ, తెరాస ఒక్కొక్కటి వంతున గెలిచాయి. పంధర్‌పూర్‌- ‌మంగల్వేధాలో ఎన్‌సీపీ అభ్యర్ధి ఓడిపోవడం అంటే, ఉద్ధవ్‌ ‌ఠాక్రే నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి దెబ్బే. బెంగాల్‌ ‌ఫలితాలు వెల్లడైన తరువాత మహారాష్ట్రలో సమీకరణాలు మారతాయని ఒక అంచనా ఉంది. కానీ బీజేపీ దూకుడు కాస్త తగ్గిన ఫలితంగా సమీకరణాల మార్పు వాయిదా పడవచ్చు. కానీ ఎన్‌సీపీ అభ్యర్థి ఓడిపోవడం కూటమిని కాస్తయినా కదిలించే అంశమే కాగలదు. శివసేనతో కలవడం వల్ల తన పార్టీకి నష్టం వస్తోందా అన్న ప్రశ్న ఎన్‌సీపీలో రాకమానదు.

By editor

Twitter
Instagram