ఆసుపత్రులు ఖాళీ లేవు. స్మశానాలూ ఖాళీ లేవు. ఒకచోట రోగులు బారులు తీరితే, ఇంకొక చోట కొవిడ్‌ ‌కాటుకు బలైన ఆప్తుల అంతిమ సంస్కారాల కోసం టోకెన్లు పట్టుకుని అయినవారు ఎదురు చూస్తున్నారు. ఆసుపత్రులలో ప్రాణవాయువు లేదు. నిజానికి లేకపోవడం కాదు, కృత్రిమ కొరత, రవాణాలో లోపం. మరుభూమిలో దహనానికి కట్టెలు కరవు. ఒక దేశం అత్యంత క్లిష్ట సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని అంగీకరించేందుకు ఇంతకంటే రుజువులు అవసరంలేదు. ఇది భారతదేశమంతటా ఒకే తీరున దృశ్యమానం కాకపోవచ్చు. కానీ నలుమూలలా దాని ప్రభావం మాత్రం నిజం. అది సృష్టిస్తున్న భయాందోళనలు వాస్తవం. భూగోళం మీద ఇప్పుడు కొవిడ్‌-19 ‌వైరస్‌ ‌రోజువారీ కేసులకు కేంద్రబిందువుగా మారిపోయిన భారతదేశంలో పరిస్థితి సాక్షాత్తు ఇదే. కొవిడ్‌ ‌రెండోదశకు భారతదేశం పెద్ద మూల్యమే చెల్లించవలసి వస్తున్నది. ఈ నష్టాన్ని తగ్గించడానికి జరుగుతున్న కృషికి మోకాలడ్డే దురదృష్టకర వాతావరణం కొందరు సృష్టించడం ఇంకా పెద్ద సమస్య.

తొలి దశ కరోనాలో లక్ష కేసులు నమోదు కావడానికి కొన్ని వారాలు పట్టింది. కానీ రెండోదశలో కేవలం కొన్ని రోజులలోనే కేసులు మూడు రెట్లు పెరిగాయి. మంగళవారానికి (ఏప్రిల్‌ 27) అం‌దిన సమాచారం ప్రకారం అంతకు ముందు గడచిన 24 గంటలలో నమోదైన కేసులు 3,52,991. దేశంలో 28 లక్షలకు పైగా చికిత్స పొందుతున్నవారు ఉన్నారు. 2,812 మంది దుర్మరణం పాలయ్యారు. తొలిదశ కరోనా విజృంభణ సమయంలో అమెరికా, బ్రెజిల్‌, ‌జపాన్‌ ‌వంటి దేశాలలో ఇలాంటి ఉత్పాతం చూశాం. ఇప్పుడు మన ముంగిటే చూస్తున్నాం.

మొదటి దఫా కరోనా విజృంభణ సమయంలో కొందరు నిపుణులు చెప్పినట్టు రెండో దశ కరోనా భయానకమే. వందేళ్లకుగాని సాధ్యం కానంత చేదు అనుభవాన్ని కొద్ది నెలలలో చవిచూపుతున్నది. ఇళ్లల్లో ఉన్నా మాస్క్ ‌ధరించడం అనివార్యంగా కనిపిస్తున్నదని కేంద్రమే స్పష్టం చేయడం ఇందుకు నిదర్శనం. మొదటి దశలో మానవాళి అనుభవించిన క్షోభ కంటే ఇప్పుడు అది ఎన్నో రెట్లు ఎక్కువ. దీని వ్యాప్తి అత్యంత వేగవంతమేకాదు, అనూహ్యం, అగమ్య గోచరం కూడా. భారత్‌ ‌వరకు 80 నుంచి 85 శాతం వ్యాధిగ్రస్తులు రోగ లక్షణాలు సరిగా కనపడకుండానే మృత్యువు అంచులకు వెళుతున్నారు. బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. పైగా నాడు కరోనా కట్టడికి ఏర్పాటు చేసినన్ని జోన్లు ఇవాళ లేవు. ఇప్పుడు వయో పరిమితితో సంబంధం లేకుండా వ్యాపిస్తున్నది కూడా. ఊపిరి సమస్య ఈ దశలో చాలా సాధారణంగా కనిపిస్తున్నది. ఆక్సిజన్‌ ‌లభ్యత వివాదాస్పదంగా మారిపోయింది. ఆర్థిక వ్యవస్థ కూడా తక్కువ సమయంలో ఎక్కువ దుష్ఫలితాన్ని చూసే అవకాశం ఉందన్న అభిప్రాయం ఇప్పుడే నెలకొంది.

కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ 19 ‌రెండో దశతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే విపక్షాలు వినోదించడం వీటన్నిటిని మించిన దుస్థితి. ఈ ప్రాణాంతక వాతావరణంలో కొన్ని విపక్షాలు రేపటి అధికార సోపానాలను వెతుక్కుంటున్న సంగతి నిజం. రెండో దశ విలయానికి కేంద్ర ప్రభుత్వం, అక్కడ అధికారంలో ఉన్న బీజేపీయే కారణమని ఒక వర్గం మీడియా బోనులో నిలబెట్టే యత్నం చేయడం విద్రోహం, వంచన. ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి, పెద్ద పార్టీల నేతలుగా ఉండి బాధ్యతా రహితంగా మాట్లాడేవారికి ఆ మీడియా అవకాశం ఇస్తూ అన్ని విలువలకు నీళ్లొదులుతున్నది. దేశమంతా కలసి ఈ ఉత్పాతాన్ని ఎదుర్కొందామని అధికార పార్టీ నాయకులు చెబుతుంటే, మేం మా నాటకాలు మానేది లేదని విపక్షాలు నిర్లజ్జగా అంటున్నాయి. అయినా ఏప్రిల్‌ 25‌న ప్రధాని మోదీ మన్‌కి బాత్‌ ‌కార్యక్రమంలో గొప్ప సందేశం ఇచ్చారు. కొవిడ్‌ ‌నివారణకు రాష్ట్రాలు జరుపుతున్న పోరాటానికి చేయూత నిచ్చేందుకే అంకితమై ఉన్నామని అన్నారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా వాస్తవాలు చెప్పడానికి వెనుకాడడం లేదు. అలా విపత్తును ఎదుర్కొనడానికి ప్రజల్ని సంసిద్ధులను చేస్తున్నారు.

కేంద్రం దీక్ష

కరోనాకు సంబంధించి నేడు ఉన్న వాస్తవాలను అంగీకరిస్తూనే కేంద్రం చిత్తశుద్ధితో నివారణకు చర్యలు చేపడుతోంది. రెండోదశ ఎంతో తీవ్రమైనదని ప్రధాని కూడా అంగీకరించారు. ఆ మహమ్మారి నియంత్రణలో కేంద్రం పోరాడుతూ, అందరినీ భాగస్వాములను చేస్తోంది. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఆక్సిజన్‌, ‌టీకాలు, మందుల సరఫరాకు అవసరమైన నిధుల మంజూరు వంటి చర్యలతో ముందుకు సాగుతోంది. వైద్యుల ప్రాణాలకు ముప్పు రాకుండా వారి జీవితాలకు బీమా కల్పి స్తోంది. ప్రధాని మోదీ, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌, ఆ ‌శాఖ కార్యదర్శి రాజేష్‌ ‌భూషణ్‌ ‌నిరంతరం అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రధాని నేరుగా ముఖ్య మంత్రులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.

 ఏప్రిల్‌ ‌మూడో వారంలో పాజిటివిటీ రేటు 10 శాతం దాటిన, ఆక్సిజన్‌, ఐసీయూ పడకల భర్తీ 60 శాతం మించిన ప్రాంతాల్లో మినీ లాక్‌డౌన్‌ ‌తరహాలో ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఆయా ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు అత్యవసర కార్య కలాపాలు మినహా అన్నింటిపైనా ఆంక్షలు విధించాలని ఆదేశించింది. కరోనా కట్టడి చర్యల్లో మాజీ సైనికోద్యోగులు, నెహ్రూ యువకేంద్ర సభ్యులను భాగస్వాములను చేయాలనీ, కొవిడ్‌ ఆస్పత్రుల పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్‌ అధికారులకు అప్పగించాలనీ సూచించింది.

ఆక్సిజన్‌ ‌సమస్యను ఒక్కసారిగా పెద్దదిగా చూడడానికి అవకాశం ఇచ్చిన నాసిక్‌ ఆక్సిజన్‌ ‌లీక్‌ ‌దుర్ఘటనకు (ఏప్రిల్‌ 21) ఎవరు బాధ్యులు? ఆ మరునాడే ముంబైలో కరోనా ఆసుపత్రులలో జరిగిన విషాదాలకు బాధ్యులు ఎవరు? మెడికల్‌ ఆక్సిజన్‌ ‌ట్యాంకర్‌ ‌నుంచి ఆక్సిజన్‌ అవసరమైన రోగులకు అందలేదు. వృథాగా బయటకు పోయింది. ముంబైలోని ఆసుపత్రిలో షార్ట్ ‌సర్క్యుట్‌ ‌జరిగింది. కానీ వాటి గురించి మాట్లాడకుండా, కేంద్రం తమకు ఆక్సిజన్‌ అం‌దించడంలో ‘సవితి తల్లి’ ప్రేమ చూపుతోందని ఆ రాష్ట్ర ప్రభుత్వం, దాని భాగస్వాములు ఆరోపిస్తున్నారు. ప్రధానితో జరిగే సమావేశాన్ని కూడా ప్రభుత్వం టీవీలో ప్రసారం చేసి తప్పంతా ప్రధానిదే అయినట్టు, తాము కాళ్లావేళ్లా పడ్డా కూడా ఆయన కనికరించడంలేదన్నట్టు చూపించడానికి శతథా యత్నిస్తారు ఢిల్లీ ముఖ్యమంత్రి. ఎన్నికలు ఆపవచ్చు కదా అంటారు మేధావులు. నిజానికి కరోనా విజృంభణ ఎన్నికలకు వెళుతున్న పశ్చిమ బెంగాల్‌లో తీవ్రంగా లేదు. అది తీవ్రమైన వేళకి తమిళనాడు, కేరళ, అస్సాం ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రధాని కుంభమేళాను నిలిపి వేయించారు. పశ్చిమ బెంగాల్‌ ‌ప్రచారం రద్దు చేసుకున్నారు. భారత పారిశ్రామికవేత్తల నుంచి, విదేశాల నుంచి కూడా ఆక్సిజన్‌ను దేశానికి దిగుమతి చేస్తున్నారు. నివారణకు జరుగుతున్న కృషి కంటే, ఏదీ జరగడం లేదని చెబుతున్న విపక్షాలకే ఒక వర్గం మీడియా పెద్దపీట వేస్తోంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవడం వేరు. ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్జేయడానికి సమస్యను భూతద్దంలో చూపించి ప్రజలను భయభ్రాంతులను చేయడం వేరు. ఒక సంక్షోభం ద్వారా శత్రువులతో కలసి ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా విఫల యత్నం చేస్తున్నాయి కొన్ని చానళ్లు. కేంద్రం అటు కరోనా వైరస్‌తో, ఇటు ప్రతిపక్షాల వైఖరితో ఏకకాలంలో యుద్ధం చేయవలసి వస్తున్నది. వాస్తవం చెప్పాలంటే ఆరేళ్ల నరేంద్రమోదీ హయాంలోనే ఇది అతి క్లిష్టమైన పరీక్షా సమయం. దీని నుంచి దేశం బయటపడడానికి జాతి మొత్తం ఏకత్రాటి మీదకు రావాలి. కరోనా మీద విజయం దేశ విజయం. ప్రజా విజయం. ఆ విజయం మోదీ ఖాతాలో జమ అవుతుందేమోనని భయపడుతూ, అడ్డుపుల్లలు వేస్తున్నవాళ్లే ఇప్పుడు కరోనాకు మించిన వైరస్‌లా కనిపిస్తున్నారు.

నాసిక్‌ ‌ఘటన.. ఆక్సిజన్‌ అలజడి

కరోనా నియంత్రణలో కీలకపాత్ర వహించే వైద్యశాలల నిర్వహణలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఘోరంగా ఉంది. ప్రాణవాయువు అందక మహారాష్ట్రలోని నాసిక్‌ ఆస్పత్రిలో 24 మంది మరణించిన సంఘటన ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో మొదటి నుంచి కరోనా తీవ్రంగా ఉంది. దేశంలో కేసుల సంఖ్యను పెంచుతున్న రాష్ట్రం ఇదే. నాసిక్‌లోని జాకీర్‌ ‌హుస్సేన్‌ ‌పురపాలక ఆస్పత్రిలో స్టోరేజి ప్లాంటు నుంచి ఆక్సిజన్‌ ‌లీకై 24 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. వీరంతా కరోనా బాధితులే. ట్యాంకులో నిల్వ చేసిన ఆక్సిజన్‌ ‌మైనస్‌ 180 ‌డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ప్రమాదం జరిగే సమయానికి ట్యాంకులో 25 శాతం ఆక్సిజన్‌ ‌నిల్వ ఉంది. స్టోరేజి ప్లాంటు నిర్వహణలో అలసత్వమే ఈ ఘటనకు కారణం. ట్యాంకు నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేట్‌ ‌సంస్థకు అప్పగించారు. దాని పనితీరుపై పర్యవేక్షణను విస్మరించింది ప్రభుత్వం. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. కొందరు వ్యక్తుల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఘటనా స్థలంలో ఉన్న ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై విచారణను బాంబే హైకోర్టు సుమోటోగా చేపట్టింది.

మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కరోనా కట్టడిలో దారుణంగా విఫలమవుతున్నాయి. వాటికి కేంద్రాన్నీ, బీజేపీనీ విమర్శించడంలో ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల శ్రేయస్సులో లేనే లేదు. కేంద్రం మీద విమర్శలతో ఆ ఘోర తప్పిదాలను మరుగుపరచాలని తంటాలు పడుతున్నాయి. నాసిక్‌, ‌ముంబై ఆసుపత్రులలో జరిగిన తప్పిదాలకి నిజంగా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా? ఆక్సిజన్‌ ‌పంపకం మీద కేంద్రం వైఖరిని తప్పు పట్టాలని కొన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. కానీ నిజం ఏమిటి? భారత్‌కు రోజుకు 7,100 టన్నుల ఆక్సిజన్‌ ‌తయారు చేసుకునే సామర్ధ్యం ఉంది. ఇది అటు పారిశ్రామిక అవసరా లకు, ఇటు వైద్య అవసరాలకు కూడా సరిపోతుంది. అంటే ఇప్పుడు దేశంలో ఆక్సిజన్‌ ‌కొరత తలెత్త కూడదు. ఏప్రిల్‌ ‌మూడోవారంలో కేంద్రం రోజుకు 6,822 టన్నుల వంతున ద్రవ ప్రాణవాయువును 20 రాష్ట్రాలకు కేటాయించింది. అవన్నీ తీవ్ర స్థాయిలో కరోనాను ఎదుర్కొంటున్నవే. నిజానికి వాటికి అవసరమైన ఆక్సిజన్‌ 6,785 ‌టన్నులు. అసలు ఏప్రిల్‌ 12 ‌నాటికి దేశంలో వైద్య అవసరాలకు కావలసిన ఆక్సిజన్‌ ‌మొత్తం 3,842 టన్నులు. భారత పారిశ్రామిక దిగ్గజం లిండే ఇండియా, ఇతర సంస్థల సహకారంతో, వాయుసేన అండతో కేంద్రం ఆక్సిజన్‌ను చేరవేస్తున్నది. ఇంకా రోడ్డు మార్గం ద్వారా కూడా రవాణా అవుతున్నది. జర్మనీ నుంచి 23 మొబైల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి యంత్రాలను కూడా దిగుమతి చేసింది. ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు భయపడి చేపట్టినది కాదు. మోదీ తన పని తాను చేసుకు వెళుతున్నారు. అంతే.

రైతుల పేరిట దుశ్చర్య

ఇక ఢిల్లీలో ఆక్సిజన్‌ ‌కొరత సంగతి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అనే అర్బన్‌ ‌నక్సల్‌ ‌నాటకాలు హద్దు మీరిపోతున్నాయి. వాటి గురించి కొంచెం తెలుసుకోవాలి. కేంద్ర రాష్ట్రాల సమావేశాలలో పాటించే సంప్రదాయాలను కూడా కాలరాసి తాను ప్రధానికి చేతులెత్తి మొక్కుతూ మాట్లాడిన మాటలు దేశం మీదకు పంపిన క్షుద్ర రాజకీయుడు కేజ్రీవాల్‌. ‌కానీ ఆ వేడుకోలు ఓ బూటకం. దేశ రాజధానికి కావలసిన మెడికల్‌ ఆక్సిజన్‌ ‌సుదూర ప్రాంతాల నుంచి రావాలి. వేయి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడు రాష్ట్రాల నుంచి చేరుతుంది. అడ్డంకుల వలన ఆగిపోయింది. ఉదాహరణకి, కేంద్రం చేసిన కేటాయింపుల ప్రకారం ఏప్రిల్‌ 23‌న ఢిల్లీకి 378 టన్నుల ఆక్సిజన్‌ ‌చేరాలి. కానీ 177 టన్నులే చేరింది. కారణం అడ్డకుంలు. రైతుల పేరిట ఢిల్లీ సరిహద్దులలో తిష్ట వేసిన అరాచకవాదులే ఆక్సిజన్‌ ‌పంపిణీని అడ్డుకున్నారన్నది పచ్చినిజం. ఇది కేజ్రీవాల్‌కు తెలియదా? ఢిల్లీ ప్రభుత్వం రెండు మూడు వారాల క్రితం మేల్కొని ఉంటే ఈ సంక్షోభమే తలెత్తి ఉండేది కాదని అధికారుల వాదన (మింట్‌, ఏ‌ప్రిల్‌ 24). ఈ ‌సమస్య గురించి అప్పుడే అధికారులు అడిగినా ఆయన స్పందించలేదు. కేజ్రీవాల్‌, ఆయన ప్రభుత్వం, పార్టీ ప్రజల ప్రాణాలతో ప్రమాదకరంగా, దారుణంగా చెలాగాటమాడుతున్నాయి. ఢిల్లీలోని ఆసుపత్రులలో నిర్మించ తలపెట్టిన ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు (వీటికి 2020లోనే అనుమతులు ఉన్నాయి) ఏమీ ఆసక్తి చూపడం లేదు. ఈ విషయాన్ని అధికారులే అంగీకరిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం సైట్‌ ‌రెడీనెస్‌ ‌సర్టిఫికెట్‌ ఇప్పటికీ ఇవ్వలేదు. అలాగే తాజాగా ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’‌కు అప్పగించవలసిన క్రయోజనిక్‌ ‌ట్యాంకర్లు కూడా పంపించలేదు. తాము ఆక్సిజన్‌ ‌వాహనాలు అడ్డుకోలేదని రైతు నాయకులు చెబుతున్నారు. కానీ ఘాజీపూర్‌ ‌సరిహద్దుల్లో వాహనాలను అడ్డగించారన్న సమాచారంతో తాము రంగ ప్రవేశం చేశామని ఉత్తర ఢిల్లీ డీసీపీ రాజీవ్‌ ‌రంజన్‌, ‌ఢిల్లీకి చెందిన ఒక స్టేషన్‌ ‌హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) ‌సంజీవ్‌ ‌కుమార్‌ ‌వెల్లడించారు. హర్యానా పోలీసుల సహకారంతో సబోలీ-నరేలా మీదుగా వాహనాలను మళ్లించి ఢిల్లీకి వచ్చే ఏర్పాట్లు చేశారు. కొన్ని వాహనాలను కుండ్లీ-మనేసర్‌- ‌పాల్వార్‌ ‌మీదుగా ఢిల్లీకి మళ్లించారు. ఫలితం, కొన్ని గంటలు ఆలస్యంగా ఢిల్లీకి ఆక్సిజన్‌ ‌చేరింది.

నిజానికి ఆక్సిజన్‌ ‌సరఫరాకు కేంద్రం అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. ఢిల్లీని ఆదుకునేందుకు రాయగఢ్‌లోని జిందాల్‌ ‌కర్మాగారం నుంచి 70 టన్నుల ద్రవ ఆక్సిజన్‌ను ప్రత్యేక రైలులో పంపించారు. విదేశాల నుంచి కొనుగోలు చేసే ఆక్సిజన్‌తో పాటు దాని ఉత్పత్తి, వినియోగం కోసం వాడే 15 రకాల వస్తువులు, టీకాలపై మూడు నెలలపాటు దిగుమతి సుంకాలను మినహాయించాలని కేంద్రం నిర్ణయించింది. దిగుమతుల సమయంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు దేశవ్యాప్తంగా 20 మంది నోడల్‌ అధికారులను నియమించారు. రెమ్‌డెసివర్‌ ‌దాని తయారీకి ఉపయోగించే ముడిసరుకుపై సుంకాలు రద్దుచేశారు.

ఈ దశ కరోనాలో ఆక్సిజన్‌ ‌వినియోగం భారీగా పెరిగిన మాట నిజం. గత ఏడాది దేశంలో రోజూ 6900 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి అయ్యేది. సెప్టెంబరు నాటికి దాని వియోగం తారస్థాయికి చేరింది. సెప్టెంబరు 23,24 తేదీల్లో ఒక్కో రోజకు మూడువేల టన్నుల ఆక్సిజన్‌ ‌వినియోగం జరిగింది. కరోనాకు ముందు రోజుల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ ‌వినియోగం రోజుకు వెయ్యి టన్నులకు పరిమితం అయ్యేది. మిగిలిన రోజుల్లో మిగతా 5,900 టన్నులను పారిశ్రామిక అవసరాలకు మళ్లించేవారు. గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే కేసులు దాదాపు 226 శాతం పెరిగాయి. దీంతో పారిశ్రామిక అవసరాలను పక్కనపెట్టి మొత్తం ఆక్సిజన్‌ను కరోనా బాధితుల అవసరాలకు వినియోగిస్తున్నారు. రోగులకు పడకల కేటాయింపులపై కేంద్రీకృత కాల్‌ ‌సెంటర్‌ ఆధారిత సేవలను అమల్లోకి తీసుకురావాలని కేంద్రం రాష్ట్ర సర్కార్లకు సూచించింది. కరోనా బాధితులకు సేవలు అందించేందుకు రక్షణ శాఖ ముందుకు వచ్చింది. తమ మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు, ఆయుధ కర్మాగారాల వైద్యశాలల్లో రోగులకు సేవలు అందిస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయ సమీపంలోని సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌కొవిడ్‌ ఆస్పత్రిలో 250 పడకలను ఏర్పాటు చేసింది. గుజరాత్‌లో 1100 పడకలను అందుబాటులోకి తెచ్చింది. ఆక్సిజన్‌ ‌రవాణా కోసం 24 కంటెయినర్లను దిగుమతి చేసుకోవాలని పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ (ఇండియన్‌ ‌టుబాకో కంపెనీ) విదేశీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలోని భద్రాచలంలో గల తమ పేపర్‌ ‌బోర్డు ప్లాంటు నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు సంస్థ ఆక్సిజన్‌ ‌సరఫరా చేస్తోంది. ఆక్సిజన్‌ ‌కొరతను నివారించేందుకు దేశంలోనే తొలిసారి తెలంగాణ సర్కారు యుద్ధ విమానలను రంగంలోకి దించింది. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఆక్సిజన్‌ను రోడ్డు, రైలు మార్గాల ద్వారా తరలించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు భారతీయ వాయుసేనకు చెందిన మూడు సి-17 యుద్ధ విమానాలను భువనేశ్వర్‌కు పంపారు. ఆక్సిజన్‌ ‌కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపైనా కేంద్రం దృష్టి సారించింది.

గాలి నుంచి ఆక్సిజన్‌ ‌తయారుచేసే మూడు ప్లాంట్లను తెలంగాణకు పంపింది. హైదరాబాద్‌, ‌ఖమ్మం, కరీంనగర్‌ల్లో వీటిని ఏర్పాటు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో తయారయ్యే ఆక్సిజన్లో కొంత మొత్తాన్ని తెలంగాణ, ఏపీలకు కేటాయించింది. మరికొంత మొత్తాన్ని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ‌తదితర బాధిత రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. తెలంగాణలో రోజువారీగా 250 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌, ఏపీకి 200 మెట్రిక్‌ ‌టన్నులు అవసరమని అంచనా వేసింది. ఆ మేరకు సరఫరాకు చర్యలు తీసుకుంది. అదనపు నిల్వలు కావాలని తెలంగాణ సర్కారు కోరిన నేపథ్యంలో రాష్ట్రానికి 360 మెట్రిక్‌ ‌టన్నులు సరఫరా చేయాలని నిర్ణయించింది. తమకూ సరఫరా పెంచాలని ఏపీ సర్కారు కేంద్రాన్ని కోరింది. ఉక్కు ప్లాంటులోని ఆక్సిజన్‌ ‌తయారీ కేంద్రంలో రోజుకు 100 మెట్రిక్‌ ‌టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఇంకా ఉత్పత్తి పెంచే అవకాశాలపై కేంద్రం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు పీఎం కేర్స్ ‌నిధులతో దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ వైద్యశాలల్లో 551 ప్రెజర్‌ ‌స్వింగ్‌ అబ్సార్ప్‌షన్‌ (‌పీఎస్‌ఏ) ‌మెడికల్‌ ఆక్సిజన్‌ ‌ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇవి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆక్సిజన్‌ ‌రవాణాలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోటీ మొదలవడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆక్సిజన్‌ ‌సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు 2005 నాటి విపత్తు నిర్వహణ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

వ్యాక్సినేషన్‌లో ముందున్నది భారత్‌ ‌కాదా?!

ప్రపంచంలోనే అత్యధిక వేగంగా టీకాలు పంపిణీ చేస్తున్న దేశంగా భారత్‌ ‌నిలిచింది. కేవలం 99 రోజుల్లో దాదాపు 14 కోట్లమందికి టీకాలు పంపిణీ చేయడం ద్వారా ఈ ఘనతను సాధించిన దేశంగా గుర్తింపు పొందింది. వ్యాక్సిన్‌ ‌సరఫరా జనవరి 16న ప్రారంభమైంది. ఈనెల 24 వరకు 14, 09, 16, 417 మందికి వ్యాక్సిన్లు అందించారు. ఇక దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. కేంద్రీకృత పంపిణీ విధానం వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాక సగం వ్యాక్సిన్‌ ‌నిల్వలను రాష్ట్రాలకు సరఫరా చేసే అధికారాన్ని ఉత్పత్తిదారులకు కల్పించింది. స్థానికంగా వ్యాక్సిన్‌ ‌తయారీ కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించాలని నిర్ణయించింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇచ్చే కార్యక్రమం మే 1 నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌ ‌పోర్టల్‌ ‌కొవిన్‌, ‌లేదా ఆరోగ్యసేతు పోర్టల్‌ ‌ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. వ్యాక్సిన్‌ ‌కొరత నేపథ్యంలో కొత్తగా టీకా తయారీ సంస్థలకు అనుమతులు ఇచ్చింది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ.‌లిమిటెడ్‌ ‌కొత్త టీకా తయారీకి రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి మూడో దశ క్లినికల్‌ ‌పరీక్షలను చేపట్టనుంది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి మంజూరు చేసింది. ఈ పరీక్షలు ఆగస్టు నాటికి పూర్తవుతాయని అంచనా. ఆ తరవాత టీకా వెంటనే విడుదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇమ్యూనలాజికల్స్ (ఐఐఎల్‌) ఆ‌స్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్‌ ‌యూనివర్సిటీతో కలిసి టీకా తయారీ ప్రయత్నాలను చేపట్టింది. వీటిని త్వరితగతిన పూర్తిచేసి టీకాను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఐఐల్‌ ఎం‌డీ ఆనందకుమార్‌ ‌వెల్లడించారు. జైడుస్‌ ‌క్యాడిలా, జెన్నోవా సంస్థలు ఈ ప్రయత్నాల్లోనే ఉన్నాయి. ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీకి భారత్‌ ‌బయోటెక్‌ ‌ప్రయత్నిస్తున్నది. వీటికి రూ.400 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. సీరం, భారత్‌ ‌బయోటెక్‌ ‌సంస్థలకు కలిపి రూ.4,567 కోట్ల అడ్వాన్స్ ‌సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. సీరం కంపెనీకి రూ.3000 కోట్లు, భారత్‌ ‌బయోటెక్‌కు రూ.1567 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆత్మ నిర్భర భారత్‌-3 ‌మిషన్‌ ‌కింద ఈ నిధులను సమకూర్చనున్నారు.

 కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు, సిబ్బంది కోసం గతేడాది కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌ప్యాకేజీ ఈనెల 24తో ముగిసింది. దీని స్థానంలో కొత్త బీమా పథకాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు న్యూ ఇండియా అస్యూరెన్స్ ‌కంపెనీతో ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. త్వరలో ఇది కార్యరూపం దాల్చనుంది. మరోపక్క పడకల కొరతను నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అసోం రాజధాని గువహటీలోని ఇండోర్‌ ‌స్టేడియంను కొవిడ్‌ ‌చికిత్సా కేంద్రంగా మార్చారు. మధ్యప్రదేశ్‌ ‌రాజధాని భోపాల్లో రైలు బోగీలను ఐసొలేషన్‌ ‌కేంద్రంగా మార్చారు. ఈ పక్రియ దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లో చురుగ్గా సాగుతోంది. తమ ఉద్యోగుల కోసం ప్రైవేటు కంపెనీలు విదేశాల నుంచి ఎంత మొత్తం టీకా అయినా, ఎంత ధరకు అయినా దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇవన్నీ కరోనా కట్టడి చర్యల్లో భాగమే.

విపక్షాల యాగీ…

కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు సోనియా, రాహుల్‌, ‌ప్రియాంకా గాంధీ, హైదరాబాద్‌ ఎం‌పీ ఒవైసీ తదితరులు కరోనాకు సంబంధించి చేస్తున్న విమర్శల్లో హేతుబద్ధత లేదు. కేంద్రం, రాష్ట్రాల పరిమితులు ఏమిటో తెలియకుండా, కొన్ని రాష్ట్రాల తప్పిదాలను కప్పిపుచ్చాలని ఈ ఉన్మాదులు కేంద్రాన్ని ఆడిపోసు కుంటున్నారు. ఒకే రకం వ్యాక్సిన్‌కు మూడు ధరలా అని పార్టీ అధినేత్రి సోనియా ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వద్దకు వచ్చే వ్యాక్సిన్‌ ‌పంపిణీలో సమాఖ్య స్ఫూర్తికి పట్టం కడుతూ అన్ని రాష్ట్రాలకు సమానంగా కేటాయించాలని ఆమె కోరారు. అలా జరగడం లేదని ఆమెకు ఎవరు చెప్పారో తెలియదు. ఇది పూర్తిగా నిరాధారం. కరోనా నియంత్రణలో వ్యవస్థలు విఫలమయ్యాయని పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ చేస్తున్న విమర్శల్లో అసలే వాస్తవం లేదు. భారత్‌ ‌కరోనా మరణాలను దాస్తున్నదంటూ న్యూయార్క్ ‌టైమ్స్ ‌చేసిన విమర్శను ప్రస్తావించడం రాహుల్‌కే చెల్లింది. భారత్‌లో మానవ హక్కుల మృగ్యమనీ, మైనార్టీల అణచివేత జరుగుతోందనీ నిత్యం విమర్శలు చేయడం విదేశీ పత్రికలకు అలవాటైన విద్య. వాటిని ప్రాతిపదికగా తీసుకుని విమర్శలు చేస్తున్న రాహుల్‌ ‌దృష్టి మరింత వివాదాస్పదమవుతోంది. కరోనాపై చర్చించేందుకు అత్యవసరంగా పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ ‌నేత మనీష్‌ ‌తివారీ కోరడం విడ్డూరం. యావత్‌ ‌దేశం కరోనాపై పోరాడుతున్న సమయంలో సమావేశాల వల్ల సాధించేది ఏమిటో తివారీకే తెలియాలి. శివసేన ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌సైతం ఇలాంటి డిమాండ్‌ ‌చేయడం మరీ వికృతం. తమ పార్టీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో ఈ పని ఎందుకు చేయడం లేదో ఆయనే చెప్పాలి. కరోనా కేసుల సంఖ్యను గణనీయంగా పెంచుతున్న మహారాష్ట్ర సర్కారే చట్టసభల సమావేశానికి సిద్ధపడాలి. రాష్ట్రాలకు సాయం విషయంలో కేంద్రం పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ కొందరు భాజపాయేతర ముఖ్యమంత్రలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదు. ఇలాంటి ఆరోపణలు చేయడంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ‌ఠాక్రేయే ముందున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ‌కూడా తక్కువేమీ కాదు. కేంద్రంతో కలసి నడవాలన్న ఇంగిత జ్ఞానం ఆయనకు ఏనాడూ లేదు. ఇటీవల ప్రధానితో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా అనుచితంగా వ్యవహరించారు. అధికారిక సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేసే పద్ధతి ఎక్కడా లేదు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ నేరుగా ప్రస్తావించడంతో కేజ్రీవాల్‌ ‌క్షమాపణ చెప్పడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ ప్రధాని నాయకత్వంలో జరిగే కరోనా నియంత్రణ సమావేశాలకు హాజరు కావాలన్న విషయాన్ని పూర్తిగా విస్మరించారు. దేశంలో ఉన్నది సమాఖ్య విధానమన్న స్పృహ ఆయనలో బొత్తిగా లోపించింది. కేంద్రం అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తున్న మమత ముందుగా తమ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సాయం అందజేస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలి. వ్యాక్సిన్లు, మందులు, సాయం విషయంలో కేంద్రం ఎలాంటి పక్షపాతం చూపడం లేదు. భాజపా పాలిత, విపక్ష పాలిత రాష్ట్రాలన్న వివక్ష అంటూ ఏమీ లేదు. రెమ్‌డెసివర్‌, ఆక్సిజన్‌, ‌వ్యాక్సిన్‌ ‌కేటాయింపులను నేరుగా ప్రధాని చేయరన్న సంగతిని గుర్తించాలి. అవసరాలు, తీవ్రత, ఉత్పత్తి తదితర అంశాల మేరకు ఆయా శాఖల అధికారులు చేస్తారు. కేంద్రం తెలంగాణకు ఈనెల 21 నుంచి 30 వరకు 21,500 రెమ్‌ ‌డెసివర్‌ ఇం‌జర్షన్లను కేటాయించింది. ఇప్పుడు అదనంగా మరో 13,500 ఇంజక్షన్లను కేటాయించింది. ధరలకు సంబంధించి పెంపుదలపై సీరం సంస్థ వాస్తవ పరిస్థితిని వివరిం చింది. తొలుత టీకా ధరను రూ. 150గా ప్రకటించిన మాట వాస్తవమేనని ఒప్పుకుంది. ఇప్పుడు అధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నందున ధర పెంచాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది. ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 వంతున సరఫరా చేస్తున్నారు. భారత్‌ ‌బయోటెక్‌ ‌రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600, ప్రైవేట్‌ ఆసుపత్రులకు రూ.1200 వంతున సరఫరా చేస్తోంది. ఎగుమతి ధర 15 నుంచి 20 డాలర్ల వరకు ఉంది.

అసలు విపక్షం విమర్శలలోని నిష్పాక్షికత ఎంత? కొవిడ్‌ ‌తీవ్రత నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందే జిత్తులే ఇందులో కనిపించడం లేదా? లాక్‌డౌన్‌ ‌విధిస్తే ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని అంటూనే, కట్టడి చర్యలు ఏవనీ, ప్రభుత్వానికి ముందు చూపు లేదనీ అనేవారిని ఏమనాలి?

భారతీయ వ్యాక్సిన్‌లు వ్యర్థమని, సరిగ్గా పరీక్షించకుండానే ప్రయోగిస్తున్నారని నిన్నమొన్నటి దాకా పేలినవారు ఇవాళ రాష్ట్రాలకు అవి సరిగా అందడం లేదని విమర్శించడంలోని ఆంతర్యం ఏమిటి? మన కోవాగ్జిన్‌ అద్భుత ఫలితాలు ఇస్తున్నదని ప్రపంచం ప్రశంసిస్తున్నది. దీనికి ఏమంటారు?

వ్యాక్సిన్‌ల మీద రాష్ట్రాలకు అధికారం ఉండాలని నిన్న పలికిన నోళ్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలే వ్యాక్సిన్‌ ‌సమకూర్చుకోవచ్చునని కేంద్రం చెబితే విమర్శలకు దిగడం ఏమిటి?

ప్రభుత్వం మీద విమర్శలే తప్ప.. ప్రజల బాధ్యతేదీ లేనట్టే విపక్షాల మాటలు ఉండడం మరీ విడ్డూరం. వ్యాధి విస్తరణలో ప్రజల బాధ్యతా ఉందని గుర్తు చేసేవారే కనిపించరెందుకు? కొవిడ్‌ ‌విస్తరణను అరికట్టడంలో ప్రజలు తీసుకునే జాగ్రత్తలే ప్రధానమని వారికి నిజంగానే తెలియదా?

కుంభమేళా దగ్గర హిందువులు చేరిపోతున్నా రంటూ గగ్గోలు పెట్టేవారు, ఢిల్లీ సరిహద్దులలో రైతుల పేరిట జరుగుతున్న జాతరల గురించి మాట్లా డడం లేదు. ఆక్సిజన్‌ ‌రవాణాకు అడ్డుపడుతున్నా ప్రశ్నించేవారే లేరెందుకు? కొన్నిచోట్ల ఆక్సిజన్‌ ‌వృధా అవుతోంది. ఆక్సిజన్‌, ‌వ్యాక్సిన్‌లు కూడా నల్లబజారుకు పోతున్నాయి. దీనిని ఆపడంలో విపక్షాలకు బాధ్యత ఉండదా?

 ప్రైవేటు ఆసుపత్రులలో రోజుకు లక్షలలో బిల్లులు వేస్తున్నా ఒక్కమాట కూడా విపక్షాలు ఎందుకు మాట్లాడవు. అవి మాట్లాడితే బిల్లుల అక్రమ భారాన్ని తగ్గించాలన్న ప్రభుత్వం పని సులువు కాదా? కొవిడ్‌ ‌వ్యాక్సిన్ల బ్లాక్‌మార్కెట్‌ ‌నిరోధించాలని ఒక్క ప్రతిపక్ష నాయకుడూ చెప్పడు. మాస్క్‌లు ధరించమనీ, భౌతికదూరం పాటించమనీ చెప్పలేదు.

ఇప్పుడు మనం రెండో దశ కొవిడ్‌ 19‌ను చూస్తున్నాం. మరొక దశ కూడా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. ఇది భయపెట్టడానికి చెబుతున్నది కాదు. ఇది 1919 నాటి పాఠం. ముందు జాగ్రత్త కోసం చెప్పే మాట. అయితే అది తీవ్రంగా ఉండకపోవచ్చునని కూడా నిపుణులే అభిప్రాయ పడుతున్నారు. కాబట్టి కేంద్రం, రాష్ట్రాలు కలసి ఇక ముందు కూడా గట్టి కృషిచేసి నిర్మూలన కార్యక్రమంలో పాల్గొనవలసి ఉందన్న వాస్తవాన్ని కూడా రాష్ట్రాలు విస్మరించరాదు. ఇలాంటి వాస్తవాలు గమనించకుండా అజ్ఞానమే ప్రాతిపదికగా విపక్షాలు ఆరోపణలు, విమర్శలు చేయడం తగదు.కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరులో కలసి రావాలి. అలాంటి సంస్కారం లేకపోయినా కనీసం కువిమర్శలకు దూరంగా ఉంటే మంచిది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సహాయక చర్యలను వేగవతం చేయడానికైనా అప్పుడు సమయం దొరుకుతుంది.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్


‌కరోనాపై కలిసికట్టుగా పోరాడుదాం

ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌సర్‌ ‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే

కొవిడ్‌ ‌మహమ్మారి మరోసారి మన దేశానికి సవాలు విసిరింది. ఈసారి వ్యాధి సంక్రమణం, తీవ్రత ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కొన్ని వందల కుటుంబాలు తమ వారిని పోగొట్టుకున్నాయి. ఈ విపత్తు వలన నష్టపోయిన వారందరికీ రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సంతాపం తెలియజేస్తోంది.

పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ సమాజంలో శక్తి అపారంగా ఉంది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో మన సత్తా ప్రపంచానికి ఇదివరకే తెలిసింది. స్వీయ నియంత్రణ, అనుశాసనం, పరస్పర సహకారం, ఓర్పు, నిబ్బరంతో మనం ఈ పరిస్థితుల నుండి బయటపడతామని ప్రగాఢ విశ్వాసం. ఆకస్మికంగా తలెత్తిన పరిస్థితుల వల్ల పడకలు, ఆక్సిజన్‌, ‌మందుల కొరత ఎదుర్కొంటున్నారు. భారత్‌ ‌వంటి పెద్ద సమాజాలలో ఇబ్బందులు కూడా పెద్దవిగా కనబడతాయి. వీటిని పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, స్థానిక వ్యవస్థలు నిరంతరం పని చేస్తున్నాయి. వారి ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది, భద్రతా బలగాలు, పారిశుద్ధ్య కార్మికులు తమ విధులు నిర్వహిస్తున్నారు. స్వయంసేవకులు కూడా, సహజంగానే వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. సమాజంలో వివిధ సామాజిక, ధార్మిక సంస్థలు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితులను అదనుగా చేసుకుని దేశ వ్యతిరేకశక్తులు అవిశ్వాసాన్ని, ప్రతికూలతలను సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. దేశ ప్రజలు వీరి పట్ల జాగరూకతతో వ్యవహరించాలి. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు సామాజిక, ధార్మిక, సేవాసంస్థలు, ఆర్థిక, పారిశ్రామిక రంగాల పెద్దలు ముందుకు రావాలని  రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌విజ్ఞప్తి చేస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనందరం కొన్ని విషయాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంది. ఆరోగ్యానికి, అనుశాసనానికి సంబంధించి నియమపాలన చేయడం. ముఖ్యంగా సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు జాగ్రత్తగా ఉండాలి.

–   మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, సామాజిక కార్యక్రమాలలో పరిమిత సంఖ్యలోనే పాల్గొనడం, కర్ఫ్యూ వంటి నియమాలు పాటించడంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేద కషాయం, ఆవిరి , టీకా వంటి వాటి గురించి అవగాహన చేపట్టాలి.

–    అత్యవసరం అయితేనే బయటికి వెళ్లండి. దైనందిన కార్యక్రమాలను తగ్గించుకోవాలని సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

–    వైద్యులకు, ఆరోగ్య కార్యకర్తలకు, భద్రతా సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు అన్నీ స్థాయిల్లో సహకారం అందించాలి.

–    సమాజంలో అన్ని వర్గాలకి, ప్రచార మాధ్యమాలకు, ఆశాజనక అనుకూల వాతావరణాన్ని, నమ్మకాన్ని నిలిపి ఉంచడంలో తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

–      సామాజిక మాధ్యమాలలో ఉన్నవారు జాగరూకులై ఉండడం, నిగ్రహం పాటించడం ద్వారా తమ పాత్ర పోషించాలి.


భయపెడుతున్న కరోనా వ్యర్థాలు!

మనిషి ఆధునికత కోసం, సుఖవంతమైన జీవనం కోసం కొత్త కొత్త ప్రయోగాలతో కనిపెట్టిన వస్తువుల్లో కొన్ని ప్రకృతి వినాశనానికి కారణం అవుతున్నాయి. భూమిలో కలిసిపోలేని వ్యర్థాల రూపకల్పన వల్ల ప్రపంచం యావత్తు ముప్పులో మునిగిపోతుంది.

వాటిల్లో నేడు అత్యంత కీలకమైనవి ఆసుప్రతి వ్యర్థాలు. నేడు ప్రపంచం అంతా కరోనా మహమ్మారి గుప్పిట్లో విలవిల్లాడుతుంది. కరోనా వ్యాధిగ్రస్తులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. వ్యాధిని దూరం చేయడానికి వాడే పదార్థాలతో పాటు చేరే వ్యర్థాలు తిరిగి ప్రపంచ జీవవినాశనానికి కారణం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.

కరోనా టీకాలకు ఉపయోగించే సీసాలు, కరోనా టెస్టులకు ఉపయోగించే పరికరాలు  (దూది, టెస్టింగ్‌ ‌ట్యూబ్‌లు, సూదులు, సిరంజీలు, కట్టుకునే వస్త్రాలు) వంటి వాటిని ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదఘంటికలు మోగించేవే. కరోనా వ్యాధిగ్రస్తులల్లోనే కాక ఇతర జబ్బుల బారిన పడినవారి వల్ల కూడా ఒక్కో పడకకు 400 గ్రాముల చొప్పున గ్రేటర్‌లో రోజూ 30 టన్నుల నుంచి 50 టన్నుల వరకు జీవ వ్యర్థాలు వెలువడుతుంటాయి.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం 2019లో జీవవైద్య వ్యర్థాలు (బీఎండబ్యూ) రోజుకు 616 టన్నులు ఉత్పత్తి అయ్యేవి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. అజోచామ్‌, ‌వెలాసిటీ సంస్థలు 2018లోనే  ఈ వ్యర్థాలు 717 టన్నులకు చేరే అవకాశాలు ఉన్నాయని తమ నివేదికల్లో తెలిపాయి. అప్పుడు ఈ కరోనా మహమ్మారి ఊసు లేదు. కాని నేడు ఈ మహమ్మారి నియంత్రణ, వ్యాధి నిర్ధారణ వంటి వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయ నడంలో అతిశయం లేదు. ముఖ్యంగా ఆసుపత్రులేవీ అత్యంత ప్రమాదకరమైన జీవవ్యర్థాల నిర్వహణ పట్ల జాగ్రత్తలను పాటించడం లేదు. అత్యంత జాగ్రత్తగా విచ్ఛిన్నం చేయాల్సిన వ్యర్థాలను మురుగు కాల్వలు, మున్సిపల్‌ ‌చెత్తలో కలిపేస్తున్నారు. ఈ వ్యర్థాలను 48 గంటల్లోగా నిర్వీర్య కేంద్రాల (కామన్‌ ‌బయో మెడికల్‌ ‌వేస్ట్ ‌ట్రీట్‌మెంట్‌ ‌ఫెసిలిటీస్‌)‌కు చేర్చాలి. ఆయా కేంద్రాల నిర్వాహకులు ఆసుపత్రుల నుంచి రోజూ జీవ వ్యర్థాలను సేకరించి, ప్లాంట్లకు తరలించి నిర్వీర్యం చేస్తారు. లేదంటే అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌ ‌గాల్లోకి చేరుతుంది.  అందుకనే జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ‌బీఎండబ్యూ నిర్వహణను జాగ్రత్తగానూ త్వరితగతిన నిర్వహించాలని ప్రభుత్వాలను ఆదేశించింది.

వ్యర్థాలను సేకరించడం, వాటిని పర్యావరణ హితంగా వేరుచేయడం, శుద్ధి చేయడం, నాశనం చేయడం అనే పక్రియలను వేగవంతం చేయడమే కాక శాస్త్రీయంగా చేయాల్సి ఉంటుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాతీయ ఎయిడ్స్ ‌నియంత్రణ సంస్థలు బీఎండబ్యూల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించాలని చెప్పాయి. ప్రయోగశాల వ్యర్థాలు, సూక్ష్మజీవ వ్యర్థాలు, రక్తనమూనాలు, రక్త సంచులు, వ్యర్థాలను పారవేయడానికి ఉపయోగించే కంటైనర్లు, సంచులు వంటివి సుమారు 46 రకాల జీవవైద్య వ్యర్థాలుంటాయని చెప్తారు. ఈ వ్యర్థాలను నిర్వీర్యం చేయడంలోను, శుద్ధీకరించడంలోనూ సీపీసీబీ చేసిన నిబంధనలను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు పాటిస్తూ వ్యర్థాల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది.

 కేవలం ప్రభుత్వానికే వ్యర్థాల నిర్వహణ బాధ్యత ఉందని అనుకుంటే పొరపాటే. ఇది ప్రజలందరూ కలసి పాటించవలసిన సామాజిక బాధ్యత. స్వచ్ఛంద సంస్థలూ ఈ వ్యర్థాల నిర్వహణలో పెద్ద పాత్రనే పోషించాల్సి ఉంటుంది. గృహాల్లో, వ్యాపార సంస్థలల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు ముఖ్యంగా  మాస్క్‌లు, శానిటైజర్ల సీసాలు, చేతి తొడుగులు, పీపీఈ కిట్లు  వంటి వాటిని ప్రత్యేకమైన కంటైనర్లలో తరలించాలి. వీటిని పారేసే ముందు సుమారు 72గంటల పాటు విడిగా ఉంచాలి. ఎట్టిపరిస్థితుల్లోను రోడ్లపైన, చెత్తకుండీలు నిండి ఉన్నప్పుడు వాటి పైనా పడేయరాదు. పారిశుద్ధ్య కార్మికులకు కూడా వీటి నిర్వహణలో ఎంతో ముప్పు వాటిల్లుతుంది. కనుక వారిని దృష్టిలో పెట్టుకుని వ్యర్థాలను పారవేసేటప్పుడు సశాస్త్రీయమైన పద్ధతులనే వాడాలి. గ్రామీణ కాలుష్య నియంత్రణ మండళ్లు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు చేసే పనులకు ఆటంకాలు కలిగించకుండా తమ వంతు బాధ్యతను ప్రతి పౌరుడూ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యర్థాల నిర్వహణ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో; అలాగే  సీపీసీబీ వారి నిబంధనల పట్ల ప్రజల్లో అవగాహనను కలిగించడానికి స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వాలు పూనుకోవాలి.

– ‌డా।। రాయసం లక్ష్మి

By editor

Twitter
Instagram