– డా।। తాళ్లపల్లి యాకమ్మ

ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యుడు పడమటికి వాలుతున్నాడు. చల్లని పిల్లగాలికి చెట్లు తలలు పంకిస్తున్నాయి. అది హరివిల్లుకాలనీ. పేరుకు తగ్గట్టుగానే అక్కడ అన్ని ఇంద్రధనస్సు లాంటి రంగురంగుల భవంతులు. అద్దాల మేడలు. ఆ ఇండ్ల ముందు రకరకాల పూల మొక్కలతో బృందావనాన్ని తలపింపచేస్తున్నాయి. తుమ్మెదలు ఝుమ్మని నాదం చేస్తూ సుతారంగా పూల రెమ్మలను తాకుతూ ఆడుకుంటున్నాయి. మబ్బులేని ఉరుములా పెద్దగా శబ్దం చేస్తూ అంబులెన్స్ ఒకటి వచ్చి ఒక భవంతి ముందు ఆగింది.

అందులో ఉన్న వైద్య సిబ్బంది మొత్తం ఆ ఇంటిని చుట్టుముట్టారు. కాసేపటి తర్వాత బయటకు వచ్చిన సిబ్బందిలో ఒకరు మైకు తీసుకొని ‘‘ఈ కాలనీ వాసులకు తెలియజేయునది ఏమనగా… ఈ కాలనీని కంటైన్మెంటు జోన్‌గా ప్రకటిస్తున్నాం. ఎవ్వరూ బయటకు రాకూడదు’’ అంటూ హెచ్చరిక జారీ చేశారు. ఆ భవంతి ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

కాలనీవాసులంతా ఎవరి ఇంటి గేటు ముందు వారు నిలబడి చూస్తున్నారు. మరికాసేపట్లో ఆ ఇంట్లో నుండి భార్యాభర్తలిద్దరికి పి.పి.ఈ. కిట్లు తొడిగి బయటకు తీసుకొస్తున్నారు. ఇంట్లో ఆరు నెలల పసిపాప గుక్కపెట్టి ఏడుస్తోంది.

‘‘నా కూతురు సార్‌… ‌నా కూతురుని నాతోపాటు తీసుకొచ్చుకుంటాను..!’’ అంటూ కన్నీటితో వైద్యుల్ని వేడుకుంటోంది ముప్ఫైసంవత్సరాల యువతి సువర్ణ. ‘‘అవును సార్‌ ‌మా కూతురు…!’’ అంటూ కంటనీరు పెడుతున్నాడు సువర్ణ భర్త రమేశ్‌.

‘‘‌లేదండి… ఆ పాపకు కరోనా నెగిటివ్‌ ‌వచ్చింది. మీకిద్దరికి పాజిటివ్‌ ‌వచ్చింది. మీతో పాటు ఆ పాపను తీసుకొని వస్తే ఆ పాప ప్రాణాలకే ప్రమాదం… !’’ అంటూ ముందుకు నడుస్తున్నాడు డాక్టర్‌.

‌సువర్ణ భర్త రమేష్‌ ‌సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీరుగా పనిచేస్తున్నాడు. బాగా ధనవంతులు. విశాలమైన ఇల్లు. సువర్ణ కూడా బాగా చదువుకుంది. వారికి ఆరునెలల పాప, చిన్నారి. వారి ఇంటికి ఎడమవైపు రమేష్‌ అన్నగారి ఇల్లు ఉంటుంది. కుడి ప్రక్కన ఇంట్లో రమేష్‌ ‌తల్లిదండ్రులు ఉంటారు. వెనుక ఇంట్లో రమేష్‌ అక్కగారి కుటుంబం ఉంటుంది.

కాలనీవాసులతో పాటు వారి ఇంటి గేటు ముందు నిలబడి చోద్యం చూస్తున్న అత్తగారి వంక చూస్తూ… ‘‘అత్తయ్యా… చిన్నారిని చూసుకోండి’’ అంటూ రెండు చేతులు జోడించి దండం పెట్టింది సువర్ణ.

పాపను దగ్గరకు తీసుకోవడానికి రెండు అడుగులు ముందుకు వేశాడు సువర్ణ మామగారు ‘‘ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు…! దానికి కూడ కరోనా ఉందేమో…! అది మనకు అంటుకుంటే మన పరిస్థితి ఏమిటి..?’’ అంటూ భర్తను లోపలికి లాక్కొని వెళ్లింది అత్తగారు. తోటికోడలు, ఆడపడుచులు కూడా అలాగే లోపలికి వెళ్లిపోయారు. పాప గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంది. సువర్ణ మనసు కకావికలం అవుతుంటే కూతురి దగ్గరికి పరుగెత్తుతోంది. అంతలోనే వైద్య సిబ్బంది వెళ్లి పాపను ముట్టుకోవద్దని వారిస్తూ , వెనుకకు లాగేసి అంబులెన్స్ ‌లో ఎక్కించడానికి తీసుకొని వెళ్తున్నారు.

సువర్ణ భోరున విలపిస్తోంది. పాప ఏడుపుతో కాలనీ మొత్తం ప్రతిధ్వనిస్తోంది. ఒక్కసారే సుడిగాలిలా వచ్చి చిన్నారిని తన చేతులతో చుట్టేసి, ఆతృతగా కింద కూర్చొని పాపను ఒడిలో వేసుకొని తన రొమ్ము పాప నోట్లో పెట్టింది ఒక యువతి. పాప ఏడుపు ఆపి తన్మయత్వంతో పాలు తాగుతూ ఆ యువతి మోమును తన చిన్ని చేతులతో తడుముతోంది. ఆశ్చర్యంతో అందరి చూపులు ఆమెపై వాలాయి.

తైల సంస్కారం లేని జుట్టు, పాత కాటన్‌ ‌చీర, మెడలో పసుపుతాడు చామన ఛాయ మేను, బక్క పలచని శరీరం, డొక్క వెన్నుకంటుకుపోయిన పాతికేండ్ల ఆ యువతి కడుబీదదని చూపరులకు స్పష్టంగానే తెలుస్తుంది. ఆమె వైపే దీనంగా చూస్తుంది సువర్ణ.

‘‘అమ్మగారు మీరు వెళ్లిరండి.. నేను చిన్నారిని జాగ్రత్తగా చూసుకుంటా’’ నంటూ ప్రేమగా పాప తలనిమురుతోంది ఆ యువతి.

‘‘మంగమ్మ! మేము ప్రాణాలతో తిరిగి వస్తామో లేదో తెలియదు… నా పాప జాగ్రత్త…!’’ అంటూ దీనంగా వేడుకుంది సువర్ణ.

‘‘అమ్మగారు… మీకు ఏమీ కాదు, మీరు క్షేమంగా వెళ్లి, నిండు ఆరోగ్యంతో తిరిగి రండి…! నేను పాపను నా కళ్లల్లో పెట్టి చూసుకుంటానండీ…!’’ అంటూ పాపను ఆప్యాయంగా తన ఎదకు హత్తుకుంది మంగమ్మ.

భార్యాభర్తలిద్దరు వెళ్లి అంబులెన్స్‌లో కూర్చున్నారు. అంబులెన్స్ ‌మెల్లగా ముందుకు సాగుతోంది. సువర్ణ మనసు గతాన్ని వెతుకుతోంది.

ఒక వారం రోజుల క్రితం సువర్ణ ఇంటి గేటు ముందు ‘‘అమ్మగారు…! కొంచెం సద్దన్నం ఉంటే పెట్టండమ్మా…!’’ అంటూ అరుపు.

‘‘అబ్బబ్బా… ఏమిటే… ఆ గావు కేకలు…!’’ అంటూ గేటు దగ్గరికి వచ్చి ఏంటే… ముష్టిదాన… నీకు ఒక్కసారి చెపితే అర్ధం కాదా…! అన్నం లేదు. ఏం లేదు. దూరం జరుగు…! అసలే లోకమంతా కరోనా భయంతో ఛ•స్తుంటే నువ్వేమో అన్నమో అన్నమని అరుస్తున్నవ్‌’’ అం‌టూ కసురుకుంది సువర్ణ.

‘‘అట్లా అనకండమ్మగారు…! రెండు రోజుల నుండి కడుపుకు అన్నం లేక మా చంటిదానికి పాలు రావడం లేదమ్మా, పాలకోసం అల్లాడుతోంది. కనీసం కాసిన్ని పాలన్నా పొయ్యండమ్మా… పసిదానికి తాపిస్తాను’’ అంటూ ప్రాథేయపడింది మంగమ్మ. గుక్కపెట్టి ఏడుస్తున్న చంకలో బిడ్డను భుజంపై వేసుకొని జోకొడుతూ.

‘‘పాలు లేవు, ఏం లేవు ముందు ఇక్కడి నుండి వెళ్లూ…!’’ అంటూ గద్దించింది సువర్ణ.

చేసేదేమి లేక వెనుదిరిగి అడుగులో అడుగు వేస్తోంది మంగమ్మ. భగభగమంటూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కాళ్లకు చెప్పులు కూడా లేని మంగమ్మ పాదాలు తారు రోడ్డుపై నిప్పుల గుండంలో తేలుతున్నాయి. అయినా స్థిరం లేకుండా తలనిండా కదిలే ఆలోచనలతో, మనసునిండా ఆవేదనతో, కళ్ల నిండా కన్నీళ్లతో అడుగు ముందుకు పడుతోంది మంగమ్మకు.

పల్లెటూరిలో పంట పండించుకోవడానికి గుంట భూమి కూడా లేక, కడుపు నింపుకోవడానికి కూలి దొరకక పొట్టచేత పట్టుకొని ఆరు నెలల పసికందును అడ్డబాపకట్టుకొని పట్నం చేరారు మంగమ్మ దంపతులు.

హరివిల్లు కాలనీలో సువర్ణ ఇంటి ముందు కొత్తగా నిర్మిస్తున్న పెద్ద భవంతికి వాచ్‌మెన్‌గా చేరాడు మంగమ్మ భర్త. ఆ భవంతి ముందు రోడ్డుకు దగ్గరలో ఉన్న వేప చెట్టుకింద రేకులపాక ఒకటి ఏర్పాటు చేసుకొని అందులోనే జీవనం సాగిస్తున్నారు.

చిన్న పాపను భర్తకు అప్పజెప్పి, ఆ కాలనీలోనే రెండు ఇళ్లలో పని చేస్తుండేది మంగమ్మ. వచ్చిన డబ్బులతో నాలుగు వేళ్లు నోట్లోకి వెళుతున్నాయన్న సంతోషం కొద్దిరోజులకే మాయమయింది మంగమ్మకు. భవంతికి నీళ్లు కొడుతూ కాలు జారి మెట్లపై నుండి కిందపడి కుడికాలు విరిగింది మంగమ్మ భర్తకు. మంచంలో నుండి లేవలేని పరిస్థితి. ‘మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు’ కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ ‌మొదలైంది. మంగమ్మను ఇండ్లల్లో పనికి రావద్దన్నారు యజమానులు. మంగమ్మ భర్త వాచ్‌మెన్‌గా ఉన్న భవంతి పనులు ఆగి పోయాయి. వలస వచ్చిన తోటి వారందరు కాలి నడకన గ్రామాలకు దారి పట్టారు. మంగమ్మ భర్త లేచి నడవలేడు. అందుకే చిన్న పాపతో భర్తకు సేవ చేస్తూ అక్కడే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆకలితో అలమటించవలసిన దుస్థితి ఎదురైంది.

‘‘అయ్యో దేవుడా…! ఎంత కష్టకాలం వచ్చింది. ఊరిలో ఉన్నదో, లేనిదో తిని ఉన్నతంగా బతికినం, పూరి గుడిసెలోనైనా పుర్సతిగా నిద్రపోయినం, పేరుకే పెద్ద పట్నం, పెద్ద పెద్ద అద్దాల మేడలు, పట్టెడన్నం కోసం మనసు చంపుకొని పదిండ్లు తిరిగినా దొరకలేదు, పసిదానికి కాసిన్ని పాలు దొరికినా బాగుండు అనుకుంటూ, తన పేదరికానికి ఎవరిని నిందించి ఏం లాభం? అని తనను తానే నిందించుకుంటూ రేకులపాకకు చేరింది. పాకలో ఉన్న సంచులన్నీ కుమ్మరిస్తే ఒక్కదాంట్లో చారెడు బియ్యం దొరికాయి. వాటితో జావకాసి భర్తకు తాగించి, అదే జావను చల్లార్చి చిన్నపాపకు కూడా తాగించి నిద్రపుచ్చింది. తన ఆకలిబాధను కుండలోని మంచినీళ్లతో తీర్చుకొని కాళ్లు కడుపులోకి ముడుచుకొని పడుకుంది మంగమ్మ.

హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సువర్ణ చెవుల్లో ‘‘పాలు లేవ్‌ ఏమి లేవ్‌ ‌ముందు బయటికి నడువవే ముష్టిదాన…!’’ అని మంగమ్మతో మాట్లాడిన మాటలు పదే పదే మారు మ్రోగుతున్నాయి. పాప గుర్తుకు రాగానే కన్నీటి పర్యంతరంగా దుఃఖిస్తోంది సువర్ణ.

అక్కడ ఇక్కడ అడిగి తన భర్త, బిడ్డతో పాటు సువర్ణ బిడ్డను కూడా కంటికి రెప్పలా కాపాడింది మంగమ్మ. ఇరవై రోజుల తర్వాత సువర్ణ ఆమె భర్త కరోనా నుండి కోలుకొని ఇల్లు చేరుకున్నారు. చిన్నారిని క్షేమంగా సువర్ణకు అప్పగించింది మంగమ్మ.

‘‘మంగమ్మా..! పేరుకే మేము ఉన్న మారాజులం, మా ఇండ్లు పెద్దవే కానీ మా మనసులు ఇరుకైనవి. నువ్వు కూటికి పేదదానివే కావచ్చు కానీ గుణంలో ఆకాశమంత ఎత్తున నిలిచావు. నీ బిడ్డ కోసం కాసిన్ని పాలు పొయ్యండంటూ ప్రాథేయపడినా పట్టించుకోని పాపిష్టిదాన్ని నేను, అలాంటి దాని కూతురికి ప్రాణభిక్ష పెట్టావు నువ్వు. ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం? ఎంత బలగం ఉంటే ఏం ప్రయోజనం? నా పాపను ఎవరు తాకలేదు. గుక్కెడు పాలు పట్టలేదు. ప్రాణాలను లెక్కచేయకుండా నువ్వు పాలిచ్చి నా బిడ్డను కంటికి రెప్పలా కాపాడి, నాకు అప్పగించావు నీకు ఏమిచ్చి రు•ణం తీర్చుకోగలను’’ అంటూ కన్నీరు కార్చింది సువర్ణ.

‘‘నీకు ఏం కావాలంటే అది ఇస్తాను’’ అంటూ గబగబా ఇంట్లోకి వెళ్లి పెట్టెనిండా ఉన్న బంగారు నగలు, డబ్బుల కట్టలు, పట్టుచీరెలు అన్నీ తెచ్చి ‘‘ఇవి మొత్తం తీసుకో…! ఇంకా కావాలంటే ఇస్తాను…!’’ అంటూ మంగమ్మ ముందు పెట్టింది సువర్ణ.

‘‘ఈ పాటి దానికే రుణం, గినం అని పెద్ద పెద్ద మాటలు అంటున్నారు అమ్మగారు, ఇవన్నీ నాకు ఏమీ వద్దండి. మీరు ముందు ఇవన్నీ లోపల పెట్టండీ…!’’ అంటూ రెండు చేతులు జోడించింది మంగమ్మ.

‘‘నన్ను ఇంకా రుణగ్రస్తురాలిని చేయకు మంగమ్మ…! నీకు ఏమి కావాలో కోరుకో ఈ భవంతి రాసి ఇస్తాను. నువ్వు కోరుకోవాలే కానీ మా యావదాస్తిని నీ పేరు మీద రాసిస్తా’’ అంటూ కన్నీరు కార్చింది సువర్ణ.

‘‘కన్నీరు పెట్టకండి అమ్మగారు… మనుషులం అన్నంక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి. ఈ మాత్రం దానికే అస్తులెందుకమ్మ గారు…!’’ అంటూ వెనుదిరిగింది మంగమ్మ.

‘‘ఇదిగో మంగమ్మా…! నువ్వు ఏమీ తీసుకోకుండా అలా వెళ్లిపోతే నన్ను అవమానించినట్లే…!’’ అంటూ బోరున ఏడ్చింది సువర్ణ.

ఆ మాటతో ఆగిపోయిన మంగమ్మ ‘‘అదేంది అమ్మగారు… నేను మిమ్మల్ని అవమానించడం ఏమిటి? అంత మాట అనకండి. మీరు ఇంతగ బాధపడు తున్నారు కాబట్టి నేనడిగింది లేదనకుంట ఇవ్వాలి మరి…! తీరా అడిగిన తర్వాత ఇవ్వననకూడదు మరి…!’’ అంటూ సువర్ణ చేతిలో ఉన్న చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుంది మంగమ్మ.

సువర్ణ గుండె మనో వాయువేగాల కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది. ‘‘కొంపదీసి చిన్నారిని తనకు ఇచ్చేయ్యమంటుందా ఏమిటి…! అని మనసు ఊగిసలాడుతుంటే తప్పకుండా ఇస్తాను అడుగు మంగమ్మ’’ అంది సువర్ణ స్వరం తగ్గించి.

‘‘అమ్మగారు మాలాంటి పేదవారు ఈ లాక్‌డౌన్‌ ‌కారణంగా పనులు దొరకకపోవడంతో ఎంతోమంది అన్నం కోసం అలమటిస్తున్నారు. పాలులేక పసిపిల్లలు తల్లడిల్లుతున్నారు’’ అంటూ ఒక్క నిమిషం ఆగింది మంగమ్మ.

‘‘అయితే ఏంటీ…!’’ అన్నట్లు చూసింది సువర్ణ. ‘‘మీరు పెద్ద మనసు చేసుకొని వారందరి కోసం ఒక్క రోజు అన్నదానం చేయండమ్మ గారు’’ అని బిడియంగానే అడిగింది మంగమ్మ.

సువర్ణ కళ్లల్లో నుండి అప్రయత్నంగానే కన్నీటిధారలు జలపాతాల్లా దూకుతున్నాయి. ‘‘నీ మనసు నిండుకుండలాంటిదని మరోమారు రుజువు చేసుకున్నావు. అలాగే మంగమ్మ! నీ కోరిక ప్రకారం రేపే అన్నదానం చేద్దాం. పేదవారందరినీ, నీకు తెలిసిన వారందరినీ పిలువు నేను ఈ రోజే ఇక్కడ ఒక బ్యానర్‌ ‌రాయించి పెట్టిస్తాను’’ అంటూ తృప్తిగా చెప్పింది సువర్ణ.

మరుసటి రోజు అన్నదానం కార్యక్రమం మొదలైంది. సువర్ణ దంపతులతో పాటు మంగమ్మ కలిసి ఎవరెవరికి ఏమేమి కావాలో అడిగి మరీ వడ్డించారు. అందరు తృప్తిగా తింటున్నారు. కాలే కడుపులు సేదతీరుతుండగా ‘‘చూడండి అందరికి ఇదే చెపుతున్నా..’’

‘‘జాగ్రత్తగా వినండి…’’ అంటూ సువర్ణ అందరిని ఉద్దేశించి.. ‘‘ఈ ఒక్క రోజు మాత్రమే కాదు ఈ లాక్‌డౌన్‌ అయిపోయే వరకు ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. మీకు తెలిసిన వారిని కూడా తీసుకొని రండి. మీరందరు తినగా మిగిలింది ఇంటి దగ్గర నడువలేని వృద్ధులు, చిన్న పిల్లలు ఉంటే వారికి కూడా తీసుకొని వెళ్లండి…!’’ అంటూ నిండు మనసుతో చెప్పింది సువర్ణ. ఆ మాటలు వింటున్న మంగమ్మతో పాటు అక్కడ ఉన్న పేదలందరి కళ్లు ఆనంద భాష్పాలు రాల్చాయి.

About Author

By editor

Twitter
Instagram