– జాస్తి రమాదేవి

శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీకి ఎంపికైనది


నిద్ర లేవగానే ఎవరైనా దేవుడినో, అద్దంలో తమని తామో చూసుకుంటారు. కానీ రామచంద్ర చూపులు ఎదురింటి వైపు చూస్తుంటాయి. చాలా కాలంగా అదే అతని దినచర్యగా మారి పోయింది.

ఎదురింట్లో ఓ దేవత. ఆమె కరుణించి చూడకపోతుందా! అనేది అతని చిన్న ఆశ.

ఆ దేవత పేరు వరూధిని. ఆమెకి ఇవేం తెలీదు. ఏనాడూ కావాలని అతన్ని చూసింది లేదు. అతను తన వైపు చూస్తున్నాడన్న విషయం కూడా ఆమెకి తెలీదు. లోకంతో తనకేం పనిలే నట్టుంటుంది.

‘అనురాగ దేవత నువ్వే. నా ఆమని పులకింత నువ్వే’ అన్నట్టు రామచంద్ర చూపుల తోరణాలు ఎదురింటి గుమ్మానికి తగిలించి ఎదురుచూస్తుంటాడు. ఎప్పుడో ఆమె దర్శనం అవుతుంది. అతని మది పులకరించిపోతుంది.

రామచంద్ర ఆ ఊళ్లో ‘ఆర్‌ఎం‌పి డాక్టర్‌’‌గా ప్రాక్టీస్‌ ‌చేస్తున్నాడు. స్వంత ఇల్లూ, స్వంత ప్రాక్టీసు.

అతనికి భార్యా, ఓ కూతురు, ఓ కొడుకు ఉన్నారు. కూతురికి పెళ్లిచేసి పంపించాడు. కొడుకు ఇంటర్‌ ఎగ్జామ్స్ ‌రాసాడు. ఎందుకో ఆమెని చూసిన క్షణం నుండి ఓ విధమైన అలజడి మొదలయింది. వయస్సుతోపాటు పెరిగిపోయింది. ఎందుకో తెలీదు. ఆమెనలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది.

ఆమెకదేం పట్టదు. కుట్టు మిషన్‌ ‌చప్పుడునే తన గుండె చప్పుడుగా మార్చుకుని, కొడుకును పెంచింది. వాడు టెన్త్ ‌పరీక్షలు రాసాడు. అత్తగారు అరుంధతి ఆమెకితోడు. ఆ ఇద్దరాడవాళ్లకీ ఆ చిన్న కుర్రాడే రేపటి ఆధారం.

ఆమె ఇంతవరకూ ఎవరి సాయం ఉచితంగా తీసుకోలేదు. తన రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. ఆమె ఊఁ అంటే చాలు క్యూ కట్టి, సాయపడేవాళ్లు చాలామంది ఉన్నారు. ప్రభుత్వ సాయమే ఆమె కోరలేదు. లోకల్‌ ఎమ్మెల్యే వచ్చి సాయం చేస్తామన్నా ఆమె తిరస్కరించింది. ‘పొగరు’ అందరూ గుసగుసలు పోయారు. అవేం ఆమెకి పట్టవు. తన పని తనది అన్నట్టుంటుంది. ఆమె పెద్దగా చదువుకున్నదీ కాదు.

ఆమె ఆ ఇంటి ముందు నవవధువుగా నిలబడ్డరోజు అందరి కళ్లల్లో ఆశ్చర్యం, అసూయ నిండిపోయాయి. వీరబాబు పెళ్లాం ఇంతందంగా ఉందేమిటని?! వీరబాబు ఇంత అందాన్ని ఏం చేసుకుంటాడు? అని!

ఎందుకంటే, వీరబాబు మిలట్రీ జవాను. ఎప్పుడో సెలవుల్లో వస్తాడు. ఓ సైనికుడు తన కుటుంబాన్ని బోర్డర్‌లోకి తీసుకెళ్లలేడు కాబట్టి, ఇంత అందం అడవికాచిన వెన్నెలే కదా! అని రామచంద్ర లాంటి, చాలామంది అభిప్రాయపడ్డారు.

పెళ్లయిన నెలకే వీరబాబు సెలవు ముగిసిందంటూ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వరూధిని మీద అందరికీ సానుభూతి మొదలయింది. ఆ వయస్సులో అత్తమామలకు సేవలు చేస్తూ, కాలం గడపడం రామచంద్రలాంటి చాలామందికి కష్టంగా ఉండేది. ఆరు నెలల తర్వాత, సెలవు దొరికిందని వీరబాబు ఇంటికొచ్చాడు.

వరూధిని ముఖంలో వెలుగు. వెన్నెల స్నానాలు చేసింది భర్తతో కలిసి.. ఎక్కడెక్కడో తిరిగొచ్చారు ఇద్దరూ. ఊరు వరూధిని కనబడక చిన్నబుచ్చుకుంది. రామచం• ్రలాంటి వాళ్లకైతే పొద్దే గడవలేదు.

రెండు నెలల తర్వాత వీరబాబు యుద్ధ భూమికి పయన మైనప్పుడు అంతా వరూధిని మోములో దిగులు కోసం వెతుక్కున్నారు కానీ ఆ జాడలే కానరాలేదు. వీరబాబు వెళ్లిన నెలకి వరూధిని వాంతులు చేసుకుంది. వరూధిని వీరబాబుకి ఉత్తరం రాసింది. ‘‘ఇప్పుడే వచ్చెయ్యాలని ఉంది కానీ, రాలేను ప్రియా! నీ పొట్టలో ఉన్న మన బాబుకి నా గురించి చెప్పడం మర్చిపోకు…’’ అంటూ తిరిగి ఉత్తరం రాసాడు. అదో ప్రేమ లేఖలా చాలాసార్లు చదువుకునేది వరూధిని.

వరూధినికి మగబిడ్డ పుట్టాడు. ‘వచ్చేస్తున్నా’ అంటూ టెలిగ్రాం ఇచ్చాడు వీరబాబు. అతను రాలేదు కానీ, ఆ రోజు తెల్లవారు జామున ఆ ఇంటిలోంచి వినిపించిన రోధనకి ఊరు ఉలిక్కిపడింది. అందరి కాళ్లు ఆ ఇంటికి పరుగెత్తాయి.

వీరబాబు అమ్మానాన్నలు గుండె అవిసిపోయేలా ఏడుస్తున్నారు. అందరి కళ్లూ వరూధిని కోసం వెతికాయి. పొత్తిళ్లలో బిడ్డని పెట్టుకుని ‘ఇది నిజం కాదు’ అన్నట్టు షాక్‌లో ఉంది.

ఆ రోజు మధ్యాహ్నం వీరబాబు మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఊరు కన్నీరు కార్చింది. కొడుకు మృతదేహం చూసిన వీరబాబు తండ్రి గుండె పట్టుకుని కూలబడ్డాడు. రామచంద్ర చూసి ‘గుండె ఆగి పోయింది’ అన్నాడు.

ఒకేసారి రెండు మరణాలు, ఆ ఇంటివాళ్లు ఎలా తట్టుకుంటారని వాపోయారు ఊరి జనం.

వరూధిని బిడ్డకి తండ్రిని చూపిస్తుంటే  అందరి హృదయాలు కదిలిపోయాయి. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్ని లాంఛనాలతో వీరబాబు యాత్ర ముగిసింది. కొడుకుతోపాటు, తండ్రి శవం తోడుగా కదిలింది.

ప్రభుత్వం వీర సైనికుడికి బహుమతిని ఇచ్చింది. ఇంటిస్థలం, కొంత ఆర్ధిక సాయం ప్రకటించింది. ఇద్దర్ని పోగొట్టుకున్న ఆ ఇల్లు శూన్యంలో మిగిలింది.

ఏడాది తర్వాత పిల్లాడికి పేరుపెట్టారు. చెందూ అని ముద్దుగా పిలుస్తున్నారు.

ఎన్నో చేతులు ఆదుకుంటామని ముందుకు వచ్చినా ఆమె అందుకోలేదు. ‘ఏమంత వయస్సుందని పెళ్లి చేసుకుంటే మంచిదనీ, తోడు లేకుండా ఎన్నాళ్లని బతుకుతావని?’ అటు పుట్టింటి వారూ, ఇటు అత్తింటి వారూ పోరారు కానీ, ఆమె వినిపించుకోలేదు. ‘తనకి తోడు తన బిడ్డ’ అని చూపించింది. వదిలేసారు అందరూ…

ఆమె ఊఁ అంటే చాలని.. ఆమె చేయి అందుకునేందుకు చాలామందే ముందుకు వచ్చినా ఆమె కన్నెత్తి ఎవరిని చూడలేదు. అప్పటి నుండి ఆ ఇంట్లోనించి కుట్టుమిషన్‌ ‌చప్పుడు ఆగకుండా వినిపిస్తూనే ఉంది. ఏదో ఉడుత సాయం అన్నట్టు, చుట్టపక్కల ఆడవాళ్లంతా వరూధినికే బట్టలు కుట్టడానికి ఇచ్చేవాళ్లు. అత్త అరుంధతి ఆమె పనిలో కాస్త సాయం చేస్తుంది. ఆ కుటుంబాన్ని అతికష్టంగా లాక్కొస్తోంది వరూధిని.

ఒకసారి ఆమె రామచంద్ర దగ్గరకొచ్చి ‘ఒక్కసారి మా ఇంటికి రాగలరా!’ అని ప్రాధేయపడింది.

రామచంద్ర ఎక్కడవక్కడే వదిలి, ఆమె వెంట ఆత్రంగా వెళ్లాడు. ముసలావిడ జ్వరంతో మూలుగుతోంది.

అదే మొదటిసారి ఆ ఇంట్లో అడుగుపెట్టడం అతను. చాలా ఇరుగ్గా ఉన్న మూడు గదులు. అలుకూ పూతా లేనట్టగా మాసికలు పడి ఉన్న గోడలు. అడుగడుగునా దరిద్రం కనబడుతోంది. ఓ మూలగా కుట్టుమిషన్‌ ‘‌నేనూ ఈ ఇంటి మెంబర్నే’ అన్నట్టుంది. దండెం మీద గుడ్డలు, ఉరి తీయబడ్డ ఖైదీలా వేళ్లాడుతున్నాయి. వెలిసిన గోడ మీద, వీరబాబు మిలట్రీ డ్రెస్‌లో ఉన్న ఫోటో తగిలించి ఉంది.

ఆ ఫోటోకి ప్రభుత్వం బహూకరించిన మెడల్‌ ఒకటి వేళ్లాడుతోంది. చెందూ చదువుకుంటున్న వాడల్లా రామచంద్రని చూసి లేచినిలబడ్డాడు. ‘డాక్టర్‌ ‌గారికి నమస్తే చెప్పు’ అంది వరూధిని.

వాడెంతో వినయంగా ‘నమస్తే డాక్టర్‌ ‌గారు.’ అంటూ చేతులు జోడించాడు. వరూధిని కొడుకు కదా! పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అదే తన కొడుకు అయితే, లేచి లోపలికి పోయేవాడు. వాళ్లమ్మ పెంపకం.. అనుకుంటూ..

ముసలావిడని చూసి మందు బిళ్లలిచ్చి అవి ఎలా వేసుకోవాలో చెప్పాడు. అవసరం అనుకుంటే మళ్లీ పిలవమని చెప్పాడు. ఆమె ఫీజు ఇవ్వబోతే వద్దన్నాడు.

‘ఆమె మళ్లీ రాకపోతుందా!’ అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసాడు గానీ, అలాంటిదేం జరగలేదు. మూడో రోజు చెందూ వచ్చాడు. రామచంద్ర కళ్లు మతాబుల్లా మెరిసాయి.

‘‘మీ ఫీజు, మందులకు డబ్బులు డాక్టర్‌ ‌గారూ!’’ అతని చేతిలో రెండు వంద నోట్లుపెట్టి, వెళ్లాడు వాడు.

ఎవరో ఈడ్చి కొట్టినట్లు బాధపడ్డాడు రామచంద్ర. ఆ ఇంటికి వెళ్లే అవకాశం రాలేదు. సాయంచేసే దారీ దొరకలేదు అతనికి. ఒంటరి ఆడది, తోడు ఓ ముసలి అత్త, పదేళ్ల కొడుకు… ఏ సాయం పొందకుండా ఎలా బతుకుతుందనుకుంటుంది. అంత పొగరేంటసలు.. ఆ రోజంతా గింజుకు పోయాడు. మరో అవకాశం రాకపోతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు.

చెందూ చదువు విషయంలో సాయపడాలని చూసినా కుదరలేదు. గవర్నమెంట్‌ ‌స్కూల్లో అన్నీ ఫ్రీనే. ‘వాళ్ల నాన్న ఉంటే, మనవాడు చదివే స్కూల్లో చదివేవాడు కదా!’ అని ఓసారి భార్య దగ్గర సానుభూతిగా వాపోయాడు. ‘చదివేవాడు ఎక్కడ చదివినా ఒకటే… వాడ్ని అలా పెంచుతోంది వరూధిని. అంటూ కితాబిచ్చింది అతని భార్య పార్వతి.

ళి       ళి       ళి

కాలం ఎవరి ఆలోచనలతోనూ సంబంధం లేనట్టుగా గడిచిపోతూనే ఉంది. చెందూ టెన్త్ ‌మంచిమార్కులతో పాసయ్యాడని తెల్సి వాడిని అభినందించాడు రామచంద్ర. తన కొడుకు వరుణ్‌ ‌చదివే కాలేజీలో సీటు ఇప్పిస్తే వాళ్లకి కాస్త సాయం చేసినట్టు ఉంటుందని పార్వతిని పంపించాడు. నవ్వుతూ తిరస్కరించింది వరూధిని.

అలాంటి వరూధిని ఒకరోజు చెందూని తీసుకుని, రామచంద్ర ఇంటికి వచ్చింది. ఒక దేవతలా కనిపించింది. కంగారు పడిపోతూ భార్యకి మర్యాదలు చెయ్యమని పురమాయిస్తుంటే వారించింది వరూధిని.

‘‘మీ సహాయం కోసం వచ్చానండీ…’’ ఆమె అలా అడుగుతుంటే నమ్మలేకపోతున్నాడు రామచంద్ర.

‘‘చెప్పు వరూధిని! నేనేం చెయ్యాలి? చెందూకి కాలేజీలో సీటు ఇప్పించాలా! డబ్బుసాయం కావాలా?’’ ఆరాటంగా అడిగాడతను. ‘ఇప్పటికే వన్‌ ఇయర్‌ అనవసరంగా, వేస్ట్ ‌చేసాడు చెందు’ అనుకున్నాడు.

వరూధిని తనచేతిలో ఉన్న కవర్లోంచి పేపర్‌ ‌తీసి అతని చేతికిచ్చింది. అది చదివిన రామచంద్ర మాటరాని మూగవాడయిపోయాడు. ఐదు నిమిషాల తర్వాత చెందూ సాయంతో ఆ ఫాం నింపాడు.

వరూధిని అతనికి థాంక్స్ ‌చెప్పి, నమస్కరించి కదిలిపోయింది. అతనలా

చాలాసేపు కదలిక లేనట్టుండిపోయాడు. పార్వతి కుదిపే వరకూ ఈ లోకంలోకి రాలేకపోయాడు.

‘‘వరూధిని ఎందుకలాంటి నిర్ణయం తీసుకుంది పార్వతీ!’’ గొణిగినట్టుగా అన్నాడు రామచంద్ర.

‘‘ఎలాంటి నిర్ణయం తీసుకుందండీ !’’ అడిగింది పార్వతి.

‘‘అవి ఆర్మీ రిక్రూట్మెంట్‌ అప్లికేషన్‌ ‌ఫామ్స్. ‌పిల్లాడ్ని కూడా…’’ అతని గొంతులో ఏదో అడ్డుగా నిలిచింది.

‘‘వాడు కడుపులో ఉండగానే, తండ్రి గురించి తెలుసుకున్నాడు. పుట్టినప్పటి నుంచీ తండ్రి ఫొటో చూస్తూ పెరిగాడు. ఎన్నోసార్లు తండ్రి యూనిఫామ్‌ ‌వాడు వేసుకుంటే చూసాను. వరూధిని కన్నార్పకుండా చూడ్డం చూసాను. ఎన్నిపూటలు తిన్నదో, ఎన్నిపూటలు పస్తులుందో ఎవరికీ తెలీదు కానీ, చెందూకి తెలుసు.

వాడు దృఢంగా పెరగాలని, తల్లెంతగా శ్రమపడిందో వాడికి మాత్రమే తెలుసు. ఉగ్గుపాలతోనే నేర్పిందా తల్లి. అంతచక్కగా, క్రమశిక్షణతో పెంచింది… కొందరుంటారు… పిల్లల్ని దాచుకుని, ఎందుకూ పనికిరాని వాడిగా తయారుచెయ్యాలని తపించిపోతారు …’’

వరుణ్‌ ఎస్‌ఐ ‌సెలక్షన్‌ ‌జరుగుతున్నాయన్నప్పుడు తను కాదన్నాడని పార్వతి గుర్తుచేస్తోంది.

‘‘వరూధిని ఓ తల్లిగా తన బాధ్యతని సక్రమంగానే పాటిస్తోంది. మీరంతగా బుర్రబద్దలు కొట్టుకుని ఆలోచించకండి’’ అంటూ విసురుగా లోపలికి వెళ్లిపోయింది పార్వతి.

ఎందుకో తెలీదు ఎదురింటి వైపు చూసిన రామచంద్ర కళ్లలో నీళ్లు నిండాయి. మొదటిసారి వరూధిని కొత్తగా కనబడుతోంది.

About Author

By editor

Twitter
Instagram